శ్రీః
7 . అఙ్గణ్ ఞాలమ్
హిరణ్యాసురుని వధించి ప్రహ్లాదుని సంరక్షించినటువంటి దివ్యదేశమైన శిఙ్గవేళ్ కున్ఱమందు (అహోబిలక్షేత్రమునందు) అవతరించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** అఙ్గణ్ ఞాలమ్ మఞ్జ, అఙ్గోర్ ఆళరియాయ్, అవుణన్
పొఙ్గ ఆగమ్ వళ్ళుగిరాల్, పోழ்న్ద పునిదనిడమ్ ,
పైఙ్గణ్ ఆనై కొమ్బుకొణ్డు, పత్తిమైయాల్, అడి క్కీழ்
శెఙ్గణ్ ఆళి యిట్టిఱైఞ్జుమ్, శిఙ్గవేழ் కున్ఱమే ll 1008
అఙ్గు = (విష్ణువు కలడని ప్రహ్లాదుడు శపధము చేసిన) స్థలములోనే; అమ్ కణ్ ఞాలమ్ అఞ్జ= అందముగానున్న విశాలమైన భూమండలమందుగల వారందరు భయపడునట్లు;ఓర్ ఆళ్ అరియాయ్ = సాటిలేని నరసంహరూపముదాల్చి (సర్వేశ్వరుడు అవతరించుటను గాంచి) అవుణన్ పొఙ్గ = హిరణ్యాసురుడు విజృంభించగ; ఆగమ్ = అతనియొక్క శరీరమును; వళ్ ఉగిరాల్ = వాడియైన నఖములచే; పోழ்న్ద = చీల్చి పారవైచిన; పునిదన్ ఇడమ్ = పరమ పవిత్రుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశము; (ఏదనగ) శెమ్ కణ్ ఆళి = (కోపముతో) ఎఱ్ఱని నేత్రములుగల సింహములు; పైమ్ కణ్ ఆనై కొమ్బుకొణ్డు = పచ్చని కన్నులు కలిగిన ఏనుగుల దంతములను తెచ్చి; పత్తిమైయాల్ = భక్తితో; అడి క్కీழ்=సర్వేశ్వరుని దివ్య పాదములందు; ఇట్టు=సమర్పించి; ఇఱైఞ్జుమ్ = సేవించుకొనెడి; శిఙ్గవేழ் కున్ఱమే= ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
హిరణ్యాసురుడు శ్రీమన్నారాయణుని ఉనికిని ప్రశ్నించగ విష్ణువు కలడని ప్రహ్లాదుడు శపధము చేసిన స్థలములోనే విశాలమైన భూమండలమందుగల వారందరు భయపడునట్లు అద్వితీయమైన నరసంహరూపముదాల్చి సర్వేశ్వరుడు అవతరించుటను గాంచి హిరణ్యాసురుడు విజృంభించగ, అతనియొక్క శరీరమును తన వాడియైన నఖములచే చీల్చి పారవైచిన పరమ పవిత్రుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము ఏదనగ కోపముతో ఎఱుపెక్కిన నేత్రములుగల సింహములు, పచ్చని కన్నులు కలిగిన ఏనుగుల దంతములను తెచ్చి భక్తితో సమర్పించి సేవించుకొనెడి ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
అలైత్త పేழ்వాయ్, వాళెయెయిర్ట్రు ఓర్ కోళరియాయ్, అవుణన్
కొలై క్కైయాళన్ నెఞ్జిడన్ద, కూర్ ఉగిరాళనిడమ్ ,
మలైత్త శెల్ శాత్తు ఎఱిన్దపూశల్, వన్ తుడివాయ్ కడుప్ప,
శిలైక్కైవేడర్ తెழிప్పఱాద, శిఙ్గవేழ் కున్ఱమే ll 1009
అలైత్త పేழ்వాయ్ = (కోపముతో ) ఆడుచున్న నాలుకతో పెద్ద నోరును; వాళ్ ఎయిర్ట్రు=ప్రకాశించు దంతములుగల; ఓర్ కోళ్ అరియాయ్ = సాటిలేని బలముగల నరసింహ రూపముదాల్చి; కొలై కైయాళన్ నెఞ్జు ఇడన్ద = జీవహింస చేయు హస్తములుగల హిరణ్యాసురునియొక్క వక్షస్థలమును చీల్చి పారవైచిన; కూర్ ఉగిరాళన్ ఇడమ్ =వాడియైన నఖములుగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశము; (ఏదనగ ), మలైత్త = (వేటగాండ్రచే) ఆక్రమింపబడి; శెల్ శాత్తు = తీర్థయాత్రలో దారినపోవు జనసమూహములతో; ఎఱిన్ద = అడ్డుకొని చేయబడిన; పూశల్ = పోరాటములయందు; వల్ తుడివాయ్ కడుప్ప = కర్ణకఠోరమైన ధ్వనిగల డప్పులు మ్రోగించుచు; శిలై కైవేడర్ =విల్లును చేతులయందు కలిగిన వేటగాండ్రయొక్క; తెழிప్పు= పెద్ద కోలాహలము; అఱాద = ఎడతెగక జరుగుచుండెడి; శిఙ్గవేழ் కున్ఱమే = ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
కోపముతో ఆడుచున్న నాలుకతో పెద్ద నోరును,ప్రకాశించు దంతములుగల సాటిలేని బలముగల నరసింహ రూపముదాల్చి, ప్రాణులను సంహరించెడి సహజ స్వభావముగలవాడైన హిరణ్యాసురునియొక్క వక్షస్థలమును చీల్చి పారవైచిన, వాడియైన నఖములుగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశము ఏదనగ వేటగాండ్రచే ఆక్రమింపబడి, తీర్థయాత్రలో దారినపోవు జనసమూహములను అడ్డుకొని చేయబడిన పోరాటములయందు, కర్ణకఠోరమైన ధ్వనిగల డప్పులు మ్రోగించుచు విల్లును చేతులయందు కలిగిన వేటగాండ్రయొక్క పెద్ద కోలాహలము ఎడతెగక జరుగుచుండెడి ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
ఏయ్ న్ద పేழ்వాయ్,వాళ్ ఎయిర్ట్రు ఓర్ కోళరియాయ్, అవుణన్
వాయ్ న్ద ఆగమ్ వళ్ళుగిరాల్, వకిర్ న్ద అమ్మానదిడమ్ ,
ఓయ్ న్ద మావుమ్ ఉడైన్ద కున్ఱుమ్, అన్ఱియుమ్ నిన్ఱు అழలాల్,
తేయ్ న్ద వేయుమ్ అల్లదిల్లా, శిఙ్గవేழ் కున్ఱమే ll 1010
ఏయ్ న్ద పేழ்వాయ్ = (రూపమునకు) తగినట్లు పెద్ద నోరును; వాళ్ ఎయిర్ట్రు = కత్తి పోలిన దంతములుగల; ఓర్ కోళరియాయ్ = సాటిలేని బలముగల నరసింహ రూపముదాల్చి; అవుణన్ = హిరణ్యాసురునియొక్క; వాయ్ న్ద ఆగమ్ = మిక్కిలి బలిసి పెరిగిన శరీరమును; వళ్ ఉగిరాల్ =వాడియైన నఖములచే; వకిర్ న్ద=చీల్చి పారవైచిన; అమ్మానదు ఇడమ్ = స్వామి సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశము; (ఏదనగ) ఓయ్ న్ద మావుమ్= బంజరు భూమిలో అటు ఇటు తిరుగుచు అలసిపోయిన జంతువులును; ఉడైన్ద కున్ఱుమ్=వేడిమికి పగిలిపోయిన చిన్న కొండలును; అన్ఱియుమ్= మఱియు; నిన్ఱు అழలాల్ తేయ్ న్ద వేయుమ్ = అచట రగులుచుండెడి నిప్పుచే సగము కాలిపోయిన వెదుళ్ళ మొక్కలును; అల్లదు ఇల్లా=ఇవి తప్ప వేరు ఏమియు లేనటువంటి; శిఙ్గవేழ் కున్ఱమే = ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
రూపమునకు తగినట్లు పెద్ద నోరును, కత్తి పోలిన దంతములుగల సాటిలేని బలముగల నరసింహ రూపముదాల్చి,హిరణ్యాసురునియొక్క మిక్కిలి బలిసి పెరిగిన శరీరమును అతి సునాయసముగ చీల్చి పారవైచిన స్వామి సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశము ఏదనగ బంజరు భూమిలో అటు ఇటు తిరుగుచు అలసిపోయిన కొన్ని జంతువులు, వేడిమికి పగిలిపోయిన చిన్న కొండలు, అచట రగులుచుండెడి నిప్పుచే సగము కాలిపోయిన వెదుళ్ళ మొక్కలు వదలి వేరు ఏమియు లేనటువంటి ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
ఎవ్వమ్ వెవ్వేల్ పొన్ పెయరోన్, ఏతలన్ ఇన్నుయిరై
వవ్వి, ఆగమ్ వళ్ళుగిరాల్, వకిర్ న్ద అమ్మానదిడమ్ ,
కవ్వునాయుమ్ కழுగుమ్, ఉచ్చిప్పోదుడు కాల్ శుழన్ఱు,
తెయ్ వమల్లాల్ శెల్లవొణ్ణా, శిఙ్గవేழ் కున్ఱమే ll 1011
ఎవ్వమ్ వెమ్ వేల్ = దుఃఖమును కలుగజేయు తీక్షణమైన శూలాయుధము కలిగిన; ఏదలన్ = భగవంతుని విరోధియైన; పొన్ పెయరోన్ = హిరణ్యాసురునియొక్క; ఇన్ ఉయిరై = ప్రియమైన ప్రాణమును; వవ్వి = అపహరించి; ఆగమ్ = అతనియొక్క శరీరమును; వల్ ఉగిరాల్ = వాడియైన నఖములచే;వకిర్ న్ద=చీల్చి పారవైచిన; అమ్మానదు ఇడమ్=సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశము; (ఏదనగ) కవ్వుమ్ నాయుమ్ =( దారినపోవువారిని) కరుచుచుండెడి శునకములు; కழுగుమ్ = గెద్దలు; ఉచ్చిప్పోదుడు కాల్ శుழన్ఱు = విపరీతమైన ఎండలు మఱియు శుడిగాలులు ఎప్పుడూ ఉండుటచే; తెయ్ వమల్లాల్ = మిక్కిలి ప్రేమగల భగవద్భక్తులచే తప్ప మరివేరొక్కరు చేతను; శెల్లవొణ్ణా = చేరలేనటువంటి; శిఙ్గవేழ் కున్ఱమే = ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
దుఃఖమును కలుగజేయు తీక్షణమైన శూలాయుధము కలిగిన భగవంతుని విరోధియైన హిరణ్యాసురునియొక్క ప్రియమైన ప్రాణమును అపహరించి, అతనియొక్క శరీరమును వాడియైన నఖములచే చీల్చి పారవైచిన స్వామి సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశము ఏదనగ దారినపోవువారిని కరుచుచుండెడి శునకములు, గెద్దలు, విపరీతమైన ఎండలు మఱియు శుడిగాలులు, ఎప్పుడూ ఉండుటచే మిక్కిలి ప్రేమగల భగవద్భక్తులచే తప్ప మరివేరొక్కరు చేతను చేరలేనటువంటి ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
మెన్ఱ పేழ்వాయ్, వాళ్ ఎయిర్ట్రు ఓర్ కోళరియాయ్, అవుణన్
పొన్ఱ ఆగమ్ వళ్ళుగిరాల్, పోழ்న్ద పునిదనిడమ్ ,
నిన్ఱ శెన్దీ మొణ్డు శూఱై, నీళ్ విశుమ్బూడు ఇరియ ,
శెన్ఱు కాణ్డఱ్కరియ కోయిల్, శిఙ్గవేழ் కున్ఱమే ll 1012
మెన్ఱ పేழ்వాయ్ = ( కోపముతో) నాలుకను దంతములమధ్య కదలించుచు నములుచుండు పెద్ద నోరుగల; వాళ్ ఎయిర్ట్రు=కత్తి పోలిన దంతములుకలిగి; ఓర్ కోళరియాయ్ = సాటిలేని బలముగల నరసింహ రూపముదాల్చి; పొన్ఱ అవుణన్ = (తనను చూచినవెంటనే) భీతిచెంది మరణావస్థనుపొందిన హిరణ్యాసురునియొక్క; ఆగమ్ = శరీరమును; వళ్ ఉగిరాల్ = వాడియైన నఖములచే; పోழ்న్ద = చీల్చి పారవైచిన; పునిదన్ ఇడమ్ = పరమ పవిత్రుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము (ఏదనగ); శూఱై = సుడిగాలులు;నిన్ఱ శెమ్ తీ మొణ్డు= ఎడతెగక నుండెడి మండుచున్న ఎండను ధరించుకొనివచ్చి; నీళ్ విశుమ్బూడు ఇరియ = విశాలమైన ఆకాశము పర్యంతము వ్యాపించి వేగముతో చెల్లాచెదురుగ కదులుచుండుటచే; శెన్ఱు కాణ్డఱ్కు అరియ కోయిల్=సమీపమునకు వెడలి సేవించుటకు సాధ్యముకాని దేవాలయముగల; శిఙ్గవేழ் కున్ఱమే = ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
మిక్కిలి కోపావేశముతో నాలుకను దంతములమధ్య కదలించుచు నములుచుండు పెద్ద నోరుగల, కత్తి పోలిన దంతములు కలగి, సాటిలేని బలముగల నరసింహ రూపముదాల్చి, తనను చూచినవెంటనే భీతిచెంది మరణావస్థనుపొందిన హిరణ్యాసురునియొక్క శరీరమును వాడియైన నఖములచే చీల్చి పారవైచిన పరమ పవిత్రుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము ( ఏదనగ ) సుడిగాలులు ఎడతెగక నుండెడి మండుచున్న ఎండను ధరించుకొనివచ్చి ఆకాశము పర్యంతము వ్యాపించి వేగముతో చెల్లాచెదురుగ కదులుచుండుటచే సమీపమునకు వెడలి సేవించుటకు సాధ్యముకాని దేవాలయముగల ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
ఎరిన్ద పైఙ్గణ్ ఇలఙ్గు పేழ்వాయ్, ఎయిర్ట్రోడు ఇతెవ్వురువెన్ఱు,
ఇరిన్దు వానోర్ కలఙ్గి యోడ, ఇరున్ద అమ్మానదిడమ్,
నెరిన్ద వేయిన్ ముழைయుళ్ నిన్ఱు, నీణెఱివాయ్ ఉழవై,
తిరిన్ద ఆనై చ్చువడుపార్కుమ్, శిఙ్గవేழ் కున్ఱమే ll 1013
ఎరిన్ద = (కోపముతో) జ్వలించుచున్న; పైమ్ కణ్ = పచ్చని కన్నులుగల; ఇలఙ్గు పేழ் వాయ్ ఎయిర్ట్రోడు = ప్రకాశించుచున్న పెద్ద నోటిలో వాడియైన దంతములుకూడియున్న; ఇదు ఎవ్వురువు ఎన్ఱు = ఈ నరసింహాకారము ఎంత భయంకరముగ యున్నదో యని; వానోర్ ఇరిన్దు కలఙ్గి యోడ = దేవతలు చెల్లాచెదురుగ మిక్కిలి కలవరపాటుతో పరిగెత్తునట్లు; ఇరున్ద = కృపతో వేంచేసిన; అమ్మానదు ఇడమ్ = సర్వస్వామియైన సర్వేశ్వరుని దివ్యదేశము; ( ఏదనగ ), ఉழవై = పెద్ద పులులు; నెరిన్ద వేయిన్ ముழைయుళ్ నిన్ఱు = దగ్గరగా చేరియున్న వెదురు పొదల మధ్యనుండి; నీళ్ నెఱివాయ్ = పెద్ద మార్గము ద్వారా (వచ్చి); తిరిన్ద ఆనై శువడు పార్కుమ్ = అడవిలో తిరుగుచుండెడి ఏనుగులయొక్క అడుగుజాడలను పరిశీలించుచు (ఘ్రాణించుచు) చూచుచుండెడి; శిఙ్గవేழ் కున్ఱమే = ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
కోపముతో జ్వలించుచున్న పచ్చని కన్నులుగల, ప్రకాశించుచున్న పెద్ద నోటిలో వాడియైన దంతములుకూడియున్న ఈ నరసింహాకారము ఎంత భయంకరముగ యున్నదో యని దేవతలు చెల్లాచెదురుగ మిక్కిలి కలవరపాటుతో పరిగెత్తునట్లు కృపతో వేంచేసిన సర్వస్వామియైన సర్వేశ్వరుని దివ్యదేశము (ఏదనగ ) పెద్ద పులులు దగ్గరగ చేరియున్న వెదురు పొదల మధ్యనుండి పెద్ద మార్గము ద్వారా వచ్చి, అడవిలో తిరుగుచుండెడి ఏనుగులయొక్క అడుగుజాడలను పరిశీలించుచు (ఘ్రాణించుచు) చూచుచుండెడి ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
మునైత్త శీర్ట్రమ్ విణ్ శుడప్పోయ్, మూవులగుమ్ పిఱవుమ్,
అనైత్తుమ్ అఞ్జ ఆళరియాయ్, ఇరున్ద అమ్మానదిడమ్,
కనైత్త తీయుమ్ కల్లుమ్ అల్లా, విల్లుడై వేడరుమాయ్ ,
తినైత్తనైయుమ్ శెల్లవొణ్ణా, శిఙ్గవేழ் కున్ఱమే ll 1014
మునైత్త శీర్ట్రమ్ = మిక్కిలి అపరిమితమైన కోపము; పోయ్=కింద నుండి పైకి పోవుచు; విణ్ శుడ = ఆకాశమును చేరి దహింపజేసి; మూవులగుమ్ పిఱవుమ్ = మూడు లోకములందు గలవారును మరియు; అనైత్తుమ్ = బ్రహ్మ లోకమందు గలవారును అఞ్జ = భయకంపితులగునట్లు; ఆళ్ అరియాయ్ = నరసంహ రూపమునుదాల్చి; ఇరున్ద = కృపతో వేంచేసిన; అమ్మానదు ఇడమ్ = సర్వస్వామియైన సర్వేశ్వరుని దివ్యదేశము; ( ఏదనగ) కనైత్త తీయుమ్ = శబ్దించుచు మండుచున్న మంటలును; కల్లుమ్ = (ఆ మంటలచే మిక్కిలి వేడెక్కిన) = రాళ్ళును; అల్లా = వీటికన్న మిక్కిలి క్రూరమైన; విల్ ఉడై = విల్లును చేతులయందు కలిగిన; వేడరుమ్ ఆయ్ =వేటగాండ్రచే నిండిన ప్రదేశమగుటచే; తినై తనైయుమ్ శెల్ల ఒణ్ణా = (ఏ ప్రయత్నము చేతనైన) క్షణకాలములోనైనను సమీపించి చేరలేని; శిఙ్గవేழ் కున్ఱమే=ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
హిరణ్యాసురునిపై కలిగిన మిక్కిలి అపరిమితమైన కోపము ఈ భూబాగము విడిచి పైకి పోయి ఆకాశమును చేరి దహింపజేసి, మూడు లోకములందు గలవారును మఱియు బ్రహ్మ లోకమందు గలవారును భయకంపితులగునట్లు నరసింహరూపమును దాల్చి కృపతో వేంచేసిన సర్వస్వామియైన సర్వేశ్వరుని దివ్యదేశము; ( ఏదనగ) శబ్దించుచు మండుచున్న మంటలును, ఆ మంటలచే మిక్కిలి వేడెక్కిన రాళ్ళును, వీటికన్న మిక్కిలి క్రూరమైన విల్లును చేతులయందు కలిగిన వేటగాండ్రచే నిండిన ప్రదేశమగుటచే (ఏ ప్రయత్నము చేతనైన) క్షణకాలములోనైనను సమీపించి చేరలేని ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
నాత్తழுమ్బ నాన్ముగనుమ్, ఈశనుమాయ్ ముఱైయాల్
ఏత్త, అఙ్గు ఓర్ ఆళరియాయ్, ఇరున్ద అమ్మానదిడమ్,
కాయ్ త్త వాగై నెర్ట్రు ఒళిప్ప, కల్లదర్ వేయ్ ఙ్గழைపోయ్,
తేయ్ త్త తీయాల్ విణ్ శివక్కుమ్, శిఙ్గవేழ் కున్ఱమే ll 1015
నాన్ముగనుమ్ ఈశనుమ్ ఆయ్ = చతుర్ముఖ బ్రహ్మయు,శివుడును కూడి; నా తழுమ్బ= నాలుక మొద్దుబారునట్లు; ముఱైయాల్ ఏత్త = క్రమపద్ధతిలో స్తుతించగ; అఙ్గు = (విష్ణువు కలడని ప్రహ్లాదుడు శపధము చేసిన) స్థలములోనే; ఓర్ ఆళరియాయ్ అద్వితీయమైన నరసంహ రూపమునుదాల్చి; ఇరున్ద = కృపతో వేంచేసిన; అమ్మానదు ఇడమ్ = సర్వస్వామియైన సర్వేశ్వరుని దివ్యదేశము ( ఏదనగ ) కాయ్ త్త = కాయలతో నిండిన; వాగై = దిరిసెన చెట్లయొక్క; నెర్ట్రు = ఎండిన పండ్లు; ఒళిప్ప = శబ్ధించుచుండునదియు; కల్ అదర్ = రాళ్ళ మధ్యలో; వేయ్ కழை = వెదురు చెట్లు; పోయ్ = ఆకాశపర్యంతము పెరిగి; తేయ్ త్త = ఒకటితోమరొకటి ఒరుసుకొనుటచే కలిగిన; తీయాల్ = అగ్నిచే; విణ్ శివక్కుమ్ = ఆకాశము ఎర్రబడుచుండెడి; శిఙ్గవేழ் కున్ఱమే=ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
చతుర్ముఖ బ్రహ్మయు,శివుడును కూడి తమ నాలుక మొద్దుబారునట్లు ఎడతెగక నిరంతరము క్రమపద్ధతిలో స్తుతించగ,విష్ణువు కలడని ప్రహ్లాదుడు శపధము చేసిన స్థలములోనే, అద్వితీయమైన నరసంహ రూపమునుదాల్చి కృపతోవేంచేసిన సర్వస్వామియైన సర్వేశ్వరుని దివ్యదేశము ( ఏదనగ ), కాయలు కాచి తొంగులాడెడి దిరిసెన చెట్లయొక్క ఎండిన పండ్లు గాలికి గలగలమని శబ్దించుచున్న ప్రదేశములతోను రాళ్ళ మధ్యలో వెదురు చెట్లు ఆకాశపర్యంతము పెరిగి ఒకటితోమరొకటి ఒరుసుకొనుటచే కలిగిన అగ్నిచే ఆకాశము ఎర్రబడుచుండెడిదియు అయిన, ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమే సుమా!
నల్లై నెఞ్జే నామ్ తొழுదుమ్, నమ్ముడైయ నమ్బెరుమాన్ ,
అల్లిమాదర్ పుల్ గ నిన్ఱ, ఆయిరమ్ తోళనిడమ్,
నెల్లిమల్గిక్కల్ ఉడైప్ప, ప్పుల్లిలై ఆర్తు , అదర్ వాయ్
శిల్లిశిల్లెన్ఱు ఒల్ అఱాద, శిఙ్గవేழ் కున్ఱమే ll 1016
నల్లై నెఞ్జే = నాయొక్క మంచి హృదయమా!; నమ్ముడైయ నమ్బెరుమాన్ = మనయొక్క స్వామియును; అల్లిమాదర్ పుల్ గ నిన్ఱ=కమలవాసినిని కౌగిలించికొనియున్నవాడును;ఆయిరమ్ తోళన్ ఇడమ్ = సహస్ర భుజములుగలవాడును అయిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశము (ఏదనగ); నెల్లి మల్గి = రాసి ఉసిరి చెట్లచే నిండి;(ఆ చెట్ల వేర్లు రాళ్ళలో వ్యాపించుటచే)కల్ ఉడైప్ప=రాళ్ళు పగిలిపోవుచుండునవియు; పుల్ ఇలై ఆర్తు = తాటియాకుల శబ్ధములతోను; అదర్ వాయ్ = మార్గములలో; శిల్లి = యిలకోడి యొక్క (ఒక రకమైన కీటకము); శిల్ ఎన్ఱు ఒల్ అఱాద = కిచకిచ ధ్వనులు ఎడతెగక వినబడుచుండు; శిఙ్గవేழ் కున్ఱమే = ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమును; నామ్ తొழுదుమ్ = మనము సేవించుకొందుము.
నాయొక్క మంచి హృదయమా!, మనయొక్క స్వామియును, కమలవాసినిని కౌగిలించికొనియున్నవాడును, సహస్ర భుజములుగలవాడును అయిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసియున్న దివ్యదేశము ఏదనగ రాసి ఉసిరి చెట్లయొక్క (రాళ్ళ నడుమ మొలకెత్తి పెరుగుటచే) వేర్లు రాళ్ళలో వ్యాపించుటచే ఆ రాళ్ళు పగిలి పోవుచుండునవియు,తాటియాకుల శబ్ధములు, యిలకోడి యొక్క (ఒక రకమైన కీటకము) కిచకిచ ధ్వనులు ఎడతెగక వినబడుచుండు ఆ శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమును ,సర్వేశ్వరుని కృపాపాత్రులైన మనము చేరి సేవించుకొందుము.
** శెమ్ కణ్ ఆళి ఇట్టు ఇఱైఞ్జుమ్, శిఙ్గవేழ் కున్ఱుడైయ ,
ఎఙ్గళ్ ఈశన్ ఎమ్బిరానై, ఇరుమ్ తమిழ்నూల్ పులవన్,
మంగైయాళన్ మన్ను తొల్ శీర్, వణ్డు అరై తార్ కలియన్,
శెంగైయాళన్ శెఞ్జొల్ మాలై , వల్లవర్ తీదిలరే ll 1017
శెమ్ కణ్ ఆళి = ఎర్రని కన్నులుగల సింహములు; ఇట్టు ఇఱైఞ్జుమ్ = తమకు దొరికిన ఏనుగుల దంతములను) పాదములందు సమర్పించి సేవించుకొనుచుండెడి; శిఙ్గవేழ் కున్ఱు ఉడైయ = శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) నిత్యవాసముగ కలిగిన ; ఎఙ్గళ్ ఈశన్ = సంసారులైన మనకందరికి స్వామియు; ఎమ్బిరానై = మనకు ఉపకారకుడైన శ్రీ నరసింహమూర్తి విషయమై; ఇరుమ్ తమిழ்నూల్ పులవన్ = పెద్ద తమిళ శాస్త్రములయందు శ్రేష్ఠులును;మంగై ఆళన్=తిరుమంగై దేశమునకు ప్రభువును; మన్ను తొల్ శీర్ =నిత్యమైన శ్రీ వైష్ణవలక్ష్మి గలవారును;వణ్డు అరై తార్ = తుమ్మెదల ఝంకారము చేయు పూల మాలను ధరించిన వారును, శెమ్ కై ఆళన్ = మిక్కిలి ఉదారమైనవారును; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; శెమ్ శొల్ మాలై = అనుగ్రహించిన శ్లాఘ్యమైన సూక్తులమాలను; వల్లవర్=అనుసంధించువారు ; తీదు ఇలరే = పాపవిముక్తులై మంచి స్వభావమును కలిగియుందురు.
కోపముతో ఎరుపెక్కిన కన్నులుగల సింహములు తమకు దొరికిన ఏనుగుల దంతములను తెచ్చి పాదములందు సమర్పించి సేవించుకొనుచుండెడి శిఙ్గవేళ్ కున్ఱమ్ (అహోబిలక్షేత్రమను) దివ్యదేశమును నిత్యవాసముగ కలిగిన , సంసారులైన మనకందరికి స్వామియు, మరియు ఉపకారకుడైన శ్రీ నరసింహమూర్తి విషయమై విస్తృతమైన తమిళ శాస్త్రములయందు శ్రేష్ఠులును, తిరుమంగై దేశమునకు ప్రభువును, తుమ్మెదల ఝంకారము చేయు పూల మాలను ధరించిన వారును, మిక్కిలి ఉదారమైనవారును,తిరుమంగైఆళ్వార్ అనుగ్రహించిన శ్లాఘ్యమైన సూక్తులమాలను అనుసంధించువారు పాపవిముక్తులై మంచి స్వభావమును కలిగియుందురు.
*********************