పెరియ తిరుమొழி-3వపత్తు (2)

శ్రీః

2. ఊన్ వాడ

    తిరుచిత్రకూటమను దివ్య దేశములో కృపతో వేంచేసియున్న శ్రీగోవిందరాజన్ పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.  

** ఊన్ వాడ వుణ్ణాదు ఉయిర్ కావలిట్టు, ఉడలిల్ పిరియా ప్పులనైన్దుమ్ నొన్దు,

తామ్ వాడవాడ త్తవమ్ శెయ్యవేణ్డా, తమదా ఇమైయోరులగు ఆళక్కిఱ్పీర్ ,

కాన్ ఆడ మఞ్ఞైక్కణమాడ మాడే, కయలాడు కానీర్ పழనమ్ పుడైపోయ్ ,

తేన్ ఆడ మాడక్కొడి ఆడు, తిల్లై త్తిరుచ్చిత్తరకూడమ్ శెన్ఱు శేర్మిన్గళే ll 1158

ఇమైయోర్ ఉలగు తమదు ఆ  ఆళ కిఱ్పీర్ = పరమపదము తమ స్వాధీనమై పాలింప కోరికగలవారు; ఊన్ వాడ=కండలతో మాంసభరితమైన శరీరము వాడునట్లు;ఉణ్ణాదు= భుజింపక ఉపవాసములు చేయుచు; ఉయిర్ కావలిట్టు = ప్రాణము పోకుండ(నీటితోను, గాలితోను,శాకములతోను) కాపాడుకొనుచు; ఉడలిల్ పిరియా ప్పులన్ ఐన్దుమ్ నొన్దు = శరీరమును విడిచిపెట్టని ఐదు ఇంద్రియములను చిత్రహింస చేసుకొనుచు; తామ్ వాడవాడ తవమ్ శెయ్య వేణ్డా = తమ్ము మిక్కిలి కృశింపజేసుకొనుచు తపస్సు చేయ అవశ్యకతలేదు సుమా!; కాన్ ఆడ=తోటలు ఇటు అటు ఊగునట్లు;మఞ్ఞైకణమ్ ఆడ=నెమలి సమూహములు నృత్యము చేయుచున్నదియు; మాడే = సమీపమందు; కయల్ ఆడు = కయల్ మీనములు గెంతులువేయు;నీర్=నీటి ప్రవాహముగల,కాల్ = కాలువలు కలిగినదియు;పழనమ్ పుడై పోయ్=జలాశయముల చేరువకు వెడలి; తేన్= తుమ్మెదలు; ఆడ = (మధువును  గ్రోలి) సంచరించుచున్నదియు; మాడమ్ కొడి ఆడు = భవనములపై ధ్వజములు రెప రెపలాడు; తిల్లై తిరుచిత్తరకూడమ్ శెన్ఱు = తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి; శేర్మిన్గళే = ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

పరమపదము తమ స్వాధీనమై పాలింప కోరికగలవారు కండలతో మాంసభరితమైన శరీరము వాడునట్లు భుజింపక ఉపవాసములు చేయుచు,ప్రాణము పోకుండ నీటితోను,గాలితోను, శాకములతోను  కాపాడుకొనుచు, తమ ఐదు ఇంద్రియములను చిత్రహింస చేసుకొనుచు,తమ్ము మిక్కిలి కృశింప జేసుకొనుచు, తపస్సు చేయ అవశ్యకతలేదు సుమా!,తోటలు ఇటు అటు ఊగునట్లు నెమలి  సమూహములు నృత్యము చేయుచున్నదియు, సమీపమందు కయల్ మీనములు గెంతులువేయు నీటి ప్రవాహముగల కాలువలు కలిగినదియు,జలాశయముల చేరువకు వెడలి తుమ్మెదలు మధువును  గ్రోలి సంచరించుచున్నదియు, భవనములపై ధ్వజములు రెప రెపలాడు తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి,ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

కాయోడు నీడుకనియుణ్డు, వీశు కడుఙ్గాల్ నుగర్ న్దు నెడుఙ్గాలమ్, ఐన్దు

తీయోడు నిన్ఱు త్తవమ్ శెయ్యవేణ్డా, తిరుమార్వనై చ్చిన్దెయుళ్ వైత్తుమెన్బీర్ ,

వాయోదు వేదమ్ మలికిన్ఱ తొల్ శీర్, మఱైయాళర్ నాళుమ్ ముఱైయాల్ వళర్త,

తీయోఙ్గవోఙ్గ పుగழோఙ్గు, తిల్లైత్తిరుచ్చిత్తరకూడమ్ శెన్ఱు శేర్మిన్గళే ll 1159

తిరుమార్వనై=శ్రీమహాలక్ష్మి తన వక్షస్థలమునగల సర్వేశ్వరుని;శిన్దెయుళ్ వైత్తుమ్ ఎన్బీర్ = తమ హృదయమందు నిలపుకొనవలెనని కోరికగల భక్తులారా!;కాయోడు నీడు కని ఉణ్డు = కాయలు, చాలకాలమునుండి ఎండిన ఫలములు భుజించుచు; వీశు కడుమ్ కాల్ నుగర్ న్దు = వీచెడి  వేడిగాలిని అనుభవించుచు; నెడుమ్ కాలమ్ ఐన్దు తీయోడు నిన్ఱు = చాలకాలము పంచాగ్నుల మధ్య స్థితులై; తవమ్ శెయ్య వేణ్డా = తపస్సు చేయ అవశ్యకతలేదు సుమా!; వాయ్ ఓదు వేదమ్ మల్ కిన్ఱ = నోటితో పారాయణచేయుచు వచ్చుచుండెడి వేదములలో ఏవిధమైన కొరతలేకయున్న; తొల్ శీర్ మఱైయాళర్ = సహజ సద్గుణసంపన్నులైన బ్రాహ్మణోత్తములు; నాళుమ్ మఱైయాల్ వళర్త = ప్రతిదినము క్రమబద్ధముగ అనుష్ఠించిన; తీ ఓఙ్గ ఓఙ్గ = అగ్ని సంబంధిత కార్యములు అమితముగ అభివృద్ధిచెందుటచే; పుగழ் ఓఙ్గు = మిక్కిలి  ప్రఖ్యాతిచెందిన; తిల్లై తిరుచిత్తరకూడమ్ శెన్ఱు = తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి; శేర్మిన్గళే = ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

            శ్రీమహాలక్ష్మి తన వక్షస్థలమునగల సర్వేశ్వరుని తమ హృదయమందు నిలపుకొనవలెనని కోరికగల భక్తులారా!, కాయలు మరియు చాలకాలమునుండి ఎండిన ఫలములు  భుజించుచు,వీచెడి  వేడిగాలిని అనుభవించుచు, చాలకాలము పంచాగ్నుల మధ్య స్థితులై తపస్సు చేయ అవశ్యకతలేదు సుమా!,పారాయణ చేయుచు వచ్చుచుండెడి వేదములలో ఏవిధమైన కొరతలేకయున్న సహజ సద్గుణ సంపన్నులైన బ్రాహ్మణోత్తములు ప్రతిదినము క్రమబద్ధముగ అనుష్ఠించిన అగ్ని సంబంధిత కార్యములు అమితముగ అభివృద్ధిచెందుటచే మిక్కిలి  ప్రఖ్యాతిచెందిన తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి, ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

వెమ్బుమ్ శినత్తు పునక్కేழలోన్ఱాయ్, విరినీర్ ముతువెళ్ళ ముళ్ పుక్కழுన్ద,

వమ్బుణ్ పొழிల్ శూழ் ఉలగన్ఱెడుత్తాన్, అడిప్పోతణైవాన్విరుప్పోడిరుప్పీర్,

పైమ్బొన్ను ముత్తు మ్మణియుమ్ కొణర్ న్దు, పడై మన్నవన్ ప్పల్లవర్కోన్ పణిన్ద,

శెమ్బొన్ మణిమాడఙ్గళ్ శూழ் న్ద, తిల్లై త్తిరుచ్చిత్తరకూడమ్ శెన్ఱు శేర్మిన్గళే ll 1160

వమ్బు ఉణ్ పొழிల్ శూழ் ఉలగు = నవీనమైన ఆహారపదార్ధముల నొసగు తోటలచే  చుట్టబడియున్న భూమండలము;విరి నీర్ ముదు వెళ్ళమ్ ఉళ్ పుక్కు అழுన్ద =  విశాలమైన మహా జల ప్రళయములో మునిగియుండగ; అన్ఱు = ఆ సమయమున; వెమ్బుమ్ శినమ్ పునమ్ కేழల్ ఒన్ఱు ఆయ్ = మిక్కిలి క్రోధముతో, అడవిలోనుండెడి విలక్షణమైన వరాహ రూపము దాల్చి;ఎడుత్తాన్=ఆ భూమిని పైకెత్తి ఉద్ధరించిన సర్వేశ్వరుని యొక్క;అడి పోదు=పాదపద్మముల యందు; అణైవాన్ విరుప్పోడు ఇరుప్పీర్ = చేరుకొను ఆశగల భక్తులారా!;మన్నవన్ పల్లవర్ కోన్ = పల్లవ మహారాజు; పై పొన్నుమ్ ముత్తుమ్ మణియుమ్  కొణర్ న్దు = అందమైన బంగారుపుష్పములను, ముత్యములను, మాణిక్యములను తెచ్చి; పడై=తనయొక్క పరివారములతోకూడ; పణిన్ద = ఆశ్రయించిన; శెమ్ పొన్ మణి మాడఙ్గళ్ శూழ் న్ద = అందమైన బంగారము, రత్నములతొ నిర్మితమైన భవనములతో  చుట్టుకొనియున్న; తిల్లై తిరుచిత్తరకూడమ్ శెన్ఱు = తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి; శేర్మిన్గళే = ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

        నవీనమైన ఆహారపదార్ధముల నొసగు తోటలచే చుట్టబడియున్న భూమండలము, విశాలమైన మహా జల ప్రళయములో మునిగియుండగ, ఆ సమయమున మిక్కిలి క్రోధముతో, అడవిలోనుండెడి విలక్షణమైన వరాహ రూపము దాల్చి ఆ భూమిని పైకెత్తి ఉద్ధరించిన సర్వేశ్వరుని యొక్క పాదపద్మములయందు చేరుకొను ఆశగల భక్తులారా!, పల్లవ మహారాజు అందమైన బంగారుపుష్పములను, ముత్యములను, మాణిక్యములను తెచ్చి తనయొక్క పరివారములతో కూడ  ఆశ్రయించిన, అందమైన బంగారము, రత్నములతొ నిర్మితమైన భవనములతో  చుట్టుకొనియున్న తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు.  

అరుమానిల మన్ఱళప్పాన్ కుఱలాయ్, అవుణన్ పెరువేళ్వియిల్ శెన్ఱిరన్ద,

పెరుమాన్ తిరునామమ్ పిదర్ట్రి, నున్దమ్ పిఱవిత్తుయర్ నీఙ్గుతుమెన్నగిఱ్పీర్,

కరుమాకడలుళ్ కిడన్దాన్ ఉవన్దు, కవైనా అరవినణైప్పళ్ళియిన్ మేల్,

తిరుమాల్ తిరుమఙ్గైయోడాడు, తిల్లైత్తిరుచ్చిత్తరకూడమ్ శెన్ఱు శేర్మిన్గళే ll 1161

అన్ఱు = పూర్వమొకకాలమున; అరు మా నిలమ్ = కొలుచుటకు సాధ్యముకాని పెద్ద భూమండలమును; అళప్పాన్ = కొలుచుటకై; కుఱలాయ్ = వామన రూపముదాల్చి; అవుణన్ పెరు వేళ్వియిల్ శెన్ఱు=మహాబలియను అశురునియొక్క యాగభూమివద్దకు వెడలి; ఇరన్ద = మూడడుగుల స్థలమును యాచించిన; పెరుమాన్ = సర్వేశ్వరునియొక్క  తిరునామమ్ పిదర్ట్రి=దివ్యనామములను తోచినట్లు ఉచ్చరించి;నున్దమ్ పిఱవి తుయర్ నీఙ్గుదుమ్ ఎన్న కిఱ్పీర్=మీయొక్క సంసార దుఃఖములను పోగొట్టుకొనెదమని తలచెడి భక్తులారా!; కరు మా కడలుళ్ = నల్లని మహా సముద్రములో; కవైనా అరవిన్ అణై పళ్ళియిన్ మేల్ = చీలియున్న నాలుకలుగల శేషునియొక్క తల్పముపై; ఉవన్దు కిడన్దాన్ తిరుమాల్ = మహదానందముతో శయనించిన శ్రియఃపతి; తిరుమఙ్గైయోడు ఆడు = శ్రీమహాలక్ష్మితో కూడి నిత్యవాసము చేయుచున్న; తిల్లై తిరుచిత్తరకూడమ్ శెన్ఱు = తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి; శేర్మిన్గళే = ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

పూర్వమొకకాలమున ఏ ఒక్కరిచేతను కొలుచుటకు సాధ్యముకాని పెద్ద భూమండలమును కొలుచుటకై వామన రూపముదాల్చి మహాబలియను అశురునియొక్క యాగభూమివద్దకు వెడలి మూడడుగుల స్థలమును యాచించిన సర్వేశ్వరునియొక్క దివ్యనామములను తోచినట్లు ఉచ్చరించి, మీయొక్క సంసార దుఃఖములను పోగొట్టుకొనెదమని తలచెడి భక్తులారా!, నల్లని మహా సముద్రములో శేషతల్పముపై మహదానందముతో శయనించిన శ్రియఃపతి, శ్రీమహాలక్ష్మితో కూడి నిత్యవాసము చేయుచున్న తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

కోమఙ్గ వఙ్గక్కడల్ వైయముయ్య, కులమన్నర్ అఙ్గమ్ మழுవిల్ తుణియ,

తామ్ అఙ్గు అమరుళ్ పడైతొట్ట వెన్ఱి, త్తవమామునియై తమక్కాక్కకిఱ్పీర్,

పూమఙ్గై తఙ్గి ప్పులమఙ్గై మన్ని, పుగழ் మఙ్గై యెఙ్గుమ్ తిగழ ప్పుగழ் శేర్, 

శేమఙ్గొళ్ పైమ్బూం పొழிల్ శూழ் న్ద, తిల్లైత్తిరుచ్చిత్తరకూడమ్ శెన్ఱు శేర్మిన్గళే ll 1162

కో = రాజులు; మఙ్గ = నశించునట్లు; వఙ్గ కడల్ వైయమ్ ఉయ్య = ఓడలతో నిండిన మహాసముద్రముచే చుట్టుకొనియున్న భూమండలమును ఉజ్జీవించుటకు; కులమన్నర్ అఙ్గమ్ మழுవిల్ తుణియ = ఆ రాజులయొక్క శరీరము గొడ్డలితో నరుకుటకై;తామ్= తాను; అఙ్గు అమరుళ్ = ఆ సమయమున జరిగిన యుద్ధములో; పడై తొట్ట = ఆయుధములను ధరించి; వెన్ఱి తవ మా మునియై = జయించిన గొప్ప మునియైన పరశురాముని అవతారము దాల్చిన సర్వేశ్వరుని; తమక్కు ఆక్క కిఱ్పీర్ = తమకు కృపజేయునట్లు ఆశించుచున్న భక్తులారా!; పూ మఙ్గై తఙ్గి = కమలవాసినిని తన వక్షస్థలమందు కుడివైపున కలిగి;పులమ్ మఙ్గై మన్ని=శ్రీ భూదేవిని తన వక్షస్థలమందు ఎడమ వైపున కలిగి; పుగழ் మఙ్గై యెఙ్గుమ్ తిగழ=అట్టి కీర్తిదేవి అంతటను ప్రకాశించు; పుగழ் శేర్  శేమమ్ కొళ్ = ఖ్యాతితో రక్షణకలిగిన;  పైమ్ పూమ్ పొழிల్ శూழ் న్ద = విశాలమైన వికసించిన పూలతోటలతొ చుట్టుకొనియున్న;తిల్లై తిరుచిత్తరకూడమ్ శెన్ఱు = తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి; శేర్మిన్గళే = ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు.  

             ఒకానొక సమయమున దుష్టులైన రాజులు నశించునట్లు, ఓడలతో నిండిన మహాసముద్రముచే చుట్టుకొనియున్న భూమండలమును ఉజ్జీవించుటకు, ఆ రాజులయొక్క శరీరము గొడ్డలితో నరుకుటకై , అప్పుడు జరిగిన యుద్ధములో ఆయుధములను ధరించి జయించిన గొప్ప మునియైన పరశురాముని అవతారము దాల్చిన సర్వేశ్వరుని, తమకు కృపజేయునట్లు ఆశించుచున్న భక్తులారా!,కమలవాసినిని తన వక్షస్థలమందు కుడివైపున కలిగి,శ్రీ భూదేవిని తన వక్షస్థలమందు ఎడమ వైపున కలిగి,అట్టి కీర్తిదేవి అంతటను ప్రకాశించు ఖ్యాతితో రక్షణకలిగిన విశాలమైన వికసించిన పూలతోటలతొ చుట్టుకొనియున్న తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

నెయ్ వాయழలమ్బుతురన్దు, మున్నీర్ తుణియ ప్పణికొణ్డణిఅర్ న్దు, ఇలఙ్గు

మైయార్ మణివణ్ణనైయెణ్ణి, నున్దమ్ మనత్తు ఇరుత్తుమ్బడి వాழ వల్లీర్,

అవ్వాయ్ ఇళమఙ్గైయర్ పేశవున్దాన్, అరుమామఱైయన్దణర్ శిందైపుగ,

శెవ్వాయ్ కిళినాన్మఱైపాడు, తిల్లైత్తిరుచ్చిత్తరకూడమ్ శెన్ఱు శేర్మిన్గళే ll 1163

నెయ్ వాయ్ అழల్ అమ్బు తురన్దు = వాడియైన నోటినుండి అగ్ని కురియుచున్న  బాణములను ప్రయోగించి; మున్నీర్ తుణియ = మహాసముద్రమును ఎండిపోయి కల్లోలమగునట్లు సంసిద్ధమైనపుడు;(సముద్రరాజు వినయముతొ అనుకూలించగ)పణి కొణ్డు = (ఆ సముద్రముపై సేతువును కట్టి) అతనినుండి కైంకర్యమును స్వీకరించినవాడును; అణి అర్ న్దు ఇలఙ్గు మై ఆర్ మణి వణ్ణనై = ఆభరణములచే మిక్కిలి అలంకృతమై, ప్రకాశించు నల్లని మణివర్ణమువంటి తిరుమేనిగల సర్వేశ్వరుని; ఎణ్ణి = ధ్యానించి;నున్దమ్ మనత్తు ఇరుత్తుమ్ పడి వాழ వల్లీర్ = మీ యొక్క హృదయమందు వసింప జేసుకొని ఉజ్జీవింప తలచెడి భక్తులారా!; అవ్వాయ్ = ఆ చిలుకవంటి మధురమైన వాక్కులుగల;ఇళ మఙ్గైయర్ = యువ బాలికలు; అరు మా మఱై = కష్ఠతరమైన గొప్ప వేద వాఖ్యములు; పేశవుమ్=చెప్పుచుండగ (వారితో కలిసి); శెమ్ వాయ్ కిళి = ఎర్రని నోరుగల చిలుకచే; అన్దణర్ శిన్దై పుగ = బ్రాహ్మణుల హృదయమందు పరమానందము కలుగునట్లు;నాల్ మఱై = నాలుగు వేదములు; పాడు = పాడబడుచుండు;తిల్లై తిరుచిత్తరకూడమ్ శెన్ఱు = తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి; శేర్మిన్గళే = ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

            వాడియైన నోటినుండి అగ్ని కురియుచున్న బాణములను ప్రయోగించి మహాసముద్రమును ఎండిపోయి కల్లోలమగునట్లు సంసిద్ధమైనపుడు, సముద్రరాజు వినయముతొ అనుకూలించగ ఆ సముద్రముపై సేతువును కట్టి అతనినుండి కైంకర్యమును స్వీకరించినవాడును, ఆభరణములచే మిక్కిలి అలంకృతమై,ప్రకాశించు నల్లని మణివర్ణమువంటి తిరుమేనిగల సర్వేశ్వరుని ధ్యానించి మీ యొక్క హృదయమందు వసింప జేసుకొని ఉజ్జీవింప తలచెడి భక్తులారా!, ఆ చిలుకవంటి మధురమైన వాక్కులుగల యువ బాలికలు కష్ఠతరమైన గొప్ప వేద వాఖ్యములు చెప్పుచుండగ వారితో కలిసి ఎర్రని నోరుగల చిలుకచే బ్రాహ్మణుల హృదయమందు పరమానందము కలుగునట్లు నాలుగు వేదములు పాడబడుచుండు తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

మౌవల్ కుழలాయ్ చ్చి మెన్ తోళ్ నయన్దు, మకరంశుழల చ్చుழల్ నీర్ పయన్ద,

తెయ్ వ త్తిరుమామలర్మంగై తఙ్గు, తిరుమార్వనై చ్చిందైయుళ్ వైత్తు మెన్బీర్,

కౌవై క్కళర్ట్రిన్ మరుప్పుమ్ పొరుప్పిల్, కమழ் శన్దమ్ ఉన్ది నివా వలఙ్గొళ్, 

దెయ్ వ ప్పునల్ శూழ் న్దழగాయ, తిల్లైత్తిరుచ్చిత్తరకూడమ్ శెన్ఱు శేర్మిన్గళే ll 1164

మౌవల్ కుழల్ ఆయ్ చ్చి = మల్లెలతొ అలంకృతమైన కుంతలములుగల గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టి యొక్క; మెన్ తోళ్ నయన్దు=మృదువైన భుజములను ఆశించి ఆలింగనము చేసుకొనినవాడును; మకరం శుழల శుழల్ నీర్ పయన్ద = మీనములు వలయాకారముగ తిరుగునట్లు సుడులతో వచ్చుచున్న సముద్రమందు ఉద్భవించిన; తెయ్ వ తిరు మా మలర్ మంగై తఙ్గు = అందమైన కమలవాసిని నిత్యవాసము చేయుచున్న; తిరు మార్వనై = దివ్యమైన వక్షస్థలముగల సర్వేశ్వరుని; శిందైయుళ్   వైత్తుమ్ ఎన్బీర్ = తమ హృదయమందు నిలపుకొనవలెనని కోరికగల భక్తులారా!; కౌవై క్కళర్ట్రిన్ మరుప్పుమ్ = (సింహములతో తలబడి) ఘీంకారముచేయు ఏనుగులయొక్క దంతములను; పొరుప్పిల్ = పర్వతములందు; కమழ் శన్దమ్ = పరిమళభరితమైన చందనపు చెట్లను;ఉన్ది= కొట్టుకొనువచ్చు;నివా=” నివా” యను నది; వలమ్ కొళ్=చుట్టు ప్రవహించుచుండునదియు; దెయ్ వ పునల్ శూழ் న్ద అழగాయ = పుణ్య తీర్థములతో చుట్టుకొనియున్న అందమైన; తిల్లై తిరుచిత్తరకూడమ్ శెన్ఱు = తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి; శేర్మిన్గళే = ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు ఆత్మసమర్పణము చేసుకొనుడు.  

      మల్లెలతొ అలంకృతమైన కుంతలములుగల గోపస్త్రీ నప్పిన్నైపిరాట్టియొక్కమృదువైన భుజములను ఆశించి ఆలింగనము చేసుకొనినవాడును, మీనములు వలయాకారముగ తిరుగునట్లు సుడులతో వచ్చుచున్న సముద్రమందు ఉద్భవించిన అందమైన కమలవాసిని నిత్యవాసము చేయుచున్న దివ్యమైన వక్షస్థలముగల సర్వేశ్వరుని, తమ హృదయమందు నిలపుకొనవలెనని కోరికగల భక్తులారా!, సింహములతో తలబడి ఘీంకారముచేయు ఏనుగులయొక్క దంతములను, పర్వతములందు పరిమళభరితమైన చందనపు చెట్లను,కొట్టుకొనువచ్చు” నివా” యను నది చుట్టు ప్రవహించుచుండునదియు, పుణ్య తీర్థములతో చుట్టుకొనియున్న అందమైన తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు.  

మావాయినఙ్గమ్ మదియాదుకీఱి, మழைమాముదుకున్ఱెడుత్తు, ఆయర్ తఙ్గళ్

కోవాయ్ నిఱైమేయ్ త్తులగుణ్డమాయన్, కురై మాకழల్ కూడుమ్ కుఱిప్పుడైయీర్,

మూవాయిర నాన్మఱైయాళర్, నాళుమ్ ముఱైయాల్ వణఙ్గ అణఙ్గాయశోది,

దేవాదిదేవన్ తిగழ் కిన్ఱ, తిల్లైత్తిరుచ్చిత్తరకూడమ్ శెన్ఱు శేర్మిన్గళే ll 1165

మా వాయిన్ అఙ్గమ్ మదియాదు కీఱి = అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క నోటిని మరియు శరీరమును అలక్ష్యముగ చీల్చి పారవైచిన వాడును;  మழை మా ముదు కున్ఱు ఎడుత్తు = (ఇంద్రునిచే కురుపింపబడిన భయంకరమైన) వర్షమునకు గోవర్ధన పర్వతమును గొడుగు వలె పైకెత్తినవాడును;ఆయర్ తఙ్గళ్ కో ఆయ్= గొల్లవాండ్రకు పభువై; నిఱై మేయ్ త్తు=పశువులను మేయించినవాడును;ఉలగు ఉణ్డ మాయన్= (ప్రళయకాలమున) సర్వలోకములను  ఆరగించిన ఆశ్చర్యచేష్టితములుగల సర్వేశ్వరుని యొక్క; కురై మా కழల్ కూడుమ్ కుఱిప్పు ఉడైయీర్ = ఆభరణములచే శబ్ధించుచుండు దివ్యమైన పాదములను చేరుకొనవలెనని అభిప్రాయముగల భక్తులారా!; మూవాయిరమ్ నాన్మఱైయాళర్ = మూడు వేలమంది బ్రాహ్మణులు;నాళుమ్ ముఱైయాల్ వణఙ్గ = ప్రతిదినము తమ స్వరూపమునకు అనుగుణముగ సేవించెడి; అణఙ్గాయ శోది = అప్రాకృతమైన తేజస్సుగల; దేవాదిదేవన్ తిగழ் కిన్ఱ = సర్వేశ్వరుడు ప్రకాశించుచున్న; తిల్లై తిరుచిత్తరకూడమ్ శెన్ఱు = తిల్లై తిరుచిత్తరకూడమ్  దివ్యదేశమునకు పోయి; శేర్మిన్గళే = ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు ఆత్మసమర్పణము చేసుకొనుడు.  

అశ్వరూపములో వచ్చిన కేశియను అశురునియొక్క నోటిని మరియు శరీరమును అలక్ష్యముగ చీల్చి పారవైచిన వాడును, (ఇంద్రునిచే కురుపింపబడిన భయంకరమైన) వర్షమునకు గోవర్ధన పర్వతమును గొడుగు వలె పైకెత్తినవాడును, గొల్లవాండ్రకు పభువై,పశువులను మేయించిన వాడును, (ప్రళయకాలమున) సర్వలోకములను  ఆరగించిన ఆశ్చర్యచేష్టితములుగల సర్వేశ్వరుని యొక్క ఆభరణములచే శబ్ధించుచుండు దివ్యమైన పాదములను చేరుకొనవలెనని అభిప్రాయముగల భక్తులారా! మూడు వేలమంది బ్రాహ్మణులు ప్రతిదినము తమ స్వరూపమునకు అనుగుణముగ సేవించెడి అప్రాకృతమైన తేజస్సుగల సర్వేశ్వరుడు ప్రకాశించుచున్నతిల్లై తిరుచిత్తరకూడమ్  దివ్యదేశమునకు పోయి ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు ఆత్మసమర్పణము చేసుకొనుడు.  

శెరునీలవేల్ కణ్ మడవార్ తిఱత్తు, చ్చినత్తోడునిన్ఱు మనత్తాల్ వళర్కుమ్ ,

అరు నీలపావమ్ అగల ప్పుగழ் శేర్, అమరర్కుమ్ ఎయ్ దాద అణ్డత్తిరుప్పీర్ ,

పెరునీర్ నివావున్ది ముత్తమ్ కొణర్ న్దు,ఎఙ్గుమ్ విత్తుం వయలుళ్ కయల్ పాయ్ న్దుగళ,

తిరునీలమ్ నిన్ఱు తిగழ் కిన్ఱ, తిల్లైత్తిరుచ్చిత్తరకూడమ్ శెన్ఱు శేర్మిన్గళే ll 1166

శెరు వేల్  నీలమ్  కణ్ మడవార్  తిఱత్తు = యుద్దములో ఉపయోగించెడి ఈటవలెను మరియు నల్లకలువ వలె కన్నులుగల వినయముగల స్త్రీల విషయమై (సంభోగమును అడ్డగించిన వారిపై); శినత్తోడు నిన్ఱు = కోపము కలిగియుండి; మనత్తాల్ వళర్కుమ్ = మనస్సులో ఆ స్త్రీలయందు  కోరిక అమితముగ పెంచుకొని అనేక దుష్కుత్యములు చేయుటచే కలుగు; అరు నీలమ్ పావమ్ అగల = పోగొట్టకొనలేని అతినిమ్నమైన పాపము తొలగిపోవునట్లు; ప్పుగழ் శేర్ అమరర్కుమ్ ఎయ్ దాద  అణ్డత్తు ఇరుప్పీర్ = మిక్కిలి ఖ్యాతికలిగిన బ్రహ్మాదిదేవతలకు దుర్లభమైన పరమపదమందు వసించుటకు  ఇచ్ఛగల భక్తులారా!; పెరు నీర్ నివా ముత్తమ్ కొణర్ న్దు ఉన్ది విత్తుం = గొప్ప  నీటి ప్రవాహముగల “నివా” నది ముత్యములను తీసుకునివచ్చి నాటుచుండెడి; వయలుళ్ ఎఙ్గుమ్=పొలములందంతటను; కయల్ పాయ్ న్దుగళ=మీనములు ఈదుచు గెంతులు వేయుచున్నదియు;తిరు నీలమ్ నిన్ఱు తిగழ் కిన్ఱ = సుందరమైన నల్లకలువలు అన్ని ప్రదేశములందు ప్రకాశించుచున్న;తిల్లై తిరుచిత్తరకూడమ్ శెన్ఱు = తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమునకు పోయి;శేర్మిన్గళే=ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు ఆత్మసమర్పణము చేసుకొనుడు. 

యుద్దములో ఉపయోగించెడి ఈటవలెను మరియు నల్లకలువలవలె కన్నులుగల వినయముగల స్త్రీల విషయమై సంభోగమును అడ్డగించిన వారిపై కోపము కలిగియుండి, మనస్సులో ఆ స్త్రీలయందు  కోరిక అమితముగ పెంచుకొని అనేక దుష్కుత్యములు చేయుటచే కలుగు పోగొట్టకొనలేని అతినిమ్నమైన పాపము తొలగి పోవునట్లు, మిక్కిలి ఖ్యాతికలిగిన బ్రహ్మాదిదేవతలకు దుర్లభమైన పరమపదమందు వసించుటకు ఇచ్ఛగల భక్తులారా!, గొప్ప  నీటి ప్రవాహముగల “నివా” నది ముత్యములను తీసుకునివచ్చి నాటుచుండెడి పొలములందంతటను మీనములు ఈదుచు గెంతులు వేయుచున్నదియు, సుందరమైన నల్లకలువలు అన్ని ప్రదేశములందు ప్రకాశించుచున్న తిల్లై తిరుచిత్తరకూడమ్   దివ్యదేశమునకు పోయి ఆ సర్వేశ్వరుని దివ్య చరణారవిందములందు  ఆత్మసమర్పణము చేసుకొనుడు.

** శీరార్  పొழிల్ శూழ் న్దழగాయ, తిల్లైత్తిరుచ్చిత్తర కూడత్తుఱై శెఙ్గణ్ మాలుక్కు, 

ఆరాద ఉళ్ళత్తవర్ కేట్టు ఉవప్ప, అలైనీర్ ఉలగుక్కరుళే పురియుమ్ ,

కారార్ పుయఱ్కై క్కలికన్ఱి,  కున్ఱా ఒలిమాలై ఓరొన్బతోడొన్ఱుమ్ వల్లార్, 

పారార్ ఉలగమళన్దాన్ అడిక్కీழ், ప్పలకాలం నిర్కుమ్బడి వాழ்వర్ తామే ll 1167

శీరార్  పొழிల్ శూழ் న్ద అழగాయ = శ్లాఘ్యమైన తోటలచే చుట్టుకొనియున్న మిక్కిలి సుందరమైన; తిల్లైత్తిరుచ్చిత్తర కూడత్తు ఉఱై=తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమున  నిత్యవాసము చేయుచున్న; శెమ్ కణ్ మాలుక్కు = పుండరీకాక్షుడైన సర్వేశ్వరుని విషయమై; ఆరాద ఉళ్ళత్తవర్ = భగవద్గుణములు ఎంత అనుభవించినను తృప్తితీరని భక్తులు; కేట్టు ఉవప్ప = విని ఆనందించునట్లు;అలైనీర్ ఉలగుక్కు అరుళే పురియుమ్= సముద్రముచే చుట్టుకొనియున్న భూలోక వాసులకు కృపచేయువారైన; కార్ ఆర్ పుయల్  కై = కాళ మేఘమువంటి ఉదారస్వభావముగల;కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; కున్ఱా ఒలిమాలై = ఏ దోషములేని శబ్ధపుష్ఠిగల పదములతో నిండి మాలగనున్న; ఓర్ ఒన్బతోడు ఒన్ఱుమ్ వల్లార్ తామ్ = ఈ పది పాసురములు అనుసంధించువారు; పార్ ఆర్ ఉలగమ్ అళన్దాన్ అడిక్కీழ் = భూమండలమును, స్వర్గాదిలోకములును కొలిచిన సర్వేశ్వరుని దివ్య చరణములందు; పలకాలం నిర్కుమ్బడి వాழ்వర్ = చిరకాలము(శాశ్వతముగ) కైంకర్యముచేయుచు సుఖించెదరు.

శ్లాఘ్యమైన తోటలచే చుట్టుకొనియున్న మిక్కిలి సుందరమైన తిల్లై తిరుచిత్తరకూడమ్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న పుండరీకాక్షుడైన సర్వేశ్వరుని విషయమై, భగవద్గుణములు ఎంత అనుభవించినను తృప్తితీరని భక్తులు విని ఆనందించునట్లు,సముద్రముచే చుట్టుకొనియున్న భూలోక వాసులకు కృపచేయువారైన కాళ మేఘమువంటి ఉదారస్వభావముగల తిరుమంగై ఆళ్వార్ ఏ దోషములేని శబ్ధపుష్ఠిగల పదములతో నిండి మాలగనున్న ఈ పది పాసురములు అనుసంధించువారు, భూమండలమును, స్వర్గాదిలోకములును కొలిచిన సర్వేశ్వరుని దివ్య చరణములందు చిరకాలము(శాశ్వతముగ) కైంకర్యముచేయుచు సుఖించెదరు.

********

వ్యాఖ్యానించండి