పెరియతిరుమొழி-6వపత్తు (2)

 శ్రీః

2. పొఱుత్తేన్

తిరువిణ్ణకర్ దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరుడు తగురీతిగ స్పందించనందున,తిరుమంగై ఆళ్వార్ ఖిన్నులై,తన పూర్వప్రవృత్తిని త్రికరణశుద్దిగ విడిచి స్వామి చరణములచెంతకు చేరితినని మొరపెట్టుచున్నారు.

** పొఱుత్తేన్ పున్ శొల్ నెఞ్జిల్, పొరుళిన్బమ్ ఎనఇరణ్డుమ్,

ఇఱుత్తేన్, ఐమ్బులన్గల్ కడనాయిన, వాయిలొట్టి

అఱుత్తేన్, ఆర్వచ్చెర్ట్రమవై దన్నై, మనత్తగర్ట్రి

వెఱుత్తేన్, నిన్నడైన్దేన్, తిరువిణ్ణకర్ మేయవనే  ll 1458

పున్ శొల్ = (ఇతరులు అవహేళనతో చెప్పు)కఠినమైన మాటలను;నెఞ్జిల్ = నాయొక్క  మనస్సున; పొఱుత్తేన్ = సహించికొనియుంటిని; ఐమ్బులన్గల్ కడన్ ఆయిన=నాయొక్క  పంచేంద్రియములకు ప్రాప్తమయిన; పొరుళ్ ఇన్బమ్ ఎన ఇరణ్డుమ్ = అర్ధము,కామము అను ఈరెండును; ఇఱుత్తేన్ = అనుభవించితిని; ఆర్వమ్ శెర్ట్రమ్ = నాకిష్టులయెడల ప్రీతిగను, అఇష్టులయెడల పగతోకూడిన క్రియలు; వాయిల్ ఒట్టి = “తప్పక చేసెదనని ప్రతిఙ్ఞ”పూని;అఱుత్తేన్=నెరవేర్చితిని; అవై దనై = ఆ రాగ ద్వేషములను;మనత్తు అగర్ట్రి= ( ఇపుడు ) నా హృదయమందు విసర్జించి; వెఱుత్తేన్ = వాటియందు విముఖత కలిగనవాడనై; తిరువిణ్ణకర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుడా!; నిన్ అడైన్దేన్=నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను. 

        ఇతరులు అవహేళనతో చెప్పు కఠినమైన మాటలను నాయొక్క మనస్సున సహించికొనియుంటిని. పంచేంద్రియములకు ప్రాప్తమయిన అర్ధము,కామము అను ఈ రెండును అనుభవించితిని. నాకిష్టుల యెడల ప్రీతిగను,అఇష్టులయెడల పగతోకూడిన క్రియలు, “తప్పక చేసెదనని ప్రతిఙ్ఞ”పూని నెరవేర్చితిని.ఇపుడు ఆ రాగ ద్వేషములను నా హృదయమందు విసర్జించి వాటియందు విముఖత కలిగనవాడనై, తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుడా!,నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను.  

మఱన్దేన్ ఉన్నై మున్నమ్, మరన్ద మతియిన్మనత్తాల్,

ఇఱన్దేన్ ఎత్తనైయుమ్, అదనాల్ ఇడుమ్బైక్కుழிయిల్,

పిఱన్దే ఎయ్ త్తొழிన్దేన్, పెరుమాన్ తిరుమార్బా,

శిఱన్దేన్ నిన్నడిక్కే, తిరువిణ్ణకర్ మేయవనే  ll 1459

ఉన్నై = (ఎల్లప్పుడు స్మరింపవలసిన) శ్రీవారిని; మున్నమ్ = మునుపు; మఱన్దేన్ = మరచిపోయితిని ;(అదియేగాక) మరన్ద మతి ఇల్ మనత్తాల్=ఇట్లు మరచితినేయను అనుతాపములేని మనస్సుతో; ఎత్తనైయుమ్=మిక్కిలి; ఇఱన్దేన్=నీచుడనై చెడిపోతిని; అదనాల్ = ఆ కారణముచే; ఇడుమ్బై = దుఃఖములకు ఆలవాలమైన; కుழிయిల్ = గర్భాశయమందు;పిఱన్దే=పలుమార్లు జనించుచు, మరణించుచు;ఎయ్ త్తుఒழிన్దేన్= అనర్ధములపాలైపోతిని; తిరుమార్బా పెరుమాన్=శ్రీదేవిని వక్షస్థలమందుగల స్వామీ!;తిరువిణ్ణకర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; నిన్ అడిక్కే = నీయొక్క దివ్యమైన  చరణారవిందములకే;శిఱన్దేన్=(ఇపుడు) తగిన మనస్తత్వం కలవానిగ చేరుకొంటిని.

(ఎల్లప్పుడు స్మరింపవలసిన) శ్రీవారిని,మునుపుమరచిపోయితిని. అదియేగాక ” ఇట్లు మరచితినే”యను అనుతాపములేని మనస్సుతో మిక్కిలి నీచుడనై చెడిపోతిని. ఆ కారణముచే దుఃఖములకు ఆలవాలమైన గర్భాశయమందు పలుమార్లు జనించుచు,మరణించుచు అనర్ధముల పాలైపోతిని. శ్రీదేవిని వక్షస్థలమందుగల స్వామీ!,తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,నీయొక్క దివ్యమైన  చరణారవిందములకే (ఇపుడు) తగిన మనస్తత్వం కలవానిగ చేరుకొంటిని.

మానేయ్ నోక్కియర్ తమ్, వయిర్ట్రు క్కుழிయిల్ ఉழைక్కుమ్,

ఊనేయాక్కైదన్నై, ఉదవామై ఉణర్ న్దుణర్ న్దు,

వానే మానిలమే, వన్దువన్దు ఎన్ మనత్తిరున్ద

తేనే, నిన్నడైన్దేన్, తిరువిణ్ణకర్ మేయవనే  ll 1460

వానే మానిలమే = నిత్యవిభూతికిని,లీలావిభూతికిని నిర్వాహకుడా!; ఉవన్దువన్దు= పరమపదమునుండి సంతోషముతో వచ్చి, ఎన్ మనత్తు ఇరున్ద తేనే = నాయొక్క హృదయమందు నిత్యవాసము చేయుచున్న తేనెవలె పరమభోగ్యుడా!; తిరువిణ్ణకర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; మాన్ ఏయ్ నోక్కియర్ తమ్ = లేడి వంటి కంటిచూపులుగల యువతుల యొక్క; వయిర్ట్రు కుழிయిల్ =గర్భాశయమందు;ఉழைక్కుమ్=బహుబాధలు కలగుజేయు;ఊన్ ఏయ్ = మాంసాదిపదార్ధములతో నిండిన; ఆక్కై తన్నై = శరీరము యొక్క; ఉదవామై ఉణర్ న్దుణర్ న్దు = ఉపయోగములేని స్థితిని బాగుగ తెలుసుకొని;నిన్ అడైన్దేన్=నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను. 

    నిత్యవిభూతికిని,లీలావిభూతికిని నిర్వాహకుడా!,పరమపదమునుండి సంతోషముతో వచ్చి నాయొక్క హృదయమందు నిత్యవాసము చేయుచున్న తేనెవలె పరమభోగ్యుడా!,తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, లేడి వంటి కంటిచూపులుగల యువతుల యొక్క గర్భాశయమందు బహు బాధలు కలగుజేయు మాంసాదిపదార్ధములతో నిండిన శరీరము యొక్క ఉపయోగములేని స్థితిని బాగుగ తెలుసుకొని నీయొక్క దివ్యమైన చరణారవిందములందు చేరియున్నాను.

పిఱన్దేన్ పెర్ట్రమక్కళ్, పెణ్డిర్ ఎన్ఱివర్ పిన్ ఉదవాదు

అఱిన్దేన్, నీ పణిత్త అరుళెన్నుమ్, ఒళ్ వాళ్ ఉరువి

ఎఱిన్దేన్, ఐమ్బలన్గళ్ ఇడర్ తీర, ఎఱిన్దు వన్దు

శెఱిన్దేన్, నిన్నడిక్కే, తిరువిణ్ణకర్ మేయవనే  ll 1461

పెర్ట్ర మక్కళ్ = జనించిన పిల్లలు; పెణ్డిర్ = భార్య; ఎన్ఱ ఇవర్ = ఇత్యాది బంధువులు; పిన్ ఉదవాదు అఱిన్దేన్=అంతిమసమయమున సహాయపరులుకారను విషయమును తెలుసుకొన్నవాడనై; పిఱన్దేన్= వారిని విడిచిపెట్టితిని;నీ పణిత్త అరుళ్ ఎన్నుమ్ ఒళ్ వాళ్ =(మునుపు అర్జునుని రథమందు)నీవు అనుగ్రహించిన చరమశ్లోకమను వాడియైన కత్తిని; ఉరువి = ఒరనుండి తీసి; ఐమ్బలన్గళ్ ఇడర్ తీర = శబ్దాదివిషయములవలన కలిగెడు దుఃఖములను;ఎఱిన్దేన్= ఎగరగొట్టితిని;ఎఱిన్దు వన్దు = అట్లు పంచేద్రియముల బాధను తొలగించుకొని;తిరువిణ్ణకర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; నిన్ అడిక్కే = నీయొక్క దివ్యమైన  చరణారవిందములకే; శిఱన్దేన్= (ఇపుడు) తగినమనస్తత్వంకలవానిగ చేరుకొంటిని.

జనించిన పిల్లలు,భార్య ఇత్యాది బంధువులు అంతిమసమయమున సహాయపరులు కారను విషయమును తెలుసుకొన్నవాడనై,వారిని విడిచిపెట్టితిని. (మునుపు అర్జునుని రథమందు)నీవు అనుగ్రహించిన చరమశ్లోకమను వాడియైన కత్తిని ఒరనుండి తీసి శబ్దాదివిషయములవలన కలిగెడు దుఃఖములను ఎగరగొట్టితిని.అట్లు పంచేద్రియముల బాధను తొలగించుకొని,తిరువిణ్ణకర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, నీయొక్క దివ్యమైన  చరణారవిందములకే (ఇపుడు) తగిన మనస్తత్వంకలవానిగ చేరుకొంటిని.

పాణ్ తేన్ వణ్డఱైయుమ్ కుழలార్ గళ్, పల్లాణ్డిశైప్ప,

ఆణ్డార్ వైయమెల్లామ్, అరశాగి, మున్నాణ్డవరే

మాణ్డారెన్ఱు వన్దార్ అన్దో, మనైవాழ்క్కై తన్నై

వేణ్డేన్,  నిన్నడైన్దేన్, తిరువిణ్ణకర్ మేయవనే  ll 1462

పాణ్ =  రాగభరితమైన నోరు; తేన్ = తేనెను పానముచేయు; వణ్డు = భ్రమరములు; అఱైయుమ్ = ఝంకారము చేయుచుండెడి; కుழలార్ గళ్ = కుంతలములు గల యువతులు;పల్లాణ్డు ఇశైప్ప= మంగళాశాసనము చేయుచుండగ ; అరశు ఆగి = రాజులుగ;వైయమ్ ఎల్లామ్=భూమండలమంతయును; ఆణ్డార్=పాలించిరి; (కాని ఒక దినమున)మున్= మునుపు; ఆణ్డవరే మాణ్డార్ =ఆ పాలించినవారు ఇక లేరు; ఎన్ఱు వన్దార్=అని మాట చెప్పుటకు  వారు వచ్చిరి;అన్దో = అయ్యో!;తిరువిణ్ణకర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!;మనై వాழ்క్కై తన్నైవేణ్డేన్ =(ఇటువంటి స్వభావము కలగియున్న) సంసారజీవనమున ఇచ్ఛలేక విముఖత కలిగిన వాడనై;నిన్ అడైన్దేన్ = నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను. 

రాగభరితమైన నోరు, తేనెను పానముచేయు భ్రమరములు ఝంకారము చేయుచుండెడి కుంతలములు గల యువతులు మంగళాశాసనము చేయుచుండగ రాజులుగ భూమండలమంతయును పాలించిరి. (కాని ఒక దినమున) మునుపు ఆ పాలించినవారు ఇక లేరు అని మాట చెప్పుటకు  వారు వచ్చిరి అయ్యో! తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! (ఇటువంటి స్వభావము కలగియున్న) సంసారజీవనమున ఇచ్ఛలేక విముఖత కలిగిన వాడనై నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను. 

కల్లా ఐమ్బులన్గళవై, కణ్డవాఱు శెయ్యగిల్లేన్,

మల్లా మల్ అమరుల్ మల్లర్ మాళ, మల్లడర్త

మల్లా, మల్లల్ అమ్ శీర్, మదిళ్ నీర్ ఇలఙ్గై యழிత్త

విల్లా, నిన్నడైన్దేన్, తిరువిణ్ణకర్ మేయవనే  ll 1463

కల్లా = శాస్త్రములు సమ్మతించని; ఐమ్బులన్గళ్ అవై = పంచేంద్రియములు;కణ్డ ఆఱు= చేయ తలచిన విధముగ; శెయ్యగిల్లేన్ = నేను సమ్మతింపను;మల్లా=మిక్కిలి శక్తివంతమైన సర్వేశ్వరా!;మల్ అమరుల్ = మల్లయుద్ధములో; మల్లర్ మాళ = చాణూరముష్టికులనబడు మల్లులు నశించునట్లు; మల్ అడర్త = వారియొక్క బలమును క్షీణింపజేసిన,మల్లా=మల్ల వీరుడా!;మల్లల్ అమ్ శీర్=మిక్కిలి అందమైన సంపదకలిగిన; మదిళ్ = ప్రాకారములచే చుట్టుకొనియున్నదియు; నీర్ = నీటి అగడ్త చుట్టియున్నదియు; ఇలఙ్గై = లంకాపురిని; అழிత్త = నాశనముచేసిన; విల్లా = శార్ఙ్గమను విల్లును ధరించినవాడా!; తిరువిణ్ణకర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుడా!; నిన్ అడైన్దేన్=నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను. 

శాస్త్రములు సమ్మతించని పంచేంద్రియములు చేయ తలచిన విధముగ నేను చేయుటకు సమ్మతించను. మిక్కిలి శక్తివంతమైన సర్వేశ్వరా! మల్లయుద్ధములో చాణూరముష్టికులనబడు మల్లులు నశించునట్లు వారియొక్క బలమును క్షీణింపజేసిన మల్ల వీరుడా!,మిక్కిలి అందమైన సంపద కలిగినదియు, ప్రాకారములచే చుట్టుకొని యున్నదియు,నీటి అగడ్త చుట్టియున్నదియు, లంకాపురిని నాశనముచేసిన శార్ఙ్గమను విల్లును ధరించినవాడా!,తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను. 

వేఱాయాన్ ఇరన్దేన్, వెగుళాదు మనక్కొళ్ ఎన్దాయ్,

ఆఱావెన్నరకత్తు, అడియేనై ఇడక్కరుది,

కూఱా ఐవర్ వన్దు కుమైక్క, కుడివిట్టవరై,

తేఱాదు ఉన్నడైన్దేన్, తిరువిణ్ణకర్ మేయవనే  ll 1464

ఎన్దాయ్ = నాయొక్క స్వామీ!; యాన్ = నీ దాసుడైన నేను; వేఱు ఆ = విలక్షణముగ; ఇరన్దేన్=యాచన చేయుచున్నాను; వెగుళాదు = ఆగ్రహించక; మనక్కొళ్ = తమ హృదయమున స్వీకరించవలెను; ఐవర్ = పంచేద్రియములు; అడియేనై=ఈ దాసుని; ఆఱా వెమ్ నరకత్తు=ఎడతెగని క్రూరమైన సంసార నరకములో; ఇడ కరుది = త్రోయుటకై తలచి; కూఱు ఆ = నన్ను తమయొక్క భాగముగ ఎంచి; వన్దు = సమీపించి; కుమైక్క = హింసింప;కుడి విట్టవరై= (నీవు నన్ను సన్మార్గమున ప్రవర్తింపజేయుటకై సృష్టికాలమున నాయందు) నివాసముచేయ ఏర్పరచిన పంచేంద్రియములను; తేఱాదు = నమ్మలేక; తిరువిణ్ణకర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!;ఉన్ అడైన్దేన్=నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను.

నాయొక్క స్వామీ!,నీ దాసుడైన నేను విలక్షణముగ యాచనచేయుచున్నాను. ఆగ్రహించక తమ హృదయమున స్వీకరించవలెను.పంచేద్రియములు ఈ దాసుని ఎడతెగని క్రూరమైన సంసారనరకములో త్రోయుటకై తలచి, నన్ను తమయొక్క భాగముగ ఎంచి, సమీపించి,హింసింప,(నీవు నన్ను సన్మార్గమున ప్రవర్తింపజేయుటకై సృష్టికాలమున నాయందు)నివాసముచేయ ఏర్పరచిన పంచేంద్రియములను నమ్మలేక, తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను.

తీవాయ్ వల్ వినైయార్,ఉడనిన్ఱు శిఱన్దవర్ పోల్,

మేవా వెన్నరగత్తిడ, వుర్ట్రువిరైన్దువన్దార్,

మూవా వానవర్ తమ్ ముదల్వా, మది కోళ్ విడుత్త

తేవా, నిన్నడైన్దేన్, తిరువిణ్ణకర్ మేయవనే  ll 1465

తీవాయ్=అగ్నిని జల్లు నోరుగల;వల్ వినైయార్ = క్రూరమైన పాపములు; శిఱన్దవర్ పోల్ = ఆప్తబంధువులవలె;ఉడనిన్ఱు=నాతోనే నన్ను విడువక కలసియుండి;మేవా వెమ్ నరగత్తు ఇడ ఉర్ట్రు= పొందకూడని క్రూరమైన నరకమున త్రోయుటకై సంకల్పించి;విరైన్దు వన్దార్= అతివేగముకలవియై ఉన్నవి;మూవా వానవర్ తమ్ ముదల్వా=జరా మొదలగు వికారములు లేని దేవాదిదేవుడా!;మది కోళ్ విడుత్త తేవా = చంద్రుని క్షయ రోగమును పోగొట్టిన దేవుడా!; తిరువిణ్ణకర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; నిన్ అడైన్దేన్=నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను.

అగ్నిని జల్లు నోరుగల క్రూరమైన పాపములు ఆప్తబంధువులవలె నాతోనే నన్ను విడువక కలసియుండి పొందకూడని క్రూరమైన నరకమున త్రోయుటకై సంకల్పించి అతివేగము కలవియై ఉన్నవి. జరా మొదలగు వికారములు లేని దేవాదిదేవుడా!,చంద్రుని క్షయ రోగమును పోగొట్టిన దేవుడా!,తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను.

పోదార్ తామరైయాళ్, పులవి క్కులవానవర్ తమ్

కోదా, కోదిల్ శెఙ్గోల్, కుడైమన్నరిడై నడన్ద

తూదా,తూమెழிయాయ్ శుడర్ పోల్, ఎన్ మనత్తిరున్ద 

వేదా, నిన్నడైన్దేన్, తిరువిణ్ణకర్ మేయవనే  ll 1466

పోదు ఆర్ తామరైయాళ్=బాగుగ వికసించిన తామరపుష్ప నివాసిని శ్రీ దేవికిని;పులవి= భూదేవికిని; కుల వానవర్ తమ్=శ్లాఘ్యమైన నిత్యశూరులకును; కోదా = ఆశపడతగిన వాడవును; కోదిల్ శెఙ్గోల్ కుడై మన్నర్ ఇడై = ఎటువంటి ఆటంకములులేని రాజ్యాధిపత్యమును  చేయుచున్న (దుర్యోదనాదుల) రాజుల చెంతకు; నడన్ద తూదా = వెడలి ధౌత్యము చేసిన స్వామీ!;తూ మెழிయాయ్ = మధురమైన వాక్కులుగలవాడా!;శుడర్ పోల్ = జ్యోతివలె ప్రకాశించుచు; ఎన్ మనత్తు ఇరున్ద = నాయొక్క హృదయమందు నిత్యవాసము చేయుచున్న; వేదా = వేద ప్రతిపాద్యుడా!;తిరువిణ్ణకర్ మేయవనే = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!;నిన్ అడైన్దేన్=నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను.

    బాగుగ వికసించిన తామరపుష్ప నివాసిని శ్రీ దేవికిని,భూదేవికిని,శ్లాఘ్యమైన నిత్యశూరులకును ఆశపడతగిన వాడవును,ఎటువంటి ఆటంకములులేని రాజ్యాధిపత్యమును  చేయుచున్న (దుర్యోదనాదుల) రాజుల చెంతకు వెడలి ధౌత్యము చేసిన స్వామీ!,మధురమైన వాక్కులుగలవాడా!, జ్యోతివలె ప్రకాశించుచు నాయొక్క హృదయమందు నిత్యవాసము చేయుచున్న వేద ప్రతిపాద్యుడా!, తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,నీయొక్క దివ్యమైన  చరణారవిందములందు చేరియున్నాను.

** తేనార్ పూమ్బుఱవిల్, తిరువిణ్ణకర్ మేయవనై,

వాన్ ఆరుమ్ మదిళ్ శూழ், వయల్ మంగైయర్ కోన్ మరువార్,

ఊనార్ వేల్ కలియన్, ఒలి శెయ్ తమిழ் మాలై వల్లార్, 

కోనాయ్ వానవర్ తమ్, కొడిమానకర్ కూడువరే  ll 1467

తేన్ ఆర్ పూమ్ పుఱవిల్=తేనెలతోనిండిన పూల తోటలుగల;తిరువిణ్ణకర్ మేయవనై = తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై; వాన్ ఆరుమ్ మదిళ్ వయల్  శూழ் = ఆకాశమును స్పర్శించుచుండు ప్రాకారములతోను; పొలములతోను చుట్టబడిన; మంగైయర్ కోన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువు; మరువార్ = శత్రువుల; ఊనార్ వేల్ = శరీరములయందు చొచ్చుకొను  శూలాయుధముగల; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలి శెయ్ తమిழ் మాలై = అనుగ్రహించిన తమిళ భాషలోనున్న ఈ పాశురముల మాలను; వల్లార్ = అనుసంధించువారు; కోన్ ఆయ్ = శ్రీ వైకుంఠమునకు నిర్వాహకులై; వానవర్ తమ్ =  నిత్యశూరులయొక్క, కొడి = ధ్వజములచే అలంకరింపబడిన;మా = గొప్ప; నకర్ = శ్రీ వైకుంఠమును; కూడువరే = పొందుదురు.

              తేనెలతోనిండిన పూల తోటలుగల తిరు విణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై ఆకాశమును స్పర్శించుచుండు ప్రాకారములతోను పొలములతోను చుట్టబడిన తిరుమంగై దేశవాసులకు ప్రభువు, శత్రువుల శరీరములయందు చొచ్చుకొను శూలాయుధముగల, తిరుమంగై ఆళ్వార్, అనుగ్రహించిన తమిళ భాషలోనున్న ఈ పాశురముల మాలను అనుసంధించువారు శ్రీ వైకుంఠమునకు నిర్వాహకులై నిత్యశూరులయొక్క ధ్వజములచే అలంకరింపబడిన వైకుంఠమును పొందుదురు.

*************

వ్యాఖ్యానించండి