పెరియ తిరుమొழி-2వపత్తు (7)

శ్రీః 

7 . తివళుమ్

      తిరువిడవెన్దై దివ్యదేశమున నిత్యకళ్యాణ పెరుమాళ్ ను సందర్శంచిన తిరుమంగై ఆళ్వార్ అంతులేని భక్తిపారవశ్యములో,తన నిజస్థితిని కోల్పోయి, పరకాలనాయకి అవస్థను పొందిన ఆమెను, గాంచిన తల్లి, సర్వేశ్వరునితో తన పుత్రిక విషయమై, ఈ పాశురములలో విన్నవించుచున్నారు.

** తివళుమ్ వెణ్మతిపోల్  తిరుముగత్తరివై, శెழுఙ్డడలముదినిల్ పిఱన్ద

అవళుమ్, నిన్నాగత్తిరుప్పదుమ్ అరిన్దుమ్, ఆగిలుమ్ ఆశై విడాళాల్ ,

కువళై యఙ్గణ్ణి కొల్లియమ్ ప్పావై, శొల్లు నిన్ తాళ్ నయన్దిరున్ద

ఇవళై, యున్ మనత్తాల్ ఎన్నినైన్దిరున్దాయ్, ఇడవెన్దై ఎన్దైపిరానే ll 1108

ఇడవెన్దై ఎన్దై పిరానే! = తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; తివళుమ్ వెణ్ మదిపోల్  తిరుముగత్తు = ప్రకాశము వెదజల్లుచునున్న చంద్రునివలె దివ్యమైన ముఖమండలము గల; అరివై=నిత్యయౌవనము కలిగిన ఈమె;  శెழுమ్ కడల్ అముదినిల్ పిఱన్ద = సర్వ సంపదలతో నిండిన సముద్రములో అమృతముతో కూడ ఉద్భవించిన; అవళుమ్=ఆ శ్రీమహాలక్ష్మి;నిన్ ఆగత్తు = నీయొక్క వక్షస్థలమందు; ఇరుప్పదుమ్=వేంచేసియుండుట; అరిన్దుమ్ ఆగిలుమ్ =(నాకుమార్తెకు) తెలిసి యుండినను; ఆశై విడాళ్ (ఆల్ )= నీయందు ఆశను విడువలేదు ( ఆశ్చర్యము ); కువళై అమ్ కణ్ణి  = నల్ల కలువవలె అందమైన నేత్రములు కలదియు; కొల్లి అమ్ పావై = కొల్లి పర్వతమందుగల అందమైన బొమ్మవలె నుండునదియు;నిన్ తాళ్ నయన్ది ఇరున్ద= నీ దివ్య చరణములందే ఆశపెట్టుకొనియున్న; ఇవళై = ఈ నా కుమార్తె విషయమై; ఉన్ మనత్తాల్ ఎన్ నినైన్దు ఇరున్దాయ్ = నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించి ఉంటివో; శొల్లు = దానిని కృపతో వెల్లడించుమా!

              తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! ప్రకాశము వెదజల్లుచునున్న చంద్రునివలె దివ్యమైన ముఖమండలముగల నిత్యయౌవనము కలిగిన ఈమె సర్వ సంపదలతో నిండిన సముద్రములో అమృతముతో కూడ ఉద్భవించిన ఆ శ్రీమహాలక్ష్మి నీయొక్క వక్షస్థలమందు వేంచేసియుండుట, నాకుమార్తెకు తెలిసి యుండినను, నీయందు ఆశను విడువలేదు ( ఆశ్చర్యము ). నల్ల కలువవలె అందమైన నేత్రములు కలదియు, కొల్లి పర్వతమందుగల అందమైన బొమ్మవలె నుండునదియు,నీ దివ్య చరణములందే ఆశపెట్టుకొనియున్న ఈ నా కుమార్తె విషయమై,నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియుంటివో, దానిని కృపతో వెల్లడించుమా!

తుళమ్బడుముఱువల్ తోழிయఱ్కరుళాళ్, తుణైములై శాన్దుకొణ్డణియాళ్ ,

కుళమ్బడు కువళైక్కణ్ణిణై యెழுదాళ్, కోలనన్మలర్ కుழఱ్కణియాళ్

వళమ్బడు మున్నీర్ వైయమున్నళన్ద, మాలెన్నుమ్ మాలినమొழிయాళ్ ,

ఇళమ్బడి ఇవళుక్కెన్ని నైన్దిరున్దాయ్, ఇడవెన్దై ఎన్దైపిరానే ll 1109

ఇడవెన్దై ఎన్దై పిరానే! = తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; మాల్ ఇనమ్ మొழிయాళ్ = తనయొక్క వ్యామోహమునకు తగినట్లు  పలుకులుగల ఈ నా కుమార్తె; తుళమ్ పడు ముఱువల్ = దానిమ్మ గింజలవరుసల వలెనున్న పళ్ళ నుండి విరిసెడి చిరునవ్వుతో; తోழிయఱ్కు అరుళాళ్ = తన స్నేహితురాండ్రను పలుకరించదు; తుణై ములై=అందమైన వక్షోజములను;శాన్దు కొణ్డు అణియాళ్=చందనముతో అలంకరించుకొనదు;కుళమ్ పడు కువళై క్కణ్ణి ఇణై = తటాకములోనున్న (అందముతగ్గని) నల్లకలువ పోలిన నేత్రములందు;యెழுదాళ్= కాటుక పెట్టుకొనదు; కోలమ్ నల్ మలర్ = సుందరమైన మంచి పుష్పములను; కుழఱ్కు అణియాళ్ = తన కేశములయందు అలంకరించుకొనదు;వళమ్ పడు మున్నీర్ వైయమ్ మున్ అళన్ద= రత్నములు మొదలగు అనేక సంపదలకు స్థానమైన సముద్రముచే చుట్టుకొనియున్న భూమండలమును పూర్వమొకకాలమున తన పాదములచే కొలిచిన; మాల్ ఎన్నుమ్ = సర్వేశ్వరుడా! యని చెప్పుచుండును; ఇళమ్ పడి ఇవళుక్కు = (విరహమును సహింపజాలని)  సుకుమార స్వభావముకలిగిన ఈమె విషయమై;ఎన్ నినైన్దు ఇరున్దాయ్ = నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

     తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! తనయొక్క వ్యామోహమునకు తగినట్లు పలుకులుగల ఈ నా కుమార్తె, దానిమ్మ గింజల వరుసలవలెనున్న పళ్ళనుండి విరిసెడి చిరునవ్వుతో తన స్నేహితురాండ్రను పలుకరించదు,అందమైన వక్షోజములను చందనముతో అలంకరించుకొనదు, తటాకములోనున్న (అందముతగ్గని) నల్లకలువ పోలిన నేత్రములందు కాటుక పెట్టుకొనదు,సుందరమైన మంచి పుష్పములను తన కేశములయందు అలంకరించుకొనదు, రత్నములు మొదలగు అనేక సంపదలకు స్థానమైన సముద్రముచే చుట్టుకొనియున్న భూమండలమును పూర్వమొకకాలమున తన పాదములచే కొలిచిన సర్వేశ్వరుడా! యని చెప్పుచుండును. (విరహమును సహింపజాలని)  సుకుమార స్వభావముకలిగిన ఈమె విషయమై నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

శాన్దముమ్ పూణుమ్ శన్దనక్కుழమ్బుమ్, తడములైక్కణియిలుమ్ తழలామ్ ,

పోన్దవెణ్ తిఙ్గళ్ కదిర్ శుడమెలియుమ్, పొరుకడల్ పులమ్బిలుం పులమ్బుమ్ ,

మాన్దళిర్ మేని వణ్ణముమ్ పొన్నామ్, వళైగళుమ్ ఇఱైనిల్లా, ఎన్ఱన్

ఏన్దిழை యివళుక్కెన్ని నైన్దిరున్దాయ్, ఇడవెన్దై ఎన్దైపిరానే ll 1110

ఇడవెన్దై ఎన్దై పిరానే! = తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! ; శాన్దముమ్=సుగంధద్రవ్యములతో మిశ్రితమైన చందనమును;పూణుమ్= ముత్యముల  కంకణములు హారము మొదలగు ఆభరణములను;శన్దనక్కుழమ్బుమ్= చందనపు ముద్దను; తడ ములైక్కు అణియిలుమ్ = తన విశాల వక్షోజములయందు  అలంకరించుకొనినను; తழల్ ఆమ్=అవి నిప్పువలె మండుచున్నట్లు బాధపడుచున్నది;  పోన్ద వెణ్ తిఙ్గళ్ కదిర్ శుడ = ఉదయించిన తెల్లని చంద్రుని కిరణములు తనను దహించుచున్నట్లు; మెలియుమ్=మిక్కిలి వ్యధపొందుచున్నది;పొరు కడల్ పులమ్బిలుం = అలలుకొట్టుచున్న సముద్రము ఘోషించినచో;పులమ్బుమ్=ఈమెయు అరుచుచుండును; మాన్ తళిర్ మేని వణ్ణముమ్ = మామిడి లేతదళము పోలిన ఈమె శరీర వర్ణము; పొన్ ఆమ్ = పాలిపోయినది; వళైగళుమ్ ఇఱై నిల్లా = చేతి గాజులు కొంచమైనను నిలుచుటలేదు; ఎన్ తన్ ఏన్దు ఇழை యివళుక్కు = నాయొక్క ఆభరణములు ధరించియున్న కుమార్తె విషయమై;ఎన్ నినైన్దు ఇరున్దాయ్ = నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

    తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, సుగంధద్రవ్యములతో మిశ్రితమైన చందనమును,ముత్యముల  కంకణములు హారము మొదలగు ఆభరణములను,చందనపు ముద్దను తన విశాల వక్షోజములయందు అలంకరించుకొనినను,అవి నిప్పువలె మండుచున్నట్లు బాధపడుచున్నది,ఉదయించిన తెల్లని చంద్రుని కిరణములు తనను దహించుచున్నట్లు మిక్కిలి వ్యధపొందుచున్నది,  అలలుకొట్టుచున్న సముద్రము ఘోషించినచో ఈమెయు అరుచుచుండును, మామిడి లేతదళము పోలిన ఈమె శరీర వర్ణము పాలిపోయినది,చేతి గాజులు కొంచమైనను నిలుచుటలేదు, నీయందు అతిప్రేమానురాగములతో ఆభరణములు ధరించియున్ననా కుమార్తె విషయమై,నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

ఊழிయిల్  పెరిదాల్ నాழிగై యెన్నుమ్, ఒణ్ శుడర్ తుయిన్ఱదాలెన్నుమ్ ,

ఆழிయుమ్ పులమ్బుమ్ అన్ఱిలుమ్ ఉఱఙ్గా, తెన్ఱలుమ్ తీయినిల్ కొడిదామ్,

తోழிయో ఎన్నుమ్ తుణైములై అరక్కుమ్, శొల్లుమిన్ ఎన్ శెయ్ గేనెన్నుమ్,

ఏழைయెన్ పొన్నుక్కు ఎన్ నినైన్దిరున్దాయ్, ఇడవెన్దై ఎన్దైపిరానే ll 1111

ఇడవెన్దై ఎన్దై పిరానే! = తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; నాழிగై ఊழிయిల్ పెరిదు ఎన్నుమ్ = ఇరవది నాలుగు నిముషముల కాలము ఒక కల్పముకంటె దీర్ఘముగ నడుచుచున్నదని చెప్పును;ఒణ్ శుడర్ తుయిన్ఱదు ఎన్నుమ్ =మిక్కిలి తేజస్సుగల సూర్యుడు దీర్ఘనిద్రలో మునిగియున్నాడని చెప్పును; తోழி = ఓ! సఖీ!; ఆழிయుమ్ పులమ్బుమ్ = సముద్రము ఘోషించుచున్నది; అన్ఱిలుమ్ ఉఱఙ్గా  = అన్ఱిల్ పక్షి నిదురించటలేదు, తెన్ఱలుమ్ తీయినిల్ కొడిదామ్ = దక్షిణదిశపు గాలి నిప్పుకంటె మిక్కిలి వేడిగ వీచుచున్నది;ఓ ఎన్నుమ్=అయ్యో!అని చెప్పును; తుణైములై అరక్కుమ్= తన రెండు స్తనములను పెరికివేయునట్లుండును; ఎన్ శెయ్ గేన్ శొల్లుమిన్ ఎన్నుమ్ =”ఈ స్థితియందు ఏమి చేయగలను” తెలుపమని  చెప్పుచుండును; ఏழை ఎన్ పొన్నుక్కు =  మిక్కిలి చాపల్యముతోనున్న నా కుమార్తె విషయమై; ఎన్ నినైన్దు ఇరున్దాయ్ = నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, ఇరవది నాలుగు నిముషముల కాలము ఒక కల్పముకంటె దీర్ఘముగ నడుచుచున్నదని చెప్పును, మిక్కిలి తేజస్సుగల సూర్యుడు దీర్ఘనిద్రలో మునిగియున్నాడని చెప్పును, ఓ! సఖీ! సముద్రము ఘోషించుచున్నది,అన్ఱిల్ పక్షి నిదురించటలేదు,దక్షిణదిశపు గాలి నిప్పుకంటె మిక్కిలి వేడిగ వీచుచున్నది అయ్యో! అని ఆమెతో చెప్పును. తన రెండు స్తనములను పెరికివేయునట్లుండును. మిక్కిలి చాపల్యముతోనున్న నా కుమార్తె విషయమై,నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

ఓదిలుమ్ ఉన్ పేరన్ఱి మర్ట్రు ఓదాల్, ఉరుగుమ్ నిన్తిరువురు నినైన్దు ,

కాదన్మైపెరిదు కైయఱవుడైయళ్, కయల్ నెడుఙ్గణ్ తుయిల్ మఱన్దాళ్ ,

పేదైయేన్ పేదై పిళ్ళైమై పెరిదు, తెళ్ళియళ్ వళ్ళి నుణ్ మరుఙ్గుల్  ,

ఏదలర్ మున్నా ఎన్ నినైన్దిరున్దాయ్, ఇడవెన్దై ఎన్దైపిరానే ll 1112

ఇడవెన్దై ఎన్దై పిరానే! =తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; ఓదిలుమ్ = ఈ నా కుమార్తె నోరువిప్పి ఏమిపలికినను; ఉన్ పేర్ అన్ఱి = నీయొక్క దివ్య నామములే తప్ప; మర్ట్రు ఓదాల్ = వేరొక మాటలు పలుకదు; నిన్ తిరువురు నినైన్దు ఉరుగుమ్ = నీయొక్క తిరుమేనిని ధ్యానించుచు మైమరచి లీనమైయుండును; కాదన్మైపెరిదు = నీ విషయమై ఆశ అమితముగ కలిగి యున్నది; కై అఱవు ఉడైయళ్ = తనకు సంబంధించినది కోల్పోయినట్లు వేదనతోనుండును; కయల్ నెడుమ్ కణ్ తుయిల్ మఱన్దాళ్ = కయల్ మీనములవలెనున్న విశాల నేత్రములుగల ఈమె నిదురించుట మరచిపోయినది; పేదైయేన్ పేదై=ఙ్ఞానవిహీనురాలైన నాయొక్క కుమార్తె; పిళ్ళైమై పెరిదు = మిక్కిలి చిన్నవయస్సులో నుండినను; తెళ్ళియళ్ = (నీ స్వరూప గుణగణాదులందు) మిక్కిలి ఙ్ఞానవంతురాలై యుండును; వళ్ళి నుణ్ మరుఙ్గుల్ = తీగవలె సన్నని నడుముగల ఈమె విషయమై, ఏదలర్ మున్నా = ఆమెయొక్క విరోధుల ముంగిట(కించపరచుదువో లేక ప్రీతితో ఆదరించెదవో); ఎన్ నినైన్దు ఇరున్దాయ్ = నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

  తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,ఈ నా కుమార్తె నోరువిప్పి ఏమిపలికినను,నీయొక్క దివ్య నామములే తప్పు వేరొక మాటలు పలుకదు, నీయొక్క తిరుమేనిని ధ్యానించుచు మైమరచి లీనమైయుండును, నీ విషయమై ఆశ అమితముగ కలిగియున్నది, తనకు సంబంధించినది కోల్పోయినట్లు వేదనతో బాధపడుచుండును,కయల్ మీనములవలెనున్న విశాలనేత్రములుగల ఈమె నిదురించుట మరచిపోయినది,ఙ్ఞానవిహీనురాలైన నాయొక్క కుమార్తె మిక్కిలి చిన్నవయస్సులో నుండినను నీ స్వరూప గుణగణాదులందు మిక్కిలి ఙ్ఞానవంతురాలై యుండును, తీగవలె సన్నని నడుముగల ఈమె విషయమై,ఆమెయొక్క విరోధుల ముంగిట (కించపరచుదువో లేక ప్రీతితో ఆదరించెదవో),నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

తన్ కుడిక్కేదుమ్ తక్కవా నినైయాళ్, తడఙ్గడల్ నుడఙ్గు ఎழிల్ ఇలఙ్గై,

వన్ కుడి మడఙ్గ వాళ్ అమర్ తొలైత్త, వార్తైకేట్టు ఇన్బుఱుమ్ మయఙ్గుమ్ ,

మిన్ కొడి మరుఙ్గుల్ శురుఙ్గమేల్ నెరుఙ్గి, మెన్ములై పొన్ పయన్దిరున్ద ,

ఎన్ కొడి యివళుక్కెన్ని నైన్దిరున్దాయ్, ఇడవెన్దై ఎన్దైపిరానే ll 1113

ఇడవెన్దై ఎన్దై పిరానే! = తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్నసర్వేశ్వరా!; తన్ కుడిక్కు = (ఈ నా కుమార్తె )తన కులమర్యాదలకు; తక్కవా = అనుగుణముగ; ఏదుమ్  నినైయాళ్ = స్వల్పమైనను తలచదు; తడ కడల్ = పెద్ద  సముద్రముతోడను; నుడఙ్గు ఎழிల్ = ఎత్తైన ప్రాకరములతోను నున్న; ఇలఙ్గై = లంకాపురిలోగల; వల్ కుడి మడఙ్గ = బలిష్ఠమైన రాక్షసవంశములు అంతమగునట్లు ,వాళ్ అమర్ తొలైత్త = భయంకరమైన యుద్ధములో నాశనముచేసిన; వార్తై కేట్టు ఇన్బుఱుమ్ మయఙ్గుమ్ = సమాచారమును విని (సీతాదేవికై పోరుసలిపితివే యని) మిక్కిలి ఆనందోత్సాహములయందు మునిగి (తనకై ఏమియు చేయలేదని తలంచి) మూర్చిల్లును; మిన్ కొడి మరుఙ్గుల్ శురుఙ్గ = మెరుపువలెను, సన్నని తీగవలెను గల నడుము వంగునట్లు; పొన్ పయన్దిరున్ద = పాలిపోయి యున్నటివంటి;మెల్ ములై= సున్నితమైన స్తనములు;మేల్ నెరుఙ్గి=వక్షస్థలముపై చేరియున్న; ఎన్ కొడి ఇవళుక్కు= నాయొక్క ఈ కుమార్తె విషయమై; ఎన్ నినైన్దు ఇరున్దాయ్ = నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

      తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,ఈ నా కుమార్తె ,తన కులమర్యాదలకు అనుగుణముగ స్వల్పమైనను తలచదు, పెద్ద సముద్రముతోడను, ఎత్తైన ప్రాకరములతోను నున్న లంకాపురిలోగల బలిష్ఠమైన రాక్షసవంశములు అంతమగునట్లు భయంకరమైన యుద్ధములో నాశనముచేసిన,సమాచారమును విని (సీతాదేవికై పోరుసలిపితివే యని) మిక్కిలి ఆనందోత్సాహములయందు మునిగి (తనకై ఏమియు చేయలేదని తలంచి) మూర్చిల్లును. మెరుపువలెను, సన్నని తీగవలెను గల నడుము వంగునట్లు,పాలిపోయి యున్నటివంటి సున్నితమైన స్తనములు వక్షస్థలముపై చేరియున్న నాయొక్క ఈ కుమార్తె విషయమై,నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

ఉళమ్ కనిన్దిరుక్కుమ్ ఉన్నైయే పిదర్ట్రుమ్, ఉనక్కన్ఱి ఎనక్కు అన్బొన్ఱిలళ్ ఆల్,

వళమ్ కనిపొழிల్ శూழ் మాలిరుఞ్జోలై,  మాయనేయెన్ఱు వాయ్ వెరువుమ్ ,

కళఙ్గని ముఱువల్ కారిగై పెరిదు, కవలైయోడు అవలమ్ శేర్ న్దిరున్ద ,

ఇళఙ్గని ఇవళుక్కు ఎన్ నినైన్దిరున్దాయ్, ఇడవెన్దై ఎన్దైపిరానే ll 1114

ఇడవెన్దై ఎన్దై పిరానే!=తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; ఉళమ్ కనిన్దు ఇరుక్కుమ్ = (ఈ నా కుమార్తె ఎల్లప్పుడును నీయొక్క స్మరణయందే ఉండుటచే) హృదయము ఆనందముతో నిండియుండును; ఉన్నైయే పిదర్ట్రుమ్ = (నోరు విప్పినచో) నీ విషయమే సంభాషించును; ఉనక్కు అన్ఱి ఎనక్కు అన్బు ఒన్ఱు ఇలళ్ = నీయందు తప్ప నాయందు ప్రేమ స్వల్పమైనను లేదు; వళమ్ కని పొழிల్ శూழ் మాలిరుఞ్జోలై మాయనే ఎన్ఱు వాయ్ వెరువుమ్ = బాగుగ పండిన తియ్యని పండ్లుగల తోటలతో చుట్టబడియున్న తిరుమాలిరుఞ్జోలై దివ్య దేశములో కృపతో వేంచేసియున్న ఆశ్చర్యభూతుడా! అని ఎప్పుడును చెప్పుచునేయుండును; కళఙ్గని ముఱువల్  కారిగై = వాక్కాయ పండువలె మధురమైన చిరునవ్వుగల అందాలరాసియు; పెరిదు కవలైయోడు అవలమ్ శేర్ న్దు ఇరున్ద=మిక్కిలి మనోవ్యధతో దుఃఖపూరితమైయున్న, ఇళఙ్గని ఇవళుక్కు = యౌవనవతియైన ఈ నా కుమార్తె విషయమై;ఎన్ నినైన్దు ఇరున్దాయ్ = నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

  తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,ఈ నా కుమార్తె ఎల్లప్పుడును నీయొక్క  స్మరణయందు ఉండుటచే  హృదయము ఆనందముతో నిండియుండును,నోరు విప్పినచో నీ విషయమే సంభాషించును,నీయందు తప్ప నాయందు ప్రేమ స్వల్పమైనను లేదు, బాగుగ పండిన తియ్యని పండ్లుగల తోటలతో చుట్టబడియున్న తిరుమాలిరుఞ్జోలై దివ్య దేశములో కృపతో వేంచేసియున్న ఆశ్చర్యభూతుడా! అని ఎప్పుడును చెప్పుచునేయుండును, వాక్కాయ పండువలె మధురమైన చిరునవ్వుగల అందాలరాసియు,మిక్కిలి మనోవ్యధతో దుఃఖ పూరితమైయున్న, యౌవనవతియైన ఈ నా కుమార్తె విషయమై, నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

అలమ్ కెழுతడక్కై ఆయన్ వాయ్ ఆమ్బఱ్కు, ఆழிయుమాల్ ఎన్నుళ్ళమెన్నుమ్,

పులఙ్గెழு పొరునీర్  పుట్కుழி పాడుమ్, పోదుమో నీర్మలైక్కెన్నుమ్ ,

కులఙ్గెழு కొల్లి కోమలవల్లి, క్కొడియిడై నెడుమழை క్కణ్ణి ,

ఇలఙ్గు ఎழிల్ తోళిక్కు ఎన్ నినైన్దిరున్దాయ్, ఇడవెన్దై ఎన్దైపిరానే ll 1115

ఇడవెన్దై ఎన్దై పిరానే!=తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్నసర్వేశ్వరా!; (ఈ నా కుమార్తె) అలమ్ కెழு = హలముతొ ప్రకాశించెడి;తడమ్ క్కై ఆయన్ = పెద్ద దివ్యమైన చేతులుగల గోపాలకృష్ణునియొక్క; వాయ్ ఆమ్బఱ్కు= పెదవులనుండి ఊదెడి వేణుగానమునకు; ఎన్ ఉళ్ళమ్ = నాయొక్క హృదయము, అழிయుమ్ = శిధిలమగుచున్నది; ఎన్నుమ్ = అని చెప్పును;పులమ్ కెழு = మనోహరమైన; పొరు నీర్ = అలలతో నిండిన నీటిసమృద్దిగల;పుట్కుழி పాడుమ్=తిరుపుట్కుழி విషయమై పాడుచుండును; నీర్మలైక్కు పోదుమో ఎన్నుమ్= “తిరునీర్మలై దివ్యదేశమునకు పోవుదుమా!” అని అడుగుచుండును; కులమ్ కెழு కొల్లి కోమలవల్లి = మాకులమందవతరించిన మిక్కిలి శ్లాఘ్యమైన కొల్లి పర్వతమందుగల అందమైన బొమ్మవలెనున్నదియు; కొడి ఇడై = తీగవలె సన్నని నడుముకలదియు; నెడుమ్ మழை కణ్ణి = పెద్ద వర్షధారల వలె కారుచున్న కన్నులుగలదియు; ఇలఙ్గు ఎழிల్ తోళిక్కు= ప్రకాశించుచున్న అందమైన భుజములగల నా కుమార్తె విషయమై;  ఎన్ నినైన్దు ఇరున్దాయ్ = నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

    తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,ఈ నా కుమార్తె ” హలముతొ ప్రకాశించెడి పెద్ద దివ్యమైన చేతులుగల గోపాలకృష్ణుని యొక్క పెదవులనుండి ఊదెడి వేణుగానమునకు నాయొక్క హృదయము శిధిలమగుచున్నది” అని చెప్పును, మనోహరమైన అలలతో నిండిన నీటిసమృద్దిగల తిరుపుట్కుழி లో వేంచేసియున్న శ్రీమాన్  విజయరాఘవన్ పెరుమాళ్  విషయమై పాడుచుండును, “తిరునీర్మలై దివ్యదేశమునకు పోవుదుమా!” అని అడుగుచుండును, మాకులమందవతరించిన మిక్కిలి శ్లాఘ్యమైన కొల్లి పర్వతమందుగల అందమైన బొమ్మవలె నున్నదియు,తీగవలె సన్నని నడుముకలదియు,పెద్ద వర్షధారల వలె కారుచున్న కన్నులుగలదియు, ప్రకాశించుచున్న అందమైన భుజములగల నా కుమార్తె విషయమై,నీ హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

పొన్ కులాంపయలై పూత్తనమెన్ తోళ్, పొరుకయల్ కణ్ తుయిల్ మఱన్దాళ్,

అన్బినాల్ ఉన్మేల్ ఆదరమ్ పెరిదు, ఇవ్వణఙ్గినుక్కు ఉర్ట్రనోయ్ అఱియేన్ ,

మిన్ కులాం మరుఙ్గుల్ శురుఙ్గమేల్ నెరుఙ్గి, వీఙ్గియ వనములై యాళుక్కు ,

ఎన్గొలామ్ కుఱిప్పిల్ ఎన్ నినైన్దిరున్దాయ్, ఇడవెన్దై ఎన్దైపిరానే ll 1116

ఇడవెన్దై ఎన్దై పిరానే!=తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్నసర్వేశ్వరా!; మెన్ తోళ్=సన్నని నాజూకైన భుజములు;పొన్ కులాం పయలై పూత్తన = బంగారపు వర్చస్సువలె పాలిపోయినది; పొరు కయల్ కణ్ తుయిల్ మఱన్దాళ్ = ఒకటితోమరొకటి పోరుసలిపెడి కయల్ మీనములవలెనున్న  నేత్రములలో నిదుర మరచిపోయినది; ఉన్మేల్ అన్బినాల్ ఆదరమ్ పెరిదు = నీ విషయమందు ప్రేమాతిశయముచే  కోరిక మరింత పెరిగినది;ఇవ్ అణఙ్గినుక్కు ఉర్ట్ర నోయ్ అఱియేన్= ఈ అందమైన బాలిక పొందిన వ్యాధి తెలియుటలేదు; మిన్ కులాం మరుఙ్గుల్ శురుఙ్గ = మెరుపువలె వంపులుగల నడుము వంగునట్లు;మేల్ నెరుఙ్గి=వక్షస్థలముపై ఒకటితోఒకటి చేరియున్న; వీఙ్గియ వన ములై యాళుక్కు = పొంగిన అందమైన స్తనములుగల ఈమెకు; ఎన్ కొల్ ఆమ్ = ఏమి పర్యవసానమగునో?; కుఱిప్పిల్ ఎన్ నినైన్దిరున్దాయ్=(ఈ నా కుమార్తె విషయమై) నీ దివ్య హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

      తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,సన్నని నాజూకైన భుజములు బంగారపు వర్చస్సువలె పాలిపోయినది,ఒకటితోమరొకటి పోరుసలిపెడి కయల్ మీనములవలెనున్న నేత్రములలో నిదుర మరచిపోయినది,నీ విషయమందు ప్రేమాతిశయముచే కోరిక మరింత పెరిగినది,ఈ అందమైన బాలిక పొందిన వ్యాధి తెలియుటలేదు,మెరుపువలె వంపులుగల నడుము వంగునట్లు  వక్షస్థలముపై ఒకటితోఒకటి చేరియున్న పొంగిన అందమైన స్తనములుగల ఈమెకు ఏమి పర్యవసానమగునో?, ఈ నా కుమార్తె విషయమై నీ దివ్య హృదయమందు ఏమి చేయుటకు సంకల్పించియున్నావు స్వామీ!.

** అన్నముమ్ మీనుమ్ ఆమైయుమ్ అరియుమాయ, ఎమ్మాయనే అరుళాయ్,

ఎన్నుమ్ ఇన్ తొణ్డర్కు ఇన్ అరుళ్ పురియుమ్, ఇడవెన్దై ఎన్దైపిరానై ,

మన్ను మామాడమఙ్గైయర్ తలైవన్, మానవేల్ కలియన్ వాయొలిగళ్ ,

పన్నియ పనువల్ పాడువార్, నాళుమ్ పழవినై పర్ట్రఱుప్పారే ll 1117

అన్నముమ్ మీనుమ్ ఆమైయుమ్ అరియుమ్ ఆయ=హంసరూపిగను,మత్స్యరూపిగను కూర్మరూపిగను, నరసింహరూపిగను అవతరించిన సర్వేశ్వరుని; ఎమ్ మాయనే అరుళాయ్ ఎన్నుమ్ =   ” మాయొక్క ఆశ్చర్యచేష్టితములుగల స్వామీ! మాపై కృపచూపుమా! ” అని ప్రార్ధించుచుండు; ఇన్ తొణ్డర్కు = పరమ భక్తులకు; ఇన్ అరుళ్ పురియుమ్ = పరమ కృపజూపుచుండు; ఇడవెన్దై ఎన్దైపిరానై = తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై; మన్ను మా మాడ మఙ్గైయర్ తలైవన్ = శాశ్వతమైన పెద్ద భవంతులుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన; మానవేల్ = శ్లాఘ్యమైన శూలాయుధము కలిగిన; కలియన్=తిరుమంగై ఆళ్వార్; వాయ్ ఒలిగళ్ పన్నియ = ముఖపద్మమునుండి సుందరముగ విస్తరించి అనుగ్రహించిన; పనువల్=ఈ పాశురములను;పాడువార్=అనుసంధించువారు; నాళుమ్ = శాశ్వతముగ; పழవినై పర్ట్రు అఱుప్పారే = పూర్వపు పాపకర్మల సంబంధమును సమూలముగ నిర్మూలించుకొందురు.

                  హంసరూపిగను,మత్స్యరూపిగను,కూర్మరూపిగను, నరసింహరూపిగను అవతరించిన సర్వేశ్వరుని, ” మాయొక్క ఆశ్చర్యచేష్టితములుగల స్వామీ! మాపై కృపచూపుమా! ” అని ప్రార్ధించుచుండు పరమ భక్తులకు పరమ కృపజూపుచుండు తిరువిడవెన్దై దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై, శాశ్వతమైన పెద్ద భవంతులుగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన, శ్లాఘ్యమైన శూలాయుధము కలిగిన తిరుమంగై ఆళ్వార్ ముఖపద్మమునుండి సుందరముగ విస్తరించి అనుగ్రహించిన ఈ పాశురములను అనుసంధించువారు శాశ్వతముగ పూర్వపు పాపకర్మల సంబంధమును, సమూలముగ నిర్మూలించుకొందురు.

***************

వ్యాఖ్యానించండి