పెరియ తిరుమొழி-1వపత్తు (3)

శ్రీః

3 .ముర్ట్రమూత్తు   

                   శ్రీమన్నారాయణుడు ఆచార్యునిగాను ,తానే శిష్యునిగాను ఈ లోకమందు అవతరించి తిరుమంత్రమును ఉపదేశించిన  బదరిక్షేత్రమును , తిరుమంగై ఆళ్వార్ కాలవిలంబన చేయుటచే కలిగెడి వృద్ధాప్యముయొక్క స్థితిగతులను తెలపుచు తన మనస్సును వెంటనే ఆలసించక ఆ దివ్యదేశమునకు వెడలి సేవించుకొందుమని తెలుపుచున్నారు. 

** ముర్ట్రమూత్తుక్కోళ్ తుణైయా , మున్నడి నోక్కి వళైన్దు ,

ఇర్ట్రకాల్ పోల్ తళ్ళి మెళ్ళ , ఇరున్దు అఙ్గు ఇళైయామున్ ,

పెర్ట్రతాయ్ పోల్ వన్ద పేయ్ చ్చి , పెరు ములైయూడు , ఉయరై

వర్ట్రవాఙ్గియుణ్డ వాయాన్ , వదరి వణఙ్గుదుమే ll   968

ముర్ట్ర మూత్తు =  పూర్తిగ ముసలితనము పొంది; క్కోళ్ తుణైయా = చేతికఱ్ఱ సహాయముగ; మున్ అడి  వళైన్దు నోక్కి = ముందు వేయవలసిన అడుగును వంగిచూచుకొని; ఇర్ట్రకాల్ పోల్ తళ్ళి = విరిగిన కాలువలె తడబడుచు; అఙ్గు=అచ్చటనే;మెళ్ళ ఇరున్దు = మిక్కిలి ప్రయాసముతో కూర్చునియు; ఇళైయా మున్ = ఈ విధముగ పెక్కు కష్టములు కలగకముందే; పెర్ట్ర తాయ్ పోల్ వన్ద = కన్న తల్లి యశోద వలె రూపముదాల్చి వచ్చిన; పేయ్ చ్చి = పూతనయొక్క; పెరు ములై ఊడు = పెద్ద స్తనములనుండి; ఉయిరై = ఆమెయొక్క ప్రాణమును; వర్ట్ర వాఙ్గి యుణ్డ వాయాన్ =పూర్తిగ ఎండి పోవునట్లు పీల్చి ఆరగించిన దివ్యమైన ఎఱ్ఱని పెదవులుగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన; వదరి = శ్రీ బదరిని; వణఙ్గుదుమే = సేవించుకొందుము. 

                                  (ఓ నామనసా!)పూర్తిగ ముసలితనము పొంది చేతికఱ్ఱ సహాయముగ ముందుకు వంగి చూచుకొనుచు మిక్కిలి తడబడుచు నడవలేక ఆయాసపడుచు, అచటనే  అతి ప్రయాసముతో మెల్లిగ కూర్చునుచూ , ఇట్లు పెక్కు కష్టములు కలగకముందే ,కన్న తల్లి యశోద వలె రూపమునుదాల్చి వచ్చిన పూతనయొక్క పెద్ద స్తనములనుండి ఆమెయొక్క ప్రాణమును పూర్తిగ ఎండిపోవునట్లు పీల్చి ఆరగించిన దివ్యమైన ఎఱ్ఱని పెదవులుగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన శ్రీ బదరిని సేవించుకొందుము.

ముదుగు పర్ట్రి క్కైత్తలత్తాల్ , మున్నొరు కోలూన్ఱి ,

విదిర్ విదర్తు క్కణ్ శుழన్ఱు ,మేఱ్కిళైక్కొణ్డు ఇరుమి ,

ఇదువెన్ అప్పర్ మూత్తవాఱెన్ఱు , ఇళైయవర్ ఏశామున్ ,

మదువుణ్ వణ్డు పణ్గళ్ పాడుమ్ , వదరి వణఙ్గుదుమే ll 969

క్కై తలత్తాల్ = ఒక చేతితో; ముదుగు పర్ట్రి = నడుమును పట్టుకొని;మున్ ఒరు కోల్ఊన్ఱి = (వేరొక చేతితో) ఒక కర్రను ఎదుట ఆన్చి; విదిర్ విదర్తు = శరీరము వణుకుచు;కణ్ శుழన్ఱు = కళ్ళుతిరుగుచుండగ; మేల్ కిళై క్కొణ్డు ఇరుమి =పెద్ద కంఠముతో దగ్గుచూ,ఇమైయవర్ = యౌవన స్రీలు; అప్పర్ మూత్త ఆఱు ఎన్ఱు ఇదు వెన్ = ” ఈ పెద్ద మనిషి ముసలితనముతో  ఏవిధముగ యున్నాడో ” అని; ఏశామున్ = పరిహాసము చేయకమునుపే; మదు ఉణ్ వణ్డు = పుష్షములందలి తేనెనుగ్రోలి తుమ్మెదలచే;పణ్గళ్ పాడుమ్ = ఇంపుగ పాడబడుచుండెడి; వదరి = శ్రీ బదరిని; వణఙ్గుదుమే = సేవించుకొందుము.

ఒక చేతితో నడుమును పట్టుకొని ఇంకొక చేతితో కర్రను ఎదుట ఆన్చిశరీరము వణుకుచు, నడచుచు , కళ్ళుతిరిగి, నిలబడి , పెద్దకంఠముతో దగ్గుచుండు స్థితిని చూచి యౌవన స్రీలు “ఈ పెద్ద మనిషి ముసలి తనముతో  ఏవిధముగ యున్నాడో ”  అని పరిహాసము చేయక మునుపే, పుష్షములందలి తేనెనుగ్రోలి తుమ్మెదలచే  ఇంపుగ పాడబడుచుండెడి  శ్రీ బదరిని సేవించుకొందుము.

ఉరిగళ్ పోల్ మెయ్ నరమ్బెழన్దు ,ఊన్ తళర్ న్దు ఉళ్ళమెళ్ గి,

నెఱియై నోక్కి క్కణ్ శుழన్ఱు , నిన్ఱు నడుఙ్గామున్ ,

అఱిదియాగిల్ నెఞ్జ మన్బాయ్ , ఆయిరనామమ్ శొల్లి ,

వెరికొళ్ వణ్డు పణ్గళ్ పాడుమ్ , వదరి వణఙ్గుదుమే ll 970

మెయ్ నరమ్బు = శరీరమందలి నరములు;ఉరిగళ్ పోల్ ఎழన్దు = తాళ్ళవలె పైకి కనబడుచు; ఊన్ తళర్ న్దు =మాంసపుకండలు క్షీణించి; ఉళ్ళమ్ ఎళ్ గి = హృదయము శిధిలమై; నెఱియై నోక్కి కణ్ శుழన్ఱు =నడచి పోవలసిన మార్గము చూచి కళ్ళుతిరిగి; నిన్ఱు=నడవలేక నిలబడిపోయి; నడుఙ్గామున్= వణుకుచుండెడి స్థితిరాకమునుపే; నెఞ్జమ్=ఓ! నామనసా!, అఱిదియాగిల్ = నీకు వివేకమున్నచో;అన్బు ఆయ్ =భక్తితో; ఆయిరమ్ నామమ్ శొల్లి =సర్వేశ్వరుని సహస్రనామములను అనుసంధించుచు; వెరికొళ్ వణ్డు పణ్గళ్ పాడుమ్ = పరిమళముతోనుండు తుమ్మెదలచే ఇంపుగ పాడుచుండబడు; వదరి = శ్రీ బదరిని; వణఙ్గుదుమే = సేవించుకొందుము.

                              శరీరమందలి నరములు తాళ్ళవలె పైకి కనబడుచు, మాంసపుకండలు క్షీణించి, హృదయము శిధిలమై, నడచి పోవలసిన మార్గము చూచి కళ్ళుతిరిగి,నడవలేక నిలబడిపోయి వణుకుచుండెడి స్థితిరాకమునుపే ఓ! నామనసా!, వివేకముతో,సర్వేశ్వరుని సహస్ర నామములను అనుసంధించుచు, తుమ్మెదలచే ఇంపుగ పాడుచుండబడు శ్రీ బదరిని సేవించుకొందుము. 

పీళై శోర క్కణ్ణిడుఙ్గి , ప్పిత్తెழ మూత్తు ఇరుమి ,

తాళ్ గళ్ నోవ త్తమ్మిల్ ముట్టి , త్తళ్ళి నడవామున్ ,

కాళైయాగి క్కన్ఱుమేయ్ త్తు , కున్ఱెడుత్తు అన్ఱు నిన్ఱాన్ ,

వాళై పాయుమ్ తణ్ తడమ్ శూழ் , వదరి వణఙ్గుదుమే ll 971

కణ్ ఇడుఙ్గి=కన్నులు సన్నగిల్లి; పీళై శోర=పుసులు కారుచును; ప్పిత్తెழ= పిత్తముఅధికమై; మూత్తు= ముసలితనముతో; ఇరుమి = దగ్గుచూ; తాళ్ గళ్  తమ్మిల్ ముట్టి నోవ=కాళ్ళు ఒకదానితో ఒకటి కొట్టుకొని బాధపడుచు; తళ్ళి నడవామున్= తడబడుచు నడచుట కలుగకముందే; అన్ఱు = పూర్వము ఒకప్పుడు; కాళైయాగి = బాలుడుగ; కన్ఱు మేయ్ త్తు = పశువులను మేయించియు; కున్ఱు ఎడుత్తు నిన్ఱాన్ = (ఇంద్రుడు అహంకారముచే కురుపించిన రాళ్ళ వర్షమునుండి ఆ పశువుల సంరక్షణార్ధమై ) గోవర్ధనపర్వతమును గొడుగు వలె పైకెత్తి నిలిచిన సర్వేశ్వరుడు వేంచేసియున్న; వాళై పాయుమ్ తణ్ తడమ్ శూழ் = వాళై మత్స్యములు గెంతులువేయుచు ఈదుచుండెడి చల్లని కొలనులచే చుట్టబడియున్న;వదరి = శ్రీ బదరిని; వణఙ్గుదుమే = సేవించుకొందుము.

              కన్నులు సన్నగిల్లి పుసులు కారుచును, పిత్తము అధికమై ముసలితనముతోకాళ్ళు ఒకదానితో ఒకటి కొట్టుకొని బాధపడుచు, తడబడుచు కిందపడుచు,నడచుట కలుగకముందే, పూర్వము బాలుడుగ పశువులను మేయించియు, ఇంద్రుడు అహంకారముచే కురుపించిన రాళ్ళ వర్షమునుండి ఆ పశువుల సంరక్షణార్ధమై గోవర్ధనపర్వతమును గొడుగు వలె పైకెత్తి నిలిచిన సర్వేశ్వరుడు వేంచేసియున్న,వాళై మత్స్యములు గెంతులువేయుచు ఈదుచుండెడి చల్లని కొలనులచే చుట్టబడియున్న శ్రీబదరిని ,(ఓ! నామనసా! రమ్ము ) సేవించుకొందుము.

పణ్డు కామరాన వాఱుమ్ , పావైయర్ వాయముదమ్ 

ఉణ్డ వాఱుమ్ , వాழ் న్ద వాఱుమ్ ,ఒక్క ఉరైత్తిరుమి ,

తణ్డు కాలా వూన్ఱియూన్ఱి ,త్తళ్ళి నడవామున్ ,

వణ్డు పాడుమ్ తణ్ తుழாయాన్ , వదరి వణఙ్గుదుమే ll 972

పణ్డు = తన యౌవనకాలమందు; కామరాన వాఱుమ్ = స్త్రీలు తనను అభిలషించియుండు విషయములను; పావైయర్ = ఆ కాంతామణుల; వాయ్ అముదమ్ ఉణ్డ వాఱుమ్ = అధరామృతమును గ్రోలిన విషయములను; వాழ் న్ద వాఱుమ్ = తాను అనుభవించిన అల్పమైన సుఖములను; ఒక్క ఉరైత్తు ఇరుమి = చెప్పుచు, దగ్గుచు చెప్పుచు, దగ్గుచు ఈ విధముగ; దణ్డు కాలా=కర్రను కాలువలె;ఊన్ఱి ఊన్ఱి = (అశక్తిచే ఒకే చోట) పలుమార్లు నొక్కుచు; తళ్ళి నడవామున్ = తడబడుచు నడచుట కలగకముందే; వణ్డు పాడుమ్ తణ్ తుழாయాన్ = (మధువును గ్రోలుటకై వచ్చిన)తుమ్మెదలచే ఇంపుగ పాడబడుచుండెడి చల్లని తులసీమాలచే అలంకృతుడైన సర్వేశ్వరుడు వేంచేసియున్న; వదరి = శ్రీ బదరిని; వణఙ్గుదుమే = సేవించుకొందుము.

తన యౌవనకాలమందు స్త్రీలు తనను అభిలషించియుండు విషయములను, ఆ కాంతామణుల అధరా మృతమును గ్రోలిన విషయములను, తానుఅనుభవించిన అల్పమైన సుఖములను చెప్పుచు, దగ్గుచు, చెప్పుచు, దగ్గుచు ఈ విధముగ కర్రను కాలువలె శక్తి లేక ఒకేచోట పలుమార్లు నొక్కుచు తడబడుచు నడచుట కలగకముందే, (ఓ ! నామనసా!) తుమ్మెదలచే ఇంపుగ పాడబడుచుండెడి చల్లని తులసీ మాలచే అలంకృతుడైన సర్వేశ్వరుడు వేంచేసియున్న శ్రీ బదరిని సేవించుకొందుము.

ఎయ్ త్త శొల్లోడు ఈళై ఏఙ్గి , ఇరుమి ఇళైత్తు ఉడలమ్ ,

పిత్తర్ పోలచ్చిత్తమ్ వేఱాయ్ , ప్పేశి అయరామున్ ,

అత్తన్ ఎన్దై ఆదిమూర్తి , ఆழ் కడలై కడైన్ద ,

మైత్త శోది ఎమ్బెరుమాన్, వదరి వణఙ్గుదుమే ll         973

ఎయ్ త్త శొల్లోడు = బలమహీనమైన మాటలతో; ఈళై ఏఙ్గి = కఫము కంఠమున అడ్డు కొనుటచే; ఇరుమి=దగ్గుచూ; ఉడలమ్ ఇళైన్దు=శరీరము కృశించి; పిత్తర్ పోల= పిచ్చెక్కిన వానివలె; వేఱు చిత్తమ్ ఆయ్ పేశి = వికారము పొందిన మనస్సుగలిగి మాటలాడుచు; అయరామున్ = మిక్కిలి అలసిపోవు స్థితిని పొందకముందే; అత్తన్= సర్వస్వామియును; ఎన్దై = మనయొక్క తండ్రియును, ఆదిమూర్తి = జగత్కారణభూతుడును; ఆழ் కడలై కడైన్ద = అగాధమైన సముద్రమును చిలికిన;మైత్త శోది = కాటుకవలె నల్లని తిరమేనితో ప్రకాశించు; ఎమ్బెరుమాన్ = సర్వేశ్వరుడు వేంచేసియున్న; వదరి = శ్రీ బదరిని; వణఙ్గుదుమే = సేవించుకొందుము.

బలమహీనమైన మాటలతో కఫము కంఠమున అడ్డుకొనుటచే దగ్గుచూ శరీరము కృశించి పిచ్చెక్కిన వానివలె వికారము పొందిన మనస్సుగలిగి మాటలాడుచు మిక్కిలి అలసిపోవు స్థితిని పొందకముందే ఓ! నామనసా! సర్వస్వామియును,  మనయొక్కతండ్రియును, జగత్కారణభూతుడును,  అగాధమైన సముద్రమును చిలికిన , కాటుకవలె నల్లని తిరమేనితో ప్రకాశించు , సర్వేశ్వరుడు వేంచేసియున్న  శ్రీబదరిని  సేవించుకొందుము.

పప్ప అప్పర్ మూత్తవాఱు , పాழ்ప్పదు శీత్తిరళై 

యొప్ప , ఐక్కళ్ పోదవున్ద , ఉన్దమర్ కాణ్మినెన్ఱు ,

శెప్పునేర్ మెన్ కొఙ్గైనల్లార్ , తామ్ శిరియాదమున్నమ్ ,

వైప్పుమ్ నఙ్గళ్ వాழ்వు మానాన్ , వదరి వణఙ్గుదుమే ll974

శీత్తిరళై = చీము ముద్దలవలె; ఐక్కళ్ పోద ఉన్ద= కఫము అధికముగ ఉమియుచుండ (అట్టిస్థితియందు ఉండుట జూచి); శెప్పు నేర్ మెన్ కొఙ్గై నల్లార్ తామ్ = రాగి వలె ఒప్పు, మృదువైన స్తనములుగల, శ్రేయస్సుకోరుకొనువారని తలచెడి ఆ స్త్రీలు; పప్ప = అబ్బబ్బ!; అప్పర్ మూత్త ఆఱు పాழ்ప్పదు =” ఈ పెద్దమనిషి యొక్క, వృద్ధాప్యము యొక్క స్థితిగతులు మిక్కిలి అసహ్యకరముగ ఉన్నది ” అని తమలో చెప్పుకొనుచు; ఉమ్ తమర్ కాణ్మిన్ఎన్ఱు = (సమీపమునగలవారితో) ” మీయొక్క బంధువైన ఈ మనిషి స్థితిని చూడండి ” అని హేళనగా పలుకుచు; శిరియాద మున్నమ్ = పరిహసించక మునుపే; నఙ్గళ్ వైప్పుమ్ వాழ்వుమ్ ఆనాన్ = మనకు( సంపదలకు) నిధివంటివాడును, సుఖజీవనప్రధాతయును అయిన సర్వేశ్వరుడు వేంచేసియున్న; వదరి = శ్రీ బదరిని; వణఙ్గుదుమే = సేవించుకొందుము.

  చీము ముద్దలవలె కఫము అధికమగ ఉమియుచుండు పరిస్థితిని చూచి, ఏ సుందరమైన స్త్రీలు శ్రేయోభిలాషులని తలచితిమో వారే , “అబ్బబ్బ! ఈ పెద్దమనిషి యొక్క వృద్ధాప్యము యొక్క స్థితిగతులు మిక్కిలి అసహ్యకరముగ ఉన్నది ” అని తమలో చెప్పుకొనుచు, (సమీపమునగలవారితో) ” మీయొక్క బంధువైన ఈ మనిషి స్థితిని చూడండి ” అని హేళనగా పలుకుచూ పరిహాసము చేయక మునుపే,( ఓ! నామనసా!) మనకు ( సంపదలకు) నిధివంటివాడును, సుఖజీవనప్రధాతయును, అయిన సర్వేశ్వరుడు వేంచేసియున్న శ్రీ బదరిని సేవించుకొందుము.

ఈశిపోమిన్ ఈఙ్గు ఇరేన్మిన్ , ఇరుమి యిళైత్తీర్ , ఉళ్ళమ్

కూశి యిట్టీరెన్ఱు పేశుమ్ ,కువళై యఙ్గణ్ణియర్ పాల్ ,

నాశమాన పాశమ్ విట్టు , నన్నెఱి నోక్కల్ ఉఱిల్ ,

వాశమల్ గు తణ్డుழாయాన్ , వదరి వణఙ్గుదుమే ll 975 

ఈశి = చీ!చీ!, పోమిన్ = బైటకు పొండి; ఈఙ్గు ఇరేన్మిన్ = ఇచట దగ్గకండి; ఇరమి ఇళైత్తీర్ = ( అయ్యా! మీరు ) దగ్గుచు, దగ్గుచు చిక్కిశల్యమైనారు; ఉళ్ళమ్ కూశి యిట్టీర్= (మీరే) మనస్సులో సిగ్గుతో  బాధపడచున్నారు; ఎన్ఱుపేశుమ్=అని అమర్యాదగ పలికెడి;కువళై అమ్ కణ్ణియర్ పాల్=నల్ల కలువుల పోలిన అందమైన కన్నులుగల స్త్రీలయందు; నాశమాన పాశమ్ విట్టు=స్వరూప నాశనమునకు కారణమగు ఆశాపాశమును విడిచిపెట్టి;నల్ నెఱి నోక్కల్ ఉఱిల్ = మంచి మార్గమున పోవుటకు విచారించుచున్న యెడల; వాశమ్ మల్ గు తణ్ తుழாయాన్ = పరిమళభరితమైన చల్లని తులసీమాలచే అలంకృతుడైన సర్వేశ్వరుడు వేంచేసియున్న; వదరి = శ్రీ బదరిని; వణఙ్గుదుమే = సేవించుకొందుము.

                 చీ!చీ!  అయ్యా! మీరు  “ఇచట దగ్గకండి. బైటకు పొండి. దగ్గుచు, దగ్గుచు చిక్కిశల్యమైనారు. మీరే  మీస్థితిపై మనస్సులో సిగ్గుతో  బాధపడచున్నారు.” అని  చీదరింపుతో అమర్యాదగ పలికెడి నల్ల కలువుల పోలిన అందమైన కన్నులుగల స్త్రీలయందు (ఇకనైనను) స్వరూప నాశనమునకు కారణమగు ఆశాపాశమును విడిచిపెట్టి మంచి మార్గమున పోవుటకు విచారించుచున్నయెడల ( ఓ! నామనసా! ) పరిమళ భరితమైన చల్లని తులసీమాలచే అలంకృతుడైన సర్వేశ్వరుడు వేంచేసియున్న శ్రీ బదరిని సేవించుకొందుము.

పులన్ గళ్ నైయ మెయ్యిల్ మూత్తు,ప్పోన్దిరున్దు ఉళ్ళ మెళ్ గి,

కలఙ్గ ఐక్కళ్ ప్పోదవున్ది , కణ్డు పిదర్ట్రామున్ ,

అలఙ్గలాయ తణ్డుழாయ్ కొణ్డు , ఆయిరనామమ్ శొల్లి, 

వలఙ్గొళ్ తొణ్డర్ పాడియాడుమ్ , వదరి వణఙ్గుదుమే ll 976

మెయ్యిల్ = శరీరములో గల; పులన్ గళ్ నైయ = ఇంద్రియములన్నియు శిధిలమై;మూత్తు = ముసలితనము వచ్చి; పోన్దు ఇరున్దు = (నలుగురి మధ్యలో నుండుటకు సిగ్గుపడి) ఏకాంత స్థలమునకు పోయి అచటనే ఉండి; ఉళ్ళమ్ ఎళ్ గి కలఙ్గ =హృదయము శిధిలమై కలతచెందగ; ఐక్కళ్ ప్పోద ఉన్ది=కఫము అధికముగ ఉమియుచు;కణ్డ పిదర్ట్రామున్ = మనస్సునకు తోచినవిధముగ మాటలాడు స్థితి కలుగకమునుపే; వలమ్ కొళ్ తొణ్డర్ = శ్లాఘ్యమైన భక్తులు; అలఙ్గల్ ఆయ తణ్ తుழாయ్ కొణ్డు = చల్లని తులసీమాలలను తీసుకుని వచ్చి;  ఆయిరనామమ్ శొల్లి = సహస్రనామములను స్తోత్రముచేయుచు; పాడియాడుమ్=ఆడుచూ పాడుచూ నుండెడి; వదరి= శ్రీ బదరిని;వణఙ్గుదుమే= సేవించుకొందుము.

                             కాలక్రమమున  ఇంద్రియములన్నియు శిధిలమై  ముసలితనము వచ్చినలుగురి మధ్యలో నుండుటకు సిగ్గుపడి ఏకాంత స్థలమునకు పోయి అచటనే ఉండి హృదయము శిధిలమై కలతచెంది, కఫము అధికముగ ఉమియుచు,మనస్సునకు తోచినవిధముగ మాటలాడు స్థితి కలుగక మునుపే,( ఓ! నామనసా!) శ్లాఘ్యమైన భక్తులు చల్లని  తులసీమాలలను తీసుకుని వచ్చి, సహస్రనామములను స్తోత్రముచేయుచు ఆడుచూ పాడుచూ నుండెడి శ్రీ బదరిని సేవించుకొందుము.

** వణ్డు తణ్ తేన్ ఉణ్డు వాழுమ్ , వదరి నెడుమాలై ,

కణ్డల్ వేలి మఙ్గైవేన్దన్ , కలియన్ ఒలిమాలై ,

కొణ్డు తొణ్డర్ పాడియాడ , క్కూడిడిల్ నీళ్ విశుమ్బిల్ ,

అణ్డమల్లాల్ మర్ట్రవర్ క్కు ,ఓరాట్చియఱియోమే ll 977

వణ్డు తణ్ తేన్ ఉణ్డు వాழுమ్ = తుమ్మెదలు చల్లని తేనెనుగ్రోలి సుఖముగ జీవించెడి; వదరి నెడుమాలై=శ్రీ బదరిలో కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై; కణ్డల్ వేలి మఙ్గై వేన్దన్ = మొగలి మొక్కలు కంచెలవలె చుట్టుకొనియున్న తిరుమంగై దేశ వాసులకు ప్రభువైన; కలియన్=తిరుమంగై ఆళ్వార్;ఒలిమాలై కొణ్డు=అనుగ్రహించిన శబ్ధార్ధములు కలిగిన ఈ సూక్తులమాలను గ్రహించి; తొణ్డర్ = భక్తులు;పాడియాడ క్కూడిడిల్ = ఆడుచూ పాడుచూ అనభవింపగలగినచో; అవర్కు= వారికి;నీళ్ విశుమ్బిల్ అణ్డమ్ అల్లాల్ = పరమాకాశమందున్న పరమపదమే కాని; మర్ట్రు ఓర్ఆట్చి అఱియోమే = వేరొక లోకముల పాలన కల్గినదియని తెలియదుకదా!

              పుష్పములతో నిండిన తోటలలో తుమ్మెదలు చల్లని తేనెనుగ్రోలి సుఖముగ జీవించెడి శ్రీ బదరిలో కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై,మొగలి మొక్కలు కంచెలవలె చుట్టుకొనియున్న తిరుమంగై దేశవాసులకు ప్రభువైన,తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన శబ్ధార్ధములు కలిగిన ఈ సూక్తులమాలను గ్రహించి భక్తులు ఆడుచూ పాడుచూ అనభవింపగలగినచో వారికి పరమాకాశమందున్న పరమపదమే కాని   వేరొక లోకముల పాలన కల్గినదియని తెలియదుకదా!

********

వ్యాఖ్యానించండి