పెరియతిరుమొழி-4 వపత్తు (10)

శ్రీః

10 . ఆయ్ చ్చియర్

అవతారిక :-

తిరుమంగై ఆళ్వార్  సర్వేశ్వరుని  తమ దర్శనభాగ్యము కలిగింపజేయమని ప్రార్ధింపగ, తిరు వెళ్ళియఙ్గుడియందు ఆ సేవదొరుకునని తెలుపగ ఆ దివ్యదేశమునకు వెడలి మంగళాశాసనము చేయుచున్నారు. 

** ఆయ్ చ్చియర్ అழைప్ప వెణ్ణైయుణ్డొరుకాల్, అలిలై వళర్ న్ద ఎమ్బెరుమాన్, 

పేయ్ చ్చియై ములైయుణ్డు ఇణైమరుదిఱుత్తు, పెరునిలమళన్దవన్ కోయిల్,

కాయ్ త్త నీళ్ కముగుమ్ కదలియుమ్ తేఙ్గుమ్, ఎఙ్గుమ్ ఆమ్ పొழிల్ కళినడువే,

వాయ్ త్త నీర్ పాయుమ్ మణ్ణియిన్ తెన్బాల్, తిరు వెళ్ళియఙ్గుడియదువే ll     1338

ఆయ్ చ్చియర్ = గోపస్త్రీలు; అழைప్ప = మొరపెట్టుకొనునట్లు; వెణ్ణై ఉణ్డు = వెన్నను ఆరగించియు; ఒరుకాల్=ప్రళయకాల సమయమున;అల్ ఇలై=వటదళముపై;వళర్ న్ద= పవళంచిన; ఎమ్బెరుమాన్ = నాయొక్క స్వామియు; పేయ్ చ్చియై ములై  ఉణ్డు = పూతనయొక్క స్తనములందలి పాలను ఆరగించి అంతమొందించియు; ఇణై మరుదు ఇఱుత్తు = రెండు,దగ్గరగ చేరియున్న మద్ది వృక్షములు విరిగకొట్టియు; పెరు నిలమ్ అళన్దవన్ = విశాలమైన భూమండలమును కొలిచిన సర్వేశ్వరుడు; కోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; (ఏదనగ) కాయ్ త్త నీళ్ = కాయలచే నిండి బాగుగ పెరిగిన; కముగుమ్= పోకచెట్లును;కదలియుమ్=అరటిచెట్లును; తేఙ్గుమ్ = కొబ్బరిచెట్లును; ఎఙ్గుమ్ ఆమ్ = అంతటను అధికముగ గల;పొழிల్ గళిన్ నడువే = తోటల నడుమ; వాయ్ త్త నీర్ పాయుమ్ = సమృద్ధిగ నీరు పారుచున్న; మణ్ణియిన్ తెన్బాల్ = మణ్ణి నదియొక్క దక్షిణ తీరమునగల; తిరు వెళ్ళియఙ్గుడి అదువే = తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! .

గోపస్త్రీలు మొరపెట్టుకొనునట్లు వెన్నను ఆరగించియు,ప్రళయకాల సమయమున వటదళముపై పవళంచిన నాయొక్క స్వామియు,పూతనయొక్క స్తనములందలి పాలను ఆరగించి అంతమొందించియు,రెండు,దగ్గరగ చేరియున్న మద్ది వృక్షములు విరిగకొట్టియు, విశాలమైన భూమండలమును కొలిచిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; (ఏదనగ) కాయలచే నిండి బాగుగ పెరిగిన పోకచెట్లును, అరటిచెట్లును,కొబ్బరిచెట్లును అంతటను అధికముగ కల, తోటల నడుమ సమృద్ధిగ నీరు పారుచున్న మణ్ణి నదియొక్క దక్షిణ తీరమునగల తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! .

ఆనిరై మేయ్ త్తు అన్ఱలైకడలడైత్తిట్టు, అరక్కర్ తమ్ శిరఙ్గళైయురుట్టి,

కార్ నిఱైమేగమ్ కలన్దతోరురువ, కణ్ణనార్ కరుదియ కోయిల్,

పూనిరై చ్చెరున్ది పున్నైముత్తరుమ్బి, ప్పొదుమ్బిడై వరివణ్డు మిణ్డి,

తేన్ ఇరైత్తు ఉణ్డు అఙ్గిన్నిశై మురలుమ్, తిరు వెళ్ళియఙ్గుడియదువే ll       1339

అన్ఱు = పూర్వమొకకాలమున; ఆ నిరై మేయ్ త్తు = గో సమూహములను మేపినవాడును;అలై కడల్ అడైత్తిట్టు = అలలుకొట్టుచున్న సముద్రముపై సేతువును కట్టి; (లంకాపురిని ప్రవేశించి) అరక్కర్ తమ్ శిరఙ్గళై ఉరుట్టి = రాక్షసులయొక్క శిరస్సులను ఖండించి నేలపై దొర్లునట్లు చేసినవాడును; కార్ నిఱై మేగమ్ కలన్దదు= వానాకాలమందు దట్టమైన మేఘమువలె ఒప్పుచున్న; ఓర్ ఉరువమ్=విలక్షణమగు స్వరూపముగల; కణ్ణనార్= శ్రీకృష్ణుడు; కరుదియ కోయిల్ = ఆశించి నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; (ఏదనగ) పూ నిరై = గుత్తుగుత్తులుగ పుష్పించుచున్న; శెరున్ది = శెరున్ది చెట్లుయొక్కయు;  ముత్తు అరుమ్బి = ముత్యముల పోలిన మొగ్గలు కలిగిన; పున్నై = పున్నై చెట్ల యొక్కయు; పొదుమ్బిడై = తొర్రలలో; వరి వణ్డు = అందమైన తుమ్మెదలు; మిణ్డి = గుంపులుగ చేరియుండి; అఙ్గు= ఆ ప్రదేశమందు పుష్పములలో; తేన్= తేనెను; ఇరైత్తు ఉణ్డు= ఝంకారము చేయుచు ఆస్వాదించి; ఇన్ ఇశై మురలుమ్= మధురముగా రాగములతొ శబ్ధించుచుండెడి; తిరు వెళ్ళియఙ్గుడి అదువే = తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

              పూర్వమొకకాలమున గో సమూహములను మేపినవాడును, అలలుకొట్టుచున్న సముద్రముపై సేతువునుకట్టి  లంకాపురిని ప్రవేశించి రాక్షసులయొక్కశిరస్సులను ఖండించి నేలపై దొర్లునట్లు చేసినవాడును,వానాకాలమందు దట్టమైన మేఘమువలె ఒప్పుచున్న విలక్షణమగు స్వరూపముగల శ్రీకృష్ణుడు ఆశించి నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము (ఏదనగ ) గుత్తుగుత్తులుగ పుష్పించుచున్న శెరున్ది చెట్లుయొక్కయు, ముత్యముల పోలిన మొగ్గలు కలిగిన పున్నై చెట్ల యొక్కయు, తొర్రలలో అందమైన తుమ్మెదలు గుంపులుగ చేరియుండి ఆ ప్రదేశమందు పుష్పములలో తేనెను ఝంకారము చేయుచు ఆస్వాదించి, మధురముగా రాగములతొ శబ్ధించుచుండెడి తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

కడువిడముడైయ కాలియనై తడత్తై, కలక్కిమున్ అలక్కழிత్తు, అవన్దన్

పడమ్ ఇఱ ప్పాయ్ న్దు పన్మణిశిన్ద, ప్పల్ నడమ్ పయిన్ఱవన్ కోయిల్, 

పడ అరవు అల్ గుల్ పావై నల్లార్ గళ్,  పయిర్ట్రియ నాడగత్తు ఒలిపోయ్,

అడైపుడై తழுవి అణ్డనిన్ఱు అదిరుమ్, తిరు వెళ్ళియఙ్గుడియదువే ll       1340

మున్ = పూర్వమొకకాలమున; కడు విడమ్ ఉడయ = బహు క్రూరమైన విషముగల;  కాలియనై తడత్తై = కాళీయుడు యున్న  మడుగును; కలక్కి = అల్లకల్లోలము చేసి; అలక్కழிత్తు = అతనిని బాధపెట్టి; అవన్ తన్ పడమ్ ఇఱ = అతనియొక్క పడగలు శిధిలమగునట్లు; పాయ్ న్దు=దుముకి; పల్ మణి శిన్ద= పడగలయందు గల మణులంతయు చిందరవందరగునట్లు; పల్ నడమ్ పయిన్ఱ అవన్ కోయిల్ = అతని పడగలపై అనేక విధములైన నృత్యములు చేసిన శ్రీ కృష్ణుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; (ఏదనగ) పడ అరవు అల్ గుల్ = పడగవిప్పిన సర్పమువలె ఒప్పు కటిప్రదేశముగల; పావై నల్లార్ గళ్ = అందమైన స్త్రీలు; పయిర్ట్రియ నాడగత్తు= సాధన చేయుచున్న నటనలయొక్క; ఒలి =ధ్వనులు; అడై పుడై పోయ్ తழுవి = అటు ఇటు చుట్టు ప్రక్కలంతటను వ్యాపించి; అణ్డమ్ నిన్ఱు అదిరుమ్ = ఆకాశపర్యంతము చేరి ప్రతిధ్వనించుచుండు; తిరు వెళ్ళియఙ్గుడి అదువే = తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

పూర్వమొకకాలమున బహు క్రూరమైన విషముగల కాళీయుడు యున్న మడుగును అల్లకల్లోలముచేసి,అతనిని బాధపెట్టి,అతనియొక్క పడగలు శిధిలమగునట్లు దుమికి, పడగలయందు గల మణులంతయు చిందరవందరగునట్లు,అతని పడగలపై అనేక విధములైన నృత్యములు చేసిన శ్రీ కృష్ణుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము,( ఏదనగ ) పడగవిప్పిన సర్పమువలె ఒప్పు కటిప్రదేశముగల అందమైన స్త్రీలు సాధన చేయుచున్న నటనలయొక్క ధ్వనులు అటు ఇటు చుట్టు ప్రక్కలంతటను వ్యాపించి,ఆకాశపర్యంతము చేరి ప్రతిధ్వనించుచుండు తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

కఱవై మున్ కాత్తు కఞ్జనై క్కాయ్ న్ద, కాళమేగత్తిరువురువన్,

పఱవై మున్ ఉయర్తు పాఱ్కడల్ తుయిన్ఱ, పరమనార్ పళ్ళికొళ్ కోయిల్, 

తుఱైతుఱై తోఱుమ్ పొన్ మణిశిదఱుమ్, తొగుదిరై మణ్ణియిన్ తెన్బాల్, 

శెఱిమణి మాడక్కొడి కతిర్ అణవుమ్, తిరు వెళ్ళియఙ్గుడియదువే ll       1341

మున్ = పూర్వమొకకాలమున; కఱవై = గోవులను; కాత్తు = రక్షించినవాడును; కఞ్జనై క్కాయ్ న్ద=కంసునిపై కోపగించి అంతమొందించినవాడును;కాళమేగ తిరు ఉరువన్ = కాలమేఘవర్ణమువంటి దివ్యమైన రూపము గలవాడును; పఱవై మున్ ఉయర్తు = గరుడాళ్వార్ ను తన ఎదుట ధ్వజముగ కలవాడును; పాఱ్కడల్ తుయిన్ఱ = పాల సముద్రమందు యోగనిద్రలోనున్న; పరమనార్ = సర్వేశ్వరుడు; పళ్ళికొళ్ కోయిల్ = పవళించియున్న దివ్యదేశము; ( ఏదనగ ) తుఱై తుఱై తోఱుమ్ = అన్ని రేవులందును;  పొన్ మణి శిదఱుమ్ = బంగారము, మణులు చేరవేయుచున్న; తొగు తిరై మణ్ణియిన్ తెన్బాల్ = దట్టమైన అలలుగల మణ్ణినదియొక్క దక్షిణ తీరమున; శెఱి మణి మాడమ్= మిక్కుటముగ మణులతోనిర్మితమైన భవనములపై; కొడి కతిర్ అణవుమ్=ధ్వజములు సూర్యమండలమును స్పర్శించుచుండు, తిరు వెళ్ళియఙ్గుడి అదువే = తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

పూర్వమొకకాలమున గోవులను రక్షించినవాడును,కంసునిపై కోపగించి అంతమొందించిన వాడును, కాలమేఘవర్ణమువంటి దివ్యమైన రూపము గలవాడును, గరుడాళ్వార్ ను తన ఎదుట ధ్వజముగ కలవాడును, పాల సముద్రమందు యోగనిద్రలోనున్న సర్వేశ్వరుడు పవళించియున్న దివ్యదేశము,( ఏదనగ ) అన్ని రేవులందును బంగారము, మణులు చేరవేయుచున్న దట్టమైన అలలుగల మణ్ణి నదియొక్క దక్షిణ తీరమున మిక్కుటముగ మణులతోనిర్మితమైన భవనములపై ధ్వజములు సూర్యమండలమును స్పర్శించుచుండు తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

పారినైయుణ్డు పారినైయుమిழ்న్దు, పారదమ్ కై యెఱిన్దు, ఒరుకాల్

తేరినైయూర్ న్దు తేరినై త్తురన్ద, శెఙ్గణ్ మాల్ శెన్ఱు ఉఱై కోయిల్,

ఏర్ నిరై వయలుళ్ వాళైగళ్ మరుగి, ఎమక్కిడమన్ఱు ఇదెన్ఱెణ్ణి,

శీర్ మలి పొయ్ గై శెన్ఱణైగిన్ఱ, తిరు వెళ్ళియఙ్గుడియదువే ll       1342

ఒరుకాల్=ఒకానొక సమయమున;పారినై ఉణ్డు =(ప్రళయకాలమున)భూమండలమును ఆరగించి;పారినై ఉమిழ்న్దు=(సృష్ఠికాలమున) ఆ భూమిని వెలిపరిచియు;పారదమ్ కై యెఱిన్దు=మహాభారతయుద్దమున సేనలను వ్యూహాత్మకముగ నిర్వహించి; తేరినై ఊర్ న్దు= అర్జునుని రథమును నడిపి; తేరినై త్తురన్ద= ఎదిరించినవారి రథములను పారద్రోలిన; శెఙ్గణ్ మాల్ = ప్రేమాతిశయముచే ఎర్రని నేత్రములుగల సర్వేశ్వరుడు; శెన్ఱు ఉఱై కోయిల్ = ఏతెంచి నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; ( ఏదనగ )ఏర్ నిరై వయలుళ్= నాగళ్ళతో నిండియున్న పొలములలో;వాళైగళ్ మరుగి=మీనములు బయపడి;ఇదు ఎమక్కు ఇడమ్ అన్ఱు  ఎన్ఱు ఎణ్ణి = ” ఈ పొలములు మనకు సరియయిన స్థలములు కావని ” తలచి; శీర్ మలి పొయ్ గై శెన్ఱు అణైగిన్ఱ = అందము మిక్కుటముగగల తటాకములకు పోయి చేరుచుండెడి; తిరు వెళ్ళియఙ్గుడి అదువే = తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

ఒకానొక సమయమున ( ప్రళయకాలమున ) భూమండలమును ఆరగించి, (సృష్ఠి కాలమున ) ఆ భూమిని వెలిపరిచియు, మహాభారతయుద్దమున సేనలను వ్యూహాత్మకముగ నిర్వహించి, అర్జునుని రథమును నడిపి ఎదిరించినవారి రథములను పారద్రోలిన ప్రేమాతిశయముచే ఎర్రని నేత్రములుగల సర్వేశ్వరుడు ఏతెంచి నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము,(ఏదనగ)నాగళ్ళతో నిండియున్న పొలములలో మీనములు బయపడి ” ఈ పొలములు మనకు సరియయిన స్థలములు కావని ” తలచి, అందము మిక్కుటముగగల తటాకములకు పోయి చేరుచుండెడి తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా!

కార్ట్రిడై ప్పూళై కరన్దన అరందైయుఱ, క్కడల్ అరక్కర్ తమ్ శేనై,

కూర్ట్రిడై చ్చెల్ల క్కొడుఙ్గణై తురన్ద,  కోలవిల్లి రామన్దన్ కోయిల్, 

ఊర్ట్రిడై నిన్ఱ వాழைయిన్ కనిగళ్, ఊழ்త్తు వీழ்న్దన వుణ్డుమణ్డి,

శేర్ట్రిడై కయల్ గళుగళ్ తిగழ వయల్ శూழ், తిరు వెళ్ళియఙ్గుడియదువే ll 1343    

పూళై = లేత పూళై పుష్పములు; కార్ట్రు ఇడై = పెద్ద గాలిలో; కరన్దన = పతనమగునట్లు; అరక్కర్ తమ్ కడల్ శేనై = రాక్షసులయొక్క సముద్రమువంటి సేన; అరందై ఉఱ = బాధ పొందునట్లు; కూర్ట్రిడై శెల్ల = యమలోకమునకు పోవునటుల; కొడుమ్ కణై తురన్ద=క్రూరమైన బాణములను ప్రయోగించిన; కోల విల్లి = అందమైన విల్లు ధరించిన;రామన్ తన్=శ్రీరామచంద్రునియొక్క;కోయిల్=దివ్య సన్నిధి;(ఏదనగ) ఊర్ట్రు ఇడై నిన్ఱ =ఊట నీరుగల ప్రదేశములందు మొలకెత్తిన; వాழைయిన్= అరటి మొక్కలనుండి; ఊழ்త్తు వీழ்న్దన కనిగళ్ = ( పరిపక్వమైన స్థితిలో ) తెగి క్రిందపడిన పండ్లను; కయల్ గళ్ = కయల్ మీనములు; మణ్డి ఉణ్డు=పైన ఉరికి తిని;శేర్ట్రు ఇడై=బురద ప్రదేశములందు; ఉగళ్ త్రుళ్ళి త్రుళ్ళి ఆటలాడుకొనెడు; తిగழ వయల్ శూழ் = ప్రకాశించు పొలములతో చుట్టుకొనియున్న; తిరు వెళ్ళియఙ్గుడి అదువే = తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

                  లేత పూళై పుష్పములు పెద్ద గాలిలో పతనమగునట్లు రాక్షసులయొక్క సముద్రమువంటి సేన బాధ పొందునట్లు,యమలోకమునకు పోవునటుల క్రూరమైన బాణములను ప్రయోగించిన అందమైన విల్లు ధరించిన శ్రీరామచంద్రునియొక్క దివ్య సన్నిధి,(ఏదనగ) ఊట నీరుగల ప్రదేశములందు మొలకెత్తిన అరటి మొక్కలనుండి ( పరిపక్వమైన స్థితిలో ) తెగి క్రిందపడిన పండ్లను కయల్ మీనములు పైన ఉరికి తిని ,బురద ప్రదేశములందు త్రుళ్ళి త్రుళ్ళి ఆటలాడుకొనెడు ప్రకాశించు పొలములతో చుట్టుకొనియున్న తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

ఒళ్ళియ కరుమమ్ శెయ్ వ నెన్ఱుణర్ న్ద, మావలి వేల్వియిల్  పుక్కు,

తెళ్ళియ కుఱళాయ్ మూవడికొణ్డు, తిక్కుఱ వళర్ న్దవన్ కోయిల్, 

అళ్ళి అమ్ పొழிల్  వాయ్ ఇరున్దువాழ் కుయిల్ గళ్, అరియరియెన్ఱవైయழைప్ప,

వెళ్ళియార్ వణఙ్గ విరైన్దు అరుళ్ శెయ్ వాన్, తిరు వెళ్ళియఙ్గుడియదువే ll   1344 

ఒళ్ళియ కరుమమ్ శెయ్ వ న్ ఎన్ఱు ఉణర్ న్ద =”శ్లాఘ్యమైన దానకర్మమును చేసెదను” అని గాఢసంకల్పముగల; మావలి వేల్వియిల్ = మహాబలి యొక్క యాగభూమి యందు;  తెళ్ళియ కుఱళాయ్ పుక్కు = నిర్మలమైన వామనమూర్తియై ప్రవేశించి;మూ అడి కొణ్డు= మూడడుగుల నేలను యాచించి దానజలమును స్వీకరించి; తిక్కు ఉఱ వళర్ న్దవన్ = అన్ని దిక్కులకును వ్యాపించిన సర్వేశ్వరుడు; కోయిల్ =  నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము;( ఏదనగ ) అళ్ళి అమ్ పొழிల్  వాయ్ =పూమొగ్గలు కలిగిన అందమైన తోటలయందు; ఇరున్దు వాழ் = ఆహ్లాదముగ నివసించుచున్న; కుయిల్ గళ్ అవై = ఆ కోకిలములు; అరి అరి ఎన్ఱు అழைప్ప = ” హరిః హరిః ” అని కూయుచుండగ; వెళ్ళియార్ వణఙ్గ = శుద్ద సాత్వికులు ఆశ్రయించి సేవించుచుండగ; విరైన్దు అరుళ్ శెయ్ వాన్ = వారికి వెనువెంటనే కృపజేయుచుండెడి స్వామియొక్క; తిరు వెళ్ళియఙ్గుడి అదువే = తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

“శ్లాఘ్యమైన దానకర్మమును చేసెదను” అని గాఢసంకల్పముగల మహాబలి యొక్క యాగభూమియందు నిర్మలమైన వామనమూర్తియై ప్రవేశించి, మూడడుగుల నేలను యాచించి, దానజలమును స్వీకరించి, అన్ని దిక్కులకును వ్యాపించిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము, (ఏదనగ)  పూమొగ్గలు కలిగిన అందమైన తోటలయందు ఆహ్లాదముగ నివసించుచున్న ఆ కోకిలములు ” హరిః హరిః ” అని కూయుచుండగ, శుద్ద సాత్వికులు ఆశ్రయించి సేవించుచుండగ, వారికి వెనువెంటనే కృపజేయుచుండెడి స్వామియొక్క తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా!

ముడియుడై   యమరర్కిడర్ శెయ్యుమ్, అశురర్ తమ్ పెరుమానై, అన్ఱరియాయ్

మడియిడైవైత్తు మార్వై మున్ కీణ్డ, మాయనార్ మన్నియ కోయిల్, 

పడియిడై మాడత్తు అడియిడై త్తూణిల్, పదిత్త పన్మణిగళినొళియాల్,

విడి పగల్ ఇరవెన్ఱు అఱివరిదాయ, తిరు వెళ్ళియఙ్గుడియదువే ll       1345

ముడి ఉడై  అమరర్కు ఇడర్ శెయ్యుమ్=కిరీటములతో ఒప్పు దేవతలకు దుఃఖములను కలుగజేయు; అశురర్ తమ్ పెరుమానై = అసురుల యొక్క ప్రభువైన హిరణ్యాసురుని; మున్ అన్ఱు = పూర్వమొక కాలమున; అరి ఆయ్ = నరసింహరూపమునుదాల్చి; మడి ఇడై వైత్తు = తనయొక్క ఒడిలో పెట్టుకుని; మార్వై కీణ్డ = ఆ రక్కసుని వక్షస్థలమును చీల్చి వధించిన; మాయనార్ మన్నియ = ఆశ్చర్యచేష్టితుడైన సర్వేశ్వరుడు స్థిరమైన;     కోయిల్ = సన్నిధి; ( ఏదనగ ) పడి ఇడై మాడత్తు=నేలపై నిర్మించిన భవనములలో; తూణిల్ అడి ఇడై=వాటి యొక్క స్తంభముల క్రిందబాగములందు; పదిత్త=పొదగబడిన; పల్ మణిగళిన్ ఒళియాల్ = పలురకములైన రత్నములయొక్క కాంతలచే; విడి పగల్ ఇరవు ఎన్ఱు అఱివరిదాయ = ప్రాతఃకాలమో, పగలో; రాత్రియో, తారతమ్యము తెలియకనుండు; తిరు వెళ్ళియఙ్గుడి అదువే=తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా! 

        కిరీటములతో ఒప్పు దేవతలకు దుఃఖములను కలుగజేయు  అసురుల యొక్క ప్రభువైన హిరణ్యాసురుని, పూర్వమొకకాలమున నరసింహ రూపమునుదాల్చి,తనయొక్క ఒడిలో పట్టుకుని ఆ రక్కసుని వక్షస్థలమును చీల్చి వధించిన ఆశ్చర్యచేష్టితుడైన సర్వేశ్వరుడు స్థిరమైన సన్నిధి (ఏదనగ ) నేలపై నిర్మించిన భవనములలో, వాటి యొక్క స్తంభముల క్రిందబాగములందు పొదగబడిన పలురకములైన రత్నములయొక్క కాంతలచే ప్రాతఃకాలమో, పగలో; రాత్రియో, తారతమ్యము తెలియకనుండు తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా!

కుడికుడియాగ క్కూడి నిన్ఱు అమరర్, కుణఙ్గలే పిదర్ర్ట్రి నిన్ఱేత్త,

అడియవర్కరుళి అరవణై త్తుయిన్ఱ, ఆழிయాన్ అమర్ న్దుఱైకోయిల్,

కడియుడైక్కమలమ్ అడియిడై మలర, క్కరమ్బొడు పెరుఞ్జెన్నెలశైయ,

వడివుడైయన్నమ్ పెడైయొడుమ్ శేరుమ్, వయల్  వెళ్ళియఙ్గుడియదువే ll   1346

అమరర్ = బ్రహ్మాదిదేవతలు; కుడి కుడి ఆగ కూడి నిన్ఱు = తమ తమ కుటుంబములతో కలసి వచ్చి; కుణఙ్గలే పిదర్ర్ట్రి నిన్ఱు ఏత్త=తనయొక్క కల్యాణ గుణములనే చెప్పుచు స్తుతించుచుండు; అడియవర్కు అరుళి = దాసుల విషయమందు కృపజూపి;అరవణై తుయిన్ఱ = ఆదిశేషుని తల్పముపై పవళించియున్న; ఆழிయాన్ = చక్రాయుధము హస్తమందుగల సర్వేశ్వరుడు;అమర్ న్దు ఉఱై కోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; ( ఏదనగ ) కడి ఉడై=పరిమళభరితమైన; కమలమ్= తామర పుష్పములు; అడి ఇడై మలర = ( చెరకు, ఎర్రధాన్యపు పంటల నడుమ) క్రింద బాగమున వికసించుచుండగ; కరమ్బొడు పెరుమ్ శెన్నెల్ అశైయ= చెరకు మొక్కలతోబాటు, ఎదిగిన  ఎర్రని ధాన్యపు కంకులు కదులుచుండగ; వడివు ఉడై అన్నమ్ పెడైయొడుమ్ శేరుమ్ = అందమైన రూపము గల హంసలు తమ ఆడ హంసలతో చేరుచుండెడి; తిరు వెళ్ళియఙ్గుడి అదువే=తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా!

          బ్రహ్మాదిదేవతలు తమ తమ కుటుంబములతో కలసి వచ్చి తనయొక్క కల్యాణగుణములనే చెప్పుచు స్తుతించుచుండు దాసుల విషయమందు కృపజూపి, ఆదిశేషుని తల్పముపై పవళించియున్న చక్రాయుధము హస్తమందుగల సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము,( ఏదనగ ) పరిమళభరితమైన తామరపుష్పములు చెరకు , ఎర్రధాన్యపు పంటల నడుమ క్రింద బాగమున  వికసించుచుండగ,చెరకు మొక్కలతోబాటు,ఎదిగిన ఎర్రనిధాన్యపు కంకులు కదులుచుండగ అందమైన రూపముగల హంసలు తమ ఆడ హంసలతో చేరుచుండెడి తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమే సుమా!

**పణ్డు మున్ ఏనమాగి అన్ఱొరుకాల్, పారిడన్దు ఏయిర్ట్రినిల్ కొణ్డు,

తెణ్డిరై వరుడ ప్పాఱ్కడల్ తుయిన్ఱ,  తిరు వెళ్ళియఙ్గుడియానై,

వణ్డఱై శోలై మంగైయర్ తలైవన్, మానవేల్ కలియన్ వాయొలిగళ్, 

కొణ్డివై పాడుమ్ తవముడైయార్ గళ్,  ఆళ్వర్ ఇక్కురై కడలులగే  ll 1347

పణ్డు = వరాహ కల్పముయొక్క ఆరంభకాలమున;మున్ = భూమండలమునకు క్షతి కలుగక  ముందు; ఏనమాగి = మహా వరాహముగ అవతరించి; అన్ఱు ఒరుకాల్ = ప్రళయము సంభవించినప్పుడు; పార్ ఇడన్దు ఏయిర్ట్రినిల్ కొణ్డు = భూమిని పైకెత్తి తన కోరలపై ధరించి; తెణ్ తిరై = స్వచ్ఛమైన అలలు;  వరుడ = (దివ్య పాదములను) స్పర్శించుచుండగ; పాల్ కడల్ తుయిన్ఱ=పాలసముద్రమందు పవళించియున్న స్వామియు;  తిరు వెళ్ళియఙ్గుడియానై = తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమందు కృపతో వేంచేసిన సర్వేశ్వరుని విషయమై; వణ్డు అఱై శోలై = తేనెటీగలు ఝంకారము చేయుచున్న తోటలుగల; మంగైయర్ తలైవన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువును; మానవేల్ = ప్రసిద్దమైన  శూలాయుధము గల;  కలియన్ = తిరుమంగై ఆళ్వార్; వాయ్ ఒలిగళ్ ఇవై = దివ్యమైన సూక్తులమాల ఈ పది పాసురములను; కొణ్డు = ప్రీతితో అలవరుచుకొని;ఇవై పాడుమ్ = వీటిని అనుసంధించు; తవముడైయార్ గళ్ = భాగ్యవంతులు; ఇ కురై కడల్ ఉలగే =  ఘోషించు సముద్రముచే చుట్టుకొనియున్నఈ లోకమును; ఆళ్వర్ = పరిపాలించుదురు.   

                        వరాహ కల్పముయొక్క ఆరంభకాలమున  భూమండలమునకు క్షతి కలుగక ముందు మహా వరాహముగ అవతరించి, ప్రళయము సంభవించినప్పుడు భూమిని పైకెత్తి తన కోరలపై ధరించి, స్వచ్ఛమైన అలలు తన దివ్య పాదములను స్పర్శించుచుండగ పాల సముద్రమందు పవళించియున్న స్వామియు,తిరు వెళ్ళియఙ్గుడి దివ్యదేశమందు కృపతో వేంచేసియున్న సర్వేశ్వరుని విషయమై తేనెటీగలు ఝంకారము చేయుచున్న తోటలగల తిరుమంగై దేశవాసులకు ప్రభువును, ప్రసిద్దమైన  శూలాయుధముగల తిరుమంగై ఆళ్వార్ దివ్యమైన సూక్తులమాలగనున్న ఈ పది పాసురములను అలవరుచుకొని,వీటిని అనుసంధించు భాగ్యవంతులు ఘోషించు సముద్రముచే చుట్టుకొనియున్న ఈ లోకమును పరిపాలించుదురు. 

తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం

******

వ్యాఖ్యానించండి