శ్రీః
4. ఉన్దిమేల్
సుప్రసిద్ధమైన శ్రీరంగం దివ్యదేశమును తిరుమంగై ఆళ్వార్ కొనియాడుచున్నారు.
** ఉన్దిమేల్ నాన్ముగనై ప్పడైత్తాన్, ఉలగుణ్డవన్
ఎన్దై పెమ్మాన్, ఇమైయోర్ గళ్ తాదైక్కు, ఇడమెన్బరాల్,
శన్దినోడు మణియుమ్ కొழிక్కుమ్, పునల్ కావేరి,
అన్దిపోలుమ్ నిఱత్తార్ వయల్ శూழ், తెన్నరఙ్గమే ll 1378
శన్దినోడు = చందనపు దుంగలను; మణియుమ్ = నవరత్నములను;కొழிక్కుమ్ = తోసుకుని పట్టుకొనివచ్చెడి; పునల్ కావేరి=జలములుగల కావేరి నదియు;అన్దిపోలుమ్ నిఱత్తు ఆర్= సంధ్యా కాలమందు గల వర్ణముతో నిండిన;వయల్ శూழ்=పొలములతో చుట్టుకొనియున్న;తెన్ అరఙ్గమే = అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే; ఉన్దిమేల్ = తన తిరు నాభియందు; నాన్ముగనై పడైత్తాన్ = చతుర్ముఖ బ్రహ్మను సృష్టించినవాడును; ఉలగు ఉణ్డవన్ = (ప్రళయకాలమున) సర్వలోకములను ఆరగించినవాడును; ఎన్దై పెమ్మాన్ = నాయొక్క వంశమునకు నాధుడును; ఇమైయోర్ గళ్ తాదైక్కు = నిత్యశూరులకు స్వామియైన సర్వేశ్వరునియొక్క; ఇడమ్ ఎన్బరాల్ = వాసస్థలమని చెప్పుచున్నారు కదా!
చందనపు దుంగలను,నవరత్నములను తోసుకుని పట్టుకొనివచ్చెడి జలములుగల కావేరి నదియు,సంధ్యాకాలమందు గల వర్ణముతో నిండిన పొలములతో చుట్టుకొనియున్న అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే,తన తిరు నాభియందు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించినవాడును, ప్రళయ కాలమున సర్వలోకములను ఆరగించినవాడును, నాయొక్క వంశమునకు నాధుడును,నిత్యశూరులకు స్వామియైన సర్వేశ్వరునియొక్క వాసస్థలమని చెప్పుచున్నారు కదా!
వైయముణ్డు ఆలిలైమేవు మాయన్, మణి నీణ్ ముడి,
పైకొళ్ నాకత్తణైయాన్, పయిలుమ్ ఇడమెన్బర్ ఆల్,
తైయనల్లార్ కుழల్ మాలైయుమ్, మర్ట్రవర్ తడములై,
శెయ్య శాన్దుమ్ కలన్దు, ఇழி పునల్ శూழ், తెన్నరఙ్గమే ll 1379
నల్ తైయలార్=మంచి గుణశీలురైన స్త్రీలయొక్క;కుழల్ మాలైయుమ్= కొప్పులందు అలంకరించు కొనిన పుష్పముల మాలలను; మర్ట్రు = మరియు; అవర్ తడములై = వారియొక్క పెద్ద వక్షోజములందు;(రాసుకొనిన)శెయ్య శాన్దమ్ కలన్దు=ఎర్రని చందనము ఇవన్నిటితో చేరి; ఇழி పునల్ శూழ் = ప్రవహించెడి జలములుగల కావేరి నదిచే చుట్టుకొనియున్న,తెన్ అరఙ్గమే=అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే;వైయమ్ ఉణ్డు= (ప్రళయకాలమున) భూమండలమంతయును ఆరగించి; ఆల్ ఇలై మేవుమ్ మాయన్=వటదళముపై అమరి శయనించు ఆశ్చర్యభూతుడును;మణి నీళ్ ముడి = మణిమయమైన పొడుగైన కిరీటముగలవాడును;పై కొళ్ నాకత్తు అణైయాన్ = విశాలమైన పడగలుగల ఆదిశేషుని తల్పముగగల సర్వేశ్వరుడు; పయిలుమ్ ఇడమ్ ఎన్బర్ ఆల్ = నిత్యవాసము చేయుచున్న స్థలమని చెప్పుచున్నారు కదా!
మంచి గుణశీలురైన స్త్రీలయొక్క కొప్పులందు అలంకరించుకొనిన పుష్పముల మాలలను,మరియు వారియొక్క పెద్ద వక్షోజములందు రాసుకొనిన ఎర్రని చందనము ఇవన్నిటితో చేరి ప్రవహించెడి జలములుగల కావేరి నదిచే చుట్టుకొనియున్న అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే, ప్రళయకాలమున భూమండలమంతయును ఆరగించి వటదళముపై అమరి శయనించు ఆశ్చర్యభూతుడును,మణిమయమైన పొడుగైన కిరీటముగలవాడును,విశాలమైన పడగలుగల ఆదిశేషుని తల్పముగగల సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న స్థలమని చెప్పుచున్నారు కదా!
పణ్డివ్వైయమ్ అళప్పాన్ శెన్ఱు, మావలికైయిల్ నీర్
కొణ్డ, ఆழி త్తడక్కై, కుఱళన్ ఇడమెన్బర్ ఆల్,
వణ్డు పాడుమ్ మదువార్ పునల్, వన్దు ఇழிకావేరి,
అణ్డనాఱుమ్ పొழிల్ శూழ் న్దు, అழగార్ తెన్నరఙ్గమే ll 1380
వణ్డు పాడుమ్ = భ్రమరములు ఝంకారము చేయుచున్నదియు;మదువు ఆర్=తేనెలు ఒలుకు; పునల్ వన్దు ఇழி కావేరి=జలములతో వచ్చు ప్రవహించెడి కావేరి నది వలనను;అణ్డ నాఱుమ్ పొழிల్ శూழ்న్దు = ఆకాశమంతటను పరిమళము వెదజల్లు తోటలతో చుట్టబడిన; అழగు ఆర్=మిక్కిలి సుందరమైన; తెన్ అరఙ్గమే = దక్షిణ దిక్కునగల శ్రీ రంగం దివ్యదేశమునే; పణ్డు = పూర్వమొక కాలమున;ఇ వైయ్యమ్ = ఈ భూమండలమును; అళప్పాన్= కొలిచి స్వీకరించుటకై; శెన్ఱు=వెడలి;మావలి కైయిల్ నీర్=మహాబలి చేతినుండి దానజలమును;ఆழி తడక్కై కొణ్డ=సుదర్శనచక్రమును ధరించిన పెద్ద హస్తముతో గ్రహించిన; కుఱళన్=వామనమూర్తి యొక్క; ఇడమ్ ఎన్బర్ ఆల్ = వాసస్థలమని చెప్పుచున్నారు కదా!
భ్రమరములు ఝంకారము చేయుచున్నదియు,తేనెలు ఒలుకు జలములతో వచ్చు ప్రవహించెడి కావేరి నది వలనను,ఆకాశమంతటను పరిమళము వెదజల్లు తోటలతో చుట్టబడిన అందమైన శ్రీ రంగం దివ్య దేశమునే,పూర్వమొక కాలమున ఈ భూమండలమును కొలిచి స్వీకరించుటకై వెడలి మహాబలి చేతినుండి దానజలమును సుదర్శనచక్రమును ధరించిన పెద్ద హస్తముతో గ్రహించిన వామనమూర్తియొక్క వాసస్థలమని చెప్పుచున్నారు కదా!
విళైత్త వెమ్బోర్ విఱల్ వాళ్ అరక్కన్, నగర్ పాழ்పడ,
వళైత్త వల్ విల్ తడక్కైయవనుక్కు, ఇడమెన్బరాల్,
తుళైక్కైయానై మరుప్పుమ్ అగిలుమ్, కొణర్ న్దు ఉన్ది, మున్
తిళైక్కుమ్ శెల్వ ప్పునల్ కావిరి శూழ், తెన్నరఙ్గమే ll 1381
తుళై క్కై ఆనై=తొండముగల ఏనుగులయొక్క;మరుప్పుమ్=దంతములును;అగిలుమ్= అగిల్ చెట్లును; కొణర్ న్దు = కొట్టుకొనివచ్చి;మున్ ఉన్ది=ముందటనే త్రోసి; తిళైక్కుమ్ = లీలారసమనుభవించుచున్న; శెల్వమ్ పునల్ కావిరి శూழ் = దివ్యమైన జలములుగల కావేరి నదిచే చుట్టుకొనియున్న;తెన్ అరఙ్గమే= అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే; వెమ్ పోర్ విళైత్త=క్రూరమైన యుద్దమగునట్లు చేసిన; విఱల్= బలిష్ఠుడైన;వాళ్ అరక్కన్= ఖడ్గముగల రావణాసురునియొక్క; నగర్ పాழ்పడ = నగరము లంకాపురిని నాశనము అగునట్లు; వళైత్త = వంగింపజేసిన; వల్ విల్=దృఢమైన శార్ఙ్గమను విల్లును; తడక్కై అవనుక్కు = పెద్ద హస్తమున గల స్వామియొక్క; ఇడమ్ ఎన్బరాల్ = వాసస్థలమని చెప్పుచున్నారు కదా!
తొండముగల ఏనుగులయొక్క దంతములును,అగిల్ చెట్లను,కొట్టుకొనివచ్చి ముందటనే త్రోసి, లీలారసమనుభవించుచున్న దివ్యమైన జలములుగల కావేరి నదిచే చుట్టుకొని యున్న అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే,క్రూరమైన యుద్దమగునట్లు చేసిన బలిష్ఠుడైన,ఖడ్గముగల రావణాసురునియొక్క నగరము లంకాపురిని నాశనమగునట్లు, వంగింపజేసిన దృఢమైన శార్ఙ్గమను విల్లును పెద్ద హస్తమున గల స్వామియొక్క వాసస్థలమని చెప్పుచున్నారు కదా!
వమ్బు ఉలామ్ కూన్దల్ మణ్డోదరి కాదలన్, వాన్ పుగ
అమ్బుతన్నాల్ మునిన్ద, అழగనిడ మెన్బరాల్,
ఉమ్బర కోనుమ్ ఉలగేழுమ్, వన్దీణ్డి వణఙ్గుమ్, నల్
శెమ్బొనారుమ్ మతిల్ శూழ் న్దు అழగార్ తెన్నరఙ్గమే ll 1382
ఉమ్బర కోనుమ్ = దేవతలకు నిర్వాహకుడైన బ్రహ్మయు; ఉలగు ఏழுమ్=సప్త లోకములును; వన్దు ఈణ్డి = వచ్చి గుమిగూడి; వణఙ్గుమ్ = సేవించుచుండెడి;నల్ శెమ్ పొన్ ఆరుమ్ మతిల్ శూழ் న్దు = మంచి మేలిమి బంగారముతొ ఒప్పు ప్రాకారములతొ చుట్టబడిన;అழగు ఆర్=అతి సుందరమైన;తెన్ అరఙ్గమే=దక్షిణ దిక్కునగల శ్రీ రంగం దివ్యదేశమునే;వమ్బు ఉలామ్ కూన్దల్=పరిమళము వెదజల్లు కుంతలములు గల; మణ్డోదరి కాదలన్ = మండోదరియొక్క భర్త రావణాసురుడు;వాన్ పుగ = వీరస్వర్గము పొందునట్లు; అమ్బుతన్నాల్ = బాణములచే;మునిన్ద=కోపగించి కలుగజేసిన,అழగన్= వీర శ్రీ కలిగిన శ్రీ రామచంద్రుని;ఇడమ్ ఎన్బరాల్ = వాసస్థలమని చెప్పుచున్నారు కదా! .
దేవతలకు నిర్వాహకుడైన బ్రహ్మయు, సప్తలోకములును,వచ్చి గుమిగూడి సేవించుచుండెడి మంచి మేలిమి బంగారముతొ ఒప్పు ప్రాకారములతొ చుట్టబడిన అతి సుందరమైన,దక్షిణ దిక్కునగల శ్రీ రంగం దివ్యదేశమునే,పరిమళము వెదజల్లు కుంతలములుగల మండోదరియొక్క భర్త రావణాసురుడు వీరస్వర్గము పొందునట్లు బాణములచే కోపగించి కలుగజేసిన వీర శ్రీ కలిగిన శ్రీ రామచంద్రుని వాసస్థలమని చెప్పుచున్నారు కదా! .
కలై ఉడుత్త అగల్ అల్ గుల్, వన్ పేయ్ మగళ్ తాయెన,
ములై కొడుత్తాళ్ ఉయిరుణ్డవన్, వాழுమిడమెన్బరాల్,
కులై యెడుత్త కదలి, ప్పొழிలూడుమ్ వన్దున్ది, మున్
అలై యెడుక్కుమ్ పునల్ కావిరి శూழ், తెన్నరఙ్గమే ll 1383
కులై ఎడుత్త = పెద్ద కొలలు కలిగిన;కదలి పొழிల్ ఊడుమ్=అరటి చెట్ల తోటలనుండి; వన్దు = వచ్చి; మున్ ఉన్ది = (ఆ అరటిచెట్లను వేర్లతో ఊడబెరికి) ముంగిటనే త్రోసెడు; అలై ఎడుక్కుమ్ పునల్ కావిరి శూழ் =అలలుకొట్టుచున్న జలములుగల కావేరి నదిచే చుట్టుకొనియున్న; తెన్ అరఙ్గమే = అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే;కలై ఉడుత్త = పట్టు వస్త్రములు ధరించిన; అగల్ అల్ గుల్ = విశాలమైన కటిప్రదేశముగల;వన్ పేయ్ మగళ్=బలముగల రక్కసి పూతన;తాయ్ఎన=తల్లి యశోదాదేవి వలె;ములై కొడుత్తాళ్= స్తనమందలి పాలు త్రాగుటకై ఇచ్చిన ఆమెయొక్క;ఉయిర్ ఉణ్డవన్=ప్రాణమును పీల్చిన ఆ శ్రీకృష్ణుడు;వాழுమ్ ఇడమ్ ఎన్బరాల్ = నిత్యవాసము చేయుచున్న స్థలమని చెప్పుచున్నారు కదా!.
పెద్ద కొలలు కలిగిన అరటి చెట్ల తోటలనుండి వచ్చి ఆ అరటిచెట్లను వేర్లతో ఊడబెరికి ముంగిటనే త్రోసెడు అలలుకొట్టుచున్న జలములుగల కావేరి నదిచే చుట్టుకొనియున్న అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే, పట్టు వస్త్రములు ధరించిన విశాలమైన కటిప్రదేశముగల బలముగల రక్కసి పూతన తల్లి యశోదాదేవి వలె స్తనమందలి పాలు త్రాగుటకై ఇచ్చిన ఆమెయొక్క ప్రాణమును పీల్చిన ఆ శ్రీకృష్ణుడు నిత్యవాసము చేయుచున్న స్థలమని చెప్పుచున్నారు కదా!.
కఞ్జన్ నెఞ్జుమ్ కడు మల్లరుమ్, శకడమ్ కాలినాల్,
తుఞ్జ వెన్ఱ శుడరాழிయాన్, వాழுమిడమెన్బరాల్,
మఞ్జు శేర్ మాళిగై, నీడగిల్ పుగైయుమ్, మామఱైయోర్
శెఞ్జొల్ వేళ్విప్పుగైయుమ్ కమழுమ్, తెన్నరఙ్గమే ll 1384
మఞ్జు శేర్=మేఘమండలమును తాకుచున్న;మాళిగై=భవనములతో;నీడు అగిల్ పుగైయుమ్ = అధికమైన అగిల్ చెట్లయొక్క పొగయును;మా మఱైయోర్ శెమ్ శొల్ వేళ్వి పుగైయుమ్ = శ్లాఘ్యమైన వైదిక బ్రాహ్మణోత్తముల సుందరమైన సూక్తులుగల వేదములందు విధింపబడిన యాగముల హోమముయొక్క పొగయును;కమழுమ్= వ్యాపించి పరిమళింపబడు; తెన్ అరఙ్గమే = అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే;కఞ్జన్ నెఞ్జుమ్=కంసుని హృదయమును;కడు మల్లరుమ్=క్రూరమైన చాణూరముష్టికులు అనబడు మల్లులను; శకడమ్ = శకటాసురుడును; తుఞ్జ = నశించునట్లు; కాలినాల్ వెన్ఱ = తన దివ్యమైన పాదముచే జయించిన; శుడర్ ఆழிయాన్ = ఉజ్వలమైన చక్రాయుధము హస్తమందుగల సర్వేశ్వరుడు; వాழுమ్ ఇడమ్ ఎన్బరాల్ = నిత్యవాసము చేయుచున్న స్థలమని చెప్పుచున్నారు కదా!.
మేఘమండలమును తాకుచున్న భవనములతో,అధికమైన అగిల్ చెట్లయొక్క పొగయును,శ్లాఘ్యమైన వైదిక బ్రాహ్మణోత్తముల సుందరమైన సూక్తులుగల వేదములందు విధింపబడిన యాగముల హోమముయొక్క పొగయును, వ్యాపించి పరిమళింపబడు అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే, కంసుని హృదయమును, క్రూరమైన చాణూరముష్టికులనబడు మల్లులను, శకటాసురుడును నశించునట్లు తన దివ్యమైన పాదముచే జయించిన ఉజ్వలమైన చక్రాయుధము హస్తమందుగల సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న స్థలమని చెప్పుచున్నారు కదా!.
ఏన మీన్ అమైయోడు, అరియుమ్ శిఱు కుఱళుమాయ్,
తానుమాయ, తరణిత్తలైవనిడమెన్బరాల్,
వానుమ్ మణ్ణుమ్ నిఱైయ, పుగున్దీణ్డివణఙ్గుమ్, నల్
తేనుమ్ పాలుమ్ కలన్దన్నవర్ శేర్, తెన్నరఙ్గమే ll 1385
వానుమ్ మణ్ణుమ్=పరమపదమందలి నిత్యశూరులు,భూలోకమందున్న జనులు; నిఱైయ పుగున్దు= ఆనేకమంది వచ్చి; ఈణ్డి = గుమిగూడి;వణఙ్గుమ్ = సేవించుకొను చుండెడిదియు; నల్ తేనుమ్ పాలుమ్ = మంచి మధురమైన తేనె,పాలు;కలన్దన్నవర్ శేర్ = కలిపినట్లుయుండెడి విధముగ ఒకేమనోభావములు గల భక్తులు చేరియున్న; తెన్ అరఙ్గమే = అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే; ఏన మీన్ అమైయోడు = వరాహము,మత్స్యము, కూర్మముతో బాటు; అరియుమ్ శిఱు కుఱళుమ్ ఆయ్ = నరసింహ రూపముగాను, చిన్న వామనమూర్తిగాను అవతరించి;తానుమ్ ఆయ=శ్రీ రామచంద్రునిగ అవతరించి;తరణి తలైవన్= ఈ లోకమును పాలించిన స్వామియొక్క;ఇడమ్ ఎన్బరాల్=వాసస్థలమని చెప్పుచున్నారు కదా! .
పరమపదమందలి నిత్యశూరులు,భూలోకమందున్న జనులు ఆనేకమంది వచ్చి గుమిగూడి సేవించుకొను చుండెడిదియు,మంచి మధురమైన తేనె,పాలు కలిపినట్లు ఉండెడి విధముగ ఒకేమనోభావములు గల భక్తులు చేరియున్న అందమైన శ్రీ రంగం దివ్యదేశమునే, వరాహము,మత్స్యము, కూర్మముతో బాటు నరసింహ రూపముగాను, చిన్న వామనమూర్తిగాను అవతరించి,శ్రీ రామచంద్రునిగ అవతరించి ఈ లోకమును పాలించిన స్వామియొక్క వాసస్థలమని చెప్పుచున్నారు కదా! .
శేయనెన్ఱుమ్ మిగప్పెరియన్, నుణ్ణేర్మైయినాయ, ఇ
మ్మాయయై ఆరుమఱియావగైయాన్, ఇడమెన్బరాల్,
వేయిన్ ముత్తుమ్ మణియుమ్ కొణర్ న్దు, ఆర్ పునల్ కావిరి,
ఆయ పొన్ మా మదిళ్ శూழ் న్దు, అழగార్ తెన్నరఙ్గమే ll 1386
వేయిన్ ముత్తుమ్=వెదురు మొక్కలనుండి వెదజల్లబడు ముత్యములును; మణియుమ్ కొణర్ న్దు = నవరత్నములును తోసుకుని వచ్చు, ఆర్ పునల్ కావిరి = ఉధృతమైన జలములు కలిగిన కావేరినది చేతను;ఆయ పొన్ మామదిళ్ శూழ் న్దు=బంగారమును పోలినట్లున్న గొప్ప ప్రాకారములతొ చుట్టబడిన; అழగు ఆర్ = బహు సుందరమైన; తెన్ అరఙ్గమే = దక్షిణ దిక్కనగల శ్రీ రంగం దివ్యదేశమునే; శేయన్ ఎన్ఱుమ్ = పొందుటకు దుర్లభుడనియు; మిగ పెరియన్=మహా పురుషుడనియు; నుణ్ నేర్మైయిన్ ఆయ= సూక్ష్మమైన పదార్ధములకంటెను అతి సూక్ష్మమైన స్వభావముతో వసించెడి; ఇ మాయయై = ఈ ఆశ్చర్యకరమైన విషయమును; ఆరుమ్ అఱియా వగైయాన్ = ఏ ఒక్కరిచేతను తెలుసుకొనలేని విధముగ నున్న సర్వేశ్వరుని; ఇడమ్ ఎన్బరాల్ = వాసస్థలమని చెప్పుచున్నారు కదా! .
వెదురు మొక్కలనుండి వెదజల్లబడు ముత్యములును, నవరత్నములును తోసుకుని వచ్చు ఉధృతమైన జలములు కలిగిన కావేరినది చేతను,బంగారమును పోలినట్లున్న గొప్ప ప్రాకారములతొ చుట్టబడిన బహుసుందరమైన దక్షిణ దిక్కనగల శ్రీ రంగం దివ్యదేశమునే, పొందుటకు దుర్లభుడనియు, మహాపురుషుడనియు,సూక్ష్మమైన పదార్ధములకంటెను అతి సూక్ష్మమైన స్వభావముతో వసించెడి ఈ ఆశ్చర్యకరమైన విషయమును ఏ ఒక్కరిచేతను తెలుసుకొనలేని విధముగ నున్న సర్వేశ్వరుని వాసస్థలమని చెప్పుచున్నారు కదా!
** అల్లి మాదరమరుమ్, తిరుమార్వన్ అరఙ్గత్తై,
కల్లిన్ మన్ను మదిళ్, మంగైయర్ కోన్ కలికన్ఱి శొల్,
నల్లిశై మాలైగళ్, నాలిరణ్డుమిరణ్డుముడన్,
వల్లవర్ తామ్ ఉలగాణ్డు, పిన్ వానులగాళ్వరే ll 1387
అల్లి మాదర్ అమరుమ్ = కమలవాసిని అమరియున్న; తిరుమార్వన్ = దివ్యమైన వక్షస్థలముగల సర్వేశ్వరునియొక్క; అరఙ్గత్తై = శ్రీ రంగం దివ్యదేశమును;కల్లిన్=రాతిచే కట్టబడిన;మన్ను = దృఢమైన; మదిళ్ = ప్రాకారములుగల; మంగైయర్ కోన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువు; కలికన్ఱి=తిరుమంగై ఆళ్వార్;శొల్ = కృపతో చెప్పిన;నల్ ఇశై = ఇంపైన రాగములతొ నున్న; మాలై గళ్ = సూక్తులమాలైన; నాలిరణ్డుమ్ ఇరణ్డుమ్= ఈ పది పాశురములను; ఉడన్=శ్రద్ధతో;వల్లవర్ తామ్= అనుసంధించువారు; ఉలగు ఆణ్డు = ఈ లోకమును పాలించి;పిన్ = పిదప;వాన్ ఉలగు ఆళ్వరే = పరమపదమును పాలించుదురు సుమా!
కమలవాసిని అమరియున్న దివ్యమైన వక్షస్థలముగల సర్వేశ్వరునియొక్కశ్రీ రంగం దివ్య దేశమును రాతిచే కట్టబడిన దృఢమైన ప్రాకారములుగల తిరుమంగై దేశ వాసులకు ప్రభువు, తిరుమంగై ఆళ్వార్ కృపతో చెప్పిన ఇంపైన రాగములతొ నున్న సూక్తులమాలైన ఈ పది పాశురములను శ్రద్ధతో అనుసంధించువారు ఈ లోకమును పాలించి పిదప పరమపదమును పాలించుదురు సుమా!
******