శ్రీః
10.తిరుమడన్దై
అవతారిక :
అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశములో సర్వేశ్వరుడు శ్రీదేవి , భూదేవి సమేతుడై వేంచేసి , తన భక్తుల సర్వపాపములను హరించియు , వారి విరోదులను తుదముట్టించియు కృపజేయు వైఖరిని తిరుమంగై ఆళ్వారులు తన మనస్సునకు ప్రభోదించుచు , అట్టి దివ్య దేశమును ఆశ్రయించి ఉజ్జీవింపుమని ఈ పాశురములలో చెప్పుచున్నారు .
** తిరుమడన్దై మణ్ మడందై యిరుపాలుమ్ తిగழ் ,
తీవినైగళ్ పోయ్ అగల అడియవర్ గట్కు ఎన్ఱుమ్
అరుళ్ నడన్దు, ఇవ్వేழுలగత్తవర్ పణియ , వానోర్
అమర్ న్దేత్త ఇరున్దవిడమ్ ,పెరుమ్ పుకழ் వేదియర్ వాழ்
తరుమ్ ఇడఙ్గళ్ మలర్ గళ్ మిగు కైతైగళ్ శెఙ్గழுనీర్ ,
తామరైగళ్ తడఙ్గళ్ తొఱుమ్ ఇడఙ్గళ్ తొఱుమ్ తిగழ்,
అరువిడఙ్గళ్ పొழிల్ తழுవి యెழிల్ తిగழுనాంగూర్ ,
అరిమేయవిణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1238
ఇరుపాలుమ్ = ఇరుప్రక్కలను;తిరుమడన్దై = శ్రీదేవియు;మణ్ మడందై = భూదేవియు; తిగழ் = ప్రకాశించుచుండ; అడియవర్ గట్కు=ఆశ్రయించిన భక్తులయొక్క; తీవినైగళ్ పోయ్ అగల=క్రూరమైన పాప సమూహములు తొలగిపోవునటుల; ఎన్ఱుమ్ = ఎల్లప్పుడును; అరుళ్ నడన్దు = కృపజేయుచు; ఇవ్ ఏழ் ఉలగత్తవర్ = ఇచ్చటి సప్త లోకములలోనున్న వారందరుచే; పణియ = ఆశ్రయింపబడుచు; వానోర్ = నిత్యశూరులచే; అమర్ న్దేత్త = అమరి స్తుతింపబడుచు; ఇరున్దవిడమ్ = (సర్వేశ్వరుడు) కృపతో వేంచేసిన దివ్య దేశమును; పెరుమ్ పుకழ் = గొప్ప కీర్తిగల; వేదియర్ = వేదోత్తములు; వాழ்తరుమ్ = నివసించు; ఇడఙ్గళ్ = స్థానములు కలిగినదై; మలర్ గళ్ మిగు = పుష్పసమృద్ది కలిగిన;కైతైగళ్ = మొగలి పువ్వులును;శెఙ్గழுనీర్ =ఎఱ్ఱకలువులును; తామరైగళ్ = తామర పుష్పములును;తడఙ్గళ్ తొఱుమ్ =తటాకములలో; (నిండి), ఇడఙ్గళ్ తొఱుమ్ = కనిపించెడి ప్రదేశమంతటను;తిగழ் = ప్రకాశించుచు; పొழிల్ = తోటలు; అరువిడఙ్గళ్ = ఆకాశము; తழுవి=అంటియుండటచే;ఎழிల్ తిగழ் = బహు సౌందర్యముతొ ప్రకాశించుచున్నదియు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమ్ అను దివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = సేవించుకొనుమా !
శ్రీమన్నారాయణుడు శ్రీదేవి,భూదేవి సమేతుడై ఎల్లప్పుడును తన భక్తుల పాపములు నశించునట్లు కృపజేయుచు , సప్తలోకములలోనున్న వారందరిచే ఆశ్రయింపబడుతూ , నిత్యశూరులచే అమరి స్తుతింపబడుతూ , కృపతో వేంచేసిన దివ్య దేశమును, గొప్ప కీర్తిగల వేదోత్తములు నివసించునదియు , మొగలి పువ్వులును , ఎఱ్ఱ కలువలును, తామరపుష్పములును తటాకములందు నిండి ఒప్పుచున్నదియు , బాగుగ ఎదిగిన మనోహరమైన తోటలు కలదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును ఓ విధేయమైన నామనసా! సేవించుకొనుమా!.
వెన్ఱిమిగు నరకన్ ఉరమదు అழிయ విశిఱుమ్ ,
విఱలాழிత్తడక్కైయన్ విణ్ణవర్ గట్కు అన్ఱు ,
కున్ఱుకొడు కురైకడలై కడైన్దు అముదమ్ అళిక్కుమ్ ,
కురుమణి ఎన్ ఆరముదమ్ కులవి యుఱైకోయిల్ ,
ఎన్ఱుమిగు పెరుఞ్జెల్వత్తు ఎழிల్ విళఙ్గు మఱైయోర్ ,
ఏழிశైయుమ్ కేళ్విగళుమ్ ఇయన్ఱ పెరుఙ్గుణత్తోర్,
అన్ఱు ఉలగమ్ పడైత్తవనే యనైయవర్ గళ్ నాఙ్గూర్ ,
అరిమేయవిణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1239
వెన్ఱిమిగు = జయశీలుడైన;నరకన్ = నరకాసురునియొక్క; ఉరమదు = అట్టి బలమును; అழிయ= నాశనమగునట్లు; విశిఱుమ్ = అతనిపై ప్రయోగింపబడు; విఱల్ = మిక్కిలి బలము కలిగిన; ఆழி = చక్రాయుధమును; త్తడక్కైయన్ = విశాలమైన హస్తమున ధరించినవాడును; అన్ఱు = పూర్వమొకప్పుడు; విణ్ణవర్ గట్కు = ఇంద్రుడు మొదలగు దేవతలకు; కున్ఱుకొడు = మందరపర్వతముచే; కురైకడలై = ఘోషించు సముద్రమును;కడైన్దు = మధించి; అముదమ్ = అమృతమును; అళిక్కుమ్ = తీసి నొసగినవాడును; కురుమణి = శ్లాఘ్యమైన రత్నమువలె ప్రకాశించువాడును;ఎన్ ఆరముదమ్ = నాకు పరిపూర్ణమైన అమృతమువలెనున్న సర్వేశ్వరుడు; కులవి = ఆశించి; యుఱైకోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్య దేశమును; ఎన్ఱుమ్=ఎల్లప్పుడును; మిగు పెరమ్ శెల్వత్తు = వృద్ధిపొందుచున్న అంతులేని సంపదలతో; ఎழிల్ =సుందరముగ ; విళఙ్గు = ప్రకాశించుచున్న; మఱైయోర్ = వేదోత్తములు; ఏழ் ఇశైయుమ్ = సప్తస్వరములును; కేళ్విగళుమ్ = ఇతరములైన శాస్త్రములును; ఇయన్ఱ = అభ్యసించిన; పెరుమ్ గుణత్తోర్ = సకల సద్గుణ సంపన్నులు; అన్ఱు = మునుపు; ఉలగమ్ = సర్వలోకములను; పడైత్తవనే = సృష్టించిన బ్రహ్మయో; యనైయవర్ గళ్ = అనునట్లు ఒప్పు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమ్ అను దివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = సేవించుకొనుమా!
జయశీలుడైన నరకాసురునియొక్క బలమును నశించునట్లుచేయు సుదర్శన చక్రాయుధము హస్తారూఢుడైనవాడును , మందరపర్వతముచే ఘోషించు సముద్రమును చిలికితీసిన అమృతమును దేవతలకు ఒసగినవాడును ,నాకు పరిపూర్ణమైన అమృతమువలెనున్న సర్వేశ్వరుడు ఆశించి నిత్యవాసము చేయుచున్న దివ్య దేశమును , సకల శాస్త్రపారంగతులును, సద్గుణ సంపన్నులును సృష్టిగావించిన బ్రహ్మయో ! అనబడు గొప్ప కీర్తిగల వేదోత్తములతో ఒప్పుచున్నదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును ,ఓ ! విధేయమైన నామనసా! సేవించుకొనుమా!
ఉమ్బరుమ్ ఇవ్వేழுలగుమ్ ఏழ் కడలుమెల్లామ్ ,
ఉణ్డపిరాన్ అణ్డర్ గళ్ మున్ కణ్డు మగిழ்వెయ్ ద,
కుమ్బమిగు మదయానై మరుప్పొశిత్తు , కఞ్జన్
కుఞ్జి పిడిత్తు అడిత్త పిరాన్ కోయిల్ , మరుఙ్గెఙ్గుమ్
పైమ్పొనొడు వెణ్ ముత్తమ్ పల పున్నైకాట్ట ,
ప్పలఙ్గనికళ్ తేన్ కాట్ట ప్పడ అరవేర్ అల్ గుల్ ,
అమ్బనైయ కణ్ మడవార్ మగిழ் వెయ్ దు నాఙ్గూర్
అరిమేయ విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే !. 1240
ఉమ్బరుమ్ = దేవతలను;ఇవ్వేழுలగుమ్ = ఈ సప్తలోకములను; ఏழ் కడలుమ్ = సప్తసముద్రములను; ఎల్లామ్ = వీటినన్నింటిని; ఉణ్డ = (ప్రళయకాలమున) తన ఉదరముననుంచుకొని రక్షించిన; పిరాన్ = ఉపకారుడును;అణ్డర్ గళ్= గోపాలకుల;మున్=ముందు; కణ్డు=చూచి;మగిழ்వెయ్ ద=సంతోషించునట్లు; కుమ్బమిగు = పెద్ద కుంబస్థలముగల; మదయానై = మత్తగజమైన కువలయాపీడము యొక్క; మరుప్పొశిత్తు = దంతములను విరిచి;(పిదప) కఞ్జన్ = కంసునియొక్క; కుఞ్జి పిడిత్తు అడిత్త = జుట్టును పట్టుకొని ఈడ్చి కొట్టి సంహరించిన; పిరాన్ కోయిల్ = ఉపకారకుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును; మరుఙ్గు ఎఙ్గుమ్= చుట్టుప్రక్కలంతటను; పల పున్నై = అనేకమైన పొన్న చెట్లు; (మొగ్గలతోను, పుష్పములతోనునిండి) , పైమ్ పొనొడు వెణ్ ముత్తమ్ కాట్ట =అందమైన బంగారమును, తెల్లనిముత్యములను ప్రకాశింపజేయుచున్నదియు; పలఙ్గనికళ్ = పనసపండ్లు; తేన్ కాట్ట = తేనెలు కారునట్లు ఒప్పుచున్నదియు; పడమ్ అరవ ఏర్ అల్ గుల్ =పడగెత్తిన సర్పము పోలిన కటి ప్రదేశమును; అమ్బనైయ కణ్ = అమ్బులు పోలిన కన్నులుగల; మడవార్ = స్త్రీలు; మగిழ்వు = సంతోషముతో; ఎழ்దుమ్ = నివసించుచుండు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమ్ అను దివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = సేవించుకొనుమా !
ప్రళయకాలమున సర్వలోకములను తన ఉదరమున నుంచుకొని రక్షణ కల్పించినవాడును , మత్తగజమైన కువలయాపీడమును తుదముట్టించిన వాడును , క్రూరడైన కంసుని సంహరించిన వాడును, అయిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును , మొగ్గలతో, పుష్పములతోనున్న పెక్కు పొన్నచెట్లు బంగారము, తెల్లని ముత్యముల కాంతితో ప్రకాశించుచున్నదియు, తేనెలొలుకు పనసపండ్లు ఉన్నవియు , సౌందర్యమైన స్త్రీలు అమితసంతోషముతో నివసించుచుండునదియును , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును విధేయమైన నామనసా! సేవించుకొనుమా! .
ఓడాద వాళరియిన్ ఉరువమదుకొణ్డు ,
అన్ఱు ఉలప్పిల్ మిగు పెరు వరత్త ఇరణియనైపర్ట్రి ,
వాడాద వళ్ ఉగిరాల్ పిళన్దు అవన్ తన్ మగనుక్కు ,
అరుళ్ శెయ్ దాన్ వాழுమిడమ్ , మల్లిగై శెఙ్గழுనీర్,
శేడేఱు మలర్ శెరున్ది శెழுఙ్గముగమ్ పాళై ,
శెణ్బగఙ్గళ్ మణనాఱుమ్ వణ్ పొழிలినూడే,
ఆడేఱు వయల్ ఆలై పుగై కమழு నాఙ్గూర్
అరిమేయ విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1241
అన్ఱు = పూర్వము ఒకప్పుడు;ఓడాద = యుద్దమందు వెనుతిరగని; ఆళ్ అరియన్ ఉరువమదుకొణ్డు = నరసంహరూపమును దాల్చి;ఉలప్పిల్ మిగు=అంతములేని మిక్కిలి; పెరు వరత్త=పెద్ద వరములు బడసిన; ఇరణియనై పర్ట్రి = హిరణ్యాసురుని పట్టుకొని; వాడాద వళ్ = వంగని తీక్షణమైన; ఉగిరాల్ = నఖములచే; పిళన్దు = వక్షస్థలము చీల్చి చంపి; అవన్ తన్ = అతనియొక్క; మగనుక్కు = కుమారుడైన ప్రహ్లాదునకు; అరుళ్ శెయ్ దాన్ = కృపజేసిన సర్వేశ్వరుడు;వాழுమిడమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశమును;మల్లిగై = మల్లి పువ్వులతోను; శెఙ్గழுనీర్ = ఎఱ్ఱకలువలతోను; శేడు ఏఱు మలర్ = గుత్తు గుత్తులుగ పుష్పంచు; శెరున్ది = శెరున్ది పుష్పములతోను; శెழு కముగమ్ పాళై = అందమైన పోకచెట్ల పూబాళలతోను; శెణ్బగఙ్గళ్ = సంపంగి పుష్పములతోను; మణమ్ = పరిమళము; నాఱుమ్ = వ్యాపింపబడు; వణ్ పొழிలినూడే = సుందరమైన తోటలనడుమ; ఆడేఱు వయల్ ఆలై పుగై కమழு = పొలములలో చెరకులను ఆడెడి మిల్లుల నుండి వచ్చెడి పొగలవాసనతొ ఒప్పుచున్నదియు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములోనున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమ్ అను దివ్యదేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = సేవించుకొనుమా!
అనేక ఘోరమైన తపస్సులను చేసి వరములుబడసిన హిరణ్యాసురుని వధించుటకై , నరసంహరూపమునుదాల్చి , అతని వక్షస్థలమును నఖములచే చీల్చి , అతని కుమారుడైన ప్రహ్లాదునకు కృపజేసిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్య దేశమును, మల్లి పువ్వులతోను , ఎఱ్ఱ కలువలతోను , గుత్తుగుత్తులుగ పుష్పంచు శెరున్ది పుష్పములతోను ,అందమైన పోకచెట్ల పూబాళలతోను పరిమళము వ్యాపింపబడు తోటలనడుమ , పొలములలో చెరకులను ఆడెడి మిల్లుల నుండి వచ్చెడి పొగల పరిమళముచే ఒప్పుచున్నదియును నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును విధేయమైన నామనసా! సేవించుకొనుమా! .
కణ్డవర్ తమ్ మనమ్ మగిழ మావలితన్ వేళ్వి ,
కళవిన్ మిగు శిఱుకుఱళాయ్ మూవడియెన్ఱిరన్దిట్టు ,
అణ్డముమ్ ఇవ్వలై కడలుమ్ అవనిగళు మెల్లామ్,
అళన్దపిరాన్ అమరుమిడమ్ వళఙ్గొళ్ పొழிల్ అయలే ,
అణ్డముఱు ముழవొలియుమ్ వణ్డినఙ్గల్ ఒలియుమ్ ,
అరుమఱైయి నొలియుమ్ మడవార్ శిలమ్బినొలియుమ్ ,
అణ్డముఱుమ్ అలైకడలి నొలి తిగழ் నాఙ్గూర్,
అరిమేయవిణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1242
కణ్డవర్ తమ్ = చూచువారందరి;మనమ్ = మనస్సులు; మగిழ = ఆనందము పొందునట్లు; మావలితన్ వేళ్వి = మహాబలి యాగ భూమియందు; కళవిన్ మిగు = మిక్కిలి వంచనచే; శిఱుకుఱళాయ్ = సుందర వామన రూపమునుదాల్చి; మూవడియెన్ఱు ఇరన్దిట్టు = “తన మూడడుగులచే కొలవగలభూమి ఇవ్వు” యని యాచించి; అణ్డముమ్ = పై లోకములను; ఇవ్వలై కడలుమ్ = ఈ అలలు కొట్టుచున్న సముద్రములతో కూడ; అవనిగళుమ్= భూమండలమును; ఎల్లామ్ = ఇతరములనంతయును; అళన్ద = కొలిచిన; పిరాన్ = ఉపకారకుడైన; అమరుమ్ ఇడమ్ =అమరి వేంచేసిన దివ్య దేశమును; వళఙ్గొళ్ = అందమైన; పొழிల్అయలే =తోటల సమీపమందు;అణ్డమ్ ఉఱు = ఆకాశపర్యంతము వ్యాపింపబడు; ముழுవొలియుమ్ = సంగీత వాద్యము ధ్వనులతోను;వణ్డు ఇనఙ్గల్ = తుమ్మెదల సమూహముల; ఒలియుమ్ = ఝంకారములతోను;అఱు మఱైయిన్ = దుర్లభమైన వేదముల; ఒలియుమ్ = పఠన ఘోషలతోను; మడవార్ = స్త్రీలయొక్క;శిలమ్బిన్ = అందెల; ఒలియుమ్ = శబ్దములతోను; అణ్డమ్ = ఆకాశ పర్యంతము; ఉఱుమ్ = వ్యాపింపబడుచున్న; అలై కడలిన్ ఒలి = అలలు కొట్టుచున్న సముద్ర ఘోషలతోను; తిగழுమ్ = ప్రకాశించుచున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమ్ అను దివ్యదేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = సేవించుకొనుమా ! .
చూచువారల కనులకింపుగ మహాబలి యాగభూమియందు సుందర వామన రూపమును దాల్చి, తన మూడడుగులచే కొలవగల నేలను యాచించి, రెండడుగులచే సర్వలోకములను కొలిచి, మూడవ అడుగును, తన దివ్య పాదమును మహాబలి శిరస్సుపై మోపినఉపకారకుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, సుందరమైన తోటలతోను ,సంగీత వాద్యముల ధ్వనులతోను , తుమ్మెదల సమూహముల ఝంకారములతోను, వేదముల ఘోషలతోను, సముద్ర ఘోషలతోను ,ప్రకాశించుచున్న నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును విధేయమైన నామనసా! సేవించుకొనుమా! .
వాళ్ నెడుమ్ కణ్ మలర్ కూన్దల్ మైదలిక్కా , ఇలఙ్గై
మన్నన్ ముడియొరుపదుమ్ తోళిరుపదుమ్ పోయ్ ఉదిర,
తాళ్ నెడుమ్ తిణ్ శిలైవళైత్త తయరదన్ శేయ్ , ఎన్ఱన్
తని చ్చరణ్ వానవర్కరశు కరుదుమిడమ్ తడమార్ ,
శేణిడఙ్గొళ్ మలర్కమలమ్ శేల్ కయల్ గళ్ వాళై,
శెన్నెలొడుమ్ అడుత్తు అరియ ఉదిర్ న్ద శెழுముత్తమ్ ,
వాళ్ నెడుఙ్గణ్ కడైశియర్ గళ్ వారుమ్ అణి నాఙ్గూర్,
అరిమేయవిణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే 1243
వాళ్ నెడుమ్ కణ్ = కత్తి వలె వాడియైన విశాలమైన కనులును; మలర్ కూన్దల్ = పూలతొ అలంకృతమైన కుంతలములుగల; మైదలిక్కా = వైదేహిదేవి కొఱకై; ఇలఙ్గై = లంకాపురికి; మన్నన్ = రాజైన రావణాసురుని; ముడియొరుపదుమ్ = పదితలలను; తోళిరుపదుమ్ = ఇరవై భుజములను; పోయ్ ఉదిర = ఛిన్నభిన్నమగునట్లు; తాళ్ = వింటితొకూడిన; నెడుమ్ = పొడుగైన;తిణ్=ధృడమైన; శిలైవళైత్త = ధనస్సు వంచిన; తయరదన్ శేయ్ = దశరధుని పుత్రుడును;ఎన్ తన్ = నాయొక్క;తని శరణ్ =అద్వితీయమైన రక్షకుడును;వానవర్కు అరశు=నిత్యశూరులకు నాధుడగు సర్వేశ్వరుడు; కరుదుమిడమ్ = అభిలషించి నిత్యవాసము చేయుచున్న దివ్య దేశమును; తడమ్ ఆర్ = కొలనులచే నిండి యుండినదియు; శేణ్ ఇడఙ్గొళ్ = ఆకాశపర్యంతము ఎదిగిన; కమలమ్ మలర్ = తామర పుష్పములను; శేల్ కయల్ గళ్ వాళై = శేల్, కయల్, వాళై అను మత్స్యములను; శెన్నెలొడమ్ అడుత్తు అరియ= ఎఱ్ఱ ధాన్యపు పంటలును కోసి, నూర్చి,తూర్పార పట్టునపుడు;ఉదిర్ న్ద =రాలిన; శెழுముత్తమ్ = అందమైన ముత్యములను; వాళ్ = కత్తివలె వాడియైన; నెడుమ్ = విశాలమైన; కణ్ = నేత్రములుగల; కడైశియర్ గళ్ = రైతాంగనలచే; వారుమ్ = పోగుచేయబడు చున్నదియు; నాఙ్గూర్ = నాఙ్గూర్ప్రాంతములో నున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = సేవించుకొనుమా! .
సీతాదేవి కొఱకై , లంకాపురికి రాజైన రావణాసురునియొక్క పదితలలను తనయొక్కప్రఖ్యాతమైన కోదండవిల్లును ఎక్కుపెట్టి నిప్పులుగ్రక్కు అద్వితీయమైన భాణములచే త్రుంచి వధించిన దశరధుని పుత్రుడును ,నాయొక్క అద్వితీయమైన రక్షకుడును , నిత్యశూరులకు నాధుడును ,అయిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును , కొలనులచే నిండియుండినదియు , ఎఱ్ఱ ధాన్యపు పంటలును కోసి, నూర్చి, తూర్పారపట్టునపుడురాలిన ముత్యములను , తామర పుష్పములను ,శేల్ , కయల్ ,వాళై అనబడు మత్స్యములను, రైతాంగనలచే పోగు చేయబడుచున్నదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును విధేయమైన నామనసా! సేవించుకొనుమా! .
తీమనత్తాన్ కఞ్జనదు వఞ్జనైయిల్ తిరియుమ్ ,
ధేనుగనుమ్ పూతనై తన్ అర్ ఉయిరుమ్ శెగుత్తాన్ ,
కామనైత్తాన్ పయన్ద కరుమేనియుడై యమ్మాన్ ,
కరుదుమిడమ్ పొరుదుపునల్ తుఱైతుఱై ముత్తు ఉన్ది ,
నా మనత్తాల్ మన్దిరఙ్గళ్ నాల్ వేదమ్ , ఐన్దు
వేళ్వియొడు ఆఱఙ్గమ్ నవిన్ఱు కలై పయిన్ఱు , అఙ్
గామనత్తు మఱైయవర్ గళ్ పయిలుమణి నాఙ్గూర్,
అరిమేయవిణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1244
తీ మనత్తాన్ = క్రూరమనస్కుడైన;కఞ్జనదు = కంసునిచే ప్రేరేరింపబడి; వఞ్జనైయిల్ = కపటరూపములు దాల్చి; తిరియుమ్ = తిరుగుచున్న;ధేనుగనుమ్ = ధేనుకాసురుని యొక్కయు; పూతనై తన్ = పూతన యొక్కయు; అర్ ఉయిరుమ్ = మంచి ప్రాణమును; శెగుత్తాన్ = అంతమొందించిన వాడును; కామనైత్తాన్ = మన్మధుని;పయన్ద = పుత్రునిగ కలవాడును; కరుమేనియుడై = నల్లని విగ్రహ స్వరూపము కలవాడును; అమ్మాన్ = సర్వేశ్వరుడు; కరుదుమ్ ఇడమ్ =అభిలషించి నిత్యవాసము చేయుచున్న దివ్య దేశమును; పొరుదుపునల్ = అలలుకొట్టు జలములచే; తుఱైతుఱై = ప్రతి రేవుల వద్దను; ముత్తు = ముత్యములు; ఉన్ది = త్రోయబడుచుండునదియు; నా = నాలుక చేతను;మనత్తాల్ = మనస్సుచేతను; మన్దిరఙ్గళ్ = భగవంతుని మంత్రములను; నాల్ వేదమ్ = నాల్గు వేదములును; ఆఱు అంగమ్ = ఆరు అంగములును; నవిన్ఱు = అభ్యసించి; కలై = మిగిలిన శాస్త్రములును; పయిన్ఱు = నేర్చుకొని; ఐన్దు వేళ్వియొడు = పంచమహా యఙ్ఞముల తోడను కూడి; అఙ్గు ఆమ్ మనత్తు = నిర్మలమైన మనస్కులై ఆ భగవంతునియందే లీనమై యుండెడి; మఱైయవర్ గళ్ = వేదబ్రాహ్మణోత్తములు; పయిలుమ్ = నిత్యవాసము చేయుచుండునదియు; అణి = సుందరమైనదియు;నాఙ్గూర్ =నాఙ్గూర్ ప్రాంతములో నున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమ్ అనుదివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = సేవించుకొనుమా!
క్రూరమైన కంసునిచే ప్రేరేరింపబడి కపటరూపములతో వచ్చిన ధేనుకాసురునియు , పూతనను వధించినవాడును , మన్మధుని తండ్రియును, నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, జలముల అలలచే రేవుల వద్ద ముత్యములు చేరబడుచుండునదియు , నాల్గు వేదములును ఆరుఅంగములును , సకల శాస్త్రములును అభ్యసించి నిర్మలమైన మనస్కులై భగవంతునియందే లీనమైయుండెడి వేదబ్రాహ్మణోత్తములు నిత్యవాసము చేయుచుండునదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును విధేయమైన నామనసా! సేవించుకొనుమా! .
కన్ఱదనాల్ విళవెఱిన్దు కనియుదిర్ త్త కాళై ,
కామరు శీర్ ముగిల్ వణ్ణన్ కాలిగల్ మున్ కాప్పాన్ ,
కున్ఱదనాల్ మழைతడత్తు క్కుడమాడు కూత్తన్ ,
కులవుమిడమ్ కొడి మదిళ్ గళ్ మాళిగై గోపురఙ్గళ్ ,
తున్ఱు మణి మణ్డపఙ్గళ్ శాలైగళ్ , తూ మఱైయోర్
తొక్కు ఈణ్డి తొழுదియొడు మిగ ప్పయిలుమ్ శోలై ,
అన్ఱు అలర్ వాయ్ మదువుణ్డు అఙ్గు అళి మురలు నాఙ్గూర్,
అరిమేయవిణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1245
కన్ఱు అదనాల్ = దూడరూపములోనున్న వత్సాసురుని పట్టుకొని; విళవు ఎఱిన్దు = వెలగచెట్టుపైనున్న కపిత్థాసురునిపై విసిరి; కని ఉదిర్ త్త = ఆ వెలగపండును క్రిందపడునట్లు చేసి ఆఇరువురుని చంపిన వాడును; కాళై = నిత్యయౌవనుడును;కామరు శీర్ = ఆశపడతగిన కళ్యాణ గుణములు కలవాడును; ముగిల్ వణ్ణన్ = కాళమేఘమువంటి రూపము కలవాడును; మున్ = పూర్వము ఒకప్పుడు; కాలిగల్ = పశువులను; కాప్పాన్ = రక్షించుట కొఱకై; కున్ఱు అదనాల్ = గోవర్ధన పర్వతముచే; మழை = (ఇంద్రునిచే కురుపించిన) భయంకరమైన వర్షమును;తడత్తు = అడ్డగించినవాడును; క్కుడమాడు కూత్తన్ =కుంభనృత్యము చేయునట్టి సర్వేశ్వరుడు; కులవుమ్ఇడమ్ = సంతోషముతో నిత్యవాసము చేయుచున్న దివ్య దేశమును; కొడి మదిళ్ గళ్ = ధ్వజములుగల ప్రాకరములతోను; మాళిగై = భవనములతోను; గోపురఙ్గళ్ = గోపురములతోను; తున్ఱు మణి = దట్టముగ మణులతో ప్రకాశించు; మణ్డపఙ్గళ్ = మణ్డపములతోను; శాలైగళ్ = ధర్మశాలలతోను; తూ మఱైయోర్ = పరమపవిత్రులైన బ్రాహ్మణులు; తొక్కుఈణ్డి = సమూహములగ చేరి; తొழுదియొడు = స్తుతించు పెద్ద ధ్వనులతోను; మిగ పయిలుమ్ = మిక్కిలి కూడియున్న;శోలై = తోటలలో; అన్ఱు అలర్ వాయ్ = అప్పుడె వికసించిన అందమైన పుష్పములలోగల; మదు ఉణ్డు = తేనెలను త్రాగి; అఙ్గు = అచ్చోటనే; అళి మురలుమ్ = తుమ్మెదల ఝంకారములుచేయుచుండెడి; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములోనున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమ్ అనుదివ్య దేశమును;మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = సేవించుకొనుమా!
దూడరూపములోనున్న వత్సాసురుని పట్టుకొని వెలగచెట్టుపై వెలగపండు రూపములోనున్న కపిత్థాసురుడను రాక్షసునిపై విసిరి ఇరువురుని వధించినవాడును, మిక్కిలి క్రోధుడై ఇంద్రుడు ఏడు రోజులు ఎడతెగక భయంకరమైన వర్షమును కురుపించగ గోవర్ధనపర్వతముచే గోవులను గోకులవాసులను సంరక్షించిన వాడును , కుంభనృత్యము చేయునట్టి సర్వేశ్వరుడు అభిలషించి నిత్యవాసము చేయుచున్న దివ్య దేశమును, ధ్వజములుగల ప్రాకరములతోను , భవనములతోను, గోపురములతోను ,మణులతో ప్రకాశించు మణ్డపములతోను ,పరమపవిత్రులైన భ్రాహ్మణసమూహములు స్తుతించు పెద్ద ధ్వనులతోను ,తోటలలో అప్పుడె వికసించిన అందమైన పుష్పములలోగల తేనెలను త్రాగి తుమ్మెదలచే ఝంకారముచేయబడు చున్నదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును విధేయమైన నామనసా! సేవించుకొనుమా!
వఞ్జనైయాల్ వన్దవళ్ తన్ ఉయిరుణ్డు వాయ్ త్త
తయిరుణ్డు , వెణ్ణై యముదుణ్డు , వలిమిక్క
కఞ్జనుయిరదువుణ్డు ఇవ్వులగుణ్డ కాళై ,
కరుదుమిడమ్ కావిరి శన్దు అగిల్ కనకమ్ ఉన్ది ,
మఞ్జులవు పొழிలూడుమ్ వయలూడుమ్ వన్దు
వళమ్ కొడుప్ప , మామఱైయోర్ మామలర్ గళ్ తూవి,
అఞ్జలిత్తు అఙ్గు అరి శరణెన్ఱు ఇఱైఞ్జుమ్ అణి నాఙ్గూర్ ,
అరిమేయవిణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1246
వఞ్జనైయాల్ = కపట వేషముతో;వన్దవళ్ తన్ = వచ్చిన రక్కసి పూతనయొక్క;ఉయిరుణ్డు = ప్రాణమును పీల్చినవాడును; వాయ్ త్త = చేతిలో దొరికించుకొన్న;తయిరుణ్డు = పెరుగును త్రాగినవాడును; వెణ్ణైయముదుణ్డు = వెణ్ణను ఆరగించిన వాడును; వలిమిక్క కఞ్జన్ = బలశాలియైన కంసుని;ఉయిరదువుణ్డు = ప్రాణమును హరించిన వాడును; ఇవ్వులగుణ్డ = ఈ జగత్తును మ్రింగిన వాడును; కాళై = నిత్యయౌవనుడైనట్టి సర్వేశ్వరుడు; కరుదుమ్ ఇడమ్ = అభిలషించి నిత్యవాసము చేయుచున్న దివ్య దేశమును; కావిరి = కావేరి నదిచే ;శన్దు = చందనపు చెట్లును; అగిల్ = అగరు చెట్లును; కనకమ్ = స్వర్ణములును; ఉన్ది = కొట్టుకొనివచ్చి ;మఞ్జులవు = మేఘమండల పర్యంతము ఎదిగిన; పొழிలూడుమ్ = తోటలలోను; వయలూడుమ్ = పొలములలోను;వన్దు = ప్రవేశించి;వళమ్ కొడుప్ప = సంపదలు చేకూర్చుచున్నదియు; మామఱైయోర్ = గొప్పవేదబ్రాహ్మణులు; మామలర్ గళ్ = శ్లాఘ్యమైన పుష్పములను; తూవి = సమర్పించి; అఞ్జలిత్తు = అంజలిచేసి; అఙ్గు= అచట; అరి శరణెన్ఱు = ” హరీ! నీపాద పద్మములే మాకు శరణ్యము”అని పలుకుచు;ఇఱైఞ్జుమ్ = మ్రొక్కబడు చుండునదియు; అణి = సుందరమైనదియు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములోనున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమ్ అనుదివ్య దేశమును;మడనెఞ్జే విధేయమైన నామనసా!;వణఙ్గు = సేవించుకొనుమా!
యశోదాదేవి రూపమునుదాల్చి వచ్చిన పూతన రక్కసి యొక్క విషము రాసుకొన్న స్తనములందు పాలతోబాటు ప్రాణమును పీల్చినవాడును , గోకులమందు గోపస్త్రీల ఇండ్లయందు దొంగతనముగ ప్రవేశించి పెరుగు, వెణ్ణను ఆరగించినవాడును, క్రూరుడైన కంసుని సంహరించిన వాడును,ఈ జగత్తును మ్రింగిన వాడును నిత్యయౌవనుడైనట్టి సర్వేశ్వరుడు సంతోషముతో నిత్యవాసము చేయుచున్న దివ్య దేశమును, కావేరి నది ప్రవాహముతొ చందనపు చెట్లు ,అగరు చెట్లు , స్వర్ణములు కొట్టుకొనివచ్చి తోటలలోను పొలములలోను ప్రవేశించి సిరిసంపదలు చేకూర్చు బడుచున్నదియు ,గొప్ప వేద భ్రాహ్మణులు శ్లాఘ్యమైన పుష్పములను సమర్పించి అంజలిచేసి ” హరీ! నీపాదపద్మములే మాకుశరణ్యము ” అని పలుకుచు మ్రొక్కబడు చుండునదియు ,సుందరమైనదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశమును విధేయమైన నామనసా! సేవించుకొనుమా! .
** శెన్ఱు శినవిడైయేழுమ్ పడ అడర్తు , పిన్నై
శెవ్విత్తోళ్ పుణర్న్దుగన్ద తిరుమాల్ తన్ కోయిల్,
అన్ఱు అయనుమ్ అరన్ శేయుమ్ అనైయవర్ గళ్ నాఙ్గూర్,
అరిమేయవిణ్ణగరమమర్ న్ద శెழுఙ్గున్ఱై ,
కన్ఱి నెడు వేల్ వలవన్ మంగైయర్ తమ్ కోమాన్ ,
కలికన్ఱి యొలిమాలై యైన్దినొడు మూన్ఱుమ్ ,
ఒన్ఱినొడుమ్ ఒన్ఱుమివై కర్ట్రువల్లార్ , ఉలగత్తు
ఉత్తమర్ గట్కుత్తమరాయ్ ఉమ్బరమ్ ఆవర్ గళే!. 1247
శెన్ఱు = స్వయముగ వెడలి; శిన =మిక్కిలి రౌద్రముతోనున్న; ఇడైయేழுమ్ = ఏడు వృషభములతొ; పడ అడర్తు = పోరుసలిపి సంహరించి; పిన్నై = నప్పిన్నైపిరాట్టియొక్క; శెవ్విత్తోళ్ = అందమైన భుజములతొ; పుణర్ న్దు = సంశ్లేషించి; ఉగన్ద = ఆనందించిన; తిరుమాల్ తన్ కోయిల్ = లక్ష్మీనాధుని యొక్క సన్నిధియే; అన్ఱు = కాకుండా;అయనుమ్ = బ్రహ్మయును; అరన్ శేయుమ్ = రుద్రుని పుత్రుడగు సుభ్రమణ్యుడును; అనైయవర్ గళ్ = పోలినవారలు నివసించు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; అరిమేయవిణ్ణగరమ్ = అరిమేయవిణ్ణగరమను దివ్య దేశములో; అమర్ న్ద = అమరి వేంచేసిన; శెழுమ్ కున్ఱై= అందమైన పర్వతముపోలిన సర్వేశ్వరుని విషయమై; కన్ఱి నెడు వేల్ = రక్తమరకలతో నిండిన పొడుగైన బల్లెమును;వలవన్ = హస్తమున కలవాడును; మంగైయర్ తమ్ = తిరుమంగై దేశవాసులకు; కోమాన్ = ప్రభువును అయిన; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వారులు కృపతో నుడివిన ; ఒలి మాలై=సూక్తుల మాలగనున్న;ఐన్దినొడు మూన్ఱుమ్ ఒన్ఱినొడుమ్ ఒన్ఱుమివై= ఈ పది పాసురములను; కర్ట్రువల్లార్ = అధ్యయనము చేసినవారు; ఉలగత్తు = ఈ లోకములో; ఉత్తమర్ గట్కు ఉత్తమరాయ్ =ఉత్తములలో మిక్కిలి ఉత్క్రుష్టులై నివసించి; ఉమ్బరమ్ ఆవర్ గళే = నిత్యశూరులతొ చేరుదురు.
బలిష్టమైన ఏడు వృషభములతొ పోరుసలిపి సంహరించి, నప్పిన్నైపిరాట్టియొక్క అందమైన భుజములతొ సంశ్లేషించినవాడును , బ్రహ్మ ,సుభ్రమణ్యుడు వారలతొ పోలిన మహనీయులు నివసించుచుండునదియును నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన అరిమేయవిణ్ణగరమ్ దివ్య దేశములో కృపతో వేంచేసిన సర్వేశ్వరుని విషయమై తిరుమంగైదేశవాసులకు నిర్వాహుకులైన తిరుమంగై ఆళ్వారులు కృపతో వెలిబుచ్చిన సూక్తుల మాలగనున్న ఈ పది పాసురములను అధ్యయనము చేసినవారు ఈ లోకములో సర్వోత్క్రుష్టులై నివసించిన తదుపరి పరమపదమందలి నిత్యశూరులతో చేరుదురు.
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
*******