పెరియ తిరుమొழி-1వపత్తు (1)

శ్రీః 

శ్రీమతే రామనుజాయనమః

1 .  వాడినేన్ 

( కోయిల్ తిరుమొழி )

                        శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృపచే తిరుమంత్రముపదేశము పొందిన తిరుమంగై ఆళ్వార్ స్వరూపజ్ఞానము కలిగినవారై ఆ మహోత్తరమైన అష్టాక్షరీ తిరుమంత్రము యొక్క ( అందుగల శ్రీమన్ నారాయణ నామముయొక్క )  వైభవమును మరియు , తాను దీర్ఘకాలమునుండి గడిపిన  వ్యర్ధమైన జీవితమును ఈ పది పాశురములలో తెలియజేయుచున్నారు

** వాడినేన్ వాడి వరున్దినేన్ మనత్తాల్,పెరున్తుయరిడుమ్బైయిల్ పిఱన్దు ,

కూడినేన్ కూడి యిళైయవర్ తమ్మోడు,అవర్ తరుమ్ కలవియే కరుది,

ఓడినేన్ ఓడి ఉయ్ వదోర్ పొరుళాళ్,ఉణర్వెనుమ్ పెరుమ్ పదమ్ తిరిన్దు ,

నాడినేన్ నాడి  నాన్ కణ్డుకొణ్డేన్ , నారాయణా ఎన్నుమ్ నామమ్ ll 948

పెరుం తుయర్ = అంతులేని దుఃఖములను; ఇడుమ్బైయిల్=కలుగజేయు శరీరమందు,పిఱన్దు = జనించి; కూడినేన్ = ఆత్మ స్వరూపము మరచి సంసారమందు మగ్నుడనైతిని;కూడి = ఆవిధముగ ఈ సంసారములో మునగియున్న నేను; ఇళయవర్ తరుమ్ =యౌవనమైన కాంతలు ఒసగు; కలవియే కరుది = సంభోగమునే తలచుచు; అవర్ తమ్మోడు  ఓడినేన్ = ఆ కాంతల వెనుకనే పరుగెడితిని; ఓడి = ఈ విధముగ పెక్కు ప్రదేశములందు ఆ కాంతలను రమించుటకై వారి చుట్టును తిరిగుచుండెడి నేను; మనత్తాల్ = అనేక విషయసంబంధమైన కోరికలగల మనస్సుతో; వరన్దినేన్ = మిక్కిలి వ్యధపొందితిని; (ఇట్లు) వాడినేన్ = ఆ వ్యధతో చాలకాలము గడుపుచు వాడిపోతిని;వాడి = ఈ విధముగ వాడిపోయిన నేను; ఉయ్ వదోర్ పొరుళాళ్ = (సర్వేశ్వరుని నిర్హేతుకకృప వలన) ఉజ్జీవింజేసెడి ఒకమహోత్తరమైన సూత్రముచే; ఉణర్వెనుమ్ పెరుమ్ పదమ్ తిరిన్దు=జ్ఞానమనెడి ఒక శ్లాఘ్యమైన మార్గమందు ప్రవేశించి; నాడినేన్=మంచిచెడులను పరిశీలింప మొదలెడితిని; నాడి = అట్టి పరిశీలనలో; నారాయణా ఎన్నుమ్ నామమ్ నాన్ కణ్డుకొణ్డేన్ = అష్టాక్షరీ మహామంత్రమును నేను పొందితిని.

                           అంతులేని దుఃఖములను కలుగజేయు శరీరమందు జన్మించి స్వరూపజ్ఞానములేక సంసారమందు మగ్నుడనైతిని. అట్టి నేను యౌవనమైన స్త్రీలు ఒసగు సంభోగ సుఖమునే తలచుచు  వారి వెనుకనే పరుగెడితిని. ఇట్లు తిరిగుచుండెడి నేను అనేక విషయసంబంధమైన కోరికలగల మనస్సుతో మిక్కిలి వ్యధపొందుతూ చాలకాలము గడుపుచూ వాడిపోతిని. ఇటువంటి దుస్ధితిలోనున్న నేను (సర్వేశ్వరుని నిర్హేతుకకృప వలన) ఉజ్జీవింజేసెడి ఒకమహోత్తరమైన సూత్రముచే జ్ఞానమనెడి ఒక శ్లాఘ్యమైన మార్గమందు ప్రవేశించి మంచిచెడులను పరిశీలింప మొదలెడితిని. అట్టిక్రమమందు అష్టాక్షరీ మహామంత్రమును నేను పొంది ధన్యుడైతిని. 

** ఆవియే! అముదే! ఎన నినైన్దురుగి, అవరవర్ పణై ములై త్తుణైయా,

పావియేన్ ఉణరాదు ఎత్తనైపగలుమ్ , పழுదుపోయొழிన్దన నాళ్ గళ్,

తూవిశేరన్నమ్ తుణైయొడుమ్ పుణరుమ్,శూழ் పునల్కుడన్దైయే తొழுదు, ఎన్

నావినాల్ ఉయ్య నాన్ కణ్డుకొణ్డేన్, నారాయణా ఎన్నుమ్ నామమ్ ll 949

ఆవియే = నాకు ప్రాణమువంటిదానా!; అముదే = నాకు అమృతమువలె భోగ్యమైనదానా!; ఎన = అని ఈ విధముగ చెప్పుచు; నినైన్దు = వారొసగెడి స్వల్పమైన సుఖములను తలచుకొని; ఉరుగి = మనసు కరిగిపోయి; అవర్ అవర్ = ఆ యా కాంతామణుల; పణై ములై = పెద్ద  స్తనములను; తుణైయా= (నా నిత్యానందమునకు) రక్షకమని; పావియేన్ = పాపియైన నేను; ఉణరాదు = స్వరూపజ్ఞానములేక, ఆ సర్వేశ్వరుడే రక్షకుడను తలచక; నాల్ గళ్ = ప్రతిదినము; (అట్లు)ఎత్తనై పగలుమ్ = ఎన్నియో దినములు; పழுదుపోయ్ ఒழிన్దన = వ్యర్ధముగ గడిచి పోయినవి(అయ్యో!); తూవి శేర్ అన్నమ్ = ఱెక్కలగల హంసలు; తుణైయొడు పుణరుమ్ = తమ ఆడ హంసలతో కూడి సంచరించుచున్న; పునల్ శూழ் = జలసమృద్దిచే చుట్టబడియున్న; కుడందైయే=తిరు కుడందై దివ్య దేశములో వేంచేసి యున్న ఆరావముదు పెరుమాళ్ ను;తొழுదు=సేవించి; నాన్ = విషయభోగములందు మగ్నుడైన నేను; ఉయ్య= ఉజ్జీవించునట్లు;నారాయణా ఎన్నుమ్ నామమ్=దివ్యమైన “నారాయణ” అను మహామంత్రమును ; ఎన్ నావినాల్ = నాయొక్క నాలుకచే; కణ్డు కొణ్డేన్ = స్తుతించు మహాభాగ్యమును పొందితిని.

                    సర్వేశ్వరుని స్మరించుచు చెప్పవలసిన ఆవియే!,అముదే! వాక్కులను యౌవన స్రీలను పొగుడుచు వారు ఒసగెడి స్వల్పమైన సుఖములను తలచుకొని మనసు కరిగిపోయి  వారియందు లీనమగుటయు, సర్వేశ్వరుడు రక్షకుడని ఎంచక ఆ ఆ కాంతామణుల స్తనములనే రక్షణగ తలచుచు పాపినగు నేను ప్రతిదినము విషయాంత పరుడనై ఎన్నియో దినములు వ్యర్ధముగ గడిపితిని. అందమైన ఱెక్కలగల హంసలు తమ ఆడ హంసలతో కూడి సంచరించుచున్న, జలసమృద్దిచే చుట్టబడియున్న తిరు కుడందై దివ్యదేశములో వేంచేసియున్న ఆరావముదు పెరుమాళ్ ను సేవించి విషయ భోగములందు మగ్నుడైన నేను ఉజ్జీవించునట్లు దివ్యమైన “నారాయణ” అను మహామంత్రమును నాయొక్క నాలుకచే స్తుతించు మహాభాగ్యమును పొందితిని.

శేమమే వేణ్డి త్తీవినై పెరుక్కి , తెరివైమారురవమే మరువి ,

ఊమనార్ కణ్డకనవిలుమ్ పழுదాయ్ , ఒழிన్దన కழிన్ద అన్నాళ్ గళ్, 

కామనార్ తాదై నమ్ముడైయడిగళ్ , తమ్మడైన్దార్ మనత్తిరుప్పార్ ,

నామమ్ నానుయ్య నాన్ కణ్డుకొణ్డేన్, నారాయణా ఎన్నుమ్ నామమ్ ll 950

శేమమే వేణ్డి=సౌఖ్యములనే కోరుకొనుచు; త్తీవినై పెరుక్కి=పాపకర్మములనే అధికముగ చేయుచు; తెరివై మారురవమే మరువి= స్తీల శరీరసౌందర్యమునే అనుభవింప వాంఛతో; కழிన్ద అన్నాళ్ గళ్ = గడిచిన ఆదినములు; ఊమనార్ కణ్డ కనవిలుమ్ పழுదాయ్  ఒழிన్దన = మూగవారు చూచు స్వప్నమువలె వ్యర్ధముగ నశించిపోయినవి;కామనార్ తాదై = మన్మధుని తండ్రియును;నమ్ముడై అడిగళ్=మనయొక్క స్వామియును; తమ్ అడైన్దార్ మనత్తు ఇరుప్పార్ = తనను ఆశ్రయించువారి హృదయమున నిత్యముగ వేంచేసియుండు సర్వేశ్వరునియొక్క; నామమ్ = దివ్యపదమైన, నారాయణా ఎన్నుమ్ నామమ్ =  ” నారాయణ ” అను దివ్యమైన నామమును; నాన్ = విషయభోగములందు మగ్నుడైన నేను; ఉయ్య= ఉజ్జీవింపబడునట్లు; నాన్ కణ్డుకొణ్డేన్ = నేను కనుగొంటిని.

   క్షేమమే కోరుకొనుచు ఎటువంటి సత్కర్మములను చేయక పాపకృత్యములనే అధికముగ చేయుచు, స్తీల శరీరసౌందర్యమునే తలచుచు చేయని పాపములు లేక, మూగవారు చూచు స్వప్నమువలె అనుభవించినది తన సహచరులతో పంచుకొని ఆ ఆనందమును చెప్పలేక,  గడిచిన ఆదినములు వ్యర్ధముగ నశించిపోయినవి .(అట్టి నేను) మన్మధుని తండ్రియును, మనయొక్క స్వామియును, తనను ఆశ్రయించువారి హృదయమున నిత్యముగ వేంచేసియుండు సర్వేశ్వరునియొక్క   ” నారాయణ ” అను దివ్యమైన నామమును విషయభోగములందు మగ్నుడైన నేను ఉజ్జీవింపబడునట్లు నేను కనుగొంటిని.

వెన్ఱియేవేణ్డి వీழ் పొరుట్కిరఙ్గి , వేఱ్కణార్ కలవియే కరుది ,

నిన్ఱవానిల్లా నెఞ్జినైయుడైయేన్ , ఎన్ శెయ్ గేన్ నెడువిశుమ్బణవుమ్ ,

పన్ఱియాయన్ఱు పారకమ్ కీణ్డ , పాழிయాన్ ఆழிయాన్ అరుళే ,

నన్ఱు నానుయ్య నాన్ కణ్డుకొణ్డేన్ , నారాయణా ఎన్నుమ్ నామమ్ ll 951

వెన్ఱియేవేణ్డి = విజయమునే ఆశించియు; వీழ் పొరుట్కు ఇరఙ్గి = తాత్కలికమైన సంపదలకై వ్యధపొందియు; వేల్ కణార్ కలవియే కరుది = శూలము వలె వాడియైకన్నులుగల కన్యల సంభోగమే ఆశపడుచును; (ఇట్లు బాహ్యవిషయములందు తపించుచు) నిన్ఱ ఆ నిల్లా నెఞ్జినై ఉడైయేన్ = ఏ ఒక్క విషయమందును స్థిరముగ మనస్సు ఉంచలేని  నేను; ఎన్ శెయ్ గేన్ = ఏమి చేయగలను?; అన్ఱు = పూర్వము ఒకప్పుడు ప్రళయకాలమున;నెడు విశుమ్బు అణవుమ్=విశాలమైన ఆకాశ పర్యంతము పెరిగిన; పన్ఱియాయ్ = మహా వరాహరూపముదాల్చి,పారకమ్ కీణ్డ = భూమండలమును ఉద్ధరించిన;   పాழிయాన్=మహాబలశాలియైన; ఆழிయాన్= చక్రాయుధము హస్తమందు గలవానియొక్క; అరుళే = కృపవలననే; నాన్ = విషయభోగములందు మగ్నుడైన నేను;నన్ఱు ఉయ్య = బాగుగా ఉజ్జీవింపబడునట్లు; నారాయణా ఎన్నుమ్ నామమ్ =   ” నారాయణ ” అను దివ్యమైన నామమును; నాన్ కణ్డుకొణ్డేన్ = నేను కనుగొంటిని.

                         సమస్త జనులపై విజయమునే ఆశించియు, అనిత్యమైన సంపదలకై వ్యధపొందియు, శూలము వలె వాడియైన కన్నులుగల కన్యల సంభోగమే ఆశపడుచూ,మిక్కిలి చంచలమైన మనస్సు గల నేను  ఏమి చేయగలను?. పూర్వము ఒకప్పుడు ప్రళయకాలమున మహా వరాహరూపముదాల్చి భూమండలమును ఉద్ధరించిన మహాబలశాలియైన చక్రాయుధుడైన సర్వేశ్వరుని  కృపవలననే విషయభోగములందు మగ్నుడైన నేను బాగుగా ఉజ్జీవింపబడునట్లు ” నారాయణ ” అను దివ్యమైన నామమును నేను కనుగొంటిని.

కళ్వనేనానేన్ పడిఱుశెయ్ దిరుప్పేన్ ,కణ్డవాతిరితన్దేనేలుమ్ ,

తెళ్ళియేనానేన్ శెల్ కదిక్కు అమైన్దేన్, శిక్కెన తిరువరుళ్ పెర్ట్రేన్ ,

ఉళ్ళెలామ్ ఉరుగి క్కురల్ తழுత్తొழிన్దేన్, ఉడమ్బెల్లామ్ కణ్ణనీర్ శోర,

నళ్ళిరుళళవుమ్ పగలుమ్ నానழைప్పన్, నారాయణా ఎన్నుమ్ నామమ్ll 952

కళ్వనేన్ ఆనేన్ = ( గడిచిన కాలమున ) సర్వేశ్వరునికి సంబందించిన ఈ ఆత్మను అపహరించిన వాడనైతిని; పడిఱు శెయ్ దు ఇరుప్పేన్ = అనేక నీచకృత్యములను చేయుచుంటిని; (ఈ విధముగ ) కణ్డవా తిరితన్దేనేలుమ్ =  మనస్సు ప్రేరేపించుచుండు విధముగ సంచరించువాడనైతిని అయినను;  (ఇప్పుడు) తెళ్ళియేన్ ఆనేన్ = నేను స్వచ్ఛమైన జ్ఞానమును కలిగినవాడనైతిని; తిరు అరుళ్ శిక్కెన పెర్ట్రేన్ = సర్వేశ్వరుని దివ్యమైన కృపను దృఢముగ పొందితిని; శెల్ గదిక్కు అమైన్దేన్ = పోవలసిన మంచి మార్గమున నేను పడితిని; ఉళ్ ఎలామ్ ఉరుగి = నా హృదయము, శరీరమంతయు కరిగి; కురల్ తழுత్తొழிన్దేన్=కంఠము గద్గదమై; కణ్ణనీర్ ఉడమ్బెల్లామ్ శోర=ఆనంద బాష్పములు నా శరీరమంతయు తడచునట్లు కారుతుండగ;నల్ ఇరుళ్ అళవుమ్ = రాత్రంతను, పగల్ అళవుమ్ = పగలంతను; నారాయణా ఎన్నుమ్ నామమ్ =  ” నారాయణ ” అను దివ్యమైన నామమును;నాన్ అழைప్పన్=నేను చెప్పుచున్నాను.

                             సర్వేశ్వరునికి సంబందించిన ఈ ఆత్మను అపహరించినవాడనై,అనేక నీచకృత్యములను చేయుచు,  శాస్త్ర  విరుద్ధములైన పనులను మనస్సునకుతోచిన విధముగ చేయుచు తిరిగెడి నేను ఆ సర్వేశ్వరుని నిర్హేతుకకృపను దృఢముగ పొందుటచే స్వస్వరూపము, నాకుగల భగవత్సంబంధము తెలుసుకొనినవాడనై, పోవలసిన మంచి మార్గమున నేను పడితిని. ఈ పరిణామముచే, నా స్వామి దివ్య చరణములందు లీనమైన మనస్సుగల నేను రాత్రంతయు, పగలంతయు ” నారాయణ ” అను దివ్యమైన నామ స్మరణముచే నా హృదయము, శరీరమంతయు కరిగి , కంఠము గద్గదమై, అమితానందముచే కన్నీళ్లు ఎడతెగక కారెడి ఔనత్యము పొందితిని. (దివ్యనామస్మరణచే కలిగెడి ఆనందము వర్ణణాతీతము.)

** ఎమ్బిరాన్ ఎన్దై ఎన్నుడైశుర్ట్రమ్ , ఎనక్కరశెన్నుడైవాణాళ్ ,

అమ్బినాల్ అరక్కర్ వెరుక్కొళనెరుక్కి, అవరుయిర్ శెగుత్త ఎమ్మణ్ణల్,

వమ్బుఉలామ్ శోలై మామదిళ్ , తఞ్జైమామణిక్కోయిలే వణఙ్ఙి ,

నమ్బిగాళ్ ఉయ్యనాన్ కణ్డుకొణ్డేన్, నారాయణా ఎన్నుమ్ నామమ్ll 953

నమ్బిగాళ్ = భగవద్గుణానుభవములో మునిగియున్న ఓ భాగవతోత్తములారా!  ఎమ్బిరాన్=నాయొక్క మహోపకారకుడును; ఎందై = నాయొక్క తండ్రియైనవాడును;ఎన్నుడైశుర్ట్రమ్ = నాయొక్క సకల విధమైన బంధువును; ఎనక్కు అరసు = నన్ను పాలించు ప్రభువును; ఎన్నుడై వాழ்నాళ్=నాయొక్క జీవితాధారమైనవాడును; అరక్కర్ వెరుక్కొళ = రాక్షసులు భయపడునట్లు; అమ్బినాల్ = బాణములతో; నెరుక్కి = ఉక్కిరిబిక్కిరి చేసి; అవర్ ఉయిర్ శెగుత్త ఎమ్మణ్ణల్ = వారియొక్క ప్రాణములనుకడతేర్చిన నాయొక్క స్వామియైన సర్వేశ్వరునియొక్క; వమ్బుఉలామ్ శోలై = పరిమళము వీచుచున్న తోటలును; మా మదిళ్ = పెద్ద ప్రాకారములును కలిగిన;తఞ్జైమామణిక్కోయిలే వణఙ్ఙి = తఞ్జైమామణి కోవెలనే సేవించుచు; నాన్ ఉయ్య =మీకు వలనే  నేను ఉజ్జీవించునట్లు; నారాయణా ఎన్నుమ్ నామమ్ కణ్డుకొణ్డేన్ =” నారాయణ ” అను దివ్యమైన నామమును కనుగొంటిని.

    భగవద్గుణానుభవములో మునిగితేలుచున్న ఓ భాగవతోత్తములారా! మీకు వలనే నేనుకూడ, నాయొక్క మహోపకారకుడును, నాయొక్క తండ్రియైనవాడును,నాయొక్క సకల విధమైన బంధువును, నాయొక్క జీవితాధారమైనవాడును, రాక్షసులు భయపడునట్లు బాణములతో ఉక్కిరిబిక్కిరి చేసి వారియొక్క ప్రాణములను హరించిన  స్వామియైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన, పరిమళము వీచుచున్న తోటలును,పెద్ద ప్రాకారములును కలిగిన తఞ్జైమామణి కోవెలనే సేవించుచు, ఉజ్జీవించునట్లు ” నారాయణ ” అను దివ్యమైన నామమును కనుగొంటిని..

ఇల్ పిఱప్పు అఱియీర్ ఇవరవరెన్నీర్, ఇన్నదోర్ తన్మైయెన్ఱుణరీర్,

కఱ్పగమ్ పులవర్ కళైగణెన్ఱులగిల్ , కణ్డవా తొణ్డరై ప్పాడుమ్ ,

శొల్ పొరుళాళీర్ శొల్లుగేన్ వమ్మిన్, శూழ் పునల్ కుడన్దైయేతొழுమిన్ ,

నల్ పొరుళ్ కాణ్మిన్ పాడినీర్ ఉయ్ మ్మిన్, నారాయణా ఎన్నుమ్ నామమ్ll 954

ఇల్ పిఱప్పు అఱియీర్ = సంసార జీవితముయొక్క స్థితిగతులు మరియు కులముయొక్క గొప్పతనమును తెలుసుకొనక;ఇవర్ అవర్ ఎన్నీర్= ఇప్పుడుండెడి ధనవంతులు మునపటి దరిద్రులని తెలుసుకొనక, ఇన్నదోర్ తన్మైయెన్ఱుణరీర్ = “వీరియొక్క స్వభావము ఇటువంటిది” అని తెలుసుకొనక; ఉలగిల్ తొణ్డరై = లోకమున ప్రజలకు స్వల్పమైన పనులు చేయుచు సంచరించెడి వారిని; కఱ్పగమ్ ఎన్ఱు = కల్పవృక్షమువలె దానమునిచ్చువాడా!అనియు;పులవర్ ఎన్ఱు = సర్వజ్ఞుడా!అనియు; కళై కణ్ ఎన్ఱు = రక్షకుడా! అనియు; కణ్డ ఆ పాడుమ్ = మనస్సునకు తోచినవిధముగ పొగుడుచు; శొల్ పొరుళ్ ఆళీర్ = మంచి అర్థములతో కూడిన వాక్కులను చెప్పగల సమర్ధలైన  కవిశ్రేష్టులారా!;శొల్లుగేన్=మీకు మంచి హితము చెప్పుచున్నాను; వమ్మిన్ = నీచులను కవిత్వముతో పొగడుట విడిచి నాచెంతకు రండి; పునల్ శూழ் కుడన్దై  తొழுమిన్ = జలసమృద్దిచే చుట్టబడియున్న తిరు కుడందై దివ్య దేశములో కృపతో వేంచేసియున్న ఆరావముదు పెరుమాళ్ ను సేవించండి; నారాయణా ఎన్నుమ్ నామమ్ పాడినీర్ ఉయ్ మ్మిన్ = ” నారాయణ ” నామమును పాడుచు ఉజ్జీవించి ధన్యులవండి.నల్ పొరుళ్ కాణ్మిన్ = మీకు నేను ఉపదేశించెడి  ఈ శ్లాఘ్యమైన పరమార్థమును తెలుసుకొనండి.

సకల శాస్త్రములను అభ్యసించి శ్లాఘ్యమైన కవిత్వము చెప్పగలమిక్కిలి సమర్ధవంతులైన మీరు లోకములో ప్రజలకు స్వల్పమైన పనులు చేయుచు సంచరించెడి    ధనవంతులయొక్క గృహస్థ జీవనవిధానము, కులముయొక్క గొప్పతనము,  వారియొక్క ముందటి పేదరికము, నిజ స్వభావము, మొదలగు విషయములు ఏమియు తెలుసుకొనక, వారిని కల్పవృక్షమువలె దానమునిచ్చువాడా!అనియు, బృహస్పతిని మించిన సర్వజ్ఞుడా! అనియు,రక్షకుడా! అనియు మనస్సునకు తోచినవిధముగ పొగుడుటచే కలగెడి క్షుద్రమైన ప్రయోజనములను వీడి, నాయొక్క  హితమును విని జలసమృద్దిచే చుట్టబడియున్న తిరు కుడందై దివ్య దేశములో కృపతో వేంచేసియున్న ఆరావముదు పెరుమాళ్ ను సేవించుకొనచు,  ” నారాయణ ” నామమును పాడుచు ఉజ్జీవించి ధన్యులవండి. నాయొక్క హితమందలి శ్లాఘ్యమైన జీవిత పరమార్థమును తెలుసుకొనండి.

కర్ట్రిలేన్ కలైగళ్ ఐమ్బులన్ కరుదుమ్, కరుత్తులే తిరుత్తినేన్ మనత్తై,

పెర్ట్రిలేన్ అదనాల్ పేదైయేన్ నన్మై ,పెరనిలత్తారుయిర్కెల్లామ్ ,

శెర్ట్రమే వేణ్డి త్తిరితరువేన్ తవిర్ న్దేన్, శెల్ కదిక్కు ఉయ్యు మాఱెణ్ణి

నర్ట్రుణయాగ ప్పర్ట్రినేనడియేన్ , నారాయణా ఎన్నుమ్ నామమ్ll 955

కలైగళ్ = శాస్త్రములను; కర్ట్రిలేన్ = అభ్యసించినవాడనుకాను; ఐమ్బులన్ కరుదుమ్, కరుత్తులే = పంచేంద్రియములు కోరుకొనెడి విషయములందే; మనత్తై తిరుత్తినేన్ = నాయొక్క హృదయమున తలచుచుంటిని; అదనాల్ = ఆ కారణముచే; పేదైయన్ =అవివేకియైన నేను; నన్మై పెర్ట్రిలేన్ = ఒక మంచి ఆలోచనయు లేనివాడనైతిని; పెరునిలత్తార్ = ఈ పెద్ద భూమియందుగల; ఉయిర్ క్కు ఎల్లామ్ = ప్రాణులన్నింటికిని; శెర్ట్రమే వేణ్డి = హాని కలిగించు మార్గములనే తలచుచు; తిరితరువేన్ = తిరుగుచుంటిని; (ఈ విధముగ చిరకాలమునుండి పాపములు చేయుచు చెడిపోయునవాడైనను భగవంతుని కరుణాకటాక్షముచే నేను) తవిర్ న్దేన్ = ఆ పాపకృత్యములనుండి విముక్తిపొందితిని; అడియేన్=దాసుడైన నేను;శెల్ గదిక్కు ఉయ్యుమ్ ఆఱు ఎణ్ణి=వెడలవలసిన మంచి మార్గమును ఆలోచనచేసి ఉజ్జీవించువిధానమును చింతించి; నారాయణా ఎన్నుమ్ నామమ్ = ” నారాయణ ”  దివ్యనామమును; నల్ తుణైయాగ పర్ట్రినేన్ = మంచి సహాయముగ పట్టుకొంటిని.

ఒక ఆచార్యునికూడ ఆశ్రయించని కారణముచే శాస్త్రఙ్ఞానమునాకు కలుగలేదు . అట్టి నేను పంచేంద్రియములు కోరుకొనెడి విషయములనే నాయొక్క హృదయమున తలచుచుంటిని. అవివేకియైన నేను ఒక మంచి ఆలోచనయు లేనివాడనైతిని. మరియు ఈ భూమియందుగల ప్రాణులన్నింటికిని హాని కలిగించు మార్గములనే తలచుచు తిరుగుచుంటిని. ఈ విధముగ చిరకాలము నుండి పాపములు చేయుచు చెడిపోయునవాడైనను సర్వేశ్వరుని కరుణాకటాక్షముచే నేను ఆ పాప కృత్యములనుండి విముక్తి పొందితిని. ఆ సర్వేశ్వరుని దివ్య చరణములయందు చేరి ఉజ్జీవించు విధానమును చింతించి ” నారాయణ ” అను  దివ్యనామమును మంచి సహాయముగ పట్టుకొంటిని.

** కులన్దరుమ్ శెల్వన్తన్దిడుమ్, అడియార్ పడు తుయరాయిన వెల్లామ్,

నిలన్దరుమ్ శెయ్యుమ్ నీళ్ విశుమ్బరుళుమ్, అరుళొడు పెరునిలమళిక్కుమ్,

వలన్దరుమ్ మర్ట్రుంతన్దిడుమ్, పెర్ట్రతాయినుమ్ ఆయిన శెయ్యుమ్,

నలన్దరుమ్ శొల్లైనాన్ కణ్డుకొణ్డేన్, నారాయణా ఎన్నుమ్ నామమ్ ll 956

నారాయణా ఎన్నుమ్ నామమ్ = ఈ నారాయణ అను దివ్యమైన నామము;కులమ్ తరుమ్=ఉత్తమమైన వంశము ఒసగును;శెల్వము తన్దిడుమ్ = ఐశ్వర్యము ఇచ్చును;అడియార్ పడు తుయరాయిన ఎల్లామ్= ఆశ్రితులు అనుభవించెడి దుఃఖములు సర్వము;నిలమ్ దరమ్ శెయ్యుమ్ = నేలపాలుచేయును;నీళ్ విశుమ్బు అరుళుమ్=పరమపదము కలుగజేయును;పెరు నిలమ్ = మహత్వమైన కైంకర్యమును; అళిక్కుమ్= కలుగజేయును; వలమ్ తరుమ్=భగవద్భక్తికి తగు శక్తిని ఇచ్చును;మర్ట్రుమ్ తన్దిడుమ్= మరియు కావలసిన సద్గుణ సంపత్తిని కలుగజేయును; పెర్ట్ర తాయినుమ్ ఆయిన శెయ్యుమ్ = కన్న తల్లి వలె ఎల్లప్పుడును హితము చేయుచుండును; (ఈ విధమైన)నలమ్ తరుమ్ శొల్లై=శుభములను కలుగజేయు దివ్యనామమును;నాన్ కణ్డుకొణ్డేన్=  నేను కనుగొంటిని. 

ఈ నారాయణ అను దివ్యమైన నామము , ఉత్తమమైన వంశమందు జన్మము ఒసగును,ఐశ్వర్యము ఇచ్చును, ఆశ్రితులు అనుభవించెడి దుఃఖములనుపోగొట్టును,పరమపదము కలుగజేయును, కైంకర్యశ్రీ లభించును,భగవద్భక్తికి తగు శక్తిని ఇచ్చును.మరియు కావలసిన సద్గుణ సంపత్తిని కలుగజేయును. కన్న తల్లి వలె ఎల్లప్పుడును హితము చేయుచుండును. ఇట్లు అనేక శుభములను కలుగజేయు దివ్యనామమును నేను (సర్వేశ్వరుని నిర్హేతుకకృపచే) తెలుసుకొంటిని. 

** మఞ్జులామ్ శోలై వణ్డరైమానీర్, మఙ్గైయార్ వాళ్ కలికన్ఱి,

శెఞ్జొలాల్ ఎడుత్త దెయ్ వనన్మాలై, యివైకొణ్డు శిక్కెనత్తొణ్డీర్ ,

తుఞ్జుమ్బోదుఅழைమిన్ తుయర్వరిల్ నినైమిన్, తుయరిలీర్ శొల్లిలుమ్ నన్ఱామ్,

నఞ్జుదాన్ కణ్డీర్ నమ్ముడై వినైక్కు, నారాయణా ఎన్నుమ్ నామమ్ ll 957

మఞ్జు ఉలామ్ శోలై = మేఘములు సంచరించెడి తోటలును; వణ్డు అరై మా నీర్ =తుమ్మెదల ఝంకారములును,జలసమృద్దియును కలిగిన; మఙ్గైయార్ = తిరుమంగైదేశవాసులకుప్రభువును; వాళ్=శూలముహస్తమున కలవారయిన;కలికన్ఱి=తిరుమంగై ఆళ్వార్; శెమ్ శొల్లాల్ ఎడుత్త= శ్లాఘ్యమైన పదములతో అనుగ్రహించిన;దెయ్ వ నల్ మాలై = దివ్యమైన ఈ మంచి సూక్తులమాలను;శిక్కెన కొణ్డు=నాలుకయందు దృఢముగ నుంచుకొని; తొణ్డీర్ = భక్తులారా!; తుఞ్జుమ్బోదు అழைమిన్ = శరీరము విడిచెడి కాలమున అనుసంధించండి; తుయర్ వరిల్ నినైమిన్ = దుఃఖసమయములందు స్మరించండి;తుయర్ ఇలీర్ శొల్లిలుం నన్ఱామ్=  దుఃఖములు లేనివారు అనుసంధించినచో మేలు కలుగును;నారాయణా ఎన్నుమ్ నామమ్ = ఈ నారాయణ అను దివ్యమైన నామము; నమ్ముడై వినైక్కు= మనయొక్క పాపసమూహములకు;నఞ్జుదాన్ కణ్డీర్=విషమే యగును సుమా!

మేఘములు సంచరించెడి తోటలును, తుమ్మెదల ఝంకారములును, జలసమృద్దియును కలిగిన తిరుమంగై దేశవాసులకు ప్రభువును,ప్రసిద్ధమైన శూలము హస్తమున కలవారయిన తిరుమంగై ఆళ్వార్ శ్లాఘ్యమైన పదములతో అనుగ్రహించిన దివ్యమైన ఈ సూక్తులమాలను హృదయాంతరాళమందు నుంచుకొని ఓ!  భక్తులారా! శరీరావశానదినములందు అనుసంధించి పరమపద ప్రాప్తిని, దుఃఖసమయములందు స్మరించి దుఃఖముల విముక్తిని, దుఃఖములు లేని సమయములందు అనుసంధానము చేసి శుభప్రాప్తిని పొందండి.ఈ నారాయణ అను దివ్యమైన నామము మనయొక్క పాపసమూహములకు విషముగనుండును సుమా!

*****************

                 

  

వ్యాఖ్యానించండి