శ్రీః
9 . నుమ్మైత్తొழுదోమ్
(కోయిల్ తిరుమొழி)
అవతారిక :-
తిరువిందళూరు దివ్యదేశమున కృపతో వేంచేసియున్న పరిమళ రంగనాథన్ పెరుమాళ్ ను కనులార చూసి,చేతులారా సేవను నిరంతరము ఎటువంటి అంతరాయములు లేక పొందగోరి, మిక్కిలి పరితపించి తిరుమంగై ఆళ్వార్, పాడుటకును,వినుటకును అతి మధురమైన ఈపాశురములను అనుగ్రహించినారు.
** నుమ్మై త్తొழுదోమ్, నున్దమ్ పణిశెయ్ దిరుక్కుమ్ నుమ్మడియోమ్,
ఇమ్మైక్కిన్బమ్ పెర్ట్రోమ్, ఎన్దాయ్ ఇన్దళూరీరే,
ఎమ్మై క్కడితా క్కరుమమరుళి, ఆవా ఎన్ఱిరఙ్గి,
నమ్మై ఒరుకాల్ కాట్టి నడన్దాల్, నాఙ్గల్ ఉయ్యోమే ll 1328
ఇన్దళూరీరే = తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!; ఎన్దాయ్ = నా స్వామీ!; నుమ్మై త్తొழுదోమ్ = దేవరవారిని ఆశ్రయించినవారము; నుమ్ తమ్ పణిశెయ్ దు ఇరుక్కుమ్ = శ్రీవారియొక్క కైంకర్యములు చేయుచునుండెడి; నుమ్ అడియోమ్ = మీయొక్క దాసులము; ఇమ్మైక్కు = ఈ జన్మమందు; ఇన్బమ్ పెర్ట్రోమ్ = మిమ్ములను సేవించు ఙ్ఞానసంబంధమైన ఆనందమును పొందగలిగితిమి; ఎమ్మై = ఇటువంటి వారైన మా విషయమందు; ఆ ఆ ఎన్ఱు ఇరఙ్గి = అయ్యయ్యో అని కనికరించి; కడిదు ఆ = అతి శీఘ్రముగా; కరుమమ్ అరుళి = ఏదైన ఒక కైంకర్యమును నియమించి; నమ్మై = మాకు; ఒరుకాల్=ఒక్కసారియైనా; కాట్టి = తమ దివ్యమంగళ స్వరూపమును జూపి; నడన్దాల్=తమరు వేంచేసినచో; నాఙ్గల్ ఉయ్యోమే = మేము ఉజ్జీవింపబడుదుముగదా!
తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!,నా స్వామీ!, దేవరవారిని ఆశ్రయించినవారము.శ్రీవారియొక్క కైంకర్యములు చేయుచునుండెడి మీయొక్క దాసులము.ఈ జన్మమందు మిమ్ములను సేవించు ఙ్ఞానసంబంధమైన ఆనందమును పొందగలిగితిమి. ఇటువంటి వారైన మా విషయమందు “అయ్యయ్యో” అని కనికరించి అతి శీఘ్రముగా ఏదైన ఒక కైంకర్యమును నియమించి మాకు ఒక్కసారియైనా తమ దివ్యమంగళ స్వరూపమును జూపి, తమరు వేంచేసినచో, మేము ఉజ్జీవింపబడుదుముగదా!
** శిన్దైతన్నుళ్ నీఙ్గాదుఇరున్ద తిరువే, మరువ ఇనియ
మైన్దా, అమ్ తణ్ ఆలి మాలే, శోలై మழ కళిఱే,
నన్దావిళక్కిన్ శుడరే, నఱైయూర్ నిన్ఱనమ్బి, ఎన్
ఎన్దాయ్ ఇన్దళూరాయ్, అడియేఱ్కు ఇఱైయుమ్ ఇరఙ్గాయే ll 1329
శిన్దైతన్నుళ్=హృదయమందు;నీఙ్గాదు ఇరున్ద =ఒక క్షణమైనను విడువక యున్న;తిరువే=శ్రీమంతుడా!; మరువ ఇనియ = ఆశపడునట్లు భోగ్యమైన; మైన్దా = నిత్య యౌవనుడా!; అమ్ తణ్ ఆలి మాలే = అందమైన,చల్లని తిరువాలి దివ్యదేశమున వేంచేసియున్న భక్తవత్సలుడా!;శోలై మழ కళిఱే=తోటలలో తిరుగుచుండెడి పిల్లఏనుగువంటి వాడా!;నన్దా విళక్కిన్ శుడరే = ఎడతెగక వెలుగుచుండెడి దీపపు కాంతివలె ప్రకాశించువాడా!;నఱైయూర్ నిన్ఱ నమ్బి=తిరు నఱైయూర్ దివ్యదేశమందు వేంచేసియున్న పరిపూర్ణుడా!;ఎన్దాయ్=నాయొక్క స్వామీ!; ఇన్దళూరాయ్= తిరువిందళూరిలో వేంచేసి యున్నవాడా!; అడియేఱ్కు = ఈ దాసుని విషయమున; ఇఱైయుమ్ = స్వల్పమైనను; ఇరఙ్గాయే =దయ చూపుటలేదే!
హృదయమందు ఒక క్షణమైనను విడువక యున్న శ్రీమంతుడా!, ఆశపడునట్లు భోగ్యమైన నిత్యయౌవనుడా!, అందమైన,చల్లని తిరువాలి దివ్యదేశమున వేంచేసియున్న భక్తవత్సలుడా!,తోటలలో తిరుగుచుండెడి పిల్లఏనుగువంటి వాడా!, తిరు నఱైయూర్ దివ్యదేశమందు వేంచేసియున్న పరిపూర్ణుడా!,నాయొక్క స్వామీ! తిరువిందళూరిలో వేంచేసియున్నవాడా!,ఈ దాసుని విషయమున స్వల్పమైనను దయ చూపుటలేదే!
పేశుకిన్ఱదిదువే, వైయమ్ ఈరడియాల్ అళన్దు,
మూశి వణ్డు మురలుమ్, కణ్ణి ముడియీర్, ఉమ్మై క్కాణు
మాశైయెన్నుమ్, కడలిల్ వీழுన్దు ఇఙ్గు అయర్తోమ్, అయలారుమ్
ఏశుకిన్ఱ దిదువే కాణుమ్, ఇన్దళూరీరే ll 1330
వైయమ్ = లోకములను; ఈర్ అడియాల్ అళన్దు=రెండు అడుగులచే కొలిచి;వణ్డు = తుమ్మెదలు;మూశి = గుమిగూడి; మురలుమ్=ఝంకారము చేయు;కణ్ణి =తులసీమాలను;ముడియీర్= దివ్యకిరీటముగ గలవాడా!; ఇన్దళూరీర్ = తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!; ఇఙ్గు = ఈ లోకమున; ఉమ్మై క్కాణుమ్ ఆశై ఎన్నుమ్ కడలిల్ వీழுన్దు =శ్రీవారిని ప్రత్యక్ష దర్శనము పొందవలెననెడి ఆశా సముద్రమందు పడి; అయర్తోమ్ = వ్యాకులత పొందితిమి;అయలారుమ్= ఇరుగు పొరుగువారు; ఏశుకిన్ఱదు = పరిహసించుచుండునది; ఇదువే కాణుమ్ = ఈ విషయమే సుమా!; పేశుకిన్ఱదు ఇదువే= తమకు అపవాదు ఏమియు కలుగనీయకుండుటకే మేము నుడువుచున్నాము స్వామీ!
మహాబలి యాగభూమివద్దకు వెడలి మూడడుగులస్థలమును యాచించి లోకములంతయు రెండు అడుగులచే కొలిచి, తమ దివ్య చరణారవిందములను సమస్త జనుల శిరస్సుపై మోపిన దయామయా!, తుమ్మెదలు సంచరించు తులసీపుష్పమాలను దివ్యకిరీటముగ గలవాడా!తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!ఈ లోకమున శ్రీవారిని ప్రత్యక్ష దర్శనము పొందవలెననెడి ఆశా సముద్రమందు పడి వ్యాకులత పొందితిమి.ఇరుగు పొరుగువారు పరిహసించు చుండునది ఈ విషయమే సుమా!.తమకు అపవాదు ఏమియు కలుగనీయకుండుటకే మేము నుడువుచున్నాము స్వామీ! (దుఃఖము మాకు సహజ స్వభావమే అయినను, మీ దాసులైన పిదప మాకు కలిగెడి అపవాదు, మీకు పరాభవమగునని, తిరుమంగై ఆళ్వార్ వాపోవుచున్నారు)
ఆశైవழுవాతు ఏత్తుమ్, ఎమక్కు ఇఙ్గు ఇழுక్కాయ్ త్తు, అడియోర్కు
త్తేశమఱియ, ఉమక్కేయాళాయ్ తిరికిన్ఱోముక్కు,
కాశినొళియిల్ తికழுమ్ వణ్ణమ్, కాట్టీర్ ఎమ్బెరుమాన్,
వాశివల్లీర్ ఇన్దళూరీర్, వాழ்న్దేపోమ్ నీరే ll 1331
ఇఙ్గు=ఇచట;ఆశై వழுవాతు=కోరికయందు లేశమైనను కొదువ లేక; ఏత్తుమ్ ఎమక్కు= స్తుతించుచున్న మాకు; ఇழுక్కు ఆయ్ త్తు = నిందయేకలిగినది; తేశమ్ అఱియ = లోకమంతయు తెలుసుకొనునటుల; ఉమక్కే ఆళాయ్ తిరికిన్ఱోముక్కు అడియోర్కు= మీకే దాసులై సంచరించెడి మాకు; కాశిన ఒళియిల్ = కరగించిన బంగారపు నాణెముల కాంతి కంటెను; తికழுమ్ = మిక్కిలి ప్రకాశంచెడి; వణ్ణమ్ = మీ రూపసౌందర్యమును; కాట్టీర్ = కనిపింపజేయలేదు; ఎమ్బెరుమాన్ = మాయొక్క ప్రభువా!;ఇన్దళూరీర్ = తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!; వాశి వల్లీర్ = తారతమ్యములను కనపరచు ప్రఙ్ఞగల స్వామీ!; నీరే వాழ்న్దే పోమ్ = మీయొక్క రూపము మీరే చూచుకొని ఆనందాతిశయముతో నుందురుగాక!
ఇచట మిమ్ము దర్శించు కోరికయందు లేశమైనను కొదువ లేక స్తుతించుచున్న మాకు నిందయే మిగిలినది.లోకమంతయు తెలుసుకొనునటుల మీకే దాసులై సంచరించెడి మాకు కరగించిన బంగారపు నాణెముల కాంతి కంటెను మిక్కిలి ప్రకాశంచెడి మీ రూపసౌందర్యమును కనిపింపజేయలేదు. మాయొక్క ప్రభువా!, తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!,తారతమ్యములను కనపరచు ప్రఙ్ఞగల స్వామీ!,మీయొక్క రూపము మీరే చూచుకొని ఆనందాతిశయముతో నుందురుగాక! (తిరుమంగై ఆళ్వార్ యొక్క గాఢ నిస్పృహ తెలుపు పాశురము)
తీయెమ్బెరుమాన్ నీర్ ఎమ్బెరుమాన్, తిశైయుమ్ ఇరునిలను
మాయ్, ఎమ్బెరుమానాగి నిన్ఱాల్, అడియోమ్ కాణోమాల్,
తాయ్ ఎమ్బెరుమాన్, తన్దైతన్దైయావీర్, అడియోము
క్కే ఎమ్బెరుమానల్లీరో నీర్, ఇన్దళూరీరే ll 1332
ఇన్దళూరీరే = తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!; నీర్ = తమరు; తీ ఎమ్బెరుమాన్ = తేఙస్సు తత్వమునకు అంతర్యామియైన స్వామియు; నీర్ ఎమ్బెరుమాన్= జల తత్వమునకు అంతర్యామియైన స్వామియు; తిశైయుమ్ ఇరునిలనుమ్ ఆయ్ ఎమ్బెరుమాన్ ఆగి నిన్ఱాల్ = అన్ని దిశలకు, విశాలమైన భూమండలమునకు నిర్వాకుడై అంతర్యామియైన స్వామిగ యుండినప్పుడు; అడియోమ్ కాణోమ్ ఆల్ = (అఙ్ఞానముతో నిండియున్న) నీ దాసులమైన మేము దేవరవారిని దర్శింలేకపోవుచున్నాము అయ్యో!;తాయ్ = తల్లిగను, ఎమ్బెరుమాన్ = మాకు స్వామిగను; తన్దై తన్దై = మా తండ్రికి తండ్రిగను, ఆవీర్ = అయియున్నస్వామీ!; నీర్ = తమరు; అడియోముక్కే ఎమ్బెరుమాన్ అల్లీరో = మాకు అద్వితీయమైన ప్రభువే కదా స్వామీ!
తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!, తమరు తేఙస్సు తత్వమునకు అంతర్యామియైన స్వామియు, జల తత్వమునకు అంతర్యామియైన స్వామియు, అన్ని దిశలకు, విశాలమైన భూమండలమునకు నిర్వాకుడై అంతర్యామియైన స్వామిగ యుండియున్నను, అఙ్ఞానముతో నిండియున్ననీ దాసులమైన మేము దేవరవారిని దర్శింలేకపోవుచున్నాము అయ్యో!,తల్లిగను, మాకు స్వామిగను, తండ్రికి తండ్రిగను అయియున్నస్వామీ!, తమరు మాకు అద్వితీయమైన ప్రభువే కదా స్వామీ! (స్వామియొక్క దివ్యానుగ్రహముచేతనే, సకల విధబంధువును, సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుని దర్శనమును తిరుమంగైఆళ్వార్ అపేక్షించుచున్నారు)
శొల్లాదు ఒழிయకిల్లేన్, అఱిన్దశొల్లిల్, నుమ్మడియా
రెల్లారోడుమొక్క, ఎణ్ణియిరన్దీరడియేనై,
నల్లార్ అఱివీర్, తీయార్ అఱివీర్, నమక్కు ఇవ్వులగత్తిల్,
ఎల్లామ్ అఱివీర్, ఈదేయఱివీర్, ఇన్దళూరీరే ll 1333
ఇన్దళూరీరే = తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!; శొల్లాదు ఒழிయకిల్లేన్ = చెప్పక ఉండలేను; అఱిన్ద శొల్లిల్=నాకు తెలిసినది చెప్పినయెడల; (తమరు దయార్ద్రహృదయముతో వినగోరుచున్నాను) అడియేనై = (మిమ్ము విడిచి ఉండలేని) ఈ దాసుని; నుమ్ అడియారెల్లారోడుమ్ ఒక్క ఎణ్ణి ఇరన్దీర్ = మీయొక్క తక్కిన దాసులందరితోను సమానముగ తలచుకొనియున్నారు;నల్లార్ అఱివీర్ =మిమ్ము వదలియుండలేని సత్పురుషులను మీరు ఎరుంగుదురు; తీయార్ అఱివీర్ = మిమ్ములను విడిచి జీవించు దుష్టులను తమరు ఎరుంగుదురు; ఇవ్వులగత్తిల్ ఎల్లామ్ అఱివీర్ = ఈ లోకమందలి సమస్తమును తమరు ఎరుంగుదురు; నమక్కు ఈదే అఱివీర్ = నాయొక్క స్వభావమొక్కటియే ఎరుంగకున్నారు!
తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!చెప్పక ఉండలేను. నాకు తెలిసినది చెప్పినయెడల, తమరు దయార్ద్రహృదయముతో వినగోరుచున్నాను. మిమ్ము విడిచి ఉండలేని ఈ దాసుని మీయొక్క తక్కిన దాసులందరితోను సమానముగ తలచుకొనియున్నారు. మీరు వదలియుండలేని సత్పురుషులను మీరు ఎరుంగుదురు. మరియు మిమ్ములను విడిచి జీవించగల దుష్టులను తమరు ఎరుంగుదురు. ఈ లోకమందలి సమస్తమును తమరు ఎరుంగుదురు. కాని నాయొక్క స్వభావమొక్కటియే ఎరుంగకున్నారు! ( సర్వేశ్వరుడు దర్ననమీయక ఉపేక్షించుచుండుటను ఎంతమాత్రము సహింపలేక తమయొక్క మనోవ్యధను తిరుమంగై ఆళ్వార్ వెలిబుచ్చుచున్నారు. )
మాట్టీరానీర్ పణి నీర్ కొళ్ళ, ఎమ్మై ప్పణియఱియా
వీట్టీర్, ఇదైనై వేఱే శొన్నోమ్, ఇన్దళూరీరే,
కాట్టీరానీర్, నున్దమ్ అడిక్కళ్ కాట్టిల్, ఉమక్కు ఇన్ద
నాట్టే వన్దు తొణ్డరాన, నాఙ్గల్ ఉయ్యోమే ll 1334
ఇన్దళూరీరే = తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!; నీర్ =దేవరువారు;పణి కొళ్ళ= మానుండి కైంకర్యము చేకొనుటకు;మాట్టీరానీర్=సమ్మతములేదా స్వామీ!; ఎమ్మై=దాసులైన మమ్ములను;పణి అఱియా వీట్టీర్=కైంకర్య ప్రావీణ్యం తెలుసుకొనుటకై విడిచిపెట్టితిరా స్వామీ!; ఇదైనై వేఱే శొన్నోమ్=మా ఈ మనోభిప్రాయమును ప్రత్యేకముగ విన్నపించుకొనుచున్నాము; నున్దమ్ అడిక్కళ్ = దేవరవారి దివ్య చరణారవిందములను; కాట్టీర్ ఆనీర్ = దర్శింపనీయలేదే స్వామీ!; కాట్టిల్ = దర్శనమిచ్చినచొ; ఇన్ద నాట్టే = ఈ దేశమందే; వన్దు = తమయొక్క సేవను కోరి ఆశతో వచ్చిన;ఉమక్కు తొణ్డరాన నాఙ్గల్= దేవరవారి దాసులైన మేము; ఉయ్యోమే = ఉజ్జీవించుదుము కదా!
తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!,దేవరువారు మానుండి కైంకర్యము చేకొనుటకు సమ్మతములేదా స్వామీ!, అట్లుకానిచో దాసులైన మమ్ములను కైంకర్య ప్రావీణ్యం తెలుసుకొనుటకై విడిచిపెట్టితిరా స్వామీ!.మా ఈ మనోభిప్రాయమును ప్రత్యేకముగ విన్నపించు కొనుచున్నాము. దేవరవారి దివ్య చరణారవిందములను దర్శింపనీయలేదే స్వామీ!. దర్శనమిచ్చినచొ ఈ దేశమందే తమయొక్క సేవను కోరి ఆశతో వచ్చిన దేవరవారి దాసులైన మేము ఉజ్జీవించుదుము కదా!
మున్నై వణ్ణమ్ పాలిన్ వణ్ణమ్, ముழுదుమ్ నిలై నిన్ఱ,
పిన్నై వణ్ణమ్ కొణ్డల్ వణ్ణమ్, వణ్ణమ్ ఎణ్ణుఙ్గాల్,
పొన్నిన్ వణ్ణమ్ మణియిన్ వణ్ణమ్, పురైయుమ్ తిరుమేని,
ఇన్న వణ్ణమెన్ఱు కాట్టీర్, ఇన్దళూరీరే ll 1335
ఇన్దళూరీరే = తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!; వణ్ణమ్ ఎణ్ణుఙ్గాల్ = దేవరవారి తిరుమేని వర్ణమును స్మరించినయెడల; మున్నై వణ్ణమ్ పాలిన్ వణ్ణమ్ = మొట్టమొదటి (కృతయుగమందు) తిరుమేని వర్ణము పాలువలె తెల్లని వర్ణము; ముழுదుమ్ నిలై నిన్ఱ పిన్నై వణ్ణమ్ = ఎల్లప్పుడును స్థిరముగనుండెడి తరువాత కలియుగ కాలమందలి తిరమేని వర్ణము; కొణ్డల్ వణ్ణమ్ = కాలమేఘము వంటి నల్లని వర్ణము; పొన్నిన్ వణ్ణమ్ మణియిన్ వణ్ణమ్ పురైయుమ్ తిరుమేని = బంగారు వర్ణమును; నీలమణివంటి వర్ణమును ఒప్పుచున్న దేవరవారి తిరుమేనియొక్క; ఇన్న వణ్ణమ్ ఎన్ఱు కాట్టీర్ = ఇటువంటి వర్ణమని తమ తిరమేని దివ్య మంగళ విగ్రహ శోభనంతయును మాకు దర్శింప కృపజేయవలెను !
తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా! దేవరవారి తిరుమేని వర్ణమును స్మరించినయెడల మొట్టమొదటి (కృతయుగమందు) తిరుమేని వర్ణము పాలువలె తెల్లని వర్ణము, ఎల్లప్పుడును స్థిరముగనుండెడి తరువాత కలియుగ కాలమందలి తిరమేని వర్ణము కాలమేఘమువంటి నల్లని వర్ణము, మిగిలిన యుగములందు దేవరవారి తిరుమేని వర్ణములు, బంగారు వర్ణము, నీలమణివంటి వర్ణములుగ ఒప్పుచున్నవి. ఇటువంటి వర్ణమని తమ తిరమేని దివ్య మంగళ విగ్రహ శోభనంతయును మాకు దర్శింప కృపజేయవలెను !
ఎన్దై తన్దై తమ్మాన్ ఎన్ఱెన్ఱు, ఎమర్ ఏழళవుమ్,
వన్దు నిన్ఱ తొణ్డరోర్ క్కే, వాశివల్లీర్ ఆల్,
శిన్దై తన్నుళ్ మున్ది నిర్ట్రీర్, శిఱిదుమ్ తిరుమేని,
ఇన్ద వణ్ణమెన్ఱు కాట్టీర్, ఇన్దళూరీరే ll 1336
ఇన్దళూరీరే = తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా!;ఎన్దై తన్దై తమ్మాన్ ఎన్ఱెన్ఱు = నాకును, నాయొక్క తండ్రికి మరియు నాయొక్క తాతలకు స్వామియని; ఎమర్ ఏழళవుమ్ = ఏడుతరముల మా వంశజులు; వన్దు నిన్ఱ = దేవరవారికి కైంకర్య సేవను నిమగ్నమై చేయుచువచ్చుచున్న; తొణ్డరోర్ క్కే =మా యొక్క విషయమందే; వాశివల్లీర్ = తమరు విశ్లేషించుచున్నారు; ఆల్ = అయ్యో!; శిన్దై తన్నుళ్ = నా హృదయమందు; మున్ది నిర్ట్రీర్ = చిరకాలమునుండి నిలిచియున్నారు; తిరుమేని ఇన్ద వణ్ణమ్ ఎన్ఱు = తమ దివ్యస్వరూపము ఇట్టి స్వభావముకలదని; శిఱిదుమ్ కాట్టీర్ = స్వల్పమైనను కనపరచలేదు స్వామీ! .
తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్నవాడా! నాకును, నాయొక్క తండ్రికి మరియు నాయొక్క తాతలకు స్వామియని ఏడు తరముల మా వంశజులు దేవరవారికి కైంకర్య సేవను నిమగ్నమై చేయుచువచ్చుచున్న మా యొక్క విషయమందే తమరు విశ్లేషించుచున్నారు.అయ్యో!. నా హృదయమందు చిరకాలమునుండి నిలిచియున్నారు. తమ దివ్యస్వరూపము ఇట్టి స్వభావముకలదని స్వల్పమైనను కనపరచలేదు స్వామీ!
** ఏరార్ పొழிల్ శూழ், ఇన్దళూరిల్ ఎందై పెరుమానై,
కారార్ పుఱవిల్ మంగై వేన్దన్, కలియన్ ఒలిశెయ్ ద,
శీరార్ ఇన్ శొల్ మాలై, కర్ట్రు త్తిరివార్ ఉలగిత్తిల్,
ఆరార్ అవరే, అమరర్కు ఎన్ఱుమ్ అమరరావారే ll 1317
ఏర్ ఆర్ పొழிల్ శూழ் = మిక్కిలి అందమైన తోటలచే చుట్టబడియున్న; ఇన్దళూరిల్ = తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్న;ఎన్దై పెరుమానై=మనయొక్క ప్రభువైన సర్వేశ్వరుని విషయమై; కార్ ఆర్ పుఱవిల్ మంగై వేన్దన్ = మేఘములతో నిండిన తోటలుగల తిరుమంగై నగరమునకు స్వామియైన; కలియన్ ఒలిశెయ్ ద = తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన; శీర్ ఆర్ ఇన్ శొల్ మాలై = కల్యాణ గుణములతో నిండిన మధురమైన ఈ సూక్తులమాలను;కర్ట్రు =అభ్యసించి; తిరివార్=సంచరించువారు; ఉలగిత్తిల్ ఆర్ ఆర్ అవరే = ఈ లోకమున ఎవరెవరుగలరో వారే; ఎన్ఱుమ్=ఎల్లప్పుడును; అమరర్కు అమరర్ ఆవారే = నిత్యశూరులకు గౌరవనీయులగుదురు.
మిక్కిలి అందమైన తోటలచే చుట్టబడియున్న తిరువిందళూరిలో కృపతో వేంచేసియున్న మనయొక్క ప్రభువైన సర్వేశ్వరుని విషయమై మేఘములతో నిండిన తోటలుగల తిరుమంగై నగరమునకు స్వామియైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన కల్యాణ గుణములతో నిండిన మధురమైన ఈ సూక్తులమాలను అభ్యసించి సంచరించువారు ఈ లోకమున ఎవరెవరుగలరో వారే ఎల్లప్పుడును నిత్యశూరులకు గౌరవనీయులగుదురు.
*********