శ్రీః
3. వెన్ఱిమామழுవేన్ది
తిరు వెళ్ళఱై దివ్య దేశమున కృపతో వేంచేసిన పుణ్డరీకాక్షన్ పెరుమాళ్ ను తిరుమజ్గై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచున్నారు.
** వెన్ఱిమామழுవేన్ది మున్ మణ్ మిశై మన్నరై, మూవెழுకాల్
కొన్ఱ దేవ, నిన్ కురై కழల్ తొழுవదోర్, వగై యెనక్కరుళ్ పురియే,
మన్ఱిల్ మామ్బొழிల్ నుழைతన్దు, మల్లిగై మౌవలిన్ పోదలర్తి,
తెన్ఱల్ మామణమ్ కమழுతర వరు, తిరు వెళ్ళఱై నిన్ఱానే ll 1368
తెన్ఱల్ = దక్షినపుగాలి;మన్ఱిల్=బయట ఖాళీ స్థలములలోగల;మామ్ పొழிల్ = మామిడి తోటలలో; నుழைతన్దు = ప్రవేశించియు;మల్లిగై మౌవలిన్ పోదు అలర్తి = మల్లిపూలను, విరజాజి పూలను వికసింపజేసి;మా మణమ్ కమழு తరు వరు= గొప్ప పరిమళమును అంతటను వ్యాపింపజేయుచు వచ్చుచుండెడి; తిరు వెళ్ళఱై నిన్ఱానే = తిరు వెళ్ళఱై దివ్యదేశమునకృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; మున్ = మునుపు ఒకకాలమున,వెన్ఱి=ఎల్లప్పుడు విజయమునొసగు,మా మழுవు ఏన్ది= గొప్ప పరశువును ధరించి; మణ్ మిశై మన్నరై=భూమిపై గల క్షత్రీయ రాజులను;మూ ఎழு కాల్= ఇరువదియొక్క మార్లు;కొన్ఱ దేవ=వధించన దేవాదిదేవుడా!;నిన్ కురై కழల్=నీయొక్క ఆభరణములచే శబ్ధించుచున్న చరణారవిందములను;తొழுవదు = సేవించుకొను;ఓర్ వగై=ఒక ఉపాయమును;ఎనక్కు అరుళ్ పురియే=నాకు కృప జేయుమా!
దక్షినపుగాలి,బయట ఖాళీ స్థలములలోగల మామిడి తోటలలో ప్రవేశించియు, మల్లి పూలను, విరజాజి పూలను వికసింపజేసి,గొప్ప పరిమళమును అంతటను వ్యాపింపజేయుచు వచ్చుచుండెడి తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!మునుపొకకాలమున ఎల్లప్పుడు విజయము నొసగు గొప్ప పరశువును ధరించి, భూమిపై గల క్షత్రీయ రాజులను ఇరువదియొక్క మార్లు వధించిన దేవాదిదేవుడా!, నీయొక్క ఆభరణములచే శబ్ధించుచున్న చరణారవిందములను సేవించుకొను ఒక ఉపాయమును నాకు కృప జేయుమా!
వశైయిల్ నాన్మఱై కెడుత్త అమ్మలర్ అయఱ్కు అరుళి, మున్ పరిముగమాయ్,
ఇశైకొళ్ వేద నూలెన్ఱివై పయన్దవనే, యెనక్కరుళ్ పురియే,
ఉయిర్ కొళ్ మాదవి పోదొడు ఉలావియ, మారుదమ్ వీదియిన్ వాయ్,
తిశైయెల్లామ్ కమழுమ్ పొழிల్ శూழ், తిరు వెళ్ళఱై నిన్ఱానే ll 1369
ఉయిర్ కొళ్ = పైకెదిగిన; మాదవి = కురుక్కత్తి చెట్లయొక్క; పోదొడు ఉలావియ= పుష్పములతో కూడిన; మారుదమ్=మారుతము; వీదియిన్ వాయ్ = వీదులంతయును; తిశై ఎల్లామ్ = దిక్కులంతయును; కమழுమ్ = పరిమళము వ్యాపింపచేయు; పొழிల్ శూழ் = తోటలతో చుట్టుకొనియున్న;తిరు వెళ్ళఱై నిన్ఱానే = తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!;మున్= మునుపొక కాలమున;వశైయిల్ = దోషములేని; నాల్ మఱై = నాలుగు వేదములు; కెడుత్త = పోగొట్టుకొని బాధపడుచున్న; అ మలర్ అయఱ్కు అరుళి = ఆ పద్మమందు పుట్టిన బ్రహ్మకు కృపజేసి; పరి ముగమ్ ఆయ్ = హయగ్రీవునిగ అవతరించి; ఇశై కొళ్ వేద నూల్ ఇవై ఎన్ఱు = ” స్వరబద్ధమైన వేద శాస్త్రములు ఇవియే” యని చెప్పి; పయన్దవనే = వాటిని బ్రహ్మకు ఉపదేశించిన సర్వేశ్వరా!; ఎనక్కు అరుళ్ పురియే=నాకు కృప జేయుమా!
పైకెదిగిన కురుక్కత్తి చెట్లయొక్క పుష్పములతో కూడిన మారుతము వీదులంతయును, దిక్కులంతయును పరిమళము వ్యాపింపచేయు, తోటలతో చుట్టుకొనియున్న తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! మునుపొకకాలమున దోషములేని నాలుగు వేదములు పోగొట్టుకొని బాధపడుచున్న ఆ పద్మమందు పుట్టిన బ్రహ్మకు కృపజేసి, హయగ్రీవునిగ అవతరించి, ” స్వరబద్ధమైన వేద శాస్త్రములు ఇవియే” యని చెప్పి వాటిని బ్రహ్మకు ఉపదేశించిన స్వామీ!నాకు కృప జేయుమా!
వెయ్యనాయ్ ఉలగేழுడన్ నలిన్దవన్, ఉడలగమ్ ఇరుపిళవా,
కైయిల్ నీళ్ ఉగిర్ పడైయదు వాయ్ త్తవనే, యెనక్కరుళ్ పురియే,
మైయినార్ తరు వరాలి నమ్ పాయ, వణ్ తడత్తిడై క్కమలఙ్గళ్,
తెయ్ వనాఱుమ్ ఒణ్ పొయ్ గైగళ్ శూழ், తిరు వెళ్ళఱై నిన్ఱానే ll 1370
మైయిన్ ఆర్ తరు = నల్లదనమందు పూర్ణమైన;వరాల్ ఇనమ్=వరాల్ మత్స్యముల సమూహములు; వణ్ తడత్తు ఇడై = అందమైన తటాకములలో;పాయ= త్రుళ్ళిత్రుళ్ళి ఎగురుచుండునదియు; తెయ్ వ నాఱుమ్ = దివ్యమైన పరిమళము వెదజల్లుచుండు; క్కమలఙ్గళ్ = తామర పుష్పములు గల; ఒణ్ పొయ్ గైగళ్ శూழ் = సుందరమైన తటాకములతో చుట్టబడియున్న; తిరు వెళ్ళఱై నిన్ఱానే = తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!;వెయ్యన్ ఆయ్=మిక్కిలి క్రూరమైన స్వభావము గలిగినవాడై; ఉలగు ఏழ் ఉడన్=సప్తలోకములను మొత్తముగ;నలిన్దవన్= హింసించిన హిరణ్యాసురుని యొక్క; ఉడల్ అగమ్ = వక్షస్థలమును; ఇరు పిళవా= రెండు భాగములగ చీల్చబడునట్లు; కైయిల్ నీళ్ ఉగిర్ పడై అదు వాయ్ త్తవనే= తన దివ్యమైన హస్తమునగల పొడుగైన నఖములను ఆయుధముగ కలిగిన స్వామీ!;ఎనక్కు అరుళ్ పురియే=నాకు కృప జేయుమా!
నల్లదనమందు పూర్ణమైన వరాల్ మత్స్యముల సమూహములు అందమైన తటాకములలో ఎగురుచుండు నదియును, దివ్యమైన పరిమళము వెదజల్లుచుండు తామరపుష్పములు గల సుందరమైన తటాకములతో చుట్టబడియున్న తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, మిక్కిలి క్రూరమైన స్వభావము గలిగినవాడై సప్తలోకములను హింసించిన హిరణ్యాసురుని యొక్క వక్షస్థలమును రెండు భాగములగ చీల్చబడునట్లు తనదివ్యమైన హస్తమునగల పొడుగైన నఖములను ఆయుధముగ కలిగిన స్వామీ! నాకు కృప జేయుమా!
వామ్ పరి యుక మన్నర్ తమ్ ఉయిర్ శెగ, ఐవర్గట్కరశళిత్త,
కామ్బినార్ తిరు వేఙ్గడ ప్పొరుప్ప, నిన్ కాదలై అరుళెనక్కు,
మామ్బొழிల్ తళిర్ కోదియ మడక్కుయిల్, వాయదు తువర్పెయ్ ద,
తీమ్బలఙ్గ్కని తేనదు నుగర్, తిరు వెళ్ళఱై నిన్ఱానే ll 1371
మామ్ పొழிల్ = మామిడి తోటలలో; తళిర్ కోదియ = చిగురుటాకులను ముక్కుతో పొడుచుకొని తినిన; మడ కుయిల్=వినయ పూర్వకమైన కోకిలలు;వాయదు తువర్పు ఎయ్ ద = తమ నోరు ఒగరుతనము పొందగ; (అది పోవునట్లు) తీమ్ పలమ్ కని తేన్ అదు నుగర్ = మధురమైన పనసపండు యందుగల తేనెను పానముచేయుచుండెడి; తిరు వెళ్ళఱై నిన్ఱానే = తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; వామ్ పరి ఉగ = ( భారతయుద్దమందు) పైనపడుటకై వచ్చెడి అశ్వములు మరణించునట్లును;మన్నర్ తమ్ ఉయిర్ శెగ=శత్రురాజుల ప్రాణములు పోవునట్లును; ఐవర్గట్కు అరశు అళిత్త = పంచ పాండవులకు రాజ్యాధిపత్యమును కలిగించినవాడైన; కామ్బిన్ ఆర్ తిరు వేఙ్గడ పొరుప్ప=వెదురుచెట్లతో నిండియున్న దివ్యమైన వేంకటా చలమున వేంచేసియున్నవాడా!; నిన్ కాదలై ఎనక్కు అరుళ్ = నీయందు పరమభక్తిని ఈ దాసునికి కృపజేయుమా!.
మామిడి తోటలలో చిగురుటాకులను పొడుచుకొని తినిన కోకిలలు తమనోరు ఒగరుతనము పొందగ, అది పోవునట్లు మధురమైన పనసపండు యందుగల తేనెను పానము చేయుచుండెడి తిరువెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, భారతయుద్దమందు పైనపడుటకై వచ్చెడి అశ్వములు మరణించునట్లును, శత్రురాజుల ప్రాణములు పోవునట్లును,పంచ పాండవులకు రాజ్యాధిపత్యమును కలిగించినవాడైన, వెదురుచెట్లతో నిండియున్న దివ్యమైన వేంకటాచలమున వేంచేసి యున్నవాడా!, నీయందు పరమభక్తిని ఈ దాసునికి కృపజేయుమా!.
మానవేల్ ఒణ్ కణ్ మడవరల్, మణ్మగళ్ అழுఙ్గ మున్నీర్ పరప్పిల్,
ఏనమాగి యన్ఱు ఇరునిలమ్ ఇడన్దవనే, యెనక్కరుళ్ పురియే,
కాన మాముల్లై కழை క్కరమ్బేఱి, వెణ్ ముఱువల్ శెయ్ దు అలర్ కిన్ఱ,
తేనిన్ వాయ్ మలర్ మురుగుకుక్కుమ్, తిరు వెళ్ళఱై నిన్ఱానే ll 1372
కరమ్బు కழை ఏఱి = చెరకుమొక్కల తుదివరకు వ్యాపించి;వెణ్ ముఱువల్ శెయ్ దు అలర్ కిన్ఱ = తెల్లని చిరునవ్వుచేయువానివలె వికసించియున్న; మా కానమ్ ముల్లై మలర్ = పెద్ద అడవి మల్లె పుష్పములపైన;తేనిన్ వాయ్=భ్రమరముల నోటినుండి;మురుగు ఉగుక్కుమ్ = తేనె పెరగుచుండు; తిరు వెళ్ళఱై నిన్ఱానే = తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; మాన వేల్ ఒణ్ = గొప్పతనము కలిగిన శూలమువలె అందమైన; కణ్ మడవరల్ = నేత్రములుగల సహనము మొదలగు ఉత్తమ గుణవంతురాలైన;మణ్ మగళ్=శ్రీ భూదేవి;అழுఙ్గ= (ప్రళయకాలమున) మునిగి యుండగ; అన్ఱు = ఆ సమయమున; మున్నీర్ పరప్పిల్ = ఆ సముద్ర మహాజలములో; ఏనమ్ ఆగి = వరాహముగ అవతరించి; ఇరునిలమ్ ఇడన్దవనే = విశాలమైన భూమిని అండభిత్తినుండి పెగళించి ఉద్ధరించిన స్వామీ!; ఎనక్కు అరుళ్ పురియే = నాకు కృప జేయుమా !
చెరకుమొక్కల తుదివరకు వ్యాపించి తెల్లని చిరునవ్వుచేయువానివలె వికసించియున్న పెద్ద అడవి మల్లె పుష్పముల పైన, భ్రమరముల నోటినుండి తేనె పెరగుచుండు తిరువెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! గొప్పతనము కలిగిన శూలమువలె అందమైన నేత్రములుగల, సహనము మొదలగు ఉత్తమ గుణవంతురాలైన శ్రీ భూదేవి ప్రళయకాలమున మునిగియుండగ ఆ సమయమున ఆ సముద్ర మహాజలములో,వరాహముగ అవతరించి, విశాలమైన భూమిని అండభిత్తినుండి పెగళించి ఉద్ధరించిన స్వామీ!,నాకు కృప జేయుమా!.
పొఙ్గు నీణ్ముడి యమరర్ గళ్ తొழுదెழ, అముదినై క్కొడుత్తళిప్పాన్,
అఙ్గోర్ ఆమైయదాగియ ఆది, నిన్నడిమైయై అరళెనక్కు,
తఙ్గు పేడైయోడు ఊడియ మదుకరమ్, తైయలార్ కుழల్ అణైవాన్,
తిఙ్గల్ తోయ్ శెన్ని మాడమ్ శెన్ఱణై, తిరు వెళ్ళఱై నిన్ఱానే ll 1373
తఙ్గు పేడైయోడు=పుష్పముపైనున్న ఆడ భ్రమరముతో;ఊడియ=ప్రణయ కలహము వలన;మదుకరమ్ = మగ భ్రమరము; తైయలార్ కుழల్ = స్రీలయొక్క కొప్పులయందు; అణైవాన్ = చేరి అచటనే దాగియుండుటకై; తిఙ్గల్ తోయ్ శెన్ని మాడమ్ శెన్ఱు అణై = చంద్రమండల పర్యంతమువరకు శిఖరములుగల భవంతులకు పోయి చేరుచుండెడి; తిరు వెళ్ళఱై నిన్ఱానే = తిరువెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!;పొఙ్గు నీళ్ ముడి=ప్రకాశించు కిరీటములుగల;అమరర్ గళ్ తొழுదు ఎழ = దేవతలు తనను సేవించి ఆశ్రయించగ; అముదినై కొడుత్తు అళిప్పాన్ = అమృతమును ఒసగి కరుణించుటకై; అఙ్గు = సముద్ర మంథన సమయమున; ఓర్=ఒక విలక్షణమైన; ఆమై అదు ఆగియ=కూర్మరూపిగ అవతరించిన;ఆది=కారణభూతుడా!;నిన్=నీయొక్క ; అడిమైయై = దాసునిగ నేనుండుటకు; ఎనక్కు అరళ్ = నాకు కృప జేయుమా ! .
పుష్పముపైనున్న ఆడ భ్రమరముతో ప్రణయ కలహము వలన మగ భ్రమరము స్రీలయొక్క కొప్పులయందు చేరి అచటనే దాగియుండుటకై చంద్రమండల పర్యంతము వరకు శిఖరములుగల భవంతులకు పోయి చేరుచుండెడి తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,ప్రకాశించు కిరీటములుగల దేవతలు, తనను సేవించి ఆశ్రయించగ,అమృతమును ఒసగి కరుణించుటకై ,సముద్ర మంథన సమయమున ఒక విలక్షణమైన కూర్మరూపిగ అవతరించిన కారణభూతుడా! నీయొక్క దాసునిగ నేనుండుటకు నాకు కృప జేయుమా !
ఆఱినోడొరునాన్గుడై నెడుముడి, అరక్కన్ తన్ శిరమెల్లామ్,
వేఱువేఱు ఉగ విల్లదు వలైత్తవనే, యెనక్కరుళ్ పురియే,
మాఱిల్ శోదియ మరకత ప్పాశడై, త్తామరైమలర్ వార్ న్ద,
తేఱల్ మాన్ది వణ్డు ఇన్నిశైమురల్, తిరు వెళ్ళఱై నిన్ఱానే ll 1374
మాఱు ఇల్ శోదియ = సాటిలేని ప్రకాశముగల; మరకత పాశ అడై = మరకత మణివంటి పచ్చని వర్ణముగల ఆకులతోనున్న; తామరై మలర్ వార్ న్ద = తామర పుష్పములనుండి పెరుగుచున్న;తేఱల్ మాన్ది=తేనెను పానముచేసి;వణ్డు ఇన్ని ఇశై మురల్= భ్రమరములు ఇంపుగ రాగములతో ఝంకారము చేయుచుండెడి;తిరు వెళ్ళఱై నిన్ఱానే=తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!;అరక్కన్ తన్=రాక్షసుడైన రావణాసురునియొక్క; ఆఱినోడు ఒరు నాన్గుడై నెడు ముడి = పది పొడుగైన కిరీటములుగల;శిరమ్ ఎల్లామ్=శిరస్సులన్నియును;వేఱు వేఱు ఉగ=ఒక్కటొక్కటిగ ఖండింపబడునట్లు; విల్ల అదు వలైత్తవనే = శార్ఙ్గమను విల్లును వంచి బాణములను ప్రయోగించిన స్వామీ!;ఎనక్కు అరుళ్ పురియే = నాకు కృప జేయుమా !
సాటిలేని ప్రకాశముగల మరకత మణివంటి పచ్చని వర్ణముగల ఆకులతోనున్నతామర పుష్పములనుండి పెరుగుచున్న తేనెను పానముచేసి భ్రమరములు,ఇంపుగ రాగములతో ఝంకారము చేయుచుండెడి తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,రాక్షసుడైన రావణాసురునియొక్క పది పొడుగైన కిరీటములుగల శిరస్సులన్నియును ఒక్కటొక్కటిగ ఖండింప బడునట్లు శార్ఙ్గమను విల్లును వంచి బాణములను ప్రయోగించిన స్వామీ! నాకు కృప జేయుమా!.
మున్నివ్వేழுలగు ఉణర్విన్ఱి ఇరుళ్ మిగ, ఉమ్బర్ గళ్ తొழுదేత్త,
అన్న మాగి అన్ఱు అరుమఱై పయన్దవనే, యెనక్కరుళ్ పురియే,
మన్ను కేతకై శూతకమెన్ఱివై, వనత్తిడై చ్చురుమ్బినఙ్గళ్,
తెన్నవెన్న వణ్డిన్నిశై మురల్, తిరు వెళ్ళఱై నిన్ఱానే ll 1375
మన్ను=ఎల్లప్పుడు పుష్పించుచుండు;కేతకై=మొగలి పొదలు;శూతకమ్ ఎన్ఱు ఇవై = మామిడి చెట్లు అనబడు ఈ వృక్షములుగల;వనత్తు ఇడై = వనములందు; శురుమ్బు ఇనఙ్గళ్ = శురుమ్బు అనెడి తేనెటీగల సమూహములు; తెన్న వెన్ఱు = “తెన్న తెన్న” యని పాడగ; వణ్డు ఇన్ని ఇశై మురల్ = తుమ్మెదలు ఇంపుగ రాగములతో ఝంకారము చేయుచుండెడి;తిరు వెళ్ళఱై నిన్ఱానే=తిరువెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, మున్ = పూర్వమొకకాలమున; ఇ ఏழ் ఉలగు = ఈ సప్త లోకములు; ఉణర్వు ఇన్ఱి = జ్ఞానము లేక; ఇరుళ్ మిగ = అఙ్ఞానాంధకారములో మునిగియున్న సమయమున;ఉమ్బర్ గళ్ తొழுదు ఏత్త=దేవతలు సేవించి స్తుతించగ; అన్ఱు=ఆ సమయమున;అన్నమ్ ఆగి =హంసరూపమునుదాల్చి అవతరించి; అరు మఱై పయన్దవనే = దుర్లభమైన వేదములను సంపాదించి ఒసగిన స్వామీ; ఎనక్కు అరుళ్ పురియే = నాకు కృప జేయుమా !.
ఎల్లప్పుడు పుష్పించుచుండు మొగలి పొదలు,మామిడి చెట్లు అనబడు ఈ వృక్షములుగల వనములందు శురుమ్బు అనెడి తేనెటీగల సమూహములు “తెన్న తెన్న” అని పాడగ,తుమ్మెదలు ఇంపుగ రాగములతో ఝంకారము చేయుచుండెడి తిరువెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,పూర్వమొకకాలమున ఈ సప్త లోకములు జ్ఞానము లేక అఙ్ఞానాంధకారములో మునిగియున్న సమయమున దేవతలు సేవించి స్తుతించగ ఆ సమయమున హంసరూపమునుదాల్చి అవతరించి, దుర్లభమైన వేదములను సంపాదించి ఒసగిన స్వామీ!,నాకు కృప జేయుమా !.
ఆఙ్గు మావలి వేళ్వియిల్ ఇరన్దు శెన్ఱు, అగలిడ ముழுదినైయుమ్,
పాఙ్గినాల్ కొణ్డ పరమ నిన్ పణిన్దు ఎழுవేన్, ఎనక్కరుళ్ పురియే,
ఓఙ్గు పిణ్డియిన్ శెమ్మలర్ ఏఱి, వణ్డు ఉழிతర, మా ఏఱి
తీఙ్గుయిల్ మిழర్ట్రుమ్ పడప్పై, త్తిరువెళ్ళఱై నిన్ఱానే ll 1376
ఓఙ్గు పిణ్డియిన్ = బాగుగ పెరిగియున్న అశోక వృక్షముయొక్క; శెమ్ మలర్ = ఎర్రని పుష్పములపై; వణ్డు = భ్రమరములు; ఏఱి = ఎక్కి; ఉழிతర = సంచరించుచున్నదియు; తీమ్ కుయిల్ = మధురస్వరముగల కోకిలలు;మా ఏఱి=మామిడి చెట్లపై ఎక్కి; మిழర్ట్రుమ్=కూయుచుండెడిదియు; పడప్పై= లతలుగల తోటలతో చుట్టబడియున్న; త్తిరువెళ్ళఱై నిన్ఱానే= తిరువెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; మావలి =మహాబలి; వేళ్వియిల్=యాగభూమియందు;శెన్ఱు = చేరి;ఇరన్దు = యాచించి;ఆఙ్గు =ఆ సమయమున; అగల్ ఇడమ్ ముழுదినైయుమ్=విశాలమైన భూమిపైగల సర్వమును; పాఙ్గినాల్ కొణ్డ = సక్రమమైన రీతిలో స్వీకరించిన;పరమ నిన్ పణిన్దు = పురుషోత్తముడా! నిన్ను సేవించుకొని;ఎழுవేన్ = ఉజ్జీవించుటకై వచ్చిన;ఎనక్కుఅరుళ్ పురియే = నాకు కృప జేయుమా !.
బాగుగ పెరిగియున్న అశోక వృక్షముయొక్క ఎర్రని పుష్పములపై భ్రమరములు ఎక్కి సంచరించుచున్నదియు, మధురస్వరముగల కోకిలలు మామిడి చెట్లపై ఎక్కి కూయు చుండెడిదియు, తోటలతో చుట్టబడియున్న తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,మహాబలి యాగభూమి వద్దకు వెడలి యాచించి విశాలమైన భూమిపైగల సర్వమును సక్రమమైన రీతిలో స్వీకరించిన పురుషోత్తముడా! నిన్ను సేవించుకొని ఉజ్జీవించుటకై వచ్చిన నాకు కృప జేయుమా !.
** మఞ్జులామ్ మణి మాడఙ్గళ్ శూழ், తిరువెళ్ళఱైయదన్ మేయ,
అఞ్జనమ్ పురైయుమ్ తిరువురువనై, ఆదియై యముదత్తై,
నఞ్జు ఉలావియ వేల్ వలవన్, కలికన్ఱి శొల్ ఐ యిరణ్డుమ్,
ఎఞ్జలిన్ఱి నిన్ఱేత్త వల్లార్, ఇమైయోర్కు అరశావర్ గళే ll 1377
మఞ్జు ఉలామ్ మణి మాడఙ్గళ్ శూழ் = మేఘమండలము వరకు చేరియున్న నవ రత్నములతొ పొదగబడిన భవనములతో చుట్టుకొనియున్న;తిరువెళ్ళఱై అదన్ మేయ= తిరు వెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్నవాడును; అఞ్జనమ్ పురైయుమ్ తిరువురువనై = నల్లని కాటుక పోలిన దివ్యమైన తిరుమేనిగలవాడును; ఆదియై = జగత్కారణభూతుడును; అముదత్తై = అమృతమువలె పరమభోగ్యుడును అయిన సర్వేశ్వరుని విషయమై; నఞ్జు ఉలావియ వేల్ వలవన్ = విషము కూడిన శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; శొల్ ఐ ఇరణ్డుమ్ = అనుగ్రహించిన పది పాసురములను;ఎఞ్జల్ ఇన్ఱి = ఏ కొరతలేక; నిన్ఱు = మనస్సును నిలిపి; ఏత్త వల్లార్=అనుసంధించు సమర్ధమైనవారు;ఇమైయోర్కు అరశు ఆవర్ గళే = నిత్యశూరులచేతను ఆదరింపబడు వారగుదురు.
మేఘమండలము వరకు చేరియున్న నవరత్నములతొ పొదగబడిన భవనములతో చుట్టుకొనియున్న తిరువెళ్ళఱై దివ్యదేశమున కృపతో నిత్యవాసము చేయుచున్న వాడును,నల్లని కాటుక పోలిన దివ్యమైన తిరుమేనిగలవాడును,సకల జగత్తుకు కారణభూతుడును,అమృతమువలె పరమభోగ్యుడును అయిన సర్వేశ్వరుని విషయమై విషము కూడిన శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన పది పాసురములను ఏ కొరతలేక మనస్సును నిలిపి అనుసంధించు సమర్ధమైనవారు నిత్యశూరులచేతను ఆదరింపబడు వారగుదురు.
******