శ్రీః
2. వాలిమావలత్తు
సర్వస్వామియనియు, సర్వ సులభుడనియు పరమార్ధముగల తిరుమంత్రమును శ్రీమన్నారాయణుని నిర్హేతుకకృపచే ఉపదేశము పొందిన తిరుమంగై ఆళ్వార్ పులకిత హృదయులై మొదటగ తిరుమంత్రముయొక్క వైభవమును స్తుతించిరి . పరమ సౌలభ్యుడైన సర్వేశ్వరుడు పరమపదమందేగాక తన ఆశ్రితులు , ఈ లోకములోనే ఈశరీరముతోనే ప్రత్యక్షముగ తమ కన్నులతో సేవించి తరించుటకై కృపతో అనేక దివ్య దేశములందు వేంచేయ, తిరుమంగై ఆళ్వార్ తాము ఆ సర్వేశ్వరుని సౌందర్యము, దివ్య కల్యాణ గుణములను దర్శించి అనుభవింప మిక్కిలి ఆర్తితో మొట్టమొదట హిమవత్ పర్వతమందుగల తిరుప్పిరిది దివ్యదేశమును సేవించుకొందుమని తమ మనస్సునకు ప్రభోదించుచున్నారు.
** వాలిమావలత్తు ఒరవనదుడల్ కెడ , వరిశిలై వళైవిత్తు , అన్ఱు
ఏలనాఱు తణ్ తడమ్ పొழிలిడమ్బెఱ ,ఇరున్దనల్ ఇమయత్తుళ్ ,
ఆలి మాముగిల్ అదిర్ తర అరువరై ,అగడు ఉఱ ముగడేఱి ,
పీలిమామయిల్ నడఞ్జెయుమ్ తడఞ్జునై , పిరిదిశెన్ఱడై నెఞ్జే ll 958
నెఞ్జే = ఓ నామనసా!; అన్ఱు = మునుపు శ్రీరామావతారకాలమందు; వాలి = వాలి అను పేరుగల; మా వలత్తు ఒరువనదు = మహాబలశాలియైన ఒక వానర రాజుయొక్క;ఉడల్ కెడ = శరీరము ఛిన్నభిన్నమగునట్లు; వరి శిలై వళైవిత్తు = అందమైన విల్లును ఎక్కుపెట్టి (ఆ వాలిని వధించిన సర్వేశ్వరుడు); ఏలమ్ నాఱు = పరిమళము వీచుచున్న;తణ్ తడమ్ పొழிల్=చల్లని విశాలమైన తోటల నడుమ;ఇడమ్ పెఱ=నివాస స్థానముగ చేసుకొని; ఇరున్ద = కృపతోవేంచేసియుండు;నల్ ఇమయత్తుళ్= మనోహరమైన హిమాలయ పర్వతములో; ఆలి మాముగిల్ అదిర్ తర = చిన్న చిన్న నీటిబిందువులు కలిగిన కాళమేఘములు గర్జించుచుచుండగ; పీలి మా మయిల్ = పింఛములగల పెద్ద నెమళ్ళు; అరు వరై ముగడు = ఎక్కలేని ఉన్నతమైన పర్వత శిఖరములపై; అగడు ఉఱ ఏఱి = తమక్రింది ఉదరబాగము తగులుచుండగ ఎక్కి; నడమ్ శెయ్యుమ్ = నాట్యము చేయుచున్నదియు; తడమ్ శునై = విశాలమైన కొలనులు గలదియు; (అయిన) పిరిదిశెన్ఱు అడై = తిరుపిరిది దివ్యదేశమునకు వెడలి ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
ఓ నామనసా! పూర్వము శ్రీరామావతారకాలమందు మహాబలశాలియైన వానర రాజు వాలిని వధించి సుగ్రీవునకు రక్షణనొసగిన సర్వేశ్వరుడు అభిలషించి నిత్యవాసము చేయుచున్న పరిమళభరితమైన తోటలచే ఒప్పు మనోహరమైన హిమాలయ పర్వతములో, ఆవరించియున్న కాళమేఘముల గర్జనలతోను; తమ ఉదరములతో తాకుచూ ఉన్నతమైన పర్వత శిఖరములపై చేరి అందమైన పింఛములతో నాట్యము చేయు నెమళ్ళతోను, కొలనులతోను కూడిన తిరుపిరిది దివ్యదేశమునకు వెడలి సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
కలఙ్గ మాక్కడల్ అరికులమ్ పణిశెయ్య , అరువరై యణైకట్టి ,
ఇలఙ్గై మానగర్ పొడిశెయ్ ద అడిగళ్ తామ్ , ఇరున్దనల్ ఇమయత్తుళ్ ,
విలఙ్గల్ పోల్ వన విఱలిరుమ్ శినత్తన , వేழఙ్గళ్ తుయర్ కూర ,
పిలఙ్గొళ్ వాళెయుర్ట్రు అరియవై తిరిదరు , ప్పిరిదిశెన్ఱడై నెఞ్జే ll 959
నెఞ్జే = ఓ నామనసా!; మా కడల్ = మహా సముద్రము; కలఙ్గ = అల్లకల్లోలమగునట్లు; అరికులమ్ పణిశెయ్య= వానర సమూహములు కైంకర్యము చేయగ; అరు వరై = కదలింపలేని పెద్ద పర్వతములను తెచ్చి; అణై కట్టి=శేతువును కట్టి; మా ఇలఙ్గై నగర్=పెద్ద లంకాపురిని; పొడి శెయ్ ద = భస్మీపటలము చేసిన; అడిగళ్ దామ్=సర్వ స్వామియే; ఇరున్ద = కృపతో వేంచేసియుండు; నల్ ఇమయత్తుళ్ = మనోహరమైన హిమాలయ పర్వతములో; విలఙ్గల్ పోల్వన = పర్వతములను పోలిన; విఱల్ = శక్తివంతమైన; ఇరుశినత్తన = మిక్కిలి కోపముగల కలిగిన; వేழఙ్గళ్= ఏనుగులు; తుయర్ కూర = దుఃఖముపొందునట్లు; బిళం కొళ్ = గుహలలో నివసించు; వాళ్ ఎయిర్ట్రు = కత్తి వంటి దంతములుగల; అరి అవై = ఆ సింహములు; తిరిదరు = తిరుగుచుండెడి; పిరిది శెన్ఱు అడై = తిరుపిరిది దివ్యదేశమునకు వెడలి సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
ఓ నామనసా! సర్వేశ్వరునివలన దుఃఖములను పోగొట్టుకొన్న సుగ్రీవుడు , తన వానర సమూహములతో మహా సముద్రము అల్లకల్లోలమగునట్లు పెద్ద పర్వతములను తెచ్చి కైంకర్యము చేయగ శేతువును కట్టి రావణాసురునియొక్క పెద్ద లంకాపురిని భస్మీపటలముచేసిన ఆ సర్వ స్వామియే కృపతో వేంచేసియుండు మనోహరమైన హిమాలయ పర్వతములో , పర్వతములను పోలిన శక్తివంతమైన ఏనుగులు దుఃఖము పొందునట్లు గుహలలో నివసించు కత్తి వంటి దంతములుగల సింహములు తిరుగుచుండెడి తిరుపిరిది దివ్యదేశమునకు వెడలి సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
తుడికొళ్ నుణ్ణిడై చ్చురికుழల్ , తులఙ్గెయిర్ట్రి ఇళఙ్గొడి తిఱత్తు, ఆయర్
ఇడికొళ్ వెఙ్గురలిన విడై యడర్తవన్ , ఇరున్దనల్ ఇమయత్తుళ్ ,
కడికొళ్ వేఙ్గయిన్ నఱుమలర్ అమళియిన్ , మణి యఱైమిశై వేழమ్,
పిడియనోడు వణ్డిశైశొల తుయిల్ కొళుమ్ , పిరిదిశెన్ఱడై నెఞ్జే ll 960
తుడికొళ్ నుణ్ ఇడై = డమరు వాద్యమువలె సూక్ష్మమైన నడుముగల; శురికుழల్ =గిరిజాల కుంతలములును; తుళఙ్గు ఎయిర్ట్రు=ధగధగమని ప్రకాశించు దంతములుగల;ఇళమ్ కొడి తిఱత్తు = లేత తీగవలె అతి సుకుమారమైన నీళాదేవి కొరకు; ఆయర్ = గోకులవాసులయొక్క; ఇడి కొళ్ వెమ్ కురల్ ఇనమ్ విడై = పిడుగు వలె భయంకరముగ శబ్దించుచు గుంపుగా వచ్చుచున్న ఏడు వృషభములను; అడర్తవన్ = అణచి వధించిన సర్వేశ్వరుడు; ఇరున్ద = కృపతోవేంచేసియుండు; నల్ ఇమయత్తు = మనోహరమైన హిమాలయ పర్వతమందు; వణ్డు ఇశై శొల = తుమ్మెదలు ఇంపుగ పాడుచుండగ;మణి అఱై మిశై = ఇంద్రనీలమణులు కలిగిన రాతులపై; కడికొళ్ వేఙ్గయిన్ నఱుమలర్ అమళియిన్ = మలబారు కినో చెట్ల పరిమళభరితమైన పుష్పములతోనిండిన పడకయందు; వేழమ్ = ఏనుగులు; పిడియనోడు = తమ ఆడ ఏనుగులతో కలిసి;తుయిల్ కొళుమ్ = నిదురించుచుండు; పిరిది శెన్ఱు=తిరుపిరిది దివ్యదేశమునకు పోయి;నెఞ్జే = ఓ నామనసా!; అడై = సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
లేత తీగవలె అతి సుకుమారమైన, అందమైన కుంతలములు, సన్ననినడుముగల నీళాదేవిని పరిణయమాడుటకై , భయంకరముగ శబ్దించుచు గుంపుగా వచ్చుచున్న ఏడు వృషభములను అణచి వధించిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న , మనోహరమైన హిమాలయ పర్వతమందు తుమ్మెదలు ఇంపుగ పాడుచుండగ, ఇంద్రనీల మణులు కలిగిన రాతులపై మలబారు కినో చెట్ల పరిమళ భరితమైన పుష్పములతో నిండిన పడకయందు ఏనుగుల జంటలు నిదురించుచుండు తిరుపిరిది దివ్యదేశమునకు వెడలి ఓ! మనసా! ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
మఱఙ్గొళ్ ఆళరి యురువెన వెరువర , ఒరువనదగల్ మార్వమ్
తిఱన్దు , వానవర్ మణిముడి పణిదర , ఇరున్ద నల్ ఇమయత్తుళ్ ,
ఇఱఙ్గి ఏనఙ్గళ్ వళైమరుప్పు ఇడన్దిడ , క్కిడన్ద అరుగెరివీశుమ్ ,
పిఱఙ్గు మామణి యరువియొడు ఇழிదరు , పిరిదిశెన్ఱడై నెఞ్జే ll 961
మఱమ్ కొళ్ = మిక్కిలి కోపావేశముతో నుండు; ఆళ్ అరి ఉఱు ఎన = “నరసింహమూర్తి” యని ప్రస్తావించిన మాత్రమే; వెరువర = భయముతో వణుకునట్లుగ (నరసంహరూపముదాల్చి) ఒరువనదు = వీరులలో సాటిలేని హిరణ్యాసురునియొక్క;అగల్ మార్వమ్=విశాలమైన వక్షస్థలమును;తిఱన్దు = చీల్చి; వానవర్ = దేవతలు; మణిముడి పణిదర = మణులతోనిండిన కిరీటములు కలిగిన శిరస్సులతో దివ్యమైన పాదములందు మోకరిల్లునట్లు ; ఇరున్ద = కృపతోవేంచేసియుండు; నల్ ఇమయత్తుళ్ = మనోహరమైన హిమాలయ పర్వతమందు; ఏనఙ్గళ్ = అడవిపందులు; ఇరఙ్గి = కిందకు వంగి; వళైమరుప్పు = తమ వంగియుండు కొమ్ములతో; ఇడన్దిడ = (మణులతో ఒప్పు రాళ్లను) పగలగొట్టి చిందరవందర చేయగ; అరుగు కిడన్ద ఎరివీశుమ్ పిఱఙ్గు మా మణి = సమీపమున పడిన కాంతులు వెదజల్లు పెద్ద శ్లాఘ్యమైన మణులు;అరువియోడు = కొండ వాగుల ప్రవాహములతో; ఇழிదరు = కిందకు చేరుచుండెడి; పిరిది శెన్ఱు=తిరుపిరిది దివ్యదేశమునకు పోయి;నెఞ్జే = ఓ నామనసా!; అడై = ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
తన ఆశ్రితుడైన భక్త ప్రహ్లాదుని హింసించుచున్న హిరణ్యాసురునిపై మిక్కిలి కోపావేశముతో అతి భయంకరమైన నరసంహ రూపముదాల్చి ఆతని విశాలమైన వక్షస్థలమును చీల్చి వధించిన సర్వేశ్వరుడు బ్రహ్మ,ఇంద్రాదిదేవతులు మణులతో నిండిన కిరీటములు కలిగిన శిరస్సులతో తన దివ్యమైన పాదములందు మోకరిల్లునట్లు కృపతోవేంచేసియుండు , మనోహరమైన హిమాలయ పర్వతమందు అడవిపందులు తమ వంగియుండు కొమ్ములతో ఇంద్రనీలమణులు కలిగిన రాళ్లనుపగలగొట్టి చిందరవందర చేయగ సమీపమున పడిన, కాంతులు వెదజల్లు పెద్ద శ్లాఘ్యమైన మణులు కొండ వాగుల ప్రవాహములతో కిందకు చేరుచుండెడి తిరుపిరిది దివ్యదేశమునకు పోయి ఓ నామనసా!; ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
కరై శెయ్ మాకడల్ కిడైన్దవన్ , కనైకழల్ అమరర్ గళ్ తొழுదేత్త ,
అరై శెయ్ మేకలై అలర్ మగళవళొడుమ్ , అమర్ న్ద నల్ ఇమయత్తు ,
వరై శెయ్ మాక్కళిఱు ఇళవెదిర్ వళర్ ముళై , అళై మిగుతేన్ తోయ్ త్తు,
పిరశవారి తన్నిళమ్ పిడిక్కరుళ్ శెయుమ్ , పిరిదిశెన్ఱడై నెఞ్జే ll 962
కనై కழల్ = (ఆభరణములు కలగియుండుటచే) గలగలమని శబ్దించుచున్న దివ్యమైన చరణములను; అమరర్ గళ్= దేవతలు;తొழுదు ఏత్త=సేవించుకొని స్తుతించునట్లు;కరై శెయ్ మాకడల్ కిడైన్దవన్ = తనకుతానే గట్టును అతిక్రమించక నుండెడి పెద్ద క్షీరసాగరమందు పవళించియున్న సర్వేశ్వరుడు; అరై శెయ్ మేకలై అలర్ మగళవళొడుమ్ =నడుమున దివ్యమైన మొలతాడుగల కమలవాసినితో కూడ; అమర్ న్ద = కృపతోవేంచేసియుండు; నల్ ఇమయత్తు = మనోహరమైన హిమాలయ పర్వతమందు; వరై శెయ్ మాక్కళిఱు = పర్వతమును పోలిన పెద్ద ఏనుగులు;ఇళ వెదిర్ = లేత వెదుళ్ళ మొక్కలయొక్క; వళర్ ముళై = పెరుగుచున్న రెమ్మలను (పీకి); అళై మిగుతేన్ తోయ్ త్తు = గుహలలో మిక్కుటముగ గల తేనెపట్టులోని తేనెలోముంచి; పిరశమ్ వారి = ఆ తేనె దారలను; తన్ ఇళమ్ పిడిక్కు అరుళ్ శెయుమ్ = తమయొక్క పిల్ల ఏనుగులకు ప్రేమతో ఒసగుచుండెడి; పిరిది శెన్ఱు=తిరుపిరిది దివ్యదేశమునకు పోయి; నెఞ్జే = ఓ నామనసా!; అడై = ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .
గలగలమని శబ్దించుచున్న దివ్యమైన చరణములను బ్రహ్మాది దేవతలుభక్తితొ సేవించుకొని స్తుతించునట్లు క్షీరసాగరమందు పవళించియున్న సర్వేశ్వరుడు తన కమలవాసినితో కూడ కృపతో వేంచేసియుండు మనోహరమైన హిమాలయ పర్వతమందు, పర్వతమును పోలిన పెద్ద ఏనుగులు , లేత వెదుళ్ళ మొక్కలయొక్క పెరుగుచున్న రెమ్మలను పీకి గుహలలో మిక్కుటముగగల తేనెపట్టులోని తేనెలోముంచి ఆ తేనెదారలను తమయొక్క పిల్లఏనుగులకు ప్రేమతో ఒసగుచుండెడి తిరుపిరిది దివ్యదేశమునకు వెడలి ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .
పణఙ్గలాయిరముడైయ నల్ అరవణై పళ్ళికొళ్ , పరమా ఎన్ఱు ,
ఇణఙ్గి వానవర్ మణిముడి పణిదర , ఇరున్ద నల్ ఇమయత్తు ,
మణఙ్గొళ్ మాదవి నెడుఙ్గొడి విశుమ్బుఱ , నిమిర్ న్దవై ముగిల్ పర్ట్రి ,
పిణఙ్గు పూమ్బొழிల్ నుழைన్దు వణ్డిశై శొలుమ్ , పిరిదిశెన్ఱడై నెఞ్జే ll 963
వానవర్ = బ్రహ్మాదిదేవతలు; ఇణఙ్గి = గుంపులుగుంపులుగకూడి; పణఙ్గల్ ఆయిరమ్ ఉడైయ = వేయి పడగలగల; నల్ అరువు అణై = ఆదిశేషుని అతిసున్నితమైన పడకయందు; పళ్ళికొళ్ పరమా ఎన్ఱు = పవళించియున్న పరమపురుషుడా! యని; మణిముడి పణిదర =మణులతోనిండిన కిరీటములు కలిగిన శిరస్సులతో దివ్యమైన పాదములందు సేవించికొనుటకు అనువుగా;ఇరున్ద=కృపతో వేంచేసియుండు ; నల్ ఇమయత్తు = మనోహరమైన హిమాలయ పర్వతమందు; మణమ్ కొళ్ నెడు మాదవి కొడి అవై=పరిమళభరితమైన పొడవైన కురుక్కత్తి తీగలు; విశుమ్బు ఉఱ నిమిర్ న్దు = ఆకాశ పర్యంతము పెరిగి ;ముగిల్ పర్ట్రి పిణఙ్గు = మేఘములతో కలహించునట్టి; పూపొழிల్ = పుష్పించెడితోటలలో; వణ్డు నుழைన్దు = తుమ్మెదలు ( తేనెను గ్రోలుటకై) ప్రవేశించి; ఇశై శొలుమ్=ఇంపుగ పాడుచుండెడి; పిరిది శెన్ఱు=తిరుపిరిది దివ్యదేశమునకు పోయి;నెఞ్జే = ఓ నామనసా!; అడై = ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .
బ్రహ్మాదిదేవతలు గుంపులుగుంపులుగకూడి ; “శేషతల్పముపై పవళించియున్న పరమపురుషుడా!” యని మణులతో నిండిన కిరీటములు కలిగిన శిరస్సులతో దివ్యచరణములందు సేవించికొనుటకు అనువుగా కృపతోవేంచేసియుండు మనోహరమైన హిమాలయ పర్వతమందు, పరిమళభరితమైన పొడవైన కురుక్కత్తి తీగలు ఉన్నతముగ పెరుగుచు మేఘములతో కలసి ఆవరించినట్లు ఒప్పుచు పుష్పించెడి తోటలలో తుమ్మెదలు తేనెను గ్రోలుటకై ప్రవేశించి ఇంపుగ పాడుచుండెడి తిరుపిరిది దివ్యదేశమునకు పోయి ఓ నామనసా! ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
కార్ కొళ్ వేఙ్గైగళ్ కనవరై తழுవియ , కఱివళర్ కొడితున్ని ,
పోర్ కొళ్ వేఙ్గైగళ్ పునవరై తழுవియ , పూమ్బొழிల్ ఇమయత్తుళ్ ,
ఏర్ కొళ్ పూఞ్జునైత్తడమ్ పడిన్దు, ఇనమలర్ ఎట్టుమిట్టు ఇమైయోర్ గళ్,
పేర్ గళాయిరమ్ పరవినిన్ఱడితొழுమ్ , పిరిదిశెన్ఱడై నెఞ్జే ll 964
కనమ్ వరై = విశాలమైన పర్వతముల ఏటవాలుగానున్న ప్రదేశములందు; కార్ కొళ్ వేఙ్గైగళ్ = మేఘమండలము ఆక్రమించుచు పెరిగియున్న మలబారు కినోచెట్లను; తழுవియ=చుట్టుకొనియున్న; కఱి కొడి = మిరియాల తీగలచే; తున్ని వళర = దట్టముగ వ్యాపించియుండునదియు; పునమ్ వరై = నదుల ఒడ్డున ప్రదేశములందుగల చిన్న చిన్న కొండలయందు; పోర్ కొళ్ వేఙ్గైగళ్ తழுవియ = యద్దమునకు సిద్దముగనుండు చిరుతపులులు సంచరింపబడుచుండునదియు; పూమ్ పొழிల్ = అందమైన తోటలు గలదియు అయిన; ఇమయత్తుళ్ = హిమాలయ పర్వతమందు;ఇమైయోర్ గళ్ = దేవతలు; ఏర్ కొళ్ పూమ్ శునై త్తడమ్ పడిన్దు = మిక్కిలి అందమైనవికసించిన పుష్పములతో నిండిన తటాకములయొక్క రేవుల యందు స్నానమాచరించి; ఇనమ్ మలర్ ఎట్టుమ్ ఇట్టు= శ్లాఘ్యమైన ఎనిమిది రకములైన పుష్పములను సమర్పించి;పేర్ గళాయిరమ్ పరవి నిన్ఱు = సహస్రనామములను స్తోత్రముచేయుచు; అడితొழுమ్ = సర్వేశ్వరుని దివ్యమైన చరణములను సేవించుకొనుచుండెడి; పిరిది శెన్ఱు = తిరుపిరిది దివ్యదేశమునకు పోయి; నెఞ్జే = ఓ నామనసా!; అడై = ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .
విశాలమైన పర్వతముల ఏటవాలుగానున్న ప్రదేశములందు మేఘమండల పర్యంతము పెరిగినయున్న మలబారు కినోచెట్లను చుట్టుకొనియున్న మిరియాల తీగలచే, దట్టముగ వ్యాపించి యుండునదియు, నదుల ఒడ్డున ప్రదేశములందుగల చిన్న చిన్న కొండలయందు చిరుతపులులచే సంచరింపబడుచుండునదియు, అందమైన తోటలు గలదియు అయిన హిమాలయ పర్వతమందు దేవతలు మిక్కిలి సుందరమైన వికసించిన పుష్పములతో నిండిన తటాకములయొక్క రేవుల యందు స్నానమాచరించి శ్లాఘ్యమైన ఎనిమిది రకములైన పుష్పములు (ఎఱ్ఱ కలువపుష్పములు, సంపంగెలు, సన్నజాజులు, పాదరి పుష్పములు; పున్నై పుష్పములు; కురుకత్తి పుష్పములు; కరుముగై పుష్పములు, తామర పుష్పములును) సమర్పించి సహస్రనామములను స్తోత్రము చేయుచు సర్వేశ్వరుని దివ్యమైన చరణములను సేవించుకొనుచుండెడి తిరుపిరిది దివ్యదేశమునకు పోయి ఓ నామనసా! ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!
ఇరవు కూర్ న్దిరుళ్ పెరుగియ వరై ముழை , ఇరుమ్బశియదు కూర ,
అరవమ్ ఆవిక్కుమ్ అకమ్ పొழிల్ తழுవియ , అరువరై ఇమయత్తు ,
పరమనాదియెమ్బణిముగిల్ వణ్ణనెన్ఱు , ఎణ్ణినిన్ఱిమైయోర్ గళ్ ,
పిరమినోడు శెన్ఱడితొழுమ్ పెరున్దగై , పిరిదిశెన్ఱడై నెఞ్జే ll 965
ఇరవు కూర్ న్దు ఇరుళ్ పెరుగియ = బాగుగ చీకటికమ్మిన రాత్రియందు;వరై ముழை=కొండ గుహలలో; ఇరు పశికూర = అమితమైన ఆకలితో;అరవమ్ = కొండచిలువలు; ఆవిక్కుమ్= ఆవలించుచుండెడి; అగమ్ పొழிల్త ழுవియ = లోపల తోటలచే కూడిన; అరు వరై = ఎక్కలేని మిక్కిలి ఏటవాలుగనుండు; ఇమయత్తు = హిమాలయ పర్వతమందు; ఇమైయోర్ గళ్ = ఇంద్రాది దేవతులు; పిరమనోడు శెన్ఱు = చతుర్ముఖ బ్రహ్మతో కలసి వెడలి; పరమన్ ఎన్ఱు = “పరమపురషా!”అనియు; ఆది ఎన్ఱు = “ఈ జగత్తునకు మూలపురుషుడా!” అనియు;ఎమ్ పని ముగిల్ వణ్ణన్ ఎన్ఱు = “చల్లనిమేఘమువంటి వర్ణముగలిగన మాయొక్క సర్వేశ్వరా” అనియు; ఎణ్ణి నిన్ఱు = అనుసంధించుచు;అడి తొழுమ్=దివ్యమైన చరణారవిందములందు మ్రొక్కుచుండెడి;పెరు దగై = పెద్ద కీర్తిగల; పిరిది శెన్ఱు = తిరుపిరిది దివ్యదేశమునకు పోయి;నెఞ్జే = ఓ నామనసా!; అడై = ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .
బాగుగ చీకటికమ్మిన రాత్రియందు కొండ గుహలలో అమితమైన ఆకలితో కొండచిలువలు ఆవలించుచుండెడి, లోపల తోటలచే కూడిన , ఎక్కలేని మిక్కిలి ఏటవాలుగనుండు హిమాలయ పర్వతమందు ఇంద్రాదిదేవతులు చతుర్ముఖ బ్రహ్మతో కలసి వెడలి “పరమపురషా!,ఈ జగత్తునకు మూలపురుషుడా!,నీలమేఘశ్యాముడా!మాయొక్క సర్వేశ్వరా!” యని పెక్కు విధములుగ అనుసంధించుచు , దివ్యమైన చరణారవిందములందు మ్రొక్కుచుండెడి , విఖ్యాతిచెందిన తిరుపిరిది దివ్యదేశమునకు పోయి ఓ నామనసా! ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .
ఓదియాయిరనామఙ్గళుణర్ న్దవర్కు , ఉఱుతుయరడైయామల్ ,
ఏదమిన్ఱినిన్ఱరుళుమ్ నమ్బెరున్దగై , యిరున్ద నల్ ఇమయత్తు,
తాదుమల్ గియపిణ్డివిణ్డలర్ గిన్ఱ , తழల్ పురైయెழிల్ నోక్కి ,
పేదై వణ్డుగళెరియెన వెరువరు , పిరిదిశెన్ఱడై నెఞ్జే ll 966
ఆయిరమ్ నామఙ్గళ్ = సహస్రనామములు; ఓది = ఎల్లప్పుడును అనుసంధించుచు; ఉణర్దవర్కు = (దానిచే సర్వేశ్వరుడే రక్షకుడని) ఙ్ఞానము కలిగినవారికి; ఉఱు తుయర్అడైయామల్ = సంప్రాప్తమగు దుఃఖములేవియు కలుగనీయక; ఏదమ్ ఇన్ఱి = పాప విముక్తిని;నిన్ఱు అరుళుమ్= ఎల్లప్పుడును కృపజేయుచున్న;నమ్ పెరు దగై=మనయొక్క గొప్ప కీర్తిగల సర్వేశ్వరుడు;ఇరున్ద = కృపతోవేంచేసి యుండు ;నల్ ఇమయత్తు = మనోహరమైన హిమాలయ పర్వతమందు; తాదు మల్గియ = మొగ్గలు మిక్కుటముగ గల;పిణ్డి = అశోక పుష్పములు; విణ్డి అలర్ కిన్ఱ = తెరుచుకొని వికసించు సమయమున; తழల్ పురైయెழிల్ = నిప్పులవలెనున్న ఆ అందమును; పేదై వణ్డుగళ్ నోక్కి = అమాయకమైన తుమ్మెదలు అది చూచి;ఎరియెన=నిప్పులని తలచుకొని; వెరువరు= భయపడుచుండెడి; పిరిది శెన్ఱు = తిరుపిరిది దివ్యదేశమున,కు పోయి;నెఞ్జే = ఓ నామనసా!; అడై = ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .
సర్వేశ్వరుని సహస్రనామములను ఎల్లప్పుడును అనుసంధించుచు సర్వేశ్వరుడే రక్షకుడని ఙ్ఞానము కలిగినవారికి సంప్రాప్తమగు దుఃఖములేవియు కలుగనీయక పాపవిముక్తిని ఎల్లప్పుడును కృపజేయుచున్న గొప్ప కీర్తిగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసియుండు మనోహరమైన హిమాలయ పర్వతమందు మొగ్గలు మిక్కుటముగ గల అశోక పుష్పములు తెరుచుకొని వికసించు సమయమున నిప్పులవలెనున్న ఆ అందమును అమాయకమైన తుమ్మెదలు అది చూచి నిప్పులని తలచుకొని భయపడుచుండెడి తిరుపిరిది దివ్యదేశమునకు పోయి ఓ! నా మనసా! ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .
** కరియ మాముగిల్ పడలఙ్గళ్ కిడన్దు , అవై ముழఙ్గిడ , కళిఱెన్ఱు
పెరియ మాశుణమ్ వరైయెన పెయర్ తరు , పిరిది యెమ్బెరుమానై ,
వరికొళ్ వణ్డఱైపైమ్బొழிల్ మఙ్గైయర్ , కలియనదొలిమాలై ,
అరియ ఇన్నిశై పాడుం నల్లడియవర్కు , అరువినై అడైయావే ll 967
కరియ మా ముగిల్ పడలఙ్గళ్=నల్లని పెద్ద మేఘముల సమూహములు; కిడన్ద= సంచలనములేక ఒక్కచోటనే నుండి; అవై ముழఙ్గిడ = ఆ మేఘములు గర్జించుచుండగ; (ఆ శబ్దములను వినిన);పెరియ మాశుణమ్=పెద్ద కొండచిలువలు ,కళిఱెన్ఱు = (తమకు ఆహారముగనుండు) ఏనుగులుగ తలచి; వరైయెన పెయర్ తరు = పర్వతమంత పెద్దగ నోరు తెరిచి మింగుటకై వచ్చుచుండెడి; పిరిది ఎమ్బెరుమానై= తిరుపిరిది దివ్యదేశములో కృపతోవేంచేసిన సర్వేశ్వరుని విషయమై;వరికొళ్ వణ్డు అఱై పైమ్ పొழிల్ మఙ్గైయర్ = అందమైన తుమ్మెదలు ఝంకారము చేయుచున్న విశాలమైన తోటలుగల తిరుమంగై దేశ వాసులకు ప్రభువైన; కలియనదు = తిరుమంగై ఆళ్వార్ యొక్క; ఒలి మాలై = శబ్ధార్ధములు కలిగిన సూక్తులమాలయందుగల; అరియ ఇన్ ఇశై పాడుమ్= తెలుసు కొనుటకు కష్టమైన , ఈ ఇంపైన రాగములుగల ,పాశురములను పాడగల; నల్ అడియవర్ క్కు = విలక్షణమైన భాగవతులకు; అరువినై అడైయావే = ఎటువంటి మహా పాపములైన చేరలేవుసుమా!
నల్లని పెద్ద మేఘముల సమూహములు సంచలనములేక ఒక్కచోటనే నుండి గర్జించుచుచుండగ ఆ శబ్దములను వినిన పెద్ద కొండచిలువలు తమకు ఆహారముగనుండు ఏనుగులుగ తలచి పెద్దగ నోరు తెరిచి మింగుటకై వచ్చుచుండెడి తిరుపిరిది దివ్యదేశములో కృపతోవేంచేసిన సర్వేశ్వరుని విషయమై అందమైన తుమ్మెదలు ఝంకారముచేయుచున్న విశాలమైన తోటలుగల తిరుమంగై దేశ వాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ యొక్క శబ్ధార్ధములు కలిగిన సూక్తులమాలయందుగల తెలుసుకొనుటకు కష్టమైన ,ఈ ఇంపైన రాగములుగల, పాశురములను పాడగల విలక్షణమైన భాగవతులకు ఎటువంటి మహా పాపములైన చేరలేవుసుమా!
*********