శ్రీః
శ్రీమతే రామనుజాయనమః
తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన
_______________
పెరియతిరుమొழி-3వ పత్తు
____________
శ్రీః
1. ఇరున్దణ్
తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశములో కృపతో నిత్యవాసము చేయుచున్న దేవనాథన్ పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** ఇరున్దణ్ మానిలమ్ ఏనమదాయ్, వళైమరుప్పి నిలగత్తు ఒడుక్కి ,
కరున్దణ్ మాకడల్ కణ్ తుయిన్ఱవనిడమ్, కమలనన్మలర్ తేఱల్
అరున్ది, ఇన్నిశై మురన్ఱు ఎழுమళికులమ్ పొతుళి, అమ్బొழிలూడే ,
శెరున్ది నాణ్మలర్ శెన్ఱణైన్దు ఉழிతరు, తిరువయిన్దిరపురమే ll 1148
ఇరుమ్ తణ్ మా నిలమ్ = మిక్కిలి చల్లని పెద్ద భూమిని; ఏనమ్ అదు ఆయ్ = వరాహ రూపముదాల్చి, వళైమరుప్పు అగత్తునిల్ ఒడుక్కి = వంగియున్న కోరలుపై దృఢముగ నుంచుకొనినవాడును; కరుమ్ తణ్ మా కడల్ కణ్ తుయిన్ఱవన్ = నల్లని చల్లనైన మహా సముద్రమందు యోగనిద్రలో పవళించియున్న సర్వేశ్వరుని; ఇడమ్= నివాసస్దానము (ఏదనగ ); అమ్ పొழிలూడే=అందమైన తోటలలో;నల్ కమలమ్ మలర్ తేఱల్ అరున్ది = బాగుగ వికసించిన తామరపుష్పమందలి తేనెను గ్రోలి;ఇన్ ఇశై మురన్ఱు ఎழுమ్= ఇంపైన రాగములతొ పాడుచు నృత్యముచేయు; అళికులమ్ పొతుళి = తుమ్మెదల సమూహములు గుమిగూడి ; శెరున్ది = శురపున్నై చెట్లయొక్క, నాళ్ మలర్ = అప్పుడే వికసించిన పుష్పముల చెంతకు;శెన్ఱు అణైన్దు = పోయి వాటియందు; ఉழிతరు = సంచరించుచుండెడి; తిరువయిన్దిరపురమే = తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
మిక్కిలి చల్లని పెద్ద భూమిని, వరాహ రూపముదాల్చి, వంగియున్న కోరలుపై దృఢముగ నుంచుకొనిన వాడును, నల్లని చల్లనైన మహాసముద్రమందు యోగనిద్రలో పవళించియున్న సర్వేశ్వరునియొక్క నివాసస్దానము ( ఏదనగ ), అందమైన తోటలలో బాగుగ వికసించిన తామర పుష్పమందలి తేనెను గ్రోలి,ఇంపైన రాగములతొ పాడుచు నృత్యముచేయు తుమ్మెదల సమూహములు గుమిగూడి, శురపున్నై చెట్లయొక్క అప్పుడే వికసించిన పుష్పముల చెంతకు పోయి వాటియందు సంచరించుచుండెడి తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
మిన్నుమ్ ఆழிయఙ్గైయవన్, శెయ్యవళ్ ఉఱైతరు తిరుమార్వన్ ,
పన్ను నాన్మఱై ప్పల్ పొరుళాగియ, పరనిడమ్ వరైచ్చారల్ ,
పిన్నుమ్ మాదవిప్పన్దలిల్ పెడైవర, ప్పిణియవిழ் కమలత్తు ,
తెన్న వెన్ఱు వణ్డు ఇన్నిశై ముయల్ తరు, తిరువయిన్దిరపురమే ll 1149
మిన్నుమ్ ఆழி అమ్ కైయవన్ = ప్రజ్వలించుచున్న సుదర్శనచక్రము అందమైన తన హస్తమున కలవాడును; శెయ్యవళ్ ఉఱైతరు తిరుమార్వన్ = శ్రీమహాలక్ష్మి నిత్యవాసము చేయుచున్న వక్షస్థలము కలవాడును; పన్ను నాల్ మఱై పల్ పొరుళ్ ఆగియ = అనుసంధింపబడు నాలుగు వేదముల అనేక విధములైన అర్ధములచే ప్రతిపాదింప బడువాడైన; పరన్ ఇడమ్ = పరమ పురుషునియొక్క నివాసస్దానము ( ఏదనగ ); వణ్డు= తుమ్మెదలు; వరై చారల్=కొండల ఏటవాలుగానున్న ప్రదేశములందు;పిన్నుమ్= సమీపములోనున్న; మాదవి పన్దలిల్=గురువిందతీగలు అల్లుకొనియుండు పందిళ్ళ పైన నున్న; పెడై వర = తమ ఆడ తుమ్మెదలు తామున్న స్థలమునకు వచ్చునట్లు; పిణి అవిழ் కమలత్తు = పరిమళము వెదజల్లు తామరపుష్పమందు; తెన్న ఎన్ఱు = తెన్నాతెన్నాయని ఇంపుగ రాగములతో పాడుచుండెడి ; తిరువయిన్దిరపురమే = తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
ప్రజ్వలించుచున్న సుదర్శనచక్రము అందమైన తన హస్తమున కలవాడును, శ్రీమహాలక్ష్మి నిత్యవాసము చేయుచున్న వక్షస్థలము కలవాడును,అనుసంధింపబడు నాలుగు వేదముల అనేక విధములైన అర్ధములచే ప్రతిపాదింప బడువాడైన పరమ పురుషునియొక్క నివాసస్దానము ( ఏదనగ ), తుమ్మెదలు, కొండల ఏటవాలుగానున్న ప్రదేశములందు, సమీపములోనున్న గురువిందతీగలు అల్లుకొనియుండు పందిళ్ళ పైన నున్న ,తమ ఆడ తుమ్మెదలు తామున్న స్థలమునకు వచ్చునట్లు పరిమళము వెదజల్లు తామరపుష్పమందు, తెన్నాతెన్నా యని ఇంపుగ రాగములతో పాడుచుండెడి తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
వైయమేழுముణ్డు ఆలిలై వైగియ మాయవన్, అడియవర్కు
మెయ్యనాగియ దెయ్ వనాయకనిడమ్, మెయ్ దకు వరైచ్చారల్ ,
మొయ్ కొళ్ మాతవి శెణ్బకమ్ ముయఙ్గియ, ముల్లైయఙ్గొడియాడ ,
శెయ్యతామరై చ్చెழுమ్ పణై తిగழ் తరు, తిరువయిన్దిరపురమే ll 1150
వైయమ్ ఏழுమ్ ఉణ్డు = (ప్రళయకాలమున) సప్తలోకములను ఆరగించి; ఆల్ ఇలై వైగియ మాయవన్=వటపత్రముపై చిరకాలముగడిపిన మిక్కిలి ఆశ్చర్యభూతుడును;అడియవర్కు మెయ్యన్ ఆగియ = తనయొక్క దాసులకు నమ్మకమైనవాడును; దెయ్ వ నాయకన్ ఇడమ్ = సమస్త దేవతలకు నాయకుడైన సర్వేశ్వరుని నివాసస్దానము (ఏదనగ);మెయ్ దకు వరై చారల్ = ఆ సర్వేశ్వరుని తిరుమేని వర్ణముగల పర్వతము యొక్క ఏటవాలు ప్రదేశములందు; మొయ్ కొళ్ మాతవి శెణ్బకమ్ = దట్టముగనున్న కురుకత్తి, సంపంగిచెట్లతో; ముయఙ్గియ = చుట్టుకొనియున్న; ముల్లై అమ్ కొడి ఆడ = అందమైన మల్లెల తీగలు కదులుచుండునదియు; శెయ్య తామరై శెழுమ్ పణై తిగழ் తరు = ఎర్ర తామర పుష్పములతో నిండిన జలరాసులతో ప్రకాశించుచున్నట్టి; తిరువయిన్దిరపురమే = తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
ప్రళయకాలమున సప్తలోకములను ఆరగించి వటపత్రముపై చిరకాలము గడిపిన మిక్కిలి ఆశ్చర్యభూతుడును,తనయొక్క దాసులకు నమ్మకమైనవాడును, సమస్త దేవతలకు నాయకుడైన సర్వేశ్వరుని నివాసస్దానము ( ఏదనగ ), ఆ సర్వేశ్వరుని తిరుమేని వర్ణముగల పర్వతముయొక్క ఏటవాలు ప్రదేశములందు, దట్టముగనున్న కురుకత్తి, సంపంగిచెట్లతో చుట్టుకొనియున్న అందమైన మల్లెల తీగలు కదులు చుండునదియు,ఎర్ర తామర పుష్పములతో నిండిన జలరాసులతో ప్రకాశించుచున్నట్టి తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!.
మాఱుకొణ్డు ఉడన్ఱు ఎతిర్ న్ద వల్ అవుణన్ తన్, మార్వకమిరుపిళవా ,
కూఱుకొణ్డు అవన్ కులమగఱ్కు, ఇన్నరుళ్ కొడుత్తవనిడమ్, మిడైన్దు
శాఱుకొణ్డ మెన్ కఱుమ్బు ఇళఙ్గழை తకై, విశుమ్బుఱ మణినీழల్ ,
శేఱుకొణ్డ తణ్ పழనమతు ఎழிల్ తిగழ், తిరువయిన్దిరపురమే ll 1151
మాఱు కొణ్డు = శత్రుత్వము వహించి; ఉడన్ఱు = మిక్కిలి క్రోధముతో;ఎతిర్ న్ద = తనను ఎదిరించిన; అవుణన్ తన్ = బలశాలియైన హిరణ్యాసురునియొక్క;మార్వగమ్ = వక్షస్థలమును; ఇరు పిళవా = రెండు ముక్కలగ; కూఱు కొణ్డు = చీల్చి వధించి; అవన్ కులమ్ మగఱ్కు = అతని శ్లాఘ్యమైన పుత్రుడు ప్రహ్లాదునికి; ఇన్ అరుళ్ కొడుత్తవన్ ఇడమ్ = మంచి కృపజేసిన సర్వేశ్వరుని నివాసస్దానము (ఏదనగ); మిడైన్దు = ఒకటితోమరొకటి చేరియున్న; శాఱు కొణ్డ = రసమయమయిన; మెన్ కఱుమ్బు ఇళమ్ కழை = మృదువైన చెరకుమొక్కల లేత మొలకల కొనలు; తకై విశుమ్బు ఉఱ = ఆకసమువరకు పెరిగి దానిచే అడ్డగింపబడుటచే; మణి నీழల్ = అందమైన నీడలు కలిగించు చున్నదియు; శేఱు కొణ్డ= చెరకు రసములు కారుటచే బురదలు కలిగినదై; తణ్ పழనమతు ఎழிల్ తిగழ்=చల్లని జలాశయములతో అందముగ ప్రకాశించుచున్న; తిరువయిన్దిరపురమే = తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
శత్రుత్వము వహించి మిక్కిలి క్రోధముతో తనను ఎదిరించిన బలశాలియైన హిరణ్యాసురునియొక్క వక్షస్థలమును రెండు ముక్కలగ చీల్చి వధించి, అతని శ్లాఘ్యమైన పుత్రుడు ప్రహ్లాదునికి మంచి కృపజేసిన సర్వేశ్వరుని నివాసస్దానము (ఏదనగ), ఒకటితోమరొకటి చేరియున్న రసమయమయిన మృదువైన చెరకుమొక్కల లేత మొలకల కొనలు ఆకసమువరకు పెరిగి దానిచే అడ్డగింపబడుటచే అందమైన నీడలు కలిగించుచున్నదియు, చెరకు రసములు కారుటచే బురదలు కలిగినదై,మరియు చల్లని జలాశయములతో అందముగ ప్రకాశించుచున్న తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
ఆఙ్గుమావలి వేళ్వియిల్ ఇరన్దు శెన్ఱు, అగలిడమ్ అళన్దు, ఆయర్
పూఙ్గొడిక్కు ఇనవిడై పొరుతవనిడమ్, పొన్ మలర్ తిగழ், వేఙ్గై
కోఙ్గు శెణ్గగ క్కొమ్బినిల్, కుతికొడు క్కురక్కినమ్ ఇరైత్తోడి ,
తేన్ కలన్ద తణ్ పలఙ్గని నుగర్ తరు, తిరువయిన్దిరపురమే ll 1152
మావలి వేళ్వియిల్=మహాబలి యాగభూమివద్దకు;శెన్ఱు=వెడలి;ఇరన్దు = మూడడుగుల స్థలమును యాచించి; ఆఙ్గు = అచ్చటనే; అగల్ ఇడమ్ అళన్దు = విశాలమైన సర్వలోకములను కొలిచి స్వీకరించినవాడును;ఆయర్ పూమ్ కొడిక్కు= అందమైన తీగ పోలిన గొల్లకాంత నప్పిన్నైపిరాట్టి కొరకు; ఇనమ్ విడై = గుంపుగా వచ్చుచున్న ఏడు వృషభములతో;పొరుదవన్ ఇడమ్=పోరుసలిపి వాటిని అంతమొందించిన సర్వేశ్వరుని నివాసస్దానము (ఏదనగ); క్కురక్కినమ్=వానర గుంపులు;పొన్ మలర్ తిగழ்=బంగారు వర్ణముకలిగిన పుష్పములు ప్రకాశించు; వేఙ్గై కోఙ్గు శెణ్గగమ్ కొమ్బినిల్ = ఏగిస, అల్లి, సంపంగి చెట్లయొక్క కొమ్మలలో; కుదికొడు=గెంతులువేయుచు;ఇరైత్తు=అరుచుకొనుచు; ఓడి = ఇటు అటు పరుగెత్తుచు; తేన్ కలన్ద తణ్ పలమ్ కని నుగర్ తరు = మిక్కిలి తేనె కలిగిన శ్లాఘ్యమైన పనస పండ్లను తినుచుండెడి; తిరువయిన్దిరపురమే = తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
మహాబలి యాగభూమివద్దకు వెడలి మూడడుగులస్థలమును యాచించి, అచ్చటనే విశాలమైన సర్వలోకములను కొలిచి స్వీకరించినవాడును, అందమైన తీగ పోలిన గొల్లకాంత నప్పిన్నైపిరాట్టి కొరకు గుంపుగా వచ్చుచున్న ఏడు వృషభములతో పోరుసలిపి వాటిని అంతమొందించిన సర్వేశ్వరుని నివాసస్దానము ( ఏదనగ ), వానర గుంపులు బంగారు వర్ణముకలిగిన పుష్పములు ప్రకాశించు ఏగిస, అల్లి, సంపంగి చెట్లయొక్క కొమ్మలలో గెంతులువేయుచు, అరుచుకొనుచు, ఇటు అటు పరుగెత్తుచు, మిక్కిలి తేనె కలిగిన శ్లాఘ్యమైన పనస పండ్లను తినుచుండెడి తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
కూనులావియ మడందైతన్, కొడఞ్జొలిన్ తిఱత్తు ఇళఙ్గొడియోడుమ్ ,
కాన్ ఉలావియ కరుముగిల్ తిరునిఱత్తవనిడమ్, కవినారుమ్ ,
వాన్ ఉలావియ మతితవழ் మాల్ వరై, మామతిళ్ పుడై శూழ் ,
తేన్ ఉలావియ శెழுమ్ పొழிల్ తழுవియ, తిరువయిన్దిరపురమే ll 1153
కూన్ ఉలావియ మడందైతన్ = గూనితొ సంచరించు మంథరయను స్త్రీయొక్క; కొడమ్ శొలిన్ తిఱత్తు = చెప్పుడు మాటలు కారణముగ;ఇళమ్ కొడియోడుమ్ = లేత తీగవలెనున్న సీతాదేవితోకూడ; కాన్ ఉలావియ=అడవులలో సంచరించిన;కరుముగిల్ తిరు నిఱత్తవన్ ఇడమ్ = కాలమేఘవర్ణమువంటి రూపము కలగిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము (ఏదనగ); కవిన్ ఆరుమ్=అందముతో నిండిన;వాన్ ఉలావియ మది= ఆకాశములో సంచరించెడి చంద్రుడు; తవழ் = దోగాడు;మాల్ వరై = పెద్ద పర్వతమును; మా మతిళ్ పుడై శూழ் = పెద్ద ప్రాకారములచే అన్నిపక్కల చుట్టుకొనియున్నదియు; తేన్ ఉలావియ శెழுమ్ పొழிల్ తழுవియ = తుమ్మెదలు సంచరించు అందమైన తోటలచే చుట్టుకొనియున్న; తిరువయిన్దిరపురమే = తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
గూనితొ సంచరించు మంథరయను స్త్రీయొక్క చెప్పుడు మాటలు కారణముగ లేత తీగవలెనున్న సీతాదేవితోకూడ అడవులలో సంచరించిన కాలమేఘవర్ణమువంటి రూపము కలగిన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము ( ఏదనగ ), అందముతో నిండిన ఆకాశములో సంచరించెడి చంద్రుడు దోగాడు పెద్ద పర్వతమును, పెద్ద ప్రాకారములచే అన్నిపక్కల చుట్టుకొనియున్నదియు, తుమ్మెదలు సంచరించు అందమైన తోటలచే చుట్టుకొనియున్న తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా! .
మిన్నిన్ నుణ్ణిడై మడక్కొడి కారణమ్, విలఙ్గలిన్ మిశై యిలఙ్గై
మన్నన్, నీణ్ముడి పొడిశెయ్ ద మైన్దనదిడమ్, మణివరై నీழల్ ,
అన్న మామలర్ అరవిన్దత్తమళియిల్, పెడైయొడుమ్ ఇనిదు అమర,
శెన్నెల్ ఆర్ కవరిక్కులై వీశు, తణ్ తిరువయిన్దిరపురమే ll 1154
మిన్నిన్ నుణ్ ఇడై = మెరుపువలె సూక్ష్మమైన నడుముగల; మడమ్ కొడి కారణమ్ = వినయము కలిగిన తీగవలెనున్న సీతాదేవి కారణముగ;విలఙ్గలిన్ మిశై యిలఙ్గై = సువేలపర్వతముపై సురక్షితముగ నిర్మింపబడిన లంకాపురికి; మన్నన్ = ప్రభువైన రావణాసురునియొక్క; నీళ్ ముడి పొడిశెయ్ ద మైన్దనదు ఇడమ్ = పొడుగైన కిరీటములు గల పది తలలను భస్మీపటలముచేసిన మిక్కిలి బలశాలియైన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము (ఏదనగ); మణివరై నీழల్ = అందమైన పర్వతము యొక్క నీడలో; అన్నమ్ = హంసలు; మా అరవిన్దత్తు మలర్ అమళియిల్=పెద్ద తామర పుష్పము యొక్క పడకయందు; పెడైయొడుమ్ ఇనిదు అమర = తమ ఆడ హంసలతో కూడి సంతోషముతో వసించుటకు తగునట్లు;శెన్నెల్ ఆర్ కవరి కులై వీశు=ఎర్రనిధాన్యపు పంటలు వింజామరమువలె వీచుచున్న; తణ్ = చల్లని; తిరువయిన్దిరపురమే = తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
మెరుపువలె సూక్ష్మమైన నడుముగల వినయము కలిగిన తీగవలెనున్న సీతాదేవి కారణముగ, సువేలపర్వతముపై సురక్షితముగ నిర్మింపబడిన లంకాపురికి ప్రభువైన రావణాసురుని యొక్క కిరీటములుగల పది తలలను భస్మీపటలముచేసిన మిక్కిలి బలశాలియైన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము ( ఏదనగ ), అందమైన పర్వతము యొక్క నీడలో హంసలు పెద్ద తామరపుష్పము యొక్క పడకయందు తమ ఆడ హంసలతో కూడి సంతోషముతో వసించుటకు తగునట్లు ఎర్రనిధాన్యపు పంటలు వింజామరమువలె వీచుచున్న చల్లని తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
విరైకమழ் న్ద మెన్ కరుఙ్గుழల్ కారణమ్, విల్ ఇఱత్తు అడల్ మழைక్కు,
నిరైకలఙ్గిడ వరైకుడైయెడుత్తవన్, నిలవియ ఇడమ్ తడమ్ ఆర్ ,
వరై వళన్దికழ் మదకరి మరుప్పొడు, మలై వళర్ అకిల్ ఉన్ది ,
తిరై కొణర్ న్దణై శెழுనది వయల్ పుగు, తిరువయిన్దిరపురమే ll 1155
విరై కమழ் న్ద మెన్ కరుమ్ కుழల్ కారణమ్ = పరిమళము వెదజల్లెడి మృదువైన నల్లని కుంతలములుగల సీతాదేవి కొరకు; విల్ ఇఱత్తు = ధనస్సును విరిచినవాడును; అడల్ మழைక్కు నిరై కలఙ్గిడ = వధింపగల భయంకరమైన వర్షధారలకు గోసమూహములు పరితపించగ; వరై కుడై ఎడుత్తవన్ = గోవర్ధన పర్వతమును గొడుగు వలె పైకెత్తిన సర్వేశ్వరుడు; నిలవియ ఇడమ్ = ఆనందముతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము( ఏదనగ ); తడమ్ ఆర్ వరై వళమ్ తికழ் మద కరి = తటాకములతో నిండియున్న పర్వతమునకు అందమును కలుగజేయు ఉజ్వలమైన మదపుటేనుగులయొక్క; మరుప్పొడు = దంతములును; మలై వళర్ అకిల్ = పర్వత ప్రాంతమందు పెరిగియున్న అగిల్ చెట్లను;తిరై ఉన్ది కొణర్ న్దు = అలలతొ త్రోయుచు తీసుకుని వచ్చి ;అణై శెழு నది=చేర్చెడి అందమైన నది;వయల్ పుగు = పొలములలో ప్రవహించుచున్న; తిరువయిన్దిరపురమే = తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
పరిమళము వెదజల్లెడి మృదువైన నల్లని కుంతలములుగల సీతాదేవి కొరకు శివధనస్సును విరిచినవాడును, వధింపగల భయంకరమైన వర్షధారలకు గోసమూహములు పరితపించగ, గోవర్ధన పర్వతమును గొడుగు వలె పైకెత్తిన సర్వేశ్వరుడు ఆనందముతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము ( ఏదనగ ), తటాకములతో నిండియున్న పర్వతమునకు, అందమును కలుగజేయు ఉజ్వలమైన మదపుటేనుగులయొక్క దంతములును, పర్వతప్రాంతమందు పెరిగియున్న అగిల్ చెట్లను,అలలతొ త్రోయుచు,తీసుకుని వచ్చి చేర్చెడి అందమైన నది,పొలములలో ప్రవహించుచున్న తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!.
వేల్ కొళ్ కైత్తలత్తు అరశర్ వెమ్ పోరినిల్, విశయనుక్కాయ్ మణిత్తేర్ ,
క్కోల్ కొళ్ కైత్తలత్తు ఎందై పెమ్మానిడమ్, కులవు తణ్ వరైచ్చారల్ ,
కాల్ కొళ్ కణ్ కొడిక్కైయెழ, క్కముగిళమ్ పాళైగళ్ కమழுమ్ శారల్ ,
శేల్ గళ్ పాయ్ తరు శెழுనది వయల్ పుగు, తిరువయిన్దిరపురమే ll 1156
కై తలత్తు=తమ చేతులలో;వేల్ కొళ్=శూలాయుధములుగల;అరశర్=(దుర్యోధనాదులు) మహారాజులతొ; వెమ్ పోరినిల్=తీవ్రమైన పోరాటములో;విశయనుక్కు ఆయ్= అర్జునుని కొరకు సహాయముగ; మణి తేర్ = అతని అందమైన రథముపై; కై తలత్తు కోల్ కొళ్=తన చేతులో జాటికర్రను పట్టుకొని సారధిగ ఆసీనుడైన; ఎందై పెమ్మాన్ ఇడమ్ = మా ప్రభువైన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము ( ఏదనగ ); కులవు తణ్ వరై శారల్ = కొండాడతగిన చల్లని పర్వతము యొక్క ఏటవాలుప్రదేశములందు; కాల్ కొళ్ కణ్ కొడి కై యెழ = (మద్దతు కొరకు నాటిన) రాట్ల ఆధారముగ కణుపులు కణుపులుగ పెరిగెడి తమలపాకుల తీగలు మిక్కుటముగ కలిగియున్నదియు; కముగు ఇళమ్ పాళైగళ్ కమழுమ్ శారల్=పోక చెట్లయొక్క లేత పూబాళల సువాసనలు చుట్టుపక్కల వెదజల్లబడు ప్రదేశములు కలదియు; శేల్ గళ్ పాయ్ తరు శెழுనది వయల్ పుగు = “శేల్” మీనములు సంతోషముతో గెంతులు వేయుచు ఈదుచుండెడి అందమైన నది పొలములలో ప్రవహించుచున్నట్టి; తిరువయిన్దిరపురమే = తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
తమ చేతులలో శూలాయుధములుగల దుర్యోధనాదుల మహారాజులతో తీవ్రమైన పోరాటములో అర్జునుని కొరకు సహాయముగ, అతని అందమైన రథముపై తన చేతులో జాటికర్రను పట్టుకొని సారధిగ ఆసీనుడైన మాప్రభువైన సర్వేశ్వరునియొక్క నివాసస్దానము ( ఏదనగ), కొండాడతగిన చల్లని పర్వతము యొక్క ఏటవాలు ప్రదేశములందు, మద్దతు కొరకు నాటిన రాట్ల ఆధారముగ కణుపులు కణుపులుగ పెరిగెడి తమలపాకుల తీగలు మిక్కుటముగ కలిగియున్నదియు,పోక చెట్లయొక్క లేత పూబాళల సువాసనలు చుట్టుపక్కల వెదజల్లబడు ప్రదేశములుకలదియు, “శేల్” మీనములు సంతోషముతో గెంతులువేయుచు ఈదుచుండెడి అందమైన నది పొలములలో ప్రవహించుచున్నట్టి తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశమే సుమా!
** మూవరాగియ ఒరువనై, మూవులగుణ్డు ఉమిழ்న్దు అళన్దానై ,
తేవర్ దానవర్ శెన్ఱు శెన్ఱిఱైఞ్జ, తణ్ తిరువయిన్దిరపురత్తు ,
మేవుశోదియై వేల్ వలవన్, కలికన్ఱి విరిత్తురైత్త ,
పావు తణ్ తమిழ் పత్తివై పాడిడ, ప్పావఙ్గళ్ పయిలావే ll 1157
మూవర్ ఆగియ ఒరువనై = బ్రహ్మ,విష్ణు,రుద్రులకు అంతర్యామియైన అద్వితీయుడును; మూవులగు ఉణ్డు = ముల్లోకములు (ప్రళయకాలమున) ఆరగించి; ఉమిழ்న్దు = (సృష్ఠి కాలమున) వెలిపరచిన వాడును; అళన్దానై = (వామనావతార కాలమున) త్రివిక్రముడుగ ముల్లోకములను కొలిచినవాడును;తేవర్ దానవర్ శెన్ఱు శెన్ఱు ఇఱైఞ్జ = దేవతలు, దానవులు గుంపులుగుంపులుగ వచ్చి సేవంచుకొనుటకు తగినట్లు; తణ్ తిరువయిన్దిరపురత్తు మేవు శోదియై = చల్లని తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న పరంజ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని విషయమై; వేల్ వలవన్ కలికన్ఱి=శూలాయుధమును ప్రయోగింప సమర్ధతగల తిరుమంగై ఆళ్వార్; విరిత్తు ఉరైత్త = విపులముగ అనుగ్రహించిన; పావు తణ్ తమిழ் పత్తు ఇవై పాడిడ = అపారమైన,అందమైన తమిళ భాషలోనున్న ఈ పదిపాశురములను పాడి అనుసంధించినయెడల;ప్పావఙ్గళ్ పయిలావే = పాపములు చేరలేవుగదా!.
బ్రహ్మ,విష్ణు,రుద్రులకు అంతర్యామియైన అద్వితీయుడును,ముల్లోకములు (ప్రళయకాలమున) ఆరగించి,(సృష్ఠి కాలమున) వెలిపరచినవాడును, (వామనావతార కాలమున) త్రివిక్రముడుగ ముల్లోకములను కొలిచినవాడును, దేవతలు, దానవులు గుంపులుగుంపులుగ వచ్చి సేవంచుకొనుటకు తగినట్లు,చల్లని తిరువహీన్ద్రపురమ్ దివ్యదేశములో నిత్యవాసము చేయుచున్న పరంజ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుని విషయమై,శూలాయుధమును ప్రయోగింప సమర్ధతగల తిరుమంగై ఆళ్వార్ విపులముగ అనుగ్రహించిన అపారమైన,అందమైన తమిళ భాషలోనున్న ఈ పది పాశురములను పాడి అనుసంధించినయెడల ,పాపములు చేరలేవుగదా!.
*********