శ్రీః
6. తూవిరియ
(కోయిల్ తిరుమొழி)
నిర్హేతుకకృపచే హృదయమందు వేంచేసియున్న తిరువాలి మణవాళన్ ధ్యానమందు మునిగిన తిరుమంగై ఆళ్వార్ మిక్కిలి భక్తిపారవశ్యములో పరకాలనాయకి అవస్థను పొంది ప్రత్యక్ష అనుభవమును కోరుకొనుచున్నారు.
** తూవిరియ మలర్ ఉழక్కి, తుణైయోడుమ్ పిరియాదే,
పూవిరియ మదునుగరుమ్, పొఱివరియ శిఱువణ్డే,
తీవిరియ మఱై వళర్కుమ్, పుగழாళర్ తిరువాలి,
ఏవరి వెఞ్జిలై యానుక్కు, ఎన్నిలైమై యురైయాయే ll 1198
తూ విరియ = రెక్కలను చాచి; మలర్= పుష్పములను; ఉழక్కి = మధియించి; తుణైయొడుమ్=తన భాగస్వామిని; పిరియాదే=విడువక;పూ విరియ మదు నుగరుమ్= పుష్పములు వికసించగ వాటియందు తేనెను గ్రోలుచుండెడి; పొఱివరియ = చుక్కలు మరియు చారలుగల; శిఱు వణ్డే = ఓ చిన్న భ్రమరమా!; తీ విరియ = అగ్ని సంబంధిత కార్యములను విస్తారముగ వ్యాపించునట్లు, మఱై వళర్కుమ్ = వేద మర్యాదలను ఏవిధమైన కొరతలేక నడిపించెడి; పుగழாళర్ = ఖ్యాతిగల వైదికోత్తములు నివసించు ; తిరువాలి = తిరువాలి దివ్యదేశమందు కృపతో వేంచేసియున్న; ఏ వరి వెమ్ శిలై యానుక్కు = అంబులను ఎక్కుపెట్టెడి అందమైన మరియు శత్రువులకు భయంకరమైన విల్లును తన హస్తమునగల సర్వేశ్వరునికి; ఎన్నిలైమై ఉరైయాయే = నాయొక్క అవస్థను తెలియజేయుమా!.
రెక్కలను చాచి పుష్పములను మధియించి, తన భాగస్వామిని విడువక పుష్పములు వికసించగ వాటియందు తేనెను గ్రోలుచుండెడి చుక్కలు మరియు చారలుగల ఓ చిన్న భ్రమరమా!,అగ్ని సంబంధిత కార్యములను విస్తారముగ వ్యాపించునట్లు వేద మర్యాదలను ఏవిధమైన కొరతలేక నడిపించెడి ఖ్యాతిగల వైదికోత్తములు నివసించు తిరువాలి దివ్యదేశమందు కృపతో వేంచేసియున్న,అంబులను ఎక్కుపెట్టెడి అందమైన మరియు శత్రువులకు భయంకరమైన విల్లును తన హస్తమునగల సర్వేశ్వరునికి నాయొక్క అవస్థను తెలియజేయుమా!.
పిణి యవిழுమ్ నఱునీల, మలర్ కిழிయ ప్పెడైయోడుమ్,
అణిమలర్ మేల్ మదునుగరుమ్, అఱుకాల శిఱువణ్డే,
మణికెழுనీర్ మరుఙ్గు అలరుమ్, వయల్ ఆలి మణవాలన్,
పణి యఱియేన్ నీ శెన్ఱు, ఎన్ పయలై నోయ్ ఉరైయాయే ll 1199
పిణి అవిழுమ్=వికసించుచున్న, నఱు నీల మలర్=పరిమళభరితమైన నీలోత్పములు; కిழிయ = ఛిన్నభిన్నమగునట్లు; పెడై యొడుమ్ = తన ఆడ భ్రమరముతో కూడి; అణిమలర్ మేల్ మదు నుగరుమ్ = అందమైన ఆ పుష్పములందుండి తేనెను గ్రోలుచుండెడి; అఱు కాల శిఱు వణ్డే = ఆరు కాళ్ళుగల ఓ చిన్న భ్రమరమా!;మణి = అందమైన; కెழுనీర్ =ఎర్ర కలువపువ్వులు; మరుఙ్గు=నలుప్రక్కల; అలరుమ్= వికసించెడి;వయల్=పొలములు గల; ఆలి మణవాలన్ = తిరువాలియందు వేంచేసియున్న ప్రభువు యొక్క; పణి = చర్యలు; అఱియేన్=ఇట్టివని ఎఱుగకున్నాను; నీ శెన్ఱు = నీవు పోయి;ఎన్ పయలై నోయ్ = నాయొక్క పాలిపోవుచున్న ఈ శరీర వ్యధను; ఉరైయాయే = తెలియజేయుమా!
వికసించుచున్న పరిమళభరితమైన నీలోత్పములు ఛిన్నభిన్నమగునట్లు తన ఆడ భ్రమరముతో కూడి అందమైన ఆ పుష్పములందుండి తేనెను గ్రోలుచుండెడి ఆరు కాళ్ళుగల ఓ చిన్న భ్రమరమా!, అందమైన ఎర్ర కలువపువ్వులు నలుప్రక్కల వికసించెడి పొలములు గల తిరువాలియందు వేంచేసియున్న ప్రభువు యొక్క చర్యలు ఇట్టివని ఎఱుగకున్నాను. నీవు పోయి ( నాతో విహరించి విడిచిపెట్టి పోయినమొదలు) నాయొక్క పాలిపోవుచున్న ఈ శరీర వ్యధను తెలియజేయుమా!.
నీర్ వానమ్ మణ్ ఎరి కాలాయ్, నిన్ఱ నెడుమాల్, తన్
తారాయ నఱు తుళబమ్, పెఱున్దగైయేఱ్కు అరుళానే,
శీరారుమ్ వళర్ పొழிల్ శూழ், తిరువాలి వయల్ వాழுమ్,
కూర్ వాయ శిఱుకురుగే, కుఱిప్పఱిన్దు కూఱాయే ll 1200
నీర్ వానమ్ మణ్ ఎరి కాలాయ్ నిన్ఱ నెడుమాల్=జలము,ఆకాశము,భూమి,అగ్ని, వాయువు మొదలగు పంచభూతములకు నిర్వాకుడైన సర్వేశ్వరుడు; తన్ తారాయ నఱు తుళబమ్ = తనయొక్క పరిమళభరితమైన తులసీదళముల మాలను,పెఱుమ్ తగైయేఱ్కు = మిక్కిలి సముచితముగ పొందదగిన నాకు; అరుళానే = కృపతో ఒసుగుటలేదే!; శీర్ ఆరుమ్ = శ్లాఘ్యముగ;వళర్ పొழிల్ శూழ் = వృద్ధిపొందుచున్న తోటలతో చుట్టుకొనియున్న; తిరువాలి=తిరువాలి మహానగరములో;వయల్ వాழுమ్ = పొలములలో నివసించుచున్న; కూర్ వాయ శిఱు కురుగే = వాడియైన ముక్కుగల చిన్న కొంగపక్షీ!; కుఱిప్పు అఱిన్దు =(తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామి యొక్క) మనోభిప్రాయమును తెలుసుకొని; కూఱాయే = నాకు చెప్పుమా!.
జలము,ఆకాశము,భూమి,అగ్ని, వాయువు మొదలగు పంచభూతములకు నిర్వాకుడైన సర్వేశ్వరుడు తనయొక్క పరిమళభరితమైన తులసీదళముల మాలను మిక్కిలి సముచితముగ పొందదగిన నాకు (ఉజ్జీవింపేజేయునట్టి దానిని) ఒసుగుటలేదే!.శ్లాఘ్యముగ వృద్ధిపొందుచున్న తోటలతో చుట్టుకొనియున్న తిరువాలి మహానగరములో పొలములలో నివసించుచున్న వాడియైన ముక్కుగల చిన్న కొంగపక్షీ! తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నాస్వామి యొక్క మనోభిప్రాయమును తెలుసుకొని నాకు చెప్పుమా!.
తానాక నినైయానేల్, తన్ నినైన్దు నైవేఱ్కు, ఓర్
మీనాయ్ కొడి నెడువేళ్, వలిశెయ్య మెలివేనో,
తేన్ వాయ వరివణ్డే, తిరువాలి నగరాళుమ్,
ఆనాయఱ్కు ఎన్ ఉఱునోయ్, అఱియ చ్చెన్ఱురైయాయే ll 1201
తాన్ ఆగ = తాను స్వయముగ; నినైయాన్ ఏల్ = నన్ను తలచకుండినను; తన్ నినైన్దు నైవేఱ్కు = అతనినే స్మరించుచు వ్యథచెందుచున్న నన్ను; ఓర్ మీనాయ్ కొడి నెడువేళ్ వలి శెయ్య=అనుపమాన మీనమును ధ్వజముగగల మన్మధుడు వేధించినచో; మెలివేనో = బాధపడుచుందునా?; తేన్ వాయ వరి వణ్డే = తేనెవలె మధురమైన వాక్కులును, రేఖలుగల భ్రమరమా!;తిరువాలి నగర్ ఆళుమ్=తిరువాలి దివ్యదేశమును పాలించుచున్న; ఆన్ ఆయఱ్కు శెన్ఱు = గోపాలకృష్ణుని చెంతకు పోయి;ఎన్ ఉఱునోయ్=నాకు కలిగిన అధికమైన మనోవ్యాధిని; అఱియ ఉరైయాయే = తెలుసుకొనునట్లు మీరు చెప్పవలెనుసుమా!.
తాను స్వయముగ నన్ను తలచకుండినను అతనినే స్మరించుచు వ్యథచెందుచున్న నన్ను, అనుపమాన మీనమును ధ్వజముగగల మన్మధుడు వేధించినచో బాధపడుచుందునా? తేనెవలె మధురమైన వాక్కులును, రేఖలుగల భ్రమరమా! తిరువాలి దివ్యదేశమును పాలించుచున్న గోపాలకృష్ణుని చెంతకు పోయి నాకు కలిగిన అధికమైన మనోవ్యాధిని తెలుసుకొనునట్లు మీరు చెప్పవలెనుసుమా!.
వాళాయ కణ్ పనిప్ప, మెన్ ములైగళ్ పొన్నరుమ్బ,
నాళ్ ణాళుమ్, నిన్ నినైన్దు నైవేఱ్కు, ఓమణ్ణళన్ద
తాళాళా తణ్ కుడందై నగరాళా,వరైయెడుత్త
తోళాళా, ఎన్ఱనక్కోర్, తుణైయాళన్ ఆకాయే ll 1202
ఓ మణ్ అళన్ద తాళాళా = భూమండలమును కొలిచిన దివ్య చరణములుగలవాడా!;ఓ తణ్ కుడందై నగరాళా=చల్లని తిరుకుడందై దివ్యదేశమును పాలించుచున్నవాడా!; వరై యెడుత్త తోళాళా = గోవర్ధన పర్వతమును గొడుగువలె పైకెత్తిపట్టుకొనిన దివ్యమైన భుజములుగలవాడా!;వాళ్ ఆయ కణ్ పనిప్ప = వాడియైన కత్తివలె నున్న నా కన్నులనుండి కన్నీరు నిలువక కారుచు;మెన్ ములైగళ్ =మృదువైన నావక్షోజములు; పొన్ అరుమ్బ = పాలిపోవుచు; నాళ్ నాళుమ్ = ప్రతిదినము; నిన్ నినైన్దు నైవేఱ్కు = నిన్నే స్మరించుచు వ్యథచెందుచున్నటివంటి;ఎన్ఱనక్కు = నాకు; ఓర్ తుణైయాళన్ ఆకాయే = ఒక విశిష్ఠమైన సహాయభూతడగుమా!.
భూమండలమును కొలిచిన దివ్య చరణములుగలవాడా!,చల్లని తిరుకుడందై దివ్యదేశమును పాలించుచున్నవాడా!,గోవర్ధన పర్వతమును గొడుగువలె పైకెత్తిపట్టుకొనిన దివ్యమైన భుజములు గలవాడా!,వాడియైన కత్తివలె నున్న నా కన్నులనుండి కన్నీరు ఏకధాటిగా కారుచు, మృదువైన నావక్షోజములు పాలిపోవుచు ప్రతిదినము నిన్నే స్మరించుచు వ్యథచెందుచున్నటివంటి నాకు ఒక విశిష్ఠమైన సహాయభూతడగుమా!.
తారాయ తణ్ తుళవ, వణ్డు ఉழுద వరై మార్బన్,
పోరానై కొమ్బొశిత్త, పుట్పాగన్ ఎన్నమ్మాన్,
తేరారుమ్ నెడువీది, తిరువాలి నగరాళుమ్,
కారాయన్ ఎన్నుడైయ, కనవళైయుమ్ కవర్వానో ll 1203
తారాయ తణ్ తుళవమ్ = చల్లని తులసీమాలయందు;వణ్డు = తుమ్మెదలచే; ఉழுద = తేనె మొదలగు వాటిచే బురద చేయబడిన;వరై మార్బన్=పర్వతము పోలిన వక్షస్థలము కలవాడును; పోర్ ఆనై = పోరాటమునకు వచ్చిన కువలయాపీడమను ఏనుగుయొక్క; కొమ్బు ఒశిత్త=దంతములను విరిచి వధించినవాడును;పుళ్ పాగన్= గరుడాళ్వార్ ను వాహనముగ చేసుకొన్నవాడును;ఎన్ అమ్మాన్= నాయొక్క స్వామియు; తేర్ ఆరుమ్ నెడు వీది = దివ్యమైన రథముపై అధిష్ఠించి వచ్చుటకు వీలుగ నున్న పెద్ద వీధులుగల; తిరువాలి నగర్ ఆళుమ్ = తిరువాలి దివ్యదేశమును పాలించుచున్న; కార్ ఆయన్ = నల్లని వర్ణముకలిగిన శ్రీకృష్ణుడు;ఎన్నుడైయ కనవళైయుమ్ కవర్వానో= నాయొక్క బంగారు కంకణములును అపహరించునో! (ఇది తగునో!)
చల్లని తులసీమాలయందు తుమ్మెదలచే తేనె మొదలగు వాటిచే బురద చేయబడిన పర్వతము పోలిన వక్షస్థలము కలవాడును పోరాటమునకు వచ్చిన కువలయాపీడమను ఏనుగుయొక్క దంతములను విరిచి వధించినవాడును, గరుడాళ్వార్ ను వాహనముగ చేసుకొన్నవాడును,నాయొక్క స్వామియు,దివ్యమైన రథముపై అధిష్ఠించి వచ్చుటకు వీలుగ నున్న పెద్ద వీధులుగల తిరువాలి దివ్యదేశమును పాలించుచున్న,నల్లని వర్ణముకలిగిన శ్రీకృష్ణుడు నాయొక్క బంగారు కంకణములును అపహరించునో! (ఇది తగునో!)
కొణ్డు అరవ త్తిరైయులవు, కురైకడల్ మేల్ కులవరైపోల్,
పణ్డు అరవినణై క్కిడన్దు, పార్ అళన్ద పణ్బాళా,
వణ్డు అమరుమ్ వళర్ పొழிల్ శూழ், వయలాలి మైన్దా, ఎన్
కణ్ తుయిల్ నీ కొణ్డాయ్ క్కు, ఎన్ కనవళైయుమ్ కడవేనో ll 1204
పణ్డు = పూర్వమొక కాలమున; అరవమ్ తిరై ఉలవు = ఘోషించెడి అలలుకొట్టుచున్న; కురై కడల్ మేల్ = విశాలమైన పాలసముద్రమందు;కొణ్డు=తన దివ్య సంకల్పమున ఎంచుకొని;అరవు ఇన్ అణై=ఆదిశేషుని అతిసున్నితమైన తల్పమునందు;కులవరైపోల్= శ్లాఘ్యమైన పర్వతమువలె; కిడన్దు = శయనించి;పార్ అళన్ద పణ్బు ఆళా =(త్రివిక్రముడై) భూమండలమును కొలిచిన దయాళుడా!; వణ్డు అమరుమ్ వళర్ పొழிల్ శూழ் = తుమ్మెదలు కలిగిన ఎదిగియున్న తోటలచే చుట్టుకొనియున్న;వయల్ = పొలములుగల; ఆలి=తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న;మైన్దా=నిత్యయౌవనుడైన సర్వేశ్వరుడా; ఎన్ కణ్ తుయిల్ =నా కంటినిద్రను; నీ కొణ్డాయ్ క్కు =అపహరించిన నీకు; ఎన్ కన వళైయుమ్ =నాయొక్క బంగారు కంకణములును కూడ; కడవేనో = పోగొట్టకొనవలనా?
పూర్వమొక కాలమున (భక్తులు విన్నవించుకొనుటకు వీలుగ) ఘోషించెడి అలలుకొట్టుచున్న విశాలమైన పాలసముద్రమందు, తన దివ్య సంకల్పమున ఎంచుకొని ఆదిశేషుని అతిసున్నితమైన తల్పమునందు శ్లాఘ్యమైన పర్వతమువలె శయనించి,(దేవేంద్రుడు ప్రార్ధింపగ) త్రివిక్రముడై భూమండలమును కొలిచిన దయాళుడా!, తుమ్మెదలు కలిగిన ఎదిగియున్న తోటలచే చుట్టుకొనియున్న,పొలములుగల తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న నిత్యయౌవనుడైన సర్వేశ్వరుడా!,నా కంటినిద్రను అపహరించిన నీకు నాయొక్క బంగారు కంకణములును కూడ పోగొట్టకొనవలనా? ( ఇది ఎటువంటి చేష్ఠితము స్వామీ!)
** కుయిలాలుమ్ వళర్ పొழிల్ శూழ், తణ్ కుడన్దై క్కుడమాడీ!,
తుయిలాద కణ్ణిణైయేన్, నిన్ నినైన్దు తుయర్వేనో,
ముయల్ ఆలుమ్ ఇళమదిక్కే, వళైయిழన్దేఱ్కు, ఇదునడువే
వయలాలి మణవాళా, కొళ్వాయో మణినిఱమే ll 1205
కుయిల్ ఆలుమ్ = కోకిలములు సంతోషముతో ఆటలాడుచున్న; వళర్ పొழிల్ శూழ்=ఎదిగియున్న తోటలచే చుట్టుకొనియున్న, తణ్ కుడన్దై కుడమాడీ! = చల్లని తిరుకుడందై దివ్యదేశమున(పూర్వము గోకులమందు గోపస్త్రీల కనువిందుగ ఆడిన) కుంభ నృత్యము చేసిన (అట్టి సౌశీల్యముగల సర్వేశ్వరా!;తుయిలాద కణ్ ఇణైయేన్ = నిదురలేని కన్నులుగల నేను; నిన్ నినైన్దు తుయర్వేనో = నిన్ను తలచుకొనుచు బాధపడుచునేఉందునా?; ముయల్ ఆలుమ్ = కుందేలు గెంతులువేయుచు ఆడుచుండు;ఇళ మదిక్కే = బాల చంద్రునికే; (నీ విరహ తాపమధికమై)వళై ఇழన్దేఱ్కు=కంకణములను పోగొట్టుకొనిన నాకు;ఇదునడువే = ఈ సంబంధిత దుఃఖమున; వయల్ = పొలములు గల; ఆలి = తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న; మణవాళా = ప్రభువా!; మణి నిఱమే = నాయొక్క కాంతిగల ఛాయనుకూడ; కొళ్వాయో = అపహరించెదవో?
కోకిలములు సంతోషముతో ఆటలాడుచున్న ఎదిగియున్న తోటలచే చుట్టుకొనియున్న చల్లని తిరుకుడందై దివ్యదేశమున ( పూర్వము గోకులమందు గోపస్రీల కనువిందుగ ఆడిన) కుంభనృత్యము చేసిన (అట్టి సౌశీల్యముగల) సర్వేశ్వరా! నిదురలేని కన్నులుగల నేను బాధపడుచునే ఉందునా?కుందేలు గెంతులువేయుచు ఆడుచుండు బాల చంద్రునికే (నీ విరహ తాపమధికమై) కంకణములను పోగొట్టుకొనిన నాకు, ఇట్టి దుఃఖ సమయమున పొలములు గల తిరువాలియందు వేంచేసియున్న ప్రభువా! నాయొక్క కాంతిగల ఛాయనుకూడ అపహరించెదవో?
నిలైయాళా నిన్ వణఙ్గ, వేణ్డాయే యాగిలుమ్, ఎన్
ములై యాళ వొరునాళ్, ఉన్ అగలత్తాల్ ఆళాయే,
శిలైయాళా మరమెయ్ ద తిఱలాళా, తిరుమెయ్య
మలైయాళా, నీయాళ వళైయాళ మాట్టోమే ll 1206
శిలై ఆళా = శార్ఙ్గమను విల్లును దివ్యమైన హస్తమునగలవాడా!; మరమ్ ఎయ్ ద తిఱల్ ఆళా = (సుగ్రీవుడు విశ్వసించుటకై) సప్త సాలవృక్షములను ఒక్క బాణముచే కూలగొట్టిన మిక్కిలి శక్తివంతమైనవాడా!; తిరుమెయ్య మలై ఆళా = తిరుమెయ్యమనుదివ్యదేశమును పాలించుచున్నవాడా!; నిలై ఆళ్ ఆ నిన్ వణఙ్గ వేణ్డాయే ఆగిలుమ్ = తగు నిశ్చయముతో శరణజొచ్చి నిన్ను నేను సేవించునట్లు మనస్సున కోరకుండినను; ఒరు నాళ్ = ఒక్క దినమైనను;ఎన్ ములై ఆళ=నాయొక్క వక్షోజములు సేవ నిర్వర్తింప; ఉన్ అగలత్తాల్ ఆళాయే=నీయొక్క విశాలమైన వక్షస్థలముతో హత్తుకొనుమా!;నీ ఆళ=నీవు పరిపాలించగ; వళై ఆళ మాట్టోమే = చేతియందు కంకణములు ఉండెడి సమస్య ఉండునో? ( నీ వియోగములేక నీతో కూడియున్నందున ఆనందాతిశయముతో శరీర సౌష్ఠవముచే కంకణములు జారిపోయెడి ప్రశ్నలేక పగులునని భావము)
శార్ఙ్గమను విల్లును దివ్యమైన హస్తమునగలవాడా!, సుగ్రీవుడు విశ్వసించుటకై సప్త సాలవృక్షములను ఒక్క బాణముచే కూలగొట్టిన మిక్కిలి శక్తివంతమైనవాడా!, తిరుమెయ్యమను దివ్యదేశమును పాలించుచున్నవాడా! తగు నిశ్చయముతో శరణజొచ్చి నిన్ను నేను సేవించునట్లు మనస్సున కోరకుండినను,ఒక్క దినమైనను నాయొక్క వక్షోజములు సేవ నిర్వర్తింప నీయొక్క విశాలమైన వక్షస్థలముతో హత్తుకొనుమా!, అట్లు నీవు పరిపాలించగ నాయొక్క చేతియందు కంకణములు ఉండెడి సమస్య ఉండునో? నీ వియోగములేక నీతో కూడియున్నందున ఆనందాతిశయముతో కంకణములను చేతియందు కలిగియుండుట శఖ్యమగునా?
** మైయిలఙ్గు కరుఙ్గువళై, మరుఙ్గలరుమ్ వయలాలి,
నెయిలఙ్గు శుడరాழி, ప్పడైయానై నెడుమాలై,
కైయిలఙ్గు వేల్ కలియన్, కణ్డు ఉరైత్త తమిழ் మాలై,
ఐయిరణ్డు మివై వల్లార్కు, అరువినై గళ్ అడైయావే ll 1207
కై ఇలఙ్గు వేల్ కలియన్ = హస్తమున ప్రకాశించు బల్లెముగల తిరుమంగై ఆళ్వార్; మై ఇలఙ్గు కరుమ్ కువళై=కాటుకవలె ప్రకాశించు నల్లని నీలోత్పములు; మరుఙ్గు అలరుమ్ వయల్ ఆలి = సమీపములందు వికసించుచుండబడు పొలములుగల తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న; నెయ్ ఇలఙ్గు శుడర్ ఆழி పడైయానై =స్థూలముగ ప్రకాశించుచున్న జ్వలించెడి చక్రాయుధమును హస్తమున కలవానిని; నెడుమాలై = సర్వేశ్వరుని; కణ్డు ఉరైత్త = సేవించి చెప్పిన; తమిழ் మాలై = తమిళ భాషలో సూక్తుల మాలగనున్న; ఇవై ఐన్దు ఇరణ్డుమ్ = ఈ పదిపాశురములను; వల్లార్కు = అనుసంధించువారికి; అరువినై గళ్ = దుష్కకర్మములు; అడైయావే = చేరలేవుసుమా!
హస్తమున ప్రకాశించు బల్లెముగల తిరుమంగై ఆళ్వార్,కాటుకవలె ప్రకాశించు నల్లని నీలోత్పములు సమీపములందు వికసించుచుండబడు పొలములుగల తిరువాలి దివ్యదేశమందు వేంచేసియున్న స్థూలముగ ప్రకాశించుచున్న, జ్వలించెడి చక్రాయుధమును హస్తమున కలవానిని,సర్వేశ్వరుని,సేవించి చెప్పిన తమిళ భాషలో సూక్తుల మాలగనున్న ఈ పదిపాశురములను అనుసంధించువారికి దుష్కకర్మములు చేరలేవుసుమా!
******