శ్రీః
7 . కణ్ణార్ కడల్
అవతారిక :
శ్రీమాన్ తిరుమంగై ఆళ్వారులు, ఒకప్పుడు తాను దివ్యదంపతల రూపములో విచ్చేసిన పెరుమాళ్ళ ఆభరణాలను దొంగిలించే సన్నివేశములో, దుస్థితిలో, పెరుమాళు యొక్క శ్రీపాదముల స్పర్శ చేతను , నిర్హేతుకకృపచే కృపతో పొందిన తిరుమంత్రలభ్ధి వలనను, కలిగిన అనుభూతి, ఆనంద పరవశము, ఈ దివ్యదేశ సందర్శనములో స్పురింప, సంసార తాపముల ముక్తి పొంది, పెరుమాళును సేవించినపుడు కలుగు స్ధితి ఎటువంటిదో కదా !.. లీనమైన మనస్సుతో ఈ దివ్యదేశ పెరుమాళును ఉద్దేశించి… శ్రీ శ్రీనివాసా! అణ్ణా! సంసార దుఃఖములను తొలగించి నీ కైంకర్యమును అనుగ్రహింపుమా! అని ఈ పాశురములతో పెరుమాళ్ సన్నిధిలో తమ విన్నపమును సమర్పణ చేయుచున్నారు.
** కణ్ణార్ కడల్ పోల్, తిరుమేని కరియాయ్ ,
నణ్ణార్ మునై, వెన్ఱికొళ్వార్మన్ను నాఙ్గూర్,
తిణ్ణార్ మదిళ్ శూழ், తిరువెళ్ళక్కుళత్తుళ్
అణ్ణా!, అడియేనిడరై క్కళైయాయే ll 1308
కణ్ణార్ = విశాలమైన ; కడల్ పోల్ = సాగరము వలె ; తిరుమేని = నీ దివ్యమంగళ శరీరము ; కరియాయ్ = నీల కాంతిచే శోభిల్లు నా స్వామీ!;నణ్ణార్ = శత్రువులతోడ జరిగే ; మునై = యుద్ధములో; వెన్ఱికొళ్వార్ = జయమే సాధించుపురుషోత్తములు ;మన్ను = నివసించు ; నాఙ్గూర్ = నాఙ్గూరులో ; తిణ్ణార్మదిళ్ = దృఢమైన ప్రాకారములచే ; శూழ் = చుట్టబడిన ; తిరువెళ్ళక్కుళత్తుళ్ = తిరువెళ్ళక్కుళమ్ దివ్యదేశములో కృపతో వేంచేసిన ; అణ్ణా! = స్వామీ! ; అడియేన్ = నీ పాదదాసుని ; ఇడరై = దుఃఖములను ; కళైయాయే! = నశింపజేయుమా!
తమ విరోదులను నిర్జించు కీర్తిగల పురుషోత్తములు నివసించు నాఙ్గూరులో, దృఢప్రాకారములుగల తిరువెళ్ళక్కుళమ్ దివ్య దేశములో కృపతో వేంచేసిన నాస్వామీ! విశాలమైన, గంభీరమైన సాగరమును కాంచు కన్నులను మరలింప తరముకాదో, అట్టి నీలమైన కాంతిచే శోభిల్లు శ్రీ శ్రీనివాసా! నీ పాదదాసుని సంసార తాపములను నశింపజేయుమా!
కొన్దార్ తుళవ, మలర్ కొణ్డు అణివానే!,
నన్నాద పెరు పుకழ், వేతియర్ నాఙ్గూర్,
శెన్దామరై నీర్, తిరువెళ్ళక్కుళత్తుళ్
ఎన్దాయ్!, అడియేనిడరై క్కళైయాయే! . 1309
కొన్దార్ = పూలగొత్తులతో నిండిన ; తుళువ మలర్ కొణ్డు = తులసీ పుష్పముల మాలలను; అణివానే = ధరించి శోభిల్లు శ్రీ శ్రీనివాసా! ;నన్నాద = ఎన్నడును కొఱతలేని; పెరుమ్ పుకழ் = గొప్ప కీర్తి కలిగిన ; వేతియర్ = వేదోత్తములు నివసించు ; నాఙ్గూర్ = నాఙ్గూరులో ; శెన్ తామరై నీర్ = ఎఱ్ఱ తామరపూలతో నిండిన కొలనులుగల ; తిరువెళ్ళక్కుళత్తుళ్ = తిరువెళ్ళక్కుళమ్ దివ్య దేశములో కృపతో వేంచేసిన ; ఎన్దాయ్ = నా స్వామీ! ; అడియేన్ = నీ దాసుని ; ఇడరై = దుఃఖములను ; కళైయాయే = తొలిగించుమా!
మనోహరమైన తులసీపుష్పమాలలను ధరించిన స్వామీ! నీ దివ్యానుగ్రహముచే ఎన్నడును ఎటువంటి కొఱతయు లేక, సంసార తాపములను ఎడబాసిరి అనబడే గొప్ప కీర్తిగల వేదోత్తములు నివసించు నాఙ్గూరులో ఎఱ్ఱ తామరపూలతో నిండిన కొలనులుగల తిరువెళ్ళక్కుళమ్ దివ్య దేశములో కృపతో వేంచేసిన నాస్వామీ! శ్రీ శ్రీనివాసా! నీ పాదదాసుని సంసార దుఃఖములను తొలగించి నీ కైంకర్యమును అనుగ్రహింపుమా!
కున్ఱాల్ కుళిర్ మారి, తడత్తుకన్దానే!,
నన్ఱాయ పెరుమ్ పుకழ், వేతియర్ నాఙ్గూర్,
శెన్ఱార్ వణఙ్గుమ్, తిరువెళ్ళక్కుళత్తుళ్
నిన్ఱాయ్, నెడియాయ్ అడియేనిడర్ నీక్కే! 1310
కున్ఱాల్ = గోవర్ధన పర్వతముచే ; కుళిర్ మారి = స్థంబింపజేయు వర్షమును ; తడత్తు = అడ్డగించి ; ఉకన్దానే = ఆనందించిన నాస్వామీ! ;నన్ఱాయ = విలక్షణమైన ; పెరుమ్ పుకழ் = గొప్ప కీర్తిగల ; వేదియర్ = వేదోత్తములు నివసించు ; నాఙ్గూర్ = నాఙ్గూరులో ; శెన్ఱార్ = వచ్చుపోవు జనులందరూ ; వణఙ్గుమ్ = మ్రొక్కుటకు అనుకూలముగా ; తిరువెళ్ళక్కుళత్తుళ్ = తిరువెళ్ళక్కుళమ్ దివ్య దేశములో ; నిన్ఱాయ్ = నిలచిన కరుణామయీ! ;నెడియాయ్= అంతులేని మహిమగల నాస్వామీ! శ్రీశ్రీనివాసా!; అడియేన్ = నీ దాసుని ; ఇడరై = దుఃఖములను ; నీక్కే = తొలగించుమా!
ఒకప్పుడు ఆగ్రహముతో ఇంద్రుడు కురుపించిన భయంకరమైన వర్షమును, నీ చిటికిన వేలికొనతో గోవర్ధనపర్వతమును పైకెత్తి గోకులవాసులను సంరక్షించి ఆనందించిన నాస్వామీ! విలక్షణమైన కీర్తిచే ఒప్పు వేదోత్తములునివసించు నాఙ్గూరులో, తిరువెళ్ళక్కుళమ్ దివ్య దేశములో, వచ్చుపోవు జనులందరూ నీపాదములను సేవించి ఉజ్జీవించుటకు అనువుగా , వేంచేసి నిలచిన నాస్వామీ! అంతులేని మహిమగల శ్రీ శ్రీనివాసా! నీ దాసుని దుఃఖములను తొలగించుమా!
కానార్ కరికొమ్బదు, ఒశిత్త కళిఱే!,
నానావగై, నల్లవర్ మన్నియ నాఙ్గూర్,
తేనార్ పొழிల్ శూழ், తిరువెళ్ళక్కుళత్తాయ్,
ఆనాయ్!, అడయేనుక్కు అరుళ్ పురియాయే!. 1311
కానార్ = అడవిలో పెరిగి మదించన ; కరి = ఏనుగు (కువలయాపీడము) యొక్క; కొమ్బు అదు = దంతములను ; ఒశిత్త = విరిచిన ; కళిఱే = బలమైన ఏనుగువంటి నాస్వామీ! ;నానావగై = ఙ్ఞాన ,భక్తి మొదలగు సద్గుణములతో అలరారు పరుషోత్తములతో ; మన్నియ = కూడిన ; నాఙ్గూర్ = నాఙ్గూరులో; తేనార్ = తేనెలతో నిండిన ; పొழிల్ శూழ் = తోటలతో చుట్టబడిన; తిరువెళ్ళక్కుళత్తుళ్= తిరువెళ్ళక్కుళమ్ అనుదివ్యదేశములో కృపతో వేంచేసిన ; ఆనాయ్ = గజేంద్రుడా! ; అడియేనుక్కు = దాసుని మీద ; అరుళ్ పురియాయే = కృపనుసారించుమా!
కంసునిచే ప్రేరేరింపబడిన, మదజలము స్రవించు, కువలయాపీడము యొక్క దంతములను విరిచి చంపిన బలమైన ఏనుగువంటి నాస్వామీ! ఙ్ఞాన, వైరాగ్యము,భక్తి మొదలగు సద్గుణములతో ఒప్పు శ్రీవైష్ణవులు నివసించు నాఙ్గూరులో, తేనెలు వెదజల్లు సుందరమైన పూతోటలతో చుట్టుకొనియున్న తిరువెళ్ళక్కుళమ్ అను దివ్య దేశములో వేంచేసిన ఏనుగువంటివాడా! శ్రీ శ్రీనివాసా! నీ దాసునిపై దయసారించుమా!
** వేడార్ తిరువేఙ్గడం, మేయవిళక్కే!,
నాడార్ పుకழ், వేతియర్ మన్నియ నాఙ్గూర్,
శేడార్ పొழிల్ శూழ், తిరువెళ్ళక్కుళత్తాయ్,
పాడావరువేన్, వినైయాయిన పార్ట్రే! 1312
వేడార్ = వేటగాండ్రతో నిండిన ; తిరువేఙ్గడం = తిరుమలలో; మేయ = నిత్యవాసము చేయుచున్న ; విళక్కే= పరంజ్యోతీ! ; నాడు ఆర్ పుకழ் = దేశమంతటను గొప్ప కీర్తితో ప్రకాశించు ;వేతియర్ = వేదోత్తములు ;మన్నియ = నివసించు ; నాఙ్గూర్ = నాఙ్గూరులో; శేడార్ = దట్టమైన ; పొழிల్ శూழ் = తోటలతో చుట్టబడిన ; తిరువెళ్ళక్కుళత్తాయ్ = తిరువెళ్ళక్కుళమ్ లో వెలసిన శ్రీనివాసా!; పాడా = గానము చేసికొంటూ ;వరువేన్ = వచ్చిన నీ దాసుని యొక్క ; వినై ఆయిన = పాప సమూహము లన్నింటిని ; పార్ట్రే = భస్మము చేయుమా!
కైంకర్యపరులయిన వేటగాండ్రతో ఒప్పు తిరుమలలో నిత్యవాసము చేయుచున్న పరంజ్యోతీ! గొప్ప కీర్తిగల వేదోత్తములు నివసించు నాఙ్గూరులో దట్టమైన పూతోటలతో చుట్టుకొనియున్న తిరువెళ్ళక్కుళమ్ అను దివ్య దేశములో వేంచేసిన శ్రీ వేంకటేశ్వరా! నీ కల్యాణగుణములను పాడుతూ నీపాదములచెంత చేరిన దాసుని పాప సమూహములన్నింటిని భస్మీపటలము చేయుమా!
కల్లాల్ కడలై, అణై కట్టి ఉకన్దాయ్,
నల్లార్ పలర్,వేదియర్ మన్నియ నాఙ్గూర్
శెల్వా!, తిరువెళ్ళక్కుళత్తుఱైవానే,
ఎల్లాఇడరుమ్ , కెడుమాఱు అరుళాయే! 1313
కల్లాల్ = పెద్ద రాతిబండలచే ; కడలై = సముద్రములో ; అణై కట్టి = సేతువు కట్టి ; ఉకన్దాయ్ = ఆనందించిన స్వామీ! ; నల్లార్ పలర్ = విలక్షుణులైన పలువురు ;వేదియర్ = వేదోత్తములు ; మన్నియ = నివసించు ; నాఙ్గూర్ = నాఙ్గూరులో ; తిరువెళ్ళక్కుళత్తు = తిరువెళ్ళక్కుళమ్ అను దివ్యదేశములో ; ఉఱైవానే = కృపతో వేంచేసిన ; శెల్వా = శ్రీ మంతుడా!; ఎల్లాఇడరుమ్ = నా దుఃఖములు అంతయును; కెడుమాఱు = నశించునట్లు ; అరుళాయే = కృపచేయుమా!
పర్వతములను పోలిన రాతిబండలచే లోతైన సముద్రములో సేతువు కట్టి (సీతాదేవి యొక్క కష్టములు తీరు సమయము ఆసన్నమైనదని) మిక్కిలి ఆనందించిన నాస్వామీ! సద్గుణములతో విలసిల్లు అనేక శ్రీ వైష్ణవులు నివసించు నాఙ్గూరులో, తిరువెళ్ళక్కుళమ్ దివ్య దేశములో కృపతో వేంచేసిన శ్రీ మంతుడా! నా దుఃఖములంతయు నశింపజేసి కనికరించుమా!
కోలాల్ నిరై మేయ్ త్త, ఎఙ్గోవలర్ కోవే!,
నాలాగియ , వేదియర్ మన్నియ నాఙ్గూర్,
శేలార్ వయల్ శూழ், తిరువెళ్ళక్కుళత్తుళ్
మాలే!, ఎనవల్ వినై తీర్తు అరుళాయే! . 1314
కోలాల్ = చేతికర్రచే ;నిరై = పశుసమూహలములను ; మేయ్ త్త = మేయించిన ; ఎమ్ కోవలర్ కోవే = నా గోపాలకృష్ణుడా! ; నాలాగియ = నాలుగు వేదములు స్తుతించు ; వేదియర్ = వేదోత్తములు ; మన్నియ = నివసించు ; నాఙ్గూర్ = నాఙ్గూరులో; శేలార్ = మత్స్యములతో నిండిన ; వయల్ శూழ் = పొలములతో చుట్టుకొనియున్న ; తిరువెళ్ళక్కుళత్తుళ్ = తిరువెళ్ళక్కుళమ్ అనుదివ్య దేశములో కృపతో వేంచేసిన; మాలే = సర్వాధికుడా! ; ఎన = నాయొక్క ; వల్ వినై = క్రూరమైన పాపములన్నింటిని తీర్తు=నివర్తించి ; అరుళాయే = కృపచేయుమా!
గొల్లల కులవృత్తికి అనుగుణముగా చేతిలో ఒక కర్రను బూని పశువులను తోలుకొనిపోయి మేయించిన నా గోపాలకృష్ణుడా! అనర్గళముగా నాలుగు వేదములు స్తుతించు వేదోత్తములు నివసించు నాఙ్గూరులో మత్స్యములతో నిండిన పొలములతో చుట్టుకొనియున్న తిరువెళ్ళక్కుళమ్ అను దివ్య దేశములో వేంచేసిన దేవాదిదేవా! నీ దాసుని యొక్క క్రూరమైన పాపములన్నింటిని తొలగించి కృపచేయుమా!
వారాగమదాగి, ఇమ్మణ్ణైయిడన్దాయ్,
నారాయణనే!, నల్లవేదియర్ నాఙ్గూర్,
నీర్ పొழிల్ శూழ், తిరువెళ్ళక్కుళత్తుళ్,
ఆరావముదే!, అడియేఱ్కరుళాయే! 1315
వారాగమ్ అదు ఆగి = మహా వరాహముగ అవతరించి ; ఇమ్మణ్ణై = ఈ భూమిని ; ఇడందాయ్ = అండభిత్తినుండి పైకెత్తిన ; నారాయణనే = నారాయణా! ; నల్ల వేదియర్ = విలక్షణమైన వేదోత్తములతో వెలయు ; నాఙ్గూర్ = నాఙ్గూరులో ;శీరార్ పొழிల్ = శ్లాఘ్యమైన తోటలతో ; శూழ் = చుట్టుకొనియున్న తిరువెళ్ళక్కుళత్తుళ్ = తిరువెళ్ళక్కుళమ్ అను దివ్య దేశములో కృపతో వేంచేసిన ; ఆరావముదే = ఎంతఅనుభవించినను తృప్తితీరని అమృతతుల్యుడా ! ; అడియేఱ్కు = నీ దాసునిపై ; అరుళాయే = కృపచేయుమా!
ప్రసిద్దమైన వేదోత్తములు నివసించు నాఙ్గూరులో శ్లాఘ్యమైన పూతోటలతో చుట్టుకొనియున్న తిరువెళ్ళక్కుళమ్ అను దివ్య దేశములో కృపతో వేంచేసిన నాస్వామీ! వరాహ అవతారమును దాల్చి భూమిని అండభిత్తినుండి పెగళించి ఉద్ధరించిన శ్రీమన్ నారాయణా! ఎంత అనుభవించినను తృప్తితీరని అమృతమువంటివాడా! నీ పాదములచెంతనున్న ఈదాసునిపై కృపనుసారించుమా!
పూవార్ తిరుమామగళ్, పుల్గియమార్బా,
నావార్ పుకழ், వేదియర్ మన్నియ నాఙ్గూర్
దేవా!, తిరువెళ్ళక్కుళత్తుఱైవానే,
ఆవా అడియాన్, ఇవనెన్ఱరుళాయే! 1316
పూవార్ = కమలవాసినియైన ; తిరుమామగళ్ = అలర్ మేల్ మంగ తాయారు ; పుల్గియ = ప్రీతితోచేరిన ; మార్బా = వక్షస్థలము గల నాస్వామీ! ; నావార్ పుకழ் = జనుల వాక్కులలో ఎల్లప్పుడూ పొగడబడు కీర్తిగల ; వేదియర్ = వేదోత్తములు ; మన్నియ = నివసించు ; నాఙ్గూర్ = నాఙ్గూరులో ; తిరువెళ్ళక్కుళత్తు = తిరువెళ్ళక్కుళమ్ అను దివ్య దేశములో ;ఉఱైవానే = కృపతో వేంచేసిన ; దేవా! =దేవాదిదేవా! ;ఇవన్ = నీ చరణములయందు మోకరిల్లియున్న ;అడియాన్ = ఈ దాసుడు ; ఆవా ఎన్ఱు = అయ్యో! సంసార దుఃఖముల నడుమ అలమటించుచున్నాడే అని తలచి; అరుళాయే = దయసారించుమా!
కమలవాసినియైన అలర్మేల్ మంగ తాయారు, నిన్ను ఒక క్షణము వీడక ప్రీతితోచేరిన వక్షస్థలముతో మెరయు శ్రీనివాసా! నాస్వామీ! ప్రశస్తమయిన కీర్తిగల వేదోత్తములు నివసించు నాఙ్గూరులో, తిరువెళ్ళక్కుళమ్ అను దివ్య దేశములో కృపతో వేంచేసిన దేవాదిదేవా! నీ చరణద్వంద్వములయందు మోకరిల్లియున్న ఈ దాసుడు ” అయ్యో! సంసార దుఃఖముల నడుమ అలమటించుచున్నాడే ” అని తలచి నీ దివ్యానుగ్రహమును ప్రసరింపజేయుమా!
** నల్లన్బుడై, వేదియర్ మన్నియ నాఙ్గూర్,
శెల్వన్, తిరువెళ్ళక్కుళత్తుఱైవానై ,
కల్లిన్ మలితోళ్, కలియన్ శొన్న మాలై,
వల్లరెనవల్లవర్ , వానవర్ తామే! 1317
నల్ అన్బుడై = శ్లాఘ్యమైన భక్తిగల ; వేదియర్ = వేదోత్తములు ; మన్నియ = నివసించు ; నాఙ్గూర్ = నాఙ్గూరులో ; తిరువెళ్ళక్కుళత్తుళ్ = తిరువెళ్ళక్కుళమ్ అను దివ్య దేశములో ; ఉఱైవానై = నిత్యవాసము చేయుచున్న ; శెల్వన్ = భగవంతుని విషయమై ;కల్లిన్ = పర్వతముకంటెను ; మలితోళ్ = దృఢమైన భుజములుగల ; కలియన్ = తిరుమంగై ఆళ్వారులు ; శొన్న = కృపతో చెప్పిన ; మాలై = దివ్య సూక్తుల మాలను ; వల్లరెనవల్లవర్ = ఎవరు, మనోహరముగ పాడ సమర్థులనబడెదరో ; తాము = అట్టి పురుషోత్తములు ; వానవర్ = నిత్యశూరులతో చేరుదురు.
భక్తాగ్రేసురులైన వేదోత్తములు నివసించు నాఙ్గూరులో, తిరువెళ్ళక్కుళమ్ అను దివ్య దేశములో కృపతో వేంచేసిన భగవంతుని విషయమై తిరుమంగై ఆళ్వారులు నుడివిన దివ్య సూక్తుల మాలను మధురముగా పాడగల మహనీయులు నిత్యశూరులతో చేరి మహదానందమును బడయుదురు.
*******