శ్రీః
9. శలఙ్గొణ్డ
అవతారిక : వైకుంఠమందు తాను వేంచేసియుండు తిరుక్కోలముతో ఈ భువియందు భక్తుల నిమిత్తమై తిరు వైగున్ద విణ్ణగరమను దివ్య దేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న ఆ సర్వేశ్వరుని దర్శించిన తిరుమంగై ఆళ్వారులు అమితానందభరితులై మిక్కిలి ఉత్తేజముతో , సహజముగ చంచలస్వభావముగలిగిన తన మనస్సును ఈ దివ్యదేశమును ఆశ్రయించి ఉజ్జీవింపుమని ప్రభోదించుచున్నారు.
** శలఙ్గొణ్డ ఇరణియనదు అగల్ మార్వమ్ కీణ్డు ,
తడఙ్గడలై క్కడైన్దు అముదఙ్గొణ్డు ఉగన్ద కాళై ,
నలఙ్డొడ కరు ముగిల్ పోల్ తిరుమేని యమ్మాన్ ,
నాడోఱుమ్ మగిழ் న్దు ఇనిదు మరువియుఱైకోయిల్ ,
శలఙ్గొణ్డు మలర్ శొరియుమ్ మల్లిగై ఒణ్ శెరున్ది ,
శణ్బకఙ్గల్ మణనారుమ్ వణ్ పొழிలి నూడే ,
వలఙ్గొణ్డు కయలోడి విళైయాడు నాఙ్గూర్ ,
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే !. 1228
శలమ్ = ద్వేషపూరితుడైన;ఇరణియన్ = హిరణ్యాసురునియొక్క; అదు = బలిష్టమైన; అగల్ మార్వమ్ = విశాలమైన వక్షస్థలమును; కీణ్డు = చీల్చినవాడును; తడమ్ కడలై = పెద్ద పాలసముద్రమును; కడైన్దు = చిలికి; అముదమ్ = అమృతమును; కొణ్డు ఉగన్ద = తీసి దేవతలకు ఇచ్చి ఆనందించివాడును; కాళై = నిత్యయౌవనుడును; నలమ్ కొణ్డ = సుందరమైన; కరుమా ముగిల్ పోల్ = నీలమేఘము పోలిన; తిరుమేని = దివ్య విగ్రహ స్వరూపుడైన; అమ్మాన్ =సర్వేశ్వరుడు;నాళ్ దోఱుమ్=ఎల్లప్పుడును; మగిழ்న్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; మరువియుఱై కోయిల్ =అమరి వేంచేసిన దివ్య దేశమును; శలమ్ కొణ్డు = నీటిని గ్రహించి; మలర్ శొరియుమ్ = పుష్కలముగ పుష్పించుచున్న;ఒణ్ మల్లిగై శెరున్ది శెణ్బకఙ్గల్ = అందమైన మల్లి, శెరున్ది,సంపంగి చెట్ల సమూహములచే ;మణమ్ నాఱుమ్ = పరిమళము వ్యాపింపబడు; వణ్ పొழிలినూడే = సుందరమైన తోటలనడుమ; కయల్ = మత్స్యములు; ఓడి వలఙ్గొణ్డు = కదలుచు, త్రుళ్ళుచూ; విళైయాడుమ్ = ఆటలాడబడు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వైగున్దవిణ్ణగరమ్ = వైగున్ద విణ్ణగరమ్ దివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా; వణఙ్గు = శరణుజొచ్చుమా !.
శ్రీమన్నారాయణుని యందు మిక్కిలి ద్వేషపూరితుడైన హిరణ్యాసురునియొక్క బలిష్టమైన విశాలమైన వక్షస్థలమును, నృసింహావతారముదాల్చి చీల్చినవాడును, పాలసముద్రమును చిలికినపుడు ఉద్భవించిన అమృతమును, జగన్మోహినిగ అవతరించి ,దేవతలకు ఒసగి ఆనందించినవాడును ,నిత్యయౌవనుడును, నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, పుష్కలముగ పుష్పించుచున్న మల్లి,శెరున్ది,సంపంగి చెట్ల సమూహములచే పరిమళము వ్యాపింపబడు సుందరమైన తోటలనడుమ మత్స్యములు కదలుచూ,త్రుళ్ళుచూ ఆటలాడబడు, నాఙ్గూర్ ప్రాంతములో నున్న వైగున్ద విణ్ణగరమ్ దివ్యదేశమునువిధేయమైన నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!
తిణ్ణియదోర్ అరియురువాయ్ తిశైయనైత్తుమ్ నడుఙ్గ ,
తేవరొడు దానవర్ గళ్ తిశైప్ప , ఇరణియనై
నణ్ణి యవన్ మార్వగలత్తు ఉగిర్ మడుత్తనాదన్ ,
నాడోఱుమ్ మగిழ் న్దు ఇనిదు మరువియుఱైకోయిల్
ఎణ్ణిల్ మిగు పెరుఞ్జెల్వత్తు ఎழிల్ విళఙ్గు మఱైయుమ్ ,
ఏழிశైయుమ్ కేళ్విగళుమ్ ఇయన్ఱ పెరుఙ్గుణత్తోర్ ,
మణ్ణిల్ మిగు మఱైయవర్ గళ్ మలివెయ్ దు నాఙ్గూర్,
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే !. 1229
తిశై అనైత్తుమ్ = అన్ని దిక్కులందున్నవారు; నడుఙ్గ = భయకంపితులగునట్లు;తేవరొడు = దేవతలతోపాటు; దానవర్ గళ్ = రాక్షసులు; తిశైప్ప = వ్యాకులపడునట్లు;తిణ్ణియదోర్ = మిక్కిలి బలిష్టమైన సాటిలేని;అరియురువాయ్ = నరసంహరూపముదాల్చి; ఇరణియనై = హిరణ్యాసురుని; నణ్ణి = సమీపించి; అవన్ = అతనియొక్క; మార్వు అగలత్తు = విశాలవక్షస్ధలమందు; ఉగిర్ = తన వాడినఖములను; మడుత్త = జొనిపి చీల్చివేసిన; నాదన్ = సర్వేశ్వరుడు; నాళ్ దోఱుమ్ = ఎల్లప్పుడును; మగిழ் న్దు = సంతోషముతో ; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; మరువియుఱైకోయిల్ =అమరి వేంచేసిన దివ్య దేశమును; ఎణ్ణిల్ మిగు = లెక్కకట్టరాని; పెరుఞ్జెల్వత్తు = మిక్కిలి సంపదలతోకూడి; ఎழிల్ విళఙ్గు = తేజస్సుచే ప్రకాశించు; మఱైయుమ్ = వేదములును; ఏழ் ఇశైయుమ్ = సప్త స్వరములును; కేళ్విగళుమ్ = వేదార్ధ శ్రవణములును; ఇయన్ఱ = కలిగిన;పెరుఙ్గుణత్తోర్ = గొప్ప సద్గుణములతో;మణ్ణిల్ మిగు = ఈ భూమిలోగల సత్పురుషులకంటె మించిన కీర్తిగల; మఱైయవర్ గళ్ = వైదిక బ్రాహ్మణోత్తములు; మలివెయ్ దు = మిక్కుటముగ వసించుచుండు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వైగున్ద విణ్ణగరమ్ = వైగున్ద విణ్ణగరమ్ అనుదివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా!
తానే సర్వలోకములకు అధిపతినని అహంకారముపూని , హిరణ్యాసురుడు శ్రీమన్నారాయణునియందు అమితద్వేషముతో , దానికిమించిన విష్ణుభక్తిగల తన పుత్రుడైన ప్రహ్లాదునితో ,ఆవేశముతో సర్వేశ్వరుని ఉనికిని ప్రశ్నించగ , ప్రశాంతచిత్తుడైన చిన్న బాలుడైన ప్రహ్లాదుడు వినయముగ శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపియని బదులు పలుకగ , మరింత క్రోధుడై హిరణ్యాసురుడు సమీపమందున్న స్తంభములో హరి కలడా? యని ఆకంబమును విరగకొట్టగ, అన్ని దిసలయందున్నవారు భయకంపితులగునట్లు దేవతలును రాక్షసులును వ్యాకులపడునట్లు నరసంహరూపముదాల్చి, హిరణ్యాసురుని విశాల వక్షస్ధలమును తన వాడినఖములతో చీల్చివధించిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, దివ్యసంపన్నులు,సకలశాస్త్రపారంగతులు , సద్గుణములతో ప్రకాశించు బ్రాహ్మణోత్తములు వసించుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న వైగున్ద విణ్ణగరమ్ దివ్యదేశమును, విధేయమైన నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా! .
అణ్డముమ్ ఇవ్వలై కడలుమ్ అవనిగళు మెళ్ళామ్ ,
అముదశెయ్ ద తిరువయిర్ట్రన్ అరన్ కొణ్డు తిరియుమ్ ,
ముణ్డమదు నిఱైత్తు అవన్ కణ్ శాపమదు నీక్కుమ్ ,
ముదల్వనవన్ మగిழ் న్దు ఇనిదు మరువియుఱైకోయిల్ ,
ఎణ్డిశైయుమ్ పెరుఞ్జెన్నల్ ఇళమ్ తెఙ్గు కదలి ,
ఇలైక్కొడి యొణ్ కులై క్కముగోడి శలివళమ్ శొరియ ,
వణ్డు పలఇశైపాడ మయిలాలు నాఙ్గూర్
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే !. 1230
అణ్డముమ్ = అణ్డములను;ఇ అలై కడలుమ్ = ఈ అలలు కొట్టుచున్నసముద్రములను; అవనిగళుమ్ = భూమండలమును;ఎల్లామ్ =తదితర ప్రపంచములను;అముదశెయ్ ద = (ప్రళయకాలమున) ఆరగించిన;తిరువయిర్ట్రన్ = దివ్య ఉదరము కలవాడును,అరన్ = రుద్రుడు (శాపవశమున);కొణ్డు = తన చేతిలో చేరియున్న దానితో; తిరియుమ్ = తిరుగుచున్న;ముణ్డమదు = ఆ కపాలమును; నిఱైన్దు = నింపి; అవన్ కణ్ = ఆరుద్రునకు కలిగిన;శాపమదు = బ్రహ్మహత్యాపాతకమును; నీక్కుమ్ =పోగొట్టిన; ముదల్వన్ = జగత్కారణభూతుడైన; అవన్ = సర్వేశ్వరుడు; మగిழ் న్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; మరువి ఉఱైకోయిల్ = అమరి వేంచేసిన దివ్య దేశమును; ఎణ్ తిశైయుమ్ = కనుచూపులోనున్న ప్రదేశమంతటను; పెరుఞ్జెన్నల్ = ఎదిగిన ఎఱ్ఱ ధాన్యపుపంటలను; ఇళమ్ తెఙ్గు = ఎదుగుచున్న కొబ్బరి మొక్కలను;కదలి = అరటిచెట్లును; ఇలై కొడి = తమలపాకు తీగెలును; ఒణ్ కుల కముగోడు = అందమైన కొలలతోఉన్న పోకచెట్లును; ఇశలి = ఒకటినిమించిమఱియొకటి పెరిగి; వళమ్ శొరియ = సిరిసంపదలు చేకూర్చుచున్నదియు; వణ్డు పలఇశైపాడ = తుమ్మెదలు పలు రకముల రాగములు అలాపించుచున్నవియు; మయిల్ ఆలుమ్ = నెమళ్ళ నృత్యములతోను ఒప్పు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వైగున్ద విణ్ణగరమ్ = వైగున్ద విణ్ణగరమ్ అను దివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!;వణఙ్గు=శరణుజొచ్చుమా!
ప్రళయకాలములో లోకములు నశింపకుండ సమస్తమును తన దివ్యఉదరమందుంచుకొని రక్షించినవాడును, బ్రహ్మహత్యాపాతకముచే రుద్రుడు తనచేతికి అంటిన కపాలముచే బిక్షమెత్తుకొని తిరగుచుండగ, ఆశాపమును పోగొట్టిన జగత్కారణభూతుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, ధాన్యపు పంటలతోను, అరటి , కొబ్బరి ,పోక మొదలగు చెట్లతోను నిండి సిరిసంపదలతో తులతూగుచున్నదియు , ఆ వనములందు మధుపానముచేసి తుమ్మెదలు పలురకములుగ ఇంపుగ శబ్దించుచున్నవియు , నెమళ్లు పురివిప్పి మనోహరముగ నృత్యములు చేయుచున్నవియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన వైగున్ద విణ్ణగరమ్ దివ్యదేశమును విధేయమైన నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!
కలై యిలఙ్గుమ్ అగల్ అల్గుల్ అరక్కర్ కులక్కొడియై ,
కాదొడు మూక్కుడనరియ క్కదఱి యవళోడి ,
తలైయిల్ అమ్ కైవైత్తు మలైయిలఙ్గై పుగచ్చెయ్ ద ,
తడన్దోళన్ మగిழ் న్దు ఇనిదు మరువియుఱైకోయిల్ ,
శిలైయిలఙ్గు మణిమాడత్తుచ్చిమిశై చ్చూలమ్,
శెழுఙ్గొణ్డల్ అగడిరియ చ్చొరిన్ద శెழுముత్తమ్,
మలైయిలఙ్గు మాళిగైమేల్ మలివెయ్ దు నాఙ్గూర్,
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే !. 1231
కలై యిలఙ్గుమ్ = మెరయుచున్న వస్త్రములతో; అగల్ అల్ గుల్ = విశాల కటి ప్రదేశముగల; అరక్కర్ కులక్కొడియై = రాక్షసకులమునకు చెందిన శూర్పణఖయొక్క; కాదొడుమూక్కు = ముక్కుచెవులను; ఉడన్ అరియ = వెంటనే కోయగ; అవళ్ = ఆ రక్కసి; కదఱి = బిగ్గరగ రోదనము చేయుచు; తలైయిల్ = తన నెత్తిపై;అమ్ కైవైత్తు = అందమైన చేతులను వేసికొని; మలై ఇలఙ్గై = పర్వతముపై నున్న లంకాపురికి; ఓడి పుగ శెయ్ ద = పరిగెడుతూ చేరునట్లు చేసిన; తడమ్ తోళన్ = గొప్ప బాహువులు కలిగిన సర్వేశ్వరుడు; మగిழ் న్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; మరువియుఱైకోయిల్ = అమరి వేంచేసిన దివ్య దేశమును; శిలైయిలఙ్గు = ప్రకాశించుచున్న; మణిమాడత్తు = రత్నములచే ప్రకాశించు;ఉచ్చిమిశై = భవనముల పైననున్న; శూలమ్=శూలములచే;శెழுమ్ కొణ్డల్ = అందమైనమేఘముల యొక్క; అగడు = క్రిందిబాగము; ఇరియ = గుచ్చుకొనగ(అందువలన);శొరిన్ద = కురియుచున్న; శెழுముత్తమ్ = సుందరమైన ముత్యములు; మలైయిలఙ్గు = పర్వతముల వలె ప్రకాశించు; మాళిగైమేల్ = భవనములపై; మలివు ఎయ్ దు = అధికముగ చేరునట్టిదియు; నాఙ్గూర్=నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వైగున్ద విణ్ణగరమ్ = వైగున్ద విణ్ణగరమ్ అను దివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా! .
తను తలచుకున్న రూపము పొందగల రాక్షసకులమునకుచెందిన శూర్పణఖ దండకారణ్యములో శ్రీరాముని చూచి , కడు మోహితురాలై ,మెరయుచున్న వస్త్రములతో అందమైన స్త్రీరూపముదాల్చి , శ్రీరాముని వద్దకు వెళ్లి తన కామము వెలిబుచ్చగ , తిరస్కరింపబడి , దానికి సీత కారణమని తలచి, ఆ సీతామాతను వధింపబూనిన శూర్పణకయొక్క ముక్కుచెవులను వెంటనే కోసి, ఆరక్కసి లంకాపురికి బిగ్గరగ రోదించుచు చేరునట్లు చేసిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, మణులతో ప్రకాశించు ఉన్నతమైన భవనములతోవెలయుచున్నదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన వైగున్ద విణ్ణగరమ్ దివ్యదేశమును విధేయమైన నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా! .
మిన్ననైయ నుణ్ మరుఙ్గుల్ మెల్లియఱ్కా ,ఇలఙ్గైవేన్దన్
ముడియొరుపదుమ్ తోళిరుపదుమ్ పోయ్ ఉదిర ,
తన్నిగరిల్ శిలైవళైత్తు అన్ఱిలఙ్గై పొడి శెయ్ ద ,
తడన్దోళన్ మగిழ் న్దు ఇనిదు మరువియుఱైకోయిల్ ,
శెన్నెలొడు శెఙ్గమలమ్ శేల్ కయల్ గళ్ వాళై ,
శెఙ్గழுనీరొడు మిడైన్దు కழని తిగழ் న్దు ఎఙ్గుమ్ ,
మన్నుపుగழ் వేదియర్ గళ్ మలివెయ్ దు నాఙ్గూర్,
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1232
అన్ఱు=పూర్వము ఒకప్పుడు; మిన్ అనైయ = మెరుపువలె; నుణ్ మరుఙ్గుల్ = సన్నని నడుముగల; మెల్లియఱ్కా = మృదుస్వభావముగల సీతాదేవి కొరకై; ఇలంగైవేన్దన్ = లంకకురాఙైన రావణాసురుని యొక్క; ముడి ఒరుపదుమ్ = పదితలలను; తోళ్ ఇరుపదుమ్ = ఇరవై భుజములను; పోయ్ ఉదిర = ఛిన్నభిన్నమగునట్లు;నిగరిల్ = సాటిలేని; తన్ శిలై=తన కోదండ విల్లును; వళైత్తు=ఎక్కుపెట్టి;(బాణములనుప్రయోగించి) ఇలఙ్గై = లంకాపురిని;పొడి శెయ్ ద=భస్మము చేసిన;తడమ్ తోళన్ = గొప్ప బాహువులు కలిగిన సర్వేశ్వరుడు; మగిழ் న్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; మరువి యుఱైకోయిల్ =అమరి వేంచేసిన దివ్య దేశమును;శెమ్ కమలమ్ = ఎఱ్ఱ తామరపూలతోను;శేల్ కయల్ గళ్ వాళై = శేల్, కయల్,మొదలగు మత్స్యములతోను; శెఙ్గழுనీరొడు = ఎఱ్ఱకలువలతోను; మిడైన్దు = కూడియుండు; కழని ఎఙ్గుమ్ = పొలములతో అంతటను;తిగழ் న్దు = ప్రకాశించుచున్నదియు; మన్నుపుగழ்=శాశ్వతమైన కీర్తిగల;వేదియర్ గళ్=బ్రాహ్మణోత్తములు;మలివు ఎయ్ దు = మిక్కుటముగ వసించుచుండు;నాఙ్గూర్=నాఙ్గూర్ ప్రాంతములోనున్న; వైగున్ద విణ్ణగరమ్ = వైగున్ద విణ్ణగరమ్ అను దివ్యదేశమును; మడనెఞ్జే = విధేయమైన నా మనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా! .
లంకాపురికి రాజైన రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకలో బందించగ, శ్రీరాముడు వానరసేనతో లంకను చేరి , సాటిలేని తన కోదండ విల్లును ఎక్కుపెట్టి నిప్పులు గ్రక్కుఅద్వితీయమైన భాణములచే ఆరావణుని వధించినట్టి సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, ప్రదేశమంతటను , ఎఱ్ఱ తామరపూలతోను , వివిధ మత్స్యములతోను,కూడియుండు పంటపొలములతో ప్రకాశించు చున్నదియు, శాశ్వతమైన కీర్తిగల భ్రాహ్మణోత్తములు నివసించు చుండునదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, వైగున్ద విణ్ణగరమ్ దివ్యదేశమును విధేయమైన నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా! .
పెణ్మైమిగు వడివుకొడు వన్దవళై , పెరియ ,
పేయినదు ఉరువుకొడు మాళ వుయిరుణ్డు ,
తిణ్ మైమిగు మరుదొడు నల్ శగడమ్ ఇఱుత్తరుళుమ్ ,
దేవనవన్ మగిழ் న్దు ఇనిదు మరువియుఱైకోయిల్,
ఉణ్మైమిగు మఱైయొడు నల్ కలైగళ్ నిఱై పొఱైగళ్ ,
ఉదవుకొడై ఎన్ఱు ఇవర్టిన్ ఒழிవిల్లా , పెరియ
వణ్మైమిగు మఱైయవర్ గళ్ మలివెయ్ దు నాఙ్గూర్ ,
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! , 1233
పెణ్మైమిగు = ఉత్తమమైన;వడివుకొడు = స్త్రీరూపముదాల్చి; వన్దవళై = వచ్చిన ఆమెను (పూతనను); పెరియ పేయినదు = ఆమెయొక్క నిజరూపమయిన; ఉరువుకొడు = రక్కసి శరీరముతొ; మాళ = చచ్చునట్లు; ఉయిరుణ్డు = ప్రాణములు తీసియు; తిణ్ మైమిగు = మిక్కిలి ధృడముగ నాటుకొనియున్న; మరుదొడు = మద్ది వృక్షములను;నల్ శగడమ్ = క్రూరమైన శకటమును; ఇఱుత్తరుళుమ్ = అవలీలగ విరిచి కరుణించిన; దేవనవన్ = సర్వేశ్వరుడు; మగిழ் న్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; మరువియుఱైకోయిల్ = అమరి వేంచేసిన దివ్య దేశమును; ఉణ్మైమిగు = ఉన్నసత్యమునే వచించు; మఱైయొడు = వేదములతోపాటు,నల్ కలైగళ్ = స్ప్రుహణీయమైన ఇతిహాస,పురాణములవిఙ్ఞానము; నిఱై పొఱైగళ్ = సహనము మొదలగుసద్గుణములు; ఉదవుకొడై = అడిగినది ఇచ్చెడి ఔదార్యము; ఎన్ఱు ఇవర్టిన్ = చెప్పబడు ఈ సకలగుణములును; ఒழிవిల్లా = ఎల్లప్పుడును; పెరియవణ్మైమిగు = ఆత్మసమర్పణమను శ్లాఘ్యమైన ఔదార్యమును కలిగిన; మఱైయవర్ గళ్ = వేదబ్రాహ్మణోత్తములు; మలివెయ్ దు = మిక్కుటముగ వసించుచుండు; నాఙ్గూర్ = నాఙ్గూర్ప్రాంతములో నున్న; వైగున్ద విణ్ణగరమ్ = వైగున్ద విణ్ణగరమ్ అను దివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా!
తననిజస్వరూపమును దాచి విషపూరితమైన స్తనములందు పాలచే చంపజూచిన పూతనయొక్క ప్రాణములను తీసినవాడును , రెండు మద్దివృక్షములను పడగొట్టినవాడును ,శకటాసురుని వధించినవాడును , అయిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, వేద , పురాణ, ఇతిహాసములను బాగుగా అధ్యయనము చేసినవారును , శ్లాఘ్యమైన ఔదార్యము ,సహనము మొదలగు సద్గుణములతో నిండినవారును అయిన భ్రాహ్మణోత్తములు నివసించుచుండునదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన వైగున్ద విణ్ణగరమ్ దివ్యదేశమును విధేయమైన నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!
విళఙ్గనియై యిళఙ్గన్ఱుకొణ్డు ఉదిర ఎఱిన్దు ,
వేల్ నెడుఙ్గణ్ ఆయ్ చ్చియర్ గళ్ వైత్తతయిర్ వెణ్ణెయ్ ,
ఉళమ్ కుళిర అముదశెయ్ దు ఇవ్వులగుణ్డ కాళై ,
ఉగన్దు ఇనిదు నాడోఱుమ్ మరువియుఱైకోయిల్ ,
ఇళమ్బడి నల్ కముగు కులైత్తెఙ్గు కొడిచ్చెన్నెల్ ,
ఈన్ కరుమ్బు కణ్ వళర కాల్ తడవుమ్ పునలాల్ ,
వళఙ్గొణ్డ పెరుమ్ శెల్వమ్ వళరు మణి నాఙ్గూర్,
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1234
యిళఙ్గన్ఱుకొణ్డు=లేతదూడనుపట్టుకొని(ఆ రూపములో నున్న వత్సాసురుని); విళఙ్గనియై=వెలగపండుపై (ఆ రూపములోనున్న కపిత్థాసురునిపై); ఉదిర ఎఱిన్దు= విసిరి ఇరువురుని వధించినవాడును; వేల్ నెడుఙ్గణ్ = ఈటెవలె విశాలమైన నేత్రములుగల; ఆయ్ చ్చియర్ గళ్ = గోపస్త్రీలు;వైత్త = ఉట్లలో ఉంచిన; తయిర్ వెణ్ణెయ్ = పెరుగును,వెణ్ణను; ఉళమ్ కుళిర = తన మనస్సు చల్లబడునటుల; అముదశెయ్ దు = ఆరగించినవాడును; ఇవ్వులగుణ్డ = (అయినను తృప్తితీరక) ఈలోకములన్నియు మ్రింగిన; కాళై = నిత్యయౌవనుడును అయినసర్వేశ్వరుడు; ఉగన్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; నాడోఱుమ్ = ఎల్లప్పుడును; మరువియుఱైకోయిల్ = అమరి వేంచేసిన దివ్యదేశమును; ఇళమ్బడి నల్ కముగు = యౌవనమె సహజంగా నుండునట్లు స్పురించు అందమైన పోకచెట్లు; కులై తెఙ్గు = గెలలతోనున్న కొబ్బరిచెట్లును; శెమ్ నెల్ = ఎఱ్ఱ ధాన్యపు పంటలును; ఈన్ కరుమ్బు భోగ్యమైన చెరకు మొక్కలును; ( మొదలగు ఇవన్నియు ),కణ్ వళర = ఎప్పుడును పెరుగునట్లు; కాల్ తడవుమ్ = వాటి వ్రేళ్ళనడుమ పారుచున్న; పునలాల్ = జలములతో; వళమ్ కొణ్డ = శోభించుచున్నదియు; పెరు శెల్వమ్ = మిక్కిలి ఐశ్వర్యముతో; వళరుమ్ = వృద్ధి కలిగినదియు; అణి = అట్లు శోభాయమానమై యుండు;నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వైగున్ద విణ్ణగరమ్ = వైగున్ద విణ్ణగరమ్ అను దివ్య దేశమును; మడనెఞ్జే = విధేయమైన నామనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా! .
క్రూరడైన కంసునిచే ప్రేరేరింపబడివచ్చిన లేతదూడరూపములో నున్న వత్సాసురుని పట్టుకొని వెలగపండురూపములోనున్నకపిత్థాసురుడను రాక్షసునిపై విసిరి ఇరువురుని వధించినవాడును, గోకులములో గొల్లల ఇండ్లలో ప్రవేశంచి గోపస్త్రీలు ఉట్లలో ఉంచిన పెరుగును ,వెణ్ణనుఆరగించినది చాలక సర్వలోకములను మ్రింగిన నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, అందమైన పోకచెట్లు, కొబ్బరిచెట్లు,తమలపాకు తోటలు,ఎఱ్ఱ ధాన్యపు పంటలు,చెరకు మొక్కలు , వీటికి కావలసిన జలసమృద్ది , వీటితోపాటు సిరిసంపదలు కలిగిఉన్నదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన వైగున్ద విణ్ణగరమ్ దివ్యదేశమును విధేయమైన నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా! .
ఆఱాద శినత్తిన్ మిగు నరకన్ ఉరమ్ అழிత్త ,
అడలాழி త్తడక్కైయన్ అలర్ మగట్కుమ్ అరఱ్కుమ్ ,
కూఱాగ కొడుత్తరుళుమ్ తిరువుడమ్బన్ , ఇమైయోర్
కులముదల్వన్ మగిழ் న్దు ఇనిదు మరువియుఱైకోయిల్,
మాఱాద మలర్ క్కమలమ్ శెఙ్గழுనీర్ తదుమ్బి ,
మదువెళ్ళమ్ ఒழுగ వయల్ ఉழுవర్ మడైయడప్ప ,
మాఱాద పెరుఞ్జెల్వమ్ వళరుం అణి నాఙ్గూర్ ,
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1235
ఆఱాద=అణగని;శినత్తిన్ మిగు=అదికమైన కోపముతొ;(ఎదరించిన),నరకన్ = నరకాసురునియొక్క; ఉరమ్ = బలమును;అழிయ = నాశనమగునట్లు;అడలాழி = తీక్షణమైన చక్రాయుధమును; త్తడక్కైయన్ = తన విశాలమైన చేతిలో కలిగినవాడును;అలర్ మగట్కుమ్ =కమలవాసినికిని; అరఱ్కుమ్ = శివునకును; కూఱాగ = శరీర బాగమున చేరుటకు; కొడుత్తుఅరళుమ్ = కృపతో ఒసగిన; తిరువుడమ్బన్ = దివ్య విగ్రహ స్వరూపుడును; ఇమైయోర్ = నిత్యశూరులకు; కులముదల్వన్ = నిర్వాకుడును అయిన సర్వేశ్వరుడు; మగిழ் న్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; మరువియుఱైకోయిల్ =అమరి వేంచేసిన దివ్య దేశమును;మాఱాద మలర్ = ఎడతెగక వికసించుచున్న;కమలమ్=తామరపుష్పములనుండియు;శెమ్ కழுనీర్ = ఎర్ర కలువలనుండియు; మదువెళ్ళమ్ = తేనె కాలువలు; తదుమ్బి ఒழுగ = నిరంతరముగ పారుచుండుటచే; ఉழవర్ = రైతులు; వయల్ = తమతమ పొలములలో;మడైయడప్ప = కాలువులను మూయుచుండువారును; మాఱాద పెరుమ్ = తరగక గొప్ప; శెల్వమ్ వళరుమ్ =వృద్దిపొందు సంపదలతోకూడిన;అణి = సుందరమైన; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వైగున్ద విణ్ణగరమ్ = వైగున్ద విణ్ణగరమ్ అను దివ్యదేశమును; మడనెఞ్జే=విధేయమైన నామనసా!; వణఙ్గు = శరణుజొచ్చుమా! .
సకల ప్లాణులును ,దేవతలును హింసించుచున్న భూధేవి పుత్రుడైన నరకాసురుని వధించుటకై సత్యభామాసమేతుడై గరుడారూఢుడై చక్రాయుధమును ప్రయోగించి ఆరక్కసుని బలగమునునశింపజేసియు,ఆ నరకాసుని చంపినవాడును , కమలవాసినిని తన వక్షస్థలమందును , శివునిని తన శరీరములో ఒక బాగమందును చేర్చుకొన్నవాడును , నిత్యశూరులకు నిర్వాహకుడును అయిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును , తేనెలతో నిండి ఎడతెగక వికసించుచున్న తామరపుష్పములతోను , ఎఱ్ఱ కలువలతోను ,సిరిసంపదలతోను శోభిల్లుచున్నదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన వైగున్ద విణ్ణగరమ్ దివ్యదేశమును విధేయమైన నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా!
వఙ్గ మలి తడమ్ కడలిల్ వానవర్ గళోడు ,
మామునివర్ పలర్ కూడి మామలర్ గళ్ తూవి ,
ఎఙ్గళ్ తని నాయకనే యెమక్కరుళాయ్ ఎన్నుమ్ ,
ఈశనవన్ మగిழ் న్దు ఇనిదు మరువియుఱైకోయిల్,
శెఙ్గయలుమ్ వాళైగళుమ్ శెన్నెలిడై కుదిప్ప ,
శేల్ ఉగళుమ్ శెழுమ్ పణై శూழ் వీదిదొఱుమ్ మిడైన్దు
మఙ్గుల్ మది యగడు ఉరిఞ్జు మణిమాడ నాఙ్గూర్
వైగున్ద విణ్ణగరమ్ వణఙ్గు మడనెఞ్జే! . 1236
వఙ్గ మలి = ఓడలతొ నిండిన;తడమ్ కడలిల్ = విశాలమైన పాలసముద్రములో; వానవర్ గళోడు = దేవతలతోపాటు; మామునివర్ = మహర్షులును; పలర్ కూడి = పెక్కుమంది చేరి; మామలర్ గళ్ = శ్లాఘ్యమైన పుష్పములను; తూవి = సమర్పించిఎఙ్గళ్ తని నాయకనే = “మాయొక్క అద్వితీయమైన నాయకుడా!” ; ఎమక్కు = మాపై;అరుళాయ్ = కృపజేయుమా!; ఎన్నుమ్ = ఆని మొరపెట్టబడు; ఈశనవన్ = ఆ సర్వేశ్వరుడు; మగిழ் న్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; మరువి యుఱైకోయిల్ = అమరి వేంచేసిన దివ్య దేశమును;శెమ్ కయలుమ్ = అందమైన కయల్ మీనములును; వాళైగళుమ్ = వాళై మీనములును;శెన్ నెలిడై = ఎఱ్ఱ ధాన్యపు పొలముల నడుమ; కుదిప్ప=త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచున్నవియు; శేల్ ఉగళుమ్=శేల్ మీనములును ఆటలాడుచున్నవియు; శెழுమ్ పణై = అందమైన తటాకములతో; శూழ் = చుట్టబడియున్నదియు; వీదిదొఱుమ్ = ప్రతి వీదులలోను దట్టముగ; మఙ్గుల్ మది=ఆకసములొ సంచరించు చంద్రుని; అగడు= క్రిందఉదరబాగము; ఉరిఞ్జు = తగులునట్లున్న; మణి మాడమ్ = రత్నమయమైన భవనములతోను; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములోనున్న;వైగున్ద విణ్ణగరమ్=వైగున్ద విణ్ణగరమ్ అను దివ్య దేశమును; మడనెఞ్జే= విధేయమైన నామనసా!;వణఙ్గు=శరణుజొచ్చుమా! బ్రహ్మాది దేవతలు, సనకాది మహర్షులును కూడి క్షీరాబ్ధిలో పవళించియున్న శ్రీమన్నారాయణుని సమీపించి శ్లాఘ్యమైన పుష్పములను శ్రీపాదములపై సమర్పించి కృపజేయుమని వేడుకొనునట్టి సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశమును, ఎఱ్ఱ ధాన్యపు పొలములనడుమ వివిదరకములైన మత్స్యములు త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచున్నవియు ,అందమైన తటాకములతో చుట్టబడియున్నదియు , ఉన్నతమైన రత్నమయమైన భవనములతో వెలయుచున్నదియును , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన వైగున్ద విణ్ణగరమ్ దివ్యదేశమును విధేయమైన నామనసా! శరణుజొచ్చి ఉజ్జీవింపుమా! .
** శఙ్గు మలితణ్డు ముదల్ శక్కర మున్ ఏన్దుమ్ ,
తామరైక్కణ్ నెడియపిరాన్ తాన్ అమరుమ్ కోయిల్ ,
వఙ్గ మలి కడలులగిల్ మలివెయ్ దు నాఙ్గూర్,
వైగున్ద విణ్ణగర్ మేల్ వణ్డఱైయుమ్ పొழிల్ శూழ்,
మంగైయర్ తమ్ తలైవన్ మరువలర్ తమ్ ఉడల్ తుణియ
వాళ్ వీశుమ్ పరకాలన్ కలికన్ఱి శొన్న ,
శఙ్గమలి తమిழ் మాలై పత్తివై వల్లార్ గళ్ ,
తరణియొడు విశుమ్బాలుమ్ తన్మై పెఱువారే !. 1237
శఙ్గు = శ్రీ పాఞ్ఛజన్యమును;మలితణ్డు = ధృడమైన కౌమోదికగదను; శక్కరమ్ = సుదర్శన చక్రము మొదలగు; ముదల్ =:దివ్యాయుధములను; మున్ ఏన్దుమ్ = కన్నులముందరనే ధరించియున్న వాడును; నెడియ = విశాలమైన; తామరైక్కణ్ = పద్మములవంటి కన్నులుగల; పిరాన్ తాన్ = ఉపకారకుడైన సర్వేశ్వరుడు;అమరుమ్ కోయిల్ = నిత్యవాసము చేయు దివ్య దేశమును; వఙ్గమ్ మలి = ఓడలతొ నిండిన; కడల్ ఉలగిల్= సముద్రముచే చుట్టుకొని ఉన్న ఈభూమియందు;మలివెయ్ దు = ప్రసిద్దికెక్కిన; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వైగున్ద విణ్ణగర్ మేల్ = వైగున్ద విణ్ణగరమ్ అను దివ్య దేశము పైన; వణ్డు అఱైయుమ్ = తుమ్మెదలు ఝంకారము చేయుచున్న; పొழிల్ శూழ் = తోటలతో చుట్టబడిన;మంగైయర్ తమ్ = తిరుమంగై దేశములో నివసించు ప్రజలకు; తలైవన్ = ప్రభువును;మరువలర్ తమ్ = శత్రువులయొక్క;ఉడల్ తుణియ = శరీరము తునకలగునట్లు; వాళ్ వీశుమ్ = ఖడ్గమును ప్రయోగించువారును; పరకాలన్ = పరకాలన్ అను నామదేయము కలవారును; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; శొన్న = కృపతో చెప్పిన; శఙ్గమ్ మలి = కవులచే కొనియాడబడు; తమిழ் మాలై = తమిళ సూక్తుల మాలికను; ఇవై పత్తు = ఈ పదింటిని; వల్లార్ గళ్ = పఠించువారు; తరణియొడు = భూమియును; విశుమ్బు = పరమపదమును; ఆళుమ్ = పాలించు; తన్మై పెఱువారే = అధికారమును పొందుదురు.
శ్రీ పాఞ్ఛజన్యమను శంఖమును , సుదర్శన చక్రమును , మొదలగు దివ్యాయుధములను ధరించి వైగున్ద విణ్ణగరమ్ మను దివ్యదేశములో కృపతో వేంచేసిన పంకజనేత్రుడైన శ్రీమన్నారాయణుని సన్నిధిలో తిరుమంగై ఆళ్వార్ నుడివిన ద్రావిడ వేదసారమయిన ఈ పది పాసురములను శ్రద్దతో పఠించువారు భూమండలమును, పరమపదమును పాలించు అధికారమును పొందుదురు .
***************