శ్రీః
5. వన్దునదడియేన్
తిరువాలి దివ్యదేశమందు కృపతో నిత్యవాసము చేయుచున్న వయలాలి మణవాళన్ పెరుమాళ్, అమృతమువల్లి తాయార్ సమేతముగ ఏతెంచి, నిర్హేతుకకృపతో తనకు తిరమంత్రోపదేశముచేసి, అచంచలమైన భక్తిని కలుగజేసిన ఆ సర్వేశ్వరుని తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** వన్దు ఉనదు అడియేన్ మనమ్ పుగున్దాయ్, పుగున్దదఱ్పిన్ వణఙ్గుమ్, ఎన్
శిన్దనైక్కినియాయ్, తిరువే ఎన్నారుయిరే,
అన్దళిర్ అణియార్, అశోగిన్ ఇళన్దళిర్ గళ్ కలన్దు, అవైయెఙ్గుమ్
శెన్దழల్ పురైయుమ్, తిరువాలియమ్మానే ll 1188
అమ్ తళిర్ అణి అర్=అందమైన దళములతో అలంకృతమైన;అశోగిన్=అశోక వృక్షముల; ఇళమ్ తళిర్ గళ్ అవై = వాటి లేత చిగుళ్ళు; ఎఙ్గుమ్ కలన్దు = అన్ని ప్రదేశములందు వ్యాపించియుండుటచే; శెమ్ తழల్ పురైయుమ్=ఎర్రని అగ్ని జ్వలించుచున్నట్లు తలపించు;తిరువాలి అమ్మానే=తిరువాలియందు వేంచేసియున్న నాస్వామీ!; తిరువే = నాయొక్క దివ్యమైన సొత్తుగ ప్రకాశించుచున్నవాడా!; ఎన్ ఆర్ ఉయిరే = నాయొక్క ప్రాణభూతుడైయున్నవాడా!; వన్దు = స్వయముగ నిర్హేతుకకృపతొ వచ్చి; ఉనదు అడియేన్ మనమ్ పుగున్దాయ్ = నీయొక్క దాసుని హృదయమందు వేంచేసితివి; పుగున్దదఱ్పిన్ = అట్లు వేంచేసియున్న పిదప; వణఙ్గుమ్ ఎన శిన్దైక్కు =సేవించుచుండెడి నా మనస్సుకు; ఇనియాయ్ = అతి భోగ్యుడవైతివి (ఆహా!).
అందమైన దళములతో అలంకృతమైన అశోక వృక్షముల యొక్క లేత చిగుళ్ళు అంతటను వ్యాపించియుండుటచే,ఎర్రని అగ్ని జ్వలించుచున్నట్లు తలపించు తిరువాలియందు వేంచేసియున్న నాస్వామీ!,నాయొక్క దివ్యమైన సొత్తుగ ప్రకాశించుచున్నవాడా!,నాయొక్క ప్రాణభూతుడైయున్నవాడా!, స్వయముగ నిర్హేతుక కృపతో వచ్చి నీయొక్క దాసుని హృదయమందు వేంచేసితివి. అట్టి నిన్ను సేవించుచుండెడి నా మనస్సుకు అతి భోగ్యుడవైతివి (ఆహా!).
నీలత్తడవరై, మామణినిగழ் క్కిడన్దదుపోల్, అరవణై
వేలైత్తలై కిడన్దాయ్, అడియేన్ మనత్తిరున్దాయ్ ,
శోలైత్తలైక్కణమామయిల్ నడమాడ, మழைముగిల్ పోన్ఱెழுన్దు, ఎఙ్గుమ్
ఆలైప్పుగై కమழுమ్, అణియాలియమ్మానే ll 1189
శోలైత్తలై = తోటలలో; మా మయిల్ కణమ్ = సుందరమైన నెమళ్ళ సమూహములు; నడమాడ = (సంతోషముతో) నాట్యము చేయునట్లు;ఆలైప్పుగై = చెరకు పరిశ్రమయొక్క పొగ; ఎఙ్గుమ్ = అంతటను; మழை ముగిల్ పోన్ఱు ఎழுన్దు=వర్షాకాలపు మేఘమువలె పైకెగిసి; కమழுమ్=పరిమళము వెదజల్లెడి;అణి =అందమైన; ఆలి అమ్మానే=తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!; నీలమ్ తడ వరై = నీలివర్ణముగల పెద్ద పర్వతము; మా మణి నిగழ் క్కిడన్దదు పోల్ = (దానిపై) అద్వితీయమైన నీలిరత్నము ప్రకాశించుచు పవళించియున్నట్లు; వేలై తలై = మహాసముద్రమందు; అరవు అణై = శేషశయనముపై; కిడన్దాయ్ = (మునుపు) పవళించియుంటివి;(ఇప్పుడు) అడియేన్ మనత్తి ఇరున్దాయ్ = నీదాసుని హృదయమందు వీడకయున్నావుగదా! (ఏమి నా భాగ్యము)
తోటలలో సుందరమైన నెమళ్ళ సమూహములు సంతోషముతో నాట్యము చేయునట్లు, చెరకు పరిశ్రమయొక్క పొగ, అంతటను, వర్షాకాలపు మేఘమువలె పైకెగిసి పరిమళము వెదజల్లెడి అందమైన తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!, నీలివర్ణముగల పెద్ద పర్వతము దానిపై అద్వితీయమైన నీలిరత్నము ప్రకాశించుచు పవళించియున్నట్లు మహాసముద్రమందు శేషశయనముపై పవళించియున్న నీవు నీదాసుని హృదయమందు వీడకయున్నావుగదా! (ఏమి నా భాగ్యము) .
నెన్నెల్ పోయ్ వరుమెన్ఱెన్ఱెణ్ఱియిరామై, ఎన్ మనత్తే పుగున్దదు ,
ఇమ్మైక్కెన్ఱిరున్దేన్, ఎఱినీర్ వళమ్ శెరువిల్ ,
శెన్నెఱ్కూழை వరమ్బొరీఇ, అరివార్ ముగత్తు ఎழுవాళైపోయ్, కరుమ్బు
అన్నఱ్కాడణైయుమ్, అణియాలియమ్మానే ll 1190
ఎఱి నీర్ వళమ్ శెరువిల్ = అలలగల జలాశయములతో నిండిన పొలములలో; శెన్నెల్ కూழை = ఎర్రధాన్యపు కంకులను; వరమ్బు ఒరీఇ = పొలముల గట్లపై చేర్చెడి; అరివార్ ముగత్తు=కోతలు కోయు రైతుల ముఖముపై; ఎழு వాళై = ఎగురుపడుచుండెడి మత్స్యములు; పోయ్ = (అపాయకరమైన స్థలమని) ఆ పొలములను విడిచి; అ నల్ కరుమ్బు కాడు అణైయుమ్ = మంచి దట్టమైన పొదలుగల చెరకుతోటలలో చేరుకొనుచున్న అట్టి; అణి = అందమైన; ఆలి అమ్మానే = తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!; నెన్నెల్ పోయ్ వరుమ్ ఎన్ఱెన్ఱు ఎణ్ఱి ఇరామై = “నిన్నటి దినమున వెడలెను,ఈ దినమున వచ్చును, ఈ దినమున వచ్చును…” అని తలచుచు(వ్యధపొందునట్లు) గడుపునట్లుగాక;ఎన్ మనత్తే పుగున్దదు = నాయొక్క హృదయమందు ప్రవేశించి ఉండినది; ఇమ్మైక్కు ఎన్ఱు ఇరున్దేన్ = ఆజన్మాంతమువరకు అని అమితానంద భరితుడనైతిని.
అలలగల జలాశయములతో నిండిన పొలములలో ఎర్రధాన్యపు కంకులను పొలముల గట్లపై చేర్చెడి రైతుల ముఖముపై ఎగురిపడుచుండెడి మత్స్యములు అపాయకరమైన స్థలమని ఆ పొలములను విడిచి సమీపమునగల మంచి దట్టమైన పొదలుగల చెరకుతోటలలో చేరుకొనుచున్న , అట్టి అందమైన తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!, “నిన్నటి దినమున వెడలెను,ఈ దినమున వచ్చును, ఈ దినమున వచ్చును…” అని తలచుచు(వ్యధపొందునట్లు)గడుపునట్లుగాక నాయొక్క హృదయమందు ప్రవేశించి ఉండినది, ఆజన్మాంతమువరకు అని అమితానంద భరితుడనైతిని.
మిన్నిన్ మన్ను నుడుఙ్గిడై, మడవార్ తమ్ శిన్దైమఱన్దు వన్దు, నిన్
మన్ను శేవడిక్కే, మఱవామై వైత్తాయాల్ ,
పున్నై మన్ను శెరున్ది, వణ్ పొழிల్ వాయగన్ పణైగళ్ కలన్దు, ఎఙ్గుమ్
అన్న మన్నుమ్ వయల్, అణియాలియమ్మానే ll 1191
పున్నై శెరున్ది మన్ను = పున్నై వృక్షములతోను, శెరున్ది వృక్షములతోను నిండియున్న; వణ్ పొழிల్ వాయ్ = అందమైన తోటలలోగల; అగన్ పణై గళ్ ఎఙ్గుమ్ =విశాలమైన తటాకములలో అన్నిప్రదేశములందును; అన్నమ్ కలన్దు మన్నుమ్ = హంసలు జతకూడి నివసించుచుండెడిదియు; వయల్ = పొలములుగలదియు; అణి = అందమైన; ఆలి అమ్మానే = తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!; మిన్నిన్ మన్ను నుడుఙ్గు ఇడై=మెరుపువలె సూక్ష్మమైన నడుముగల; మడవార్ తమ్=స్త్రీల విషయమై; శిన్దై మఱన్దు వన్దు=అనురాగమును విసర్జించి వచ్చి; నిన్ మన్ను శేవడిక్కే=నీ దివ్యమైన సుందరమైన చరణారవిందములందే; మఱవామై వైత్తాయ్ = ఎన్నడును మరువక స్మరించునట్లు కృపచేసితివి; ఆల్ = ఇది ఎంత ఆశ్చర్యమో!
పున్నై వృక్షములతోను, శెరున్ది వృక్షములతోను నిండియున్న అందమైన తోటలలో గల విశాలమైన తటాకములలో అన్నిప్రదేశములందును హంసలు జతకూడి నివసించుచుండెడిదియు, పొలములుగలదియు,అందమైన తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!,మెరుపువలె సూక్ష్మమైన నడుముగల స్త్రీల విషయమై అనురాగమును విసర్జించి వచ్చి నీ దివ్యమైన సుందరమైన చరణారవిందములందే ఎన్నడును మరువక స్మరించునట్లు కృపచేసితివి. (ఇది ఎంత ఆశ్చర్యమో!).
నీడు పన్మలర్ మాలైయిట్టు, నిన్నిణైయడి తొழுదేత్తుమ్, ఎన్ మనమ్
వాడ నీ నినైయేల్, మరమెయ్ ద మామునివా ,
పాడల్ ఇన్నొలి శఙ్గినోశై పరన్దు, పల్ పణైయాల్ మలిన్దు, ఎఙ్గుమ్
ఆడలోశైయఱా, అణియాలియమ్మానే ll 1192
పాడల్ ఇన్ ఒలి=( భగవత్సంబంధమైన) పాటలయొక్క మధురమైన ధ్వనియు;శఙ్గిన్ ఓశై = శంఖములను పూరించుటచే కలిగిన ధ్వనియు; పరన్దు = అంతటను వ్యాపించియుండు నదియు; పల్ పణైయాల్ మలిన్దు = పలు వాద్యముల ఘోషలతో నిండియున్నదియు; ఎఙ్గుమ్ = అన్ని ప్రదేశములందును;ఆడల్ ఓశై అఱా = ఎడతెగక నృత్యముల శబ్దములు వినబడుచుండు; అణి = అందమైన; ఆలి అమ్మానే = తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!; మరమ్ ఎయ్ ద మామునివా = సప్త సాల వృక్షములను ఒక్క బాణముచే కూలగొట్టిన సత్యసంకల్పుడా!;నిన్ ఇణై అడి=నీయొక్క పాదద్వందములందు; పల్ మలర్ మాలై = పలు రకములైన పుష్పముల మాలను; నీడు యిట్టు = చిరకాలము సమర్పించి; తొழுదు ఏత్తుమ్=సేవించి,స్తుతించుచుండెడి;ఎన్ = నీ దాసుడైన నాయొక్క;మనమ్ వాడ = హృదయము(నీ వియోగమువలన) వాడునట్లు; నీ నినైయేల్ = నీవు తలచకుమా!.
భగవత్సంబంధమైన పాటలయొక్క మధురమైన ధ్వనియు, శంఖములను పూరించుటచే కలిగిన ధ్వనియు,అంతటను వ్యాపించియుండునదియు, పలు వాద్యముల ఘోషలతో నిండియున్నదియు, అన్ని ప్రదేశములందును ఎడతెగక నృత్యముల శబ్దములు వినబడుచుండు అందమైన తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!,సప్త సాలవృక్షములను ఒక్క బాణముచే కూలగొట్టిన సత్యసంకల్పుడా!,నీయొక్క పాదద్వందములందు పలు రకములైన పుష్పముల మాలను చిరకాలము సమర్పించి,సేవించి,స్తుతించుచుండెడి నీ దాసుడైన నాయొక్క హృదయము నీ వియోగమువలన వాడునట్లు నీవు తలచకుమా!.
కన్దమామలరెట్టుమిట్టు, నిన్ కామరు శేవడి కై తొழுదు ఎழுమ్ ,
పున్దియేన్ మనత్తే, పుగున్దాయై ప్పోగలొట్టేన్ ,
శన్ది వేళ్వి శడఙ్గు నాన్మఱై, ఓది ఓదువిత్తు ఆదియాయ్ వరుమ్ ,
అన్దణాళరఱా, అణియాలియమ్మానే ll 1193
శన్ది వేళ్వి శడఙ్గు నాల్ మఱై = సంధ్యావందనము మొదలగు నిత్యకర్మలను,యాగము మొదలగు నైమిత్తిక కర్మలును,కామ్యకర్మలును,ఙ్ఞానసంబంధమైన నాలుగువేదములును; ఆదియాయ్ = అనాదికాలమునుండి;ఓది ఓదువిత్తు వరుమ్ = తాము అనుసంధించియు, ఇతరులచే అనుసంధింప జేయుచు వచ్చుచున్న;అన్దణాళర్ అఱా=బ్రాహ్మణులచే అవిచ్చిన్నముగ జరుగుచుండెడి; అణి= అందమైన;ఆలి అమ్మానే = తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!; నిన్ కామరు శే అడి = నీయొక్క అందమైన ఎర్రని పాదపద్మములందు; గన్దమ్ మా మలర్ ఎట్టుమ్ ఇట్టు = పరిమళ భరితమైన శ్లాఘ్యమైన ఎనిమిది రకములైన పుష్పములను సమర్పించి; కై తొழுదు ఎழுమ్ పున్దియేన్ = సేవించుకొని ఉజ్జీవింప అధ్యవసాయము కలిగియున్ననాయొక్క; మనత్తే = హృదయమందు; పుగున్దాయై = కృపతో వేంచేసియున్న నిన్ను; పోగల్ ఒట్టేన్ = ఇకపై నన్ను వీడనివ్వను.
సంధ్యావందనము మొదలగు నిత్యకర్మలను,యాగము మొదలగు నైమిత్తిక కర్మలును,కామ్యకర్మలును,ఙ్ఞానసంబంధమైన నాలుగువేదములును అనాదికాలమునుండి తాము అనుసంధించియు, ఇతరులచే అనుసంధింపజేయుచు వచ్చుచున్న బ్రాహ్మణులచే అవిచ్చిన్నముగ జరుగుచుండెడి అందమైన తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!, నీయొక్క అందమైన ఎర్రని పాదపద్మములందు పరిమళభరితమైన శ్లాఘ్యమైన ఎనిమిది రకములైన పుష్పములను సమర్పించి సేవించుకొని ఉజ్జీవింప అధ్యవసాయము కలిగియున్న నాయొక్క హృదయమందు కృపతో వేంచేసియున్న నిన్ను ఇకపై నన్ను వీడనివ్వను.
ఉలవు తిరైక్కడల్ పళ్ళికొణ్డు వన్దు, ఉన్నడియేన్ మనమ్ పుగున్ద, అ
ప్పలవ పుణ్ణియనే, పుగున్దాయై ప్పోగలొట్టేన్ ,
నిలవు మలర్ పున్నై నాழల్ నీழల్, తణ్తామరై మలరిన్మిశై , మలి
అలవన్ కణ్ పడుక్కుమ్, అణియాలియమ్మానే ll 1194
నిలవు మలర్ పున్నై = ఎల్లప్పుడును వికసించు పుష్పములుగల పున్నై వృక్షముల యొక్కయు; నాழల్ = ఞాయల్ వృక్షములయొక్కయు; నీழల్ = నీడలయందు; తణ్ తామరై మలరిన్ మిశై = చల్లని తామర పుష్పములపై; మలి అలవన్ = పెద్ద మగ పీతలు; కణ్ పడుక్కుమ్ = నిదురించుచుండు; అణి = అందమైన; ఆలి అమ్మానే = తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!; తిరై ఉలవు కడల్ = అలలు కొట్టుచున్న పాలసముద్రమందు; పళ్ళి కొణ్డు = పవళించియుండి; వన్దు ఉన్నడియేన్ మనమ్ పుగున్ద = అచటనుండి ఏతెంచి నీయొక్క దాసుని హృదయమందు కృపతో వేంచేసియున్న;అ ప్పులవ = ఓ సర్వజ్ఞుడా!;పుణ్ణియనే =(నన్ను ఉద్ధరించినటువంటి) బహు సుకృతములుగలవాడా!;పుగున్దాయై = నిర్హేతుకకృపతొ వేంచేసియున్న నిన్ను; పోగల్ ఒట్టేన్ = ఇకపై నన్ను వీడనివ్వను.
ఎల్లప్పుడును వికసించు పుష్పములుగల పున్నై వృక్షముల యొక్కయు, ఞాయల్ వృక్షముల యొక్కయు నీడలయందు చల్లని తామర పుష్పములపై పెద్ద మగ పీతలు నిదురించుచుండు అందమైన తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!, అలలు కొట్టుచున్న పాలసముద్రమందు పవళించియుండి అచటనుండి ఏతెంచి నీయొక్క దాసుని హృదయమందు కృపతో వేంచేసియున్న ఓ సర్వజ్ఞుడా!, నన్ను ఉద్ధరించినటువంటి బహు సుకృతములుగలవాడా!, నిర్హేతుకకృపతొ వేంచేసియున్న నిన్ను ఇకపై నన్ను వీడనివ్వను.
శఙ్గు తఙ్గు తడఙ్డడల్, కడల్ మల్లైయుళ్ కిడన్దాయ్, అరుళ్ పురిన్దు
ఇఙ్గెన్నుళ్ పుగున్దాయ్, ఇని ప్పోయినాల్ అఱైయో ,
కొఙ్గు శెణ్బగమ్ మల్లిగై మలర్ పుల్ గి, ఇన్ ఇళ వణ్డు పోయ్, ఇళమ్
తెఙ్గిన్ తాదు అళైయుమ్, తిరువాలియమ్మానే ll 1195
ఇన్ ఇళ వణ్డు = మనోహరమైన పడుచు తుమ్మెదలు; కొఙ్గు శెణ్బగమ్ మల్లిగై మలర్ = పరిమళ భరితమైన సంపంగి, మల్లి పుష్పములను; పుల్ గి = హత్తుకొని; పోయ్ = అచటినుండి వెడలి; ఇళమ్ తెఙ్గిన్ తాదు అళైయుమ్ = లేత కొబ్బరి పూబాళలను కలియపెట్టుచుండెడి; తిరువాలి అమ్మానే = తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!; శఙ్గు తఙ్గు తడమ్ కడల్ =శంఖములు చేరియుండెడి విశాలమైన పాల సముద్రమందును; కడల్ మల్లైయుళ్ కిడన్దాయ్=తిరుకడల్ మల్లై దివ్యదేశమునందును పవళించియున్నవాడా!; ఇఙ్గు ఎన్నుళ్ = ఇపుడు నాయొక్క హృదయమందు; అరుళ్ పురిన్దు = కరుణతో; పుగున్దాయ్ = ప్రవేశించితివి; ఇని ప్పోయినాల్ అఱైయో = ఇక నీవు నన్ను విడిచి పోవుట నీకది పెద్ద విజయమే అగును సుమా! (అసాధ్యమని భావము!)
మనోహరమైన పడుచు తుమ్మెదలు పరిమళభరితమైన సంపంగి, మల్లి పుష్పములను హత్తుకొని అచటినుండి వెడలి లేత కొబ్బరి పూబాళలను కలియపెట్టుచుండెడి తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!,శంఖములు చేరియుండెడి విశాలమైన పాలసముద్రమందును,తిరుకడల్ మల్లై దివ్యదేశమునందును పవళించియున్నవాడా!, ఇపుడు నాయొక్క హృదయమందు కరుణతో ప్రవేశించితివి. ఇక నీవు నన్ను విడిచి పోవుట నీకది పెద్ద విజయమే అగును సుమా! (అసాధ్యమని భావము!)
ఓది ఆయిరనామముమ్ పణిన్దేత్తి, నిన్న డైన్దేఱ్కు, ఒరు పొరుళ్
వేదియా! అరైయా, ఉరైయాయ్ ఒరుమార్ట్రమ్ ఎన్దాయ్ ,
నీదియాగియ వేద మామునియాళర్, తోర్ట్రమురైత్తు, మర్ట్రవర్కు
ఆదియా యిరున్దాయ్, అణి యాలి యమ్మానే ll 1196
నీది ఆగియ వేదమ్ = సత్యములను నుడువుచున్న వేదములను; మామునియాళర్ తోర్ట్రమ్ = (ఆ వేదములందుగల దివ్య మంత్రములను దర్శించిన)మహాఋషుల జన్మము మొదలగువానిని;ఉరైత్తు = వెలిబుచ్చినవాడవును;మర్ట్రు అవర్కు=తదితరులకు;ఆదియాయ్ ఇరున్దాయ్= కారణభూతుడైనున్న; అణి = అందమైన; ఆలి అమ్మానే=తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!;వేదియా= వేదములచే తెలియదగినవాడా!; అరైయా = దేవాది దేవుడా!;ఎన్దాయ్ = నాయొక్క స్వామీ!; ఆయిరనామముమ్ ఓది=నీయొక్క సహస్రనామములను అనుసంధించి; పణిన్దు ఏత్తి= సేవించి, స్తుతించి; నిన్ అడైన్దేఱ్కు= నీ చరణారవిందములందు శరణుజొచ్చిన ఈ దాసునికి ;ఒరు పొరుళ్=ఒక దివ్యార్ధమును; ఒరు మార్ట్రమ్ = ఒక దివ్యమైన వాక్కును; ఉరైయాయ్ = కృపతో సెలవీయుమా!
సత్యములను నుడువుచున్న వేదములను,ఆ వేదములందుగల దివ్య మంత్రములను దర్శించిన మహాఋషులజన్మము మొదలగువానిని వెలిబుచ్చినవాడవును తదితరులకు కారణభూతుడైనున్న అందమైన తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామీ!, వేదములచే తెలియదగినవాడా! దేవాది దేవుడా!, నాయొక్క స్వామీ!,నీయొక్క సహస్రనామములను అనుసంధించి, సేవించి,స్తుతించి,నీ చరణారవిందములందు శరణుజొచ్చిన ఈ దాసునికి ఒక దివ్యార్ధమును,ఒక దివ్యమైన వాక్కును (నీయొక్క దివ్య ముఖారవిన్దమునుండి) కృపతో సెలవీయుమా! (ఎడతెగని ఆనందదాయకమగు వాక్కులకై ఆళ్వార్ విన్నవించుకొనుచున్నారు)
** పుల్లి వణ్డఱైయమ్ పొழிల్ పుడై శూழ், తెన్ ఆలియిరున్దమాయనై ,
కల్లిన్ మన్ను తిణ్తోళ్, కలియన్ ఒలిశెయ్ ద ,
నల్ల ఇన్ ఇశై మాలై, నాలుమోరైన్దు మొన్ఱుమ్ నవిన్ఱు తామ్,ఉడన్
వల్లరాయ్ ఉరైప్పార్కు, ఇడమాగుమ్ వాన్ ఉలగే ll 1197
వణ్డు = తుమ్మెదలు;పుల్లి=జతకూడి; అఱైయుమ్ = ఇంపుగ ఝంకారముచేయుచున్న; పొழிల్ = తోటలచే;పుడై శూழ் =అంతటను చుట్టుకొనియున్న; తెన్ ఆలి =అందమైన తిరువాలి దివ్యదేశమందు; ఇరున్ద= కృపతో వేంచేసియున్న;మాయనై=ఆశ్చర్యకరమైన సర్వేశ్వరుని విషయమై; కల్లిన్ తిణ్ మన్ను తోళ్ = పర్వతమువలె దృఢముగనుండెడి భుజములుగల; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలిశెయ్ ద = అనుగ్రహించిన; నల్ల ఇన్ ఇశై =సుందరమైన మధురమైన రాగభరితమైన;మాలై నాలుమ్ ఓరైన్దుమ్ ఒన్ఱుమ్= పది పాశురములను; నవిన్ఱు = అభ్యసించి; తామ్ ఉడన్ వల్లరాయ్ ఉరైప్పార్కు = అందలి భావమును ధ్యానించి అనుసంధించువారికి; ఇడమాగుమ్ వాన్ ఉలగే = పరమపదము నివాసస్థానమగును.
తుమ్మెదలు జతకూడి ఇంపుగ ఝంకారముచేయుచున్న తోటలచే అంతటను చుట్టుకొనియున్న అందమైన తిరువాలి దివ్యదేశమందు కృపతో వేంచేసియున్న ఆశ్చర్యకరమైన సర్వేశ్వరుని విషయమై పర్వతమువలె దృఢముగనుండెడి భుజములుగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సుందరమైన మధురమైన, రాగభరితమైన పది పాశురములను అభ్యసించి అందలి భావమును ధ్యానించి అనుసంధించువారికి పరమపదము నివాసస్థానమగును.
***************