పెరియతిరుమొழி-5వపత్తు (6)

శ్రీః

6. కైమ్మానమ్

సుప్రసిద్ధమైన శ్రీరంగం దివ్యదేశమును కొనియాడిన తిరుమంగై ఆళ్వార్ ఆ శ్రీ రంగనాథుని సేవించుకొనుచున్నారు.

** కై మ్మాన మழ కళిర్ట్రై, కడల్ కిడన్ద కరుమణియై,

మై మ్మాన మరదకత్తై, మఱైయురైత్త తిరుమాలై,

ఎమ్మానై యెనక్కెన్ఱు మినియానై, ప్పనికాత్త

అమ్మానై, యాన్ కణ్డదు, అణినీర్ తెన్నరఙ్గత్తే  ll 1398

మానమ్ కై= పొడుగైన తొండముగల;మழ కళిర్ట్రై=యౌవనమైన ఏనుగువంటి వాడును; కడల్ కిడన్ద కరుమణియై=మహాసముద్రమున పవళించియున్న నీలమణివంటివాడును; మై మానమ్ మరదకత్తై= పచ్చని వర్ణము మిక్కుటముగగల మరకత మణివంటివాడును; మఱై ఉరైత్త తిరుమాలై = వేదములచే ప్రతిపాదింపబడిన  శ్రీమహాలక్ష్మివల్లభుడును; ఎమ్మానై = నాకు స్వామియును;ఎనక్కు ఎన్ఱుమ్ ఇనియానై=నాకు ఎల్లప్పుడును పరమ భోగ్యమైనవాడును; పని కాత్త అమ్మానై=వర్షమునుండి గోవులను రక్షించిన సర్వేశ్వరుని; యాన్ కణ్డదు = ఈ దాసుడు సేవించుకొనినది; అణి నీర్ తెన్ అరఙ్గత్తే = అందమైన జలములచే చుట్టుకొనియున్న ఆ సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!

పొడుగైన తొండముగల యౌవనమైన ఏనుగువంటి వాడును,మహాసముద్రమున పవళించియున్న నీలమణివంటివాడును, పచ్చని వర్ణము మిక్కుటముగగల మరకత మణివంటి వాడును,వేదములచే ప్రతిపాదింపబడిన  శ్రీమహాలక్ష్మివల్లభుడును,నాకు స్వామియును,నాకు ఎల్లప్పుడును పరమ భోగ్యమైనవాడును,వర్షమునుండి గోవులను రక్షించిన సర్వేశ్వరుని ఈ దాసుడు సేవించుకొనినది, అందమైన జలములచే చుట్టుకొనియున్న ఆ సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!

** పేరానై, కుఱుఙ్గుడి యెమ్బెరుమానై, త్తిరుత్తణ్గాల్,

ఊరానై, క్కరమ్బనూరుత్తమనై, ముత్తిలఙ్గు

కారార్ తిణ్ కడలేழுమ్, మలైయేழ் ఇవ్వలగేழுణ్డుమ్,

ఆరాదెన్ఱు ఇరున్దానై, కణ్ణదు తెన్నరఙ్గత్తే  ll 1399

పేరానై = తిరుప్పేర్ దివ్యదేశమున వేంచేసియున్నవాడును;కుఱుఙ్గుడి ఎమ్బెరుమానై = తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న స్వామియును; తిరు తణ్ కాల్ ఊరానై = తిరు తణ్ కాల్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడును;  కరమ్బనూరు ఉత్తమనై = తిరు కరమ్బనూరులో వేంచేసియున్న పురోషోత్తముడును; ముత్తు ఇలఙ్గు కార్ ఆర్ తిణ్ కడల్ ఏழுమ్ = గర్బమందు ముత్యములు ప్రకాశించు మిక్కిలి నల్లని అణచుటకు సాధ్యముకాని మహాసముద్రములు ఏడును; మలై ఏழ்=సప్త కులపర్వతములను;ఇ ఉలగేழ்=ఈ సప్తలోకములను; ఉణ్డుమ్= ఆస్వాదించియు; ఆరాదు ఎన్ఱు ఇరున్దానై = తృప్తితీరనివానివలె నున్న సర్వేశ్వరుని; కణ్డదు = ఈ దాసుడు సేవించుకొనినది; తెన్ అరఙ్గత్తే = సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

తిరుప్పేర్ దివ్యదేశమున వేంచేసియున్నవాడును,తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న స్వామియును,తిరు కరమ్బనూరులో వేంచేసియున్న పురోషోత్తముడును, గర్బమందు ముత్యములు ప్రకాశించు మిక్కిలి నల్లని అణచుటకు సాధ్యముకాని మహాసముద్రములు ఏడును,సప్త కులపర్వతములను, ఈ సప్తలోకములను ఆస్వాదించియు,తృప్తితీరనివానివలె నున్న సర్వేశ్వరుని ఈ దాసుడు సేవించుకొనినది సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

ఏనాగి ఉలగు ఇడన్దు, అన్ఱు ఇరునిలమ్ పెరువిశుమ్బుమ్,

తానాయ పెరుమానై, తన్నడియార్ మనత్తెన్ఱుమ్,

తేనాగి యముదాగి, త్తిగழ்న్దానై మగిழ்న్దొరుకాల్ ,

ఆనాయన్ ఆనానై, కణ్డదు తెన్నరఙ్గత్తే  ll 1400

అన్ఱు=వరాహ కల్పమందు; ఏన్ ఆగి=మహా వరాహముగ అవతరించి; ఉలగు ఇడన్దు=భూమిని (అండభిత్తినుండి) పైకెత్తినవాడును; ఇరు నిలమ్ పెరు విశుమ్బుమ్ తానాయ పెరుమానై = విశాలమైన భూలోకము, వ్యాపించియున్న ఆకాశము తన శరీరముగ కలవాడైన స్వామియు; తన్ అడియార్ మనత్తు ఎన్ఱుమ్ = తనయొక్క ఆశ్రితులయొక్క హృదయమందు ఎల్లప్పుడును; తేన్ ఆగి అముదు ఆగి = తేనెవలె, అమృతమువలె; తిగழ்న్దానై = ప్రకాశించుచున్న వాడును ;ఒరునాల్=మునుపొక సమయమున; మగిழ் న్దు = సంతోషముతో; ఆన్ ఆయన్ ఆనానై = పశువులను మేయింపజేయు గొల్లవాడైన సర్వేశ్వరుని; కణ్డదు = ఈ దాసుడు సేవించుకొనినది; తెన్ అరఙ్గత్తే = సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

వరాహ కల్పమందు మహా వరాహముగ అవతరించి భూమిని (అండభిత్తినుండి) పైకెత్తినవాడును విశాలమైన భూలోకము, వ్యాపించియున్న ఆకాశము తన శరీరముగ కలవాడైన స్వామియు, తనయొక్క ఆశ్రితులయొక్క హృదయమందు ఎల్లప్పుడును తేనెవలె, అమృతమువలె ప్రకాశించుచున్న వాడును మునుపొక సమయమున సంతోషముతో పశువులను మేయింపజేయు గొల్లవాడైన సర్వేశ్వరుని ఈ దాసుడు సేవించుకొనినది సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

వళర్ న్దవనై త్తడఙ్గడలుళ్, వలి యురువిల్ తిరి శకడమ్,

తళర్ న్దు ఉదిర ఉదైత్తవనై, తరియాదు అన్ఱు ఇరణియనై

ప్పిళన్దవనై, పెరునిలమ్ ఈరడినీట్టి, పణ్డొరునాళ్

అళన్దవనై, యాన్ కణ్డదు, అణినీర్ తెన్నరఙ్గత్తే  ll 1401

తడమ్ కడలుళ్=విశాలమైన సముద్రమందు;వళర్ న్ద అవనై=యోగనిద్రలో పవళించి యున్నవాడును; వలి ఉరువిల్ = బలిష్టమైన శరీరముతో; తిరి శకడమ్ = దొర్లుకొని వచ్చుచున్న (అశురావేశముకలిగిన) శకటమును;తళర్ న్దు ఉదిర ఉదైత్తవనై = చిక్కి ఛిన్నభిన్నమై క్రింద పడునట్లు దివ్యమైన పాదముచే తన్నినవాడును; తరియాదు = (ప్రహ్లాదుడు గురి అగుచున్న హింసలను) సహింపజాలక; అన్ఱు = ఆ సమయమున;     ఇరణియనై = హిరణ్యాసురుని, పిళన్దవనై = తన నఖములచే  చీల్చినవాడును;పణ్డు ఒరునాళ్ = పూర్వమొకకాలమున; ఈరడి నీట్టి = తన రెండు పాదములు చాచి; పెరు నిలమ్ అళన్దవన్ = విశాలమైన భూమండలమంతయును కొలిచిన సర్వేశ్వరుని; యాన్ కణ్డదు =ఈ దాసుడు సేవించుకొనినది; తెన్ అరఙ్గత్తే = సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

  విశాలమైన సముద్రమందు యోగనిద్రలో పవళించి యున్నవాడును, బలిష్టమైన శరీరముతో దొర్లుకొని వచ్చుచున్న (అశురావేశముకలిగిన) శకటమును,చిక్కి ఛిన్న భిన్నమై క్రింద పడునట్లు దివ్యమైన పాదముచే తన్నినవాడును,ప్రహ్లాదుడు గురి అగుచున్న హింసలను సహింపజాలక, ఆ సమయమున, హిరణ్యాసురుని తన నఖములచే  చీల్చినవాడును, పూర్వమొక కాలమున తన రెండు పాదములు చాచి విశాలమైన భూమండలమంతయును కొలిచిన సర్వేశ్వరుని ఈ దాసుడు సేవించుకొనినది సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

నీర్ అழలాయ్ నెడునిలనాయ్ నిన్ఱానై,  అన్ఱు అరక్కన్ 

ఊర్ అழలాల్ ఉణ్డానై, కణ్డార్ పిన్ కాణామే,

పేర్ అழలాయ్ ప్పెరువిశుమ్బాయ్, ప్పిన్ మఱైయోర్ మన్దిరత్తిన్,

ఆర్ అழలాల్ ఉణ్డానై, క్కణ్డదు తెన్నరఙ్గత్తే  ll 1402

నీర్ అழల్ ఆయ్=జలస్వరూపియు;అగ్ని స్వరూపియు;నెడు నిలన్ ఆయ్= భూస్వరూపియు; నిన్ఱానై =అయియున్నవాడును;అన్ఱు =శ్రీ రామచంద్రునిగ అవతరించిన కాలమందు; అరక్కన్ ఊర్ = రావణాసురుని యొక్క నగరము లంకాపురిని; కణ్డార్ పిన్ కాణామే=మొదట చూడబడినవారు తదుపరి చూడబడని విధముగ;అழలాల్ ఉణ్డానై= అగ్నికి ఆహుతి చేసినవాడును;పేర్ అழల్ ఆయ్=పెద్ద బడబాగ్ని స్వరూపియు;పెరు విశుమ్బు ఆయ్ = పరమపదమునకు నిర్వాహకుడును; పిన్ = దానికి పైన;మఱైయోర్ మన్దిరత్తిన్ ఆర్ అழలాల్ ఉణ్డానై=వైదిక బ్రాహ్మణోత్తముల మంత్రపూరితమైన అగ్ని యందు సమర్పింపబడు హవిస్సును ఆస్వాదించునట్టి స్వామిని; కణ్డదు=ఈ దాసుడు సేవించుకొనినది; తెన్ అరఙ్గత్తే = సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

                   జలస్వరూపియు,అగ్ని స్వరూపియు,విశాలమైన భూస్వరూపియు, అయియున్నవాడును,శ్రీరామచంద్రునిగ అవతరించిన కాలమందు రావణాసురుని యొక్క నగరము లంకాపురిని, మొదట చూడబడినవారు తదుపరి చూడబడని విధముగ, అగ్నికి ఆహుతి చేసిన వాడును,పెద్ద బడబాగ్ని స్వరూపియు, పరమపదమునకు నిర్వాహకుడును,దానికి పైన వైదిక బ్రాహ్మణోత్తముల మంత్రపూరితమైన అగ్ని యందు సమర్పింపబడు హవిస్సును ఆస్వాదించునట్టి స్వామిని ఈ దాసుడు సేవించుకొనినది సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

తఞ్జినత్తై తవిర్తు అడైన్దార్, తవనెఱియై, తరియాదు

కఞ్జనైక్కొన్ఱు, అన్ఱులగమ్ ఉణ్డుమిழ்న్ద కఱ్పగత్తై,

వెఞ్జినత్త కొడున్దొழிలోన్, విశైయురువై అశైవిత్త,

అఞ్జిఱై ప్పుట్పాగనై, యాన్ కణ్డదు తెన్నరఙ్గత్తే  ll 1403

తమ్ శినత్తై=తమయొక్క ద్వేషమును;తవిర్తు=విడిచి;అడైన్దార్=తనను ఆశ్రయించిన వారికి; తవ నెఱియై =ఉపాయ మార్గముగ నుండువాడును; తరియాదు = (క్రూరమైన అపకారములను) సహింపజాలక;కఞ్జనై కొన్ఱు=కంసుని వధించియు; అన్ఱు = పూర్వము; ఉలగమ్ ఉణ్డు ఉమిழ்న్ద కఱ్పగత్తై=లోకములను ఆస్వాదించియు, వెలిపరిచియు చేసిన కల్పవృక్షము వంటి వాడును, వెమ్ శినత్త కొడుమ్ తొழிలోన్= భయంకరమైన కోపముచే చేయకూడని సంహార కర్మలుగల రుద్రునియొక్క; విశై ఉరువై = మిక్కిలి వేగము కలిగిన రూపమును; అశైవిత్త = భాణాసుర యుద్దములో చలింపచేసిన వాడును; అమ్ శిఱై పుళ్ పాగనై=అందమైన రెక్కలుగల గరుడాళ్వార్ వాహనముగగల సర్వేశ్వరుని;యాన్ కణ్డదు= ఈ  దాసుడు సేవించుకొనినది;తెన్ అరఙ్గత్తే=సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

          తమయొక్క ద్వేషమును విడిచి తనను ఆశ్రయించిన వారికి ఉపాయ మార్గముగ నుండువాడును, క్రూరమైన అపకారములను సహింపజాలక కంసుని వధించియు, పూర్వము లోకములను ఆస్వాదించియు,వెలిపరిచియు చేసిన కల్పవృక్షము వంటి వాడును,భయంకరమైన కోపముచే చేయకూడని సంహార కర్మలుగల రుద్రునియొక్క మిక్కిలి వేగము కలిగిన రూపమును భాణాసుర యుద్దములో చలింపచేసిన వాడును, అందమైన రెక్కలుగల గరుడాళ్వార్ వాహనముగగల సర్వేశ్వరుని ఈ దాసుడు సేవించుకొనినది సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

** శిన్దనైయై తవనెఱియై,  త్తిరుమాలై, పిరియాదు

వన్దెనదు మనత్తిరున్ద, వడమలైయై, వరివణ్డార్

కొన్దణైన్ద పొழிఱ్కోవల్, ఉలగళప్పాన్ అడినిమిర్త

అన్దణనై, యాన్ కణ్డదు,  అణినీర్ తెన్నరఙ్గత్తే  ll 1404

శిన్దనైయై = నాయొక్క మనోరథమునకు విషయమైనవాడును; తవ నెఱియై = ఉపాయ మార్గముగ నుండువాడును; తిరుమాలై = శ్రీదేవియొక్క విభుడును; వడ మలైయై =తిరు వేంకటాచలమునకు నిర్వాహకుడును;(అట్టి స్వామి) వన్దు ఎనదు మనత్తు = కృపతో వేంచేసి నా హృదయమంlదు; పిరియాదు ఇరున్ద = ఒక క్షణమైనను విడువక యున్న; వరి వణ్డు ఆర్ = అందమైన భ్రమరములతో నిండి;కొన్దు=గుత్తుగుత్తులుగ నున్న పుష్పములపై; అణైన్ద = కిక్కిరిసి చేరియున్న; పొழிల్=తోటలతో చుట్టబడిన; కోవల్ = తిరు కోవలూర్ దివ్యదేశమున; ఉలగు అళప్పాన్ అడి నిమిర్త అన్దణనై = లోకములను కొలుచుటకై దివ్యచరణారవిందములను చాచిన నాయొక్క ప్రభువును; యాన్ కణ్డదు= ఈ  దాసుడు సేవించుకొనినది;తెన్ అరఙ్గత్తే=సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

నాయొక్క మనోరథమునకు విషయమైనవాడును,ఉపాయ మార్గముగ నుండువాడును, శ్రీదేవియొక్క విభుడును,తిరు వేంకటాచలమునకు నిర్వాహకుడును అట్టి స్వామి కృపతో వేంచేసి నా హృదయమందు క్షణమైనను విడువక యున్న, అందమైన భ్రమరములతో నిండి, గుత్తుగుత్తులుగ నున్న పుష్పములపై కిక్కిరిసి చేరియున్న తోటలతో చుట్టబడిన తిరు కోవలూర్ దివ్యదేశమున, లోకములను కొలుచుటకై దివ్యచరణారవిందములను చాచిన నాయొక్క ప్రభువును ఈ  దాసుడు సేవించుకొనినది సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

తువరిత్త వుడైయవర్కుమ్, తూయ్ మైయిల్లా చ్చమణర్కుమ్,

అవర్ కట్కఙ్గరుళిల్లా అరుళానై, తన్నడైన్ద

ఎమర్ గట్కుమ్ అడియేర్కుమ్, ఎమ్మాఱ్కుమ్ ఎమ్మనైక్కుమ్,

అమరర్కుమ్ పిరానారై, కణ్డదు తెన్నరఙ్గత్తే  ll 1405

తువరిత్త ఉడై యవర్కుమ్=కాషాయ వస్త్రముల ధరించిన బౌద్ధులకు;తూయ్ మై ఇల్లా శమణర్కుమ్ = పరిశుద్దస్వభావములేని జైనులకు, అవర్ గట్కు=వారివిషయమున; అరుళ్ ఇల్లా = కృపజేయనివాడును; అరుళానై =(వైదిక బ్రాహ్మణోత్తముల విషయమున) కృపజేయువాడును;తన్ అడైన్ద=తననే ఆశ్రయించిన; ఎమర్ గట్కుమ్=నన్ను చేరియున్న వారికిని; అడియేర్కుమ్ = ఈ దాసునకును; ఎమ్మాఱ్కుమ్ =నాయొక్క తండ్రికిని; ఎమ్ అనైక్కుమ్ = నాయొక్క  తల్లికిని; అమరర్కుమ్ = నిత్యశూరులకును; పిరానారై = స్వామియైన సర్వేశ్వరుని; కణ్డదు = ఈ  దాసుడు సేవించుకొనినది; తెన్ అరఙ్గత్తే = సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

    కాషాయ వస్త్రముల ధరించిన బౌద్ధులకు,పరిశుద్దస్వభావములేని జైనులకు, వారివిషయమున కృపజేయనివాడును,వైదిక బ్రాహ్మణోత్తముల విషయమున కృప జేయువాడును,తననే ఆశ్రయించిన నన్ను చేరియున్న వారికిని,ఈ దాసునకును, నాయొక్క తండ్రికిని,నాయొక్క తల్లికిని,నిత్యశూరులకును, స్వామియైన సర్వేశ్వరుని, ఈ  దాసుడు సేవించుకొనినది సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

పొయ్ వణ్ణమ్ మనత్తు అగర్ట్రి, ప్పులనైన్దుమ్ శెలవైత్తు,

మెయ్ వణ్ణమ్ నినైన్దవర్కు, మెయ్ నిన్ఱ విత్తగనై,

మై వణ్ణమ్ కరుముగిల్ పోల్, తిగழ் వణ్ణ మరదకత్తిన్,

అవ్వణ్ణ వణ్ణనై, యాన్ కణ్డదు తెన్నరఙ్గత్తే  ll 1406

పొయ్ వణ్ణమ్ = అశ్వాశ్వతమైన బాహ్యవిషయములందు;మనత్తు అగర్ట్రి = మనస్సును  వీడి; పులన్ ఐన్దుమ్ = పంచేంద్రియములను; శెలవైత్తు = మరలింపజేసి;మెయ్ వణ్ణమ్ నినైన్ద అవర్కు = సత్యముగ తనను స్మరించినవారికి; మెయ్ నిన్ఱ=తన స్వరూపమును నిజముగ కనపరచు;విత్తగనై =ఆశ్చర్య భూతుడును; మై వణ్ణమ్=అంజనమువలె నల్లని వర్ణమును; కరు ముగిల్ పోల్ తిగழ் వణ్ణమ్ మరదకత్తిన్ అవ్ వణ్ణమ్ = కాలమేఘము వలె ప్రకాశించెడి వర్ణముగల మరకత మణివంటి వర్ణమును; వణ్ణనై = అటువంటి వర్ణముతో ఒప్పు సర్వేశ్వరుని; యాన్ కణ్డదు = ఈ  దాసుడు సేవించుకొనినది; తెన్ అరఙ్గత్తే = సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

అశ్వాశ్వతమైన బాహ్యవిషయములందు మనస్సును వీడి పంచేంద్రియములను మరలింపజేసి సత్యముగ తనను స్మరించినవారికి తన స్వరూపమును నిజముగ కనపరచు ఆశ్చర్య భూతుడును అంజనమువలె నల్లని వర్ణమును,కాలమేఘము వలె ప్రకాశించెడి వర్ణముగల మరకత మణివంటి వర్ణమును, కలిగినటువంటి వర్ణముతో ఒప్పు సర్వేశ్వరుని ఈ  దాసుడు సేవించుకొనినది సుందరమైన శ్రీ రంగం దివ్యదేశమునందే సుమా!.

** ఆ మరువి నిరై మేయ్ త్త, అణియరఙ్గత్తమ్మానై,

కామరుశీర్ క్కలికన్ఱి,  ఒలి శెయ్ ద మలి పుగழ்శేర్,

నా మరువు తమిழ்మాలై, నాలిరణ్డోడిరణ్డినైయుమ్,

తామరువి వల్లార్ మేల్, శారా తీవినై తానే ll 1407

ఆ నిరై = గో సమూహములను; మరువి మేయ్ త్తు = మిక్కిలి ఆశతో మేయించిన; అణి అరఙ్గత్తు అమ్మానై = భూలోకమునకు అలంకారమైన శ్రీ రంగం దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై; కామరుశీర్ క్కలికన్ఱి = కోరదగిన గుణములు కలిగిన తిరుమంగై ఆళ్వార్; ఒలి శెయ్ ద = తమ ముఖపద్మమునుండి అనుగ్రహించిన; మలి పుగழ்శేర్ =మిక్కిలి కీర్తిగల;నా మరువు తమిழ்మాలై= జిహ్వపై కదలాడు తమిళ భాషలోనున్న; నాలిరణ్డోడుఇరణ్డినైయుమ్= ఈ పది పాసురములను; తామ్ మరువి వల్లార్ మేల్=తాము ఆశించి అనుసంధించిన వారిపై;తానే తీవినై శారా=తానుగ పాపములు చేరలేవు!

    గో సమూహములను మిక్కిలి ఆశతో మేయించిన, భూలోకమునకు అలంకారమైన శ్రీ రంగం దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై, కోరదగిన గుణములు కలిగిన తిరుమంగై ఆళ్వార్, తమ ముఖ పద్మమునుండి అనుగ్రహించిన మిక్కిలి కీర్తిగల,జిహ్వపై కదలాడు తమిళ భాషలోనున్నఈ పది పాసురములను,తాము ఆశించి అనుసంధించిన వారిపై తానుగ పాపములు చేరలేవు!

*****

వ్యాఖ్యానించండి