పెరియ తిరుమొழி-1వపత్తు (4)

శ్రీః

4 .ఏనమునాకి   

                             దివ్యమైన బదరిక్షేత్రమును సేవించుకొందుమని తన మనస్సునకు ప్రబోధించిన  తిరుమంగై ఆళ్వార్, ఆ పవిత్రమైన శిఖరముపై గల బదరికాశ్రములో కృపతో  వేంచేసియున్న  శ్రీ నరనారాయణ పెరుమాళ్ ను మంగళాశాసనము చేయుచున్నారు.

** ఏనమునాకి యిరునిలమిడన్దు , అన్ఱిణైయడి ఇమైయవర్ వణఙ్గ ,

దానవన్ ఆగమ్ తరణియిల్ పురళ ; త్తడఞ్జిలై కునిత్త ఎన్ తలైవన్ ,

తేనమర్ శోలై క్కఱ్పకమ్ పయన్ద , తెయ్ వనన్నఱుమలర్ కొణర్ న్దు ,

వానవర్ వణఙ్గుమ్ గంగైయిన్ కరైమేల్ , వదరి యాచ్చిరామత్తుళ్ళానేll   978

మున్ అన్ఱు = పూర్వము ఒకప్పుడు ,ఇణై అడి= తన పాదద్వందములను; ఇమయైవర్ వణఙ్గ = బ్రహ్మాదిదేవతలు వచ్చి సేవించగ; ఏనమ్ఆగి= వరాహ రూపముదాల్చి, ఇరు నిలమ్ ఇడన్దు = (అణ్డభిత్తిలోమునిగిన) విశాలమైన భూమండలమును తన కోరలతో పైకెత్తి ఉద్ధరించినవాడును; దానవన్ ఆగమ్ = రావణాసురుని శరీరము; తరణియిల్ పురళ =(చచ్చి)భూమిపై పడి దొర్లునట్లు;తడ శిలై కునిత్త=పెద్ద విల్లును వంచినవాడును;ఎన్ తలైవన్= అయిన నాయొక్క స్వామి; (ఎచట వేంచేసియున్నాడనగా) వానవర్= దేవతలు; తేనమర్ శోలై కఱ్పకమ్ పయన్ద = తేనెలతోనిండిన నందనవనమునగల కల్పవృక్షములు ఒసగిన; దెయ్ వమ్ నల్ నఱు మలర్ = దివ్యమైన మంచి పరిమళ భరితమైన పుష్పములను; కొణర్ న్దు = తీసుకొనివచ్చి సమర్పించి; వణఙ్గుమ్= సేవించుచుండెడి; గంగైయిన్ కరైమేల్ =గంగానది ఒడ్డునగల;వదరి యాచ్చిరామత్తు = బదరికాశ్రములో; ఉళ్ళానే = కృపతో వేంచేసియున్నాడు.

    పూర్వము ఒకప్పుడు తన చరణారవిందములను బ్రహ్మాదిదేవతలు వచ్చి సేవించగ  వరాహరూపముదాల్చి అణ్డభిత్తిలో మునిగిన విశాలమైన, భూమిని  తన కోరలతో పైకెత్తి ఉద్ధరించిన వాడును, శ్రీరామావతారమందు, రావణాసురుడు  చచ్చి భూమిపై పడి దొర్లునట్లు పెద్ద  విల్లును వంచిన వాడును, అయిన నాయొక్క స్వామి, (ఎచట వేంచేసియున్నాడనగా), దేవతలు   తేనెలతోనిండిన నందనవనమునగల కల్పవృక్షములు ఒసగిన దివ్యమైన మంచి పరిమళ భరితమైన పుష్పములను తీసుకొనివచ్చి సమర్పించి సేవించుచుండెడి గంగానది ఒడ్డునగల బదరికాశ్రములో కృపతో వేంచేసియున్నాడు.

కానిడై ఉరువై చ్చుడు శరమ్ తురన్దు, కణ్డుమున్ కొడున్దొழிల్ ఉరవోన్ ,

ఊనుడై అగలత్తు అడుకణై కుళిప్ప, ఉయిర్ కవర్ న్దుకన్ద ఎమ్మొరువన్,

తేనుడై క్కమలత్తు అయనొడు దేవర్, శెన్ఱుశెన్ఱు ఇఱైఞ్జిడ, పెరుగు

వానిడై ముదునీర్ గంగైయిన్ కరైమేల్ , వదరి యాచ్చిరామత్తుళ్ళానే ll   979  

కానిడై=అరణ్యమునందు;ఉరువై=(మారీచునిమాయారూపమైన) బంగారులేడిని; మున్ కణ్డు= తనయెదుటనుండుట చూచి; (దానిని వెంబడించి); శుడు శరమ్ తురన్దు= (దానిపైన) తీక్షణమైన బాణమును ప్రయోగించినవాడును;కొడు తొழிల్ ఉరవోన్ =క్రూరమైన చేష్టితములుగల బలశాలియైన వాలియొక్క;ఊన్ ఉడై అగలత్తు = మాంస పూరితమైన వక్షస్థలములో;అడు కణై కుళిప్ప=తీక్షణమైన బాణమును చొచ్చుకొనునట్లు ప్రయోగించి; ఉయిర్ కవర్ న్దు = అతని ప్రాణమును హరించి; ఉగన్ద = సంతోషించిన;ఎమ్ ఒరువన్ = నాయొక్క అద్వితీయమైన స్వామి;(ఎచట వేంచేసియున్నాడనగా); తేనుడై క్కమలత్తు అయనొడు = తేనెలొలుకు కమలమందు జనించిన బ్రహ్మతో కూడి;  దేవర్=సమస్త దేవతలు;శెన్ఱు శెన్ఱు=తరచుగా వచ్చి; ఇఱైఞ్జిడ=సేవించుచుండు;పెరుగు వానిడై ముదునీర్ గంగైయిన్ కరైమేల్ = ప్రవహించుచున్న పురాతనమైన ఆకాశగంగ ఒడ్డునగల; వదరి యాచ్చిరామత్తు = బదరికాశ్రములో; ఉళ్ళానే = కృపతోవేంచేసియున్నాడు.

దండకారణ్యములో మారీచునిమాయారూపమైన బంగారులేడిని తనయెదుటనుండుట చూచి దానిని వెంబడించి దానిపైన తీక్షణమైన బాణమును ప్రయోగించన వాడును. క్రూరమైన చేష్టితములుగల బలశాలియైన వాలియొక్క మాంస పూరితమైన వక్షస్థలములో తీక్షణమైన బాణమును చొచ్చుకొనునట్లు ప్రయోగించి, అతని ప్రాణమును హరించి సంతోషించిన నాయొక్క అద్వితీయమైన స్వామి ఎచట వేంచేసియున్నాడనగా తేనెలొలుకు కమలమందు జనించిన బ్రహ్మతో కూడి సమస్త దేవతలు తరచుగా వచ్చి సేవించుచుండు ప్రవహించుచున్న పురాతనమైన ఆకాశగంగ ఒడ్డునగల బదరికాశ్రములో కృపతోవేంచేసియున్నాడు.

ఇలఙ్గైయుమ్ కడలుమ్ అడలరుమ్ తుప్పిన్, ఇరునిదిక్కు ఇఱైవనుం, అరక్కర్ 

కులఙ్గళుమ్ కెడ మున్ కొడున్దొழிల్ పురిన్ద కొర్ట్రవన్, కొழఞ్జుడర్ శుழన్ఱ,

విలఙ్గలిల్ ఉఱుఞ్జి మేల్ నిన్ఱ విశుమ్బిల్, వెణ్ తుగిల్ కొడియెన విరిన్దు,

వలన్దరు మణినీర్ గంగైయిన్ కరైమేల్ , వదరి యాచ్చిరామత్తుళ్ళానే ll   980

మున్=శ్రీరామావతారమందు;ఇలఙ్గైయుమ్=లంకాపురియు;కడలుమ్=సముద్రమును;అడల్ అరు తుప్పిల్ = ఒకరిచేతను జయింపశఖ్యముకాని మహాబలశాలియైన;ఇరు నిదిక్కు ఇఱైవనుమ్= పెద్ద నిధులకు స్వామియైన రావణాసురునియు;అరక్కర్ కులఙ్గళుమ్ = రాక్షసుల కులములను; కెడ = నశించునట్లు; కొడు తొழிల్ పురిన్ద = భయంకరమైన కార్యములు చేసిన; కొర్ట్రవన్ = మహా ప్రభువు, (ఎచట వేంచేసి యున్నాడనగా); కొழு శుడర్ = ప్రకాశించు సూర్యుడు; శుழన్ఱ = చుట్టు తిరిగెడి; విలఙ్గలిల్ ఉఱుఞ్జి = మేరు పర్వతముపై ఢీకొని; మేల్ నిన్ఱ విశుమ్బిల్ = పైన నున్నఆకాశములో; వెణ్ తుగిల్ కొడియెన విరిన్దు = తెల్లని ధ్వజమాఅనునట్లు వ్యాపించి; వలమ్ తరుమ్ = (వేగముచే) మిక్కిలి బలముకలదియు;మణి నీర్=స్వచ్ఛమైన నీరు కలదియు; గంగైయిన్ కరైమేల్ = గంగానది ఒడ్డునగల; వదరి యాచ్చిరామత్తు = బదరికాశ్రములో; ఉళ్ళానే = కృపతో వేంచేసియున్నాడు.

                   శ్రీరామావతారకాలమందు,  మహాసముద్రముచే  చుట్టుకొని  రక్షణకలిగిన లంకాపురిని మఱియు, ఒకరిచేతను జయింపశఖ్యముకాని మహాబలశాలియైన వాడును, కుబేరుని జయించి శంఖనిధి, పద్మనిధులకు స్వామియైన రావణాసురునియు, రాక్షసుల కులములను నశించునట్లు భయంకరమైన కార్యములు చేసిన మహా ప్రభువు, ప్రకాశించు సూర్యుడు, చుట్టుతిరిగెడి మేరు పర్వతముపై ఢీకొని, పైన నున్న ఆకాశములో తెల్లని ధ్వజమాఅనునట్లు వ్యాపించి,వేగముచే మిక్కిలి బలముకలదియు, స్వచ్ఛమైన నీరు కలదియు అయిన గంగానది ఒడ్డునగల బదరికాశ్రములో కృపతో వేంచేసియున్నాడు.

తుణివిని యునక్కు చ్చొల్లువన్ మనమే, తొழுదెழு తొణ్డర్ గళ్ తమక్కు,

పిణియొழிత్తు అమరర్ పెరువిశుమ్బరుళుమ్, పేరరుళాళన్ ఎమ్బెరుమాన్,

అణిమలర్ కుழలార్ అరమ్బైయర్ తుగిలుమ్, ఆరముమ్ వారివన్దు, అణినీర్

మణికొழிత్తు ఇழிన్ద గంగైయిన్ కరైమేల్ , వదరి యాచ్చిరామత్తుళ్ళానే ll 981

మనమే = ఓ! నామనసా!; ఇని = ఇప్పుడు; ఉనక్కు= నీకు;తుణివు శొల్లువన్ = జీవించు ఉపాయము  చెప్పుచున్నాను (వినుము);తొణ్డర్ గళ్ తమక్కు= ఆశ్రితులయొక్క;పిణి ఒழிత్తు=వ్యాధులను పోగొట్టి; అమరర్ పెరువిశుమ్బు అరుళుమ్ = నిత్యశూరులుగల పరమపదమును (వారికి) కృపజేయు; పేర్ అరుళాళన్ = పరమదయాళుడైన; ఎమ్బెరుమాన్ = సర్వేశ్వరుని; తొழுదు ఎழு = సేవించుకొని ఉజ్జీవించుమా! ( ఆ సర్వేశ్వరుడు ఎచట కలడనగ ) అణి నీర్ = (గంగానదియందు) అందమైన నీరు;  మలర్ అణి కుழలార్ అరమ్బైయర్ = సుందరమైన పుష్పములతో అలంకరించుకొనిన కుంతలములు గల అప్సరస స్త్రీలయొక్క;తుగిలుమ్=వస్త్రములును; ఆరముమ్ = హారములును; వారి వన్దు=అన్నిటిని తీసికొని;మణి కొழிత్తు=రత్నములను కొట్టుకొని వచ్చునట్లు;ఇழிన్ద=ప్రవహించుచున్న; గంగైయిన్ కరైమేల్ = గంగానది ఒడ్డునగల; వదరి యాచ్చిరామత్తు = బదరికాశ్రములో; ఉళ్ళానే = కృపతో వేంచేసియున్నాడు. 

                           ఓ!నామనసా! ఇప్పుడు నీకు ఒక సఫలమగు జీవన ఉపాయము చెప్పుచున్నాను. వినుము. తన ఆశ్రితులయొక్క వ్యాధులను పోగొట్టి నిత్యశూరులుగల పరమపదమును వారికి కృపజేయు పరమ దయాళుడైన సర్వేశ్వరుని సేవించుకొని ఉజ్జీవించుమా! ( ఆ సర్వేశ్వరుడు ఎచట కలడనగ ), సుందరమైన పుష్పములతో అలంకరించుకొనిన కుంతలములుగల అప్సరస స్త్రీలయొక్క వస్త్రములును, హారములును అన్నిటిని తీసికొని  మఱియు రత్నములను కొట్టుకొని వచ్చునట్లు ప్రవహించుచున్న స్వచ్ఛమైన జలములుగల గంగానది ఒడ్డునగల బదరికాశ్రములో కృపతో వేంచేసియున్నాడు. 

పేయ్ ఇడైక్కిరున్దు వన్దమర్ట్రవళ్ తన్, పెరుములై శువైత్తిడ, పెర్ట్ర

తాయ్ ఇడైక్కు ఇరుత్తల్ అఞ్జువనెన్ఱు తళర్ న్దిడ, వళర్ న్ద ఎన్ తలైవన్,

శేయ్ ముకట్టుచ్చి అణ్డముమ్ శుమన్ద, శెమ్బొన్ శెయ్ విలఙ్గలిల్ ఇలఙ్గు,

వాయ్ ముకట్టు ఇழிన్ద గంగైయిన్ కరైమేల్,వదయాచ్చిరామత్తుళ్ళానేll982

వన్ద =(యశోదాదేవి రూపమునుదాల్చి)వచ్చిన;పేయ్=రక్కసి పూతన యొక్క; ఇడైక్కు ఇరున్దు = ఒడిలోనుండి; మర్ట్రు=మరియు; అవళ్ తన్ = ఆ పూతనయొక్క;పెరు ములై = పెద్ద స్తనములను; శువైత్తిడ = రుచి చూచి ఆరగించిగ; పెర్ట్ర తాయ్=(అది చూచిన) కన్న తల్లి యశోదాదేవి; ఇడైక్కు ఇరుత్తల్ అఞ్జువన్ ఎన్ఱు తళర్ న్దిడ=” నా ఒడిలోనుంచుకొనుటకు (స్తన్యములనిచ్చుటకు) బయపడుచున్నాను ” అనితడబడునట్లు;వళర్ న్ద = పెరిగినటువంటి; ఎన్ తలైవన్ = నాయొక్క స్వామి; శేయ్ ముగడు ఉచ్చి =  ఉన్నతమైన పర్వత శిఖరముపై; అండమ్ శుమన్ద = అండమును భరించుచున్న; శెమ్ పొన్ శెయ్ విలఙ్గలిల్ = మేలిమి బంగారమువలె నున్నమేరు పర్వతముపై; ఇలఙ్గు=ప్రకాశించుచున్న; వాయ్=విశాలమైన; ముగడు=శిఖరముపైనుండి;ఇழிన్ద = కిందకు ప్రవహించుచున్న; గంగైయిన్ కరైమేల్ = గంగానది ఒడ్డునగల; వదరి యాచ్చిరామత్తు = బదరికాశ్రములో; ఉళ్ళానే = కృపతో వేంచేసియున్నాడు.

            యశోదాదేవి రూపమునుదాల్చి వచ్చిన పూతనయొక్క ఒడిలోనుండి ఆ రక్కసి యొక్క పెద్ద స్తనములను రుచి చూచి ఆరగించిగ,  ఆ పూతన కిందపడి కనుమూసిన  దృశ్యమునుచూసిన కన్న తల్లి యశోదాదేవి తన ఒడిలోనుంచుకొని స్తన్యములనిచ్చుటకు  బయపడి తడబడునట్లు పెరిగినటువంటి నాయొక్క స్వామి ఉన్నతమైన పర్వత శిఖరముపై అండమును భరించుచున్న మేలిమి బంగారమువలె నున్న  మేరుపర్వతముపై ప్రకాశించుచున్న విశాలమైన శిఖరముపైనుండి కిందకు ప్రవహించుచున్న గంగానది ఒడ్డునగల బదరికాశ్రములో కృపతో వేంచేసియున్నాడు.

తేరణఙ్గు అల్ గుల్ శెழுమ్ కழల్ కణ్ణితిఱత్తు, ఒరుమఱత్తొழிల్ పురిన్దు,

పారణఙ్గిమిలేఱేழுమ్ మున్నడర్త, పనిముకిల్ వణ్ణనెమ్బెరుమాన్ ,

కారణన్దన్నాల్ కడుప్పునల్ కయత్త, కరువరై పిళవెழ క్కుత్తి ,

వారణఙ్గొణర్ న్ద గంగైయిన్ కరైమేల్, వదరి యాచ్చిరామత్తుళ్ళానే ll  983

తేరణఙ్గు అల్ గుల్ = రథచక్రము పోలిన కటిప్రదేశముగలదియు; శెழுమ్ కழల్ కణ్ణి తిఱత్తు= అందమైన కழల్ మీనములవలె నేత్రములుగలదియు అయిన నీళాదేవి కొరకు;ఒరు మఱత్తొழிల్ పురిన్దు = మిక్కిలి కోపముతో చేష్ఠలను పూని; పార్ అణఙ్గు ఇమిల్ = భూమియందలి జనులు వణికించెడి నూపురములుగల; ఏఱు ఏழுమ్ = ఏడు వృషభములను; మున్ అడర్త = అందరి కంటియెదుట వధించిన;పనిముకిల్ వణ్ణన్ =చల్లని మేఘమువంటి వర్ణముగలిగిన తిరుమేనిగల; ఎమ్బెరుమాన్ = సర్వేశ్వరుడు; కారణమ్ తన్నాల్ = భగీరథుని ప్రయత్న కారణముచే; కడు పునల్ కయత్త = మిక్కిలి వేగముతో ప్రవహించుచున్న నీటికి అడ్డుగాగల; కరు వరై=పెద్ద పర్వతమును; పిళవెழ క్కుత్తి = ఛిన్నభిన్నమగునట్లు చొచ్చి; వారణమ్ కొణర్ న్ద = (అచట నున్న)ఏనుగులను తీసుకుని వచ్చుచున్న ప్రవాహము గల, గంగైయిన్ కరైమేల్ = గంగానది ఒడ్డునగల; వదరి యాచ్చిరామత్తు = బదరికాశ్రములో; ఉళ్ళానే = కృపతో వేంచేసియున్నాడు.

            సుందరమైన కటిప్రదేశము,అందమైన కழల్ మీనములవలె నేత్రములుగల నీళాదేవిని పరిణయమాడుటకై భూమియందలి జనులు వణికించెడి నూపురములుగల , మిక్కిలి కోపావేశముతో వచ్చు , ఏడు వృషభములను అందరి కంటియెదుట వధించిన చల్లని మేఘమువంటి వర్ణముగలిగిన తిరుమేనిగల సర్వేశ్వరుడు, భగీరథుని ప్రయత్న కారణముచే ,మార్గ మధ్యమునగల పర్వతములు ఛిన్నభిన్నమగునట్లు చొచ్చి అచట నివసించు ఏనుగులను తీసుకుని వచ్చుచున్న అతివేగముతో ప్రవహించుచున్న గంగానది ఒడ్డునగల బదరికాశ్రములో కృపతో వేంచేసియున్నాడు.

వెన్దిఱల్ కళిఱుమ్ వేలైవాయ్ అముదమ్, విణ్ణొడు విణ్ణవర్కరశుమ్,

ఇన్దిరఱ్కరుళి యెమక్కుమ్ ఈన్దరుళమ్,ఎన్దై ఎమ్మడిగళ్ ఎమ్బెరుమాన్,

అన్దరత్తు అమరర్ అడియిణై వణఙ్గ, ఆయిరముకత్తినాళ్ అరుళి,

మన్దరత్తు ఇழிన్ద గంగైయిన్ కరైమేల్, వదరి యాచ్చిరామత్తుళ్ళానే ll  984

వేలైవాయ్=పాలసముద్రముయొక్క గర్భమునుండి;వెమ్ తిఱల్ కళిఱుమ్ = మిక్కిలి శక్తివంతమైన ఐరావతమను గజమును;అముదమ్=అమృతమును; విణ్ణొడు =స్వర్గలోకముతో బాటు; విణ్ణవర్కు అరశమ్ = సమస్త దేవతలకు ప్రభువుగాను; ఇందిరర్కు అరుళి = ఇంద్రునకు కృపతో ఒసగియు; ఎమక్కుమ్ ఈన్దరుళుమ్=మనకు కావలసినవన్నియును కృపతో ఒసగువాడును; ఎన్దై ఎమ్మడిగళ్ ఎమ్బెరుమాన్ = నాయొక్క తండ్రి, మనయొక్క ప్రభువు, నాయొక్క స్వామి; అన్దరత్తు అమరర్ = స్వర్గమందలి దేవతలందరు; అడియిణై వణఙ్గ = సర్వేశ్వరుని పాదద్వందములపై మోకరిల్లి ప్రార్ధింపగ; ఆయిరమ్ ముకత్తినాళ్ అరుళి = పలుముఖములుగ ప్రవహించునట్లు నియమించి కృపజేయగ; మన్దరత్తు ఇழிన్ద = ( ఆ విధముగనే ) మన్దర పర్వతమునుండి ప్రవహించుచున్న; గంగైయిన్ కరైమేల్ = గంగానది ఒడ్డునగల; వదరి యాచ్చిరామత్తు = బదరికాశ్రములో; ఉళ్ళానే = కృపతో వేంచేసియున్నాడు.

          పాలసముద్రముయొక్క గర్భమునుండి,ఐరావతమను గజమును, అమృతమును, స్వర్గలోకముతో బాటు సమస్త దేవతలకు ప్రభువుగాను,ఇంద్రునకు కృపతో ఒసగినవాడును, తనఆశ్రితభక్తుల సకల వాంఛలను తీర్చువాడును,నాయొక్కతండ్రి, మనయొక్క ప్రభువు,నాయొక్క స్వామి, ఎచట కలడనగ ,ఆ నీలమేఘశ్యాముని చరణారవిందములపై, స్వర్గమందలి దేవతలందరు మోకరిల్లి ప్రార్ధింప,మన్దర పర్వతమునుండి పలుముఖములుగ ప్రవహించునట్లు నియమించగ,ఆ విధముగ ప్రవహించుచున్న గంగానది ఒడ్డునగల బదరికాశ్రములో కృపతో వేంచేసియున్నాడు.

మాన్ మునిన్దు ఒరుకాల్ వరిశిలై వళైత్త మన్నవన్, పొన్నిఱత్తు ఉరవోన్ ,

ఊన్ మునిన్దు అవనదుడల్ ఇరుపిళవా,ఉగిర్ నుతి మడుత్తు,అయన్ అరనై

తాన్ మునిన్దిట్ట, వెన్దిఱల్ శాపమ్ తవిర్తవన్, తవమ్ పురిన్దు ఉయర్ న్ద

మాముని కొణర్ న్ద గంగైయిన్ కరైమేల్, వదరి యాచ్చిరామత్తుళ్ళానే ll  985

ఒరుకాల్ = (పంచవటిలో వేంచేసియునప్పుడు) = ఒక సమయమున;మాన్ మునిన్దు=మారీచునిపై కోపగించి; వరిశిలై వళైత్త మన్నవన్=అందమైన విల్లును వంచి బాణమును ప్రయోగించిన ప్రభువును; పొన్ నిఱత్తు ఉరవోన్ = బంగారమువంటి వర్ణముకలిగిన హిరణ్యాసురుడను మిక్కిలి బలశాలియొక్క; ఊన్ మునిన్దు=శరీరమును తుదముట్టింప మిక్కిలి కోపావేశముతో; అవనదుడల్ ఇరుపిళవా = ఆ అశురుని శరీరము రెండు భాగములగునట్లు; ఉగిర్ నుతి మడుత్తు = వాడి నఖముల కొనలను (శరీరములో) జొనిపియు; అరన్ తాన్ = చతుర్ముఖ బ్రహ్మ స్వయముగ; అరనై మునిన్దు = శివునిపై కోపగించి; ఇట్ట = అతనికిచ్చిన; వెమ్ తిఱల్ శాపమ్ తవిర్తవన్ = మిక్కిలి క్రూరమైన శాపమును పోగొట్టిన సర్వేశ్వరుడు; తవమ్ పురిన్దు ఉయర్ న్ద మాముని కొణర్ న్ద =తపోమునులలో శ్రేష్ఠుడైన భగీరథ మహాముని తీసుకుని వచ్చిన; గంగైయిన్ కరైమేల్ గంగానది ఒడ్డునగల; వదరి యాచ్చిరామత్తు = బదరికాశ్రములో; ఉళ్ళానే = కృపతో వేంచేసియున్నాడు.

                   పంచవటిలో వేంచేసియునప్పుడు,బంగారులేడి రూపములో వచ్చిన మారీచునిపై కోపగించి అందమైన విల్లును వంచి బాణమును ప్రయోగించిన ప్రభువును,తన భక్తుడైన ప్రహ్లాదుని హింసించుచున్న హిరణ్యాసురుడను మిక్కిలి బలశాలియొక్క శరీరమును తుదముట్టించుటకై మిక్కిలి కోపావేశముతో ఆ అశురుని శరీరము రెండు భాగములగునట్లు మిక్కిలి వాడియైన నఖములచే చీల్చి వధించినవాడును; రుద్రునియొక్క బ్రహ్మహత్యాపాతకమును పోగొట్టినవాడును, అట్టి  సర్వేశ్వరుడు , తపోమునులలో  శ్రేష్ఠుడైన భగీరథ మహాముని తీసుకునివచ్చిన గంగానది ఒడ్డునగల బదరికాశ్రములో కృపతో వేంచేసియున్నాడు

కొణ్డల్ మారుతఙ్గళ్ కులవరై తొకునీర్, కురైకడల్ ఉలగుడన్ అనైత్తుమ్,

ఉణ్డ మావయిర్ట్రోన్ ఒణ్ శుడర్ ఏయ్ న్ద, ఉమ్బరుమ్ ఊழிయుమానాన్,

అణ్డమ్ ఊడఱుత్తు అన్ఱుఅన్దరత్తు ఇழிన్దు, అఙ్గవనియాళ్అలమర ప్పెరుగుమ్

మణ్డు మామణినీర్ గంగైయిన్ కరైమేల్, వదరి యాచ్చిరామత్తుళ్ళానే ll  986

కొణ్డల్ = మేఘములును, మారుతఙ్గళ్ = వాయుసమూహములును;కులవరై = కులపర్వతములును; తొగు నీర్ కురైకడల్ = జలసమృద్దియు, ఘోషించుచుయుండు మహాసముద్రములును; ఉలగుడన్ అనైత్తుమ్ = భూమండలముతో కూడ సమస్త  లోకములను; ఉణ్డ = ఆరగించిన; మావయిర్ట్రోన్ = పెద్ద ఉదరము గలవాడును;ఒణ్ శుడర్ ఏయ్ న్ద ఉమ్బరుమ్ ఊழிయుమ్ ఆనాన్=ప్రకాశించు సూర్యచంద్రాదులు కలిగిన పైలోకములకును, కాలము మొదలగువాటినన్నింటికిని నిర్వాహకుడైన సర్వేశ్వరుడు; అన్ఱు = భగీరథుడు గంగానదిని తీసుకునివచ్చునపుడు; అణ్డమ్ ఊడు అఱుత్తు = బ్రహ్మ లోకమునుండి హద్దులనతిక్రమించి; అన్దరత్తు ఇழிన్దు = ఆకాశమునుండి క్రిందకు దిగుచు; అఙ్గు = అచటినుండి; అవనియాళ్ అలమర పెరుగుమ్ = భూదేవి వణుకునట్లుగ ప్రవహించుచుండు; మణ్డు మామణినీర్ = మిక్కిలి స్వచ్ఛమైన జలములు గల; గంగైయిన్ కరైమేల్ = గంగానది ఒడ్డునగల; వదరి యాచ్చిరామత్తు = బదరికాశ్రములో; ఉళ్ళానే = కృపతో వేంచేసియున్నాడు.

    మేఘములు,వాయుసమూహములు,మహాసముద్రములు,భూమండలము, సమస్తలోకములు మొదలగు వాటినన్నింటిన ఒకేసారి ఆరగించిన దివ్యమైన ఉదరము గలవాడును,సూర్యచంద్రాదులు కలిగిన పైలోకములకును, కాలము మొదలగు వాటినన్నింటికిని నిర్వాహకుడైన సర్వేశ్వరుడు, భగీరథుడు గంగానదిని తీసుకుని వచ్చునపుడు, బ్రహ్మ లోకమునుండి హద్దులనతిక్రమించి, ఆకాశమునుండి క్రిందకు దిగుచు; అచటినుండి భూదేవి వణుకునట్లుగ ప్రవహించుచుండు మిక్కిలి స్వచ్ఛమైన జలములుగల గంగానది ఒడ్డునగల బదరికాశ్రములో కృపతో వేంచేసియున్నాడు.

** వరుమ్ తిరై మణినీర్ గంగైయిన్ కరైమేల్, వదరి యాచ్చిరామత్తుళ్ళానై ,

కరుఙ్గడల్ మున్నీర్ వణ్ణనై యెణ్ణి, క్కలియన్ వాయొలిశెయ్ ద పనువల్,

వరమ్ శెయ్ ద ఐన్దుమైన్దుమ్ వల్లార్ గళ్, వానవరులగుడన్ మరువి

ఇరుమ్ కడల్ ఉలగమాణ్డు వెణ్ కుడైక్కీழ்,ఇమైయవర్ ఆగువర్ తామే ll987

వరుమ్ తిరై మణినీర్ = మిక్కిలి వేగముతో అలలుతో వచ్చు స్వచ్ఛమైన నీరుగల; గంగైయిన్  కరైమేల్ = గంగానది ఒడ్డునగల; వదరి యాచ్చిరామత్తుళ్ళానై = బదరికాశ్రములో కృపతో వేంచేసియున్న; కరుమ్ కడల్ మున్నీర్ వణ్ణనై = నల్లని,మూడు రకములనీటితో ఒప్పు సముద్రము వంటి వర్ణముకలిగిన శ్రీమన్నారాయణుని; ఎణ్ణి = అనుసంధించుచు; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; వాయొలిశెయ్ ద = ముఖపద్మమునుండి అనుగ్రహించిన; పనువల్ = పాశురములైన; వరమ్ శెయ్ ద ఐన్దుమైన్దుమ్ = శ్లాఘ్యమైన ఈ పదియును; వల్లార్ గళ్ = అనుసంధించు భక్తులు;వెణ్ కుడైక్కీழ் = తెల్లని ఛత్రముక్రింద సుఖముగ ఆశీనులై; ఇరు కడల్ ఉలగమాణ్డు = విశాలమైన సముద్రముచే చుట్టుకొనియున్న ఈ భూమండలమును పరిపాలించి; ఉడన్ = అటుపిమ్మట;వానవర్ ఉలగు మరువి=బ్రహ్మలోకమునకు నిర్వాకులుగనుండి;(పిదప) ఇమైయవర్ ఆగువర్ తామే = నిత్యశూరులతో చేరియుండుదురు.

మిక్కిలి వేగముతో అలలుతో వచ్చు స్వచ్ఛమైన నీరుగల గంగానది ఒడ్డునగల బదరికాశ్రములో కృపతో వేంచేసియున్న నల్లని, మూడు రకముల నీటితోఒప్పు సముద్రమువంటి వర్ణము కలిగిన శ్రీమన్నారాయణుని అనుసంధించుచు, తిరుమంగై ఆళ్వార్ ముఖపద్మమునుండి అనుగ్రహించిన శ్లాఘ్యమైన ఈ పది పాసురములను అనుసంధించు భక్తులు,తెల్లని ఛత్రముక్రింద సుఖముగ ఆశీనులై విశాలమైన సముద్రముచే చుట్టుకొనియున్న ఈ భూమండలమును పరిపాలించి, అటుపిమ్మట బ్రహ్మలోకమునకు నిర్వాకులుగనుండి పిదప నిత్యశూరులతో చేరియుండుదురు.

*******

వ్యాఖ్యానించండి