పెరియ తిరుమొழி-1వపత్తు (5)

శ్రీః

5. కలైయుమ్

                                          హిమాలయ పర్వతశ్రేణిలో గల తిరుసాలగ్రామ దివ్యదేశములో కృపతో    వేంచేసియున్న సర్వేశ్వరుని, తిరుమంగై ఆళ్వార్  మంగళాశాసనము చేయుచున్నారు. 

** కలైయుమ్ కరియుమ్ పరిమావుమ్, తిరియుమ్ కానమ్ కడన్దుపోయ్ ,

శిలైయుమ్ కణైయుమ్ తుణైయాగ, శెన్ఱాన్ వెన్ఱిచ్చెరుక్కళత్తు ,

మలైకొణ్డు అలైనీర్ అణై కట్టి,  మదిళ్ నీర్ ఇలఙ్గై వాళ్ అరక్కర్

తలైవన్ , తలైపత్తఱుత్తుకన్దాన్ , శాలక్కిరామమడైనెఞ్జే ll 988

కలైయుమ్ = లేళ్ళు; కరియుమ్ = ఏనుగులు; పరిమావుమ్ = అశ్వములు మొదలగు మృగములు; తిరియుమ్ = తిరుగుచుండెడి; కానమ్ = అడవిని; కడన్దుపోయ్ = దాటుకొనుచు చాలదూరము వెడలి; శిలైయుమ్ కణైయుమ్ తుణైయాగ = విల్లు, బాణముల సహాయముగ; వెన్ఱి శెరుకళత్తు శెన్ఱాన్ = తనకు విజయము చేకూర్చెడి యుద్దభూమికి వేంచేసినవాడును; అలై నీర్ = అలలుకొట్టుచున్న సముద్రపు నీటిలో; మలై కొణ్డు = పర్వతముల వంటి రాళ్ళతో; అణై కట్టి =సేతువును కట్టి; మదిళ్ నీర్ ఇలఙ్గై = ప్రాకారములతోను, మహాసముద్రముతోను రక్షణగ చుట్టబడియున్న లంకాపురియందు; వాళ్= ఖడ్గములు ఆయుధములుగాగల; అరక్కర్ తలైవన్ = రాక్షసుల ప్రభువైన రావణాసురునియొక్క;పత్తు తలై=పది తలలను; అఱుత్తు=త్రుంచి; ఉగన్దాన్ = (ఆశ్రితులను రక్షించితినను కారణమున) మిక్కిలి సంతోషించినవాడును, అట్టి   సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న;సాలక్కిరామమ్ = శ్రీ సాలగ్రామ దివ్య దేశమును; నెఞ్జే అడై = ఓ! నామనసా! చేరి ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!

ఏనుగులు, అశ్వములు మొదలగు అనేక క్రూరమృగములు తిరిగెడి అడవిని దాటుకొనుచు చాలదూరము వెడలి, విల్లు బాణముల సహాయముగ రణభూమికి చేరినవాడును, అలలతో అల్లకల్లోలముగా నున్న మహాసముద్రములో పర్వతముల వంటి రాళ్ళతో సేతువును కట్టి, మహాసముద్రము అగడ్తగను, దృఢమైన ప్రాకరములుగల లంకాపురిలో భయంకరమైన ఖడ్గములు ఆయుధములుగాగల రాక్షసుల ప్రభువైన రావణాసురునియొక్క పదితలలను త్రుంచి, ఆశ్రితులను రక్షించితినను కారణమున మిక్కిలి సంతోషించినవాడును, అట్టి సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న శ్రీ సాలగ్రామ దివ్య దేశమును, ఓ! నామనసా!, చేరి, ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!

కడమ్ శూழ் కరియుమ్ పరిమావుమ్, ఒలిమాన్తేరుమ్ కాలాళుమ్,

ఉడన్ శూழ் న్దు ఎழுన్ద కడి ఇలఙ్గై, పొడియా వడివాయ్ చ్చరన్తురన్దాన్,

ఇడమ్ శూழ் న్దు ఎఙ్గుమ్ ఇరు విశుమ్బిల్, ఇమైయోర్ వణఙ్గ మణమ్ కమழுమ్,

తడమ్ శూழ் న్దు ఎఙ్గుమ్ అழగాయ,శాలక్కిరామమడైనెఞ్జేll 989

కడమ్ శూழ் కరియుమ్ = మదజలములు స్రవించు ఏనుగులును; పరిమావుమ్ = గుఱ్ఱములును; ఒలి మా తేరుమ్ = ధ్వనించెడు మహారథములును; కాలాళుమ్=పదాతిదళములును; ఉడన్ శూழ் న్దు = వీటినన్నింటితో కూడి; ఎழுన్ద=అతిశయించిన;  కడి ఇలఙ్గై = కోటలతో సురక్షితమైన లంకాపురిని; పొడియా=భస్మీపటలముగునట్లు; వడి వాయ్ = వాడియైన నోరుగల; శరమ్ = బాణములను; తురన్దాన్ = ప్రయోగించిన శ్రీ రామచంద్రుడు కృపతో వేంచేసియున్నదియు; ఇరు విశుమ్బిల్ ఇమైయోర్= విశాలమైన స్వర్గలోకమందున్న దేవతలందరు; ఇడమ్ ఎఙ్గుమ్ శూழ் న్దు=ఈ భూతలమందంతటను వ్యాపించి; వణఙ్గ= ఆశ్రయించునట్లు;మణమ్ కమழுమ్ తడమ్= పరిమళము వీచెడి పుష్పములతో నిండిన తటాకములచే; శూழ் న్దు=చుట్టబడియుండి; ఎఙ్గుమ్ అழగాయ=ఎటుచూచినను మిక్కిలి సుందరముగనుండు; సాలక్కిరామమ్ = శ్రీ సాలగ్రామ దివ్య దేశమును; నెఞ్జే అడై = ఓ! నామనసా! చేరి ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!

                         మదజలము స్రవించెడి గజాతిదళములు, అశ్వదళములు, మహారథములు, పదాతిదళములు మొదలగువాటితో అతిశయించి యున్నదియు, మరియు దుర్గమమైన కోటలతో సురక్షితమైనదియు, అయిన లంకాపురిని భస్మీపటలమగునట్లు దివ్యమైన బాణములను ప్రయోగించిన శ్రీ రామచంద్రుడు కృపతో వేంచేసియున్నదియు, సమస్తదేవతలు ఈ భూతలమందు ఆశ్రయించుటకు అనువుగ పరిమళము వీచెడి పుష్పములతో నిండిన తటాకములచేచుట్టబడియుండి,ఎటుచూచినను మిక్కిలి సుందరముగనుండు  శ్రీ సాలగ్రామ దివ్యదేశమును  ఓ! నామనసా! చేరి ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .

ఉలవు తిరైయుమ్ కులవరైయుమ్, ఊழிముదలా ఎణ్ తిక్కుమ్,

నిలవుమ్ శుడరుమ్ ఇరుళుమాయ్ నిన్ఱాన్, వెన్ఱి విఱలాழி

వలవన్, వానోర్ తమ్ పెరుమాన్, మరువా అరక్కర్కు ఎఞ్జాన్ఱుమ్

శలవన్, శలమ్ శూழ் న్దు అழగాయ, శాలక్కిరామమడైనెఞ్జే ll 990

ఉలవు తిరైయుమ్ = కదులుచుండెడి అలలుగల సముద్రములును; కులవరైయుమ్ = కులపర్వతములును; ఊழிముదలా ఎణ్ దిక్కుమ్ = కాలము, సకల పదార్ధములును,ఎనిమిది దిక్కులును; నిలవుమ్ = చంద్రుడును; శుడరుమ్= సూర్యుడును; ఇరుళుమ్=చీకటియును; ఆయ్ నిన్ఱాన్ = మొదలగు వీటినన్నింటికిని  అంతర్యామిగనున్నవాడును; వెన్ఱి విఱల్ ఆழி వలవన్ = విజయమును,శక్తియుకలిగిన దివ్యసుదర్శనచక్రము తన కుడిచేతిలో కలవాడును; వానోర్ తమ్ పెరుమాన్ = బ్రహ్మాదిదేవతలకు ప్రభువును;మరువా అరక్కర్కు = (తనను) ఆశ్రయించని రాక్షసుల విషయమందు; ఎఞ్జాన్ఱుమ్ శలవన్=ఎన్నడూ మేలుచేయని సర్వేశ్వరుడు (కృపతో వేంచేసియున్న) శలమ్ శూழ் న్దు అழగాయ=జలాశయములచే చుట్టుకొనియున్నమిక్కిలి సుందరమైన;సాలక్కిరామమ్= శ్రీ సాలగ్రామ దివ్యదేశమును;నెఞ్జే అడై = ఓ! నామనసా! చేరి ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .

అలలుకొట్టుచున్న మహాసముద్రములు,కుల పర్వతములు, కాలము,అన్ని దిక్కులయందుగల సమస్త పదార్ధములు, సూర్యచంద్రులు, చీకటి, మొదలగు వీటినన్నింటికిని  అంతర్యామిగనున్న వాడును, దివ్యసుదర్శనచక్రము తనకుడిచేతిలో కలవాడును, తనను ఆశ్రయించని రాక్షసుల విషయమందు ఎన్నడూ మేలుచేయని సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న, జలాశయములచే చుట్టుకొనియున్న మిక్కిలి సుందరమైన శ్రీ సాలగ్రామ దివ్యదేశమును, ఓ! నామనసా! చేరి ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .

ఊరాన్ కుడందై ఉత్తమన్, ఒరుకాలిరుకాల్ శిలైవళైయ ,

తేరా అరక్కర్ తేర్ వెళ్ళమ్ శెర్ట్రాన్, వర్ట్రా వరుపునల్ శూழ் 

పేరాన్, పేరాయిరముడైయాన్, పిణఙ్గు శిఱై వణ్డు అఱైకిన్ఱ

తారాన్, తారావయల్ శూழ் న్ద, శాలక్కిరామమడైనెఞ్జే ll 991

ఊరాన్ = తిరు ఊరగం దివ్యదేశములో వేంచేసియున్నవాడును;కుడందై ఉత్తమన్ =తిరుకుడందై దివ్య దేశములో కృపతో వేంచేసియున్న పురుషోత్తముడును; ఒరుకాల్ =పూర్వ కాలమున (శ్రీరామావతారమందు), శిలై ఇరు కాల్ వళైయ= విల్లుయొక్క రెండుకొనలను వంచి; తేరా అరక్కర్ తేర్ వెళ్ళమ్ శెర్ట్రాన్ = అవివేకులై వచ్చిన రాక్షసుల రథసమూహములను వధించినవాడును; వర్ట్రా వరుపునల్ శూழ் పేరాన్=ఒకప్పుడును ఎండిపోక ప్రవహించుచున్న కావేరినదిచే చుట్టుకొనియున్న తిరుప్పేర్ నగర్ దివ్యదేశములో పవళించియున్నవాడును; పేర్ ఆయిరమ్ ఉడైయాన్ = సహస్రనామములు గలవాడును;పిణఙ్గు శిఱై వణ్డు అఱైకిన్ఱ తారాన్ = గుంపులు గుంపులుగ అందమైన ఱెక్కలుగల తుమ్మెదలు ఝంకారము చేయుచుండు తులసీమాలచే అలంకృతుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న; తారా వయల్ శూழ் న్ద = ” తారా ” పక్షులచే నిండిన పొలములతో చుట్టుకొనియున్న; సాలక్కిరామమ్ = శ్రీ సాలగ్రామ దివ్యదేశమును; నెఞ్జే అడై = ఓ! నామనసా! చేరి ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .

                           తిరు ఊరగం దివ్యదేశములో వేంచేసియున్నవాడును, తిరుకుడందై దివ్య దేశములో కృపతో వేంచేసియున్న   పురుషోత్తముడును, శ్రీరామావతారమందు,ఎదిరింప అశఖ్యమని తెలుసుకొనలేని అవివేకులై వచ్చిన  అనేక రాక్షసుల  రథసమూహములను తుదముట్టించినవాడును, ఎల్లప్పుడును జలసమృద్దిచే   ప్రవహించుచున్న కావేరినదిచే చుట్టుకొనియున్న తిరుప్పేర్ నగర్ దివ్యదేశములో పవళించి యున్నవాడును, సహస్రనామములచే స్తుతింపబడువాడును, తుమ్మెదల ఝంకారముచేయుచుండు తులసీమాలచే అలంకృతుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న,  ” తారా ” పక్షులచే నిండిన పొలములతో చుట్టుకొనియున్న శ్రీ సాలగ్రామ దివ్యదేశమును, ఓ! నామనసా! చేరి ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .

అడుత్తు ఆర్తు ఎழన్దాల్ పిలవాయ్ విట్టుఅలఱ, అవళ్ మూక్కు అయిల్  వాళాల్

విడుత్తాన్, విళఙ్గు శుడరాழி, విణ్ణోర్ పెరుమాన్ నణ్ణార్ మున్ ,

కడుత్తు ఆర్తు ఎழுన్ద పెరుమழைయై, క్కల్లోన్ఱేన్ది ఇననిరైక్కా

తడుత్తాన్, తడమ్ శూழ்న్దు అழగాయ, శాలక్కిరామమడైనెఞ్జే ll 992

అడుత్తు ఆర్తు ఎழన్దాల్ = సమీపమునకు వచ్చి అరచు మిక్కిలి కామవాంఛతోనున్నశూర్పణఖను; పిలమ్ వాయ్ విట్టు అలఱ = భిలమువలెనున్న నోటిని తెరిచి రోధించునట్లు; అవళ్ మూక్కు అయిల్ వాళాల్ విడుత్తాన్ = ఆ రక్కసియొక్క ముక్కును వాడియైన కత్తిచే (లక్ష్మణస్వామి సహాయముతో) కోసినవాడును; విళఙ్గు శుడర్ ఆழி =ప్రకాశముతో ప్రజ్వలించు చక్రాయుధము హస్తమందు కలవాడును; విణ్ణోర్ పెరుమాన్ =నిత్యశూరులకు ప్రభువును; కడత్తు = మిక్కిలి వేగముతో; ఆర్తు = గర్జించుచు; ఎழுన్ద=వచ్చిన;పెరు మழைయై = పెద్ద వానను; నణ్ణార్ మున్ = ( గోకులవాసులచే) ఎదిరింపబడిన ఇంద్రుని ఎదుటనే; ఇన నిరైక్కా=పశు సమూహముల రక్షణకై; కల్ ఒన్ఱు ఏన్ది తడుత్తాన్ = గోవర్ధనమను ఒక పర్వతమును పైకెత్తి  అడ్డగించిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న; తడమ్ శూழ்న్దు అழగాయ = తటాకములతో చుట్టుకొనియున్న సుందరమైన ; సాలక్కిరామమ్ = శ్రీ సాలగ్రామ దివ్యదేశమును; నెఞ్జే అడై = చేరి  ఓ! నామనసా!  ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!

సమీపమునకు వచ్చి అరచు మిక్కిలి కామవాంఛతోనున్న శూర్పణఖను, బిగ్గరగ రోధించునట్లు,లక్ష్మణస్వామిచే వాడియైన కత్తితో ఆ రక్కసి  ముక్కును కోయించినవాడును, ప్రకాశముతో ప్రజ్వలించు చక్రాయుధము హస్తమందు కలవాడును, మిక్కిలి వేగముతో గర్జించుచు వచ్చిన పెద్ద వానను గోకులవాసులచే ఎదిరింపబడిన ఇంద్రుని  కంటిఎదుటనే  గోవర్ధనపర్వతమును పైకెత్తి అడ్డగించిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న, తటాకములతో చుట్టుకొనియున్న సుందరమైన  శ్రీ సాలగ్రామ దివ్యదేశమును చేరి, ఓ! నామనసా!  ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .

తాయాయ్ వన్ద పేయ్ ఉయిరుమ్, తయిరుమ్ విழுతుమ్ ఉడన్ ఉణ్డ

వాయాన్, తూయవరి యురువిల్ కుఱళాయ్ చ్చెన్ఱు, మావలియై

ఏయాన్ ఇరప్ప, మూవడి మణ్ ఇన్ఱేతా ఎన్ఱు, ఉలగేழுమ్ 

తాయాన్, కాయామలర్ వణ్ణన్, శాలక్కిరామమడైనెఞ్జే ll 993

తాయ్ ఆయ్ వన్ద పేయ్ ఉయిరుమ్ = కన్నతల్లి అయిన యశోదాదేవి రూపమునుదాల్చి వచ్చిన  రక్కసి పూతనయొక్క ప్రాణములను, తయిరుమ్ విழுతుమ్ ఉడన్= పెరుగుతో బాటు వెణ్ణను; ఉణ్డ వాయాన్ = ఆరగించిన దివ్యమైన నోరుగలవాడును; ఏయాన్ = (యాచించుటకు) తగనివాడయిన తాను; తూయ వరి ఉరువిల్ కుఱళాయ్ మావలియై శెన్ఱు = పరిశుద్ధమైన మిక్కిలి సుందరమైన రూపముగల వామనుడై మహబలివద్దకు వెడలి; ఇన్ఱే మూ అడి మణ్ తా ఎన్ఱు ఇరప్ప = ఇప్పుడే (నాకు) మూడడుగులు భూమిఒసగు మని యాచించగ; (ఆ మహాబలినుండి దానజలమును స్వీకరించిన వెంటనే) ఉలగు ఏழுమ్ తాయాన్ = సప్తలోకములను కొలిచినవాడును; కాయామలర్ వణ్ణన్= అల్లి పుష్పమువంటి  వర్ణముగలిగిన తిరుమేనిగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన; సాలక్కిరామమ్ = శ్రీ సాలగ్రామ దివ్యదేశమును; నెఞ్జే అడై = చేరి  ఓ! నామనసా!  ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .

కన్నతల్లి  యశోదాదేవి రూపమునుదాల్చి వచ్చిన  రక్కసి పూతనయొక్క ప్రాణములను, పెరుగుతోబాటు వెణ్ణను ఆరగించిన దివ్యమైన నోరుగలవాడును, యాచించుటకు తగనివాడయినను తాను దేవేంద్రునికై పరిశుద్ధమైన సుందరమైన రూపముగల వామనుడై , మహబలివద్దకు వెడలి  మూడడుగులు భూమి యాచించి, ఆ మహాబలినుండి దానజలమును స్వీకరించిన వెంటనే సప్తలోకములను కొలిచినవాడును, అల్లి పుష్పమువంటి  వర్ణముగలిగిన తిరుమేనిగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన, బహుసుందరమైన  శ్రీ సాలగ్రామ దివ్యదేశమును చేరి, ఓ! నామనసా!  ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! 

ఏనోర్ అఞ్జ వెమ్ శమత్తుళ్, అరియాయ్ ప్పరియ ఇరణియనై ,

ఊనార్ అగలమ్ పిళ ఎడుత్త, ఒరువన్ తానే యిరుశుడరాయ్ ,

వానాయ్ తీయాయ్ మారుదమాయ్, మలైయాయ్ అలైనీర్ ఉలగనైత్తుమ్

తానాయ్, తానుమానాన్తన్, శాలక్కిరామమడైనెఞ్జే ll 994

ఏనోర్ అఞ్జ= శత్రువులైన రాక్షసులు భయపడునట్లు; అరియాయ్ = నరసంహ రూపమునుదాల్చి; పరియ ఇరణియనై=మిక్కిలి బలిసిన శరీరముగల హిరణ్యాసురుని;వెమ్ శమత్తుళ్=భయంకరమైన యుద్ధములో;ఊన్ ఆర్ అగలమ్ పిళ ఎడుత్త ఒరువన్=మాంసభరితమైన వక్షస్థలమును చీల్చి వధించిన అద్వితీయుడైన సర్వేశ్వరుడు,తానే =ఆ స్వామియే; ఇరు శుడరాయ్ = సూర్యచంద్రులగాను; వానాయ్ = ఆకాశముగాను; తీయాయ్ = అగ్నిగాను; మారుదమాయ్ = వాయువుగాను; మలైయాయ్= పర్వతములుగాను; అలై నీర్ ఉలగు అనైత్తుమ్ తానాయ్ = అలలుతోనుండు సముద్రములచే చుట్టబడియున్న లోకములంతయు తానే అయినవాడును;తానుమ్ ఆనాన్ తన్ = అసాధారణమైన దివ్య మంగళవిగ్రహ స్వరూపుడైన ఆ సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న; సాలక్కిరామమ్ = శ్రీ సాలగ్రామ దివ్యదేశమును; నెఞ్జే అడై = చేరి  ఓ! నామనసా!  ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .

                శత్రువులైన రాక్షసులు భయపడునట్లు నరసంహరూపముదాల్చి మిక్కిలి బలిసిన శరీరముగల హిరణ్యాసురుని భయంకరమైన యుద్ధములో మాంసభరితమైన వక్షస్థలమును చీల్చి వధించిన అద్వితీయుడైన సర్వేశ్వరుడే సూర్యచంద్రులు,ఆకాశము, వాయువు,పర్వతములు , సముద్రములచే చుట్టబడియున్న లోకములు అంతయు తానే అయినవాడు,ఆ అసాధారణమైన దివ్య మంగళవిగ్రహ స్వరూపుడైన  సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న బహుసుందరమైన  శ్రీ సాలగ్రామ దివ్యదేశమును చేరి, ఓ! నామనసా! అట్టి నా స్వామి యొక్క  దివ్యదర్శనమును పొందుమా! 

వెన్దార్ ఎమ్బుమ్ శుడునీఱుమ్, మెయ్యిల్ పూశి కై యగత్తు, ఓర్

శన్దార్ తలై కొణ్డు ఉలగేழுమ్, తిరియుమ్ పెరియోన్ తాన్ శెన్ఱు, ఎన్ 

ఎన్దాయ్, శాపమ్ తీరెన్న, ఇలఙ్గు అముదునీర్ తిరుమార్బిల్

తన్దాన్, శన్దార్ పొழிల్ శూழ் న్ద, శాలక్కిరామమడైనెఞ్జే ll 995

వెన్దార్ ఎమ్బుమ్ = ప్రేతముల ఎండిన పుఱ్ఱెలను; శుడు నీఱుమ్ = మృతదేహములను కాల్చిన బూడిదను; మెయ్యిల్ పూశి = శరీరమున ధరించుకొని; శన్దార్ ఓర్ తలై కై యగత్తు కొణ్డు = రంద్రములతోకూడియున్న ఎప్పటికిని నింపలేని బ్రహ్మకపాలమును తన చేతిలోకలిగి; ఉలగేழுమ్ తిరియుమ్ = సర్వలోకములయందు తిరుగుచుండెడి; పెరియోన్ తాన్ =పరమశివుడు; శెన్ఱు=(సర్వేశ్వరుని) సమీపించి;ఎన్ ఎన్దాయ్ శాపమ్ తీర్ ఎన్న= “నాయొక్క స్వామీ!” (నాకు కలిగిన) శాపమును కృపతో పోగొట్టుమని వేడుకొనగ; తిరు మార్బిల్ ఇలఙ్గు అముదునీర్ తన్దాన్ = తన దివ్యమైన వక్షస్థలమునుండి ప్రకాశించు అమృతజలము ఒసగి శాపముతీర్చిన సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న;శన్దు ఆర్ పొழிల్ శూழ் న్ద = చందనవృక్షములతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న; సాలక్కిరామమ్ = శ్రీ సాలగ్రామ దివ్యదేశమును; నెఞ్జే అడై = చేరి  ఓ! నామనసా!  ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా! .

    కపాలములమాలను,మృతదేహములను కాల్చిన బూడిదను శరీరమున ధరించుకొని,రంద్రములతో కూడియున్న,ఎప్పటికిని నింపలేని బ్రహ్మకపాలమును తన చేతిలో కలిగి, సర్వలోకములయందు తిరుగుచుండెడి పరమశివుడు సర్వేశ్వరుని సమీపించి,”నాయొక్క స్వామీ!” (నాకు కలిగిన) శాపమును కృపతో పోగొట్టుమని వేడుకొనగ, తన దివ్యమైన వక్షస్థలమునుండి ప్రకాశించు అమృతజలము ఒసగి శాపముతీర్చిన సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న ,చందన వృక్షములతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న శ్రీ సాలగ్రామ దివ్యదేశమును చేరి, ఓ! నామనసా! అట్టి నా స్వామి యొక్క  దివ్యదర్శనమును పొందుమా!  

తొణ్డామ్ ఇనముమ్ ఇమైయోరుమ్, తుణైనూల్ మార్విల్ అన్దణరమ్,

అణ్డా ఎమక్కే అరుళాయ్ ఎన్ఱు, అణైయుమ్ కోయిల్ అరుగెల్లామ్,

వణ్డార్ పొழிలిన్ పழనత్తు, వయలిన్ అయలే కయల్ పాయ ,

తణ్డామరైగళ్ ముకమలర్తుమ్, శాలక్కిరామమడైనెఞ్జే ll 996

తొణ్డు ఆమ్ ఇనముమ్ = కైంకర్యములుచేయు భాగవతుల యొక్క  సమూహములును; ఇమైయోరుమ్ = నిత్యశూరులును; తుణైనూల్ మార్విల్ అన్దణరమ్=యఙ్ఞోపవీతము తమ వక్షస్థలమందు కలిగిన బ్రాహ్మణులును; అణ్డా ఎమక్కే అరుళాయ్ ఎన్ఱు అణైయుమ్ కోయిల్ = ” జగత్తును పాలించెడి దేవా! మాపై కృపజేయుమా! ” అని వేడుకొనుచు చేరుకొనుచుండెడి కోవెలయొక్క; అరుగు ఎల్లామ్ = సమీపమందలి ప్రదేశములందంతటను; వణ్డు ఆర్ పొழிలిన్=తుమ్మెదల సమూహములచే నిండియున్న తోటలయందు గల; పయనత్తు = జలాశయములందు, వయలిన్ అయలే కయల్ పాయ=పొలముల సమీపమునుండి కయల్  మీనములు వచ్చి గెంతుటచే; తణ్ తామరైగళ్ ముగమ్ మలర్తుమ్=చల్లని  తామరమొగ్గలు వికసించు చుండబడు; సాలక్కిరామమ్ = శ్రీ సాలగ్రామ దివ్యదేశమును; నెఞ్జే అడై=చేరి  ఓ! నామనసా!  ఆ సర్వేశ్వరుని దివ్యదర్శనమును పొందుమా!

కైంకర్యములుచేయు భాగవతులు,నిత్యశూరులు, యఙ్ఞోపవీతము తమ వక్షస్థలమందు కలిగిన బ్రాహ్మణులు, మొదలగు వారందరు ” జగత్తును పాలించెడి దేవా! మాపై కృపజేయుమా! ” అని వేడుకొనుచు చేరుకొనుచుండెడి కోవెలయొక్క సమీపమందలి ప్రదేశములందంతటను, తుమ్మెదల సమూహములచే నిండియున్న తోటలయందుగల జలాశయములందు, పొలముల సమీపమునుండి కయల్  మీనములు వచ్చి గెంతుటచే చల్లని తామరమొగ్గలు వికసించుచుండబడు, బహుసుందరమైన  శ్రీ సాలగ్రామ దివ్యదేశమును చేరి, ఓ! నామనసా! అట్టి నా స్వామి యొక్క  దివ్యదర్శనమును పొందుమా! 

** తారావారుమ్ వయల్ శూழ் న్ద, శాలక్కిరామత్తు అడిగళై,

కారార్ పుఱవిన్ మంగై వేన్దన్, కలియన్ ఒలిశెయ్ తమిழ்మాలై, 

ఆరార్ ఉలగత్తు అఱివుడైయార్, అమరర్ నన్నాట్టు అరశాళ,

పేరాయిరముమ్ ఓదుమిన్ గళ్,  అన్ఱియివైయే పిదర్ట్రుమినే ll 997

ఉలగత్తు=ఈలోకమందు;అఱివుడైయార్ ఆరార్=వివేకవంతులైనవారు ఎవరెవరుగలరోవారు; అమరర్ నల్ నాడు అరశ ఆళ = నిత్యశూరులయొక్క విలక్షణమైన శ్రీ వైకుంఠమును ప్రభువుగ పరిపాలించుటకు; పేరాయిరముమ్ ఓదుమిన్ గళ్ = శ్రీవైకుంఠనాధుని సహస్రనామములను అనుసంధానము చేయండి; అన్ఱి = అట్లుగాక; కారార్ పుఱవిల్ మంగై వేన్దన్ కలియన్ = మేఘములతో ఆవరింపబడిన తోటలుగల తిరుమంగై దేశమునకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ ; తారావారుమ్ వయల్ శూழ் న్ద =” తారా ” పక్షలచే నిండిన పొలములతో చుట్టుకొనియున్న; శాలక్కిరామత్తు అడిగళై =   శ్రీసాలగ్రామ దివ్య దేశములో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై;ఒలి శెయ్=  అనుగ్రహించిన; తమిழ்మాలై = తమిళ భాషలోనున్న ఈ పాశురముల మాలను;పిదర్ట్రుమినే = క్రమములేకనే నోటికి వచ్చినవిధముగ పాడుటయో, చేసినచో ఇష్టసిద్ధి ప్రాప్తి కలుగును.

ఈలోకమందు వివేకవంతులైనవారు ఎవరెవరుగలరో వారు, నిత్యశూరులయొక్క విలక్షణమైన శ్రీ వైకుంఠమును ప్రభువుగ పరిపాలించుటకు, శ్రీవైకుంఠనాధుని సహస్రనామములను అనుసంధానము చేయుటయో లేక మేఘములతో ఆవరింపబడిన తోటలుగల తిరుమంగై దేశమునకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్, ” తారా ” పక్షలచే నిండిన పొలములతో చుట్టుకొనియున్న శ్రీసాలగ్రామ దివ్య దేశములో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై అనుగ్రహించిన తమిళ భాషలోనున్న ఈ పాశురముల మాలను క్రమములేకనే నోటికి వచ్చిన విధముగ పాడుటయో, చేసినచో ఇష్టసిద్ధి ప్రాప్తి కలుగును.

*********

వ్యాఖ్యానించండి