పెరియతిరుమొழி-5వపత్తు (1)

 శ్రీః 

శ్రీమతే రామనుజాయనమః

తిరుమంగై ఆళ్వార్ ముఖారవిన్దమునుండి వెలువడిన

_______________

పెరియతిరుమొழி-5వపత్తు

____________

శ్రీః

1.అఱివదరియాన్

      తిరు ప్పుళ్ళంబూదంగుడి దివ్య దేశములో కృపతో తిరు శయనకోలములో వేంచేసియున్న వల్లిరామన్ పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు 

** అఱివదరియాన్ అనైత్తులగముడైయాన్, ఎన్నైయాళుడైయాన్,

కుఱియమాణి యురువాయ, కూత్తన్ మన్ని యమరుమిడమ్,

నఱియ మలర్మేల్ శురుమ్బార్క, ఎழிలార్ మఞ్ఞైనడమాడ,

పొఱిగొళ్ శిఱై వణ్డిశైపాడుమ్, పుళ్ళమ్ బూదఙ్గుడితానే ll 1348

అఱివదు అరియాన్=ఏ ఒక్కరికిని తమ స్వయంకృషిచే తెలుసుకొనుటకు అశక్యుడును;  అనైత్తు ఉలగమ్ ఉడైయాన్ = సర్వలోకములు తన ఆధీనమున కలవాడును;ఎన్నై ఆళ్ ఉడైయాన్ = నన్ను తన కైంకర్యపరునిగ కలిగినవాడును; కుఱియ మాణి ఉరు ఆయ = వామన బ్రహ్మచారి రూపమును దాల్చిన; కూత్తన్ = అతి మనోహరమైన చేతలుగల సర్వేశ్వరుడు; మన్ని అమరుమ్ ఇడమ్ = స్థిరముగ నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము; ( ఏదనగ ) శురుమ్బు = శురమ్బు అనెడి భ్రమరములు; నఱియ మలర్మేల్ = పరిమళభరితమైన పుష్పములపై;ఆర్క=ఝంకారము చేయుచుండగ; ఎழிల్ ఆర్ మఞ్ఞైనడమాడ = మిక్కిలి సౌందర్యము కలగిన నెమళ్ళు నృత్యము చేయుచుండగ; పొఱి కొళ్ శిఱై వణ్డు ఇశై పాడుమ్ = చారలున్న రెక్కలుగల తుమ్మెదలు మధురముగపాడుచుండెడి; పుళ్ళమ్బూదఙ్గడిదానే = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా!

      ఏ ఒక్కరికిని తమ స్వయంకృషిచే తెలుసుకొనుటకు అశక్యుడును,సర్వలోకములు తన ఆధీనమున కలవాడును,నన్ను తన కైంకర్యపరునిగ కలిగిన వాడును, వామన బ్రహ్మచారి రూపమును దాల్చిన అతి మనోహరమైన చేతలుగల సర్వేశ్వరుడు స్థిరముగ నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము( ఏదనగ ) శురమ్బు అనెడి భ్రమరములు పరిమళభరితమైన పుష్పములపై ఝంకారము చేయుచుండగ, మిక్కిలి సౌందర్యము కలగిన నెమళ్ళు నృత్యము చేయుచుండగ,చారలున్న రెక్కలుగల తుమ్మెదలు మధురముగ పాడుచుండెడి పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా!

కళ్ళ క్కుఱళాయ్ మావలియై వఞ్జిత్తు, ఉలగమ్ కైపడుత్తు,

పొళ్ళై క్కరత్త పోతగత్తిన్, తున్బమ్ తవిర్త పునిదనిడమ్,

పళ్ళ చ్చెరువిల్  కయలుగళ, ప్పయన క్కழని యదనుళ్ పోయ్,

పుళ్ళు ప్పిళైక్కిరైతేడుమ్, పుళ్ళమ్బూదఙ్గుడితానే ll 1349

కళ్ళమ్ కుఱళ్ ఆయ్ = కపటముతో వామనమూర్తియై;మావలియై వఞ్జిత్తు=మహాబలిని భ్రమింపజేసి; ఉలగమ్ కై పడుత్తు = సర్వలోకములను స్వాధీనము చేసుకొనియు;పొళ్ళై కరత్త పోదగత్తిన్ = రంధ్రముతొ కూడిన తొండముగల గజేంద్రుని; తున్బమ్ తవిర్త=దుఃఖమును పోగొట్టిన;పునిదన్ ఇడమ్ = పరమ పవిత్రుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము; ( ఏదనగ ) పళ్ళ శెరువిల్ = పల్లపు పంటభూములలో; కయల్ ఉగళ = మీనములు త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచుండుగ; పుళ్ళు = పక్షులు; పయన కழని అదనుల్ పోయ్ = నీటి వనరులుగల ఆపొలములకు పోయి; పిళైక్కు ఇరై తేడుమ్ = తమ పిల్లలకు ఆహారమును వెదుకుచుండెడి ;పుళ్ళమ్బూదఙ్గడిదానే = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా!

    కపటముతో వామనమూర్తియై మహాబలిని భ్రమింపజేసి సర్వలోకములను స్వాధీనము చేసుకొనియు,రంధ్రముతొకూడిన తొండముగల గజేంద్రుని  దుఃఖమును పోగొట్టిన పరమ పవిత్రుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము ( ఏదనగ ) పల్లపు పంటభూములలో మీనములు త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచుండుగ, పక్షులు నీటి వనరులుగల ఆపొలములకు పోయి తమ పిల్లలకు ఆహారమును వెదుకుచుండెడి పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా!

మేవా అరక్కర్ తెన్నిలఙ్గై,  వేన్దన్ వీయ చ్చరన్దురన్దు,

మావాయ్ పిళన్దు మల్లడర్తు, మరుదమ్ శాయ్ త్త మాలదు ఇడమ్,

కావార్ తెఙ్గిన్ పழమ్ వీழ, క్కయల్ గళ్  పాయ కురుకు ఇరియుమ్,

పూవార్ కழని యెழிలారుమ్, పుళ్ళమ్బూదఙ్గుడితానే ll 1350

మేవా = విరోధించు స్వభావముతో తనను ఆశ్రయించని; అరక్కర్=రాక్షసులు నివసించు;  తెన్ ఇలఙ్గై = దక్షిన దిక్కునగల లంకాపురియొక్క; వేన్దన్ = ప్రభువైన రావణాసురుడు; వీయ = మృతిచెందునట్లు; శరమ్ తురన్దు = బాణములను ప్రయోగించియు;మా వాయ్ పిళన్దు = అశ్వరూపములో వచ్చిన కేశియను అసురుని నోటిని చీల్చియు; మల్ అడర్తు= చాణూరముష్టికులనబడు మల్లులను నిరసించియు; మరుదమ్ శాయ్ త్త = జతగా చేరియున్న రెండు మద్ది వృక్షములు పడవైచిన; మాలదు ఇడమ్ = ఆశ్రిత వ్యామోహితుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము;( ఏదనగ ) కా ఆర్ = తోటలలో దట్టముగనున్న; తెఙ్గిన్ పழమ్ వీழ = కొబ్బరిచెట్లనుండి కొబ్బరి కాయలు తెగిక్రిందపడగ;కయల్ గళ్ = మీనములు; పాయ=భయముతో వేరోక స్థలమునకు త్రుళ్ళిపోవుచున్నదియు; కురుగు ఇరియుమ్ = కొంగలు ఇటు అటు పరుగెత్తుచున్నదియు,పూ ఆర్ కழని = తామర మొదలగు పుష్పములతో నిండిన పొలములవలన; ఎழிల్ ఆరుమ్ = మిక్కిలి సౌందర్యముతో అలరారుచున్న ; పుళ్ళమ్బూదఙ్గడిదానే = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా!

        విరోధించు స్వభావముతో తనను ఆశ్రయించని రాక్షసులు నివసించుదక్షిన దిక్కునగల లంకాపురియొక్క ప్రభువైన రావణాసురుడు మృతిచెందునట్లు బాణములను ప్రయోగించియు, అశ్వరూపములోవచ్చిన కేశియను అశురుని నోటిని చీల్చియు, చాణూరముష్టికులనబడు మల్లులను నిరసించియు,జతగా చేరియున్న రెండు మద్ది వృక్షములు పడవైచిన ఆశ్రిత వ్యామోహితుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము( ఏదనగ ) తోటలలో దట్టముగనున్న కొబ్బరిచెట్లనుండి కొబ్బరి కాయలు తెగిక్రిందపడగ మీనములు భయముతో వేరోక స్థలమునకు త్రుళ్ళిపోవుచున్నదియు, కొంగలు ఇటు అటు పరుగెత్తుచున్నదియు,తామర మొదలగు పుష్పములతో నిండిన పొలముల వలన మిక్కిలి సౌందర్యముతో అలరారుచున్న పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా!

వెఱ్పాల్ మారి పழுదాక్కి, విఱల్  వాళ్ అరక్కర్ తలైవన్ తన్,

వఱ్పార్ తిరళ్ తోళ్ ఐనాన్గుమ్, తుణిత్త వల్ విల్ ఇరామనిడమ్,

కఱ్పార్ పురిశై శెయ్ గున్ఱమ్, కవిన్ ఆర్ కూడమ్ మాలిగైగళ్,

పొఱ్పార్ మాడమ్ ఎழிలారుమ్, పుళ్ళమ్ బూదఙ్గడిుతానే ll 1351

వెఱ్పాల్ మారి పழுదు ఆక్కి= గోవర్ధన పర్వతముచే పెద్ద భయంకరమైన వర్షమును అడ్డగించి నిర్వీర్యము చేసియు; విఱల్  వాళ్ అరక్కర్ తలైవన్ తన్ = బలవంతులైన, ఖడ్గములు ధరించిన రాక్షసులయొక్క నాయకుడైన రావణాసురుని;వఱ్పు ఆర్ తిరళ్ తోళ్ ఐ నాన్గుమ్ = శక్తివంతమైన కండలుతిరిగిన ఇరువది భుజములను; తుణిత్త = ఖండించిన; వల్ విల్ = దృఢమైన శార్ఙ్గమను విల్లును ధరించిన; ఇరామన్ ఇడమ్= శ్రీరామచంద్రుడు కృపతో వేంచేసిన దివ్యదేశము;( ఏదనగ ) కఱ్పు ఆర్ = శ్లాఘ్యమైన పనితనముచే; పురిశై శెయ్ =గొప్ప ప్రాకారములగ చేయబడిన; కున్ఱమ్ = కొండలచేతను; కవిన్ ఆర్ కూడమ్ =అందమైన గృహములవలనను, మాలిగైగళ్ = భవంతులవలనను; పొఱ్పు ఆర్ మాడమ్=అందమైన మండపములవలనను;ఎழிల్ ఆరుమ్ = మిక్కిలి సౌందర్యముతో అలరారుచున్న ; పుళ్ళమ్బూదఙ్గడిదానే = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా!

గోవర్ధన పర్వతముచే పెద్ద భయంకరమైన వర్షమును అడ్డగించి నిర్వీర్యము చేసియు, బలవంతులైన,ఖడ్గములు ధరించిన రాక్షసులయొక్క నాయకుడైన రావణాసురుని శక్తివంతమైన కండలుతిరిగిన ఇరువది భుజములను ఖండించిన, దృఢమైన శార్ఙ్గమను విల్లును ధరించిన, శ్రీరామచంద్రుడు కృపతో వేంచేసిన దివ్యదేశము ( ఏదనగ ) శ్లాఘ్యమైన పనితనముచే గొప్ప ప్రాకారములగ చేయబడిన కొండలచేతను,అందమైన గృహముల వలనను,భవంతులవలనను, అందమైన మండపములవలనను,మిక్కిలి సౌందర్యముతో అలరారుచున్న పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా !

మైయార్ తడఙ్గణ్ కరుఙ్గూన్దల్, అయ్ చ్చి మఱైయ వైత్తతయిర్,

నెయ్యార్ పాలొడు అముదశెయ్ ద, నేమియఙ్గై మాయనిడమ్,

శెయ్ ఆర్ ఆరల్ ఇరై కరుది, చ్చెఙ్గాల్ నారై శెన్ఱణైయుమ్,

పొయ్యా నావిల్ మఱైయాళర్, పుళ్ళమ్ బూదఙ్గుడితానే ll 1352

మై ఆర్ తడమ్ కణ్ = కాటుకతో బాగుగ అలంకరించుకొనిన విశాలమైన నేత్రములును;  కరుమ్ కూన్దల్ = నల్లని కేశపాశములుగల; అయ్ చ్చి = యశోదాదేవి; మఱైయ వైత్త = దాచిపెట్టిన; తయిర్ నెయ్ ఆర్ పాలొడు = పెరుగు,నెయ్యి, కుండలలో నిండియున్న పాలును, అముదశెయ్ ద = ఆరగించిన; నేమి అమ్ కై = సుదర్శనమును అందమైన హస్తమునగల; మాయన్ ఇడమ్=ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము;( ఏదనగ ) శెయ్ ఆర్=పొలములలో నిండియున్న; ఆరల్=ఆరల్ మీనములను; ఇరై కరుది = ఆహారమునకై తలచి; శెమ్ కాల్ నారై = ఎర్రని కాళ్ళుగల కొంగలు; శెన్ఱు అణైయుమ్ = అచటకు పోయి చేరుచుండెడిదియు; పొయ్యా నావిల్ మఱై ఆళర్ =అసత్యము చెప్పని జిహ్వతో వేదములను పఠించు బ్రాహ్మణోత్తములు నివసించు; పుళ్ళమ్బూదఙ్గడిదానే = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా ! .

కాటుకతో బాగుగ అలంకరించుకొనిన విశాలమైన నేత్రములును,నల్లని కేశపాశములుగల యశోదాదేవి దాచిపెట్టిన పెరుగు,నెయ్యి, కుండలలో నిండియున్న పాలును ఆరగించిన, సుదర్శనమును అందమైన హస్తమునగల ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు కృపతోవేంచేసిన దివ్యదేశము (ఏదనగ ) పొలములలో నిండియున్నఆరల్ మీనములను ఆహారమునకై తలచి ఎర్రని కాళ్ళుగల కొంగలు అచటకు పోయి చేరుచుండెడిదియు, అసత్యము చెప్పని జిహ్వతో వేదములను పఠించు బ్రాహ్మణోత్తములు నివసించు పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా ! .

మిన్నిన్ అన్న నుణ్ మరుఙ్గుల్, వేయేయ్ తడన్తోళ్ మెల్లియఱ్కా,

మన్ను శినత్త మழవిడైగళ్, ఏழన్ఱడర్త మాలదు ఇడమ్,

మన్ను ముదనీర్ అరవిన్ద మలర్ మేల్, వరివణ్డు ఇశైపాడ,

పున్నై పొన్నేయ్ తాదు ఉతిర్కుమ్, పుళ్ళమ్ బూదఙ్గుడితానే ll 1353

మిన్నిన్ అన్న నుణ్ మరుఙ్గుల్ = మెరుపుతో ఒప్పు సన్నని నడుమును; వేయ్ ఏయ్ తడమ్ తోళ్ = వెదురువలె పొడగైన భుజములుగల; మెల్లియఱ్కా = సొగసైన నప్పిన్నైపిరాట్టి కొరకు; అన్ఱు = మునుపొకకాలమున; మన్ను శినత్త = స్థిరమగు కోపము కలిగిన; ఏழ் మழ విడైగళ్ = ఏడు యౌవన వృషభములను; అడర్త = వధించిన; మాలదు ఇడమ్ = సర్వేశ్వరుడు కృపతోవేంచేసిన దివ్యదేశము, (ఏదనగ) మన్ను ముదనీర్ = ఎన్నడు ఎండిపోని పురాతనమైన జలములందు; అరవిన్ద మలర్ మేల్; వికసించిన తామరపుష్పములపై; వరివణ్డు ఇశై పాడ = భ్రమరములు ఇంపుగ ఝంకారములు చేయగ; పున్నై=పున్నై చెట్లు;పొన్ ఏయ్ తాదు ఉదిర్కుమ్=బంగారు వర్ణముకలిగిన  పుప్పొడి రేణువులు రాల్చుచుండు; పుళ్ళమ్బూదఙ్గడిదానే = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా ! .

      మెరుపుతో ఒప్పు సన్నని నడుమును,వెదురువలె పొడగైన భుజములుగల సొగసైన నప్పిన్నైపిరాట్టి కొరకు, మునుపొకకాలమున స్థిరమగు కోపముతొనున్న ఏడు యౌవన వృషభములను వధించిన సర్వేశ్వరుడు కృపతోవేంచేసిన దివ్యదేశము,ఏదనగ ఎన్నడు ఎండిపోని పురాతనమైన జలములందు వికసించిన తామర పుష్పములపై భ్రమరములు ఇంపుగ రాగములతో ఝంకారములు చేయగ, పున్నై చెట్లు, బంగారు వర్ణముకలిగిన  పుప్పొడి రేణువులు రాల్చుచుండు పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా !

కుడైయా విలఙ్గల్ కొణ్డు ఏన్ది, మారి  పழுదా నిరైకాత్తు,

శడైయాన్ ఓడ అడల్ వాణన్, తడన్దోళ్ తుణిత్త తలైవనిడమ్,

కుడియా వణ్డుగళ్ ఉణ్ణ, క్కోలనీలమ్ మట్టు ఉగుక్కుమ్,

పుడైయార్ కழని యెழிలారుమ్, పుళ్ళమ్బూదఙ్గుడితానే ll 1354

విలఙ్గల్ = గోవర్ధనపర్వతమును; కుడైయా కొణ్డు ఏన్ది =  గొడుగుగ చేసుకొని పైకెత్తి;    మారి  పழுదా = భయంకరమైన వర్షమును నిర్వీర్యముచేసి; నిరైకాత్తు = గోవుల సమూహములను రక్షించియు; శడైయాన్ ఓడ=జడలుగల రుద్రుడు యుద్ధమున వెనుదిరిగి పారిపోయిన పిదప;అడల్ వాణన్ = యుద్ధోన్ముఖుడైన భాణాసురునియొక్క; తడమ్ తోళ్ = విశాలమైన భుజములను; తుణిత్త = ఖండించిన;తలైవన్ ఇడమ్= సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము; (ఏదనగ) కుడియా = గుంపు గుంపులుగ; వణ్డుగళ్ = భ్రమరములు; ఉణ్ణ = మధువును గ్రోలునట్లు; కోల నీలమ్ = అందమైన నీలోత్పములు; మట్టు ఉగుక్కుమ్ = తేనెను స్రవింపజేయు; పుడై ఆర్ కழని = సమీపమందు చుట్టును పొలములతో;ఎழிల్ ఆరుమ్ = మిక్కిలి సౌందర్యముతో అలరారుచున్న ; పుళ్ళమ్బూదఙ్గడిదానే = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా !

    గోవర్ధనపర్వతమును గొడుగుగ చేసుకొని పైకెత్తి భయంకరమైన వర్షమును నిర్వీర్యము చేసి గోవుల సమూహములను రక్షించియు,జడలుగల రుద్రుడు యుద్ధమున వెనుదిరిగి పారిపోయిన పిదప యుద్ధోన్ముఖుడైన భాణాసురునియొక్క విశాలమైన భుజములను ఖండించిన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము (ఏదనగ) గుంపు గుంపులుగ భ్రమరములు మధువును గ్రోలునట్లు అందమైన నీలోత్పములు తేనెను స్రవింపజేయు సమీపమందు చుట్టును పొలములతో మిక్కిలి సౌందర్యముతో అలరారుచున్న పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా ! .

కఱైయార్ నెడువేల్ మఱమన్నర్ వీழ, విశయన్ తేర్ కడవి,

ఇఱైయాన్ కైయిల్ నిఱైయాద, ముణ్డమ్ నిఱైత్త ఎన్దైయిడమ్,

మఱైయాల్ ముత్తీయవై వళర్కుమ్, మన్ను పుగழாల్ వణ్మైయాల్,

పొఱైయాల్ మిక్క అన్దణర్ వాழ், పుళ్ళమ్ బూదఙ్గుడితానే ll 1355

కఱై ఆర్=రక్తపు మరకలు ఎండకయున్న; నెడు వేల్=పొడవైన ఖడ్గములుగల,మఱమ్ మన్నర్ వీழ = (దుర్యోధనుని యొక్క) పగతోకూడిన శత్రురాజులు వధింపబడునట్లు; విశయన్ తేర్ కడవి = విజయుని రథమును నడిపియు;ఇఱైయాన్ కైయిల్ నిఱైయాద = రుద్రుని చేతికి అంటుకొని ఏ ఒక్కరిచేతను నింపబడని; ముణ్డమ్ నిఱైత్త= కపాలమును భిక్ష పెట్టి నింపిన; ఎన్దై ఇడమ్ = నాయొక్క స్వామి సర్వేశ్వరుడు కృపతోవేంచేసిన దివ్యదేశము; (ఏదనగ) మఱైయాల్ = వేదములచేతను; ముత్తీ అవై వళర్కుమ్ = మూడు నిత్యాగ్నిహోత్రములు సలుపుచుండుటచేతను; మన్ను పుగழாల్ = శాశ్వతమైన కీర్తివలనను; వణ్మైయాల్ = ఔదార్యమువలనను,పొఱైయాల్ = సహనముచేతను; మిక్క అన్దణర్ వాழ் = గౌరవప్రతిష్టలతో ఒప్పు బ్రాహ్మణోత్తములు నివసించు; పుళ్ళమ్బూదఙ్గడిదానే = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా !

రక్తపు మరకలు ఎండకయున్న పొడవైన ఖడ్గములుగల దుర్యోధనుని యొక్క పగతో కూడిన శత్రురాజులు వధింపబడునట్లు విజయుని రథమును నడిపియు, రుద్రుని చేతికి అంటుకొని ఏ ఒక్కరి చేతను నింపబడని బ్రహ్మ కపాలమును భిక్ష పెట్టి నింపిన నాయొక్క స్వామి సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము ( ఏదనగ ) వేదములచేతను, మూడు నిత్యాగ్నిహోత్రములు సలుపుచుండుట చేతను,శాశ్వతమైన కీర్తివలనను, ఔదార్యము వలనను, సహనముచేతను గౌరవప్రతిష్టలతో ఒప్పు బ్రాహ్మణోత్తములు నివసించు పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా  !

తున్ని మణ్ణుమ్ విణ్ణాడుమ్, తోన్ఱాదు ఇరళాయ్ మూడియనాళ్,

అన్నమాగి అరుమఱైగళ్, అరుళి చ్చెయ్ ద అమలనిడమ్,

మిన్ను శోతి నవమణియుమ్, వేయిన్ ముత్తుమ్ శామరైయుమ్,

పొన్నుమ్ పొన్ని కొణర్ న్దు అలైక్కుమ్, పుళ్ళమ్బూదఙ్గుడితానే ll 1356

మణ్ణుమ్ = భూలోకమునందును; విణ్ నాడుమ్=స్వర్గలోకము నందును ;తోన్ఱాదు=ఏమియు తెలియని అజ్ఞానమను; ఇరళాయ్ = అంధకారము; తున్ని= దట్టముగ; మూడియనాళ్=కప్పిన సమయయున; అన్నమ్ ఆగి = హంసరూపమును దాల్చి ; అరు మఱైగళ్ = దుర్లభమైన వేదములను; అరుళి శెయ్ ద = కృపతో వెలువరించిన; అమలన్ ఇడమ్ = పవిత్రుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము; ( ఏదనగ ) మిన్ను శోది = ప్రకాశించు తేజస్సుకలిగిన; నవమణియుమ్ = నవ రత్నములును;వేయిన్ ముత్తుమ్= వెదురుచెట్లు వెదజల్లు ముత్యములను; శామరైయుమ్ = చామరములును;పొన్నుమ్= బంగారమును; పొన్ని కొణర్ న్దు అలైక్కుమ్ = కావేరి నదీ జలములు తోసుకొని చేర్చు చుండెడి; పుళ్ళమ్బూదఙ్గడిదానే = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా !

భూలోకమునందును, స్వర్గలోకమునందును ఏమియు తెలియని అజ్ఞానమను అంధకారము దట్టముగ కప్పిన సమయమున హంసరూపమునుదాల్చి దుర్లభమైన వేదములును కృపతో వెలువరించిన పవిత్రుడైన సర్వేశ్వరుడు కృపతో వేంచేసిన దివ్యదేశము ( ఏదనగ ) ప్రకాశించు, తేజస్సుకలిగిన నవ రత్నములును,వెదురుచెట్లు వెదజల్లు ముత్యములును, చామరములును, బంగారమును,కావేరి నదీ జలములు తోసుకొని చేర్చు చుండెడి పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమే సుమా !

** కర్ట్రా మఱిత్తు కాళియన్ తన్, శెన్ని నడుఙ్గ నడమ్ పయిన్ఱ, 

పొర్ట్రామరై యాళ్ తన్ కేళ్వన్, పుళ్ళమ్బూదఙ్గుడి తన్ మేల్,

కర్ట్రార్ పరవుమ్ మఙ్గైయర్ కోన్,  కారార్ పుయఱ్కై కలికన్ఱి, 

శొల్ తాన్ ఈరైన్దివై పాడ, చ్చోరనిల్లా తుయర్ తామే ll 1357

కర్ట్రు ఆ = లేగదూడలను, గోవులను; మఱిత్తు=కాచుచు మేయించినవాడును; కాళియన్ తన్ శెన్ని = కాళీయ సర్పముయొక్క తలపై; నడుఙ్గ = ఆ కాళీయుడు వణుకుపోవునట్లు; నడమ్ పయిన్ఱ =నృత్యము చేసినవాడును; పొన్ తామరై యాళ్ తన్ కేళ్వన్ = అందమైన కమలవాసినియొక్క వల్లభుడైన; పుళ్ళమ్బూదఙ్గడి తన్ మేల్ = పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై; కర్ట్రు ఆర్ పరవుమ్ = శిక్షణ పొందువారందరిచే కొనియాడబడు;మఙ్గైయర్ కోన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువును; కారార్ పుయల్ కై = కాళ మేఘమువంటి ఉదార స్వభావముగల; కలికన్ఱి =తిరుమంగై ఆళ్వార్ యొక్క ; శొల్ తాన్ = శ్రీ సూక్తులైన; ఈరైన్దు ఇవై పాడ తామ్=ఈ పది పాసురములు, అనుసంధించిన వారి యెడల;తుయర్ = దుఃఖములు; శోర నిల్లా= చేర లేవు.

లేగదూడలను,గోవులను కాచుచు మేయించినవాడును,కాళీయ సర్పముయొక్క తలపై ఆ కాళీయుడు వణుకుపోవునట్లు నృత్యము చేసినవాడును,అందమైన కమలవాసినియొక్క వల్లభుడైన, పుళ్ళమ్బూదఙ్గడి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై, శిక్షణ పొందు వారందరిచే కొనియాడబడు తిరుమంగైదేశవాసులకు ప్రభువును,కాళ మేఘమువంటి ఉదార స్వభావముగల తిరుమంగై ఆళ్వార్ యొక్క,శ్రీ సూక్తులైన ఈ పది పాసురములు అనుసంధించిన వారి యెడల దుఃఖములు చేరలేవు.

***********

వ్యాఖ్యానించండి