శ్రీః
శ్రీమతే రామనుజాయనమః
తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన
_______________
పెరియతిరుమొழி
2-వ పత్తు
—————————————-
శ్రీః
1. వానవర్ తఙ్గళ్
దివ్యమైన వేంకటాచలమునందు కృపతో వేంచేసియున్న శ్రియఃపతిని పాదపద్మములందు పరమభక్తి ప్రాప్తికై వేడుకున్న తిరుమంగై ఆళ్వార్, తాను ఎవరును అనుభవించలేని అపరిమితమైన ఆనందమును పొందుటకు తోడ్పడిన మనస్సును సంబోధించుచున్నారు.
** వానవర్ తఙ్గళ్ శిన్దైపోల, ఎనెఞ్జమే యినిదువన్దు, మా దవ
మానవర్ తఙ్గళ్ శిన్దై, అమర్ న్దు ఉఱైకిన్ఱ ఎన్దై ,
కానవర్ ఇడు కారగిఱ్పుగై, ఓఙ్గు వేఙ్గడమ్ మేవి, మాణ్ కుఱ
ళాన అన్దణఱ్కు, ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే ll 1048
ఎన్ నెఞ్జమే = ఓ! నామనసా!; మా తవమ్ మానవర్ తఙ్గళ్ శిన్దై = మిక్కిలి తపము చేయు మనుష్యుల యొక్క హృదయమందు; అమర్ న్దు ఉఱైకిన్ఱ ఎన్దై=స్థిరముగ కృపతో వేంచేసియున్న స్వామియును; కానవర్ ఇడు కార అగిల్ పుగై ఓఙ్గు వేఙ్గడమ్ మేవి = వేటగాండ్రచే సమర్పించబడు నల్లని అగరు చెట్లయొక్క సుగంధమైన పొగ వ్యాపించియుండు తిరుమలలో నిత్యవాసము చేయుచున్నవాడును; మాణ్ కుఱళ్ ఆన అన్దణఱ్కు = వామన బ్రహ్మచారి రూపమునుదాల్చిన సర్వేశ్వరునకు; వానవర్ తఙ్గళ్ శిన్దై పోల=నిత్యశూరులయొక్క హృదయమందువలె;(నీవును),ఇనిదు ఉవన్దు=మిక్కిలి మధురముగా సంతోషముతో; ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే = ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
ఓ! నామనసా! మిక్కిలి తపముచేయు మనుష్యులయొక్క (నమ్మాళ్వార్ మొదలగువారి యొక్క) హృదయమందు స్థిరముగ కృపతో వేంచేసియున్నస్వామియును,వేటగాండ్రచే సమర్పించబడు నల్లని అగరు చెట్లయొక్క సుగంధమైన పొగ వ్యాపించియుండు తిరుమలలో నిత్యవాసము చేయుచున్న వాడును, వామన బ్రహ్మచారి రూపమునుదాల్చిన సర్వేశ్వరునకు, నిత్యశూరులయొక్క హృదయమందు వలె నీవును, మిక్కిలి మధురముగా సంతోషముతో ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే! (ఏమి నా భాగ్యమో! యని ఆళ్వార్ పరవశించిపోతున్నారు) .
ఉఱవు శుర్ట్రమెన్ఱు ఒన్ఱిలా, వొరువన్ ఉగన్దవర్ తమ్మై, మణ్ మిశై
ప్పిఱవియే కెడుప్పాన్, అదుకణ్డు ఎన్నెఞ్జమెన్బాయ్ ,
కురవర్ మాదర్ గళోడు, వణ్డు కుఱిఞ్జిమరుళ్ ఇశైపాడుమ్, వేఙ్గడత్తు
అఱవ నాయగఱ్కు, ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే ll 1049
ఎన్ నెఞ్జమ్ ఎన్బాయ్ = నాయొక్క మనస్సుయైన నీవు; ఉఱవు శుర్ట్రమ్ ఎన్ఱు ఒన్ఱు ఇలా ఒరువన్ = బంధువులు,తల్లిదండ్రులు మొదలగు చెప్పబడువారు ఏఒక్క ఆభాసముతో కూడిన సంబంధములు లేని అద్వితీయుడైన సర్వేశ్వరుని; ఉగన్దవర్ తమ్మై = తనయందు ప్రీతిపాత్రులైన భక్తులకు; మణ్ మిశై ప్పిఱవియే కెడుప్పాన్ అదుకణ్డు = ఈ భూమిపై జన్మమును పోగొట్టెడి స్వభావమును తెలుసుకొని; కురవర్ మాదర్ గళోడు = సంచారజాతుల స్తీలతో కూడి; వణ్డు = తుమ్మెదలు; కుఱిఞ్జి మరుళ్ ఇశై పాడుమ్ = కురుఞ్జి అను మనస్సును మోహపరచు రాగమును పాడుచుండెడి; వేఙ్గడత్తు = తిరుమలలో కృపతో వేంచేసియున్న; అఱవ నాయగఱ్కు = మిక్కిలి ధర్మశీలుడైన ఆ సర్వేశ్వరునికి; ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే = ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
నాయొక్క మనస్సుయైన నీవు, బంధువులు,తల్లిదండ్రులు మొదలగు చెప్పబడువారు ఏఒక్క ఆభాసముతో కూడిన సంబంధములు లేని అద్వితీయుడైన సర్వేశ్వరుని, తనయందు ప్రీతిపాత్రులైన భక్తులకు,ఈ భూమిపై జన్మమును పోగొట్టెడి స్వభావమును తెలుసుకొని, సంచారజాతుల స్తీలతో కూడి తుమ్మెదలు కురుఞ్జి అను మనస్సును మోహపరచు రాగమును పాడుచుండెడి తిరుమలలో కృపతో వేంచేసియున్న మిక్కిలి ధర్మశీలుడైన ఆ సర్వేశ్వరునికి ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే! (ఆహా!)
ఇణ్డైయాయినకొణ్డు, తొణ్డర్ గళ్ ఏత్తువార్ ఉఱవోడుమ్, వానిడై
కొణ్డుపోయ్ ఇడవుమ్, అదుకణ్డు ఎన్నెఞ్జమెన్బాయ్ ,
వణ్డువాழ் వడవేఙ్గడమలై, కోయిల్ కొణ్డు అదనోడుమ్, మీమిశై
అణ్డమ్ ఆణ్డిరుప్పాఱ్కు, అడిమై త్తొழிల్ పూణ్డాయే ll 1050
ఎన్ నెఞ్జమ్ ఎన్బాయ్ = ఓ! నామనసా!; ఇణ్డై ఆయిన కొణ్డు = పుష్పముల మాలలను (తన వద్దకు) తెచ్చి సమర్పించి;ఏత్తువార్ = స్తోత్రముచేయు; తొణ్డర్ గళ్ = దాసులను; ఉఱవోడుమ్ = వారియొక్క సంబంధించిన బంధువర్గములతో కూడ; కొణ్డుపోయ్ = ఈ భూమండలమునుండి తీసుకుని పోయి; వానిడై ఇడవుమ్ అదు కణ్డు=పరమపదములో చేర్చు విషయమును తెలుసుకొని;వణ్డు వాழ்=తుమ్మెదలు సంతోషముతో సంచరించెడి; వడ వేఙ్గడ మలై = ఉత్తరమునగల తిరమలను; కోయిల్ కొణ్డు = తన నివాసస్థానముగ స్వీకరించి; అదనోడుమ్ = ఆ తిరుమల దివ్య దేశము మరియు; మీ మిశై అణ్డమ్=నిత్య విభూతియైన పరమాకాశమును ;ఆణ్డుఇరుప్పాఱ్కు=పరిపాలించుచుండెడి ఆ సర్వేశ్వరునికి;అడిమై త్తొழிల్ పూణ్డాయే=కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
ఓ! నామనసా! పుష్పముల మాలలను తన వద్దకు తెచ్చి సమర్పించి, స్తోత్రముచేయు దాసులను వారియొక్క సంబంధించిన బంధువర్గములతో కూడ, (ఆసర్వేశ్వరుడు) ఈభూమండలమునుండి తీసుకునిపోయి పరమపదములో చేర్చు విషయమును తెలుసుకొని నీవు, తుమ్మెదలు సంతోషముతో సంచరించెడి ఉత్తరమునగల తిరమలను తన నివాసస్థానముగ స్వీకరించి, ఆ తిరుమల దివ్య దేశము మరియు నిత్యవిభూతియైన పరమాకాశమును పరిపాలించుచుండెడి ఆ సర్వేశ్వరునికి కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
** బావియాదుశెయ్ దాయ్, ఎన్నెఞ్జమే పణ్డు తొణ్డుశెయ్ దారై, మణ్ మిశై
మేవి ఆట్కొణ్డుపోయ్, విశుమ్బేఱవైక్కుమ్ ఎన్దై ,
కోవినాయగన్ కొణ్డల్ ఉన్దు ఉయర్, వేఙ్గడమలై యాణ్డు, వానవర్
ఆవియాయిరుప్పాఱ్కు, అడిమై త్తొழிల్ పూణ్డాయే ll 1051
ఎన్ నెఞ్జమే = ఓ! నామనసా!; బావియాదు శెయ్ దాయ్=తడబడక దృఢమైన సంకల్పమును చేకొంటివి; పణ్డు = మునుపు; మణ్ మిశై మేవి=ఈ భూమండలమందు అవతరించి;తొణ్డు శెయ్ దారై= కైంకర్యసేవలు చేసినవారిని; ఆళ్ కొణ్డు పోయ్ = (ఇంకను)వారియొక్క నిత్యకైంకర్యములను పొందుటకై; విశుమ్బు ఏఱవైక్కుమ్ ఎన్దై=పరమపదము చేర్చెడు స్వామియు; కోవి నాయగన్ = గోపికలకు నాయకుడును; కొణ్డల్ ఉన్దు ఉయర్=మేఘములను నెట్టునట్లు మిక్కిలి ఉన్నతమయిన;వేఙ్గడమలై ఆణ్డు=తిరుమలను పరిపాలించుచు; వానవర్ ఆవియాయ్ ఇరుప్పాఱ్కు= నిత్యశూరులకు ప్రాణభూతుడైయున్న సర్వేశ్వరునికి; అడిమై త్తొழிల్ పూణ్డాయే = కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
ఓ! నామనసా! విషయభోగములా? లేక నా స్వరూపమునకు అనుగుణమైన సర్వేశ్వరుని కైంకర్యసేవలా? అను విషయమై తడబడక దృఢమైన సంకల్పమును (కైంకర్యసేవలనే) చేకొంటివి (ఆహా!). మునుపు ఈ భూమండలమందు అవతరించి తనకు కైంకర్యసేవలు చేసినవారిని మిక్కిలి ప్రీతితో ఇంకను వారియొక్క నిత్యకైంకర్యములను పొందుటకై పరమపదము చేర్చెడు స్వామియు, గోపికలకు నాయకుడును, మేఘములను నెట్టునట్లు మిక్కిలి ఉన్నతమయిన తిరుమలను (లీలావిభూతిని) పరిపాలించుచు, నిత్యశూరులకు ప్రాణభూతుడైయున్న సర్వేశ్వరునికి కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే! .
పొఙ్గు పోదియమ్ పిణ్డియుముడై, ప్పుత్తర్ నోన్బియర్ పళ్ళియుళ్ ఉఱై,
తఙ్గళ్ దేవరుమ్ తాఙ్గళుమేయాగ, ఎన్నెఞ్జమెన్బాయ్ ,
ఎఙ్గుమ్ వానవర్ దానవర్ నిఱైన్దేత్తుమ్, వేఙ్గడమ్ మేవి నిన్ఱరుళ్ ,
అఙ్గణాయగఱ్కు, ఇన్ఱడిమై త్తొழிల్ పూణ్డాయే ll 1052
ఎన్ నెఞ్జమే ఎన్బాయ్=ఓ! నామనసా!; పొఙ్గు = మానులతో,కొమ్మలతో బాగుగ పెరిగిన; పోదియుమ్= బోధివృక్షమును; పిణ్డియుమ్ = అశోక వృక్షమును;ఉడై=(తమకుశరణముగ) కలిగియున్న; పుత్తర్ = బుద్ధులు; నోన్బియర్ = జైనులు; పళ్ళి ఉళ్ ఉఱై తఙ్గళ్ దేవరుమ్ తాఙ్గళుమే ఆగ = తమయొక్క దేవాలయములలో నివసించు తమయొక్క దేవతలు మరియు తామును అంతటను నిండియున్నను (ఆ మతములయందు నీవు ప్రవేశించక); ఎఙ్గుమ్ వానవర్ దానవర్ నిఱైన్దు ఏత్తుమ్ = అన్ని దిశలయందు దేవతలు,దానవులు స్తుతించుచుండెడి; వేఙ్గడమ్ మేవి నిన్ఱు = తిరుమలలో కృపతో వేంచేసియున్న;అరుళ్ = కోరిన కోర్కెలను తీర్చెడి; అమ్ కణ్ నాయగఱ్కు = సుందరమైన నేత్రములగల సర్వేశ్వరునికి; ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే = ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
ఓ! నామనసా!, మానులతో,కొమ్మలతో బాగుగ పెరిగిన బోధివృక్షమును, అశోక వృక్షమును తమకు శరణముగ కలిగియున్న బుద్ధులు,జైనులు, తమయొక్క దేవాలయములలో నివసించు తమయొక్క దేవతలు మరియు తామును అంతట నిండియున్నను ఆ మతములయందు నీవు ప్రవేశించక, అన్ని దిశలయందు దేవతలు,దానవులు స్తుతించుచుండెడి తిరుమలలో కృపతో వేంచేసియున్న,కోరిన కోర్కెలను తీర్చెడి, సుందరమైన నేత్రములగల సర్వేశ్వరునికి, ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే! .(ఎంతటి నా అదృష్టమో!)
తువరియాడైయర్ మట్టైయర్, శమణ్ తొణ్డర్గళ్ మణ్డి యుణ్డు పిన్నరుమ్,
తమరుమ్ తాఙ్గళమే తడిక్క, ఎన్నెఞ్జమెన్బాయ్ ,
కవరిమాక్కణమ్ శేరుమ్, వేఙ్గడమ్ కోయిల్ కొణ్డ కణ్ణార్ విశుమ్బిడై ,
అమర నాయగఱ్కు, ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే 1053
ఎన్ నెఞ్జమే ఎన్బాయ్ = ఓ! నామనసా!; తువరి ఆడైయర్ మట్టైయర్ = కాషాయ వస్త్రములను ధరించి గుండుకలిగిన;శమణ్ తొణ్డర్గళ్ = జైనమతస్థులు; మణ్డి = ఒకరితోఒకరు చేరి; ఉణ్డు = (మనసునకు తోచినట్లు)భుజించి; పిన్నరుమ్ = ఆపైన; తమరుమ్ తాఙ్గళమే తడిక్క = తమయొక్క బంధువులు, తామును,కలిసి భుజించుటచే లావెక్కునట్లు ( నీవును వారివలె భుజించి లావెక్కుటకు తలచక); కవరి మా కణమ్ శేరుమ్ = బొచ్చు కలిగిన జంతువులు పెద్ద మందల మందలగా తిరుగుచుండెడి,వేఙ్గడమ్ కోయిల్ కొణ్డ=తిరుమలలో గల కోవెలను నివాసస్థానముగ ఎంచుకొన్న;కణ్ ఆర్ విశుమ్బిడై అమరర్ నాయగఱ్కు= మిక్కిలి విశాలమైన పరమపదమందలి నిత్యశూరుల నాయకుడైన సర్వేశ్వరునికి; ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే = ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
ఓ! నామనసా! కాషాయ వస్త్రములను ధరించి గుండుకలిగిన జైనమతస్థులు ఒకరితోఒకరు చేరి (మనసునకు తోచినట్లు) భుజించి ఆపైన తమయొక్క బంధువులు, తామును, కలిసి భుజించుటచే లావెక్కునట్లు ( నీవును వారివలె భుజించి లావెక్కుటకు తలచక) బొచ్చు కలిగిన జంతువులు పెద్ద మందల మందలగా తిరుగుచుండెడి తిరుమలలో గల కోవెలను నివాసస్థానముగ ఎంచుకొన్న మిక్కిలి విశాలమైన పరమపదమందలి నిత్యశూరుల నాయకుడైన సర్వేశ్వరునికి ఇపుడు కైంకర్యసేవను నిమగ్నమై చేయుచుంటివే!
తరుక్కినాల్ శమణ్ శెయ్ దు, శోఱు తణ్ తయిరినాల్ తిరళై, మిడర్ట్రిడై
నెరుక్కువార్ అలక్కణ్, అదు కణ్డు ఎన్నెఞ్జమెన్బాయ్ ,
మరుట్కళ్ వణ్డుగళ్ పాడుమ్, వేఙ్గడమ్ కోయిల్ కొణ్డు అదనోడుమ్, వానిడై
అరుక్కన్ మేవినిఱ్పార్కు, అడిమై త్తొழிల్ పూణ్డాయే 1054
తరుక్కినాల్ = భయంకరమైన శుష్క తర్కముచే; శమణ్ శెయ్ దు=తమయొక్క జైనమతము స్థాపించి; తణ్ తయిరినాల్ శోఱు తిరళై = మంచి పెరుగుకలిపిన అన్నపు ముద్దలను; మిడర్ ఇడై నెరుక్కువార్ = కంఠములో ఉంచుకొని కన్నులు మిటకరించుకొని మింగు జైనులయొక్క; అలక్కణ్ అదు కణ్డు=అట్టి విచారకరమైన స్థితిని చూచి; ఎన్ నెఞ్జమ్ ఎన్బాయ్ = ఓ! నామనసా! (నీవు వారియొక్క గుంపులలో చేరక);వణ్డుగళ్=తుమ్మెదలు, మరుళ్ గళ్=మరుళ్ మొదలగు ఇంపైన రాగములు; పాడుమ్ = పాడుచుండెడి; వేఙ్గడమ్ కోయిల్ కొణ్డు = తిరుమలలో గల కోవెలను నివాసస్థానముగ ఎంచుకొని; అదనోడుమ్ = దానితోకూడి; వానిడై= ఆకాశమందుగల; అరుక్కన్ మేవి నిఱ్పార్కు = సూర్యునికి అంతర్యామియై యున్న సర్వేశ్వరునికి; అడిమై త్తొழிల్ పూణ్డాయే = కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
భయంకరమైన శుష్క తర్కముచే తమయొక్క జైనమతము స్థాపించి, మంచి పెరుగుకలిపిన అన్నపు ముద్దలను కంఠములో ఉంచుకొని కన్నులు మిటకరించుకొని మింగు జైనులయొక్క విచారకరమైన స్థితిని చూచి, ఓ! నామనసా! నీవు వారియొక్క గుంపులలో చేరక తుమ్మెదలు మరుళ్ మొదలగు ఇంపైన రాగములు పాడుచుండెడి, తిరుమలలో గల కోవెలను నివాసస్థానముగ ఎంచుకొన్న, సూర్యునికి అంతర్యామియై యున్న సర్వేశ్వరునికి కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
శేయన్ అణియన్ శిఱియన్ పెరియనెన్బదుమ్, శిలర్ పేశ కేట్టిరున్దే ,
ఎన్నెఞ్జమెన్బాయ్, యెనక్కొన్ఱు శొల్లాదే ,
వేయ్ గళ్ నిన్ఱు వెణ్ ముత్తమే శొరి, వేఙ్గడమలై కోవిల్ మేవియ,
ఆయర్ నాయగఱ్కు, ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే 1055
శేయన్ = (ఆ సర్వేశ్వరుడు)పరమపదనాధుడును(మిక్కిలి దూరమందున్న వానిని ఏ విధముగ సేవించుదురు); అణియన్ = (అతను) అర్చావతారమూర్తియైన మిక్కిలి సులభుడును (మిక్కిలి చేరువులో నుండునా?) ; శిఱియన్=(అతను) కృష్ణుడుగ అవతరించినవాడును (తక్కువకులములో పుట్టినవానిని సేవించుటయా?);పెరియన్ = వ్యూహవాసుదేవుడు, అంతర్యామిగ నుండువాడును (చేరుటకు అసాధ్యమైన వానిని ఎట్లు సేవించుట సంభవము); ఎన్బదుమ్=అని ఈ విధమైన మాటలను;శిలర్ పేశ = కొంతమంది దుర్భాగ్యశాలులు చెప్పుచుండగ; ఎన్ నెఞ్జమ్ ఎన్బాయ్ = ఓ! నామనసా!; కేట్టిరున్దే=నీవు వినియుండియు;ఎనక్కు ఒన్ఱు శొల్లాదే = నాతో ఒక్క మాటయు చెప్పకనే; వేయ్ గళ్ నిన్ఱు వెణ్ ముత్తమే శొరి=వెదురు మొక్కలనుండి తెల్లని ముత్యములు కిందపడుచుండెడి; వేఙ్గడ మలై కోవిల్ మేవియ = తిరుమలలో గల కోవెలలో నిత్యవాసము చేయుచున్న; ఆయర్ నాయగఱ్కు = గోకులవాసులకు నాయకుడైన శ్రీ కృష్ణునకు; ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే = ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!
అఙ్ఞానాంధకారములో మునిగియున్న దుర్భాగ్యశాలులు కొందరు,పరమపదనాధుడను మిక్కిలి దూరస్థుడని తిరస్కరించుటయు, అర్చావతార మూర్తియైన మిక్కిలి సులభుడైన స్వామిని అతనియొక్క సమీపత్వమును ప్రశ్నించుటయు, శ్రీకృష్ణునిగ అవతరించిన సౌశీల్యమును కించపరచియు, వ్యూహవాసుదేవుడు, అంతర్యామిగ నుండువానిని చేరి సేవించుట అసాధ్యమనియు, ఈవిధముగా చెప్పుచుండగ, ఓ! నామనసా!,నీవు వినియుండియు, వారి మాటలయందు చిక్కుకొనక, నాకు అంతర్బాగమైయున్న నీవు ఒక్క మాటయు చెప్పకనే, వెదురు మొక్కలనుండి తెల్లని ముత్యములు కిందపడుచుండెడి తిరుమలలో గల కోవెలలో నిత్యవాసము చేయుచున్న గోకులవాసులకు నాయకుడైన శ్రీ కృష్ణునకు ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివే!.(తన మనస్సును చూచుకొని ఆళ్వార్ మురిసిపోతున్నారు)
కూడియాడి యురైత్తదే యురైత్తాయ్, ఎన్నెఞ్జమెన్బాయ్ తుణిన్దుకేళ్,
పాడియాడి ప్పలరుమ్, పణిన్దు ఏత్తి క్కాణ్గిలర్ ,
ఆడు తామరైయోనుమ్ ఈశనుమ్, అమరర్కోనుం నిన్ఱేత్తుమ్, వేఙ్గడత్తు
ఆడు కూత్తనుక్కు, ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే 1056
కూడి = (ఇంతకు పూర్వము నీవు) లోకమందలి జనులతో కూడి; ఆడి = వారు ఏ విషయములందు లీనమైయుండిరో నీవును ఆ విషయములందే లీనమై,ఉరైత్తదే ఉరైత్తాయ్ = వారు చెప్పుమాటలే చెప్పుచూ యున్న;ఎన్ నెఞ్జమ్ ఎన్బాయ్ = ఓ! నామనసా!; తుణిన్దు కేళ్ =(నేను ఇపుడు నీకు చెప్పుచున్న మాటలను) విశ్వాసముతో వినుము; పలరుమ్=అనేకమంది; పాడి=భగవద్గుణములను పాడియు;ఆడి=నృత్యము చేసియు;పణిన్దు=ఆశ్రయించి;ఏత్తి = స్తుతించినను;క్కాణ్గిలర్=(అతని గొప్పతనమును) తెలుసుకొనలేకపోయిరి; ఆడు తామరైయోనుమ్ ఈశనుమ్ అమరర్ కోనుం నిన్ఱు ఏత్తుమ్ = ప్రఖ్యాతిచెందిన చతుర్ముఖ బ్రహ్మయు,శివుడును,ఇంద్రుడును తమ తమ శక్తికొలది స్తుతించుచున్న; వేఙ్గడత్తు = తిరుమలలో కృపతో వేంచేసియున్న; ఆడు కూత్తనుక్కు= (మునుపు) గోపికలతో నృత్యము చేసిన సర్వేశ్వరునికి; ఇన్ఱు అడిమై త్తొழிల్ పూణ్డాయే = ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివి సుమా!
ఇంతకు పూర్వము నీవు లోకమందు సంసారములో మునిగియున్న జనులతో కూడి వారు ఏ విషయములందు లీనమైయుండిరో నీవును ఆ విషయములందే లీనమై, నిన్నటివరకు వారు చెప్పుమాటలే చెప్పుచువచ్చుచున్నఓ! నామనసా!; నీవు ఇపుడు ఎటువంటి స్థితికలిగియుంటివో, ఏ భాగ్యమును చేసుకొంటివో తెలియని నీకు నేను చెప్పునది ప్రీతితో వినుమా! అనేకమంది భక్తులు భగవద్గుణములను పాడి,మైమరచి నృత్యముచేసి,ఆశ్రయించి,స్తుతించినను ప్రత్యక్షము కానివాడును, లోకములను సృష్టిచేయు సామర్ధ్యము గల చతుర్ముఖ బ్రహ్మయు,శివుడును,ఇంద్రుడును తమ తమ శక్తికొలది స్తుతించుచున్న,తిరుమలలో కృపతో వేంచేసియున్న,గోపికలతో నృత్యము చేసిన, మహిమాన్వితమైన సర్వేశ్వరునికి ఇపుడు కైంకర్య సేవను నిమగ్నమై చేయుచుంటివి సుమా!( తన మనస్సు యొక్క సౌభాగ్యమునకు ఆళ్వార్ అమితానందము పొందుచున్నారు.)
** మిన్ను మాముగిల్ మేవు, తణ్ తిరువేఙ్గడమలై కోయిల్ మేవియ ,
అన్నమాయ్ నికழ்న్ద, అమరర్ పెరుమానై ,
కన్ని మామదిళ్ మంగైయర్ కలికన్ఱి, ఇన్ తమిழாల్ ఉరైత్త, ఇమ్
మన్ను పాడల్ వల్లార్కు, ఇడమాగుమ్ వానులగే ll 1057
మిన్నుమ్ మాముగిల్ మేవు = మెరుపులతోకూడిన కాళమేఘములు ఆవరించియున్న;తణ్ తిరువేఙ్గడమలై కోయిల్ మేవియ=చల్లని తిరుమలలోగల కోవెలలో నిత్యవాసము చేయుచున్న వాడును; అన్నమ్ ఆయ్ నికழ்న్ద = హంస రూపముదాల్చి అవతరించిన స్వామియును; అమరర్ పెరుమానై=నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరుని విషయమై; కన్ని మామదిళ్ మంగైయర్ కలికన్ఱి = రాతితో కట్టబడిన పెద్ద ప్రాకారములుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్;ఇన్ తమిழாల్ ఉరైత్త = ఇంపైన తమిళ బాషలో అనుగ్రహించిన; మన్ను = (వేదమువలె) నిత్యమైన; ఇప్పాడల్ = ఈ పాశురములను; వల్లవర్కు = అభ్యసించి అనుసంధించు వారికి; వాన్ ఉలగు = పరమపదము; ఇడమ్ ఆగుమ్ = నివాసస్థానమగును.
మెరుపులతోకూడిన కాళమేఘములు ఆవరించియున్న చల్లని తిరుమలలోగల కోవెలలో నిత్యవాసము చేయుచున్నవాడును, హంస రూపముదాల్చి అవతరించిన స్వామియును, నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరుని విషయమై, రాతితో కట్టబడిన పెద్ద ప్రాకారములుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ ఇంపైన తమిళ బాషలో అనుగ్రహించిన వేదమువలె నిత్యమైన ఈ పాశురములను అభ్యసించి అనుసంధించు వారికి పరమపదము నివాసస్థానమగును
*******