శ్రీః
5. పారాయదు
ఆశ్రితుల విషయమందు మాతృమూర్తివలె సహనశీలుడును, తనను చేరుటకు భక్తులకు తానే ఉపాయమగువాడును, తిరుక్కడలమల్లై (మహాబలిపురం) దివ్యదేశములో శయన తిరుక్కోలములో కృపతో వేంచేసిన స్థలశయన పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** పారాయదుఉణ్డుమిழ்న్ద పవళత్తూణై, ప్పడు కడలిల్ అముదత్తై ప్పరివాయ్ కీణ్డ
శీరానై, ఎమ్మానై త్తొణ్డర్ తఙ్గళ్ శిందైయుళ్ యుళ్ళే, ముళైత్తెழுన్ద తీఙ్గరుమ్బినై ,
ప్పోరానై క్కొమ్బొశిత్త పోరేర్ట్రినై, ప్పుణర్ మరుతమ్ ఇఱనడన్ద పొఱ్కున్ఱినై ,
క్కారానైయిడర్ కడిన్ద కఱ్పగత్తై, క్కణ్డదు నాన్ కడన్మల్లై త్తలశయనత్తే ll 1088
పార్ ఆయదు = ఈ భూమండలమందుగలదానినన్నింటిని; ఉణ్డు=(ప్రళయకాలమున) ఆరగించి; ఉమిழ்న్ద = (సృష్ఠికాలమున) బైటకు వెలిపరచిన; పవళమ్ తూణై = పగడపు స్తంబమువలె ఆశపడతగిన ఆధారభూతుడును; పడు కడలిల్ అముదత్తై=అపారమైన సముద్రమునగల అమృతమువలె పరమభోగ్యుడును;పరివాయ్ కీణ్డ శీరానై = అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క నోటిని చీల్చి సంహరించిన వీరలక్ష్మి కలిగినవాడును; ఎమ్మానై = నాయొక్క స్వామియును;తొణ్డర్ తఙ్గళ్ శిందైయుళ్ ఉళ్ళే= ఆశ్రితులయొక్క హృదయమందు; ముళైత్తు ఎழுన్ద = ఆవిర్భవించి పోషించెడి; తీమ్ కరుమ్బినై = మధురమైన చెరకురసమువంటి వాడును; ప్పోర్ ఆనై = పోరాటమునకు వచ్చిన కువలయాపీడమను ఏనుగుయొక్క; కొమ్బు ఒశిత్త = దంతములను విరిచి వధించిన; పోర్ ఏర్ట్రినై = యుద్దసామర్ధ్యముగలవాడును; పుణర్ మరుతమ్ ఇఱ నడన్ద = దగ్గరగ చేరియున్న రెండు మద్ది వృక్షములు విరిగి క్రిందపడునట్లు వాటి మధ్య పాకిన; పొన్ కున్ఱినై = అందమైన బంగారు కొండవంటివాడును;కార్ ఆనై యిడర్ కడిన్ద= పెద్ద గజేంద్రాళ్వార్ యొక్క దుఃఖమును పోగొట్టిన;కఱ్పగత్తై = కల్పవృక్షమువలె సర్వము దానమొసగెడి సర్వేశ్వరుని; నాన్ కణ్డదు =దాసుడైన నేను సేవించినది; కడన్మల్లై త్తలశయనత్తే = తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములందే సుమా! .
ఈ భూమండలమందుగలదానినన్నింటిని ప్రళయకాలమున ఆరగించి, సృష్ఠికాలమున బైటకు వెలిపరచిన పగడపు స్తంబమువలె ఆశపడతగిన ఆధారభూతుడును,మహాసముద్రమునగల అమృతమువలె పరమభోగ్యుడును,అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క నోటిని చీల్చి సంహరించిన వీరలక్ష్మి కలిగినవాడును, నాయొక్క స్వామియును,ఆశ్రితులయొక్క హృదయమందు ఆవిర్భవించి పోషించెడి మధురమైన చెరకురసమువంటి వాడును,పోరాటమునకువచ్చిన కువలయాపీడమను ఏనుగుయొక్క దంతములను విరిచి వధించిన యుద్దసామర్ధ్యము గలవాడును,దగ్గరగ చేరియున్న రెండు మద్ది వృక్షములు విరిగి క్రిందపడునట్లు వాటి మధ్య పాకిన,అందమైన బంగారు కొండవంటివాడును, పెద్ద గజేంద్రాళ్వార్ యొక్క దుఃఖమును పోగొట్టిన, కల్ప వృక్షమువలె సర్వము దానమొసగెడి సర్వేశ్వరుని, దాసుడైన నేను సేవించినది, తిరుకడల్ మల్లై (మహాబలిపురం) దివ్యదేశమునందు పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములందే సుమా!
** పూణ్డు అవత్తం పిఱర్కడైన్దు తొణ్డుపట్టు, ప్పొయ్ న్నూలై మెయ్ న్నూలెన్ఱెన్ఱు మోది
మాణ్డు, అవత్తమ్ పోగాదే వమ్మిన్, ఎందై ఎన్ వణఙ్గ ప్పడువానై, కణఙ్గళేత్తుమ్
నీణ్డవత్తై క్కరుముగిలై ఎమ్మాన్ తన్నై, నిన్ఱవూర్ నిత్తిలత్తై త్తొత్తార్ శోలై,
కాండవత్తై క్కనలెరివాయ్ పెయ్ విత్తానై, క్కణ్డదు నాన్ కడన్మల్లై త్తలశయనత్తే ll 1089
అవత్తం పూణ్డు=స్వరూపమును నాశనముజేయు కర్మములను చేపట్టి;పిఱర్కు అడైన్దు= నీచులను ఆశ్రయించి; తొణ్డుపట్టు = వారికి సేవచేసికొనుచు;పొయ్ నూలై = అసత్యమైన బాహ్యమత శాస్త్రములనే;మెయ్ నూల్ ఎన్ఱు=యధార్ధమైన శాస్త్రములని;ఎన్ఱుమ్ ఓది= ఎల్లప్పుడును వాటిని అభ్యసించుచు;మాణ్డు=అంతమొంది; అవత్తమ్ పోగాదే వమ్మిన్ = నశించి పోకుండా ఉజ్జీవించుటకై కదలిరండి; ఎందై = నాయొక్క తండ్రియును;ఎన్ వణఙ్గ పడువానై=నావలె నుండువారు సేవించుటకు సులభుడును;కణఙ్గళ్ ఏత్తుమ్ = ఙ్ఞానుల సమూహములచే స్తుతింపబడువాడును; నీణ్డ అత్తై = మిక్కిలి అనూహ్యమైనవాడును; కరుముగిల్=కాళమేఘవర్ణమువంటి రూపముకలవాడును;ఎమ్మాన్ తన్నై= అస్మదీయుని స్వామియును; నిన్ఱవూర్ నిత్తలత్తై = తిరునిన్ఱవూర్ దివ్యదేశములో కృపతో వేంచేసిన ముత్యములరాసి వలె చల్లని తిరుమేని కలవాడును;తొత్తు ఆర్ శోలై కాండవత్తై = పూల గుత్తులతో నిండిన తోటలగల కాండవవనమును; కనల్ ఎరివాయ్ పెయ్ విత్తానై = జ్వలించుచున్న అగ్నియొక్క నోటిలో ప్రవేశింపజేసిన సర్వేశ్వరుని; నాన్ కణ్డదు = దాసుడైన నేను సేవించినది;కడన్మల్లై త్తలశయనత్తే=తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములందే సుమా! .
స్వరూపమును నాశనముజేయు కర్మములను చేపట్టి,నీచులను ఆశ్రయించి వారికి సేవచేసికొనుచు,అసత్యమైన బాహ్యమత శాస్త్రములనే యధార్ధమైన శాస్త్రములని ఎల్లప్పుడును వాటిని అభ్యసించుచు,నశించి పోకుండా ఉజ్జీవించుటకై కదలిరండి. నాయొక్క తండ్రియును, నావలెనుండువారు సేవించుటకు సులభుడును, ఙ్ఞానుల సమూహములచే స్తుతింపబడువాడును, మిక్కిలి అనూహ్యమైనవాడును, కాళమేఘవర్ణము వంటి రూపముకలవాడును, అస్మదీయుని స్వామియును, తిరునిన్ఱవూర్ దివ్యదేశములో కృపతో వేంచేసిన ముత్యములరాసి వలె చల్లని తిరుమేని కలవాడును;పూలగుత్తులతో నిండిన తోటలగల కాండవవనమును అగ్నియొక్క నోటిలో ప్రవేశింపజేసిన సర్వేశ్వరుని, దాసుడైన నేను సేవించినది, తిరుకడల్ మల్లై (మహాబలిపురం) దివ్యదేశమునందు పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములందే సుమా! .
ఉడమ్బురువిల్ మూన్ఱొన్ఱాయ్ మూర్తివేఱాయ్, ఉలగుయ్యనిన్ఱానై, అన్ఱు పేయ్ చ్చి
విడమ్ పరుగు విత్తగనై, క్కన్ఱుమేయ్ త్తు విళైయాడవల్లానై వరై మీ కానిల్,
తడంపరుకు కరుముగిలై త్తఞ్జైక్కోయిల్, త్తవనెఱిక్కోర్ పెరునెఱియై వైయంకాక్కుమ్,
కడుంపరిమేల్ కఱ్కియై నాన్ కణ్డుకొణ్డేన్,కడిపొழிల్ శూழ்కడన్మల్లై త్తలశయనత్తేll 1090
ఉలగు ఉయ్య = (సృష్ఠి,స్థితి,లయలతో) లోకముల సంరక్షణార్ధమై(శ్రీమన్నారాయణుడు ముగ్గురి రూపములయందు కారకుడగుటచే);ఉడమ్బు ఉరువిల్ = శరీర శరీరి యను భావముతో చూచినయెడల; మూన్ఱు ఒన్ఱాయ్ = మూడు తత్వములలో ఒకే తత్వము; మూర్తి వేఱాయ్ నిన్ఱానై = స్వరూపములు వేరువేరుగ నుండువాడును; అన్ఱు=కృష్ణునిగ అవతరించిన కాలమున; పేయ్ చ్చి=పూతనయొక్క; విడమ్ పరుగు విత్తగనై = స్తనములందు రాసుకొనిన విషముతోపాలను పానముజేసిన ఆశ్చర్యభూతుడును;కన్ఱు మేయ్ త్తు విళైయాడ వల్లానై = ఆవుదూడలను మేపుకొనుచు ఆటలాడుటకై అవతరించిన వాడును;వరై మీ కానిల్=కొండపైనగల అడవిలోని;తడమ్=తటాకములో; పరుగు = (ఆవుదూడలకు నీరు తాగువిధమును నేర్పుటకు, తాను తనచేతులను వీపు వెనుక చేర్చి ముందుకు వంగి) నీటిని తాగువాడును; కరుముగిలై=కాళమేఘవర్ణమువంటి రూపముకలవాడును;తఞ్జైకోయిల్ = తఞ్జైమామణిక్కోయిల్ లో; తవమ్ నెఱిక్కు ఓర్ పెరు నెఱియై = తనను పొందు ఉపాయములలో శ్లాఘ్యమైన ఉపాయము తానుగ వేంచేసియున్నవాడును; వైయమ్ కాక్కుమ్ = లోకములను రక్షించుటకై; కడుంపరిమేల్ కఱ్కియై = అమిత వేగముగల అశ్వముపై కల్కియవతారమును ధరింపబోవు సర్వేశ్వరుని; కడిపొழிల్ శూழ் = పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన, కడన్మల్లై త్తలశయనత్తే=తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను,నాన్ కణ్డుకొణ్డేన్ = నేను సేవించుకొంటిని.
సృష్ఠి,స్థితి,లయలతో లోకముల సంరక్షణార్ధమై శ్రీమన్నారాయణుడు ముగ్గురి రూపములయందు కారకుడగుటచే, శరీర శరీరి యను భావముతో చూచినయెడల, మూడు తత్వములలో ఒకే తత్వము, స్వరూపములు వేరువేరుగ, నుండువాడును, కృష్ణునిగ అవతరించిన కాలమున పూతనయొక్క స్తనములందు రాసుకొనిన విషముతోపాలను పానముజేసిన ఆశ్చర్యభూతుడును,ఆవుదూడలను మేపుకొనుచు ఆటలాడుటకై అవతరించినవాడును, కొండపైనగల అడవిలోని తటాకములో , ఆవుదూడలకు నీరు తాగువిధమును నేర్పుటకు, తాను తనచేతులను వీపు వెనుకచేర్చి ముందుకు వంగి నీటిని తాగువాడును, కాళమేఘవర్ణమువంటి రూపము కలవాడును,తఞ్జైమామణిక్కోయిల్ లో, తనను పొందు ఉపాయములలో శ్లాఘ్యమైన ఉపాయము, తానుగ వేంచేసియున్నవాడును, లోకములను రక్షించుటకై అమిత వేగముగల అశ్వముపై కల్కియవతారమును ధరింపబోవు సర్వేశ్వరుని, పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను, నేను సేవించుకొంటిని.
పేయ్ త్తాయై ములై యుణ్డపిళ్ళై తన్నై, ప్పిణైమరుప్పిల్ కరుఙ్గళిర్ట్రై ప్పిణై మాన్ నోక్కిన్,
ఆయ్ త్తాయర్ తయిర్ వెణ్ణెయ్ అమర్ న్ద కోవై, అన్దణర్ తమముదత్తై క్కురవై మున్నే
కోత్తానై, కుడమాడుకూత్తన్ తన్నై, క్కోకులఙ్గళ్ తళరామల్ కున్ఱమేన్ది
క్కాత్తానై, ఎమ్మానై క్కణ్డుకొణ్డేన్, కడిపొழிల్ శూழ்కడన్మల్లై త్తలశయనత్తేll 1091
తాయై = తల్లి యశోదాదేవి రూపమునుదాల్చి చంపుటకై వచ్చిన; పేయ్ ములై = పూతన యొక్క (విషపూరితమైన)స్తనములను;ఉణ్డ = పీల్చి ఆరగించిన;పిళ్ళైతన్నై= బాలుడును; పిణై మరుప్పిల్ కరుమ్ కళిర్ట్రై = చేరియున్న రెండు చిన్న దంతములుగలపిల్లఏనుగువలె మిక్కిలి మనోహరుడును; మాన్ పిణై నోక్కిల్ = ఆడ లేడి చూపులను పోలిన చూపులుగల; ఆయ్ తాయర్ = గోపస్త్రీయైన తల్లి యశోదాదేవి యొక్క;తయిర్ వెణ్ణెయ్ అమర్ న్ద కోవై = పెరుగు,వెన్నలో పెరిగిన స్వామియును; అన్దణర్ తమ్ అముదత్తై = వేదోత్తములకు అమృతమువలె పరమభోగ్యుడును; మున్నే = మునుపు ఒక కాలమున; కురవై కోత్తానై = గోపకాంతలతో రాసక్రీడ సలిపినవాడును; కుడమ్ ఆడు కూత్తన్ తన్నై = కుండలతో నృత్యము చేసినవాడును; గో కులఙ్గళ్ తళరామల్= (ఇంద్రునిచే కురుపింపబడిన రాళ్ళ వర్షముచే) గో సమూహములు వ్యధపొందనీయక; కున్ఱమ్ ఏన్ది కాత్తానై=గోవర్ధనపర్వతమును గొడుగు వలె పైకెత్తి కాపాడినవాడును; ఎమ్మానై = నాయొక్క సర్వేశ్వరుని;కడిపొழிల్ శూழ் = పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన, కడన్మల్లై త్తలశయనత్తే=తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను,నాన్ కణ్డుకొణ్డేన్ = నేను సేవించుకొంటిని.
తల్లి యశోదాదేవి రూపమునుదాల్చి చంపుటకై వచ్చిన పూతనయొక్క (విషపూరితమైన) స్తనములను పీల్చి ఆరగించిన బాలుడును,చేరియున్న రెండు చిన్న దంతములుగల పిల్లఏనుగువలె మిక్కిలి మనోహరుడును,ఆడ లేడి చూపులను పోలిన చూపులుగల గోపస్త్రీయైన తల్లి యశోదాదేవి యొక్క పెరుగు,వెన్నలో పెరిగిన స్వామియును, వేదోత్తములకు అమృతమువలె పరమభోగ్యుడును, గోపకాంతలతో రాసక్రీడ సలిపిన వాడును,కుండలతో నృత్యము చేసినవాడును, ఇంద్రునిచే కురుపింపబడిన రాళ్ళ వర్షముచే గోవుల సమూహములు వ్యధపొందనీయక గోవర్ధన పర్వతమును గొడుగు వలె పైకెత్తి కాపాడినవాడును,నాయొక్క సర్వేశ్వరుని, పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను, నేను సేవించుకొంటిని.
పాయ్ న్దానై త్తిరిశకడమ్ పాఱి వీழ, ప్పాలగనాయ్ ఆలిలైయిల్ పళ్ళియిన్బమ్
ఏయ్ న్దానై, ఇలఙ్గొళిశేర్ మణిక్కున్ఱన్న, ఈరిరణ్డుమాల్ వరైత్తోళ్ ఎమ్మాన్ తన్నై ,
తోయ్ న్దానై నిలమగళ్తోళ్ తూదిఱ్చెన్ఱు, అప్పొయ్ అఱైవాయ్ పుగప్పెయ్ ద మల్లర్మఙ్గ
క్కాయ్ న్దానై ఎమ్మానై క్కణ్డుకొణ్డేన్, కడిపొழிల్ శూழ்కడన్మల్లై త్తలశయనత్తేll 1092
తిరి శకడమ్ = దొర్లుకొని వచ్చిన శకటమును;పాఱి = ఛిన్నభిన్నమై; వీழ=పడునట్లు; పాయ్ న్దానై = దివ్యమైన కాలుతో తన్నినవాడును; బాలగనాయ్ = చంటిపిల్లవానిగ; ఆల్ ఇలైయిల్ = వటపత్రముపై; పళ్ళి ఇన్బమ్ ఏయ్ న్దానై = పవళించిన సుఖమును అనుభవించినవాడును;ఇలఙ్గు ఒళి శేర్=మిక్కిలి ప్రకాశము కలిగిన;మణి క్కున్ఱు అన్న= రత్నమయమయిన పర్వతము పోలినవాడును; ఈర్ ఇరణ్డు మాల్ వరై తోళ్ ఎమ్మాన్ తన్నై=పెద్ద పర్వతమువలె దృఢమైన నాలుగు భుజములుగల స్వామియును; నిలమ్ మగళ్ తోళ్ తోయ్ న్దానై=శ్రీ భూదేవి భుజములతో చేరియున్నవాడును;తూదిన్ శెన్ఱు=పాండవుల దూతగ ( దుర్యోధనుని స్థానమునకు) వెడలి; అ పొయ్ అఱైవాయ్ పుగ ప్పెయ్ ద మల్లర్ మఙ్గ=అచట (దుర్యోధనునిచే) కృత్రిమముగ ఏర్పరచిన సింహాసనము క్రింద భూగర్భగదిలో నున్న మల్లులను అంతమొందుటకై; కాయన్దానై = కోపగించిన; ఎమ్మానై = నాయొక్క సర్వేశ్వరుని; కడిపొழிల్ శూழ் = పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన, కడన్మల్లై త్తలశయనత్తే=తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను,నాన్ కణ్డుకొణ్డేన్ = నేను సేవించుకొంటిని.
దొర్లుకొని తనపై వచ్చిన శకటమును (శకటాశురుని) ఛిన్నభిన్నమగునట్లు దివ్యమైన కాలుతో తన్నిన వాడును, చంటిపిల్లవానిగ వటపత్రముపై పవళించిన సుఖమును అనుభవించినవాడును, మిక్కిలి ప్రకాశము కలిగిన రత్నమయమయిన పర్వతము పోలినవాడును,పెద్ద పర్వతమువలె దృఢమైన నాలుగు భుజములుగల స్వామియును, శ్రీ భూదేవి భుజములతో చేరియున్నవాడును,పాండవుల దూతగ ( దుర్యోధనుని స్థానమునకు) వెడలి,అచట (దుర్యోధనునిచే) కృత్రిమముగ ఏర్పరచిన సింహాసనము క్రింద భూగర్భగదిలో నున్న మల్లులను అంతమొందుటకై కోపగించిన, నాయొక్క సర్వేశ్వరుని, పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను, నేను సేవించుకొంటిని.
కిడన్దానై త్తడఙ్గడలుళ్ పణఙ్గళ్ మేవి, క్కిళర్ పొఱియ మఱితిరియ అతనిన్ పిన్నే
పడర్ న్దానై, పడుమదత్త కళిర్ట్రిన్ కొమ్బు పఱిత్తానై, పారిడత్తై ఎయిఱుకీఱ
ఇడన్దానై, వళైమరుప్పిల్ ఏనమాగి, ఇరునిలనుం పెరువిశుమ్బుం ఎయ్ దా వణ్ణం
కడన్దానై, ఎమ్మానై క్కణ్డుకొణ్డేన్,కడిపొழிల్ శూழ்కడన్మల్లై త్తలశయనత్తేll 1093
తడ కడలుళ్=విశాలమైన పాలసముద్రమందు;పణఙ్గళ్ మేవి కిడన్దానై = ఆదిశేషుని పడగలక్రింద ప్రీతితో పవళించినవాడును; కిళర్ పొఱియ = ప్రకాశించు పలు రంగుల మచ్చలుగల; మఱి =(మారీచుడను) మాయ లేడి; తిరియ = ఎదుట సంచరించగ;అదనిన్ పిన్నే పడర్ న్దానై = దాని వెనుకనే వెడలినవాడును; పడు మదత్త కళిర్ట్రిన్ కొమ్బు పఱిత్తానై = మదజలము స్రవించు ఏనుగుయొక్క (కువలయాపీడము యొక్క) దంతములను ఊడపెరికి వధించినవాడును;వళై మరుప్పిల్ ఏనమాగి = వంగియున్న కోరలుగల వరాహరూపముదాల్చి; పార్ ఇడత్తై = విశాలమైన భూమిని; ఎయిఱు కీఱ ఇడన్దానై = తన కోరలతో (అణ్డభిత్తిలోనుండి) పెకలించి విడదీసినవాడును;ఇరునిలనుం పెరు విశుమ్బుం = విశాలమైన ఈ భూమండలము, పైనున్న పెద్ద లోకములును;ఎయ్ దా వణ్ణమ్ = తన దివ్యమైన చరణములకు సరిపడని విధముగ (పెరిగిన);కడన్దానై=సమస్త లోకములు కొలిచిన; ఎమ్మానై = నాయొక్క సర్వేశ్వరుని; కడిపొழிల్ శూழ் = పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన, కడన్మల్లై త్తలశయనత్తే=తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ యొక్క దివ్యమైన పాదపద్మములను, నాన్ కణ్డుకొణ్డేన్ = నేను సేవించుకొంటిని.
విశాలమైన పాలసముద్రమందు ఆదిశేషుని పడగలక్రింద ప్రీతితో పవళించినవాడును, ప్రకాశించు పలు రంగుల మచ్చలగల (మారీచుడను) మాయ లేడి ఎదుట సంచరించగ దాని వెనుకనే వెడలినవాడును, మదజలము స్రవించు ఏనుగుయొక్క ( కువలయాపీడము యొక్క ) దంతములను ఊడపెరికి వధించినవాడును, వంగిన కోరలుగల వరాహరూపముదాల్చి విశాలమైన భూమిని తన కోరలతో (అణ్డభిత్తిలోనుండి) పెకలించి విడదీసినవాడును,విశాలమైన ఈ భూమండలము, పైనున్న పెద్ద లోకములును తన దివ్యమైన చరణములకు సరిపడని విధముగ (పెరిగి) సమస్తలోకములు కొలిచిన నాయొక్క సర్వేశ్వరుని, పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను, నేను సేవించుకొంటిని.
పేణాదవలియరక్కర్ మెలియ అన్ఱు, పెరువరైత్తోళిఱనెరిత్తు అన్ఱు అవుణర్ కోనై ,
ప్పూణాగంపిళ ఎడుత్తపోర్ వల్లోనై, పొరుకడలుళ్ తుయిలమర్ న్ద పుళ్ళూర్ దియై,
ఊణాగ పేయ్ ములై నఞ్జుణ్డాన్దన్నై, ఉళ్ళువారుళ్ళత్తే ఉఱైకిన్ఱానై ,
క్కాణాదు తిరితరువేన్ క్కణ్డుకొణ్డేన్,కడిపొழிల్ శూழ்కడన్మల్లై త్తలశయనత్తేll 1094
అన్ఱు = పూర్వకాలమున; పేణాద = తనను సర్వేశ్వరునిగ గౌరవించని;వలి అరక్కర్=బలవంతులైన రాక్షసులు; మెలియ = సన్నగిల్లునట్లు,(వారియొక్క) పెరు వరై తోళ్ ఇఱ నెరిత్తు = పెద్ద పర్వతము పోలిన భుజములు నశించునట్లు ధ్వంసముచేసినవాడును, అన్ఱు = ప్రహ్లాదుని హింసించిన కాలమున; అవుణర్ కోనై = అసురుల ప్రభువైన హిరణ్యాసురునియొక్క; పూణ్ ఆగం పిళ ఎడుత్త పోర్ వల్లోనై = ఆభరణములచే అలంకృతమైన వక్షస్థలమును చీల్చి వధించిన బలశాలియును; పొరు కడలుళ్ తుయిల్ అమర్ న్ద = అలలుకొట్టుచున్న పాలసముద్రమందు యోగనిద్రలో పవళించినవాడును; పుళ్ళూర్ దియై = గరుడాళ్వార్ ను వాహనముగ చేసుకొన్నవాడును; పేయ్ ములై నఞ్జు = రక్కసి పూతనయొక్క స్తనములందు రాసుకొనిన విషముతో పాలను;ఊణాగ ఉణ్డాన్ తన్నై = పోషకాహరముగ ఆరగించినవాడును; ఉళ్ళువార్ ఉళ్ళత్తే ఉఱైకిన్ఱానై = తనను ధ్యానించువారి హృదయమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని; కాణాదు తిరి తరువేన్ = (చాలకాలము) సేవింపక తిరిగి తిరిగి అలసిన దాసుడైన నేను; (ఇప్పుడు) కడిపొழிల్ శూழ்=పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన,కడన్మల్లై త్తలశయనత్తే = తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ యొక్క దివ్యమైన పాదపద్మములను,నాన్ కణ్డుకొణ్డేన్=నేను సేవించుకొంటిని
పూర్వకాలమున తనను సర్వేశ్వరునిగ గౌరవించని బలవంతులైన రాక్షసులు సన్నగిల్లునట్లు వారియొక్క పెద్ద పర్వతము పోలిన భుజములు నశించునట్లు ధ్వంసముచేసినవాడును, ప్రహ్లాదుని హింసించిన కాలమున అసురుల ప్రభువైన హిరణ్యాసురునియొక్క ఆభరణములచే అలంకృతమైన వక్షస్థలమును చీల్చి వధించిన బలశాలియును,అలలుకొట్టుచున్న పాలసముద్రమందు యోగనిద్రలో పవళించి యున్నవాడును, గరుడాళ్వార్ ను వాహనముగ చేసుకొన్నవాడును, రక్కసి పూతనయొక్క స్తనములందు రాసుకొనిన విషముతోపాలను పోషకాహరముగ ఆరగించినవాడును, తనను ధ్యానించువారి హృదయమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని,చాలకాలము సేవింపక తిరిగి తిరిగి అలసిన దాసుడైన నేను, ఇప్పుడు పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను, సేవించుకొంటిని.
పెణ్ణాగి ఇన్నముదమ్ వఞ్జిత్తానై, పిఱై ఎయిర్ట్రు అన్ఱు అడలరియాయ్ పెరుగినానై ,
తణ్ణార్ న్ద వార్ పునల్ శూழ் మెయ్యమెన్నుమ్; తడవరై మేల్ కిడన్దానై ప్పణఙ్గళ్ మేవి ,
ఎణ్ణానై యెణ్ణిఱన్ద పుగழிనానై, ఇలఙ్గొళిశేర్ అరవిన్దమ్ పోన్ఱు నీణ్డ
క్కణ్ణానై, క్కణ్ణార క్కణ్డుకొణ్డేన్, కడిపొழிల్ శూழ்కడన్మల్లై త్తలశయనత్తేll 1095
పెణ్ ఆగి = మోహిని రూపమునుదాల్చి; ఇన్ అముదమ్ వఞ్జిత్తానై = మధురమైన అమృతమును అసురులకు దక్కనీయక వంచించినవాడును; అన్ఱు=పూర్వకాలమున,పిఱై ఎయిర్ట్రు = చంద్రవంక వలెనున్న కోరలతో; అడల్ అరి ఆయ్ = బలశాలియైన నరసింహమూర్తిగ; పెరుగినానై = భయంకర స్వరూపమైనవాడును; తణ్ణార్ న్ద వార్ పునల్ శూழ் మెయ్యమ్ ఎన్ఱుమ్ = చల్లని జలప్రవాహములచే చుట్టుకొనియున్న తిరుమెయ్యమను దివ్యదేశమున; తడ వరై మేల్ = పెద్ద కొండపై; ప్పణఙ్గళ్ మేవి కిడన్దానై = ఆదిశేషుని పడగలక్రింద ప్రీతితో పవళించినవాడును;ఎణ్ణానై =యోగులచే ధ్యానింపబడు వాడును; ఎణ్ ఇఱన్ద పుగழிనానై = అంతులేని కీర్తిగలవాడును; ఇలఙ్గు ఒళిశేర్ అరవిన్దమ్ పోన్ఱు నీణ్డ క్కణ్ణానై=మిక్కిలి ప్రకాశము కలిగిన తామర పూదళము వలె విశాలమైన నేత్రములుగల సర్వేశ్వరుని; కణ్ ఆర=నాకన్నులతో సంతృప్తికరముగ; కడిపొழிల్ శూழ்=పరిమళ భరితమైన తోటలచే చుట్టబడిన, కడన్మల్లై త్తలశయనత్తే = తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ యొక్క దివ్యమైన పాదపద్మములను,కణ్డుకొణ్డేన్ = నేను సేవించుకొంటిని.
మోహిని రూపమునుదాల్చి మధురమైన అమృతమును అసురులకు దక్కనీయక వంచించిన వాడును,పూర్వకాలమున చంద్రవంక వలెనున్న కోరలతో బలశాలియైన నరసింహమూర్తిగ భయంకర స్వరూపమైనవాడును,చల్లని జలప్రవాహములచే చుట్టుకొనియున్న తిరుమెయ్యమను దివ్యదేశమున పెద్ద కొండపై ఆదిశేషుని పడగలక్రింద ప్రీతితో పవళించినవాడును,యోగులచే ధ్యానింపబడు వాడును, అంతులేని కీర్తిగలవాడును,మిక్కిలి ప్రకాశము కలిగిన తామరపూదళమువలె విశాలమైన నేత్రములుగల సర్వేశ్వరుని, నాకన్నులతో సంతృప్తికరముగ,పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను, సేవించుకొంటిని.
తొణ్డాయార్ తామ్ పరవుమ్ అడియనానై, ప్పడికడన్ద తాళాళర్కాళాయ్ ఉయ్ దల్
విణ్డానై, తెన్నిలఙ్గై యరక్కర్ వేన్దై, విలఙ్గు ఉణ్ణ వలఙ్గైవాయ్ చ్చరఙ్గళాణ్డు ,
పణ్డాయ వేదఙ్గల్ నాన్గుమ్, ఐన్దువేళ్విగళుమ్ కేళ్వియోడు అఙ్గమాఱుమ్
కణ్డానై, తొణ్డనేన్ క్కణ్డుకొణ్డేన్,కడిపొழிల్ శూழ்కడన్మల్లై త్తలశయనత్తేll 1096
తొణ్డు ఆయార్ తామ్ = దాసులైన జ్ఞానులు;పరవుమ్ అడియనానై = స్తుతించెడి దివ్యచరణములు కలవాడును; పడి కడన్ద = ఈ భూమండలమును కొలిచిన; తాళ్ ఆళర్కు ఆళాయ్ = దివ్య చరణములు కలవానికి సేవించి; ఉయ్ దల్ విణ్డానై = ఉజ్జీవించుటకు తిరస్కరించిన; తెన్ ఇలఙ్గై అరక్కర్ వేన్దై = అందమైన లంకాపురికి, అసురుల ప్రభువైన రావణాసురుని;విలఙ్గు ఉణ్ణ = మృగములు తినునట్లు; వలమ్ కై వాయ్ = శక్తివంతమైన చేతులతో; శరఙ్గళ్ ఆణ్డు= బాణములను ప్రయోగించినవాడును; పణ్డు ఆయ = నిత్యమైన; వేదఙ్గల్ నాన్గుమ్ = వేదములు నాలుగును; ఐన్దు వేళ్విగళుమ్ = పంచ మహాయఙ్ఞములను; కేళ్వియోడు=మనుస్మృతి మొదలగు ధర్మ శాస్త్రములును;అఙ్గమ్ ఆఱుమ్ = ఆరు వేదాంగములను; కణ్డానై = ప్రవర్తింపజేయు సర్వేశ్వరుని; తొణ్డనేన్ = దాసుడైన నేను; కడిపొழிల్ శూழ்= పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన,కడన్మల్లై త్తలశయనత్తే = తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ యొక్క దివ్యమైన పాదపద్మములను,కణ్డుకొణ్డేన్ = సేవించుకొంటిని.
దాసులైన జ్ఞానులు స్తుతించుచుండెడి దివ్యచరణములు కలవాడును,ఈ భూమండలమును కొలిచిన దివ్య చరణములు కలవానికి సేవించి ఉజ్జీవించుటకు తిరస్కరించిన ,అందమైన లంకాపురికి, అసురుల ప్రభువైన రావణాసురుని మృగములు తినునట్లు శక్తివంతమైన చేతులతో బాణములను ప్రయోగించినవాడును, నిత్యమైన వేదములు నాలుగును,పంచ మహాయఙ్ఞములను,మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములను, ఆరు వేదాంగములను ప్రవర్తింపజేయు సర్వేశ్వరుని,దాసుడైన నేను పరిమళభరితమైన తోటలచే చుట్టబడిన తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్న స్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను, సేవించుకొంటిని.
** పడనాగత్తణైక్కిడన్దు అన్ఱు అవుణర్కోనై, పడ వెకుణ్డు మరుదిడై పోయ్ ప్పழనవేలి
తడమార్ న్ద కడన్మల్లై త్తలశయనత్తు, త్తామరైక్కణ్ తుయిలమర్ న్ద తలైవర్ తమ్మై ,
కడమారుమ్ కరుమ్ కళిఱు వల్లాన్, వెల్ పోర్ కలికన్ఱి యొలిశెయ్ ద ఇన్బప్పాడల్ ,
తిడమాగ ఇవై ఐన్దు మైన్దుమ్ వల్లార్, తీవినైయై ముదలరియ వల్లార్ తామే ll 1097
పడమ్ నాగత్తు అణై కిడన్దు=పడగలతో ఒప్పు శేషతల్పముపై పవళించియున్నవాడును; అన్ఱు = పూర్వమొకకాలమున; అవుణర్ కోనై పడ వెకుణ్డు = అసురుల ప్రభువైన హిరణ్యాసురుడు మరణించునట్లు మిక్కిలి ఆగ్రహించినవాడును;మరుదు ఇడై పోయ్= జతగా చేరియున్న రెండు మద్ది వృక్షములనడుమ పాకినవాడును;పయనమ్ వేలి = జలాశయములతో చుట్టబడినదియు;తడమ్ ఆర్ న్ద = తటాకములతో నిండియున్న కడల్ మల్లై తల శయనత్తు = తిరు కడల్ మల్లై దివ్యదేశమున భూతలము తల్పముగ; తామరై కణ్ తుయిల్ అమర్ న్ద=తామరపుష్పమువంటి నేత్రములతో పవళించియున్న; తలైవర్ తమ్మై = స్వామి స్థలశయన పెరుమాళ్ విషయమై;కడమ్ ఆరుమ్ కరుమ్ కళిఱు వల్లాన్=మిక్కిలి మదముతోనుండు పెద్ద గజమును నడిపించెడి సామర్ధ్యము గలవారును;పోర్ వెల్ = యుద్దములో విజయము సాధించువారును; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; ఒలి శెయ్ ద = అనుగ్రహించిన;ఇన్బమ్=ఆనందదాయకమగు;ఇవై ఐన్దు ఐన్దు పాడల్=ఈ పది పాసురములును; తిడమాగ వల్లార్ = దృఢనిశ్చయముతో అనుసంధించువారు; తామే = తమకు తామే; తీ వినైయై = పాపములను; ముదల్ అరియ వల్లార్ = కూకటివేర్లతో నశింపజేసుకొనగల సమర్థులు.
పడగలతోఒప్పు శేషతల్పముపై పవళించియున్నవాడును, పూర్వమొకకాలమున అసురుల ప్రభువైన హిరణ్యాసురుడు మరణించునట్లు మిక్కిలి ఆగ్రహించినవాడును, జతగా చేరియున్న రెండు మద్ది వృక్షములనడుమ పాకినవాడును,జలాశయములతో చుట్టబడినదియు,తటాకములతో నిండియున్న తిరు కడల్ మల్లై దివ్యదేశమున భూతలము తల్పముగ, తామరపుష్పమువంటి నేత్రములతో పవళించియున్న స్వామి స్థలశయన పెరుమాళ్ విషయమై,మిక్కిలి మదముతోనుండు పెద్ద గజమును నడిపించెడి సామర్ధ్యము గలవారును, యుద్దములో విజయము సాధించువారును, తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఆనందదాయకమగు ఈ పది పాసురములును దృఢనిశ్చయముతో అనుసంధించువారు తమకుతామే పాపములను కూకటివేర్లతో నశింపజేసుకొనగల సమర్థులు.
***