శ్రీః
10 . కణ్ణార్ కడల్
దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న శ్రియఃపతి పాదపద్మములందు శరణాగతి చేసిన తిరుమంగై ఆళ్వార్, పరమభక్తి ప్రాప్తికై సర్వేశ్వరుని వేడుకొనుచున్నారు.
** కణ్ణార్కడల్ శూழ், ఇలఙ్గైక్కిఱైవన్ తన్ ,
తిణ్ణాగమ్ పిళక్క, శరమ్ శెలవుయ్ త్తాయ్,
విణ్ణోర్ తొழுమ్, వేఙ్గడమామలై మేయ ,
అణ్ణా అడియేన్, ఇడరై క్కళయాయే ll 1038
కణ్ ఆర్ కడల్ శూழ்=విశాలమైన సముద్రముచే చుట్టుకొనియున్న;ఇలఙ్గైక్కు ఇఱైవన్ తన్= లంకాపురికి ప్రభువైన రావణాసురునియొక్క; తిణ్ ఆగమ్ పిళక్క = దృఢమైన శరీరము ఛేదింపబడునట్లు; శరమ్ శెల ఉయ్ త్తాయ్ = బాణములను ప్రయోగించినవాడా!; విణ్ణోర్ తొழுమ్ = బ్రహ్మాదిదేవతలు వచ్చి సేవించుచుండెడి; వేఙ్గడమామలై మేయ = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; అణ్ణా = నా అన్నా!; అడియేన్ ఇడరై కళయాయే = నీ దాసునియొక్క దుఃఖములను నిర్మూలింపజేసి కృపజేయుమా!
విశాలమైన సముద్రముచే చుట్టుకొనియున్న లంకాపురికి ప్రభువైన రావణాసురునియొక్క దృఢమైన శరీరము ఛేదింపబడునట్లు దివ్యమైన బాణములను ప్రయోగించినవాడా!,బ్రహ్మాదిదేవతలు వచ్చి సేవించుచుండెడి తిరుమలపై నిత్యవాసము చేయుచున్న నా అన్నా!, నీ దాసునియొక్క దుఃఖములను నిర్మూలింపజేసి కృపజేయుమా!
ఇలఙ్గై ప్పదిక్కు, అన్ఱు ఇఱైయాయ, అరక్కర్
కులఙ్గెట్టవర్మాళ, క్కొడిప్పుళ్ తిరిత్తాయ్ ,
విలఙ్గల్ కుడిమి, తిరువేఙ్గడమ్ మేయ ,
అలఙ్గల్ తుళబముడియాయ్, అరుళాయే ll 1039
అన్ఱు=పూర్వకాలమున;ఇలఙ్గై పదిక్కు=లంకాపురికి;ఇఱై ఆయ = రాజులుగ నుండిన; అరక్కర్ =(మాలి,సుమాలి మొదలగు) రాక్షసులయొక్క;కులమ్ కెట్టు అవర్ మాళ=కులముల సమూహములు చెడి వారందరు నిర్మూలమగునట్లు; కొడి పుళ్ తిరిత్తాయ్ = నీయొక్క ధ్వజుడైన గరుడాళ్వార్ ను సంచరింపజేసినవాడా; విలఙ్గల్ కుడిమి = (సూర్యచంద్రాదులు) తమ గమనమును మార్చుకొనునట్లు ఉన్నతమైన శిఖరములుగల; తిరువేఙ్గడమ్ మేయ = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!; తులబమ్ అలఙ్గల్ = తులసీ మాలలచే అలంకృతమైన; ముడియాయ్ = కిరీటముగలవాడా!; అరుళాయే = నీ దాసునిపై కృపజేయుమా!.
పూర్వకాలమున లంకాపురికి రాజులుగ నుండిన మాలి,సుమాలి మొదలగు రాక్షసులయొక్క కులముల సమూహములు చెడి వారందరు నిర్మూలమగునట్లు నీయొక్క ధ్వజుడైన గరుడాళ్వార్ ను సంచరింపజేసినవాడా!, సూర్యచంద్రాదులు తమ గమనమును మార్చుకొనునట్లు ఉన్నతమైన శిఖరములుగల దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్నవాడా!, తులసీ మాలలచే అలంకృతమైన కిరీటముగలవాడా! నీ దాసునిపై కృపజేయుమా!.
నీరార్కడలుమ్, నిలనుమ్ ముழுదుణ్డు ,
ఏరాలమిళమ్ తళిర్మేల్, తుయలెన్దాయ్ ,
శీరార్, తిరువేఙ్గడమామలై మేయ ,
ఆరావముదే, అడియేఱ్కరుళాయే ll 1040
నీర్ ఆర్ కడలుమ్ నిలనుమ్ ముழுదు ఉణ్డు = జలములతో పూర్ణమైయుండు మహా సముద్రములను, భూమిని, తదితర వస్తువులంతను,(ప్రళయకాలమున) ఆరగించి; ఏర్ = అందమైన; ఇళ = మిక్కిలి లేతనైన; ఆల తళిర్ మేల్ = వటపత్రముపై; తుయల్= పవళించిన; ఎన్దాయ్ = నాయొక్క స్వామీ!; శీరార్ = సిరిసంపదలతో తులతూగుచున్న; తిరువేఙ్గడమామలై మేయ = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; ఆరావముదే = అమృతమువలె పరమభోగ్యముగనున్న సర్వేశ్వరుడా!; అడియేఱ్కు = నీ దాసునిపై; అరుళాయే = కృపజేయుమా!
జలములతో పూర్ణమైయుండు మహా సముద్రములను,భూమిని,తదితర వస్తువులంతను ప్రళయ కాలమున ఆరగించి మిక్కిలి లేతనైన వటపత్రముపై పవళించిన నాయొక్క స్వామీ!, సిరిసంపదలతో తులతూగుచున్న దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న అమృతమువలె పరమభోగ్యముగనున్న సర్వేశ్వరుడా!, నీ దాసునిపై కృపజేయుమా.
ఉణ్డాయ్ ఉఱిమేల్, నఱునెయ్ అముదాగ ,
కొణ్డాయ్ కుఱళాయ్, నిలమీరడియాలే ,
విణ్ దోయ్ శిగర, తిరువేఙ్గడమ్ మేయ ,
అణ్డా అడియేనుక్కు, అరుళ్ పురియాయే ll 1041
ఉఱి మేల్ నఱు నెయ్ అముదాగ ఉణ్డాయ్ = ఉట్లలో నుంచిన మంచి నెయ్యిని అమృతమువలె ఆరగించినవాడవును, కుఱళాయ్ నిలమ్ ఈరడియాలే కొణ్డాయ్ = వామనుడవై భూమిని రెండడుగులతో కొలిచి స్వీకరించినవాడవును; విణ్ దోయ్ శిగర=పరమపదము పర్యంతము పెరిగియున్న శిఖరములుగల; తిరువేఙ్గడమ్ మేయ = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; అణ్డా = దేవాదిదేవుడా!; అడియేనుక్కు అరుళ్ పురియాయే = నీ దాసునిపై కృపజేయుమా! .
ఉట్లలో నుంచిన మంచి నెయ్యిని అమృతమువలె ఆరగించినవాడవును, వామనుడవై భూమిని రెండడుగులతో కొలిచి స్వీకరించినవాడవును,పరమపదము పర్యంతము పెరిగియున్న శిఖరములుగల దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న దేవాదిదేవుడా!,నీ దాసునిపై కృపజేయుమా!.
తూణాయదనూడు, అరియాయ్ వన్దు తోన్ఱి,
పేణా అవుణనుడలం, పిళన్దిట్టాయ్ ,
శేణార్, తిరువేఙ్గడమామలై మేయ ,
కోళ్ నాగణైయాయ్, కుఱిక్కొళ్ ఎనైనీయే ll 1042
తూణాయ అదనూడు = ఒక సామాన్యమైన స్తంబమందు; అరియాయ్ వన్దు తోన్ఱి = నరసింహ రూపమునుదాల్చి అవతరించి; పేణా అవుణన్ ఉడలం పిళన్దిట్టాయ్ =తనను సర్వేశ్వరునిగ గౌరవించని హిరణ్యాసురునియొక్క శరీరమును చీల్చి పారవైచినవాడా!; శేణ్ ఆర్ తిరువేఙ్గడమామలై మేయ = మిక్కిలి ఉన్నతమయిన,దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; కోళ్ నాగణైయాయ్ = మిక్కిలి బలముగల శేషుని తల్పముగాగల సర్వేశ్వరుడా!; ఎనై = దాసుడగు నన్ను; నీయే కుఱిక్కొళ్ = నీవే కరుణతో తలచి కృపజేయుమా!
ఒక సామాన్యమైన స్తంబమందు నరసింహ రూపమునుదాల్చి అవతరించి తనను సర్వేశ్వరునిగ గౌరవించని హిరణ్యాసురునియొక్క శరీరమును చీల్చి పారవైచినవాడా!, మిక్కిలి ఉన్నతమయిన దివ్యమైనవేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న మిక్కిలి బలముగల శేషుని తల్పముగాగల సర్వేశ్వరుడా!, నీవే కరుణతో తలచి కృపజేయుమా!
మన్నా!, ఇమ్మనిశ ప్పిఱవియై నీక్కి ,
తన్నాక్కి, తన్ ఇన్ అరుళ్ శెయ్యుమ్ తలైవన్,
మిన్నార్ముగిల్ శేర్, తిరువేఙ్గడమ్ మేయ ,
ఎన్నానై ఎన్నప్పన్, ఎన్నెఙ్జిలుళానే ll 1043
మన్నా = శాశ్వతముగాని; ఇ మనిశ పిఱవియై నీక్కి = ఈ మనిషి జన్మమును పోగొట్టి; తన్ ఆక్కి = తనయొక్క దాసునిగ చేసుకొని; తన్ ఇన్ అరుళ్ శెయ్యుమ్ తలైవన్ = తన పరమకృపను కలుగజేసెడు ప్రభువును; మిన్ ఆర్ ముగిల్ శేర్ = మెరుపులతో కూడిన మేఘములు ఆవరించియండు; తిరువేఙ్గడమ్ మేయ = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; ఎన్ ఆనై = నాకు ఏనుగువంటివాడైన; ఎన్ అప్పన్ = నాయొక్క సర్వేశ్వరుడు; ఎన్ నెఙ్జిల్ ఉళానే = నా హృదయమందు దయతో వేంచేసియున్నాడు.
శాశ్వతముగాని ఈ మనిషి జన్మమును పోగొట్టి తనయొక్క దాసునిగ చేసుకొని తన పరమకృపను కలుగజేసెడు ప్రభువును,మెరుపులతో కూడిన మేఘములు ఆవరించియండు దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న, నాకు ఏనుగువంటివాడైన, నాయొక్క సర్వేశ్వరుడు, నా హృదయమందు దయతో వేంచేసియున్నాడు.
మానేయ్ మడనోక్కి తిఱత్తు, ఎదిర్ వన్ద ,
నేழ் విడై శెర్ట్ర, అణివరై త్తోళా ,
తేనే, తిరువేఙ్గడమామలై మేయ ,
కోనే యెన్ మనమ్, కుడికొణ్డిరున్దాయే ll 1044
మానేయ్ మడ నోక్కి తిఱత్తు = లేడివంటి అందమైన చూపులుగల నప్పిన్నైపిరాట్టి కొరకు; ఎదిర్ వన్ద ఆన్ ఏழ் విడై శెర్ట్ర = పోరు సలుపుటకై వచ్చిన ఏడు వృషభములను వధించిన; అణి వరై తోళా = అందమైన పర్వతమును పోలిన భుజములుగలవాడా!; తేనే = తేనెవలె భోగ్యమైనవాడా!; తిరువేఙ్గడ మామలై మేయ = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; కోనే = నా స్వామీ!; ఎన్ మనమ్ = నాయొక్క హృదయమును; కుడి కొణ్డు ఇరున్దాయే = నివాసస్థానముగ ఎంచుకొని వేంచేసి యున్నావుకదా! (ఏమి నా భాగ్యము)
లేడివంటి అందమైన చూపులుగల నప్పిన్నైపిరాట్టి కొరకు పోరు సలుపుటకై వచ్చిన ఏడు వృషభములను వధించిన అందమైన పర్వతమును పోలిన భుజములుగలవాడా!, తేనెవలె భోగ్యమైనవాడా !, దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న నా స్వామీ!, నాయొక్క హృదయమును నివాసస్థానముగ ఎంచుకొని వేంచేసియున్నావుకదా! (ఏమి నా భాగ్యము).
శేయన్ అణియన్, ఎనశిన్దైయుళ్ నిన్ఱ
మాయన్, మణివాళ్ ఒళి, వెణ్ తరళఙ్గళ్ ,
వేయ్ విణ్డు ఉదిర్, వేఙ్గడమామలై మేయ ,
ఆయనడియల్లదు, మర్ట్రఱియేనే ll 1045
శేయన్ = అభక్తులకు అందనివాడును; అణియన్ = ( భక్తులకు) సులభుడును; ఎన శిన్దైయుళ్ నిన్ఱ మాయన్ = నాయొక్క హృదయమున వేంచేసియున్న ఆశ్చర్యభూతుడును; వేయ్ విణ్డు = వెదురుచెట్లు పగిలి; ఒళి వెణ్ తరళఙ్గళ్ = ప్రకాశించు తెల్లని ముత్యములును; వాళ్ మణి=ప్రకాశించు రత్నములును; ఉదిర్ = చెల్లాచెదురుగ పడియుండెడి; వేఙ్గడమామలై మేయ = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; ఆయన అడి అల్లదు=శ్రీ కృష్ణుని దివ్య చరణారవిందములు తప్ప;మర్ట్రు అఱియేనే = వేరొకటి నాకు తెలియదు.
అభక్తులకు అందనివాడును,భక్తులకు సులభుడును,నాయొక్క హృదయమున వేంచేసియున్న ఆశ్చర్యభూతుడును,వెదురుచెట్లు పగిలి, ప్రకాశించు తెల్లని ముత్యములు, రత్నములు చెల్లాచెదురుగ పడియుండెడి దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న శ్రీ కృష్ణుని దివ్య చరణారవిందములు తప్ప వేరొకటి నాకు తెలియదు.
వన్దాయ్ ఎన్మనమ్ పుగున్దాయ్, మన్ని నిన్ఱాయ్ ,
నన్దాద కొழுమ్ శుడరే, ఎఙ్గళ్ నమ్బీ ,
శిన్దామణియే, తిరువేఙ్గడమ్ మేయ ,
ఎన్దాయ్, ఇని యాన్ ఉన్నై, ఎన్ఱుమ్ విడేనే ll 1046
నన్దాద = ఎల్లప్పుడును ప్రజ్వలించు; కొழுమ్ శుడరే = శ్లాఘ్యమైన తేజస్వరూపుడా!; ఎఙ్గళ్ నమ్బీ = మాయొక్క దోషములను నివర్తింపజేయగల పూర్ణుడా!; శిన్దామణియే= తలచినంత మాత్రములోనే సమస్త కోరికలను నెరవేర్చువాడా!; తిరువేఙ్గడమ్ మేయ = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న;ఎన్దాయ్ = నాయొక్క స్వామీ!; వన్దాయ్ ఎన్ మనమ్ పుగున్దాయ్ = నా చెంతకు ఏతెంచి నా హృదయమందు ప్రవేశించి; మన్ని నిన్ఱాయ్ = స్ధిరముగ నుంటివి; ఇని యాన్ ఉన్నై ఎన్ఱుమ్ విడేనే = ఇకపై నేను నిన్ను ఎన్నడును విడువను.
ఎల్లప్పుడును ప్రజ్వలించు శ్లాఘ్యమైన తేజస్వరూపుడా!,మాయొక్క దోషములను నివర్తింపజేయగల పూర్ణుడా!, తలచినంత మాత్రములోనే సమస్త కోరికలను నెరవేర్చువాడా, దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న నాయొక్క స్వామీ!, నా చెంతకు ఏతెంచి నా హృదయమందు ప్రవేశించి స్ధిరముగ నుంటిని . అట్టి నిన్ను,ఇకపై నేను ఎన్నడును విడువను.
** విల్లార్ మలి, వేఙ్గడమామలై మేయ,
మల్లార్ తిరల్ తోళ్, మణివణ్ణన్ అమ్మానై ,
కల్లార్ తిరల్ తోళ్, కలియన్ శొన్నమాలై ,
వల్లారవర్, వానవరాగువర్ తామే ll 1047
విల్ ఆర్ మలి = విల్లును ధరించియుండు వేటగాండ్రచే నిండిన; వేఙ్గడమామలై మేయ = దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న; మల్ ఆర్ తిరల్ తోళ్= మిక్కిలి బలముగల కండలు తిరిగిన భుజములతో ఒప్పు; మణివణ్ణన్ = నీలమణి వర్ణమువంటి తిరుమేని కలిగిన; అమ్మానై = సర్వేశ్వరుని విషయమై; కల్ ఆర్ తిరల్ తోళ్ = రాతి వలె దృఢమైన కండలు తిరిగిన భుజములతో ఒప్పు; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; శొన్న మాలై = కృపతో చెప్పిన ఈ పాశురముల మాలను; వల్లార్ అవర్ తామ్ = అనుసంధించువారు; వానవర్ ఆగువర్ = నిత్యశూరులవలె కైంకర్య సేవాభాగ్యమును పొందుదురు.
విల్లును ధరించియుండు వేటగాండ్రచే నిండిన దివ్యమైన వేంకటాచలముపై నిత్యవాసము చేయుచున్న మిక్కిలి బలముగల కండలు తిరిగిన భుజములతో ఒప్పు, నీలమణి వర్ణమువంటి తిరుమేనిగల సర్వేశ్వరుని విషయమై, రాతి వలె దృఢమైన కండలు తిరిగిన భుజములతో ఒప్పు తిరుమంగై ఆళ్వార్ కృపతో చెప్పిన ఈపాశురముల మాలను అనుసంధిచువారు నిత్యశూరులవలె కైంకర్య సేవాభాగ్యమును పొందుదురు .
*********
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
**********************