శ్రీః
6 . నణ్ణాదవాళవుణర్
( కోయిల్ తిరుమొழி)
తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు కృపతో పవళించియున్నస్థలశయన పెరుమాళ్ దివ్యచరణారవిందములను, సేవించుకొన్న తిరుమంగై ఆళ్వార్, ఆ సర్వేశ్వరుని భాగవతుల సేవాభాగ్యమును వర్ణించుచున్నారు.
** నణ్ణాద వాళ్ అవుణర్, ఇడై పుక్కు, వానవరై
ప్పెణ్ణాగి, అముదూట్టుమ్ పెరుమానార్, మరువినియ
తణ్ణార్ న్ద కడన్మల్లై, త్తలశయనత్తు ఉఱైవారై,
ఎణ్ణాదే యిరుప్పారై, ఇఱైపొழுదుమ్ ఎణ్ణోమే ll 1098
పెణ్ ఆగి = మోహిని అవతారముదాల్చి; నణ్ణాద వాళ్ అవుణర్ ఇడై పుక్కు = ప్రతికూలరైన ఖడ్గములుగల అసురల మధ్య ప్రవేశించి; (వారిని వంచనచేసి) వానవరై అముదు ఊట్టుమ్= దేవతలకు మాత్రమే అమృతమును ఆరగింపజేసిన;పెరుమానార్ = సర్వేశ్వరుడు; మరువ ఇనియ = వసించుటకు ఆనందదాయకమగు; తణ్ ఆర్ న్ద = చల్లదనముతో నిండిన; కడన్మల్లై తలశయనత్తు= తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు;ఉఱైవారై=నిత్యవాసము చేయుచున్న స్థలశయన పెరుమాళ్ ను; ఎణ్ణాదే ఇరుప్పారై= చింతింపకనుండువారిని;ఇఱై పొழுదుమ్ ఎణ్ణోమ్=ఏ ఒక్క క్షణమందును తలచము.
మోహిని అవతారముదాల్చి ప్రతికూలరైన ఖడ్గములుగల అసురల మధ్య ప్రవేశించి, వారిని వంచనచేసి, దేవతలకు మాత్రమే అమృతమును ఆరగింపజేసిన సర్వేశ్వరుడు, వసించుటకు ఆనందదాయకమగు చల్లదనముతో నిండిన తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు నిత్యవాసము చేయుచున్న ఆ స్థలశయన పెరుమాళ్ ను చింతింపకనుండువారిని ఏ ఒక్క క్షణమందును తలచము.
పార్ వణ్ణ మడమఙ్గై, పని నన్ మామలర్ కిழత్తి ,
నీర్ వణ్ణన్ మార్వగత్తిల్, ఇరుక్కైయై మున్ నినైన్దు అవనూర్
కార్ వణ్ణ ముదుమున్నీర్, క్కడల్ మల్లైత్తలశయనమ్ ,
ఆర్ ఎణ్ణుమ్ నెఞ్జుడైయార్, అవర్ ఎమ్మైయాళ్వారే ll 1099
పార్ వణ్ణమ్ మడ మఙ్గై = భూమండలమునకు అధిష్టానదేవత, ఆత్మగుణములతొ నిండియున్న శ్రీ భూదేవియు; పని నల్ మా మలర్ కిழత్తి = చల్లని శ్లాఘ్యమైన తామరపుష్పమందు ఉద్భవించిన శ్రీదేవియు; నీర్ వణ్ణన్ = సముద్రము పోలిన వర్ణముకలిగిన సర్వేశ్వరునియొక్క; మార్వు అగత్తిల్ = వక్షస్థలములో; ఇరుక్కైయై మున్ నినైన్దు = ఇరుప్రక్కల నిత్యవాసము చేయుచున్నది, మొదట అనుసంధించిన; (పిదప) అవన్ ఊర్ = ఆ సర్వేశ్వరుని నివాసస్దానమైన; కార్ వణ్ణమ్ ముదు మున్నీర్ కడల్ మల్లై తలశయనమ్ = నల్లని సముద్రపు ఒడ్డునగల తిరుకడల్ మల్లై దివ్యదేశమును;ఎణ్ణుమ్ నెఞ్జు ఉడైయార్ఆర్=ధ్యానించుచుండు హృదయముగలవారు ఎవరో; అవర్ = ఆ మహనీయులు; ఎమ్మై ఆళ్వారే = మమ్మలను పాలించు ప్రభువులు.
భూమండలమునకు అధిష్టానదేవత,ఆత్మగుణములతొ నిండియున్న శ్రీభూదేవియు, చల్లని శ్లాఘ్యమైన తామరపుష్పమందు ఉద్భవించిన శ్రీదేవియు, సముద్రము పోలిన వర్ణముకలిగిన సర్వేశ్వరునియొక్క వక్షస్థలములో ఇరుప్రక్కల నిత్యవాసము చేయుచున్నది మొదట అనుసంధించిన పిదప ఆ సర్వేశ్వరుని నివాసస్దానమైన నల్లని సముద్రపు ఒడ్డునగల తిరుకడల్ మల్లై దివ్యదేశమును ధ్యానించుచుండు హృదయముగలవారు ఎవరో ఆ మహనీయులు మమ్మలను పాలించు ప్రభువులు.
** ఎనత్తినురువాగి, నిలమఙ్గై ఎழிల్ కొణ్డాన్ ,
వానత్తిలవర్ ముఱైయాల్, మగిழ்న్దేత్తి వలఙ్గొళ్ళ ,
కానత్తిన్ కడన్మల్లై, త్తలశయనత్తు ఉఱైకిన్ఱ ,
ఞానత్తి నొళియురువై, నినైవార్ ఎన్నాయగరే ll 1100
ఎనత్తిన్ ఉరువాగి = వరాహరూపిగ అవతరించి; నిలమఙ్గై ఎழிల్ కొణ్డాన్=శ్రీ భూదేవిని (ఆమె సహజ సౌందర్యము కొంచమైనను తగ్గనీయక) ఆ సౌందర్యముతోనే (అండభిత్తినుండి) పైకెత్తినవాడును; వానత్తిలవర్ = దేవతలు;ముఱైయాల్ = తమతమ అధికారమునకు తగినట్లుగ; మగిழ்న్దు ఏత్తి వలమ్ కొళ్ళ = మిక్కిలి సంతోషముతో స్తుతించి ప్రదక్షిణముచేయుటకు అనువుగ; కానత్తిన్ = అడవియందు గల; కడన్మల్లై తలశయనత్తు ఉఱైకిన్ఱ = తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు నిత్యవాసము చేయుచున్న వాడును అయిన; ఞానత్తిన్ ఒళి ఉరువై = ఙ్ఞానస్వరూపియైన మిక్కిలి తేజోవంతమైన సర్వేశ్వరుని; నినైవార్ = ధ్యానించువారు; ఎన్ నాయగర్ = నాయొక్క ప్రభువులు.
వరాహరూపిగ అవతరించి శ్రీ భూదేవిని (ఆమె సహజ సౌందర్యము కొంచమైనను తగ్గనీయక) ఆ సౌందర్యముతోనే అండభిత్తినుండి పైకెత్తినవాడును, దేవతలు తమ తమ అధికారమునకు తగినట్లుగ మిక్కిలి సంతోషముతో స్తుతించి ప్రదక్షిణముచేయుటకు అనువుగ అడవియందుగల తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు నిత్యవాసము చేయుచున్నవాడును, అయిన ఙ్ఞానస్వరూపియైన మిక్కిలి తేజోవంతమైన సర్వేశ్వరుని ధ్యానించువారు,నాయొక్క ప్రభువులు.
విణ్డారైవెన్ఱు ఆవి, విలఙ్గు ఉణ్డ మెల్లియలార్ ,
కొణ్డాడుమ్ మల్ అగలమ్, అழల్ ఏఱ వెఞ్జమత్తు
కణ్డారై, కడన్మల్లై, త్తలశయనత్తు ఉఱైవారై ,
క్కొణ్డాడుమ్ నెఞ్జుడైయార్, అవర్ ఎఙ్గళ్ కులదెయ్ వమేll 1101
విణ్డారై = శత్రువులైన రావణాది రాక్షసులను;వెన్ఱు =జయించి;ఆవి=వారి శరీరములను; విలఙ్గు = నక్కలు, కుక్కలు మొదలగు మృగములు; ఉణ్డ = తినునట్లు; మెల్ ఇయలార్ కొణ్డాడుమ్ మల్ అగలమ్ = మెత్తని స్వభావముగల స్రీలు పొగడు బలశాలులైన వారి వక్షస్థలమును; అழల్ ఏఱ=అగ్ని మీదపడి దహించునట్లు;వెమ్ శమత్తు=భయంకరమైన యుద్ధములో; కణ్డారై = వీక్షించిన;కడన్మల్లై తలశయనత్తు=తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు; ఉఱైవారై = నిత్యవాసము చేయుచున్న స్థలశయన పెరుమాళ్ ను; క్కొణ్డాడుమ్ నెఞ్జు ఉడైయార్ = కీర్తించు హృదయముగలవారు ఎవరో; అవర్=వారు; ఎఙ్గళ్ కులదెయ్ వమే = మా కులదేవతలగుదురు.
శత్రువులైన రావణాది రాక్షసులను జయించి వారి శరీరములను నక్కలు,కుక్కలు మొదలగు మృగములు తినునట్లు, మెత్తని స్వభావముగల స్రీలు పొగడు బలశాలులైన వారి వక్షస్థలమును, అగ్ని మీదపడి దహించునట్లు, భయంకరమైన యుద్ధములో వీక్షించిన తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు నిత్యవాసము చేయుచున్న స్థలశయనపెరుమాళ్ ను కీర్తించు హృదయముగలవారు ఎవరో, వారు మా కులదేవతలగుదురు.
పిచ్చ చ్చిఱుపీలి, శమణ్ కుణ్డర్ ముతలాయోర్ ,
విచ్చై క్కిఱైయెన్నుమ్, అవ్విఱైయై పణియాదే ,
కచ్చి క్కిడన్దవనూర్, క్కడల్మల్లైత్తలశయనమ్ ,
నచ్చి తొழுవారై, నచ్చు ఎన్ఱన్ నన్నెఞ్జే ll 1102
పిచ్చమ్ శిఱు పీలి=బిక్షాపాత్రను,(నెమలి ఈకలతో చేయబడిన)చిన్న కుంచెను కలిగిన ; శమణ్ కుణ్డర్ ముదలాయోర్ = నీచస్వభావముగల జైనులు మొదలగువారు; విచ్చైక్కు ఇఱై ఎన్నుమ్ = సర్వ ఙ్ఞానమునకు దైవస్వరూపులని చెప్పుకొనుచుండెడి; అవ్ ఇఱైయై పణియాదే = అట్టి దైవస్వరూపులను కొలవక; కచ్చి క్కిడన్దవన్ ఊర్ = కంచినగరములో తిరు వెఃకా లో శయనించియుండిన సర్వేశ్వరుని దివ్యదేశమైన; క్కడల్మల్లై తలశయనమ్ నచ్చి తొழுవారై = తిరుకడల్ మల్లైయే ఆశించి సేవించువారినే; ఎన్ తన్ నల్ నెఞ్జే = నాయొక్క మంచి హృదయమా!; నచ్చు = నీవు ఆశించి సేవించుకొనుము.
బిక్షాపాత్రను, నెమలి ఈకలతో చేయబడిన చిన్న కుంచెను కలిగిన నీచస్వభావముగల జైనులు మొదలగువారు సర్వ ఙ్ఞానమునకు దైవస్వరూపులని చెప్పుకొనుచుండెడి, అట్టి దైవస్వరూపులను కొలవక కంచినగరములో తిరు వెఃకా లో శయనించియుండిన సర్వేశ్వరుని దివ్యదేశమైన తిరుకడల్ మల్లైయే ఆశించి సేవించువారినే, నాయొక్క మంచి హృదయమా!, నీవు ఆశించి సేవించుకొనుము.
పులన్గొళ్ నితిక్కువైయోడు, పుழక్కై మ్మా కళిర్ట్రినముమ్ ,
నలఙ్గొళ్ నవమణిక్కువైయుమ్, శుమన్దు ఎఙ్గుమ్ నాన్ఱు ఒశిన్దు ,
కలఙ్గళ్ ఇయఙ్గుమ్ మల్లై, క్కడల్మల్లైత్తలశయనమ్ ,
వలఙ్గొళ్ మనత్తార్ అవరై, వలఙ్గొళ్ళెన్ మడనెఞ్జే ll 1103
పులన్ కొళ్ = ఇంద్రియములను ఆకర్షించు(మనోహరమైన);నితి కువైయోడు = బంగారు రాసులతోడను; పుழ కై మ్మా కళిఱు ఇనమ్ = తొండములుగల పెద్ద ఏనుగుల సమూహములతోను; నలమ్ కొళ్ నవమణి కువైయుమ్=మంచి నవ రత్న రాసులతోను; శుమన్దు=కలిగియుండి;నాన్ఱు ఒశిన్దు=(బరువుతో)లోతుగ మునిగి;కలఙ్గళ్ ఇయఙ్గుమ్= ఎటుచూచినను ఓడలు సంచరింపబడుచుండు; మల్లై = ఖ్యాతికలిగిన; క్కడల్మల్లై తలశయనమ్ = తిరుకడల్ మల్లై దివ్యదేశమును; వలమ్ కొళ్ మనత్తార్ అవరై = ప్రదక్షిణము చేయు హృదయముగలవారిని; ఎన్ మడ నెఞ్జే=నాయొక్క విధేయమైన మనసా!; వలమ్ కొళ్ = నీవు వారికి ప్రదక్షిణముచేసి తరించుమా!
ఇంద్రియములను ఆకర్షించు మనోహరమైన బంగారు రాసులతోడను, తొండములుగల పెద్ద ఏనుగుల గుంపులతోను,మంచి నవ రత్న రాసులతోను, కలిగియుండి,బరువుతో లోతుగ మునిగి ఎటుచూచినను ఓడలు సంచరింపబడుచుండు ఖ్యాతికలిగిన తిరుకడల్ మల్లై దివ్యదేశమును ప్రదక్షిణము చేయు హృదయము గలవారిని, నాయొక్క విధేయమైన మనసా!,నీవు వారికి ప్రదక్షిణముచేసి తరించుమా!
పఞ్జిచ్చిఱు కూழை, ఉరువాగి మరువాద ,
వఞ్జప్పెణ్ నఞ్జుణ్డ, అణ్ణల్ మున్ నణ్ణాద ,
కఞ్జై క్కడన్దవనూర్; క్కడల్మల్లైత్తలశయనమ్ ,
నెఞ్జిల్ తొழுవారై, త్తొழுవాయ్ ఎన్ తూయ్ నెఞ్జే ll 1104
పఞ్జి శిఱు కూழை ఉరువాగి = దూదివలె మృదువైన చిన్న కొప్పుగల యశోదాదేవి రూపమునుదాల్చి (వచ్చినదియు); మరువాద = హృదయమందు దయలేనిదియు; వఞ్జమ్ = వంచనకలదియు అయిన; పెణ్ = రక్కసి పూతనయొక్క; నఞ్జు ఉణ్డ = స్తనములందు రాసుకొనిన విషముతో పాలను ఆరగించిన; అణ్ణల్ = స్వామియును; మున్ = పూర్వము ఒకప్పుడు;నణ్ణాద=తనపై ప్రీతితో వ్యవహరించి చేరని; కఞ్జై= కంసుని; కడన్దవన్ ఊర్ = జయించి కడతేర్చిన సర్వేశ్వరుని దివ్యదేశమైన; క్కడల్మల్లై తలశయనమ్ = తిరుకడల్ మల్లైయే; నెఞ్జిల్ తొழுవారై = హృదయమందు సేవించెడి భాగవతోత్తములను;ఎన్ తూయ్ నెఞ్జే=నాయొక్క నిర్మలమైన మనసా!;త్తొழுవాయ్ = నీవు సేవించుకొనుమా!
దూదివలె మృదువైన చిన్న కొప్పుగల యశోదాదేవి రూపమునుదాల్చి వచ్చినదియు, హృదయమందు దయలేనిదియు, వంచనకలదియు అయిన రక్కసి పూతనయొక్క స్తనములందు రాసుకొనిన విషముతో పాలను ఆరగించిన స్వామియును పూర్వము ఒకప్పుడు,తనపై ప్రీతితో వ్యవహరించి చేరని కంసుని జయించి కడతేర్చిన సర్వేశ్వరుని దివ్యదేశమైన తిరుకడల్ మల్లైయే హృదయమందు సేవించెడి భాగవతోత్తములను నాయొక్క నిర్మలమైన మనసా!,నీవు సేవించుకొనుమా! .
శెழுనీర్ మలర్ కమలమ్, తిరైయున్దు వన్ పగట్టాల్ ,
ఉழுనీర్ వయల్ ఉழవర్ ఉழ, ప్పిన్ మున్ పిழைత్తు ఎழுన్ద ,
కழுనీర్ కడికమழுమ్, క్కడల్మల్లైత్తలశయనమ్ ,
తొழுనీర్ మనత్తవరై, త్తొழுవాయ్ ఎన్ తూయ్ నెఞ్జే ll 1105
ఉழுనీర్ = ఎల్లప్పుడును సాగుచేయుచు నుండవలసిన; వయల్ = పొలములలో; ఉழవర్ = రైతులు; శెழு నీర్ తిరై = అందమైన నీటి అలలతో; కమలమ్ మలర్ = తామర పుష్పములను; ఉన్దు = త్రోయుచు; వల్ పగట్టాల్ = బలిసిన ఎద్దులతో; ఉழ=సాగుచేయగ; పిన్ మున్=ముందు వెనకల;పిழைత్తు ఎழுన్ద=సాగుబడియందు మిగిలిపోయి మొలకెత్తిన; కழுనీర్ = ఎర్రకలువులయొక్క; కడి కమழுమ్ = పరిమళము వీచబడుచుండు; క్కడల్మల్లై తలశయనమ్ = తిరుకడల్ మల్లైయే;తొழுనీర్ మనత్తు అవరై=సేవించుకొనుటయే స్వభావముతోనుండు హృదయముగల భాగవతోత్తములను; ఎన్ తూయ్ నెఞ్జే=నాయొక్క నిర్మలమైన మనసా!;తొழுవాయ్=నీవుసేవించుకొనుమా!.
ఎల్లప్పుడును సాగుచేయుచు నుండవలసిన పొలములలో రైతులు అందమైన నీటి అలలతో, తామర పుష్పములను త్రోయుచు బలిసిన ఎద్దులతో సాగుచేయగ ముందు వెనకల సాగుబడియందు మిగిలిపోయి మొలకెత్తిన ఎర్రకలువులయొక్క పరిమళము వీచబడుచుండు తిరుకడల్ మల్లైయే, సేవించుకొనుటయే స్వభావముతోనుండు హృదయముగల భాగవతోత్తములను నాయొక్క నిర్మలమైన మనసా!,నీవు సేవించుకొనుమా ! .
పిణఙ్గళడు కాడదనుళ్, నడమాడు పిఞ్జగనోడు ,
ఇణఙ్గు తిరుచ్చక్కరత్తు, ఎమ్బెరుమానార్కిడమ్, విశుమ్బిల్
కణఙ్గళ్ ఇయఙ్గుమ్, మల్లై క్కడల్మల్లైత్తలశయనమ్ ,
వణఙ్గు మనత్తారవరై, వణఙ్గు ఎన్ఱన్ మడనెఞ్జే ll 1106
పిణఙ్గళ్ అడు కాడు అదనుళ్ = శవములను దహించెడి శ్మశానములో; నడమాడు పిఞ్జగనోడు = నృత్యముచేయు రుద్రుడుకూడ; ఇణఙ్గు = చేరియుండు; తిరుశక్కరత్తు, ఎమ్బెరుమానార్కు ఇడమ్= చక్రపాణియైన సర్వేశ్వరునికి నివాసస్దానమును; విశుమ్బిల్ కణఙ్గళ్ = దేవతాసమూహములు; ఇయఙ్గుమ్ మల్లై = వచ్చి సంచరించు ఖ్యాతికలిగిన; క్కడల్మల్లై తలశయనమ్=తిరుకడల్ మల్లైయే; వణఙ్గు మనత్తార్ అవరై=మ్రొక్కుచుండెడి హృదయముగల భాగవతోత్తములను; ఎన్ తన్ మడ నెఞ్జే = నాయొక్క విధేయమైన మనసా!; వణఙ్గు = సేవించుకొనుమా!
శవములను దహించెడి శ్మశానములో నృత్యముచేయు రుద్రుడుకూడ చేరియుండు,చక్రపాణియైన సర్వేశ్వరునికి నివాసస్దానమును, దేవతాసమూహములు వచ్చి సంచరించు ఖ్యాతికలిగిన తిరుకడల్ మల్లైయే మ్రొక్కుచుండెడి హృదయముగల భాగవతోత్తములను నాయొక్క విధేయమైన మనసా! సేవించుకొనుమా! .
** కడికమழுమ్ నెడు మఱుగిల్, క్కడల్మల్లైత్తలశయనత్తు ,
అడిగళ్ అడియే నినైయుమ్; అడియవర్ గళ్ తమ్ అడియాన్ ,
వడిగొళ్ నెడువేల్ వలవన్, కలికన్ఱి యొలివల్లార్ ,
ముడిగొళ్ నెడుమన్నవర్ తమ్, ముదల్వర్ ముదలావారే ll 1107
కడి కమழுమ్=పరిమళము వీచబడుచుండు;నెడు మఱుగిల్=విశాలమైన వీధులుగల; క్కడల్మల్లై తలశయనత్తు = తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు నిత్యవాసము చేయుచున్న, అడిగళ్ = సర్వేశ్వరుని; అడియే = పాదపద్మములనే; నినైయుమ్ = ధ్యానించుచుండు; అడియవర్ గళ్ తమ్ = భాగవతోత్తములయొక్క; అడియాన్= దాసుడును;వడి కొళ్ నెడు వేల్ వలవన్=వాడి కలిగిన పెద్ద ఈటెతో పోరు సలుపగల; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; ఒలి = అనుగ్రహించిన ఈ పాశురములను; వల్లార్ = అనుసంధించువారు; ముడిగొళ్ నెడుమన్నవర్ తమ్ ముదల్వర్ ముదలావారే = కిరీటములతో మెరయు రాజాధిరాజులపై చక్రవర్తిస్థానమును పొందగలగుదురు.
పరిమళము వీచబడుచుండు విశాలమైన వీధులుగల తిరుకడల్ మల్లై దివ్యదేశమునందు నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని పాదపద్మములనే ధ్యానించుచుండు భాగవతోత్తములయొక్క దాసుడును, వాడి కలిగిన పెద్ద ఈటెతో పోరు సలుపగల తిరుమంగై ఆళ్వార్, అనుగ్రహించిన ఈ పాశురములను అనుసంధించువారు, కిరీటములతో మెరయు రాజాధిరాజులపై చక్రవర్తిస్థానమును పొందగలగుదురు.
*****