శ్రీః
8. నన్దావిళక్కే
అవతారిక : తిరు మణిమాడక్కోయిల్ దివ్య దేశమును సందర్శించిన తిరుమంగై ఆళ్వారులు , తానుస్వయం సర్వేశ్వరునిచే తిరుమంత్రోపదేశమును పొందనది ధ్యానించి, మిక్కిలి వ్యామోహితులై , పరమపదమందు దర్శన దుర్లభుడైన పరంజ్యోతి స్వరూపుడైన శ్రీ మన్నారాయణుని , బ్రహ్మాది దేవతలు ఈ దివ్యదేశమునకు వచ్చి అతి సులభముగ సేవించి తరించుచుండగ , అట్టి దివ్య దేశమును ఆశ్రయించి ఉజ్జీవింపుమని తన మనస్సునకు ప్రభోదించుచున్నారు .
** నన్దావిళక్కే! అళత్తఱ్కరియాయ్! , నరనారాణనే! కరుమాముగిల్ పోల్
ఎన్దాయ్! , ఎమక్కే యరుళాయెననిన్ఱు, ఇమైయోర్ పరవుమిడమ్, ఎత్తిశైయుమ్
కన్దారమన్దేన్ ఇశైపాడమాడే, కళివణ్డు మిழర్ట్ర నిழల్ తుదైన్దు,
మన్దారనిన్ఱు మణమల్గు నాఙ్గూర్, మణిమాడక్కోయిల్ వణఙ్గెన్ మననే! 1218
నన్దావిళక్కే! = నిత్యమైన, స్యయంప్రకాశమైన ఙ్ఞాన స్వరూపా! ; అళత్తఱ్కు అరియాయ్ = గ్రహింప శక్యము కానివాడా!; నరనారాణనే = నరనారాయణ అవతారములో వేంచేసిన నాస్వామీ!; కరుమాముగిల్ పోల్ ఎన్దాయ్ = నల్లని పెద్ద మేఘము పోలిన నాస్వామీ!;ఎమక్కే = నిన్నే ఆశ్రయించియున్న మాకు; అరుళాయ్ ఎన = కృపజేయుమని వేడుకొనుచు; నిన్ఱు = ఈ భూమికి దిగి వచ్చి ; ఇమైయోర్ = దేవతలు ;పరవుమిడమ్ = స్తుతించు దివ్యదేశమును; అమ్ తేన్ = అందమైన భ్రమరములచే; ఎత్తిశైయుమ్ = ప్రదేశమంతటను; కన్దారమ్=దేవగాంధార రాగములో;ఇశైపాడ=ఇంపుగ శబ్దింపబడుచును;మాడే=చుట్టుప్రక్కల; కళివణ్డు= మధుపానముచే మదించిన తుమ్మెదలచే; మిழర్ట్ర=ఝంకారము చేయబడుచును; మన్దారమ్ = పారిజాతవృక్షములు; నిழల్ తుదైన్దు = నీడలొసగునట్లు దగ్గరగా చేరియుండబడి ;మణమల్గు = పరిమళముతో నిండియున్న;నాఙ్గూర్ = నాఙ్గూరులో; మణిమాడక్కోయిల్ = మణిమాడక్కోయిల్ దివ్య దేశమును; ఎన్ మననే = ఓ! నామనసా! ; వణఙ్గు = శరణుజొచ్చుమా !
బహ్మాది మొదలగు దేవతలు ఒక్కొక్కరు ఈ భూమికి దిగి వచ్చి నరనారాయణావతారములో వేంచేసిన నీలమేఘశ్యాముడైన పెరుమాళును ఉద్దేశించి ” ఓ జ్ఞాన స్వరూపా! ఎంతటివారికైనా గ్రహింప శక్యము కానివాడా! నా స్వామీ! నీకే శరణుజొచ్చియున్న నాకు కృపచేయుమా ” అని పలువిదములగ స్తుతించుచున్నదియు, పరిమళముతోపాటు , దట్టముగ చేరియున్న పారిజాతచెట్లచే చల్లని నీడ అంతటను వ్యాపింపచేయబడగ , ఆ నీడలో అందమయిన భ్రమరములు మధుపానముచే మదించి దేవగాంధార రాగములో చెవులకు ఇంపుగ ఝంకారము చేయచుండునదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన తిరుమణిమాడకోయిల్ దివ్య దేశమును, ఓ! నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!
ముదలైత్తని మా మురణ్ తీర అన్ఱు , ముదునీర్ తడత్తు శెఙ్గణ్ వేழముయ్య,
విదలైత్తలై శెన్ఱదఱ్కే యుదవి , వినైతీర్తవమ్మానిడమ్, విణ్ణణవుమ్
పదలై కపోదత్తు ఒళిమాడ నెర్ట్రి , పవళ కొழுఙ్గాల పైఙ్గాల్ పుఱవుమ్,
మదలైత్తలై మెన్బెడైకూడు నాఙ్గూర్ , మణిమాడక్కోయిల్ వణఙ్గెన్ మననే! 1219
అన్ఱు = పూర్వము ఒకప్పుడు;ముదునీర్ తడత్త = లోతైన నీరుగల తటాకమందున్న ; ముదలై = మొసలి యొక్క ; తని = సాటిలేని; మా మురణ్ తీర = గొప్ప బలము నశించునట్లు; శెఙ్గణ్ వేழమ్ = ఎఱ్ఱని కన్నులతోనున్న గజేంద్రుడు; ఉయ్య = ఉజ్జీవించునట్లు; విదలైత్తలై శెన్ఱు = మిక్కిలి ఆపదలోనున్న సమయమున వేంచేసి ; అదఱ్కే ఉదవి = ఆ గజేంద్రునికి సహాయము చేసి ; వినై తీర్త = అతని కష్టమును తొలగించిన ; అమ్మానిడమ్ = సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును ; విణ్ అణవుమ్ = ఆకాశము స్పుసించునవై ; పదలై కపోతమ్ = కలశములతోను , కపోతముల గూళ్ళతోను కూడినవై ; ఒళి = రత్నములచే ప్రకాశించు ; మాడ నెర్ట్రి = భవన ప్రాంగణములలో ;పవళమ్ కొழுఙ్గాల = పగడము వంటి ఎఱ్ఱని పాదములు ; పైఙ్గాల్ = ఆకుపచ్చని కాళ్ళుగల ; పుఱవుమ్ =పావురములు ; మదలైత్తలై = చిన్న స్తంబములపై ఉన్న ; మెన్ = మృదువైన ; పెడైకూడు = తమ ఆడుపావురములతో జతకూడియున్న ;నాఙ్గూర్ = నాఙ్గూరులో ; మణిమాడక్కోయిల్ = మణిమాడక్కోయిల్ దివ్యదేశమును ; ఎన్ మననే = ఓ నామనసా ! ; వణఙ్గు = శరణుజొచ్చుమా! .
పూర్వము తామరపూలతో నిండిన తటాకమందు, మొసలి నోట చిక్కిన గజేంద్రుడు బలముడిగి శ్రీమన్నారాయణుని శరణుజొచ్చగ, మొసలిని వధించి గజేంద్రుని సంరక్షించిన సర్వేశ్వరుడు, కృపతో వేంచేసిన దివ్య దేశమును, కలశములతోడను, కపోతముల గూళ్ళతోడను కూడి, రత్నములచే ప్రకాశించు ఉన్నత భవనప్రాంగణములలో అందమైన పావురములు చిన్న చిన్న స్తంబములపై ఉన్న మృదువైన ఆడుపావురములతో జతకూడి యుండునదియు,నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన మణిమాడక్కోయిల్ దివ్య దేశమును,ఓ! నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!
కొలై పుణ్ తలై కున్ఱ మొన్ఱుయ్య , అన్ఱు కొడుమాముదలైక్కిడర్ శెయ్ దు , కొఙ్గార
ఇలై పుణ్డరీకత్తవళ్ ఇన్బమన్బోడు , అణైన్దిట్ట అమ్మానిడమ్ , ఆళరియాల్
అలైప్పుణ్డయానై మరప్పుం అకిలుం , అణిముత్తుం వెణ్ శామరై యోడు , పొన్ని
మలై పణ్డమ్ అణ్డ తిరైయున్దు నాఙ్గూర్ , మణిమాడక్కోయిల్ వణఙ్గెన్ మననే. 1220
అన్ఱు = పూర్వము ఒకప్పుడు ; కొలై పుణ్ తలై = కొట్లాటలలో క్షతిపొందిన తలగల ;కున్ఱమ్ ఒన్ఱు = పర్వతముపోలిన గజేంద్రుడు;ఉయ్య = ఉజ్జీవించునట్లు; కొడుమా ముదలైక్కు = క్రూరమైన,బలమైన మొసలినకు ; ఇడర్ శెయ్ దు = కష్టము కలిగించి ; కొఙ్గార్=పరిమళముతోనిండి;ఇలై = ఆకులతోనుండు; పుణ్డరీకత్తవళ్ = తామరపుష్పవాసినిని; ఇన్బమ్=ఆనందముతో ;అమ్బోడు=మిక్కిలి ప్రేమతో; అణైన్దిట్ట= కౌగిలించిన ; అమ్మానిడమ్= సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును; పొన్ని = కావేరి నది ;ఆళ్ అరియాల్ = వీర సింహములచే ;అలైప్పుణ్డ ఆనై = సంహరింపబడడిన ఏనుగులయొక్క ; మరప్పుం = దంతములను ; అకిలుం = అగురు చెట్లను ; అణి ముత్తుం=అందమైన ముత్యములును ;వెణ్ శామరై యోడు= తెల్ల చామరలతోకూడ (ఒకరకపు లేడి పృచ్ఛములు); మలై పణ్డమ్ అణ్డ = పర్వతములపై ఉండెడి ఇతర వస్తువులను ;తిరైయున్దు = అలలచే చేర్చ;నాఙ్గూర్= నాఙ్గూరులో ;మణిమాడక్కోయిల్ = మణిమాడక్కోయిల్ దివ్యదేశమును; ఎన్ మననే ఓ నామనసా;వణఙ్గు = శరణుజొచ్చుమా!.
క్రూరమైన బలిష్టమైన మొసలి నోటికోరలలో చిక్కి శక్తినశించిన గజేంద్రుడు ఎలుగెత్తి శ్రీమన్నారాయణుని శరణువేడగ , మొసలిని వధించి గజేంద్రుని ఉజ్జీవింపచేసినప్పుడు,తన ఆశ్రితుడు గజేంద్రుడు పొందిన ఆనందమును గాంచి, ప్రీతితో కమలవాసినిని కౌగిలించికొన్న సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, శరవేగముతో ప్రవహంచు కావేరినది తన అలలచే, సింహములచే చంపబడిన ఏనుగు దంతములను,సువాసనకలిగిన అగురు చెట్లను, తెల్లని చామరలతోకూడ పర్వతములపై ఉండెడి ఇతర వస్తువులను చేర్చు ప్రదేశమును, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన తిరుమణిమాడకోయిల్ దివ్య దేశమును ఓ! నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా! .
శిఱైయార్ ఉవణ ప్పుళ్ళొన్ఱేఱి , అన్ఱు తిశై నాన్గునాన్గుమ్ ఇరియ ,శెరువిల్
కఱైయార్ నెడువేల్ అరక్కర్ మడియ , కడల్ శూழ் ఇలఙ్గై కడన్దానిడన్దాన్ ,
ముఱైయాల్ వళర్కిన్ఱ ముత్తీయర్ నాల్వేదర్ , ఐవేళ్వి ఆరఙ్గర్ ఏழிనిశైయోర్
మఱైయోర్ వణఙ్గ పుకழெయ్ దు నాఙ్గూర్, మణిమాడక్కోయిల్ వణఙ్గెన్మననే! 1221
అన్ఱు = పూర్వము ఒకప్పుడు; శిఱైయార్ = రెక్కలతో కూడిన ; ఒన్ఱు = సాటిలేని ;ఉవణప్పుళ్ = గరుడాళ్వార్ పై; ఏఱి = ఎక్కి వేంచేసి;శెరువిల్ = యద్దములో ఎదిరించిన) ; కఱైయార్ = రక్తమరకలతో నిండిన;నెడు వేల్ = పెద్ద బల్లెములుగల; అరక్కర్ = రాక్షసులు ; తిశై నాన్గునాన్గుమ్ = ఎనిమిది దిక్కులలోను ; ఇరియ = పరుగెడునటులను ; మడియ = (పలువురు) చచ్చునట్లు చేసి ; కడల్ శూழ் = సముద్రముచే చుట్టుకొనియున్న ; ఇలఙ్గై = లంకాపురిని;కడన్దాన్ = నాశనముచేసిన ; ఇడన్దాన్! = సర్వేశ్వరుడు వేంచేసిన దివ్య దేశమే!;ముఱైయాల్ = వేదము నుడివిన క్రమములో ;వళర్కిన్ఱ ముత్తీయర్ = హోమము చేయుచున్న మూడు అగ్నిహోత్రములు కలవారును ; నాల్వేదర్ = నాల్గువేదములు తెలిసినవారును ; ఐవేళ్వి = పంచ మహాయఙ్ఞములను అనుష్టించువారును ;ఆఱు అఙ్గర్ = వేదము యొక్క ఆరు అంగములను అభ్యసించినవారును ; ఏழிన్ ఇశైయోర్ = సప్తస్వరములతో కూడిన ఇంపైనరాగములు తెలిసినవారును ; మఱైయోర్ = వేదబ్రాహ్మణోత్తములు ; వణఙ్గ = ఆశ్రయించి యుండుటచే ; పుకழ் ఎయ్ దు = విఖ్యాతిపొందిన ; నాఙ్గూర్ = నాఙ్గూరులో; మణిమాడక్కోయిల్ = మణిమాడక్కోయిల్ దివ్య దేశమును; ఎన్ మననే = ఓ! నామనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా !
పూర్వము ఒకప్పుడు లంకాపురిలో దుష్టులైన మాలి, సుమాలి , మాల్యవాన్ మొదలగు అనేక రాక్షసులను శిక్షించుటకై , గరుడాళ్వార్ పైన వేంచేసి పెక్కుమంది రాక్షసులను వధించియు, తదితరులు భీతితో అన్నిదిక్కులయందును పారిపోవునటుల గొప్ప పోరుసలిపిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, వేదములయందు వివరించినటుల హోమముచేయు మూడు అగ్నులు కలవారును, నాలుగు వేదములు నెఱింగినవారును , పంచయఙ్ఞములు అనుష్టించువారును, వేదముల యొక్క ఆరుఅంగములను అభ్యసించినవారును, సంగీతవిద్వాంసులును , అయిన భ్రాహ్మణోత్తములు ఆశ్రయించియుండుటచే విఖ్యాతి పొందినదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన తిరుమణిమాడకోయిల్ దివ్య దేశమును ఓ! నామనసా ! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!
ఇழைయాడు కొంగైత్తలై నఞ్జముణ్డిట్టు ,ఇళఙ్గన్ఱుకొణ్డు విళఙ్గాయ్ ఎఱిన్దు ,
తழைవాడ వన్ తాళ్ కురున్దమొశిత్తు , తడన్దామరై ప్పొయ్ గై పుక్కానిడన్దాన్ ,
కుழைయాడ వల్లిక్కులమ్ ఆడ మాడే , కుయిల్ కూవ నీడు కొడిమాడమల్ గు
మழைయాడు శోలై మయిలాలు నాఙ్గూర్ , మణిమాడక్కోయిల్ వణఙ్గెన్ మననే!1222
ఇழைయాడ=కదలుచున్న ఆభరణములతోఉన్న; కొఙ్గైతలై = పూతనస్తనములందున్న;నఞ్ఙమ్ = విషమును ; ఉణ్డిట్టు = పూతనప్రాణముకూడ ఆస్వాదించిన వాడును; ఇళఙ్గన్ఱుకొణ్డు=లేతదూడ రూపములో నున్న వత్సాసురును పట్టుకొని; విళఙ్గాయ్ = వెలగపండురూపములోనున్న కపిత్థాసురునిపై; ఎఱిన్దు = విసిరి ఇరువురుని వధించినవాడును; వల్ తాళ్ = గట్టిగా నాటుకున్న వ్రేళ్ళతోనున్న ; కురున్దమ్ = బండిగురుగింజ వృక్షమును ;తழைవాడ = ఆకులతోనున్న కొమ్మలు వాడునట్లు ;ఒశిత్తు = విరిచినవాడును ; తడన్దామరై = తామరపూలతో నిండిన పెద్ద; ప్పొయ్ గై పుక్కాన్ = మడుగుయందు (కాళీయునిదండించుటకై ) ప్రవేశించినవాడును ;అయిన అట్టి సర్వేశ్వరుడు ; ఇడన్దాన్ = కృపతో వేంచేసిన దివ్య దేశమును; కుழைయాడ = చెట్లఆకులకదలికచే ; మాడే = సమీపమందున్న ;వల్లి కులమ్ = పూలతీగల గుంపులు ; ఆడ = మెదలుచున్నవియు ;కుయిల్ కూవ = కోయిలలు ఇంపుగ కూయుచున్నవియు ; మழைయాడు = మేఘములు సంచరించు ; శోలై = పూతోటలలో; మయిల్ ఆలుమ్ = నెమళ్ళ నృత్యములతోను ;నీడు = పెద్ద ; కొడి = ధ్వజములు కలిగిన ;మాడమ్ = భవనములతో; మల్ గు = నిండియున్న ; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో; మణిమాడక్కోయిల్ = మణిమాడక్కోయిల్ దివ్య దేశమును ;ఎన్ మననే = ఓ! నామనసా! ; వణఙ్గు = శరణుజొచ్చుమా!.
యశోదాదేవి తల్లివలె ఆభరణములు ధరించి, పూతన, విషముపూసుకొన్న స్తనములతో పాలివ్వగా, విషముతోపాటు పూతన ప్రాణముకూడహరించినవాడును, లేత దూడరూపములోనున్న వత్సాసురుడనురాక్షసుని పట్టుకొని వెలగపండురూపములోనున్న కపిత్థాసురుడను రాక్షసునిపై విసిరి ఇరువురుని వధించినవాడును, అశురుడు ఆవేశించిన ధృడమైన వేళ్ళతోనున్న బండిగురుగింజ వృక్షమును విరిచినవాడును, కాళీయుని దండించుటకై పెద్ద మడుగుయందుప్రవేశించినవాడును, మొదలగు అనేక దివ్య చేష్టితముల చేసిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, చెట్లఆకులకదలికచే సమీపమందున్న పూలతీగల గుంపులు అందముగ ఊగుచున్నవియు ,కోయిలలు ఇంపుగ కూయుచున్నవియు , మేఘములతో ఆవరింపబడిన పూతోటలతోడను , నెమళ్ళ నృత్యములతోను ,ధ్వజములతో కూడిన భవనములతో వెలయుచున్నదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, మణిమాడక్కోయిల్ దివ్య దేశమును ఓ! నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా! .
పణ్ణేర్ మొழி ఆయ్ చ్చియర్ అఞ్జ , వఞ్జప్పగువాయ్ కழுతుక్కు ఇరఙ్గాదు, అవళ్ తన్
ఉణ్ణాములై మర్ట్రవళావియోడుమ్ , ఉడనే శువైత్తానిడమ్ , ఓఙ్గుపైన్దాళ్
కణ్ణార్ కరుమ్బిన్ కழை తిన్ఱు వైగి , క్కழுనీరిల్ మూழ் గి శెழுనీర్ తడత్తు ,
మణ్ణేన్ది ఇళ మేదిగళ్ వైగు నాఙ్గూర్ , మణిమాడక్కోయిల్ వణఙ్గెన్ మననే! 1223
పణ్ నేర్ మొழி = మృదుమధురమైన వాక్కులుగల ; ఆయ్ చ్చియర్ = గొల్లస్త్రీలు ;అఞ్జ = భయపడు రూపము ; వఞ్జమ్ పగు వాయ్ = కపటమును,పెద్ద నోరుగల ;కழுతుక్కు = (పూతన అను) రాక్షసికి ; ఇరఙ్గాదు = తాను ఎటువంటి క్లేశము పొందక ; అవళ్ తన్=ఆ పూతనయొక్క;ఉణ్ణాములై = త్రాగశఖ్యముకాని స్తనములందు పాలను ;మర్ట్రవళ్ = మరియు ఆరాక్షసియొక్క; ఆవియోడు = ప్రాణములతోసహా; ఉడనే శువైత్తాన్ = వెంటనే ఆస్వాదించిన సర్వేశ్వరుడు; ఇడన్దాన్ = కృపతో వేంచేసిన దివ్య దేశమును;ఓఙ్గుపైన్దాళ్=పెరిగిన ఆకుపచ్చని మొదళ్ళుగల; కణ్ణార్=కణుపులతొ కూడిన; కరుమ్బిన్ = చెరకు మొక్కలయొక్క ;కழை తిన్ఱు = రెమ్మలు తినుకొని ; వైగి = కొంత సమయము అచటనే గడిపి(పిదప ); కழு నీరిల్ = ఎఱ్ఱ కలువలతో కూడిన ; శెழுనీర్ = అందమైన నీటితోనిండిన; తడత్తు = తటాకములలో; మూழ்గి=మునుగి ; మణ్ణేన్ది = బురదను తమ కొమ్ములపై వేసుకున్న ; ఇళ మేదిగళ్ = బాలగేదలు ; వైగుమ్ = ఆనీటిలో వసించుచున్న ;నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో; మణిమాడక్కోయిల్= మణిమాడక్కోయిల్ దివ్య దేశమును ; ఎన్ మననే = ఓ! నామనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా!
మృదుస్వభావులయిన గోపస్త్రీలు భయభ్రాంతులనుజేయు పెద్ద ,కోరలుగల నోటితోనుండు రూపమును, వంచనచేదాచి ,యశోదాదేవి రూపమునుదాల్చి వచ్చిన పూతన రక్కసివలన ఎటువంటి క్లేశములేక ఆమె స్తనములందున్న విషపాలతోపాటు ఆమెయొక్క ప్రాణముకూడ వెంటనే ఆస్వాదించిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, పొలములలోయున్న చెరకుమొక్కలయొక్క రెమ్మలు తినుకొని, ,అచటనే కొంతసమయము పరుండి, మెల్లగా సమీపమందున్న ఎఱ్ఱకలువలతో కూడిన అందమైన నీటితోనిండిన తటాకములో మునిగి, తమ కొమ్ములుతో బురదను పైకెత్తి, ఆబురదంటిన కొమ్ములతోనే తటాకములోనే తలలు పైకెత్తియున్న బాలగేదెలు గలదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, మణిమాడక్కోయిల్ దివ్య దేశమును ఓ! నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!
తళై కట్టవిழ் తామరై వైగుపొయ్ గై , త్తడమ్ పుక్కు అడఙ్గా విడఙ్గాల్ అరవమ్ ,
ఇళైక్క తిళైత్తిట్టు అదనుచ్చితన్మేల్ , అడివైత్త అమ్మానిడమ్, మామదియమ్
తిళైక్కుమ్ కొడి మాళిగై శూழ் , తెరువిల్ శెழுముత్తు వెణ్ నెఱ్కెన శెన్ఱు , మున్ఱిల్
వళైక్కై నుళైప్పావైయర్ మాఱు నాఞ్గూర్ , మణిమాడక్కోయిల్ వణఙ్గెన్ మననే!1224
తళై = తామరమొగ్గలతోను ; కట్టు అవిழ் = వికసించిన; తామరై = తామరపూలతోను;వైగు=ఉన్న;పొయ్ గై తడమ్=తటాకములో;పుక్కు=ప్రవేశించి;అడఙ్గా=ఆ తటాకమందు లొంగకనివసించునదియు ; విడఙ్గాల్ = విషమును కక్కుచున్న; అరవమ్ = కాళీయుడను సర్పరాజు; ఇళైక్క = కృశించుపోవునట్లు; తిళైత్తిట్టు= దానితో ఆటలాడి ; అదన్ ఉచ్చితన్మేల్ = దాని తలమీద అడివైత్త = పాదములుమోపి కరుణించిన ; అమ్మానిడమ్ = సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును; వళై కై = గాజులను అలంకరించికొనిన చేతులుగల; నుళైప్పావైయర్ = మత్స్యకాంతలు ;మా మదియమ్ = అందమైన చంద్రుడు ; తిళైక్కుమ్ = దోబూచులాడునట్లు; కొడి = ధ్వజములుగల ; మాళిగైశూழ்తెరువిల్ = భవనములతో చుట్టుకొనియున్న వీదులలో; శెழு ముత్తు = శ్లాఘ్యమైన మంచి ముత్యములు ;వెణ్ నెఱ్కెన = తెల్లని బియ్యమునకుహో! అని అరుచుకొనుచు ; మున్ఱిల్ శెన్ఱు = ఇండ్లముంగిళ్ళకు పోయి; మాఱుమ్ = అమ్మబడుచున్న ; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో; మణిమాడక్కోయిల్ = మణిమాడక్కోయిల్ దివ్య దేశమును; ఎన్ మననే = ఓ! నామనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా !. తామర మొగ్గలతోను , వికసించిన తామర పూవులుతోను ఉన్న యమనానదియొక్క ఒక మడుగును విషపూరితము చేయుచు, దుష్కుత్యములు సలుపుచు మదించియున్న కాళీయుడనే సర్పరాజు యొక్క గర్వము అణుగనట్లు దాని తలపై విశ్వమంతా కొనియాడునటుల నృత్యముచేసిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును , ఉన్నతమైన భవనములను చుట్టుకొనియున్న వీదులలో మత్స్యకాంతలు తమ వద్దనున్న మంచిముత్యములు , తెల్లని బియ్యమునకుహో! అని అరుచుకొనుచు, ఇండ్ల ముంగిళ్ళకు పోయి అమ్మబడుచున్నదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన మణిమాడక్కోయిల్ దివ్య దేశమును ఓ! నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!
తుళైయార్ కరుమెన్ కుழలాయ్ చ్చియర్ తమ్,తుకిల్వారియుమ్ శిర్ట్రిల్ శిదైత్తుమ్,ముర్ట్రా
ఇళైయార్ విళైయాట్టొడు కాదల్ వెళ్ళమ్ , విళైవిత్త అమ్మానిడమ్ ,వేల్ నెడుఙ్గణ్
ముళైవాళ్ ఎయిర్ట్రు మడవార్ పయిర్ట్రు,మొழிకేట్టిరున్దు ముదిరాద ఇన్శొల్
వళైవాయ కిళ్ళై మఱైపాడు నాఙ్గూర్, మణిమాడక్కోయిల్ వణఙ్గెన్ మననే! . 1225
తుళైయార్ = (ఉంగరాల జుట్టు వలన) రంద్రములతో నిండిన ; కరుమెన్ కుழల్ = నల్లని, మృదువైన, కేశములుగల ; ఆయ్ చ్చియర్ తమ్ = గోపస్త్రీలయొక్క; తుగిల్= వస్త్రములు ;వారియుమ్ = అపహరించియు; శిర్ట్రిల్ = (వారు ఆటలయందు చేసుకొన్న) చిన్న ఇసుక ఇండ్లను; శిదైత్తుమ్ = ధ్వంసముచేసియు; ముర్ట్రా ఇళైయార్ = యౌవన వయస్సు లేనిగోప బాలికలకు; విళైయాట్టొడు = బాలక్రీడలతో ; కాదల్ వెళ్ళమ్ = (తనయందు) ప్రేమసాగరమును;విళైవిత్త = జనింపచేసిన; అమ్మానిడమ్ = సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును ; ముదిరాద = పరిపక్వములేని; ఇన్ శొల్ = మధురమైన మాటలను; వళైవాయ్ = వంకరైన నోరుగల;కిళ్ళై = చిలుకలు ;వేల్ = ఈటె వలె వాడియైన;నెడుఙ్గణ్ = విశాలమైన కన్నులు; ములై = మొలకెత్తుచున్న; వాళ్ = ప్రకాశవంతమైన; ఎయిర్ట్రు = దంతములుగల; మడవార్ = వైదికస్త్రీలు; పయిర్ట్రు = అభ్యసించు; మొழிకేట్టిరున్దు = వేదసూక్తులను విని; మఱైపాడుమ్ = ఆ వేదములను పారాయణము చేయుచున్న;నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో; మణిమాడక్కోయిల్ = మణిమాడక్కోయిల్ దివ్య దేశమును;ఎన్ మననే! = ఓ! నామనసా! ; వణఙ్గు = శరణుజొచ్చుమా !.
నల్లని, మృదువైన, గిరిజాల, కేశములుగల యౌవన వయస్సు లేని గోప బాలికల యొక్కవస్త్రములు అపహరించియు, వారు ఆటలయందు చేసికొన్న చిన్న ఇసుక ఇండ్లను పాడుచేసియు, మొదలగు బాలక్రీడలతో ఆ గోప బాలికల హృదయాల్లో అనంతమైన ప్రేమానురాగములను తనయందు కలిగింపజేసుకొన్న సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును , విశాలమైన కన్నులు , ప్రకాశవంతమైన దంతములుగల వైదికస్త్రీలు అభ్యసించు వేదసూక్తులను అచట ఉన్న చిలుకలు విని , రమ్యముగ ఆ చిలుకలు ఆవేదములను పారాయణము చేయుచున్నవియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన మణిమాడక్కోయిల్ దివ్య దేశమును ఓ! నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా! .
విడైయోడ వెన్ఱు ఆయ్ చ్చి మెన్ తోళ్ నయన్ద ,విగిర్ దా విళఙ్గు శుడర్ ఆழிయెన్నుమ్ ,
పడైయోడు శఙ్గొన్ఱుడైయాయెన నిన్ఱు , ఇమైయోర్ పరవుమిడమ్ , పైన్దడత్తు
పెడైయోడు శెఙ్గాల అన్నమ్ తుగైప్ప , తొగై పుణ్డరీకత్తిడై శెఙ్గழுనీర్ ,
మడైయోడనిన్ఱు మదువిమ్ము నాఙ్గూర్ , మణిమాడక్కోయిల్ వణఙ్గెన్ మననే !. 1226
విడై = (ఏడు)వృషభములు;ఓడ = భంగపాటు పడునట్లు; వెన్ఱు = వాటిని జయించి;ఆయ్ చ్చి = నప్పిన్నైపిరాట్టియొక్క; మెన్ తోళ్ = మృదువైన భుజములను; నయన్ద = ఆశించి పొందిన; విగిర్ దా = ఆశ్చర్యచేష్టితములు గలవాడా!; విలఙ్గు = ఉజ్వలమైన;శుడర్ = తేజస్సుగల; ఆழிయెన్నుమ్ పడైయోడు = చక్రాయుధముతోకూడ;శఙ్గు ఒన్ఱు= సాటిలేని శఙ్కమును; ఉడైయాయ్ = కలవాడా!; ఎన నిన్ఱు = అనబడునట్లు ఉన్న (సర్వేశ్వరుని);ఇమైయోర్=బ్రహ్మాది దేవతలు;పరవుమిడమ్= స్తుతించు దివ్యదేశమును; పైన్దడత్తు = సుందరమైన తటాకములో; శెమ్ కాల అన్నమ్=ఎఱ్ఱని కాళ్ళుగల హంసలు; పెడైయోడు = తమ భార్యలతోకూడ; తుగైప్ప = (విహారములో) తొక్కబడుటచే; తొగై పుణ్డరీకత్తిడై = గుంపులుగాఉన్న తామర పుష్పముల నుండి పెరిగిన; మదు = తేనెల దారలవలన; శెఙ్గழுనీర్ = (నడుమనున్న)ఎఱ్ఱకలువలు; మడై ఓడ నిన్ఱు = కాలవలో కొట్టుకొని; విమ్ముమ్ = పోవుచుండబడు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో; మణిమాడక్కోయిల్ = మణిమాడక్కోయిల్ దివ్య దేశమును; ఎన్ మననే = ఓ! నామనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా!
“నప్పిన్నైపిరాట్టి లబ్ధికై బలిష్టమైన ఏడు వృషభములను అవలీలగా వధించిన ఆశ్చర్యచేష్టితములు గలవాడా! ఉజ్వలమైన తేజస్సుగల సుదర్శన చక్రాయుధము , సాటిలేని శఙ్కమునుధరించినవాడా! పంకజనేత్రుడా!” అని బ్రహ్మాది దేవతలుచే అనేకవిదములగా స్తుతింపబడు సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును , సుందరమైన తటాకములో వసించు హంసలు తమ భార్యలతోకూడి గుంపులుగాఉన్న తామరపూలమద్య విహారముచేయునపుడు వాటి పాదధాటికి తామర పుష్పముల నుండి పెరిగిన తేనెల దారలవలన వాటి నడుమనున్న ఎఱ్ఱ కలువలు కాలువలలో కొట్టుకొని పోవుచుండబడు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన మణిమాడక్కోయిల్ దివ్య దేశమును ఓ! నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!.
** వణ్డార్ పొழிల్ శూழ் న్దు అழగాయ నాఙ్గూర్,మణిమాడక్కోయిల్ నెడుమాలుక్కు , ఎన్ఱుం
తొణ్డాయ తొల్ శీర్ వయల్ మఙ్గయర్కోన్, కలియనొలిశెయ్ తమిழ் మాలైవల్లార్,
కణ్డార్ వణఙ్గ క్కళియానైమీదే, కడల్ శూழுలగుక్కొరు కావలరాయ్,
విణ్డోయ్ నెడు వెణ్ కుడై నీழలిన్ కీழ் , విరినీర్ ఉలగాణ్డు విరుమ్బువరే . 1227
వణ్డార్ = తుమ్మెదలతో నిండిన;పొழிల్ = పూతోటలతో; శూழ் న్దు = చుట్టుకొనియున్న;అழగాయ = సుందరమైన; నాఙ్గూర్ =నాఙ్గూర్ ప్రాంతములో; మణిమాడక్కోయిల్ = మణిమాడక్కోయిల్ దివ్యదేశములో కృపతో వేంచేసిన; నెడుమాలుక్కు=సర్వేశ్వరునకు;ఎన్ఱుం తొణ్డాయ = నిత్య కైంకర్యము చేయుటయే; తొల్ శీర్ = సహజ స్వభావము గలవారైన; వయల్ = పొలములతో చుట్టుకొనియున్న; మఙ్గయర్కోన్ = తిరుమంగై దేశమునకు ప్రభువైన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలి శెழ் = కృపతో ప్రసాదించిన; తమిழ் మాలై = ఈ తమిళ పాశురములమాలను;వల్లవర్ =పఠించువారు; కణ్డార్ = చూచినవారందరు;వణఙ్గ = పాదములపై పడునట్లు;కళియానై మీదే = మత్తగజముపై ఎక్కినవారై;కడల్ శూழ்= సముద్రముచే చుట్టుకొనియున్న; ఉలగుక్కు = భూమండలమంతటికిని; ఒరుకావలరాయ్ = సాటిలేని చక్రవర్తిగ పాలించి;విణ్ దోయ్ నెడు = ఆకశమునంటు పెద్ద;వెణ్ కుడై నీழలిన్ కీழ்= తెల్లని ఛాత్ర ఛాయలో; విరినీర్ ఉలగాణ్డు = ఆవరణజలములతో చుట్టుకొన్న బ్రహ్మాండమును పరిపాలించి; విరుమ్బువరే = నిత్యసంతోషమును పొందుదురు.
తిరునాఙ్గూరు ప్రాంతములో వెలసిన మణిమాడక్కోయిల్ దివ్య దేశములో కృపతో వేంచేసిన సర్వేశ్వరుని నిత్య కైంకర్యముచేయుటయే సహజ స్వభావము గలవారైన తిరుమంగై ఆళ్వార్ కృపతో ప్రసాదించిన ఈ పాశురములను శ్రద్దతో పఠించువారు చూచినవారందరు పాదములపై పడునట్లు మత్తగజముపై ఎక్కినవారై సముద్రముచే చుట్టుకొనియున్న భూమండలమంతటికిని సాటిలేని చక్రవర్తిగ పాలించి తదుపరి ఆకశమునంటు పెద్ద తెల్లని ఛాత్ర ఛాయలో ఆవరణజలములతో చుట్టుకొన్న బ్రహ్మాండమును పరిపాలించి నిత్యసంతోషమును పొందుదురు.
*******