పెరియ తిరుమొழி-2వపత్తు (4)

శ్రీః 

4. అన్ఱాయర్

    శ్రీమన్నారాయణుడు కృపతో  నిత్యవాసము చేయుచున్న నీర్మలై దివ్యదేశమును తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు. 

** అన్ఱాయర్ కులక్కొడియోడు, అణిమామలర్ మఙ్గైయొడు అన్బళవి, అవుణర్కు

ఎన్ఱానుం ఇలక్కమిలాదవనుక్కు, ఉఱైయుమిడమావదు, ఇరుమ్బొழிల్ శూழ் 

నన్ఱాయ పునల్ నఱైయూర్ తిరువాలి కుడందై, తడన్తిగழ் కోవల్ నగర్ ,

నిన్ఱాన్ ఇరున్దాన్ కిడన్దాన్ నడన్దాఱ్కిడమ్, మామలైయావదు నీర్మలైయే ll 1078

అన్ఱు = శ్రీ కృష్ణావతారమందు, ఆయర్ కులక్కొడి యోడు=గొల్ల కులమందు జన్మించిన తీగవలె అతి సుకుమారమైన నప్పిన్నైపిరాట్టితోడను, అణి మామలర్ మఙ్ఙయొడు = మిక్కిలి సుందరమైన తామర పుష్పమందుపుట్టిన శ్రీదేవితోడను;అన్బు అళవి = ప్రేమతో కలసినవాడును; ఎన్ఱానుం = ఏ కాలమందైనను; అవుణర్కు= అసురుల విషయములో; ఇలక్కమ్ ఇలాదవనుక్కు = దయలేని సర్వేశ్వరునకు; ఉఱైయుమ్ ఇడమ్ ఆవదు = నివాసస్దానము ఏదనగ; ఇరు పొழிల్ శూழ் = విశాలమైన తోటలతో చుట్టబడియున్న; నన్ఱాయ పునల్ = పుష్కలముగ జలరాసులతో ఒప్పు; నఱైయూర్ నిన్ఱాన్ = తిరు నఱైయూర్ లో నిలిచియున్నవాడును; తిరువాలి ఇరున్దాన్ = తిరువాలి దివ్యదేశములో ఆశీనుడైయున్నవాడును; కుడందై కిడన్దాన్ = తిరుకుడందై దివ్య దేశములో శయనించి యున్నవాడును; తడమ్ తిగழ் కోవల్ నగర్ = తటాకములతో ప్రకాశించెడి తిరుకోవలూర్ లో; నడన్దాఱ్కు ఇడమ్ = నడచిన(ఉలగళంద తిరుక్కోలములో నున్న)  సర్వేశ్వరునకు నిత్యవాసముచేయు ప్రదేశము; మా మలై యావదు నీర్మలైయే = శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! ..

శ్రీ కృష్ణావతారమందు,గొల్ల కులమందు జన్మించిన తీగవలె అతి సుకుమారమైన నప్పిన్నైపిరాట్టితోడను, సుందరమైన తామర పుష్పమందుపుట్టిన శ్రీదేవితోడను, ప్రేమతో కలసినవాడును, ఏ కాలమందైనను అసురుల విషయములో దయలేని సర్వేశ్వరునకు, నివాసస్దానము ఏదనగ, విశాలమైన తోటలతో చుట్టబడియున్న పుష్కలముగ జలరాసులతో ఒప్పు తిరు నఱైయూర్ లో నిలిచియున్నవాడును, తిరువాలి దివ్యదేశములో ఆశీనుడై యున్నవాడును, తిరుకుడందై దివ్య దేశములో శయనించి యున్నవాడును, తటాకములతో ప్రకాశించెడి తిరుకోవలూర్ లో  నడచిన (ఉలగళంద తిరుక్కోలములో నున్న) సర్వేశ్వరునకు, నిత్యవాసముచేయు ప్రదేశము, శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! . 

కాణ్డావనమెన్బదోర్ కాడు, అమరర్కు అరైయనదు కణ్డు అవన్ నిఱ్క, మునే

మూణ్డు ఆరழల్ ఉణ్ణమునిన్దదువుమ్, అదువన్ఱియుమ్ మున్నులగం పొఱైతీర్తు

ఆణ్డాన్, అవుణనవన్ మార్బగలమ్, ఉగిరాల్ వగిరాగ మునిన్దు, అరియాయ్

నీణ్డాన్! కుఱలాగి నిమిర్ న్దవనుక్కిడమ్, మామలైయావదు నీర్మలైయే ll 1079

అమరర్కు అరైయన్ అవన్ = దేవతలకు ప్రభువైన ఇంద్రుడైన అతను; కణ్డు నిఱ్క= చూచుచుండగనే; మునే=అతని కళ్ళయెదుటనే; కాణ్డావనమ్ ఎన్బదు ఓర్ కాడు అదు=’ కాణ్డవవనము’ అనబడు ప్రసిద్ధమైన అడవి దానిపై; ఆర్ అழల్=అగ్నిదేవుడు; మూణ్డు ఉణ్ణ = మీదపడి ఆరగించుటకు; మునిన్దదువుమ్ = కోపగించి నియమించినవాడును; అదు అన్ఱియుమ్ = అదియేగాక, మున్ = పూర్వము ఒకప్పుడు (భారతయుద్దమందు) ఉలగం పొఱైతీర్తు = భూ భారమును తీర్చి; ఆణ్డాన్ = లోకములను రక్షించినవాడును; అవుణన్ అవన్ = రాక్షసుడు హిరణ్యాసురునియొక్క; అగలమ్ మార్బు = విశాలమైన వక్షస్థలమును; ఉగిరాల్ =  నఖములచే; వగిర్ ఆగ = రెండు భాగములగ చీల్చుటకు; మునిన్దు = కోపగించి; అరియాయ్ నీణ్డాన్ = నరసింహమూర్తిగ పెరిగినవాడును; కుఱల్ ఆగి =(మరియు) వామనుడై  అవతరించి; నిమిర్ న్ద అవనుక్కు= పెరిగిన సర్వేశ్వరునికి; ఇడమ్ = నివాసస్దానము (ఏదనగ); మా మలై యావదు నీర్మలైయే = శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! ..

దేవతలకు ప్రభువైన ఇంద్రుని కళ్ళయెదుటనే ఎటువంటి భయములేక ‘కాణ్డవవనము’ అనబడు ప్రసిద్ధమైన అడవిని, అగ్నిదేవుడు మీదపడి ఆరగించుటకు కోపముతో  నియమించిన వాడును, పూర్వము ఒకప్పుడు భారతయుద్దమందు భూమి భారమును తీర్చి లోకములను రక్షించినవాడును, రాక్షసుడు హిరణ్యాసురునియొక్క విశాలమైన వక్షస్థలమును నఖములచే రెండు భాగములగ చీల్చుటకు మిక్కిలి కోపావేశముతో నరసింహమూర్తిగ అవతరించినవాడును; మరియు వామనుడై  అవతరించి పెరిగిన సర్వేశ్వరునికి నివాసస్దానము ఏదనగ శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! 

అలమన్నుమ్ అడల్ శురిశఙ్గమెడుత్తు, అడలాழிయినాల్ అణియారురువిల్,

పులమన్ను వడంపునైకొంగైయినాళ్, పొఱై తీర మున్ ఆళ్ అడువాళమరిల్ ,

పలమన్నర్ పడ చ్చుడరాழிయినై, పకలోన్ మఱైయ ప్పణికొణ్డు అణిశేర్ ,

నిలమన్ననుమాయ్ ఉలగాణ్డవనక్కిడమ్, మామలైయావదు నీర్మలైయే ll 1080

అణి ఆర్ ఉరువిల్ =  అతిసుందరమైన తిరుమేనియందు; అడల్ ఆழிయినాల్ = తీక్షణమైన సుదర్శనచక్రముతో; అలమ్=నాగలి;మన్నుమ్ అడల్ శురిశఙ్గమ్ = నిత్య భయంకరమైన శ్రీపాంచజన్యమును;ఎడుత్తు = ధరించినవాడును;మున్ =పూర్వము ఒకప్పుడు; పులమ్ మన్ను వడం పునై కొంగైయినాళ్ = మనోహరమైన ఎల్లప్పుడును ఆభరణములచే అలంకృతమైన వక్షోజములుగల శ్రీ భూదేవి యొక్క;పొఱై తీర=భారము పోవునట్లు;ఆళ్ అడు వాళ్ అమరిల్=జనులందరిని తుదముట్టించు మహత్తైన యుద్ధములో; పల మన్నర్ పడ = అనేక రాజులు నశించునట్లు (చేసినవాడును); పకలోన్ మఱైయ = సూర్యుని కప్పునట్లు; శుడర్ ఆழிయినై పణికొణ్డు = మిక్కిలి ప్రకాశించు చక్రాయుధము యొక్క సేవలను స్వీకరించినవాడును; అణిశేర్ నిలమ్ మన్ననుమ్ ఆయ్ = అందమైన ఈ భూమండలమునకు నాయకునిగ ఉండి; ఉలగు ఆణ్డవనక్కు= లోకములను రక్షించు సర్వేశ్వరునియొక్క; ఇడమ్ = నివాసస్దానము (ఏదనగ); మా మలై యావదు నీర్మలైయే = శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! .

      అతిసుందరమైన తిరుమేనియందు తీక్షణమైన సుదర్శనచక్రముతో,నాగలి, నిత్య భయంకరమైన శ్రీపాంచజన్యమును ధరించినవాడును,పూర్వము ఒకప్పుడు,మనోహరమైన, ఎల్లప్పుడును ఆభరణములచే అలంకృతమైన వక్షోజములుగల శ్రీ భూదేవి యొక్క భారము పోవునట్లు జనులందరిని తుదముట్టించు మహత్తైన యుద్ధములో అనేక రాజులు నశించునట్లు చేసినవాడును,మిక్కిలి ప్రకాశించు చక్రాయుధముయొక్క సేవలను స్వీకరించినవాడును,అందమైన ఈ భూమండలమునకు నాయకునిగ ఉండి, లోకములను రక్షించు సర్వేశ్వరునికి నివాసస్దానము ఏదనగ శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! 

తాఙ్గాదదు ఓరాళరియాయ్, అవుణన్ తనై వీడ మునిన్దు అవనాల్ అమరుమ్,

పూఙ్గోదైయర్ పొఙ్గెరిమూழ்గ విళైత్తు అతువన్ఱియుమ్, వెన్ఱికొళ్ వాళమరిల్,

పాఙ్గాగ మున్ ఐవరోడు అన్బళవి, పతిట్రైన్దిరట్టి ప్పడైవేన్దర్ పడ,

నీఙ్గా చ్చెరువిల్ నిఱైకాత్తవనుక్కిడమ్, మామలైయావదు నీర్మలైయే ll 1081

తాఙ్గాదదు = ఎదురించు శత్రువులు సహింపజాలని; ఓర్ ఆళ అరి ఆయ్ = సాటిలేని నరసింహ రూపముదాల్చి; అవుణన్ తనై=అసురుడైన హిరణ్యాసురుని; వీడ మునిన్దు= ప్రాణము పోవునట్లు కోపగించి; అవనాల్ అమరుమ్ = అతనిచే భరింపబడెడి; పూమ్ కోదైయర్=అందమైన పూమాలలచే అలంకృతమైన స్త్రీలను;పొఙ్గు ఎరి మూழ்గ విళైత్తు= ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించునట్లు చేసినవాడును; అదు అన్ఱియుమ్ = అదియేగాక;మున్=పూర్వము ఒకప్పుడు;వెన్ఱికొళ్ వాళ్ అమరిల్=విజయముతోకూడిన పెద్ద యుద్ధములో; ఐవరోడు = పంచ పాండవులతో;పాఙ్గు ఆగ = తగువిధముగ; అన్బు అళవి = ప్రేమతో కలసి; పడై = ఆయుధములతోనున్న; పదిట్రైన్దిరట్టి వేన్దర్ పడ = నూరుగురైన దుర్యోదనాదులు నశించునట్లుజేసియు; నీఙ్గా శెరువిల్ = అంతులేని ఆ మహాభారత యుద్దముచే; నిఱై=(ద్రౌపదియొక్క)సౌశీల్యమును;కాత్తవనుక్కు=రక్షించిన సర్వేశ్వరునియొక్క, ఇడమ్ = నివాసస్దానము (ఏదనగ); మా మలై యావదు నీర్మలైయే = శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! .

        ఎదురించు శత్రువులు సహింపజాలని అద్వితీయమైన నరసింహ రూపముదాల్చి  అసురుడైన హిరణ్యాసురుని ప్రాణము పోవునట్లు కోపగించి,అతనిచే భరింపబడెడి అందమైన పూమాలలచే అలంకృతమైన స్త్రీలను ప్రజ్వలించుచున్న అగ్నిలో ప్రవేశించునట్లు చేసినవాడును, మరియు విజయముతోకూడిన పెద్ద యుద్ధములో,పంచ పాండవులతో తగువిధముగ ప్రేమతో కలసి ఆయుధములతోనున్న నూరుగురైన దుర్యోదనాదులు నశించునట్లుజేసియు,ఆ మహాభారత యద్దముచే ద్రౌపదియొక్క సౌశీల్యమును రక్షించిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము (ఏదనగ)  శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! .

మాలుమ్ కడలార మలై క్కువడిట్టు అణైకట్టి, వరమ్బు ఉరువ మదిశేర్ ,

కోల మదిళాయ ఇలఙ్గై కెడ, పడైతొట్టు ఒరుకాల్ అమరిల్ అదిర ,

కాలమిదువెన్ఱు అయన్ వాళియినాల్,కదిర్ నీణ్ముడిపత్తుమ్ అరుత్తమరుమ్,

నీలముగిల్వణ్ణన్ ఎమక్కిఱైవఱ్కిడమ్, మామలైయావదు నీర్మలైయే ll 1082

ఒరుకాల్ = పూర్వమొకకాలమున;మాలుమ్ కడల్ ఆర = పెద్ద అలలతో కూడిన సముద్రము నిండునట్లు; మలై క్కువడు ఇట్టు =  పర్వత శిఖరములను వేసి; వరమ్బు ఉరువ = అవతల ఒడ్డుకు చేరునట్లు; అణైకట్టి=సేతువును కట్టి; మదిశేర్ = చంద్రుని తాకు; కోల మదిళాయ = అందమైన ప్రాకారములుగల; ఇలఙ్గై కెడ = లంకాపురి నశించునట్లు; పడై తొట్టు = ఆయుధములను ప్రయోగించి;అమరిల్ అదిర= యుద్దములో కోలాహలము కలుగునట్లు; ఇదు కాలమ్ ఎన్ఱు = (ఈ రావణుని సంహరించుటకు) ఇదియే సరియయిన కాలమని తలచి; అయన్ వాళియినాల్ = బ్రహ్మాస్త్రముచే; కదిర్ నీళ్ ముడిపత్తుమ్ అరుత్తు=కిరీటములతో మెరయుచున్న పొడుగైన పది తలలను తునిమి;అమరుమ్ = అయోధ్యా నగరమునకు సీతాదేవితో,తాను చేరుకొన్న; నీలముగిల్వణ్ణన్=కాలమేఘవర్ణమువంటి రూపము కలగిన స్వామి; ఎమక్కు ఇఱైవఱ్కు=  మనయొక్క సర్వేశ్వరునికి; ఇడమ్ = నివాసస్దానము (ఏదనగ); మా మలై యావదు నీర్మలైయే = శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! .

     పూర్వమొకకాలమున,పెద్ద అలలతో కూడిన సముద్రము నిండునట్లు, పర్వత శిఖరములను వేసి, అవతల ఒడ్డుకు చేరునట్లు సేతువును కట్టి, చంద్రుని తాకు అందమైన ప్రాకారములుగల లంకాపురి నశించునట్లు ఆయుధములను ప్రయోగించి  యుద్దములో కోలాహలము కలుగునట్లు, ఈ రావణుని సంహరించుటకు ఇదియే సరియయిన కాలమని తలచి బ్రహ్మాస్త్రముచే కిరీటములతో మెరయుచున్న పొడుగైన పది తలలను తునిమి,అయోధ్యానగరమునకు సీతాదేవితో,తాను చేరుకొన్న కాలమేఘ వర్ణమువంటి రూపము కలగిన స్వామి, మనయొక్క సర్వేశ్వరుని నివాసస్దానము (ఏదనగ) శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! .

పారారులగుమ్ పనిమాల్ వరైయుమ్, కడలుమ్ శుడరుమ్ ఇవై ఉణ్డుమ్, ఎనక్కు

ఆరాదెన నిన్ఱవన్ ఎమ్బెరుమాన్, అలైనీరులగుక్కు అరశాకియ, అ

ప్పేరానై మునిన్ద మునిక్కరైయన్,పిఱరిల్లై నునక్కెనుమెల్లైయినాన్ ,

నీరార్ పేరాన్ నెడుమాలవనుక్కిడమ్, మామలైయావదు నీర్మలైయే ll 1083

ఆర్ పార్ ఉలగుమ్ = విశాలమైన భూలోకమును; పని మాల్ వరైయుమ్ =చల్లని పెద్ద పర్వతములును; కడలుమ్ = సముద్రములును; శుడరుమ్ = సూర్యచంద్రులును;ఇవై ఉణ్డుమ్ = మొదలైన వీటినన్నింటిని ఆరగించినను;ఎనక్కు ఆరాదు ఎన నిన్ఱవన్= ‘ నాయొక్క కడుపు నిండలేదే ‘ అనునట్లు నుండువాడును;ఎమ్బెరుమాన్=నాయొక్క ప్రభువు;అలై నీర్ ఉలగుక్కు అరశాగియ=అలలుకొట్టుచున్న మహాసముద్రములచే చుట్టబడియున్న ఈ భూమికి రాజులని చెప్పబడు; అప్పేరానై = ఆ పేరుగల క్షత్రీయ కులమును; మునిన్ద = కోపగించి తుదముట్టించిన; మునిక్కు అరైయన్ = మునులలో శ్రేష్ఠుడైన పరశురాముడును; నునక్కు పిఱర్ ఇల్లై ఎనుమ్ ఎల్లయినానై = ‘ నీకు పైన వేరొకరు లేదనునట్లు ‘ మిక్కిలి మహిమాన్వితుడై నుండువాడును;నీర్ ఆర్ పేరాన్ = “నీర్వణ్ణన్” అను దివ్యనామమును కలవాడును; నెడుమాల్  అవనుక్కు = ఆశ్రితులయందు వ్యామోహముగల సర్వేశ్వరునియొక్క; ఇడమ్ = నివాసస్దానము (ఏదనగ); మా మలై యావదు నీర్మలైయే = శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! .

విశాలమైన భూలోకమును,చల్లని పెద్ద పర్వతములును,సముద్రములును, సూర్యచంద్రులును, మొదలైన వీటినన్నింటిని ఆరగించినను,’ నాయొక్క కడుపు నిండలేదే ‘ అనునట్లు నుండువాడును, అలలుకొట్టుచున్న మహాసముద్రములచే చుట్టబడియున్న ఈ భూమిపైగల క్షత్రీయవంశమునకు చెందిన రాజులపై కోపగించి తుదముట్టించిన మునులలో శ్రేష్ఠుడైన పరశురాముడును, ‘ నీకు పైన వేరొకరు లేదనునట్లు ‘ మిక్కిలి మహిమాన్వితుడై నుండువాడును,”నీర్వణ్ణన్” అను దివ్యనామమును కలవాడును,ఆశ్రితులయందు వ్యామోహముగల సర్వేశ్వరునియొక్క నివాసస్దానము (ఏదనగ) శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా!

పుగరార్ ఉరువాగి మునిన్దవనై, ప్పుకழ் వీడ మునిన్దు ఉయిరుణ్డు, అశురన్

నగరాయిన పాழ்పడ నామమెఱిన్దు అదువన్ఱియుమ్, వెన్ఱికొళ్ వాళ్ అవుణన్, 

పగరాదవన్ ఆయిరనామమ్, అడి ప్పణియాదవనై ప్పణియాల్ అమరిల్ ,

నిగరాయవన్ నెఞ్జిడన్దానవనుక్కిడమ్, మామలైయావదు నీర్మలైయే ll 1084

పుగర్ ఆర్ ఉరువాగి = మిక్కిలి కాంతితోనిండిన రూపము కలిగి;మునిన్దవనై=(తనమీద) కోపముగల  పౌండ్రకవాసుదేవుని; ప్పుకழ் వీడ మునిన్దు = (అతని) కీర్తి నశించునట్లు కోపగించి; ఉయిర్ ఉణ్డు = అతనియొక్క ప్రాణములు హరించినవాడును; అశురన్ = అసురప్రవృత్తిగల అతనియొక్క; నగర్ ఆయిన=నగరములుగనున్న స్థానములన్నియు; నామమ్ పాழ் పడ ఎఱిన్దు = పేరులేక నశించునట్లు ధ్వంసముచేసినవాడును,అదు అన్ఱియుమ్=అదియునుగాక;వెన్ఱికొళ్ వాళ్=విజయము చేకూర్చెడి కత్తి సహాయముగల;  ఆయిరనామమ్ పగరాదవన్ = తన సహస్రనామములలో ఏఒక్కటిని చెప్పనివాడును; అడి ప్పణియాదవనై = పాదములను సేవించనివాడైన; అమరిల్ నిగరాయవన్ అవుణన్ = యుద్ధములో తనకు సాటటిలేని హిరణ్యాసురునియొక్క;నెఞ్జు = వక్షస్థలమును; పణియాల్ = (ప్రహ్లాదుని యొక్క) పలుకుల ననుసరించి;ఇడన్దాన్ అవనుక్కు = చీల్చిన సర్వేశ్వరునియొక్క; ఇడమ్ = నివాసస్దానము (ఏదనగ);మా మలై యావదు నీర్మలైయే=  శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! .

      శ్రీకృష్ణునివలె శంఖుచక్రములు ధరించియుండుటచే మిక్కిలి కాంతితోనిండిన రూపము కలిగి తనపై కోపించియున్న పౌండ్రకవాసుదేవుని కీర్తి నశించునట్లు అతనియొక్క ప్రాణములు హరించినవాడును,అసురప్రవృత్తిగల అతనియొక్క నగరములుగనున్న స్థానములన్నియు పేరులేక నశించునట్లు ధ్వంసముచేసినవాడును, మరియు విజయము చేకూర్చెడి కత్తి సహాయముగల,(తన) సహస్రనామములలో ఏఒక్కటిని చెప్పనివాడు, పాదములను సేవించనివాడు,యుద్ధములో తనకు సాటిలేని హిరణ్యాసురునియొక్క వక్షస్థలమును ప్రహ్లాదుని నిమిత్తముగ చీల్చిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము (ఏదనగ) శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా!.

పిచ్చ చ్చిఱు పీలి పిడిత్తు ఉలగిల్, పిణన్దిన్ మడవారవర్ పోల్, అఙ్గనే

అచ్చమిలర్ నాణిలరాతన్మైయాల్, అవర్ శెయ్ గై వెఱుత్తు అణిమామలర్ తూయ్,

నచ్చి నమనార్ అడై యామై, నమక్కరుళ్ శెయ్యెన ఉళ్ కుழைన్దు ఆర్వమొడు,

నిచ్చమ్ నినైవార్కరుళ్ శెయ్యుమవఱ్కిడమ్, మామలైయావదు నీర్మలైయే ll 1085

ఉలగిల్ = ఈ లోకములో; పిచ్చమ్ చ్చిఱు పీలి పిడిత్తు = చిన్న నెమలిపింఛపు ఈకల కుంచెలను చేతిలో నుంచుకొని(జైనులు);పిణమ్ తిన్ మడవారవర్ పోల్ అఙ్గనే=శవములను తినెడి పిశాచములవలె (దిగంబరులై తిరుగు);అచ్చమిలర్=భయములేక, నాణ్ ఇలర్ ఆదన్మైయాల్ = బిడియములేక నుండు కారణముచే; అవర్ = వారియొక్క శెయ్ గై=క్రియలకు;వెఱుత్తు=భయపడి త్రోసిపుచ్చి;అణి మామలర్ తూయ్=అందమైన మంచి పుష్పములు తెచ్చి సమర్పించి; నచ్చి = భక్తితో సేవించి;నమనార్ అడై యామై=’ యముడు (మమ్ము) సమీపించనీయక ‘;నమక్కు అరుళ్ శెయ్ ఎన = మాపై కృప చేయమని ప్రార్ధింపగ; ఉళ్ కుழைన్దు ఆర్వమొడు = దయార్ద్రహృదయుడై మిక్కిలి  ప్రేమతో; నిచ్చమ్ నినైవార్కు అరుళ్ శెయ్యుమ్ అవఱ్కు=నిత్యము స్మరించెడి ఆశ్రితులకు కృపజేయు సర్వేశ్వరునియొక్క; ఇడమ్ = నివాసస్దానము (ఏదనగ);మా మలై యావదు నీర్మలైయే=  శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా!

    ఈ లోకములో  నెమలిఈకల కుంచెలను చేతిలో నుంచుకొని జైనులు,శవములను తినెడి పిశాచములవలె, దిగంబరులై, భయము,లజ్జలేని వారి చేతలను తిరస్కరించి,అందమైన మంచి పుష్పములు తెచ్చి సమర్పించి, భక్తితో సేవించి,’ యముడు మమ్ము సమీపించనీయక ‘ మాపై కృపజేయుమా! యని ప్రార్ధింపగ, దయార్ద్ర హృదయుడై మిక్కిలి ప్రేమతో, నిత్యము స్మరించెడి ఆశ్రితులకు కృపజేయు సర్వేశ్వరునియొక్క నివాసస్దానము (ఏదనగ)  శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! .

పేశుమళవన్ఱిదు వమ్మిన్ నమర్, పిఱర్ కేట్పదన్ మున్ పణివార్ వినైగళ్,

నాశమదు శెయ్ దిడుమ్ ఆదన్మైయాల్, అదువే నమదుయ్ విడమ్ నాణ్మలర్మేల్

వాశమ్ మణివణ్డు అఱై పైమ్బుఱవిల్, మనమైన్దొడునైన్దు ఉయుల్వార్, మదియిల్

నీశరవర్ శెన్ఱడై యాదవనుక్కిడమ్, మామలైయావదు నీర్మలైయే ll 1086

నమర్ = మా ప్రియతమ జనులారా!; ఇదు పేశమ్ అళవు అన్ఱు = ఈ దివ్యదేశ వైభవము మనచే చెప్పనలవికాదు; పిఱర్ కేట్పదన్ మున్ =  ఇది నాస్తికులు చెవియందు పడకముందే; వమ్మిన్ = వచ్చి వినండి; అదు = ఆ దివ్యదేశముయొక్క గొప్పతనము; పణివార్ వినైగళ్ నాశమ్ శెయ్ దిడుమ్ = తనను సేవించెడివారి పాపసమూహములను నశింపజేయును; ఆదన్మైయాల్ = ఆ కారణముచే; అదువే = ఆ దివ్యదేశమే; నమదు ఉయ్ వు ఇడమ్=మనకు ఉజ్జీవించుటకు తగిన ప్రదేశము (ఆ దివ్యదేశము ఏదనగ); మనమ్ ఐన్దొడు నైన్దు ఉయుల్వార్ = మనస్సు శబ్ధ,స్పర్శ,రూప,రస,గంధ మనెడి ఐదు విషయములచే మిక్కిలి వ్యధచెందువారును; మది ఇల్ = బుద్ధి చెడినవారైన; నీచర్ అవర్ = అల్ప మనుష్యులు; శెన్ఱు అడై యాదవనుక్కు= చేరి పొంద సాధ్యముకాని సర్వేశ్వరునియొక్క; ఇడమ్ = నివాసస్దానము;మా మలై యావదు నీర్మలైయే=  శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! ..

            మా ప్రియతమ జనులారా! ఈ దివ్యదేశ వైభవము మనచే చెప్పనలవికాదు. ఇది నాస్తికులు చెవియందు పడకముందే వచ్చి వినండి. ఆ దివ్యదేశముయొక్క గొప్పతనము ఏమనగ తనను సేవించెడివారి పాప సమూహములను నశింపజేయును.ఆ కారణముచే ఆ దివ్యదేశమే మనకు ఉజ్జీవించుటకు తగిన ప్రదేశము.(ఆ దివ్యదేశము ఏదనగ) మనస్సు శబ్ధ,స్పర్శ,రూప, రస,గంధ మనెడి ఐదు విషయములచే మిక్కిలి వ్యధచెందువారును,బుద్ధి చెడినవారైన అల్ప మనుష్యులు చేరి పొంద సాధ్యముకాని సర్వేశ్వరునియొక్క నివాసస్దానము, శ్లాఘ్యమైన కొండయిన తిరునీర్మలైయే సుమా! .

** నెడుమాలవన్ మేవియ నీర్మలైమేల్, నిలవుమ్ పుగழ் మఙ్గయర్కోన్,  అమరిల్

కడ మా కళియానైవల్లాన్, కలియనొలి శెయ్ తమిழ் మాలై వల్లార్కు, 

ఉడనే విడుమాల్వినై, వేణ్డిడిల్ మేలులగుమ్ ఎళిదాయిడు మన్ఱి యిలఙ్గొళిశేర్ ,

కొడు మాకడల్ వైయగమాణ్డు, మదిక్కుడై మన్నవరాయ్ అడికూడువరే ll 1087

నెడుమాల్ అవన్ మేవియ = సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న, నీర్మలైమేల్ = దివ్యమైన నీర్మలై విషయమై; నిలవుమ్ పుగழ் = శాశ్వతమైన కీర్తిగల, మఙ్గయర్ కోన్ = తిరుమంగైదేశవాసులకు నాయకుడును; అమరిల్ =యుద్ధమందు; కడమ్ మా కళియానై వల్లాన్ = మదముతో మిక్కిలి ఆనందముగనుండు గజమును నడిపించెడి సామర్ధ్యముగలవారైన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలిశెయ్ = రాగభరితముగ అనుగ్రహించిన; తమిழ் మాలై = తమిళ భాషలోనున్న ఈ పాశురముల మాలను; వల్లార్కు = అనుసంధించువారికి; వినై = పాపములు; ఉడనే విడుమ్=వెంటనే తొలగిపోవును; వేణ్డిడిల్ = అపేక్షయుండినచో; మేల్ ఉలగుమ్ = స్వర్గలోకము మొదలగు పైలోకముల అనుభవము; ఎళిదు ఆయిడుమ్ = సులభమగును; అన్ఱి=లేక; ఇలఙ్గు ఒలిశేర్ కొడు మా కడల్ వైయగమ్ = ప్రకాశించు, ఘోషించెడి వక్రించియున్న మహాసముద్రముచే చుట్టుకొనియున్న భూమండలమును; మది కుడై మన్నవర్ ఆయ్ ఆణ్డు = చంద్రునివలె కాంతిగల ఛత్రముక్రింద రాజులుగ పరిపాలించి; (పిదప) అడి కూడువర్ = సర్వేశ్వరుని దివ్య చరణములను పొందు భాగ్యము కలుగును.

      సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యమైన నీర్మలై విషయమై శాశ్వతమైన కీర్తిగల తిరుమంగైదేశవాసులకు నాయకుడును,యుద్ధమందు మదముతో మిక్కిలి ఆనందముగనుండు గజమును నడిపించెడి సామర్ధ్యముగలవారైన తిరుమంగైఆళ్వార్ రాగభరితముగ అనుగ్రహించిన తమిళ భాషలోనున్న ఈపాశురముల మాలను అనుసంధించువారికి పాపములు వెంటనే తొలగిపోవును. అపేక్షయుండినచో, స్వర్గలోకము మొదలగు పై లోకముల అనుభవము సులభమగును. లేక ప్రకాశించు, ఘోషించెడి వక్రించియున్న మహాసముద్రముచే చుట్టుకొనియున్న, భూమండలమును చంద్రునివలె కాంతిగల ఛత్రముక్రింద రాజులుగ పరిపాలించిన పిదప సర్వేశ్వరుని దివ్య చరణములను పొందు భాగ్యము కలుగును .

.

*****

వ్యాఖ్యానించండి