శ్రీః
శ్రీమతే రామనుజాయనమః
తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన
_______________
పెరియతిరుమొழி-4 వ పత్తు
____________
శ్రీః
1. పోదలర్ న్ద
అవతారిక :
పూర్వకాలమున శ్రీ మన్నారాయణుని సేవించుటకై దేవతలు గుంపులుగా వచ్చి బారులుతీరియుండిన ఈ తిరుత్తేవనార్ తొగై దివ్య దేశములో కృపతో వేంచేసిన శ్రీ దేవనాయకుని విషయమై తిరుమంగై ఆళ్వారులు ఈ పది పాశురములతో మంగళాశాసనము చేసినారు .
** పోదలర్ న్ద పొழிల్ శోలై , ప్పుఱమెఙ్గుమ్ పొరుతిరైగళ్ ,
తాదుదిర వన్దలైక్కుమ్ , తడ మణ్ణి త్తెన్ కరైమేల్ ,
మాదవన్ తానుఱైయుమిడమ్ , వయల్ నాంగై , వరివణ్డు
తేదెన ఎన్ఱిశై పాడుమ్ , తిరుత్తేవనార్ తొగైయే !. 1248
పోదలర్ న్ద = వికసించిన పుష్పములుగల; పొழிల్ శోలై = దట్టమైన తోటలలో; ప్పుఱమెఙ్గుమ్ = చుట్టుప్రక్కలంతటను; తాదుదిర = పుష్పముల పుప్పొడి రాలునట్లు; పొరుతిరైగళ్ = శ్లాఘ్యమైన అలలు; వన్దు అలైక్కుమ్ = వచ్చి కొట్టుచున్న; తడ మణ్ణి = పెద్ద మణ్ణినదియొక్క; తెన్ కరైమేల్ = దక్షిణ ఒడ్డున; మాధవన్ తాన్ = శ్రీ లక్ష్మీపతి మాధవుడు;ఉఱైయుమ్ =నిత్యవాసము చేయుచున్న; ఇడమ్=దివ్యదేశము( ఏదనగ ) వయల్ = పొలములతో చుట్టుకొనియున్న; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వరివణ్డు = గీతలుగల తేనెటీగలు; తేదెన ఎన్ఱు = ” తెన్నా తెన్నా “యని; ఇశై పాడుమ్ = ఇంపుగ పాడుచున్న; తిరుత్తేవనార్ తొగైయే = తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే!.
వికసించిన పుష్పములుగల తోటలలో పుష్పముల పుప్పొడి రాలునట్లు శ్లాఘ్యమైన అలలు వచ్చి కొట్టుచున్న మణ్ణినదియొక్క దక్షిణ ఒడ్డున సర్వేశ్వరుడు , మాధవుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము , (ఏదనగ) నాఙ్గూర్ ప్రాంతములో గీతలుగల తేనెటీగలు ” తెన్నా తెన్నా ” యని ఝంకారము చేయుచున్న తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే !.
యావరుమాయ్ యావైయుమాయ్ , ఎழிల్ వేదప్పొరుళ్ మాయ్ ,
మూవరుమాయ్ ముదలాయ , మూర్తి యమర్ న్దుఱైయుమిడమ్ ,
మావరుమ్ తిణ్ పడై మన్నై ,వెన్ఱి కొళ్వార్ మన్ను నాంగై ,
తేవరుమ్ శెన్ఱిఱైఞ్జు పొழிల్ , తిరుత్తేవనార్ తొగైయే !. 1249
యావరుమాయ్ = సర్వ చేతనములను తన శరీరముగ కలవాడును; యావైయుమాయ్ = సర్వ అచేతనములను తన శరీరముగ కలవాడును ; ఎழிల్ వేద = ప్రకాశించుచున్న వేదముల; ప్పొరుళ్ మాయ్ = అర్ధములు తానైనవాడును; మూవరుమాయ్ = బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులను ముగ్గురును తానైనవాడును; ముదలాయ = అన్నింటికీ కారణబూతుడైన; మూర్తి = సర్వేశ్వరుడు; అమర్ న్దు=అమరి; ఉఱైయుమ్ఇడమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్య దేశము;(ఏదనగ) మా వరుమ్ = అశ్వములపై అధిష్టించివచ్చు; తిణ్ పడై = ధృడమైన ఆయుధములు కలిగిన; మన్నై = రాజులను; వెన్ఱి కొళ్వార్ = చెండాడి జయముపొందెడి బ్రాహ్మణ సమూహములు; మన్ను = నిత్యవాసము చేయుచున్న; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు; తేవరుమ్ శెన్ఱు = నిత్యశూరులు వచ్చి;ఇఱైఞ్జుమ్ = సేవించుకొనుచున్న; పొழிల్ = తోటలతో చుట్టబడిన; తిరుత్తేవనార్ తొగైయే=తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే!
సర్వ చేతనాచేతనములను శరీరముగ కలవాడును , ప్రకాశించుచున్న వేదములచే ప్రతిపాదింపబడువాడును , బ్రహ్మ,విష్ణు,మహేశ్వరుల రూపములలో ఉద్భవించినవాడును , అన్నింటికీ కారణభూతుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశము , (ఏదనగ) సాయుధులైన రాజులను చెండాడి జయముపొందెడి భ్రాహ్మణసమూహములు నిత్యవాసము చేయుచున్న నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, నిత్యశూరులు వచ్చి సేవించుకొనుచున్న తోటలతో చుట్టుకొనియున్న తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే!.
వానాడుమ్ మణ్ణాడుమ్ , మర్ట్రుళ్ళ పల్లుయిరుమ్ ,
తానాయ ఎమ్బెరుమాన్ , తలైవన్ అమర్ న్దుఱైయుమిడమ్ ,
ఆనాద పెరుమ్ శెల్వత్తు, అరుమఱైయోర్ నాంగైతన్నుళ్ ,
తేనారుమ్ మలర్ పొழிల్ శూழ் , తిరుత్తేవనార్ తొగైయే. 1250
వానాడుమ్ = నిత్యవిభూతియు; మణ్ణాడుమ్ = లీలావిభూతియు; మర్ట్రు ఉళ్ళ = ఆయా ప్రదేశములందుగల; పల్ ఉయిరుమ్ = పలురకములైన జీవరాశులును; తాన్ ఆయ = ఇవన్నియు తానేఅయిన; తలైవన్ = ప్రభువైన; ఎమ్బెరుమాన్ = సర్వేశ్వరుడు;అమర్ న్దు = అమరి; ఉఱైయుమ్ ఇడమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్య దేశము ( ఏదనగ ) ఆనాద = క్షయములేని;పెరుమ్ శెల్వత్తు = మిక్కిలి ఐశ్వర్యములతో; అరుమఱైయోర్ = క్లిష్టమైన వేదములయందు ప్రావీణులైన బ్రాహ్మణులు నివసించుచున్న; నాంగైదన్నుళ్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తేనారుమ్ = తేనెలతోనిండిన; మలర్ = పుష్పములుగల; పొழிల్ శూழ் = తోటలతో చుట్టబడిన; తిరుత్తేవనార్ తొగైయే = తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్య దేశమే !
నిత్యవిభూతియు , లీలావిభూతియు ,ఆయాప్రదేశములందుగల పలురకములైన జీవరాశులును ఇవన్నిటియందు వ్యాపించియుండు సర్వేశ్వరుడు కృపతోనిత్యవాసము చేయుచున్న దివ్యదేశము,(ఏదనగ) క్లిష్టమైన వేదములయందు ప్రావీణులైన బ్రాహ్మణులు నివసించుచున్న నాఙ్గూర్ ప్రాంతములో తేనెలతోనిండిన పుష్పములుగల తోటలతో చుట్టబడిన తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్య దేశమే!.
ఇన్దిరనుమ్ ఇమైయవరుమ్ , మునివర్ గళుమ్ ఎழிల్ అమైన్ద ,
శన్దమలర్ చ్చదుముగనుమ్ , కదిరవనుమ్ శన్దిరనుమ్ ,
ఎన్దై యెమక్కరుళెన నిన్ఱు , అరళుమిడమ్ ఎழிల్ నాంగై ,
శున్దర నల్ పొழிల్ పుడై శూழ், తిరుత్తేవనార్ తొగైయే! . 1251
ఇన్దిరనుమ్ = దేవేంద్రుడును; ఇమైయవరుమ్ = ఇతర దేవతలును; మునివర్ గళుమ్ = మహర్షులును; ఎழிల్ అమైన్ద = సౌందర్యముతొ అమరియున్న; శన్దమ్ = వేదములను అభ్యసించిన;మలర్ = పుష్పమందు జనించిన;శదుముగనుమ్=చతుర్ముఖబ్రహ్మయును; కదిరవనుమ్ = సూర్యుడును; శన్దిరనుమ్ = చంద్రుడును;ఎన్దై = “ఓ! మాస్వామీ!” ; ఎమక్కు = మాకు; అరుళ్ = కృపజేయుమా!;ఎన = అని ప్రార్ధింప; నిన్ఱు = దాని కంగీకరించి శ్రీమన్నారాయణుడు!; అరళుమ్ ఇడమ్= కృపజేయుచున్న దివ్యదేశము; ( ఏదనగ ) ఎழிల్ నాంగై = అందమైన తిరు నాఙ్గూర్ ప్రాంతములో నున్న; సుందరమ్ = సుందరమైన; నల్ = శ్లాఘ్యమైన; పొழிల్ = తోటలతో ;పుడై శూழ் = నలుప్రక్కల చుట్టుకొనియున్న; తిరుత్తేవనార్ తొగైయే = తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్య దేశమే ! దేవేంద్రాదిదేవతలు ,మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ , సూర్యుడు, చంద్రుడు మొదలగు వారందరు శ్రీమన్నారాయణుని ” ఓ! మాస్వామీ! మమ్ములను కరుణించమా! ” అని పలువిదములగ ప్రార్ధింప , దానికంగీకరించి కృపజేయుచున్న దివ్య దేశము , (ఏదనగ) నాఙ్గూర్ ప్రాంతములో నున్న శ్లాఘ్యమైన తోటలతో నలుప్రక్కల చుట్టుకొనియున్న తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్య దేశమే!
అణ్డముమ్ ఇవ్వలై కడలుమ్ , అవనిగళుమ్ కులవరైయుమ్ ,
ఉణ్డపిరాన్ ఉఱైయుమిడమ్ , ఒళి మణి శన్దు అగిల్ కనకమ్ ,
తెణ్డిరైగళ్ వరత్తిరట్టుమ్ , తిగழ் మణ్ణి త్తెన్ కరైమేల్,
తిణ్డిఱలార్ పయిల్ నాంగై , తిరుత్తేవనార్ తొగైయే! . 1252
అణ్డముమ్=ఆకాశమును; అలై ఇక్కడలుమ్=అలలుకొట్టుచున్న ఈ సముద్రములును; అవనిగళుమ్ = సమస్త ద్వీపములును;కులవరైయుమ్=కుల పర్వతములును మొదలైన ఇవన్నింటిని; ఉణ్డ = (ప్రళయకాలమున ) తన ఉదరమున నుంచుకొని రక్షించిన; పిరాన్ = ఉపకారకుడైన సర్వేశ్వరుడు; ఉఱైయుమ్ ఇడమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము ( ఏదనగ ) ఒళి = ప్రకాశించుచున్న; మణి = రత్నములును; శన్దు = చందనపు చెట్లును; అగిల్ = అగరు కొమ్మలును; కనకమ్ = స్వర్ణములును;తెణ్ = స్వచ్ఛమైన; తిరైగళ్ వర = అలలు వచ్చి; తిరట్టుమ్ = కుప్పకుప్పలుగ చేర్చు; తిగழ் = ప్రకాశించు; మణ్ణి = మణ్ణి నదియొక్క; తెన్ కరైమేల్ = దక్షిణ తీరమున; తిణ్ తిఱలార్ = మిక్కిలి బలశాలులు; పయిల్ = నిత్యవాసము చేయుచున్న; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తేవనార్ తొగైయే=తిరుత్తేవనార్ తొగై అనబడుదివ్యదేశమే !.
సమస్త లోకములను, సమస్త జీవరాసులను ప్రళయకాలమున తన ఉదరమున నుంచుకొని రక్షించిన సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము , (ఏదనగ) రత్నములు,చందనపు చెట్లు, అగరు కొమ్మలు, స్వర్ణములు మొదలగు సంపదలను అలలచే కుప్పకుప్పలుగ చేర్చు మణ్ణి నదియొక్క దక్షిణ తీరమున మిక్కిలి బలశాలులు నిత్యవాసము చేయుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే !.
ఞాలమెల్లాం అముదుశైయ్ దు , నాన్మఱైయుమ్ తొడరాద ,
పాలగనాయ్ ఆలిలైయిల్ , పళ్ళికొళ్ళుమ్ పరమనిడమ్ ,
శాలివళమ్ పెరుగివరుమ్ , తడ మణ్ణిత్తెన్ కరైమేల్ ,
శేల్ ఉగళుమ్ వయల్ నాంగై , తిరుత్తేవనార్ తొగైయే. 1253
నాన్మఱైయుమ్ = నాలుగువేదములచేతను; తొడరాద = అందజాలని; పాలగనాయ్ = చిన్న శిశువై; ఞాలమెల్లాం = ప్రపంచమంతయు; అముదుశైయ్ దు=ఆరగించి; ఆల్ ఇలైయిల్ = చిన్న వటదళముపై; పళ్ళికొళ్ళుమ్ = శయనించు; పరమన్ ఇడమ్ = సర్వేశ్వరుడు కృపతోవేంచేసిన దివ్యదేశము;(ఏదనగ ) శాలి = ఎఱ్ఱ ధాన్యపు పంటలచే; వళమ్ = ఐశ్వర్యము; పెరుగివరుమ్ = వృద్ధి పొందబడుచున్నదై; శేల్ ఉగళుమ్ = మత్స్యములు త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచుండు; వయల్ = పొలములతో కూడియున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తేవనార్ తొగైయే = తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే !.
వేదములచేనైనను పరికింపబడజాలని ముగ్ధశిశువై ,ప్రళయమువలన నశింపకుండ సర్వలోకములను ఆరగించి చిన్న వటదళముపై పవళించు సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశము , (ఏదనగ) ఎఱ్ఱ ధాన్యపుపంటలచే ఐశ్వర్యము వృద్ధిపొంద బడుచున్నదై , మత్స్యములు త్రుళ్ళి ఎగురుచుండు పొలములతో కూడియున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే !.
ఓడాద వాళరియిన్ , ఉరువాగి ఇరణియనై ,
వాడాద వళ్ ఉగిరాల్ , పిళన్దళైన్ద మాలదిడమ్ ,
ఏడేఱు పెరుమ్ శెల్వత్తు , ఎழிల్ మఱైయోర్ నాంగైతన్నుళ్ ,
శేడేఱు పొழிల్ తழுవు , తిరుత్తేవనార్ తొగైయే! . 1254
ఓడాద = లోకములో ఎన్నడు సంచరించగ కనని అపూర్వమైన; ఆళ్ అరియన్ = నరసింహ; ఉరువాగి = రూపమునుదాల్చి; ఇరణియనై = హిరణ్యాసురుని; వాడాద = దృఢమైన; వళ్ = వాడియైన; ఉగిరాల్ = నఖములచే; పిళన్దు అళైన్ద = చీల్చి రక్తసిక్తుడైన; మాలదు ఇడమ్ = సర్వేశ్వరుని యొక్క దివ్య దేశము;(ఏదనగ ) ఏడు ఏఱు = పుస్తకములలో వ్రాయునట్లు తగిన; పెరుమ్ శెల్వత్తు = మిక్కిలి ఐశ్వర్యములను కలిగినవారైన; ఎழிల్ = ప్రకాశించుచున్న; మఱైయోర్ = వేద బ్రాహ్మణులు నివసించుచున్న; నాంగైతన్నుళ్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; శేడు ఏఱు = లేతదనముతొ నిండిన; పొழிల్ తழுవు = తోటలతో కూడిన; తిరుత్తేవనార్ తొగైయే = తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే! భక్తప్రహ్లాదుని సంరక్షణార్ధమై లోకములో ఎన్నడు సంచరించగ చూడని అపూర్వమైన నరసింహరూపమునుదాల్చి తనవాడియైన నఖములచే హిరణ్యాసురుని విశాలవక్షస్ధలమును చీల్చివధించిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశము , (ఏదనగ) మహదైశ్వర్యములతొ తులతూగు వేదపారంగతులు నివసించుచున్న నాఙ్గూర్ ప్రాంతములో నున్న లేతదనముతొ నిండిన తోటలతో కూడిన తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే !
వారారుమ్ ఇళమ్ కొంగై , మైదిలియై మణమ్ పుణర్వాన్ ,
కారార్ తిణ్ శిలై యిఱుత్త , తనిక్కాళై కరుదుమిడమ్ ,
ఏరారుమ్ పెరుమ్ శెల్వత్తు , ఎழிల్ మఱైయోర్ నాంగైతన్నుళ్ ,
శీరారుమ్ మలర్ పొழிల్ శూழ் , తిరుత్తేవనార్ తొగైయే! . 1255
వారారుమ్ = వస్త్రముచే అలంకరింపబడిన; ఇళమ్ కొంగై = యౌవనమైన స్తనములుగల; మైదిలియై = సీతాదేవిని; మణమ్ = వివాహము; పుణర్వాన్ = చేసుకొనుటకై; కారార్ = మిక్కిలి నల్లనైన; తిణ్ = దృఢమైన; శిలై = విల్లును; యిఱుత్త = విరిచిన; తని = విలక్షణమైన; కాళై = యౌవనుడైన శ్రీరాముడు; కరుదుమ్ ఇడమ్ = అభిలషించి నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము;(ఏదనగ), ఏరారుమ్ = అందముతొ కూడిన; పెరుమ్ శెల్వత్తు = మిక్కిలి ఐశ్వర్యములను కలిగిన; ఎழிల్ = విలక్షణమైన; మఱైయోర్ = వేదబ్రాహ్మణోత్తములు నివసించుచున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; శీర్ ఆరుమ్ = సౌందర్యముతొ నిండిన; మలర్ = పుష్పములుగల; పొழிల్ శూழ் = తోటలతో చుట్టుకొనియున్న; తిరుత్తేవనార్ తొగైయే = తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే !.
సౌందర్యవతియైన సీతాదేవిని పరిణయమాడుటకై శివవిల్లును విరిచిన సాటిలేని వీరుడు యౌవనుడైన శ్రీరాముడు సంతోషముతో నిత్యవాసము చేయుచున్న దివ్య దేశము (ఏదనగ)మిక్కిలి ఐశ్వర్యవంతులైన వేదోత్తములు నివసించుచున్న ,నాఙ్గూర్ ప్రాంతములో నున్న శ్లాఘ్యమైన పూతోటలతో చుట్టుకొనియున్న తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే! .
కుంబమిగు మదయానై , పాగనొడుమ్ కులైన్దువీழ ,
కొమ్బదనై ప్పఱిత్తెరిన్ద , కూత్తన్ అమర్ న్దుఱైయుమిడమ్,
వమ్బవియుమ్ శెన్బగత్తిన్ , మణమ్ కమழுమ్ నాంగైతన్నుళ్,
శెమ్బొన్ మదిళ్ పొழிల్ పుడై శూழ் , తిరుత్తేవనార్ తొగైయే! . 1256
కుంబమిగు = పెద్ద కుంబస్థలముగల;మదయానై = మత్తగజమైన కువలయాపీడమును; పాగనొడుమ్ = మావటివానితోకూడ; కులైన్దువీழ = నలిగి నశించునట్లుజేసి; కొమ్బదనై = ఆ ఏనుగుయొక్క దంతములను; ప్పఱిత్తెరిన్ద=పీకిపడవేసిన;కూత్తన్=ఆశ్చర్య చేష్టితములుగల సర్వేశ్వరుడు;అమర్ న్దు = అమరి; ఉఱైయుమ్ ఇడమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; (ఏదనగ) వంబు అవిழுమ్ = అప్పుడప్పుడె వికసించిన; శెన్బగత్తిన్ = సంపంగి పుష్పముల; మణమ్ కమழுమ్ = పరిమళము వ్యాపింపబడుచున్న; నాంగైదన్నుళ్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;శెమ్ పొన్ = మేలిమి బంగారముతొ చేయబడిన; మదిళ్ = ప్రాకారములును; పొழிల్ = తోటలతో; పుడై శూழ் = నలుప్రక్కల చుట్టుకొనియున్నదైన; తిరుత్తేవనార్ తొగైయే = తిరుత్తేవనార్ తొగై అనబడుదివ్యదేశమే!
క్రూరుడైన కంసునిచే ప్రేరేరింపబడి వచ్చిన పెద్ద కుంబస్థలముగల మత్తగజమైన కువలయాపీడమును , మావటివానితోకూడ వధించి , ఆ ఏనుగుయొక్క దంతములను పెఱికి పారవేసినట్టి ఆశ్చర్యచేష్టితములుగల సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము ( ఏదనగ ) , నాఙ్గూర్ ప్రాంతములో నున్న ,అప్పుడప్పుడె వికసించిన సంపంగి పుష్పముల పరిమళము వ్యాపింపబడుచున్నదయు , మేలిమి బంగారముతొ చేయబడిన ప్రాకారములు గలదియు , నలుప్రక్కల తోటలతో చుట్టుకొనియున్నదియు , అయిన తిరుత్తేవనార్ తొగై అనబడు దివ్యదేశమే! .
** కారార్ న్ద తిరుమేని , కణ్ణన్ అమర్ న్దుఱైయుమిడమ్ ,
శీరార్ న్ద పొழிల్ నాంగై , తిరుత్తేవనార్ తొగైమేల్ ,
కూరార్ న్ద వేల్ కలియన్ , కూఱు తమిழ் పత్తుమ్ వల్లార్ ,
ఏరార్ న్ద వైగున్దత్తు , ఇమైయవరోడిరుప్పారే !. 1257
కారార్ న్ద = మేఘమును పోలిన; తిరుమేని = రూపముగల; కణ్ణన్ = శ్రీ కృష్ణుడు; అమర్ న్దు = అమరి; ఉఱైయుమ్ ఇడమ్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశమును; శీరార్ న్ద = సుందరమైన; పొழிల్ = తోటలుగల; నాంగై = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; తిరుత్తేవనార్ తొగైమేల్ = తిరుత్తేవనార్ తొగై దివ్యదేశ విషయమై;కూరార్ న్ద = మిక్కిలి వాడియైన; వేల్ = ఈటె గల; కలియన్ = తిరుమంగై ఆళ్వారులు; కూఱు = కృపతో నుడివిన; తమిழ் = ద్రావిడ భాషలోనున్న; పత్తుమ్ = ఈ పది పాసురములను; వల్లవర్ = అనుసంధించువారు; ఏరార్ న్ద = మిక్కిలి పవిత్రమైన;వైగున్దత్తు = పరమపదమందు; ఇమైయవరోడు = నిత్యశూరులతో; ఇరుప్పార్ = కూడియుందురు .
నీలమేఘశ్యాముడైన శ్రీ కృష్ణుడు కృపతో నిత్యవాసము చేయుచున్న సుందరమైన తోటలుగల నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరుత్తేవనార్ తొగై అను దివ్యదేశ విషయమై తిరుమంగై ఆళ్వారులు కృపతో నుడివిన ద్రావిడ భాషలోనున్న ఈ పది పాసురములను అనుసంధించువారు పరమపదమందు నిత్యశూరులతో కూడియుందురు.
****************