శ్రీః
6. వాణిలాముఱువల్
నైమిశారణియందు కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని దివ్య చరణములను , శ్రీదేవి సమక్షమున,ఆశ్రయించి, స్వనైచ్యసంధానము చేయుచు తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** వాణిలా ముఱువల్ శిఱునుదల్ పెరున్దోల్, మాతరార్ వనములైప్పయనే
పేణినేన్, అదనై ప్పిழయెన క్కరుది, ప్పేదైయేన్ పిఱవినోయ్ అఱుప్పాన్ ,
ఏణిలేన్ ఇరున్దేన్ ఎణ్ణినేన్ ఎణ్ణి, ఇళైయవర్ కలవియన్ తిఱత్తై,
నాణినేన్ వన్దు ఉన్ తిరువడి యడైన్దేన్, నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ ll 998
నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ = నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!; పేదైయేన్ = జ్ఞానము లేని దాసుడైన నేను; వాళ్ నిలా ముఱువల్ = కాంతులు వెదజల్లు చిరునవ్వును; శిరు నుదల్ = చిన్న నుదురును; పెరు తోళ్ = పెద్ద భుజములుగల; మాదరార్ = స్త్రీలయొక్క; వనమ్ ములైయే = అందమైన స్తనములనే; పయన = పరమ పురుషార్ధముమని; పేణినేన్ = (చాల కాలము వరకు) నేను ఆదరించుచుంటిని; అదనై = అటువంటి ఆదరించెడి స్వభావమును; పిழ ఎన కరుది = తప్పుయని ఎంచి; పిఱవి నోయ్ అఱుప్పాన్ ఏణిలేన్ ఇరున్దేన్ = ఈ సంసార వ్యాధిని పోగొట్టుకొనుటకై మునపు తలచకయే నుంటిని; ఎణ్ణినేన్ = నేను నాయొక్క స్వరూపమును పరిశీలింప మొదలెడితిని; ఎణ్ణి =ఆ విధముగ పరిశీలించుకొని; ఇళైయవర్ కలవియన్ తిఱత్తై = యౌవనమైన స్త్రీల సంభోగ విషయమైగల భావనకు; నాణినేన్ = నేను చాల సిగ్గుపడుచున్నాను; ఉన్ తిరువడి వన్దు అడైన్దేన్=నీయొక్క దివ్యచరణములచెంత చేరి శరణుజొచ్చుచున్నాను.
నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ! జ్ఞానము లేని దాసుడైన నేను కాంతులు వెదజల్లు చిరునవ్వును,ముఖ సౌందర్యమును,పెద్ద భుజములును కలిగిన స్త్రీలయొక్క అందమైన స్తనములనే పరమ పురుషార్ధముమని చాల కాలము వరకు నేను ఆదరించుచుంటిని. అటువంటి ఆదరించెడి స్వభావమును తప్పు యని తలచి ఈ సంసార వ్యాధిని పోగొట్టుకొనుటకై మునుపు తలచకయే నుంటిని. అట్టి నేను నీయొక్క నిర్హేతుకకృపచే నాయొక్క స్వరూపమును పరిశీలింప మొదలెడితిని. ఆ పరిశీలనములో నాకుగల యౌవనమైన కాంతల సంభోగమే పరమ పురుషార్ధముమను భావనకు మిక్కిలి సిగ్గుపడుచున్నాను. అట్టి నేను నీయొక్క దివ్యచరణముల చెంత చేరి శరణుజొచ్చుచున్నాను.
శిలమ్బు అడియురువిల్ కరునెడుమ్ కణ్ణార్, తిఱత్తనాయ్ అఱత్తైయే మఱన్దు,
పులమ్ పడిన్దు ఉణ్ణుమ్ పోకమే పెరుక్కి, ప్పోక్కినేన్ పొழுదినై వాళా,
అలమ్బురి తడక్కై ఆయనే మాయా, వానవర్కరశనే, వానోర్
నలమ్పురిన్దు ఇఱైఞ్జుమ్ తిరువడి యడైన్దేన్, నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ ll 999
శిలమ్బు అడి ఉరువిల్ = పాదములందు అందెలతో అలంకరించుకొనినవారును; కరు నెడుమ్ కణ్ణార్ తిఱత్తనాయ్=నల్లని విశాలమైన నేత్రములుగలవారును అయిన స్త్రీలయందు మిక్కిలి ఆశక్తుడునై; అఱత్తైయే మఱన్దు = ధర్మస్వరూపుడైన నిన్ను కొంచెమైనను తలచక; పులన్ పడిన్దు ఉణ్ణుమ్ పోకమే పెరుక్కి=ఇంద్రియములు దృఢముగ, కోరికతో అనుభవించెడి సుఖములనే పెంచుకొనుచు; పొழுదినై వాళా పోక్కినేన్=కాలమంతయు వృధా చేసి గడిపితిని; అలమ్ పురి తడ క్కై= చాలు చాలని చెప్పబడునట్లు ఒసగెడి మిక్కిలి ఉదారమైన దివ్యహస్తముగల; ఆయనే = గోపాల కృష్ణుడా!; మాయా = ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడా!; వానవర్కు అరశనే = దేవాదిదేవుడా!; నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ = నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!; వానోర్ = నిత్యశూరులు; నలమ్ పురిన్దు=అతిశయించిన ప్రేమ కలిగి; ఇఱైఞ్జుమ్=సేవించుకొనెడి; తిరువడి యడైన్దేన్ = నీయొక్క దివ్యచరణములు శరణుజొచ్చుచున్నాను.
అందముగ అందెలు తమ పాదములందు ఒప్పు, విశాలమైన నేత్రములుగల కాంతలయందు మిక్కిలి ఆశక్తుడునై,ధర్మస్వరూపుడైన నిన్ను తలచక ఇంద్రియములు దృఢముగ, కోరికతో అనుభవించెడి సుఖములనే పెంచుకొనుచు కాలమంతయు వృధా చేసి గడిపితిని. సమస్త జనులకోరికలను ఉదారముగ తీర్చు దివ్య హస్తముగల గోపాల కృష్ణుడా!,ఆశ్చర్యకరమైన చేష్టితములు కలవాడా!, దేవాదిదేవుడా!, నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!, నిత్యశూరులు మిక్కిలి ప్రేమతో సేవించుకొనెడి నీయొక్క దివ్యచరణములను శరణుజొచ్చుచున్నాను.
శూదినై ప్పెరుక్కి క్కళవినై త్తుణిన్దు, శురికుழల్ మడందైయర్ తిఱత్తు,
కాదలే మిగుత్తు కణ్డవా తిరిన్ద తొణ్డనేన్, నమన్ తమర్ శెయ్యుమ్,
వేదనైక్కు ఒడుఙ్గి నడుఙ్గినేన్, వేలై వెణ్డిరై యలమర క్కడైన్ద ,
నాదనే! వన్దు ఉన్ తిరువడి యడైన్దేన్, నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ ll 1000
వేలై = పాల సముద్రమందలి; వెణ్ తిరై = తెల్లని అలలు; అలమర = కలతచెందునట్లు; కడైన్ద = (దేవతల కొఱకు)చిలికిన; నాదనే = ఓ! ప్రభువా!; నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ = నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!; శూదినై పెరుక్కి = జూదములను అధికముగ ఆడుచును; కళవినై త్తుణిన్దు = దొంగతనమును నమ్ముకొనియు; శురికుழల్ మడందైయర్ తిఱత్తు = గిరిజాల కుంతలములుగల స్త్రీల విషయమందు; కాదలే మిగుత్తు = అధికమైన ఆశతో; కణ్డవా తిరిన్ద తొణ్డనేన్ = కంటికి కనిపించిన ప్రదేశములందంతటను సంచరించి వారికి సేవచేసిన నేను; నమన్ తమర్ శెయ్యుమ్ = యమదూతలు చేయబోయెడి; వేదనైక్కు = భయంకరమైన బాధలకు; ఒడుఙ్గి నడుఙ్గినేన్ = శరీరము తపించి నీరసించి వణుకుచున్న నేను; ఉన్ తిరువడి వన్దు అడైన్దేన్=నీయొక్క దివ్యచరణములచెంత చేరి శరణుజొచ్చుచున్నాను.
దేవతల కొఱకు పాలసముద్రమందు తెల్లని అలలు కలతచెందునట్లు చిలికిన ఓ! ప్రభువా!,నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!, జూదములను అధికముగ ఆడుచును, దొంగతనమును నమ్ముకొనియు,మరియు గిరిజాల కుంతలములుగల స్త్రీల విషయమందు మిక్కిలి ఆశతో కంటికి కనిపించిన ప్రదేశములందంతటను సంచరించి వారికి సేవచేసిన నేను, యమదూతలు చేయబోయెడి భయంకరమైన బాధలకు శరీరము తపించి నీరసించి వణుకుచున్న నేను, నీయొక్క దివ్యచరణములచెంత చేరి శరణుజొచ్చుచున్నాను.
వమ్బులామ్ కూన్దల్ మనైవియై త్తుఱన్దు, పిఱర్ పొరుళ్ తారమెన్ఱు ఇవర్ట్రై,
నమ్బినార్ ఇఱన్దాల్ నమన్ తమర్ పర్ట్రి, యెర్ట్రివైత్తు, ఎరియెழுకిన్ఱ
శెమ్బినాల్ ఇయన్ఱ పావైయై, పావీ! తழுవెన మొழிవదఱ్కఞ్జి,
నమ్బనే వన్దు ఉన్ తిరువడి యడైన్దేన్, నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ ll 1001
వమ్బు ఉలామ్ కూన్దల్ = పరిమళము వీచెడి కుంతలములుగల; మనైవియై = వివాహిత భార్యను; తుఱన్దు = విడిచిపెట్టి; పిఱర్ పొరుళ్ తారమ్ ఎన్ఱు ఇవర్ట్రై =ఇతరుల ధనము, ఇతరుల భార్యలు అను చెప్పబడు వీనిని; నమ్బినార్=ఆశించినవారు; ఇఱన్దాల్ = చనిపోయినపుడు; నమన్ తమర్ = యమబటులు; పర్ట్రి=వారిని పట్టుకొని; ఎర్ట్రి = హింసపెట్టి; వైత్తు=ఒకచోట ఉంచి; శెమ్బినాల్ ఇయన్ఱ ఎరియెழுకిన్ఱ పావైయై= రాగిచే చేయబడి మిక్కిలి కాల్చబడుటచే నిప్పురవ్వలు జల్లెడు స్త్రీయొక్కప్రతిమను (ఎదుటపెట్టి), పావీ! =”మహాపాపములు చేసి ఇచటకు చేరిన పాపాత్ముడా!”;తழுవు = కౌగిలించుకో; ఎన మొழிవదఱ్కు అఞ్జి = అని చెప్పబడు పలుకులకు బయపడిన నేను; నమ్బనే = ఆశ్రితులచే నమ్మబడువాడా!; నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ = నైమిశారణ్యం దివ్య దేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!; ఉన్ తిరువడి వన్దు అడైన్దేన్ = నీయొక్క దివ్యచరణములచెంత చేరి శరణుజొచ్చుచున్నాను.
పరిమళభరితమైన కుంతలములుగల అగ్నిసాక్షిగ వివాహమాడిన తమ భార్యను విడిచిపెట్టి, ఇతరుల ధనము, ఇతరుల భార్యలు ఆశించినవారిని, చనిపోయినపుడు,యమబటులు అట్టివారిని పట్టుకొని, హింసపెట్టి, నిప్పురవ్వలు జల్లునట్లు బాగుగ కాల్చిన రాగిచే చేయబడిన స్త్రీయొక్కప్రతిమను ఎదుటపెట్టి “మహాపాపములు చేసి ఇచటకు చేరిన పాపాత్ముడా!” ఈ ప్రతిమను కౌగిలించుకోమని చెప్పబడు పలుకులకు బయపడిన నేను, నీవే రక్షకుడని నమ్ముకొని, ఆశ్రయింపదగినట్లు నైమిశారణ్యం దివ్య దేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!, నీయొక్క దివ్యచరణముల చెంత చేరి శరణుజొచ్చుచున్నాను.
ఇడుమ్బైయాల్ అడర్పుణ్డు ఇడుమినో తుర్ట్రెన్ఱు, ఇరన్దవర్కు ఇల్లైయేయెన్ఱు,
నెడుఞ్జొలాల్ మఱుత్త నీశనేన్ అన్దో, నినైక్కిలేన్ వినైప్పయన్ తన్నై ,
కడుఞ్జొలార్ కడియార్ కాలనార్ తమరాల్, పడువదోర్ కొడుమిఱైక్కఞ్జి,
నడుఙ్గి నాన్ వన్దు ఉన్ తిరువడి యడైన్దేన్, నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ ll 1002
ఇడుమ్బైయాల్= దారిద్ర్యముచే; అడర్పుణ్డు = మిక్కిలి కష్టములుకలిగి; ఓ తుర్ట్రు ఇడుమిన్ ఎన్ఱు ఇరన్దవర్కు = ” అయ్యో! అని బాధపడుచు, కొంచెము కబళము పెట్టమని ” బిక్ష అడుగువారికి; ఇల్లైయే ఎన్ఱు = లేదు లేదని;నెడుమ్ శొలాల్=మిక్కిలి కఠినమైన మాటలచే; మఱుత్త = తిరస్కరించిన; నీశనేన్ నాన్ = నీచుడైన నేను; అన్దో=అయ్యయ్యో!; వినై పయన్ తన్నై నినైక్కిలేన్ = పాపములకు కలిగెడి ప్రతిఫలమును మనస్సులో తలచకనుంటిని; కడు శొలార్ కడియార్ కాలనార్ తమరాల్ పడువదు ఓర్ కొడుమిఱైక్కు అఞ్జి నడుఙ్గి = క్రూరమైన మాటలగలవారును, క్రూరమైన చేష్టలు గలవారును అయిన యమబటులచే కలుగజేసెడి కఠినమైన హింసలను తలచుకొని భయముతో వణుకుచు; నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ = నైమిశారణ్యం దివ్య దేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!; ఉన్ తిరువడి వన్దు అడైన్దేన్ = నీయొక్క దివ్య చరణముల చెంతచేరి శరణుజొచ్చుచున్నాను.
దారిద్ర్యముచే మిక్కిలి బాధపడుచు కొంచెము కబళము పెట్టమని బిక్ష అడుగువారికి, లేదు లేదని కఠినమైన మాటలచే తిరస్కరించిన నీచుడైన నేను, పాపములకు కలిగెడి ప్రతిఫలమును మనస్సులో తలచకనుంటిని. క్రూరమైన మాటలు, క్రూరమైన చేష్టలుగల యమబటులు కలుగజేసెడి కఠినమైన హింసలను తలచుకొని భయముతో వణుకుచు, నైమిశారణ్యం దివ్య దేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!, నీయొక్క దివ్యచరణములచెంత చేరి శరణుజొచ్చుచున్నాను.
కోడియ మనత్తాల్ శినత్తొழிల్ పురిన్దు, తిరిన్దు నాయినత్తొడుమ్ తిళైత్తిట్టు,
ఓడియుమ్ ఉழన్ఱుమ్ ఉయిర్ గళే కొన్ఱేన్, ఉణర్విలేన్ ఆదలాల్, నమనార్
పాడియై ప్పెరితుమ్ పరిశు అழிత్తిట్టేన్, పరమనే పాఱ్కడల్ కిడన్దాయ్ ,
నాడి నాన్ వన్దు ఉన్ తిరువడి యడైన్దేన్, నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ ll 1003
పరమనే = పురుషోత్తముడా!; పాற் కడల్ కిడన్దాయ్ = పాలకడలిలో పవళించియున్నవాడా!; నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ = నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!; కోడియ మనత్తాల్ = వక్రించిన మనస్తత్వముతో; శినమ్ త్తొழிల్ పురిన్దు = ఇతరులకు విరోధకరమైన పనులు చేయుచు; నాయ్ ఇనత్తొడుమ్ తిరిన్దు తిళైత్తిట్టు = శునకములు మొదలగు దుష్టజంతువుల వెనుకపోయి వేటాడి మిక్కిలి సంతోషించుచు; ఓడియుమ్ ఉழన్ఱుమ్ = ఇచట అచట పరిగెడుతూ, తిరుగుచు నుండు; ఉయిర్ గళే కొన్ఱేన్ = ప్రాణులను హింసించుచుంటిని; ఉణర్వు ఇలేన్ నాన్ = వివేకశూన్యుడైన నేను; నాడి= పరిశీలనచేసుకొని;ఉన్ తిరువడి వన్దు అడైన్దేన్ = నీయొక్క దివ్య చరణములచెంత చేరి శరణుజొచ్చి ఉజ్జీవించితిని; ఆదలాల్ = ఆ కారణముచే; నమనార్ పాడియై ప్పెరితుమ్ పరిశు అழிత్తిట్టేన్ = యమలోకమును పొందెడి పరిస్థితిని సంపూర్ణముగ నశింపజేసుకొంటిని.
పురుషోత్తముడా!, పాలకడలిలోపవళించియున్నవాడా!,నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!, వక్రించిన మనస్తత్వముతో ఇతరులకు విరోధకరమైన పనులు చేయుచు, శునకములు మొదలగు జంతువులను వేటాడి మిక్కిలి సంతోషించుచు,ఇచట అచట పరిగెడుతూ, తిరుగుచు నుండు ప్రాణులను హింసించుచుంటిని. అట్టి వివేకశూన్యుడైన నేను, పరిశీలనచేసి కొని, నీయొక్క దివ్య చరణములచెంత చేరి శరణుజొచ్చి ఉజ్జీవించితిని. ఆ కారణముచే యమలోకమును పొందెడి పరిస్థితిని సంపూర్ణముగ నశింపజేసుకొంటిని.
నెఞ్జినాల్ నినైన్దుమ్ వాయినాల్ మొழிన్దుమ్, నీతియల్లాదన శెయ్ దుమ్,
తుఞ్జినార్ శెల్లుమ్ తొన్నెఱికేట్టే, తుళఙ్గినేన్ విళఙ్గని మునిన్దాయ్,
వఞ్జనేన్ అడియేన్ నెఞ్జినిల్ పిఱియా, వానవా! దానవర్కెన్ఱుమ్
నఞ్జనే!, వన్దు ఉన్ తిరువడి యడైన్దేన్, నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ ll 1004
విళఙ్గని మునిన్దాయ్ = వెలగపండురూపములోనున్న కపిత్థాసురునిపై కోపగించి వధించినవాడా!; వఞ్జనేన్ అడియేన్ నెఞ్జినిల్ పిఱియా వానవా = మోసపూరితుడైన దాసుని హృదయమందు వేంచేసి వీడని నిత్యశూరుల నిర్వాకుడా!; దానవర్కు ఎన్ఱుమ్ నఞ్జనే = అసురులకు ఎల్లప్పుడును మృత్యువుగనుండువాడా!; నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ = నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ!; నీతియల్లాదన=శాస్త్రములచే నిషేధింపబడిన చర్యలను; నెఞ్జినాల్ నినైన్దుమ్ = మనస్సుతో తలచియు; (మరియు), వాయినాల్ మొழிన్దుమ్ = నోటితో మాటలాడియు; (మరియు) శెయ్ దుమ్ = ఆచరించియు; తుఞ్జినార్=నశించినవారు; శెల్లుమ్ తొల్ నెఱి = పోయెడు పురాతనమైన నరకమార్గమును; కేట్టే = (విద్వాంసులు చెప్పగ) వినినంత మాత్రములోనే; తుళఙ్గినేన్ = వణుకుచున్న నేను; ఉన్ తిరువడి వన్దు అడైన్దేన్ = నీయొక్క దివ్య చరణములచెంత చేరి శరణుజొచ్చి ఉజ్జీవించితిని .
వెలగపండురూపములోనున్న కపిత్థాసురునిపై కోపగించి వధించినవాడా!,మోసపూరితుడైన దాసుని హృదయమందు వేంచేసి వీడని నిత్యశూరుల నిర్వాకుడా!, అసురులకు ఎల్లప్పుడును మృత్యువుగనుండువాడా!, నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసిన నాస్వామీ!,శాస్త్రములచే నిషేధింపబడిన చర్యలను మనస్సుతో తలచియు మరియు నోటితో మాటలాడియు మరియు ఆచరించియు నశించినవారు పోవు నరకమార్గమును విద్వాంసులు చెప్పగ వినినంత మాత్రములోనే వణుకుచున్న నేను, నీయొక్క దివ్య చరణములచెంత చేరి శరణుజొచ్చి ఉజ్జీవించితిని .
ఏవినార్ కలియార్ నలిగ ఎన్ఱు; ఎన్మేల్ ఎఙ్గనే వాழுమాఱు, ఐవర్
కోవినార్ శెయ్యుమ్ కొడుమైయై మడిత్తేన్, కుఱుఙ్గుడి నెడుఙ్గడల్వణ్ణా,
పావిన్ ఆర్ ఇన్ శొల్ పల్ మలర్ కొణ్డు, ఉన్ పాదమే పరవి నాన్ పణిన్దు,ఎన్
నావినాల్ వన్దు ఉన్ తిరువడి యడైన్దేన్, నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ ll 1005
కుఱుఙ్గుడి = తిరుకురుఙ్గుడి దివ్యదేశములో కృపతోవేంచేసిన; నెడుమ్ కడల్ వణ్ణా= పెద్ద సముద్రమువంటి వర్ణము కలిగినవాడా!; నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ = నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!; కలియార్ = కలిపురుషుడను గొప్పప్రభువు; నలిగ ఎన్ఱు = “ఈ తిరుమంగై ప్రభువును హింసింపజేయుడు” అని; ఎన్ మేల్ = నామీద; ఐవర్ ఏవినార్= పంచేంద్రియములను నియమించిరి; ఎఙ్గనే వాழுమ్ ఆఱు = ఆ కలిపురుషుడు ఏవిధముగ సుఖించెదడు?; (ఏలననగ), నాన్ = దాసుడైన నేను; కోవినార్ శెయ్యుమ్ కొడుమైయై మడిత్తేన్ = మిక్కిలి వంచించు ఇంద్రయములు చేయు దుష్కుత్యములను బహిష్కరించితిని; (అదెట్లనగ) ఎన్ నావినాల్ = నాయొక్క నాలుకతో; పావిన్ ఆర్ ఇన్ శొల్ పల్ మలర్ కొణ్డు = మంచి లయబద్ధముతో నిండిన ఇంపైన పదముల పెక్కు పుష్పములను సమకూర్చి; ఉన్ పాదమే పరవి = నీయొక్క దివ్యచరణములనే స్తుతించి; పణిన్దు = సాష్టాంగముగసేవించి; ఉన్ తిరువడి వన్దు అడైన్దేన్ = నీయొక్క దివ్య చరణములచెంత చేరి శరణుజొచ్చి ఉజ్జీవించితిని .
తిరుకురుఙ్గుడి దివ్యదేశములో కృపతోవేంచేసిన,విశాలమైనట్టియు, అగాధమైనట్టియు సముద్రమువంటి వర్ణము కలిగినవాడా!, నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!, కలిపురుషుడను గొప్పప్రభువు (తిరుమంగై ఆళ్వార్ మిక్కిలి కోపావేశముతో ఉద్దేశించినది) తన ప్రభావముతో “ఈ తిరుమంగై ప్రభువును హింసింపజేయుడు” అని నామీద పంచేంద్రియములను నియమించెను. ఆ కలిపురుషుడు ఏవిధముగ సుఖించెదడు? ఏలననగ , మిక్కిలి వంచించు ఇంద్రియములు చేయు దుష్కుత్యములను బహిష్కరించితిని. అదెట్లనగ దాసుడైన నేను, నాయొక్క నాలుకతో మంచి లయబద్ధముతో నిండిన ఇంపైన పదముల పెక్కు పుష్పములను సమకూర్చి, నీయొక్క దివ్యచరణములనే స్తుతించి, సాష్టాంగముగసేవించి, నీయొక్క దివ్య చరణములచెంత చేరి శరణుజొచ్చి ఉజ్జీవించితిని.(ఈ విధముగ కలిపురుషునిపై విజయమును పొందితినని ఆళ్వారులు వెలిబుచ్చుచున్నారు)
ఊనిడైచ్చువర్ వైత్తు ఎన్బుతూణ్ నాట్టి, ఉరోమమ్ మేయ్ న్దు ఒన్బదువాశల్,
తానుడై కురుమ్బై ప్పిరియుమ్బోదు, ఉన్ఱన్ శరణమే శరణమెన్ఱిరున్దేన్,
తేనుడై క్కమలత్తిరువినుక్కరశే, తిరైకొళ్ మానెడుఙ్గడల్ కిడన్దాయ్ ,
నానుడై తవత్తాల్ తిరువడి యడైన్దేన్, నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ ll 1006
తేనుడై కమలమ్ తిరువినుక్కు అరశే = తేనెతో నిండిన కమలమునందు వసించెడి శ్రీమహాలక్ష్మికి పతియైనవాడా!; తిరైకొళ్ మానెడు కడల్ కిడన్దాయ్ = అలలతో నిండిన పెద్ద పాలసముద్రమందు పవళించియున్నవాడా!; నైమిశారణియత్తుళ్ ఎన్దాయ్ = నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!; ఊన్=మాంసమును; ఇడై శువర్ వైత్తు = మధ్యలో గోడగచేసి; ఎన్బు = ఎముకలను; తూణ్ నాట్టి = స్తంబములగ పెట్టి; ఉరోమమ్ మేయ్ న్దు=రోమములతో కప్పియున్న; ఒన్బదువాశల్ తాన్ ఉడై=నవద్వారములు కలిగిన; కురుమ్బై=గుడిసె పోలిన ఈ శరీరమును;పిరియుమ్ పోదు=విడుచు సమయమున; ఉన్ఱన్ శరణమే = నీయొక్క దివ్యచరణములే; శరణమ్ ఎన్ఱు ఇరున్దేన్ = రక్షకములగ ఉండవలెనని నేను తలచుచుంటిని; నానుడై తవత్తాల్ తిరువడి అడైన్దేన్ = (ఇప్పుడు) నాయొక్క మహాభాగ్యముచే నీయొక్క దివ్య చరణములచెంత చేరి శరణుజొచ్చుతిని.
కమలవాసినికి పతియైనవాడా!, పాలసముద్రమందు పవళించియున్నవాడా!; నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న నాస్వామీ!; మాంసమును మధ్యలో గోడగచేసి ఎముకలను స్తంబములగ పెట్టి రోమములతో కప్పియున్న ,నవద్వారములు కలిగిన గుడిసె పోలిన ఈ శరీరమును విడుచు అంతిమ సమయమున నీయొక్క దివ్యచరణములే రక్షకములగ ఉండవలెనని నేను తలచుచుంటిని. ఇపుడు నాయొక్క మహాభాగ్యముచే నీయొక్క దివ్య చరణములచెంత చేరి శరణుజొచ్చుతిని.
** ఏదమ్ వన్దు అణుగా వణ్ణ నామెణ్ణి, యెழுమినో తొழுదుమెన్ఱు, ఇమైయోర్
నాదన్ వన్దు ఇఱైఞ్జుమ్, నైమిశారణియత్తైందైయై చ్చిందైయుళ్ వైత్తు,
క్కాదలే మిగుత్త క్కలియన్ వాయొలిశెయ్, మాలైతామ్ కర్ట్రువల్లార్ గళ్,
ఓదనీర్ వైయగమాణ్డు వెణ్ కుడైక్కీழ், ఉన్బరుమాగువర్ తామే ll 1007
ఏదమ్ వన్దు అణుగా వణ్ణమ్ = దుఃఖములు మనయొక్క సమీపమునకు చేరని విధానమును; నామ్ ఎణ్ణి = మనము ఆలోచనచేసుకొని; తొழுదుమ్ ఎழுమిన్ ఎన్ఱు = ( నైమిశారణ్యం దివ్యదేశమునకు వెడలి)” సేవించుకొందుము లేచి రండి ” అనిచెప్పుచు; ఇమైయోర్ నాదన్ వన్దు ఇఱైఞ్జుమ్ = (దేవతల సమూహములతో) ఇంద్రుడు వచ్చి ఆశ్రయించుచుండెడి; నైమిశారణియత్తు ఎందైయై = నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుని;శిందైయుళ్ వైత్తు=హృదయమందు ధ్యానించి; కాదలే మిగుత్త=మిక్కిలి భగవద్భక్తి కలిగిన;కలియన్=తిరుమంగై ఆళ్వార్;వాయ్ ఒలిశెయ్ మాలైతామ్ = అనుగ్రహించిన సూక్తులమాలను; కర్ట్రువల్లార్ గళ్ తామ్ = అభ్యసించి స్తుతించువారు; ఓదమ్ నీర్ వైయగమ్=సముద్రముచే చుట్టుకొనియున్న ఈ భూమండలమును; వెణ్ కుడైక్కీழ் ఆణ్డు = తెల్లని ఛత్రముక్రింద వేంచేసి మహారాజుగ పరిపాలనచేసిన పిదప; ఉన్బరుమ్ ఆగువర్ = నిత్యశూరులతో చేరుదురు.
“దుఃఖములు మనయొక్క సమీపమునకు చేరకుండుటకై మనము నైమిశారణ్యం దివ్యదేశమునకు వెడలి సేవించుకొందుము లేచి రండి” అనిచెప్పుచు దేవతల సమూహములతో ఇంద్రుడువచ్చి ఆశ్రయించుచుండెడి నైమిశారణ్యం దివ్యదేశములో కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుని, హృదయమందు ధ్యానించి, మిక్కిలి భగవద్భక్తి కలిగిన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తులమాలను అభ్యసించి స్తుతించువారు సముద్రముచే చుట్టుకొనియున్న ఈ భూమండలమును తెల్లని ఛత్రముక్రింద వేంచేసి మహారాజుగ పరిపాలించిన పిదప నిత్యశూరులతో చేరుదురు.
*******************