పెరియ తిరుమొழி-2వపత్తు (2)

శ్రీః

2.కాశైయాడై

    తొండ దేశమందలి దివ్యదేశములను దర్శించవలెనని మిక్కిలి కుతూహలముగల తిరుమంగై ఆళ్వార్, శాలిహోత్ర ముని, ప్రత్యక్షమైన సర్వేశ్వరునిని, “ఉరియ ఉళ్ ఎవ్వుళ్”(నివసించుటకు తగిన ప్రదేశము ఏ ప్రదేశము” అని ప్రశ్నించుటచే తిరు వెవ్వుళూర్ అని పేరుగాంచిన ఈ దివ్యదేశమున, కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుని మంగళాశాసనము చేయుచున్నారు.

** కాశైయాడై మూడియోడి, కాదల్ శెయ్ దానవనూర్ ,

నాశమాగ నమ్బవల్ల, నమ్బి నమ్బెరుమాన్ ,

వేయినన్న తోళ్ మడవార్, వెణ్ణెయుణ్డానివనెన్ఱు ,

ఏశనిన్ఱ ఎమ్బెరుమాన్,  ఎవ్వుళ్ కిడన్దానే ll 1058

కాశైయాడై = కాషాయ వస్త్రములతో; మూడి = తన శరీరమును కప్పుకొని; ఓడి = (పంచవటికి) పరిగెత్తుకొని వచ్చి; కాదల్ శెయ్ దానవన్ =(సీతాదేవియందు) మోహము కలిగియున్న రావణాసురునియొక్క; ఊర్= ఊరయిన లంకాపురిని;నాశమ్ ఆగ నమ్బ వల్ల= నాశనమగునట్లు సంకల్పముచేసిన; నమ్బి= పరిపూర్ణమైన శక్తి కలవాడును; నమ్ పెరుమాన్=మనయొక్క స్వామియును;వేయిన్ అన్న తోళ్ మడవార్=తాటిమానువలె ఒప్పు భుజములుగల గోపస్త్రీలు; ఇవన్ వెణ్ణెయ్ ఉణ్డాన్ ఎన్ఱు ఏశ నిన్ఱ ఎమ్బెరుమాన్ = ” ఇతను వెణ్ణను దొంగిలించి ఆరగించినాడు ” అని చెప్పుచు పరిహసించునట్లు నుండు సర్వేశ్వరుడు, ఎవ్వుళ్ కిడన్దానే = తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

            శ్రీరాముని యందు మోహముచే భంగపడిన తన సోదరి శూర్పణఖ చెప్పుడుమాటలను విని, కాషాయ వస్త్రములతో  శరీరమును కప్పుకొని పంచవటికి పరిగెత్తుకొని వచ్చి సీతాదేవియందు ఆశతో అపహరించిన రావణాసురునియొక్క ఊరయిన లంకాపురిని నాశనమగునట్లు సంకల్పముచేసిన పరిపూర్ణమైన శక్తి కలవాడును, మనయొక్క స్వామియును, తాటిమానువలె  ఒప్పు భుజములు గల గోపస్త్రీలు  ” ఇతను వెణ్ణను దొంగిలించి ఆరగించినాడు ” అని చెప్పుచు పరిహసించునట్లు నుండు సర్వేశ్వరుడు , తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

తైయలాల్ మేల్ కాదల్ శెయ్ ద, దానవన్ వాళ్ అరక్కన్ ,

పొయ్యిలాద పొన్ ముడిగళ్, ఒన్బదోడొన్ఱుమ్, అన్ఱు

శెయ్ ద వెమ్ పోర్ తన్నిల్, అఙ్గు ఓర్ శెఞ్జరత్తాల్ ఉరుళ ,

ఎయ్ ద ఎన్దై యెమ్బెరుమాన్, ఎవ్వుళ్ కిడన్దానే ll 1059

తైయలాల్ మేల్ = శ్లాఘ్యమైన సౌందర్యరాశి అయిన సీతాదేవిని; కాదల్ శెయ్ ద = కామించిన; దానవన్ వాళ్ అరక్కన్=అసుర ప్రవృత్తిగలవాడును,కత్తిని ఆయుధముగా గలవాడును అయిన రావణాసురుని యొక్క; పొయ్ ఇలాద పొన్ ముడిగళ్ ఒన్బదోడు ఒన్ఱుమ్ = నిజమైన బంగారు కిరీటములతో కూడిన తలలు పదియును; అన్ఱు అఙ్గు శెయ్ ద వెమ్ పోర్ తన్నిల్ = సీతాదేవిని బంధించినప్పుడు,లంకాపురి సముద్రతీరమందు చేసిన ఘోరమైన యుద్ధములో; ఓర్ శెమ్ శరత్తాల్ ఉరుళ = సాటిలేని (నిప్పులుగ్రక్కుటచే) ఎర్రగ ప్రజ్వలించు బాణములచే కిందపడి దొర్లునట్లు; ఎయ్ ద = ప్రయోగించిన; ఎన్దై = నా తండ్రి; ఎమ్బెరుమాన్ = సర్వేశ్వరుడు; ఎవ్వుళ్ కిడన్దానే = తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

శ్లాఘ్యమైన సౌందర్యరాశి అయిన సీతాదేవిని కామించిన అసుర ప్రవృత్తిగలవాడును, కత్తిని ఆయుధముగా గలవాడును అయిన రావణాసురునియొక్క నిజమైన బంగారు కిరీటములతో కూడిన తలలు పదియును, సీతాదేవిని బంధించినప్పుడు,లంకాపురి సముద్రతీరమందు చేసిన ఘోరమైన యుద్ధములో సాటిలేని (నిప్పులుగ్రక్కుటచే) ఎర్రగ ప్రజ్వలించు బాణములచే కిందపడి దొర్లునట్లు ప్రయోగించిన నా తండ్రి సర్వేశ్వరుడు తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

మున్నోర్ తూదు, వానరత్తిన్ వాయిల్ మొழிన్దు, అరక్కన్ 

మన్నూర్ తన్నై, వాళియినాల్ మాళ మునిన్దు, అవనే

పిన్నోర్ తూదు, ఆదిమన్నర్కాగి పెరునిలత్తార్ ,

ఇన్నార్ తూదనెన నిన్ఱాన్, ఎవ్వుళ్ కిడన్దానే ll 1060

మున్ = శ్రీరామావతారమందు; వానరత్తిన్ వాయిల్ = వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ముఖముద్వారా; ఓర్ తూదు మొழிన్దు=(సీతాదేవికి)తగు సమాచారమును అందజేసి  (పిదప); అరక్కన్ మన్ ఊర్ తన్నై = రావణాసురునియొక్క శ్లాఘ్యమైన లంకాపురిని; వాళియినాల్=ఒక బాణముచే; మాళ మునిన్దు= నాశనమగునట్లు కోపగించినవాడును; పిన్ = శ్రీ కృష్ణావతారమందు; ఆది మన్నర్కు=నిజమైన రాజాధిరాజులైన పాండవులకు; ఓర్ తూదు ఆగి=విలక్షణమైన దూతగ వెడలి;పెరు నిలత్తార్ ఇన్నార్ తూదనెన నిన్ఱాన్ అవనే = ఈ విశాలమైన భూమిపై నివసించు జనులందరు ” ఇతను పాండవుల దూతయని ” చెప్పునట్లు ప్రశిద్ధిగాంచిన ఆ సర్వేశ్వరుడే; ఎవ్వుళ్ కిడన్దానే = తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

శ్రీరామావతారమందు వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ముఖముద్వారా సీతాదేవికి తగు సమాచారమును అందజేసిన పిదప  రావణాసురునియొక్క శ్లాఘ్యమైన లంకాపురిని ఒక బాణముచే నాశనమగునట్లు కోపగించినవాడును, శ్రీ కృష్ణావతారమందు నిజమైన రాజాధిరాజులైన పాండవులకు విలక్షణమైన దూతగ వెడలి,ఈ విశాలమైన భూమిపై నివసించు జనులందరు ” ఇతను పాండవుల దూతయని ” చెప్పునట్లు ప్రశిద్ధిగాంచిన ఆ సర్వేశ్వరుడే తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

పన్దనైన్ద మెల్ విరలాళ్, పావైతన్ కారణత్తాల్ ,

వెన్దిఱల్ ఏఱేழுమ్, వెన్ఱ వేన్దన్ విరి పుగழ் శేర్ ,

నన్దన్ మైన్దనాగ ఆగుమ్, నమ్బి నమ్బెరుమాన్ ,

ఎన్దై తన్దై తమ్బెరుమాన్, ఎవ్వుళ్ కిడన్దానే ll 1061

పన్దు అనైన్ద మెల్ విరలాళ్ పావైతన్ కారణత్తాల్=బంతి కలిగిన సున్నితమైన వేళ్ళుగల నప్పిన్నైపిరాట్టి కారణముగ; వెన్ తిఱల్ ఏఱు ఏழுమ్ వెన్ఱ వేన్దన్ = క్రూరమైన మిక్కిలి శక్తివంతమైన ఏడు వృషభములను వధించిన ప్రభువును; విరి పుగழ் శేర్ నన్దన్ =  లోకమందు వ్యాపించియున్న  కీర్తిగల నందగోపునకు; మైన్దనాగ ఆగుమ్ నమ్బి = కుమారునిగ అవతరించిన పరిపూర్ణుడును;నమ్ పెరుమాన్ = మనయొక్క స్వామియును; ఎన్దై తన్దై తమ్ పెరుమాన్=మనకులమంతకును నాధుడును, అయిన సర్వేశ్వరుడు; ఎవ్వుళ్ కిడన్దానే = తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

సున్నితమైన వేళ్ళుగల నప్పిన్నైపిరాట్టి కారణముగ క్రూరమైన, మిక్కిలి శక్తివంతమైన ఏడు వృషభములను వధించిన ప్రభువును, లోకమందు వ్యాపించిన  కీర్తిగల నందగోపునకు కుమారునిగ అవతరించిన పరిపూర్ణుడును, మనయొక్క స్వామియును,మనకులమంతకును నాధుడును, అయిన సర్వేశ్వరుడు  తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

పాలనాగి ఞాల మేழுముణ్డు, పణ్డు ఆలిలైమేల్ ,

శాలనాళుమ్ పళ్ళికొళ్ళుమ్, తామరైక్కణ్ణన్ ఎణ్ణిల్ ,

నీలమ్ ఆర్ వణ్డుణ్డు వాழுమ్, నెయ్ దలన్ త్తణ్ కழని ,

ఏలనాఱుమ్ పైమ్పుఱవిల్, ఎవ్వుళ్ కిడన్దానే ll 1062

పణ్డు = పూర్వమొక కాలమున; బాలనాగి = చిన్న శిశువై; ఞాలమ్ ఏழுమ్ ఉణ్డు =  సప్తలోకములను ఆరగించి; ఆల్ ఇలై మేల్ = వటపత్రముపై; శాల నాళుమ్ = చాల కాలము వరకు;పళ్ళి కొళ్ళుమ్= శయనించియుండిన;తామరైక్కణ్ణన్=పుండరీకాక్షుడు; ఎణ్ ఇల్ నీలమ్=లెక్కలేని కలవ పుష్పములలో; ఆర్ వణ్డు ఉణ్డు వాழுమ్=వ్యాపించి తుమ్మెదలు తేనెను గ్రోలి నివసించుచుండెడి; అమ్ తణ్ = అందమైన చల్లని, నెయ్ దల్ కழని=కలువపువ్వులుగల పొలములును;ఏలమ్ నాఱుమ్ పై పుఱవిల్= పరిమళము వీచెడి తోటలతోను వ్యాపించియున్న; ఎవ్వుళ్ కిడన్దానే = తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

పూర్వము ప్రళయ కాలమున చిన్న శిశువై సప్తలోకములను ఆరగించి వటపత్రముపై చాల కాలము వరకు శయనించియుండిన పుండరీకాక్షుడు,లెక్కలేని కలవ పుష్పములలో వ్యాపించి, తుమ్మెదలు తేనెను గ్రోలి నివసించుచుండెడి  అందమైన చల్లని కలువపువ్వులుగల పొలములును, పరిమళము వీచెడి తోటలతోను వ్యాపించియున్న  తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

శోత్తమ్ నమ్బియెన్ఱు, తొణ్డర్ మిణ్డి త్తొడర్ న్దழைక్కుమ్ ,

ఆత్తనమ్బి శెఙ్గణమ్బి, ఆగిలుమ్ దేవర్కెల్లామ్ ,

మూత్తనమ్బి ముక్కణమ్బి ఎన్ఱు, మునివర్ తొழுదు 

ఏత్తుమ్, నమ్బి యెమ్బెరుమాన్, ఎవ్వుళ్ కిడన్దానే ll 1063

తొణ్డర్ మిణ్డి=ఆశ్రితులు గుంపులుగుంపులుగకూడి; నమ్బి శోత్తమ్ ఎన్ఱు తొడర్ న్దు  అழைక్కుమ్= “స్వామీ! నీ దివ్య చరణములందు మా అంజలిని స్వీకరించిమా!”అని  చెప్పుచు నీచెంతచేరి స్తుతించుచుండబడు; ఆత్తన్ = మిక్కిలి ఆప్తుడగు; నమ్బి= స్వామియు;శెమ్ కణ్ = ఎర్రని తామర పుష్పమువంటి నేత్రములు కలవాడును;నమ్బి ఆగిలుమ్ = పరిపూర్ణడైన స్వామి అయినను; మునివర్ = సనకాది మహాఋషులు; దేవర్కు ఎల్లామ్=దేవతలందరిలో పెద్ద వారైన,మూత్తనమ్బి ముక్కణమ్బి ఎన్ఱు తొழுదు ఏత్తుమ్= చతుర్ముఖ బ్రహ్మను, శివునిని స్వామీయని సేవించి స్తుతించునట్లు; నమ్బి ఎమ్బెరుమాన్ = సర్వాంతర్యామి యైన సర్వేశ్వరుడు; ఎవ్వుళ్ కిడన్దానే = తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

ఆశ్రితులు గుంపులుగుంపులుగకూడి, “స్వామీ! నీ దివ్య చరణములందు  మా అంజలిని స్వీకరించుమా!” అనిచెప్పుచు నీచెంతచేరి స్తుతించుచుండబడు మిక్కిలి ఆప్తుడగు స్వామియు, ఎర్రని తామరపుష్పమువంటి నేత్రములు కలవాడును, పరిపూర్ణడైన స్వామి అయినను, సనకాది మహాఋషులు, దేవతలందరిలో పెద్ద వారైన చతుర్ముఖ బ్రహ్మను, శివునిని ‘స్వామీ!’ యని సేవించి స్తుతించునట్లు, సర్వాంతర్యామి యైన సర్వేశ్వరుడు తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

తిఙ్గళ్ అప్పు వాన్ ఎరి కాలాగి, తిశైముగనార్

తఙ్గళప్పన్ శామియప్పన్, పాగత్తిరున్ద, వణ్డుణ్

తొఙ్గల్ అప్పు నీళ్ ముడియాన్, శూழ்కழల్ శూడినిన్ఱ ,

ఎఙ్గళప్పన్ ఎమ్బెరుమాన్, ఎవ్వుళ్ కిడన్దానే ll 1064

తిఙ్గళ్ = చంద్రునికి(అంతర్యామిగాను); అప్పు వాన్ ఎరి కాల్ ఆగి = జలము, ఆకాశము, అగ్ని,వాయువు, మొదలగు అన్ని భూతములకు శరీరమైనవాడును; తిశైముగనార్ అప్పన్ = చతుర్ముఖ బ్రహ్మకు తండ్రియును; శామి అప్పన్ = సామవేదముచే ప్రతిపాదింపబడు స్వామియును; బాగత్తు ఇరున్ద=తన తిరుమేనియందు ఒక ప్రక్కన చేరియున్న; వణ్డు ఉణ్ తొఙ్గల్ అప్పు నీళ్ ముడియాన్=తుమ్మెదలు మధువును పానము చేసెడి కొన్ఱై పూల మాలయును, గంగా జలముతో ఒప్పు పొడుగైన జడలుగల శివుడు; శూழ்కழల్ శూడి నిన్ఱానై = విశాలమైన పాదపద్మములు తన తలపై అలంకరించునట్లు ఉన్నవాడును; ఎఙ్గళ్ అప్పన్ ఎమ్బెరుమాన్ = మనయొక్క తండ్రి సర్వేశ్వరుడు; ఎవ్వుళ్ కిడన్దానే=తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

చంద్రునికి అంతర్యామిగాను, జలము, ఆకాశము,అగ్ని,వాయువు, మొదలగు అన్ని భూతములకు శరీరమైనవాడును,చతుర్ముఖ బ్రహ్మకు తండ్రియును, సామవేదముచే ప్రతిపాదింపబడు స్వామియును, తన తిరుమేనియందు ఒక ప్రక్కన చేరియున్న, తుమ్మెదలు మధువును పానము చేసెడి కొన్ఱై పూలమాలయును, గంగా జలముతో ఒప్పు పొడుగైన జడలుగల శివుడు, విశాలమైన పాదపద్మములు తన తలపై అలంకరించునట్లు ఉన్నవాడును, మనయొక్క తండ్రి సర్వేశ్వరుడు  తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

మునివన్ మూర్తి మూవరాగి, వేదమ్ విరిత్తు ఉరైత్త

పునిదన్, పూవైవణ్ణన్ అణ్ణల్, పుణ్ణియన్ విణ్ణవర్ కోన్ ,

తనియన్ శేయన్ తానొరువనాగిలుమ్, తన్నడియార్కు

ఇనియన్, ఎన్దై యెమ్బెరుమాన్,  ఎవ్వుళ్ కిడన్దానే ll 1065

మునివన్ = సర్వలోకములను సృష్ఠించుటకు సంకల్పించినవాడును; మూర్తి మూవరాగి = బ్రహ్మ,విష్ణు,శివుడు అని చెప్పబడు ముగ్గురు మూర్తులు తానే అయినవాడును; వేదమ్ విరిత్తు ఉరైత్త పునిదన్ = వేదార్ధములు వ్యక్తమగునట్లు చెప్పిన పవిత్రుడును; పూవై వణ్ణన్ = రెల్లు పూవువంటి వర్ణముకలవాడును;అణ్ణల్ =సర్వ స్వామియును; పుణ్ణియన్ = పుణ్యస్వరూపుడును; విణ్ణవర్ కోన్ = నిత్యశూరులకు ప్రభువును; తనియన్ = అద్వితీయుడును; తాన్ శేయన్ ఒరువనాగిలుమ్ = తాను ఏ ఒక్కరికి అందని విశిష్ఠమైన వాడైనను; తన్ అడియూర్కు ఇనియన్ = తనయొక్క దాసులకు పరమభోగ్యుడుగ నుండు; ఎన్దై ఎమ్బెరుమాన్ = నాయొక్క తండ్రి సర్వేశ్వరుడు; ఎవ్వుళ్ కిడన్దానే = తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

    సర్వలోకములను సృష్ఠించుటకు సంకల్పించినవాడును, బ్రహ్మ, విష్ణు, శివుడు అని చెప్పబడు ముగ్గురు మూర్తులు తానే అయినవాడును, వేదార్ధములు వ్యక్తమగునట్లు చెప్పిన పవిత్రుడును, రెల్లు పూవువంటి వర్ణముకలవాడును, సర్వ స్వామియును, పుణ్యస్వరూపుడును, నిత్యశూరులకు ప్రభువును, అద్వితీయుడును, తాను ఏ ఒక్కరికి అందని విశిష్ఠమైనవాడైనను,తనయొక్క దాసులకు పరమభోగ్యుడుగ నుండు నాయొక్క తండ్రి సర్వేశ్వరుడు తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!.

పన్దిరుక్కుమ్ మెల్ విరలాల్, పావై పనిమలరాళ్ ,

వన్దిరుక్కుమ్ మార్వన్, నీలమేని మణివణ్ణన్ ,

అన్దరత్తిల్ వాழுమ్, వానోర్ నాయకనాయ్ అమైన్ద 

ఇన్దిరర్కుమ్ తమ్బెరుమాన్, ఎవ్వుళ్ కిడన్దానే ll 1066

పన్దు ఇరుక్కుమ్ మెల్ విరలాల్=బంతి కలిగిన సున్నితమైన వేళ్ళుగల;పనిమలరాళ్= చల్లని తామరపుష్పమందు ఉద్భవించిన; పావై=శ్రీమహాలక్ష్మి;వన్దు ఇరుక్కుమ్ మార్వన్= వచ్చి నిత్యవాసముచేయుచున్న వక్షస్థలముగలవాడును;నీలమ్ మేని మణివణ్ణన్=నీలి కలువవలె మిక్కిలి సుందరమైన వర్ణముగలవాడును; అన్దరత్తిల్ వాழுమ్ వానోర్ నాయకనాయ్ అమైన్ద ఇన్దిరర్కుమ్ తమ్ పెరుమాన్ = స్వర్గలోకములో నివసించు దేవతలకు నాయకుడైన ఇంద్రునకును స్వామియైన సర్వేశ్వరుడు; ఎవ్వుళ్ కిడన్దానే = తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

బంతి కలిగిన సున్నితమైన వేళ్ళుగల చల్లని తామరపుష్పమందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మి వచ్చి నిత్యవాసముచేయుచున్న వక్షస్థలముగలవాడును, నీలి కలువవలె మిక్కిలి సుందరమైన వర్ణముగలవాడును, స్వర్గలోకములో నివసించు దేవతలకు నాయకుడైన ఇంద్రునకును స్వామియైన సర్వేశ్వరుడు తిరు వెవ్వుళూర్ లో పవళించియున్నాడు సుమా!

** ఇణ్డై కొణ్డు తొణ్డరేత్త, ఎవ్వుళ్ కిడన్దానై ,

వణ్డు పాడుమ్ పైమ్బుఱవిన్, మంగైయర్ కోన్ కలియన్,

కొణ్డ శీరాల్ తణ్డమిழ் శెయ్ మాలై, యీరైన్దుమ్ వల్లార్ ,

అణ్డమ్ ఆళ్వదు ఆణై, అన్ఱేల్ ఆళ్వర్ అమరులగే ll 1067

తొణ్డర్ ఇణ్డై కొణ్డు ఏత్త = భక్తులు పుష్పమాలలను తెచ్చి స్తుతించుచుండెడి; ఎవ్వుళ్ కిడన్దానై = తిరు వెవ్వుళూర్ లో పవళించియున్న సర్వేశ్వరుని విషయమై; వణ్డు పాడుమ్ పై పుఱవిల్ మంగైయర్ కోన్ కలియన్ = తుమ్మెదలు సంతోషముతో ఇంపుగ పాడుచుండు విశాలమైన తోటలతో చుట్టబడియున్న తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్; కొణ్డ శీరాల్ = భగవద్గుణములతో పూర్ణమైన హృదయముతో; తణ్ తమిழ் శెయ్ మాలై=అందమైన తమిళ భాషలో అనుగ్రహించిన పాశురముల మాలయైన; యీర్ ఐన్దుమ్ వల్లార్ = ఈ పదియును అనుసంధించువారు; అణ్డమ్ ఆళ్వదు ఆణై = ఈ బ్రహ్మాండమంతయును పరిపాలించుట తధ్యము; అన్ఱేల్ = ఈ లోకములను పాలించు ఆశలేనివారు; అమరులగే ఆళ్వర్ = పరమపదమును పరిపాలించుదరు.

        భక్తులు పుష్పమాలలను తెచ్చి స్తుతించుచుండెడి తిరు వెవ్వుళూర్ లో పవళించియున్న సర్వేశ్వరుని విషయమై,తుమ్మెదలు సంతోషముతో ఇంపుగ  పాడుచుండు విశాలమైన తోటలతో చుట్టబడియున్న తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ భగవద్గుణములతో పూర్ణమైన హృదయముతో అందమైన తమిళ భాషలో అనుగ్రహించిన పాశురముల మాలయైన ఈ పదియును అనుసంధించువారు ఈ బ్రహ్మాండమంతయును పరిపాలించుట తధ్యము, అట్లు ఈ లోకములను పాలించు ఆశలేనివారు పరమపదమును తప్పక పరిపాలించుదరు.

************

వ్యాఖ్యానించండి