తిరుమంగై ఆళ్వార్ దివ్య వైభవము

View of the gopurams at Srirangathaswamy temple complex in Srirangam

శ్రీః

శ్రీమతే రామానుజాయయ నమః

వృశ్చికే కృత్తికాజాతం చతుష్కవి శిఖామణిమ్

షట్ప్రబన్ధకృతం  శార్ ఙ్గ మూర్తిం కలిహ మాశ్రయే

*****

                           శ్రీ మన్నారాయణుని ‘శార్ఙ్గమను విల్లు’ అంశములో , చోళదేశములో తిరువాలినాడు (తిరువాలి తిరునగరి) నగరములో తిరు కుఱైయలూర్ గ్రామమున , కలియుగమున 398 వ నళ సంవత్సరమున , కార్తీకమాసమున , పౌర్ణమి , గురువారము , కృత్తిక నక్షత్రమున , చోళ రాజ్యముయొక్క ప్రధాన సైన్యాధిపతి యైన ఆలినాడర్ , వల్లి తిరు దంపతులకు జన్మించిరి .వీరి నామధేయము ‘ నీలన్’. వీరు తమ కుల వృత్తికి తగినట్లు సకల యుద్ధవిద్యలందును మిక్కిలి ప్రావీణులైరి.మంచి నైపుణ్యముతో పదాతిదళములు ,అశ్వదళములు , గజాతిదళములు నడిపించి అనేక యుద్దములందు విజయము సాధించి చోళదేశ మహారాజుయొక్క ప్రశంసలను పొందిరి . వెయ్యిమంది శత్రువులు ఒక్కమ్ముడిగ వచ్చినను,వారిని తుదముట్టించ గలవారగుటచే  వీరికి ‘ పరకాలన్ ‘ ( శత్రువులకు యముడు) అని పిలువబడెడివారు .  చోళదేశమహారాజు వీరి శక్తిసామర్ధ్యములకు మురిసి అలినాడుదేశమునకు  (తిరుమంగై రాజధానిగా)  వీరిని  సామంతరాజుగ నియమించిరి .  ప్రజలు వీరిని తిరుమంగై మన్నన్, ఆలినాడన్ అని పిలుచుచుండిరి . వీరు యుద్ధవిద్యలందేగాక తమిళ,  సంస్కృత భాషలందును మిక్కిలి ప్రావీణ్యమును సంపాదించుకొనిరి . సామంతరాజుగ భోగభాగ్యములు అనుభవించుచు కాలక్రమేణ  వ్యసనములపాలై వీరు స్త్రీలోలులైరి.

                      ‘ సుమంగళ ‘ అను అప్సరస, తాను కపిలమునిని పరిహసించిన కారణముచే ఆ మహర్హి శపించుటచే మానవరూపము గ్రహింపబడి , తిరుమంగై మన్నన్ రాజ్యములోనున్న  ‘ తిరు వెళ్ళకుళం ‘ అను ఊరిలో శ్వేతపుష్కరణి వద్ద  ఒక వైష్ణవ వైద్యునిచే చూడబడి , ఆతని కుమార్తెగ  ఆమె ‘కుముదవల్లి’ నామధేయముతొ  పెంచబడసాగెను .  తన చారులవలన ఆమె సౌందర్యలావణ్యాదులను వినిన పరకాలన్ ఆ వైద్యుని గృహమునకు వెడలి , కుముదవల్లిని గాంచి  అచ్చెరువొంది , ఆమెను పరిణయమాడుటకై ఆమెయొక్క తండ్రితో ప్రస్తావించెను . కుముదవల్లి  తాను పంచసంస్కారముగల ( నామ సంస్కారము,  పుండ్ర సంస్కారము, తాప సంస్కారము,మంత్ర సంస్కారము,యఙ్ఞ సంస్కారము గల ) వైష్ణవుని మాత్రమే పరిణయమాడుదనని తెలియజేయగ తిరుమంగై మన్నన్ వెంటనే చేరువలోనున్న తిరునరైయూర్ దివ్యదేశమునకు వెడలి , అచట నున్న పెరుమాళ్ తిరు నరైయూర్ నంబిచే పంచసంస్కారములను పొంది దాద్వశ పుండ్రములను ధరించి కుముదవల్లి వద్దకు వచ్చి పరిణయమాడమని కోరెను.   దానికి కుముదవల్లి , తిరుమంగై మన్నన్ ప్రతిదినమును,  ఒక సంవత్సర కాలమువరకు , 1008 శ్రీ వైష్ణవులకు తదీయరాదనము సమర్పించి భుక్తశేషమును ఆరగింపవలెనని తెలుపగ పరకాలన్ అంగీకరించి కుముదవల్లిని పరిణయమాడిరి

                            తిరుమంగై మన్నన్ మంగైమడమ్ అను ప్రదేశమున ప్రతిదినము 1008 వైష్ణవులకు తదియారదన చేయసాగిరి. కొద్దికాలమునకు ద్రవ్యకొఱతచే చోళరాజునకు కప్పము కట్టుట మానివైచిరి. చోళరాజు ఒక సేనాధిపతిని కప్పము వసూలుకై పంపగ, పరకాలన్ ఆ సేనాధిపతిని తరిమివేసిరి . మహారాజు పెద్ద సైన్యముతో వచ్చి తిరుమంగై  మన్నన్ తో పోరాడి పలితములేక పరకాలన్ ను మెచ్చుకొనుచున్నట్లు వంచించి బంధించిరి . కాంచీపుర పేరరుళాలన్ పెరుమాళ్  తిరుమంగై మన్నన్ స్వప్నములో వేగవతి నది సమీపమందు నిధి యున్నదని తెలియజేయగ,  మహారాజును ఒప్పించి తాను ఆ నిధిని తెచ్చి కప్పమును కట్టిరి.  చోళదేశ మహారాజు మిక్కిలి ఆశ్చర్యపడి,  తిరుమంగై మన్నన్ భక్తికి మెచ్చి తానును తగు ధనమును సమకూర్చెను. అయినను తిరిగి స్వల్ప కాలములోనే ద్రవ్యకొఱత ఏర్పడగ , పరకాలన్ , ధనవంతులను దారిదోపిడి చేయుచు తదియారదన చేయసాగిరి. ఈ కార్యక్రమములో శ్రీవైష్ణవుల సాంగత్యములో తిరుమంగై మన్నన్ హృదయమందు మిక్కిలి పరివర్తనము వచ్చి అమితానందభరితులై కాలపరిమితి ముగిసినను తదియారదన కొనసాగించుచునే ఉండిరి.

                          ఇట్లుండగ ,  తిరువాలి తిరునగరి లో వేంచేసియున్న ” వయలాలి మనవాళ పెరుమాళ్, అమృతవల్లి నాచ్చియార్ “, ఆళ్వార్లను,  ఉద్ధరింపదలచి నూతన వధూవరులగ సర్వాభరణములతో, తమ కళ్యాణగోష్ఠితో  “తిరుమంగైకొళ్ళై”  మండపమందు సేదతీర్చుకొనుటకై ఉపస్థితులైరి . పొదలలో దాగియున్న తిరుమంగై మన్నన్  ఈ కళ్యాణ గోష్ఠనిగాంచి . మిక్కిలి ఆనందముతో తమ సహచరులతో మండపమునుచేరి సమస్త ఆభరణములుదోచుకొనిరి. చివరగా పరకాలన్  పెరుమాళ్ యొక్క పాదమునగల మెట్టెలను అడుగగ , ” అన్ని ఆభరణములు పొందితివి.ఇది ఒక్కటిని విడువరాదా ” అని పెరుమాళ్  చెప్పగ  ,  ” అటుల విడువను!. వైష్ణవుల ఒక రోజు  తదియారదన లో వలసిన అరటిఆకుల కొనుగోలుకు ఉపయోగించును  ”  అని  బదులు చెప్పి , తిరుమంగై మన్నన్ ,  స్వయముగ మెట్టెలను ఎంత లాగినను రాని కారణముచే తన పండ్లతొ కొరికి లాగెను.   పెరుమాళ్ మిక్కిలి అచ్చెరువొంది,  మందహాసముతో పరకాలన్ ను ” కలియన్ ”  అని పిలిచిరి. అటుపిమ్మట  తిరుమంగై మన్నన్ దోచుకొన్న ఆభరణములను మూటకట్టి ఎత్తజూచిన అది మిక్కిలి బరువై లేవకుండెను. పరకాలన్ వెంటనే కత్తిదూసి పెరుమాళ్ ను ” ఏమి మంత్రమును వేసితివి.  చెప్పుము .” అని  బెదిరించెను. అప్పుడు పెరుమాళ్  చిరునవ్వుతో  పరకాలన్ కు  ప్రక్కననున్న మఱ్ఱిచెట్టు క్రింద అష్టాక్షరీ మహామంత్రమును ఉపదేశించిరి. పిమ్మట గరుడారూఢుడై పెరుమాళ్, తాయార్లతో సహ తిరుమంగై మన్నన్ కు సాక్షాత్కరించి , ఆశీర్వదించి , అంతర్ధానమైరి.

                     కలియన్  , ఎటువంటి సద్గుణములేని తనకు కరుణామయుడైన సర్వేశ్వరుడు స్వయముగ తిరుమంత్రోపదేశమును చేసి , దర్శనమును ఇచ్చుటచే మిక్కిలి నిశ్చేష్టులైరి. ప్తత్యక్షముగ కన్నులతో గాంచియు ,అష్టాక్షరీ మహామంత్రమును చెవులతోవినియు , పెరుమాళ్ ఆభరణముల దోపిడిలో శరీర స్పర్శచేసియు , పెరుమాళ్ శరీరమందలంకృతమైన తులసీమాలసుగంధమును ఆఘ్రాణించియు , పెరుమాళ్ పాదధూళి ఆస్వాదించియు పునీతులైన తిరుమంగై మన్నన్   అందరిచే తిరుమంగై ఆళ్వారులు గ ఆరాధింపబడిరి.

                            తిరుమంగై మన్నన్,  ఒక  అద్వితీయమైన మహారాజు , పెరుమాళ్ యొక్క నిర్హేతుకకృపచే తిరుమంగై ఆళ్వారులుగ ప్రసిద్దిచెంది ,  వీరు 108 దివ్యదేశములలో 86 దివ్యదేశములను స్వయముగ దర్శించి ,  (వీటిలో 46 దివ్యదేశములు ఈ ఆళ్వారులొక్కరిచేతనే   మంగళాశాశనము చేయబడనవి )  . మొత్తము 1253 పాశురములతో  పెరుమాళ్ళను   మంగళాశాసనము చేసినారు .  ఈపాశురములలో ఆళ్వారులు  పెరుమాళ్ యొక్క   తిరునామ వైభవమును , తిరు కళ్యాణగుణములను , తిరుమేని  సౌందర్యమును , దివ్యదేశము యొక్క  సౌందర్యమును మిక్కిలి తన్మయత్వముతో   గానము చేసినారు. ఈ పాశురములను  అనుసంధించు భక్తులకు , ప్రత్యక్షదర్శనమువలె విశేష అనుభూతి కలుగుజేయును.

1 . వీరి మొదటి ప్రబంధము పెరియతిరుమొழி (1084 పాశురములు). అష్టాక్షరీ మంత్రోపదేశము పొందిన పిదప దివ్యదేశములను దర్శనము చేయుచు గానము చేసినవి ఈ పాశురములు. ఆ సందర్బములో ఒక చోట శైవ పండితులైన “జ్ఞాన సంబందర్” తో జరిగిన వాదోపవాదములో తిరు కాழிచ్చీరామవిణ్ణగర దివ్యదేశములో కృపతో వేంచేసిన త్రివిక్రమన్ పెరుమాళ్ ను ” ఒరు కుఱళాయ్ ” అని ప్రారంభించి ఆళ్వారులు గానముచేయగ, భక్తితో పెల్లుబుకివచ్చిన కవితాసౌందర్యమునకు నిశ్చేష్టులై, ముగ్ధులై జ్ఞాన సంబందర్ తమ వేల్ ను (శూలమును) ఆళ్వార్ నకు గౌరవచిహ్నముగ బహూకరించి వందనము చేసిరి. వీరికి తమ ఆచార్యుని యెడల భక్తి అమోఘము. తమ ఆచార్యులైన తిరునరైయూర్ నంబిని 110 పాశురములతో సేవించుకున్నారు.

2 . ఆళ్వారులు ఆత్మగుణపరిపూర్ణులై త్రికరణములతో పెరుమాళ్ తిరువడిగళ్ యందు మగ్నులై   “తిరుక్కుఱున్దాడకమ్ “అను ( 20 పాశురములుగల )దివ్యప్రబంధమును ప్రసాదించిరి . 

3 . ఆళ్వారులు మిక్కిలి ఆప్తితో , ” తిరుక్కుడందై ” దివ్యదేశములో కృపతోవేంచేసిన ఆరావముద పెరుమాళ్ ను తమ దివ్య తిరువడిగళ్ యందు ఎట్టి కాలవిలంబనము చేయక చేర్చుకొనుమని ” తిరువెழுకూర్ట్రిరుక్కై ” అను దివ్యప్రబంధములో వేడుకొనిరి .

4 . పెరుమాళ్ యొక్క స్పందనలభించని కారణముచే ,  ఆళ్వారులు మిక్కిలి మనోవ్యధతో తమ స్వస్వరూపము కోల్పోయి   పరకాలనాయకి అవస్థను పొంది తన ప్రియుడైన పెరుమాళ్ ను  “మడలూడు” అను ప్రక్రియ ద్వారా పొందుటకై ”  శిరియ తిరు మడల్ “( 77-1/2 పాశురములను ) , ” పెరియ తిరు మడల్ ” (148-1/2 పాశురములను) అను రెండు   దివ్యప్రబంధములను  గానము చేసిరి.

5 . ఆళ్వారుల  స్థితిని గాంచిన శ్రీ మన్నారాయణుడు తిరుమంగై ఆళ్వారుల ఎదుట ప్రత్యక్షదర్శనమును ఇవ్వగ ఆళ్వార్లు  మహదానందభరితులై  ” తిరునెడున్దాడకమ్ ” అను ( 30 పాశురములు గల ) తిరుమంత్రార్థము ప్రస్పుటించు దివ్య ప్రబంధమును ప్రసాదించిరి. 

                                            తిరుమంగై ఆళ్వార్ల యొక్క అత్యద్భుతమైన మంగళాశాశనమును స్మరింపజేయుచూ ప్రతి సంవత్సరము మిక్కిలి ప్రసిద్ధి చెందిన  ” నాఙ్గూర్ గరుఢసేవై ” అనాదికాలమునుండి వైష్ణవోత్తములచే పరమభక్తితో పుష్యమాసమందు నిర్వహింపబడచున్న   ఉత్సవము భక్తులను ఒక అనూహ్య స్థితికి చేకొనిపోవును .

                   తిరుమంగై ఆళ్వార్లను ఆలినాడన్ , అరుళ్ మారి , చతుష్కవి శిఖామణి , కలికన్రి , అని అనేక విధములగ భక్తులు ప్రీతిగ పిలుచుకొని సేవింతురు. శ్రీ రంగనాథుని ఆలయ గోపురము , మండపము , విమానము , ప్రాకారములు నిర్మింపజేయుటయు , తిరు క్కురుగూర్ లో నున్న నమ్మాళ్వార్ విగ్రహమును శ్రీ రంగమునకు వేంచేయింపజేసియు, మొదలగు అనేక సేవలు గాక , దేశమందలి అన్ని ప్రాంతములందలి శ్రీ వైష్ణవులను ఆహ్వానించి శ్రీరంగమందు తిరు వాழ் మొழி  అధ్యయన ఉత్సవమును దిగ్విజయముగ నడిపించిరి. వీరి తిరుమేని అలసటను బాపుటకై మంజకుళి సేవను శ్రీ రంగనాథులు ఆదేశించిరి. ఈ మంజకుళి (పసుపు చూర్ణముతొ మంగళస్నానము) కార్యక్రమము ఆళ్వార్ జీవితకాలమునుండి నేటివరకు జరుగుచున్న ప్రక్రియ “నాఙ్గూర్ గరుఢసేవై” లొ కానవచ్చును.

                     అద్వితీయమైన,  సాటిలేని,  తిరుమంగై ఆళ్వార్  105 సంవత్సరములు ఈభువిలోనుండి, వారు తిరుక్కురుంగుడి దివ్యదేశములో కృపతోవేంచేసిన  తిరుప్పార్ కడల్  నంబిని ముకుళిత హస్తములతో సేవించుకొనుచు   కుముదవల్లి తాయరు సమేతముగా పరమపదమునకు వేంచేసిరి.

తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే  శరణం

**************