పెరియతిరుమొழி-4 వపత్తు (2)

శ్రీః

2. కమ్బమాకడల్

అవతారిక :       

జగన్మోహాకారుడు , పురుషోత్తముడైన అయోధ్యరాముడు కృపతో వేంచేసిన తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమును తిరుమంగై ఆళ్వారులు ఈ పది పాశురములతో మంగళాశాసనము చేసినారు. 

** కమ్బ మా కడల్ అడైత్తు ఇలఙ్గైక్కుమన్ , కదిర్ ముడియవైపత్తుమ్ 

అమ్బినాల్ అఱుత్తు , అరశు అవన్ తమ్బిక్కు , అళిత్తవన్ ఉఱైకోయిల్ ,

శెమ్బలానిరై శెణ్బగమ్ మాదవి , శూతకమ్ వాழைగళ్ శూழ் ,

వమ్బులామ్ కముగు ఓఙ్గియ నాఙ్గూర్  , వణ్ పురుడోత్తమమే .  1258

కమ్బమ్ = వణుకు పుట్టించు; మా కడల్ = మహా సముద్రములో; అడైత్తు = సేతువును కట్టి; ఇలఙ్గైక్కుమన్ = లంకాధిపతి రావణుని; కదిర్ = ప్రకాశించుచున్న; ముడియవైపత్తుమ్ = పదితలలను; అమ్బినాల్ = దివ్య బాణములచే; అఱుత్తు = ఖండించి; అవన్ = ఆ రావణుని; తమ్బిక్కు = తమ్ముడైన విభీషణునకు; అరశు = రాజ్యాధిపత్యమును; అళిత్తవన్ = ఒసగిన శ్రీరాముడు; ఉఱైకోయిల్ = కృపతో వేంచేసిన దివ్యదేశము;( అది ఏదనగ ) శెమ్ పలా నిరై = పనసచెట్ల అందమైన  వరుసలతోను;శెణ్బగమ్ = సంపంగిచెట్లతోను; మాదవి = కురుక్కత్తి చెట్లతోను;  శూదకమ్ = మామిడి చెట్లతోను; వాழைగళ్ = అరటిచెట్లతోను; శూழ் = చుట్టబడియు;  వమ్బు = పరిమళము;  ఉలామ్ = వ్యాపింపజేయు; కముగు ఓఙ్గియ = పెద్ద పోకచెట్లునుగల; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;  వణ్ పురుడోత్తమమే = తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే!                                                   

ఉన్నతమైన అలలగల సముద్రమందు సేతువునుకట్టి  లంకాధిపతి రావణునితన దివ్య బాణములచే వధించి , ఆ రావణుని తమ్ముడైన విభీషణునకు రాజ్యాధిపత్యమును ఒసగిన శ్రీరాముడు కృపతో వేంచేసిన దివ్యదేశము , (  అది ఏదనగ  ) పనస , మామిడి, అరటి, సంపంగి, కురుక్కత్తి మొదలగు చెట్లతో చుట్టబడియున్నదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు,  పరిమళము వ్యాపింపజేయు పెద్ద పోకచెట్లునుగల తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! 

పల్లవమ్ తిగழ் పూమ్ కడమ్బు ఏఱి , అక్కాళియన్ పణ అరఙ్గిల్  ,

ఒల్లై వన్దుఱ ప్పాయ్ న్దు అరునడమ్ శెయ్ ద , ఉమ్బర్ కోన్ ఉఱైకోయిల్ ,

నల్ల వెమ్ దయల్ మూన్ఱు నాల్ వేదమ్  ,  ఐవేళ్వియోడు ఆఱఙ్గమ్ ,

వల్ల అన్దణర్ మల్ గియ నాఙ్గూర్  , వణ్  పురుడోత్తమమే! . 1259

పల్లవమ్ = చిగుళ్ళు; తిగழ் = ప్రకాశింప; పూమ్ = పూలతో నిండిన; కడమ్బు = బండిగురుగింజ చెట్టుపై; ఏఱి = ఎక్కి; అక్కాళియన్ = ఆ క్రూరుడైన కాళీయుని యొక్క; పణ = పడగల; అరఙ్గిల్ = నాట్య స్థలమునకు; ఒల్లై వన్దు = చటుక్కున వచ్చి;ఉఱప్పాయ్ న్దు = దృఢముగ దుముకి; అరునడమ్ శెయ్ ద =అపూర్వమైన నృత్యము చేసిన; ఉమ్బర్ కోన్ = దేవాదిదేవుడు; ఉఱైకోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్య దేశము; ( ఏదనగ ) వెమ్ తయల్ మూన్ఱు = త్రేతాగ్నులును; నాల్  వేదమ్ = నాల్గు వేదములును; ఐవేళ్వియోడు = పంచ మహా యజ్ఞములును; ఆఱు అఙ్గమ్ = వేదముయొక్క ఆరుఅంగములను; వల్ల నల్ల = బోధించు మిక్కిలి సమర్ధవంతులైన; అన్నణర్ = బ్రాహ్మణోత్తములు; మల్ గియ = నివసించుచున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;వణ్ పురుడోత్తమమే! = తిరు వణ్ పురుషోత్తమమ్  అనబడు దివ్యదేశమే!                                                                           

యమునా నది మడుగుఒడ్డున విషప్రభావముచే మోడుబారిన కదమ్బచెట్టును , తన పాదస్పర్శచే  చిగుళ్ళతోను , పూలతోను ప్రకాశింప , ఎక్కి, మడుగులో దుముకి ,క్రూరుడైన కాళీయుని యొక్క ఐదు విశాలమైన పడగల నాట్య స్థలమునకు చటుక్కున వచ్చి ,దృఢముగ దుముకి,ఆ కాళీయుడు శక్తివిహీనుడగునట్లు అపూర్వమైన నృత్యము చేసిన దేవాదిదేవుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము,( ఏదనగ ) త్రేతాగ్నులును నాల్గు వేదములును,పంచ మహాయజ్ఞములును వేదముయొక్క ఆరుఅంగములను , బోధించు  మిక్కిలి సమర్ధవంతులైన బ్రాహ్మణోత్తములు నివసించుచుండు నాఙ్గూర్ ప్రాంతములో నున్న  తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే!.

అణ్డరానవర్ వానవర్కోనుక్కెన్ఱు , అమైత్త శోరదువెల్లామ్ 

ఉణ్డు , కోనిరై మేయ్ త్తు అవైకాత్తవన్ , ఉగన్దు ఇనిదు ఉఱైకోయిల్  ,

కొణ్డలార్ ముழవిల్ కుళిర్ వార్ పొழிల్  , కులమయిల్ నడమాడ  ,

వణ్డుతాన్ ఇశైపాడిడు నాఙ్గూర్  , వణ్ పురుడోత్తమమే! .    1260

అణ్డర్ ఆనవర్ = గోకులవాసులు; వానవర్ కోనుక్కు ఎన్ఱు = దేవేంద్రునకు నైవేద్యమును సమర్పింవలయునని; అమైత్త = తయారుచేసిన; శోర్ అదు ఎల్లామ్ = అన్నము, భక్ష్యము మొదలగువన్నింటిని; ఉణ్డు = ఆరగించినవాడును; కో నిరై = పశువుల సమూహములను; మేయ్ త్తు = మేయించి; అవైకాత్తవన్ = వాటిని రక్షించిన వాడైన సర్వేశ్వరుడు; ఉగన్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; ఉఱైకోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము;( ఏదనగ ) కుళిర్ ఆర్ పొழிల్ = చల్లదనము వ్యాపింపబడిన తోటలలో;  కొణ్డల్ ఆర్ ముழవిల్ =   మేఘములు మిక్కిలి ఘోషించు సమయములందు; కులమ్ మయిల్ = నెమళ్ళ గుంపులచే;  నడమ్ = నృత్యములు; ఆడ = చేయబడుచున్నదియు; వణ్డు =  భ్రమరములచే; ఇశై పాడిడు= ( ఆ నెమళ్ళ నృత్యములకు అనుగుణముగ) ఇంపుగ పాడబడుచున్నదియు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వణ్ పురుడోత్తమమే =  తిరు వణ్ పురుషోత్తమమ్  అనబడు దివ్యదేశమే! .            

మిక్కిలి అమాయకులైన గోకులవాసులచే అనేక పంచభక్ష్యపరమాన్నములు దేవేంద్రుని కొఱకై ఉంచిన నైవేద్యమును ఆరగించిన వాడును , పశువుల సమూహములను మేయించి వాటిని రక్షించినవాడైన సర్వేశ్వరుడు సంతోషముతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము, ( ఏదనగ ) చల్లనితోటలలో, మేఘములు ఘోషలతో, భ్రమరముల ఇంపైన ఝంకారములతో, నెమళ్ళ గుంపుల నృత్యములతొ, విలసిల్లు చున్నదియు , నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే!

పరుమ్ గై ఆనైయిన్ కొమ్బినై ప్పఱిత్తు ,  అదన్ పాగనై చ్చాడిప్పుక్కు ,

ఒరుఙ్గ మల్లరైక్కొన్ఱు , పిన్ కఞ్జనై ఉదైత్తవన్ ఉఱైకోయిల్  ,

కరుమ్బినూడు ఉయర్ శాలిగళ్ విళైదరు , కழనియిల్ మలివావి ,

మరుఙ్గెలామ్ పొழிల్ ఓఙ్గియ నాఙ్గూర్  , వణ్ పురుడోత్తమమే.  1261

పరుమ్ = పెద్ద; కై = తొండముగల; ఆనైయిన్ = ఏనుగుయొక్క;(కువలయాపీడము యొక్క) కొమ్బినై = దంతములను; ప్పఱిత్తు = పెఱికి , చంపి; అదన్ పాగనై = ఆ ఏనుగుయొక్క మావటియొక్క; చ్చాడి = ప్రాణము తీసి; ప్పుక్కు = లోపలకు వెళ్లి; ఒరుఙ్గ = ఒకరితొ చేరినఇంకొకరు; మల్లరై = మల్లులనిద్దరిని; క్కొన్ఱు = వధించిన; పిన్ = తదుపరి; కఞ్జనై = కంసునుని; ఉదైత్తవన్ = తన్ని చంపిన సర్వేశ్వరుడు; ఉఱైకోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; (ఏదనగ ) కరుమ్బినూడు = చెరకుతోటల నడుమ; ఉయర్ = ఉన్నతముగ ఎదిగిన;  శాలిగళ్ = ఎఱ్ఱ ధాన్యపు పంటలు;  విళైదరు = పండింపబడు;  కழనిల్ = పొలములలో; మలి = పెక్కు; వావి = బావులతొ; మరుఙ్గు ఎలామ్ = చుట్టుప్రక్కలంతటను;   పొழிల్ ఓఙ్గియ = తోటల వృద్ధితో కూడిన; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;  వణ్ పురుడోత్తమమే = తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే !

             క్రూరుడైన కంసునిచే ప్రేరేరింపబడి వచ్చిన కువలయాపీడము యొక్క దంతములను విరిచి చంపి , ఆ ఏనుగు మావటివానియొక్క  ప్రాణమును తీసి , మల్లుల ముష్టియుద్దప్రాంగణము లోపలకు వెళ్లి చాణూరముష్టికులనబడు  మల్లుల నిద్దరిని వధించిన పిదప సింహాసనముపై అధిష్టించియున్న కంసునియొక్క జుట్టు పట్టుకొని క్రిందకుఈడ్చి  తన్ని చంపిన సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము , ( ఏదనగ )  చెరకుతోటల నడుమ ఎదిగిన ఎఱ్ఱ ధాన్యపు పంటలు పండింపబడు పొలములలో పెక్కు బావులతొ చుట్టుప్రక్కలంతటను తోటలతో కూడినదియు ,  నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! . 

శాడుపోయ్ వీழ త్తాళ్ నిమిర్ త్తు , ఈశన్ తన్ పడైయోడుమ్ కిళైయోడుమ్ 

ఓడ ,  వాణనై ఆయిరమ్ తోళ్ గళుమ్ , తుణిత్తవన్ ఉఱైకోయిల్  ,

ఆడు వాన్  కొడి అగల్ విశుమ్బు అణవిప్పోయ్ , పగలవన్ ఒళి మఱైక్కుమ్ ,

మాడమాళిగై శూழ்దరు నాఙ్గూర్, వణ్ పురుడోత్తమమే! ,    1262

శాడు =(అసురునిచే ఆవేశింపబఢిన) శకటమును; పోయ్ = ఎగిరి దూరముగ; వీழ = పడి శిధిలమగునట్లు; త్తాళ్ = తన దివ్య పాదముచే; నిమిర్ త్తు = తన్నినవాడును; ఈశన్ తన్ = శివుడు తనయొక్క; పడైయోడుమ్ = సేనలతోడను; కిళైయోడుమ్ = బంధువులతోడను; ఓడ = వెనుదిరిగి పారిపోవునటులజేసి; వాణనై = భాణాసురుని యొక్క; ఆయిరమ్ = వెయ్యి; తోళ్ గళుమ్ = భుజములను; తుణిత్తవన్ = ఖండించిన సర్వేశ్వరుడు; ఉఱైకోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; ( ఏదనగ ) ఆడు = రెపరెపలాడుచున్న; వాన్ కొడి = పెద్ద ధ్వజములు; అగల్ విశుమ్బు = విశాలమైన ఆకాశమును; అణవి పోయ్ = తగులుతు; పగలవన్ = సూర్యునియొక్క;ఒళి = ప్రకాశమును; మఱైక్కుమ్ = కప్పుచున్న;  మాడమ్ = మండపములతోను; మాళిగై = భవనములతోను; శూழ் దరు = చుట్టుకొనియున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వణ్ పురుడోత్తమమే = తిరువణ్ పురుషోత్తమమ్   అనబడు దివ్యదేశమే!

                    క్రూరుడైన కంసునిచే ప్రేరేరింపబడి శకటాసురుడు శకటములో ఆవేశించి పరుండియున్న బాలకృష్ణనిపై దొర్లుకొంటురాగ ,  ఆశకటమును ఎగిరి దూరముగ పడి శిధిలమగునట్లు  తన దివ్య పాదముచే తన్నినవాడును , శివుడు తనయొక్క సేనల తోడను , తన పుత్రుడైన కుమారస్వామి , దుర్గ , అగ్ని మొదలగు బంధువులందరు వెనుదిరిగి పారిపోవునటులజేసి భాణాసురునియొక్క సహస్ర భుజములను ఖండించిన సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము,  ( ఏదనగ )  ఉన్నతమైన భవనములతోను , మండపములతోను చుట్టుకొనియున్నదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! . 

అమ్  కైయాల్ అడిమూన్ఱు నీరేర్ట్రు , అయన్ అలర్ కొడు తొழுదేత్త ,

గంగై పోదర కాల్ నిమిర్తు అరుళియ , కణ్ణన్ వన్దు ఉఱైకోయిల్  ,

కొంగై కోంగవైకాట్ట వాయ్ కుముదంగళ్ కాట్ట , మాపదుమఙ్గళ్ ,

మంగైమార్ ముగమ్ కాట్టిడుమ్ నాఙ్గూర్, వణ్ పురుడోత్తమమే! .1263

మూన్ఱు అడి = మూడడుగుల నేలకొఱకు; అమ్ కైయాల్ = అందమైన చేతులతొ; నీర్ ఏర్ట్రు = దానజలమును స్వీకరించి; (వెనువెంటనే త్రివిక్రమావతారము దాల్చి) అయన్ = బ్రహ్మ;  అలర్ కొడు = పుష్పములను సమర్పించి; తొழுదు = సేవించి; ఏత్త = స్తుతించుటకు తగినట్లుగను; గంగై = గంగానది; పోదర = క్రిందకు పడునట్లు; కాల్ = దివ్య పాదములను; నిమిర్తు అరుళియ= బ్రహ్మలోకమువరకు వ్యాపింపజేసినవాడైన; కణ్ణన్=సర్వేశ్వరుడు;వన్దు = కృపతో వేంచేసి;ఉఱైకోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్య దేశము; ( ఏదనగ )  కోంగు అవై = కోంగు చెట్టు యొక్కమొగ్గలు; మంగైమార్ = (ఆ ఊరిలోనున్న) స్త్రీలయొక్క;  కొంగై కాట్ట = స్తనములను స్పురింప జేయచు; కుముదంగళ్ = ఎఱ్ఱ కలువలు; వాయ్ కాట్ట = (ఆ స్త్రీల) అదరములను స్పురింప జేయచు; మా పదుమఙ్గళ్ = శ్లాఘ్యమైన తామర పుష్పములు; ముగమ్ కాట్టిడు = (ఆ స్త్రీల) ముఖములను స్పురింపజేయు చుండెడి; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;  వణ్ పురుడోత్తమమే =  తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! .

చూపరులకు మహదానందము కలుగజేయు బ్రహ్మచారి రూపములో  మహాబలి యాగభూమివద్దకు ఏతెంచి తన పాదముచే కొలవబడు మూడడగుల భూమిని యాచించి , మహాబలినుండి మంత్రయుక్తమైన దానజలము తన అతిసుందరమైన హస్తమున పడిన వెంటనే  త్రివిక్రమావతారము దాల్చి  బ్రహ్మపుష్పములను సమర్పించి, సేవించి ,స్తుతించుటకు తగినట్లుగను , గంగానది క్రిందకు పడునట్లుగను తన దివ్య పాదములను బ్రహ్మలోకమువరకు వ్యాపింపజేసినవాడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్య దేశము, ( ఏదనగ ) కోంగు చెట్టు యొక్క మొగ్గలు పోలిన  స్తనములును ఎఱ్ఱ కలువలు పోలిన అదరములను , శ్లాఘ్యమైన తామరపుష్పములతో ఒప్పు ముఖమండలములును , కలిగిన  అందమైన స్త్రీలు నివసించుచున్న , నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! . 

ఉళైయ వొణ్ తిఱల్ పొన్ పెయరోన్ తనదు , ఉరమ్ పిళన్దు ఉదిరత్తై 

అళైయుమ్ , వెమ్ శినత్తు అరి పరికీరియ , అప్పన్ వన్దు ఉఱైకోయిల్  ,

ఇళైయ మంగైయర్ ఇణైయడి చ్చిలమ్బినోడు , ఎழிల్ కొళ్ పన్దడిప్పోర్ , కై

వళైయిల్ నిన్ఱు ఒలి మల్ గియ నాఙ్గూర్  , వణ్ పురుడోత్తమమే.  1264

ఒణ్ తిఱల్ = మిక్కిలి బలవంతుడైన; పొన్ పెయరోన్ =  హిరణ్యాసురుడు; ఉళైయ = నొచ్చునట్లు; తనదు = అతనియొక్క; ఉరమ్ = వక్షస్థలమును; పిళన్దు = చీల్చి; ఉదిరత్తై = వచ్చుచున్న రక్తమును; అళైయుమ్ = కెలుకుచున్న; వెమ్ శినత్తు అరి=ఉగ్ర నరసింహుడును; పరికీరియ=గుఱ్ఱము రూపములో వచ్చిన కేశియను అసురుని చంపినవాడును; అప్పన్ = స్వామి; వన్దు = కృపతో వేంచేసి;  ఉఱైకోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; ( ఏదనగ )  ఇళైయ మంగైయర్ = యౌవనయువతులు ; (నృత్యముల వలన ) ఇణై అడి = రెండు కాళ్ళకు కట్టుకొన్న; శిలమ్బినోడు = గజ్జెల ధ్వనులతో కూడ; ఎழிల్ కొళ్ = అందమును సంతరించుకొన్న; పన్దు అడిప్పోర్ = బంతులాటలాడు పిల్లలుయొక్క;  కైవళైయిల్ నిన్ఱు = చేతులకలంకరించిన  గాజుల వలన వచ్చు; ఒలి = శబ్దములతో; మల్ గియ = నిండిన; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న;    వణ్ పురుడోత్తమమే =  తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే!

                   వరబలముచే మిక్కిలి బలిష్టుడైన  హిరణ్యాసురుని విశాలవక్షస్ధలమును చీల్చివధించిన ఉగ్రనరసింహుడును , అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుని చంపినవాడును , అయిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసి నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము, (ఏదనగ )  యౌవనయువతులు రెండు కాళ్ళకు కట్టుకొన్న గజ్జెలు వారి నృత్యములచే గలగలమను ధ్వనులతోపాటు , బంతులాటలాడు పిల్లలుయొక్క చేతులకలంకరించిన గాజుల శబ్దములతో  నిండిన , నాఙ్గూర్ ప్రాంతములో నున్న, తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! 

వాళైయార్ తడఙ్గణుమైపఙ్గన్ , వన్ శాబమర్ట్రదు నీఙ్గ ,

మూళైయార్ శిరత్తు ఐయమున్నళిత్త , ఎమ్ ముగిల్ వణ్ణన్ ఉఱైకోయిల్  ,

పాళైవాన్ కముగు ఊడుయర్ తెఙ్గిన్ , వన్  పழమ్ విழ  వెరువిపోయ్ ,

వాళైపాయ్ తడమ్ శూழ்దరు నాఙ్గూర్  , వణ్ పురుడోత్తమమే! .    1265

వాళైయార్ = మీనమునుపోలిన; తడమ్ కణ్ = విశాలమైన కన్నులుగల; ఉమై = పార్వతీదేవిని; పఙ్గన్ = తన శరీరములో అర్ధభాగముగ కలిగిన రుద్రుని యొక్క;వన్ = భయంకరమైన; శాబమ్ = శాపము; అదు అర్ట్రు =ఆపాపము నశించి; నీఙ్గ = తొలగునట్లు; మున్ = పూర్వము; మూళైయార్ = ఎముకలతొ నిండిన; శిరత్తు = మొండెములొ; ఐయమ్ అళిత్త = బిక్షము పెట్టిన; ఎమ్ = నాయొక్క ఉపకారకుడైన; ముగిల్ వణ్ణన్ = నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుడు; ఉఱైకోయిల్ = కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; ( ఏదనగ ) పాళై = పూబాళలతోనున్న; వాన్ కముగు = ఎత్తుగ ఎదిగిన పోకచెట్ల; ఊడు = నడుమ; ఉయర్ = ఎత్తైన; తెఙ్గిన్ = కొబ్బరిచెట్లనుండి; వన్ పழమ్ విழ=పెద్ద కొబ్బరికాయలు (కొలనులో) పడగా, వాళై = చేపలు; వెరువిపోయ్ పాయ్ =బయపడి ఆచోటునువదిలి మఱియొక చోటునకు గెంతుచుండెడి; తడమ్ = తటాకములతో; శూழ்తరు = చుట్టబడియున్న; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వణ్ పురుడోత్తమమే = తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! .

పూర్వము ఒకప్పుడు అర్ధనారీశ్వరుడైన శివుడు బ్రహ్మహత్యాపాతకముచే శపింపబడి చేతికి అంటుకొన్న పుఱ్ఱెతొ బాధపడుతూ తిరగుచుండగ, ఆమొండెములొ బిక్షము ఒసగి శాపమును తొలగించిన నీలమేఘశ్యాముడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసి  నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము. (ఏదనగ ) ఎత్తుగ ఎదిగిన పోకచెట్ల నడుమనున్న కొబ్బరిచెట్లనుండి వాటి కాయలు నీటిలో పడగా బయపడిన చేపలు అచటినుండి వేఱొక చోటునకు గెంతుచుండెడి తటాకములతో చుట్టబడియున్నదియు, నాఙ్గూర్ ప్రాంతములో వెలసినదియు, అయిన  తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! . 

ఇన్దువార్ శడై యీశనై ప్పయన్ద , నాన్ముగనై తన్ ఎழிలారుమ్ ,

ఉన్ది మామలర్ మీమిశైప్పడైత్తవన్ , ఉగన్దు ఇనిదు ఉఱైకోయిల్  ,

కున్ది వాழைయిన్ కొழுఙ్గని నుగర్ న్దు , తన్ కురుళైయై త్తழுవిప్పోయ్ 

మన్ది మామ్బణైమేల్ వైగు నాఙ్గూర్, వణ్ పురుడోత్తమమే! .    1266

ఇన్దు = చంద్రకళతొకూడి;వార్ = పొడుగైన; శడై = జటలుగల; యీశనై = శివుని; పయన్ద = పుట్టించిన; నాన్ముగనై = చతుర్ముఖ బ్రహ్మను; తన్ = తనయొక్క; ఎழிల్ = సౌందర్యముతొ; ఆరుమ్ = నిండిన; ఉన్ది = నాభి;  మామలర్ మీమిశై = కమలములో; ప్పడైత్తవన్ = సృష్టించిన సర్వేశ్వరుడు; ఉగన్దు = సంతోషముతో; ఇనిదు = భక్తులకు ప్రీతిగ; ఉఱైకోయిల్ = నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; (ఏదనగ ) మన్ది = ఆడకోతి; వాழைయిన్ = అరటిచెట్టుయొక్క; కొழுమ్ కని = మంచి అరటిపండును; కున్ది = ముడుచుకొని కూర్చుండి; నుగర్ న్దు = తినుకొని; తన్ కురుళైయై = తన పిల్లను; తழுవిపోయ్ =హత్తుకొని అచటనుండి పోయి; మామ్ పణైమేల్ = మామిడిచెట్టు కొమ్మలపై; వైగుమ్ = చేరబడియుండెడి; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వణ్ పురుడోత్తమమే =  తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! 

     శివుని పుట్టించిన బ్రహ్మ , ఆచతుర్ముఖ బ్రహ్మను తన నాభి కమలమందు సృష్టించిన జగత్కారణభూతుడైన సర్వేశ్వరుడు కృపతో నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము, ( ఏదనగ ) ఆడ కోతులు తమ పిల్లలతో  అరటి తోటలలొ అరటి పండ్లు తిని సమీపమందున్న మామిడిచెట్ల కొమ్మలపై చేరబడియుండెడి నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమే! .  

** మణ్ణుళార్ పుగழ் వేదియర్ నాఙ్గూర్ , వణ్ పురుడోత్తమత్తుళ్ ,

అణ్ణల్ శేవడిక్కీழ் అడైన్దు ఉయ్ న్దవన్ , ఆలి మన్ అరుళ్ మారి ,

పణ్ణులార్ తర ప్పాడియ పాడల్ , ఇప్పత్తుమ్ వల్లార్ , ఉలగిల్

ఎణ్ణిలాద పేరిన్బముర్ట్రు , ఇమైయవరోడుమ్ కూడువరే .            1267

మణ్ణుళ్ = భూమండలములో; ఆర్ పుగழ் = గొప్ప కీర్తిగల; వేదియర్ = వేదోత్తములు నివసించు; నాఙ్గూర్ = నాఙ్గూర్ ప్రాంతములో నున్న; వణ్ పురుడోత్తమత్తుళ్ = తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమందు కృపతో వేంచేసిన; అణ్ణల్ = స్వామివారి; శే అడిక్కీழ் = ఎఱ్ఱని పాదపద్మములను; అడైన్దు = చేరి; ఉయ్ న్దవన్ = ఉజ్జీవించినవారును; ఆలి మన్ = తిరువాలి దేశమునకు ప్రభువును; అరుళ్ మారి = కృపనే వర్షించుమేఘము పోలిన తిరుమంగై ఆళ్వారులు;పణ్ణుల్ ఆర్ తర = గాన పుష్టితొ; పాడియ = పాడిన; పాడల్ = పాశురములైన;  ఇ పత్తుమ్ = ఈ పదింటిని; వల్లార్ = అధ్యయనము చేయువారు; ఉలగిల్ = ఈ లోకములో; ఎణ్ ఇలాద = చెప్పలేనంత; పేర్ ఇన్బమ్ = అమితమైన ఆనందమును; ఉర్ట్రు = అనుభవంచిన; (పిదప),  ఇమైయవరోడుమ్ = నిత్యశూరులతో; కూడువర్ = చేరి నివసించుదురు.                                                        

విఖ్యాతిపొందిన వేదోత్తములు నివసించు నాఙ్గూర్ ప్రాంతములో నున్న తిరు వణ్ పురుషోత్తమమ్ అనబడు దివ్యదేశమందు కృపతో వేంచేసిన సర్వేశ్వరుని పాదపద్మములను చేరి ఉజ్జీవించినవారును , తిరువాలి దేశమునకు ప్రభువును , దయాసముద్రుడును , అయిన తిరుమంగై ఆళ్వారులు నుడివిన గాన పుష్టిగల ఈ  పది పాశురములను అధ్యయనము చేయువారు ఈ లోకములో చెప్పలేనంత మహదానందమును అనుభవంచిన పిదప పరమపదమందు నిత్యశూరులతో చేరి నివసించుదురు .

*******

వ్యాఖ్యానించండి