శ్రీః
3. తుఱప్పేనల్లేన్
తిరువిణ్ణకర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుడు తనను ఉపేక్షించుచుండుటను భరించలేని తిరుమంగై ఆళ్వార్ అధికమైన వ్యధతో మొరపెట్టుచున్నారు.
** తుఱప్పేనల్లేన్, ఇన్బమ్ తుఱవాదు, నిన్నురువమ్;
మఱప్పేనల్లేన్, ఎన్ఱుమ్ మఱవాదు, యానులగిల్
పిఱప్పే నాగవెణ్ణేన్, పిఱవామై పెర్ట్రదు, నిన్
తిఱత్తేనాదన్మైయాల్, తిరువణ్ణగరానే ll 1468
తిరువణ్ణగరానే = తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; ఇన్బమ్=నీయొక్క కైంకర్యానందమును;తుఱప్పేన్ అల్లేన్=వదులుకొనలేను; తుఱవాదు = ఆ ఆనందమును వదలలేక; ఎన్ఱుమ్ = ఎల్లప్పుడును;నిన్నురువమ్ మఱప్పేన్ అల్లేన్=నీ స్వరూప సౌందర్యము మరువక నున్నాను; మఱవాదు = ఆ స్వరూప సౌందర్యము మరువక; యాన్ = నేను; ఉలగిల్ = ఈ సంసారమున;పిఱప్పేన్ ఆగ ఎణ్ణేన్ = ఇకమీద జన్మములేని తలంపుతోనున్నాను;పిఱవామై పెర్ట్రదు=ఇక జన్మరాహిత్యము పొందుట; నిన్ తిఱత్తేన్ ఆదన్మైయాల్=నీయొక్క చరణములందు కైంకర్యభాగ్యమువలనేయగును.
తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! నీయొక్క కైంకర్యానందమును ఎన్నడును వదులుకొనలేను.ఆ ఆనందమును వదలలేక శ్రీ వారి స్వరూప సౌందర్యము ఎల్లప్పుడు స్మరించుచు మరువక నున్నాను. ఆ స్వరూప సౌందర్యము మరువలేక నేను ఈ సంసారమున జన్మము లేని తలంపుతోనున్నాను.ఇక జన్మరాహిత్యము పొందుట నీయొక్క చరణములందు కైంకర్యభాగ్యమువలనేయగును. (శ్రీ వారు ఈ దాసునికి ఆ భాగ్యమును కృపజేయవలెను.)
తుఱన్దేన్ ఆర్వశెర్ట్ర, చుర్ట్రమ్ తుఱన్దమైయాల్,
శిఱన్దేన్ నిన్నడిక్కే, అడిమై తిరుమాలే,
అఱన్దానాయ్ త్తిరివాయ్, ఉన్నైయెన్ మనత్తగత్తే,
తిఱమ్బామల్ కొణ్డేన్, తిరువణ్ణగరానే ll 1469
తిరువణ్ణగరానే = తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; తిరు మాలే = ఆశ్రితుల విషయమున అమిత వ్యామోహముగల స్వామీ!; అఱమ్ తానాయ్ తిరివాయ్=సాక్షాత్ ధర్మమే స్వరూపముగకలిగి సంచరించు స్వామీ!;శుర్ట్రమ్= (సంసారమున బంధువులతో గల)సంబంధములు; ఆర్వమ్=(అనుకూలరతో నుండెడి) ప్రేమానురాగములు;శెర్ట్రమ్ =( ప్రతికూలరతో నుండెడి) శత్రుత్వము; తుఱన్దేన్= విసర్జించితిని; తుఱన్దమైయాల్ = ఆ స్వభావములను వదలియుండుటచే;నిన్ అడిక్కే=శ్రీ వారి దివ్యచరణములందే; అడిమై శిఱన్దేన్ = కైంకర్యసేవను పొందుటకు తగుమనస్సు కలవాడనైతిని; ఉన్నై ఎన్ మనత్తు అగత్తే=శ్రీ వారిని నాయొక్క హృదయాంతరాళమున; తిఱమ్బామల్ కొణ్డేన్ = విడువనీయక స్థిరముగ వసింపజేసుకొంటిని.
తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,ఆశ్రితుల విషయమున అమిత వ్యామోహముగల స్వామీ!; సాక్షాత్ ధర్మమే స్వరూపముగ కలిగి సంచరించు స్వామీ!, సంసారమున బంధువులతో గల సంబంధములు, అనుకూలరతో నుండెడి ప్రేమానురాగములు, ప్రతికూలరతో నుండెడి శత్రుత్వము విసర్జించితిని. ఆ స్వభావములను వదలియుండుటచే శ్రీ వారి దివ్యమైన చరణములందే కైంకర్యసేవను పొందుటకు తగుమనస్సు గలవాడనైతిని. శ్రీ వారిని నాయొక్క హృదయాంతరాళమున విడువనీయక స్థిరముగ వసింపజేసుకొంటిని.
మానేయ్ నోక్కునల్లార్, మదిపోల్ ముగత్తు ఉలవుమ్,
ఊనేయ్ కణ్ వాళిక్కు, ఉడైన్దు ఓట్టన్దు ఉన్నడైన్దేన్,
కోనే కుఱుఙ్గుడియుళ్ కుழగా, తిఱునఱైయూర్
తేనే, వరుపునల్ శూழ், తిరువణ్ణగరానే ll 1470
కోనే=స్వామీ!;కుఱుఙ్గుడియుళ్ కుழగా=తిరు కుఱుఙ్గుడి దివ్యదేశమున సామాన్యులతో కలసిమెలుగు స్వభావముతోనున్నవాడా!; తిఱునఱైయూర్ తేనే=తిరు నఱైయూర్ దివ్య దేశమున తేనెవలె పరమభోగ్యునిగ యున్నవాడా!;వరు పునల్ శూழ்= ప్రవహించెడి తీర్థనదులతో చుట్టుకొనియున్న; తిరువణ్ణగరానే = తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; మాన్ ఏయ్ నోక్కునల్లార్ = లేడిచూపులవంటి చూపులుగల యువతుల; మదిపోల్ ముగత్తు ఉలవుమ్=చంద్రుని పోలిన ముఖమందు కదిలెడి; ఊన్ ఏయ్ కణ్ వాళిక్కు = మాంసభరితమైన కన్నుల బాణములకు; ఉడైన్దు = భయముతో వణకుచు; ఓట్టన్దు = పరుగెత్తికొని వచ్చి; ఉన్ అడైన్దేన్=నీయొక్క దివ్యమైన చరణారవిందములందు చేరియున్నాను.
స్వామీ! తిరు కుఱుఙ్గుడి దివ్యదేశమున సామాన్యులతో కలసిమెలుగు స్వభావముతో నున్నవాడా!,తిరు నఱైయూర్ దివ్య దేశమున తేనెవలె పరమభోగ్యునిగ యున్నవాడా!,ప్రవహించెడి తీర్థనదులతో చుట్టుకొనియున్న తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, లేడిచూపులవంటి చూపులుగల యువతుల చంద్రుని పోలిన ముఖమందు కదిలెడి మాంసభరితమైన కన్నుల అంబులకు భయముతో వణకుచు, పరుగెత్తికొని వచ్చి నీయొక్క దివ్యమైన చరణారవిందములందు చేరియున్నాను.
శాన్దేన్దు మెన్ములైయార్, తడన్తోళ్ పుణరిన్బ వెళ్ళత్తు
ఆழ் న్దేన్, అరునరకత్తు అழுన్దుమ్, పయన్ పడైత్తేన్,
పోన్దేన్ పుణ్ణియనే, ఉన్నై యెయ్ ది ఎన్ తీ వినైగళ్
తీర్ న్దేన్, నిన్నడైన్దేన్, తిరువణ్ణగరానే ll 1471
తిరువణ్ణగరానే = తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; శాన్దు ఏన్దు మెల్ ములైయార్ = చందనముతో అలంకరించుకొనిన మృదువైన వక్షోజములుగల యువతుల; తడ తోళ్=విశాలమైన భుజముల;పుణర్ ఇన్బ వెళ్ళత్తు= కౌగిలిలోని ఆనందసాగరములో;ఆழ் న్దేన్= మునిగిపోయుంటిని;(ఆ కారణముగ) అరు నరకత్తు అழுన్దుమ్ పయన్ పడైత్తేన్ = క్రూరమైన సంసార నరకములో పడి దుఃఖముతోనుండు ఫలమును పొందితిని;పుణ్ణియనే=పరమపవిత్రుడైన స్వామీ!; పోన్దేన్ నిన్ అడైన్దేన్=వచ్చి నీయొక్క దివ్యమైన చరణారవిందములందు చేరియున్నాను; ఉన్నై ఎయ్ ది = శ్రీ వారి కృప పొంది; ఎన్ తీ వినై గళ్ తీర్ న్దేన్ = నాయొక్క పాపములను పోగొట్టుకొంటిని.
తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; చందనముతో అలంకరించుకొనిన మృదువైన వక్షోజములుగల యువతుల విశాలమైన భుజముల కౌగిలిలోని ఆనందసాగరములో మునిగిపోయుంటిని.(ఆ కారణముగ) క్రూరమైన సంసార నరకములో పడిదుఃఖముతోనుండు ఫలమును పొందితిని. పరమపవిత్రుడైన స్వామీ!,వచ్చి నీయొక్క దివ్యమైన చరణారవిందములందు చేరియున్నాను.శ్రీ వారి కృప పొంది నాయొక్క పాపములను పోగొట్టుకొంటిని.
మర్టోర్ తెయ్ వమెణ్ణేన్, ఉన్నై యెన్ మనత్తువైత్తు
పెర్ట్రేన్, పెర్ట్రదువుమ్, పిఱవామై యెమ్బెరుమాన్,
వర్ట్రా నీళ్ కడల్ శూழ், ఇలఙ్గై యిరావణనై
చ్చెర్ట్రాయ్, కొర్ట్రవనే, తిరువణ్ణగరానే ll 1472
వర్ట్రా నీళ్ కడల్ శూழ் = ఒకప్పుడును ఎండిపోని పెద్ద సముద్రముచే చుట్టుకొనియున్న ,ఇలఙ్గై = లంకాపురియందు; యిరావణనై = రావణాసురుని;శె ర్ట్రాయ్=వధించినవాడా!; కొర్ట్రవనే = దేవాదిదేవుడా!; తిరువణ్ణగరానే= తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; మర్టు ఓర్ తెయ్ వమ్ ఎణ్ణేన్ = మరియొక దైవమును నా హృదయమందు తలచలేను; ఎమ్బెరుమాన్ = నాయొక్క స్వామీ!;ఉన్నై ఎన్ మనత్తు వైత్తు పెర్ట్రేన్= శ్రీ వారిని నాయొక్క హృదయాంతరాళమున నిలుపుకొను భాగ్యము పొందితిని; పెర్ట్రదువుమ్ పిఱవామై = ఆ విధముగ నేను పొందినది ఇకపై పుట్టుకలేకుండుటకే సుమా! (నిత్యకైంకర్యము బడయుటకే స్వామీ!)
ఒకప్పుడును ఎండిపోని పెద్ద సముద్రముచే చుట్టుకొనియున్న లంకాపురియందు రావణాసురుని వధించినవాడా, దేవాదిదేవుడా!,తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,మరియొక దైవమును నా హృదయమందు తలచలేను,నాయొక్క స్వామీ!,శ్రీ వారిని నాయొక్క హృదయాంతరాళమున నిలుపుకొను భాగ్యము పొందితిని . ఆవిధముగ నేను పొందినది ఇకపై పుట్టుక లేకుండుటకే సుమా! (నిత్యకైంకర్యము బడయుటకే స్వామీ!)
మై ఒణ్ కరుఙ్గడలుమ్, నిలనుమ్ అణివరైయుమ్,
శెయ్య శుడరిరణ్డుమ్, ఇవైయాయనిన్నై, నెఞ్జిల్
ఉయ్యుమ్ వగై యుణర్ న్దేన్, ఉణ్మైయాలిని, యాదుమ్ మర్ట్రోర్
తెయ్ వమ్ పిఱితఱియేన్, తిరువణ్ణగరానే ll 1473
తిరువణ్ణగరానే = తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!;మై ఒణ్ కరుమ్ కడలుమ్ = కాటుకవంటి అందమైన నల్లని సముద్రము; నిలనుమ్ = భూమియు; అణి వరైయుమ్ = శ్లాఘ్యమైన పర్వతములును;శెయ్య శుడర్ ఇరణ్డుమ్= అందమైన సూర్యచంద్రులును;ఇవై ఆయ నిన్నై = ఇవన్నిటియందు వ్యాపించియున్న నిన్ను; నెఞ్జిల్=నా హృదయమందు; ఉయ్యమ్ వగై = నేను ఉజ్జీవింపబడు విధముగ; ఉణ్మైయాల్ ఉణర్ న్దేన్ = సత్యముగ (నిశ్చయముగ) తెలుసుకొంటిని; ఇని = ఈ విధముగ జరిగిన పిదప; మర్ట్రు = ఇకమీదట; పిఱిదు ఓర్ తెయ్ వమ్ యాదుమ్ అఱియేన్ = ఏ విధమైన దేవతాంతరములను తలచలేను.
తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!, కాటుకవంటి అందమైన నల్లని సముద్రము,భూమియు,శ్లాఘ్యమైన పర్వతములును,ఇవన్నిటియందు వ్యాపించియున్న నిన్ను,నా హృదయమందు,నేను ఉజ్జీవింపబడు విధముగ ,సత్యముగ (నిశ్చయముగ) తెలుసుకొంటిని. ఈవిధముగ జరిగిన పిదప,ఇకమీదట ఏ విధమైన దేవతాంతరములను తలచలేను.
వేఱే కూఱువదుణ్డు, అడియేన్ విరిత్తు ఉరైక్కుమ్
ఆఱే, నీ పణియాదు అడై, నిన్ తిరుమనత్తు,
కూఱేన్ నెఞ్జుదన్నాల్, కుణఙ్గొణ్డు, మర్ట్రోర్ తెయ్ వమ్
తేఱేన్ ఉన్నైయల్లాల్, తిరువణ్ణగరానే ll 1474
తిరువణ్ణగరానే = తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; అడియేన్ = ఈ దాసుడు; వేఱే కూఱువదు ఉణ్డు = విలక్షణమైన విన్నపము చేయు విషయము ఒకటి కలదు; విరిత్తు ఉరైక్కుమ్ ఆఱే నీ పణియాదు = నేను వివరించి చెప్పు విధముగ శ్రీ వారు నియమింపక; నిన్ తిరు మనత్తు = మీయొక్క దివ్యమైన హృదయమందు; అడై = సారాంశమును చేకొని కృపజేయవలెను;ఉన్నై అల్లాల్ = శ్రీ వారిని గాక; మర్ట్రు ఓర్ తెయ్ వమ్ = వేరొక దైవమును; కూఱేన్ = నోరు విప్పి చెప్పను; కుణమ్ కొణ్డు= వేరొక దైవముయొక్క గుణవిశేషమును గ్రహించి;నెఞ్జు తన్నాల్=నా హృదయముతో; తేఱేన్ =(ఆ దైవము ఆశ్రయణీయముగ) విశ్వసించను.( సర్వేశ్వరుని చరణారవిందములందు లీనమైన తమ మనోభావమును చెప్పుచున్నారు)
తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!,ఈ దాసుడు విలక్షణమైన విన్నపము చేయు విషయము ఒకటి కలదు. నేను వివరించి చెప్పువిధముగ శ్రీ వారు నియమింపక, మీయొక్క దివ్యమైన హృదయమందు సారాంశమును చేకొని కృపజేయవలెను.శ్రీవారిని గాక వేరొక దైవమును నేను నోరు విప్పి చెప్పను. వేరొక దైవము యొక్క గుణవిశేషమును గ్రహించి,నా హృదయముతో ఆ దైవము ఆశ్రయణీయముగ విశ్వసించను.( సర్వేశ్వరుని చరణారవిందములందు లీనమైన తమ మనోభావమును చెప్పుచున్నారు)
ముళిన్దీన్ద వెఙ్గడత్తు, మూరి ప్పెరుమ్ కళిర్ట్రాల్,
విళిన్దీన్ద మామరమ్బోల్, వీழ் న్దారై నినైయాదే,
అళిన్దు ఓర్ న్ద శిన్దై, నిన్బాల్ అడియేఱ్కు, వానులగమ్
తెళిన్దే యెన్ఱెయ్ దువదు, తిరువణ్ణగరానే ll 1475
తిరువణ్ణగరానే = తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; ముళిన్దు తీన్ద= ఎండిపోయి మోడయిన; వెమ్ కడత్తు=కఠోరమైన ఎడారిలో;మూరి పెరుమ్ కళిర్ట్రాల్ = బలమైన పెద్ద ఏనుగుచే;విళిన్దు తీన్ద=త్రోయబడి చెడిపోయిన; మామరమ్ పోల్ వీழ் న్దారై = పెద్ద వృక్షమువలె (అనేక బలశాలులు సంసారమను ఎడారిలో దహించబడి, కర్మలనే ఏనుగుచే నలిగి ) నశించి పోయినవారిని;(చూచి ఈ సంసారమును ఆనందదాయకమని); నినైయాదే = తలచక; నిన్ పాల్ = నీ విషయమున; అళిన్దు ఓర్ న్ద శిన్దై అడియేఱ్కు = భక్తితో పరిపక్వమై, శుద్ధమైన హృదయముగల ఈ దాసునికి; తెళిన్దు =ఈ సంసార బాధలు తొలగి; వాన్ ఉలగమ్ ఎయ్ దువదు ఎన్ఱు = పరమపదము పొందు దినములెప్పుడో? (అని వాపోవుచున్నారు.)
తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా!; ఎండిపోయి మోడయిన, కఠోరమైన ఎడారిలో బలమైన పెద్ద ఏనుగుచే త్రోయబడి చెడిపోయిన పెద్ద వృక్షమువలె అనేక బలశాలులు సంసారమను ఎడారిలో దహించబడి, కర్మలనే ఏనుగుచే నలిగి నశించి పోయినవారిని చూచి ఈ సంసారము ఆనంద దాయకమని తలచక నీవిషయమున భక్తితో పరిపక్వమై, శుద్ధమైన హృదయముగల ఈ దాసునికి,ఈ సంసార బాధలు తొలగి,పరమపదము పొందు దినములెప్పుడో?( అని వాపోవుచున్నారు.)
శొల్లాయ్ తిరుమార్బా, ఉనక్కాగి త్తొణ్డుపట్ట
వల్లేనై, వినైగళ్ నలియామై, నమ్బు నమ్బీ,
మల్లా కుడమాడీ, మదుశూదనే, ఉలగిల్
శెల్లా నల్లిశైయాయ్, తిరువణ్ణగరానే ll 1476
తిరువణ్ణగరానే = తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! మల్లా= శక్తివంతమైనవాడా!; కుడమ్ ఆడీ=కుంభనృత్యము చేసినవాడా!;మదుశూదనే= మధువను అసురిని వధించినవాడా!;ఉలగిల్ శెల్లా=లోకమందు కనని (అపూర్వమైన); నల్ ఇశైయాయ్ = మంచి కీర్తికలవాడా!; నమ్బీ=పరిపూర్ణుడా!;తిరుమార్బా = శ్రీ దేవిని వక్షస్థలమున కలవాడా!; శొల్లాయ్ = చెప్పుమా; ఉనక్కు ఆగి = శ్రీ వారి విషయమున; తొణ్డు పట్ట = కైంకర్యసేవను ఆశించుచున్న; వల్లేనై = దృఢమైన నిశ్చయముగల నన్ను; వినైగళ్ నలియామై = పాపములచే వ్యధకలుగనీయక; నమ్బు = దయసారించుమా!
తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరా! శక్తివంతమైనవాడా !, కుంభనృత్యము చేసినవాడా!,మధువను అసురిని వధించినవాడా!,లోకమందు కనని (అపూర్వమైన) మంచి కీర్తికలవాడా!,పరిపూర్ణుడా!,శ్రీ దేవిని వక్షస్థలమున కలవాడా!, చెప్పుమా! శ్రీ వారి విషయమున కైంకర్యసేవను ఆశించుచున్న దృఢమైన నిశ్చయముగల నన్ను పాపములచే వ్యధకలుగనీయక దయసారించుమా!
** తారార్ మలర్ కమల, త్తడమ్ శూழ் న్ద తణ్ పుఱవిల్,
శీరార్ నెడుమఱుకిల్, తిరువణ్ణగరానై
కారార్ పుయల్ తడక్కై, క్కలియనొలిమాలై,
ఆరార్ ఇవైవల్లార్, అవర్కల్లల్ నిల్లావే ll 1477
తార్ ఆర్ మలర్ = దళములతో నిండిన పుష్పములుగల; కమల తడమ్ శూழ் న్ద = తామర తటాకములతో చుట్టబడియున్న; తణ్ పుఱవిల్ = చల్లని తోటలుగల; శీరార్ నెడు మఱుకిల్ = సంపదలతో నిండిన పెద్ద వీధులుగల; తిరువణ్ణగరానై = తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై; కారార్ పుయల్ తడ క్కై=కాలమేఘము వలె ఔదార్యము కలిగిన పెద్ద హస్తములుగల; కలియన్ =తిరుమంగై ఆళ్వార్; ఒలిమాలై=అనుగ్రహించిన సూక్తులమాలైన;ఇవై = ఈ పది పాసురములు; ఆర్ ఆర్ వల్లార్ = ఎవరెవరు అనుసంధించెదరో; అవర్కు అల్లల్ నిల్లావే = అట్టి వారి యందు పాపములు నిలువలేక పారిపోవును.
దళములతో నిండిన పుష్పములుగల తామర తటాకములతో చుట్టబడియున్న,చల్లని తోటలుగల,సంపదలతో నిండిన పెద్ద వీధులుగల తిరువణ్ణగర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని విషయమై కాలమేఘము వలె ఔదార్యము కలిగిన పెద్ద హస్తములుగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తులమాలైన ఈ పది పాసురములు ఎవరెవరు అనుసంధించెదరో అట్టి వారి యందు పాపములు నిలువలేక పారిపోవును.
**********