శ్రీః
3. విఱ్పెరువిழవుమ్
తొండమాన్ చక్రవర్తి ప్రార్ధింపగ శ్రీ వెంకటేశ్వరస్వామి,శ్రీకృష్ణునిగ తనయొక్క కుటుంబసమేతముగ సేవనొసగిన తిరువల్లికేణి దివ్యదేశమును,తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** విఱ్పెరువిழవుమ్ కఞ్జనుమ్ మల్లుమ్, వేழுముమ్ పాగనుమ్ వీழ ,
శెర్ట్రవన్దన్నై పురమెరిశెయ్ ద, శివన్ ఉఱు తుయర్ కళై తేవై ,
పర్ట్రలర్ వీయ క్కోల్ కైయిల్ కొణ్డు, పార్తన్ తన్ తేర్ మున్ నిన్ఱానై ,
శిర్ట్రవై పణియాల్ ముడి తుఱన్దానై, తిరువల్లికేణిక్కణ్డేనే ll 1068
పెరు విల్ విழవుమ్ = శ్లాఘ్యమైన ధనుర్యాగమను ఉత్సవమును; కఞ్జనుమ్ =(ఆ ఉత్సవమును నడుపుచున్న) కంసునియు; మల్లుమ్ =(ఆ కంసునిచే ప్రేరేరింపబడిన) చాణూరముష్టికులనబడు మల్లులను, వేழுముమ్ = కువలయాపీడమను ఏనుగును, పాగనుమ్ = దానిని నడుపుతున్న మావటివాడును; వీழ = భంగపడునట్లు; శెర్ట్రవన్ తన్నై= ధ్వంసముచేసినవాడును; పురమ్ ఎరిశెయ్ ద = త్రిపురములను దహింపజేసిన; ఉఱు తుయర్=శివుడు పొందిన బ్రహ్మహత్యాపాతకముచే కలిగిన దుఃఖమును;కళై = నిర్మూలించిన;తేవై=దేవుడును;పర్ట్రలర్ వీయ = శత్రువులు నశించునట్లు; కోల్ కైయిల్ కొణ్డు = కొరడాను హస్తమందు గైకొని; పార్తన్ తన్ తేర్ మున్ నిన్ఱానై=పార్ధునియొక్క రథముపై సారధిగ ఆసీనుడైనవాడును; శిరు అవై పణియాల్ ముడి తుఱన్దానై = తన పినతల్లి కైకేయి చెప్పిన మాటలనుసరించి పట్టాభిషేకమును ఉపేక్షించిన సర్వేశ్వరుని; తిరువల్లికేణి క్కణ్డేనే = తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
శ్లాఘ్యమైన ధనుర్యాగమను ఉత్సవమును, ఆ ఉత్సవమును నడుపుచున్న కంసునియు,ఆ కంసునిచే ప్రేరేరింపబడిన చాణూరముష్టికులనబడు మల్లులను, కువలయాపీడమను ఏనుగును, దానిని నడుపుతున్న మావటివాడును,భంగపడునట్లు ధ్వంసముచేసినవాడును,త్రిపురములను దహింపజేసిన శివుడు పొందిన బ్రహ్మహత్యా పాతకముచే కలిగిన దుఃఖమును నిర్మూలించిన దేవుడును, శత్రువులు నశించునట్లు కొరడాను హస్తమందు గైకొని పార్ధునియొక్క రథముపై సారధిగ ఆసీనుడైనవాడును,తన పినతల్లి కైకేయి చెప్పిన మాటలనుసరించి పట్టాభిషేకమును ఉపేక్షించిన సర్వేశ్వరుని తిరువల్లికేణి దివ్యదేశమున దర్శించి సేవించుకొంటిని.
వేదత్తై వేదత్తిన్ శువై పయనై, విழுమియ మునివర్ విழுఙ్గుమ్ ,
కోదిల్ ఇన్ కనియై నన్ దనార్ కళిర్ట్రై, కువలయత్తోర్ తొழுదేత్తుమ్,
ఆదియై అముదై యెన్నై యాళుడైయప్పనై, ఒప్పవర్ ఇల్లా
మాతర్ గళ్ వాழுమ్, మాడమామయిలైతిరువల్లికేణిక్కణ్డేనే ll 1069
వేదత్తై = వేదస్వరూపుడును;శువై=వారి వారియొక్క రుచికి తగినట్లు;వేదత్తిన్ పయనై=వేదములందు చెప్పబడు కర్మముల ఫలములను ఒసగువాడును; విழுమియ మునివర్ విழுఙ్గుమ్=శ్లాఘ్యమైన మునులచే అనుభవింపబడుచుండెడి; కోదుఇల్ ఇన్ కనియై=ఏ దోషములేని భోగ్యమైన పండువంటివాడును;నన్ దనార్ కళిర్ట్రై = నందగోపునకు పుట్టిన పిల్లఏనుగు వంటి కుమారుడును; కువలయత్తోర్ తొழுదు ఏత్తుమ్ = ఈ భూమియందలి జనులందరు సేవించి స్తుతించునట్లు ఒప్పు; ఆదియై = జగత్కారణభూతుడును; అముదై = అమృతమువలె పరమభోగ్యుడును;ఎన్నై ఆళుడై అప్పనై = నన్ను దాసునిగ స్వీకరించిన సర్వేశ్వరుని; ఒప్పవర్ ఇల్లా మాతర్ గళ్ వాழுమ్=సాటిలేని సుందరమైన స్త్రీలు వసించుచున్న,మాడ మా మయిలై=మేడలుగల శ్లాఘ్యమైన మైలాపూరులోనున్న; తిరువల్లికేణిక్కణ్డేనే = తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
వేదస్వరూపుడును, వారి వారియొక్క రుచికి తగినట్లు వేదములందు చెప్పబడు కర్మముల ఫలములను ఒసగువాడును, శ్లాఘ్యమైన మునులచే అనుభవింపబడుచుండెడి ఏ దోషములేని భోగ్యమైన పండువంటివాడును, నందగోపునకు పుట్టిన పిల్లఏనుగు వంటి కుమారుడును, ఈ భూమియందలి జనులందరు సేవించి స్తుతించునట్లు ఒప్పు జగత్కారణభూతుడును, అమృతమువలె పరమభోగ్యుడును,నన్ను దాసునిగ స్వీకరించిన సర్వేశ్వరుని,సాటిలేని సుందరమైన స్త్రీలు వసించుచున్న మేడలుగల శ్లాఘ్యమైన మైలాపూరులో నున్న తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
వఞ్జనైశెయ్య తాయురువాగి, వన్ద పేయ్ అలఱి మణ్ శేర ,
నఞ్జమర్ ములైయూడు ఉయిర్ శెగవుణ్డ, నాదనై తానవర్ కూర్ట్రినై ,
విఞ్జైవానవర్ శారణర్ శిత్తర్, వియన్తుదిశెయ్య పెణ్ణురువాగి ,
అఞ్జువైయముదమ్ అన్ఱు అళిత్తానై, తిరువల్లికేణిక్కణ్డేనే ll 1070
వఞ్జనై శెయ్య = మోసము చేయుటకై; తాయ్ ఉరువాగి వన్ద = కన్న తల్లి యశోదాదేవి రూపమునుదాల్చి వచ్చిన;పేయ్=రక్కసి పూతన;అలఱి మణ్ శేర=బిగ్గరగ రోధించుచు భూమిపై పడునట్లు;నఞ్జు అమర్ ములైయూడు ఉయిర్ శెగ ఉణ్డ=విషము రాసుకొనిన స్తనములద్వారా ఆమెయొక్క ప్రాణములు పోవునట్లు పాలును ఆరగించిన; నాదనై = స్వామియును;దానవర్ కూర్ట్రినై=అసురులకు యముడువంటి వాడును; విఞ్జైవానవర్=విద్యాధరులు;శారణర్=చారణులు;శిత్తర్=సిద్ధులు;వియన్దు తుది శెయ్య=ఆశ్చర్యముతో స్తుతించునట్లు;పెణ్ ఉరువాగి=జగన్మోహినీ అవతారముదాల్చి;అన్ఱు=పూర్వకాలమున; అమ్ శువై అముదమ్ అళిత్తానై = మంచి రుచిగల అమృతమును (దేవతలకు) ఒసగిన సర్వేశ్వరుని; తిరువల్లికేణిక్కణ్డేనే=తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
మోసము చేసి చంపుటకై, కన్న తల్లి యశోదాదేవి రూపమునుదాల్చి వచ్చిన రక్కసి పూతన,బిగ్గరగ రోధించుచు భూమిపై పడునట్లు, విషము రాసుకొనిన స్తనములద్వారా ఆమెయొక్క ప్రాణములు పోవునట్లు పాలును ఆరగించిన స్వామియును, అసురులకు యముడువంటివాడును, అంతరిక్షమునగల విద్యాధరులు, చారణులు, సిద్ధులు ఆశ్చర్యముతో స్తుతించునట్లు జగన్మోహినీ అవతారముదాల్చి, పూర్వకాలమున మంచి రుచిగల అమృతమును (దేవతలకు) ఒసగిన సర్వేశ్వరుని, తిరువల్లికేణిదివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
ఇన్దిరనుక్కెన్ఱు ఆయర్ గళ్ ఎడుత్త, ఎழிల్ విழవిల్ పయనడై శెయ్ ,
మన్దిరవిదియిల్ పూశనై పెఱాదు, మழை పొழிన్దిడ తళర్ న్దు, ఆయర్
ఎన్దమ్మోడు ఇన ఆనిరై తళరామల్, ఎమ్బెరుమాన్ అరుళెన్న ,
అన్దమిల్ వరైయాల్ మழை తడుత్తానై, తిరువల్లికేణిక్కణ్డేనే ll 1071
ఇన్దిరనుక్కు ఎన్ఱు=ఇంద్రుని ఉద్దేశించి; ఆయర్ గళ్ ఎడుత్త=గోకులవాసులు నడిపించెడి; ఎழிల్ విழవిల్ = శ్లాఘ్యమైన ఉత్సవములో; పయనడై శెయ్ = అనాది ఆచారముగ చేయుచు వచ్చుచున్న; మన్దిర విదియిల్ = మంత్రముల క్రియలలో; పూశనై పెఱాదు= ఆరాధనను పొందనికారణమున;మழை పొழிన్దిడ = (ఇంద్రుడు) భయంకరమైన వర్షమును కురిపించగ; ఆయర్ తళర్ న్దు = గోపాలరు మిక్కిలి వ్యధపొంది; ఎమ్ పెరుమాన్ = ” మాకు ప్రభువైన శ్రీ కృష్ణా! “;ఎమ్ తమ్మోడు ఇన ఆనిరై తళరామల్ = మాతోబాటు ఈ పశువుల సమూహములు ఈ వర్షముచే క్షతి పొందనీయక; అరుళ్ ఎన్న = “కృపతో రక్షించుమా!” అని ప్రార్ధింపగ;అన్దమిల్ వరైయాల్ మழை తడుత్తానై= మిక్కిలి పెద్దదైన గోవర్ధనపర్వతముచే(దానిని పైకెత్తి) ఆ వర్షమును అడ్డగించిన సర్వేశ్వరుని; తిరువల్లికేణిక్కణ్డేనే= తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
ఇంద్రుని ఉద్దేశించి గోకులవాసులు నడిపించెడి శ్లాఘ్యమైన ఉత్సవములో అనాది ఆచారముగ చేయుచు వచ్చుచున్న విధముగ ఆరాధనను తాను పొందని కారణమున, మిక్కిలి కోపావేశముతో ఇంద్రుడు భయంకరమైన వర్షమును కురిపించగ, దానికి తట్టుకొనలేక గోపాలరు మిక్కిలి వ్యధపొంది,” మాకు ప్రభువైన శ్రీ కృష్ణా! “, మాతోబాటు ఈ పశువుల సమూహములు ఈ వర్షముచే క్షతి పొందనీయక “కృపతో రక్షించుమా!” అని ప్రార్ధింపగ, మిక్కిలి పెద్దదైన గోవర్ధనపర్వతమును పైకెత్తి ఆ వర్షమును అడ్డగించిన సర్వేశ్వరుని ,తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
ఇన్ తుణైప్పదుమత్తలర్ మగళ్ తనక్కుమ్ ఇన్బన్, నల్ పువిదనుక్కు ఇఱైవన్,
తన్ తుణై యాయర్ పావైనప్పినై తనక్కిఱై, మర్ట్రైయోర్కెల్లామ్
వన్ తుణై, పఞ్జపాణ్డవర్కాగి వాయ్ఉరై తూదుశెన్ఱు, ఇయఙ్గుమ్
ఎన్ తుణై, ఎందై తందై తమ్మానై, తిరువల్లికేణిక్కణ్డేనే ll 1072
ఇన్ తుణై = తనకు మిక్కిలి మధురమైన సహచారణియైన; పదుమత్తు మగళ్ తనక్కుమ్ ఇన్బన్ = పద్మమునందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మికి మిక్కిలి ఇష్టమైన వాడును;నల్ పువి తనుక్కు ఇఱైవన్=మిక్కిలి సహనముగల శ్రీ భూదేవికి నాధుడును; తన్ తుణై =తననే ఆధారముగ కలిగిన, ఆయర్ పావై నప్పినై తనక్కు ఇఱై = గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టికి నాయకుడును; మర్ట్రైయోర్కు ఎల్లామ్ = మిగిలినవారందరికిని; వన్ తుణై = ఒకప్పుడును వీడని దృఢమైన సహాయకుడును; పఞ్జ పాణ్డవర్కు ఆగి =పంచ పాండవుల కొరకు; తూదు శెన్ఱు = దూతగ వెడలి; వాయ్ఉరై ఇయఙ్గుమ్ = పాండవులు చెప్పిన మాటలను దుర్యోదనాదులకు చెప్పినవాడును;ఎన్ తుణై = నాకు మిక్కిలి సహాయకుడుగ నుండువాడును; ఎందై తందై తమ్మానై = మా కుల ధనమైన సర్వేశ్వరుని; తిరువల్లికేణిక్కణ్డేనే= తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
తనకు మిక్కిలి మధురమైన సహచారణియైన పద్మమునందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మికి మిక్కిలి ఇష్టమైన వాడును,మిక్కిలి సహనముగల శ్రీ భూదేవికి నాధుడును,తననే ఆధారముగ కలిగిన గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టికి నాయకుడును,మిగిలినవారందరికిని ఒకప్పుడును వీడని దృఢమైన సహాయకుడును, పంచ పాండవుల కొరకు దూతగ వెడలి పాండవులు చెప్పిన మాటలను దుర్యోదనాదులకు చెప్పినవాడును,నాకు మిక్కిలి సహాయకుడుగ నుండువాడును, మా కుల ధనమైన సర్వేశ్వరుని తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
అన్దకన్ శిఱువన్ అరశర్ తమ్మరశర్కు ఇళైయవన్, అణియిழைయై చ్చెన్ఱు,
ఎన్దమక్కు ఉరిమై శెయ్యెన త్తరియాదు, ఎమ్బెరుమాన్ అరుళెన్న,
శన్దమల్ కుழలాల్ అలక్కణ్ నూర్ట్రువర్ తమ్, పెణ్డిరుమెయ్ ది నూలిழప్ప ,
ఇన్దరన్ శిఱువన్ తేర్ మున్నిన్ఱానై, తిరువల్లికేణిక్కణ్డేనే ll 1073
అన్దకన్ శిఱువన్ = అంధుడైన ధృతరాష్టుని పుత్రుడైన;అరశర్ తమ్ అరశర్కు = రాజాధిరాజు దుర్యోధనునకు; ఇళైయవన్ = తమ్ముడు దుశ్శాశనుడు; అణి ఇழைయై శెన్ఱు = అందమైన ఆభరణములు కలిగిన ద్రౌపదియున్న స్థలమునకు వెడలి;ఎన్దమక్కు ఉరిమై శెయ్ ఎన = ” నిన్ను జూదములో గెలిచిన మాకందరికి దాసియై ఊడిగము చేయవలెను “అని చెప్పగ; తరియాదు=ఆమె సహించలేక;ఎమ్బెరుమాన్ అరుళ్ ఎన్న= “స్వామీ! శ్రీ కృష్ణా! నాపై కృపజేయుమా!”అని ప్రార్ధింపగ; శన్దమల్ కుழలాల్ అలక్కణ్=నల్లని వర్ణముకలిగిన కుంతలములుగల ద్రౌపదియొక్క మనోదుఃఖమును;నూర్ట్రువర్ తమ్ పెణ్డిరుమ్ ఎయ్ ది=దుర్యోధనుడు మొదలగు ఆ నూరుగురి సహోదరుల పత్నులు పొందిన; నూల్ ఇழప్ప = వారి మంగళసూత్రములు తొలగిపోవునట్లు; ఇన్దరన్ శిఱువన్ తేర్ మున్ నిన్నానై = ఇంద్రుని పుత్రుడైన అర్జునుని రధముపై సారధిగముందు నిలిచిన సర్వేశ్వరుని;తిరువల్లికేణిక్కణ్డేనే=తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
అంధుడైన ధృతరాష్టుని పుత్రుడైన రాజాధిరాజు (అట్లు తలచుచుండెడి) దుర్యోధనునకు తమ్ముడు దుశ్శాశనుడు, అందమైన ఆభరణములు కలిగిన ద్రౌపదియున్న స్థలమునకు వెడలి,”నిన్ను జూదములో గెలిచిన మాకందరికి దాసియై ఊడిగము చేయవలెను”అని చెప్పగ,ఆమె సహించలేక,”స్వామీ! శ్రీ కృష్ణా! నాపై కృపజేయుమా!”అని ప్రార్ధింపగ,నల్లని వర్ణముకలిగిన కుంతలములుగల ద్రౌపదియొక్క మనోదుఃఖమును, దుర్యోధనుడు మొదలగు ఆ నూరుగురి సహోదరుల పత్నులు పొందిన, వారి మంగళసూత్రములు తొలగిపోవునట్లు,ఇంద్రుని పుత్రుడైన అర్జునుని రధముపై సారధిగముందు నిలిచిన సర్వేశ్వరుని తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
బరతనుమ్ తమ్బి శత్తురుక్కననుమ్, ఇలక్కుమనోడు మైదిలియుమ్ ,
ఇరవునన్పగలుమ్ తుదిశెయ్యనిన్ఱ, ఇరావణాన్దగనై యెమ్మానై ,
కురవమే కమழுమ్ కుళిర్ పొழுలూడు, కుయిలొడు మయిల్ గళ్ నిన్ఱాల ,
ఇరవియిన్ కదిర్ గళ్ నుழைదల్ శెయ్ దఱియా, తిరువల్లికేణిక్కణ్డేనే ll 1074
బరతనుమ్=భరతుడును;తమ్బి శత్తురుక్కననుమ్=అతని తమ్ముడైన శత్రుఘ్నడును; ఇలక్కుమనోడు = లక్ష్మనునితోబాటు; మైదిలియుమ్ = సీతాదేవియును; ఇరవుమ్ నల్ పగలుమ్ = రాత్రి పగలుఎడతెగక; తుదిశెయ్య నిన్ఱ = స్తుతించునట్లు కృపతో వేంచేసిన; ఇరావణ అన్దగనై ఎమ్మానై = రావణ సంహారియైన సర్వేశ్వరుని, కురవమే కమழுమ్ కుళిర్ పొழுలూడు = ‘ కురా ‘ పుష్పములచే పరిమళము వీచబడు చల్లని తోటలలో, కుయిలొడు మయిల్ గళ్ నిన్ఱు ఆ = కోకిల పాటలతోను,నెమళ్ళ నృత్యములతోను ఎల్లప్పుడును ఒప్పునదియు; ఇరవియిన్ కదిర్ గళ్ నుழைదల్ శెయ్ దు అఱియా = సూర్యకిరణములు ప్రవేశించనట్టిదియు; (అట్టి) ,తిరువల్లికేణిక్కణ్డేనే=తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
భరతుడును,అతని తమ్ముడైన శత్రుఘ్నడును,లక్ష్మనునితోబాటు, సీతాదేవియును రాత్రి పగలు ఎడతెగక స్తుతించునట్లు కృపతో వేంచేసిన రావణ సంహారియైన సర్వేశ్వరుని,’ కురా ‘ పుష్పములచే పరిమళము వీచబడు చల్లని తోటలలో కోకిల పాటలతోను,నెమళ్ళ నృత్యములతోను ఎల్లప్పుడును ఒప్పునదియు,(దట్టమైన తోటల కారణముగ)సూర్యకిరణములు ప్రవేశించనట్టిదియు,తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
పళ్ళియుళ్ ఓదివన్ద తన్ శిఱువన్, వాయిల్ ఓరాయిరనామమ్ ,
ఒళ్ళియవాగి ప్పోద ఆఙ్గు అదనుక్కు, ఒన్ఱుమోర్ పొరుప్పిలనాగి ,
పిళ్ళైయైచ్చీఱి వెకుణ్డుతూణ్ పుడైప్ప, ప్పిఱైయెయిర్ట్రు అనల్ విழிప్పేழ் వాయ్,
తెళ్ళియ శిఙ్గమాగియదేవై, తిరువల్లికేణిక్కణ్డేనే ll 1075
పళ్ళియుళ్ ఓది వన్ద = పాఠశాలయందు విధ్య అభ్యసించి గృహమునకు వచ్చిన; తన్ శిఱువన్=తన కుమారుడైన ప్రహ్లాదుని యొక్క;వాయిల్=నోటియందు;ఓర్=విలక్షణమైన; ఆయిరనామమ్ = సహస్రనామములు; ఒళ్ళియ ఆగి పోద = బహుసుందరముగ ఉచ్ఛరింపబడగ; ఆఙ్గు = అచట; అదనుక్కు ఒన్ఱుమ్ ఓర్ పొరుప్పు ఇలన్ ఆగి = ఆ శబ్దములకు కొంచమైనను సహింపలేనివాడై (హిరణ్యాసురుడు); పిళ్ళైయై శీఱి వెకుణ్డు = ఆ ప్రహ్లాదునిపై మిక్కిలి కోపగించి; (వాదోపవాదముల తరువాత ) తూణ్ పుడైప్ప = స్తంబమును విరగకొట్టగ; పిఱై ఎయిఱు అనల్ విழி పేழ் వాయ్ = చంద్రవంక వంటి కోరలు, నిప్పులు కురియుచున్న నేత్రములు,పెద్ద నోరుగల; తెళ్ళియ శిఙ్గమ్ ఆగియ దేవై = స్వచ్ఛమైన నరసింహాకారముగ అవతరించిన సర్వేశ్వరుని; తిరువల్లికేణిక్కణ్డేనే = తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
పాఠశాలయందు విధ్య అభ్యసించి గృహమునకు వచ్చిన తన కుమారుడైన ప్రహ్లాదుని యొక్క నోటియందు శ్రీ మన్నారాయణుని సహస్రనామములు బహుసుందరముగ ఉచ్ఛరింపబడగ, ఆ సమయమున ఆ శబ్దములకు కొంచమైనను సహింపలేనివాడై హిరణ్యాసురుడు తన పుత్రుడైన ప్రహ్లాదునిపై మిక్కిలి కోపగించి, వాదోపవాదముల తరువాత అచట తాను సూచించిన స్తంబమును విరగకొట్టగ, చంద్రవంక వంటి కోరలు, నిప్పులు కురియుచున్న నేత్రములు,పెద్ద నోరుగల నరసింహాకారముగ అవతరించిన సర్వేశ్వరుని తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
మీనమర్ పొయ్ గై నాణ్మలర్ కొయ్ వాన్, వేట్కైయినోడు శెన్ఱిழన్ద,
కానమర్ వేழమ్ కైయెడుత్తు అలఱ, కరా అదన్ కాలినై క్కదువ ,
ఆనైయిన్ తుయరమ్ తీర ప్పుళ్ళూర్ న్దు, శెన్ఱు నిన్ఱు ఆழி తొట్టానై,
తేనమర్ శోలై మాడ మామయిలై, తిరువల్లికేణిక్కణ్డేనే ll 1076
మీన్ అమర్ పొయ్ గై=మత్స్యములతో నిండిన ఒకతటాకములో;నాళ్ మలర్ కొయ్ వాన్= అప్పుడే వికసించిన పుష్పములను కోయుటకు; వేట్కైయినోడు = మిక్కిలి కోరికతో; శెన్ఱు ఇழన్ద = పోయి తటాకమున ప్రవేశించిన; కాన్ అమర్ వేழమ్ = అడవిలో తిరిగెడి గజేంద్రుడు; కైయెడుత్తు అలఱ= దాని తొండమును పైకెత్తి బిగ్గరగ రోధించునట్లు; కరా అదన్ కాలినై కదువ = మొసలి ఆ గజేంద్రుని కాలును తన నోటితో పట్టుకొనగ;ఆనైయిన్ తుయరమ్ తీర=ఆ గజేంద్రుని దుఃఖమును పోగొట్టుటకై; ప్పుళ్ళూర్ న్దు శెన్ఱు=గరుడాళ్వార్ ను వాహనముగ చేసుకొని కృపతో వేంచేసి; నిన్ఱు= ఆ తటాకముయొక్క ఒడ్డున నిలిచి; ఆழி తొట్టానై =చక్రాయుధమును (ఆ మొసలిపై ) ప్రయోగించిన సర్వేశ్వరుని;తేన్ అమర్ శోలై = తుమ్మెదలతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న;మాడమ్ మామయిలై = పెద్ద మేడలుగల మైలాపూరులోనున్న; తిరువల్లికేణిక్కణ్డేనే = తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
మత్స్యములతో నిండిన ఒకతటాకములో అప్పుడే వికసించిన పుష్పములను కోయుటకు మిక్కిలి కోరికతో పోయి తటాకమున ప్రవేశించిన అడవిలో తిరిగెడి గజేంద్రుడు ,దాని తొండమును పైకెత్తి బిగ్గరగ రోధించునట్లు,పెద్ద మొసలి ఆ గజేంద్రుని కాలును తన నోటితో పట్టుకొనగ,ఆ గజేంద్రుని దుఃఖమును పోగొట్టుటకై, గరుడాళ్వార్ ను వాహనముగ చేసుకొని కృపతో వేంచేసి, ఆ తటాకముయొక్క ఒడ్డున నిలిచి,చక్రాయుధమును ఆ మొసలిపై ప్రయోగించిన సర్వేశ్వరుని,తుమ్మెదలతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న, పెద్ద మేడలుగల మైలాపూరులోనున్న,తిరువల్లికేణి దివ్యదేశమును దర్శించి సేవించుకొంటిని.
** మన్ను తణ్ పొழிలుమ్ వావియుం మదిళుం, మాడమాళికైయుం మణ్డపముం,
తెన్నన్ తొండైయర్ కోన్ శెయ్ ద నన్మయిలై, తిరువల్లికేణి నిన్ఱానై ,
కన్నినన్మాడమంగైయర్ కోన్ తలైవన్, కామరుశీర్ కలికన్ఱి ,
శొన్న శొన్మాలైపత్తుడన్ వల్లార్, శుకమ్ ఇనిదు ఆళ్వర్ వానులగే ll 1077
మన్ను = నిత్యమైన; తణ్ పొழிలుమ్ = చల్లని తోటలును; వావియుం = జలాశయములును; మదిళుం = ప్రాకారములును; మాడ మాళికైయుం = మేడలు, పెద్ద భవంతులును; మణ్డపముం = పెద్ద మండపములును కలిగిన; తెన్నన్ = పాండ్యరాజుని వంశజుడైన; తొండైయర్ కోన్ శెయ్ ద = తొండైదేశవాసులకు ప్రభువైన తొండమాన్ చక్రవర్తి నిర్మించిన;నల్ మయిలై=అందమైన మైలాపూరులో నున్న; తిరువల్లికేణి నిన్ఱానై = తిరువల్లికేణి దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై; కన్ని నల్ మాడ మంగైయర్ కోన్ తలైవన్ = దృఢమైన మంచి మేడలుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువును; కామరుశీర్ = శ్లాఘ్యమైన శ్రీ వైష్ణవలక్ష్మి గలవారైన; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; శొన్న = కృపతో అనుగ్రహించిన; శొల్ మాలై పత్తుడన్ వల్లార్ = సూక్తులమాలైన ఈ పది పాసురములు అనుసంధించువారు; శుకమ్ ఇనిదు వాన్ ఉలగు = ఆనందమయమయిన పరమపదమును; ఆళ్వర్ = పరిపాలించు సౌభాగ్యమును పొందుదురు.
పాండ్యరాజుని వంశజుడైన తొండైదేశవాసులకు ప్రభువైన తొండమాన్ చక్రవర్తిచే నిర్మింపబడిన, నిత్యమైన చల్లని తోటలు,జలాశయములు, ప్రాకారములు, మేడలు, పెద్ద భవంతులు,పెద్ద మండపములు కలిగిన అందమైన మైలాపూరులోనున్న తిరువల్లికేణి దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై, దృఢమైన మంచి మేడలుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువును, శ్లాఘ్యమైన శ్రీ వైష్ణవలక్ష్మి గలవారైన తిరుమంగై ఆళ్వార్ కృపతో అనుగ్రహించిన సూక్తులమాలైన ఈ పది పాసురములు అనుసంధించువారు ఆనందమయమయిన పరమపదమును పరిపాలించు సౌభాగ్యమును పొందుదురు.
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
***************