శ్రీః
4. కణ్ణుమ్ శుழுన్దు
తిరునఱైయూర్ దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బి పెరుమాళ్ ను,తిరుమంగై ఆళ్వార్, తమకు పంచసంస్కాములు చేసి ఉజ్జీవింపజేసిన ఆచార్యులను సేవించుకొందుమని తమ మనస్సునకు ప్రభోదించుచున్నారు.
** కణ్ణుమ్ శుழన్ఱు పీళైయోడు, ఈళై వన్దు ఏఙ్గినాల్,
పణ్ణిన్ మొழிయార్, పైయ నడమిన్ ఎన్నాదమున్,
విణ్ణుమ్ మలైయుమ్, వేదముమ్ వేళ్వియుమ్ ఆయినాన్,
నణ్ణు నఱైయూర్, నామ్ తొழுదుమ్ ఎழுనెఞ్జమే ll 1478
పీళైయోడు = కంటి పుసులతోను; కణ్ణుమ్ శుழన్ఱు=కళ్ళు తిరుగుటతోను;ఈళై వన్దు= కఫము కంఠమున వచ్చి; ఏఙ్గినాల్=దుఃఖముపొందినయెడల;( ఆ సమయమందు) పణ్ ఇన్ మొழிయార్= రాగభరితమైన పాటవలె ఇంపైన పలుకులుగల యువతులు; పైయ నడమిన్ ఎన్నాదమున్ = ” ఇచటనుండి మెల్లగ నడచుకొని పొండి ” అని చెప్పక మునుపే;విణ్ణుమ్ మలైయుమ్=ఆకాశము,పర్వతములును;వేదముమ్ వేళ్వియుమ్= వేదములు, యఙ్ఞములును;ఆయినాన్=తానే అయిన సర్వేశ్వరుడు; నణ్ణుమ్= ఆశించి వేంచేసియున్న దివ్యదేశము; నఱైయూర్ = తిరు నఱైయూర్ ను; నెఞ్జమే = ఓ! నా మనసా!; నామ్ తొழுదుమ్ ఎழு = మనము సేవించుకొందుము లేచి రమ్ము.
కంటి పుసులతోను,కళ్ళు తిరుగుటతోను; కఫము కంఠమున వచ్చి దుఃఖము పొందినయెడల, (ఆ సమయమందు) రాగభరితమైన పాటవలె ఇంపైన పలుకులుగల యువతులు , ” ఇచటనుండి మెల్లగ నడచుకొని పొండి ” అని చెప్పకమునుపే, ఆకాశము, పర్వతములును,వేదములు,యఙ్ఞములును తానే అయిన సర్వేశ్వరుడు, ఆశించి వేంచేసియున్న దివ్యదేశము తిరు నఱైయూర్ ను, ఓ! నా మనసా! మనము సేవించుకొందుము లేచి రమ్ము.
కొఙ్గుణ్ కుழలార్, కూడియిరున్దు శిరిత్తు, నీర్
ఇఙ్గెన్ ఇరుమి; యెమ్ పాల్ వన్దదెన్ఱు ఇగழாదమున్,
తిఙ్గళ్ ఎరికాల్, శెఞ్జుడరాయవన్ తేశుడై,
నఙ్గళ్ నఱైయూర్, నామ్ తొழுదుమ్ ఎழுనెఞ్జమే ll 1479
కొఙ్గు ఉణ్ కుழలార్ = భ్రమరములు ఆస్వాదించు పరిమళ భరితమైన పుష్పములతో అలంకరించు కొనిన కుంతలములుగల యువతులు; కూడియిరున్దు = కలసియుండి; శిరిత్తు = పరిహాసము చేసి; నీర్ = మీరు; ఇరుమి = దగ్గుచు; ఇఙ్గు = ఈ స్థలమున; ఎమ్ పాల్ వన్దదు= మా వద్దకు వచ్చినది; ఎన్ = ఎందులకు?; ఎన్ఱు ఇగழாద మున్ = అని తిరస్కారముచేయక ముందే;తిఙ్గళ్ = చంద్రుడు;ఎరి = అగ్ని; కాల్ =వాయువు;శెమ్ శుడర్ = సూర్యుడు; ఆయవన్= ఇవన్నియు తానేఅయిన సర్వేశ్వరుడు వేంచేసి యున్నదియు; తేశు ఉడై =తేజస్సుకలిగినదియు;నఙ్గళ్= మనయొక్క; నఱైయూర్=తిరు నఱైయూర్ ను; నెఞ్జమే = ఓ! నా మనసా!; నామ్ తొழுదుమ్ ఎழு = మనము సేవించుకొందుము లేచి రమ్ము.
భ్రమరములు ఆస్వాదించు పరిమళ భరితమైన పుష్పములతో అలంకరించుకొనిన కుంతలములుగల యువతులు కలసియుండి పరిహాసము చేసి ” మీరు దగ్గుచు ఈ స్థలమున మా వద్దకు వచ్చినది ఎందులకు? ” అని తిరస్కారముచేయక ముందే, చంద్రుడు, అగ్ని,వాయువు, సూర్యుడు,ఇవన్నియు తానేఅయిన సర్వేశ్వరుడు వేంచేసి యున్నదియు,తేజస్సుకలిగినదియు, మనయొక్క తిరు నఱైయూర్ దివ్యదేశమును, ఓ! నా మనసా! మనము సేవించుకొందుము లేచి రమ్ము.
కొఙ్గార్ కుழలార్, కూడియిరున్దు శిరిత్తు, ఎమ్మై
ఎమ్ కోలమైయా, ఎన్ ఇని క్కాణ్బదెన్నాదమున్,
శెఙ్గోల్ వలవన్, తాన్ పణిన్దేత్తి త్తిగழுమూర్,
నఙ్గోన్ నఱైయూర్, నామ్ తొழுదుమ్ ఎழுనెఞ్జమే ll 1480
కొఙ్గు ఆర్ కుழలార్ = తేనెలతో నిండిన పుష్పములతో అలంకరించుకొనిన కుంతలములుగల యువతులు; కూడియిరున్దు = కలసియుండి; శిరిత్తు = పరిహాసము చేసి; ఐయా=అయ్యా!;ఇని=ఈ విధముగ మీరు వృద్ధులైయుండియు;ఎమ్మై=మమ్మును;ఎమ్ కోలమ్=మాయొక్క అలంకారమును;ఎన్ కాణ్బదు=ఎందులకు చూచుచున్నారు?; ఎన్నాదమున్ = అని తిరస్కారముచేయక ముందే; శెఙ్గోల్ వలవన్ తాన్ = రాజ్యాధిపత్యమును చేయుచున్న శోழరాజన్; పణిన్దు =ఆశ్రయించి; ఏత్తి = స్తుతించు; తిగழுమ్ ఊర్ = ప్రకాశించు దివ్యదేశమైన; నమ్ కోన్ = మన ప్రభువు తిరునఱైయూర్ నమ్బి వేంచేసియున్న; నఱైయూర్ = తిరు నఱైయూర్ ను; నెఞ్జమే= ఓ! నా మనసా!; నామ్ తొழுదుమ్ ఎழு= మనము సేవించుకొందుము లేచి రమ్ము.
తేనెలతో నిండిన పుష్పములతో అలంకరించుకొనిన కుంతలములుగల యువతులు కలసియుండి పరిహాసము చేసి,” అయ్యా! ఈ విధముగ మీరు వృద్ధులై యుండియు మమ్మును, మాయొక్క అలంకారమును ఎందులకు చూచుచున్నారు? ” అని తిరస్కారముచేయక ముందే రాజ్యాధిపత్యమును చేయుచున్న శోழరాజన్ ఆశ్రయించి, స్తుతించు, ప్రకాశించు దివ్యదేశమైన మన ప్రభువు తిరునఱైయూర్ నమ్బి వేంచేసియున్న తిరు నఱైయూర్ ను, ఓ ! నా మనసా! మనము సేవించుకొందుము లేచి రమ్ము.
కొమ్బుమ్ అరవముమ్, వల్లియుమ్ వెన్ఱ నుణ్ ఏర్ ఇడై,
వమ్బుణ్ కుழలార్, వాశల్ అడైత్తు ఇగழாదమున్,
శెమ్బొన్ కముగినమ్ తాన్, కనియుమ్ శెழுమ్ శోలై శూழ்,
నమ్బన్ నఱైయూర్, నామ్ తొழுదుమ్ ఎழுనెఞ్జమే ll 1481
కొమ్బుమ్ = సన్నని చెట్టు కొమ్మయు; అరవముమ్ = సర్పమును; వల్లియుమ్ = లేత తీగయు;వెన్ఱ = జయించిన; నుణ్ ఏర్ ఇడై = సూక్ష్మమైన,అందమైన,నడుముగల; వమ్బు ఉణ్ కుழలార్ = పరిమళభరితమైన కుంతలములు గల యువతులు; వాశల్ అడైత్తు = బైట తలుపులు మూసి; ఇగழாదమున్ = అవమానము చేయకమునుపే; కముగు ఇనమ్ = పోకచెట్లయొక్క సమూహములు; శెమ్ పొన్ = శ్లాఘ్యమైన బంగారమువలె; కనియుమ్ = ఫలములతొయున్న; శెழுమ్ శోలై శూழ் = దట్టమైన తోటలతో చుట్టబడియున్న; నమ్బన్ = విశ్వసనీయుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న; నఱైయూర్ = తిరు నఱైయూర్ ను; నెఞ్జమే= ఓ! నా మనసా!; నామ్ తొழுదుమ్ ఎழு= మనము సేవించుకొందుము లేచి రమ్ము.
సన్నని చెట్టు కొమ్మయు,సర్పమును,లేత తీగయు జయించిన సూక్ష్మమైన, అందమైన, నడుముగల పరిమళభరితమైన కుంతలములు గల యువతులు (వృద్ధులైన మనలను జూచి) బైట తలుపులు మూసి అవమానము చేయకమునుపే, పోకచెట్లయొక్క సమూహములు శ్లాఘ్యమైన బంగారమువలె, ఫలములతొయున్న దట్టమైన తోటలతో చుట్టబడియున్న, విశ్వసనీయుడైన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న తిరు నఱైయూర్ ను, ఓ ! నా మనసా! మనము సేవించుకొందుము లేచి రమ్ము.
విలఙ్గుమ్ కయలుమ్, వేలుమ్ ఒణ్ కావియుమ్ వెన్ఱకణ్,
శలఙ్గొణ్డ శొల్లార్ తాఙ్గళ్, శిరిత్తు ఇగழாదమున్,
మలఙ్గుమ్ వరాలుమ్, వాళైయుమ్ పాయ్ వయల్ శూழ் తరు,
నలఙ్గొళ్ నఱైయూర్, నామ్ తొழுదుమ్ ఎழுనెఞ్జమే ll 1482
విలఙ్గుమ్=లేడిని;కయలుమ్=మీనములను;వేలుమ్=శూలమును;ఒణ్ = అందమైన; కావియుమ్ = ఎర్రకలువలను; వెన్ఱ = జయించిన; కణ్ = నేత్రములుగల; శలమ్ కొణ్డ శొల్లార్ తాఙ్గళ్=కపటమైన మాటలుగల యువతులు తాము; శిరిత్తు=పరిహాసము చేసి; ఇగழாదమున్=తిరస్కారముచేయక ముందే;మలఙ్గుమ్ వరాలుమ్ వాళైయుమ్ = మలంగు,వరాల్, వాళై యను పలు రకములైన మీనములు; పాయ్ = త్రుళ్ళిత్రుళ్ళి ఆడుచుండు; వయల్ = పొలములతో; శూழ் తరు = చుట్టుకొనియున్నదియు; నలమ్ కొళ్ = క్షేమకరమైనదియు; నఱైయూర్ = తిరు నఱైయూర్ ను; నెఞ్జమే= ఓ! నా మనసా!; నామ్ తొழுదుమ్ ఎழு= మనము సేవించుకొందుము లేచి రమ్ము.
లేడిని,మీనములను,శూలమును,అందమైన ఎర్రకలువలను జయించిన నేత్రములుగల కపటమైన మాటలుగల యువతులు తాము,(మనలను) పరిహాసము చేసి, తిరస్కారము చేయకముందే, మలంగు,వరాల్, వాళై యను పలు రకములైన మీనములు త్రుళ్ళిత్రుళ్ళిఆడుచుండు పొలములతో చుట్టుకొనియున్నదియు, క్షేమకరమైనదియు, తిరునఱైయూర్ ను, ఓ ! నా మనసా! మనము సేవించుకొందుము లేచి రమ్ము.
మిన్నేర్ ఇడైయార్, వేట్కయై మార్ట్రియిరున్దు,
ఎన్నీర్ ఇరుమి, ఎమ్బాల్ వన్దదెన్ఱు ఇగழாదమున్,
తొన్నీర్ ఇలఙ్గై మలఙ్గ, విలఙ్గు ఎరి ఊట్టినాన్,
నన్నీర్ నఱైయూర్, నామ్ తొழுదుమ్ ఎழுనెఞ్జమే ll 1483
మిన్ నేర్ ఇడైయార్ = మెరుపువలె సన్నని నడుముగల యువతులు;వేట్కయై = (మునుపు కలిగియున్న ) ప్రీతిని; మార్ట్రి ఇరున్దు = విడిచినవారై; నీర్=(ముసలితనము కలిగిన) మీరు; ఇరుమి = దగ్గుచు; ఎమ్ పాల్ వన్దదు ఎన్ ఎన్ఱు = మా వద్దకు వచ్చినది ఎందులకు అని; ఇగழாదమున్= తిరస్కారముచేయక ముందే; తొల్ నీర్ ఇలఙ్గై మలఙ్గ=సముద్రముచే చుట్టుకొనియున్న లంకాపురి కలత చెందునట్లు;విలఙ్గు = వానరవీరుడైన హనుమంతునిచే; ఎరి ఊట్టినాన్ = అగ్నికి ఆహుతి చేసిన సర్వేశ్వరుడు వేంచేసి యున్నదియు; నల్ నీర్ = మంచి తీర్థములతో ఒప్పుచున్నదియు; నఱైయూర్ = తిరు నఱైయూర్ ను; నెఞ్జమే= ఓ! నా మనసా!; నామ్ తొழுదుమ్ ఎழு= మనము సేవించుకొందుము లేచి రమ్ము.
మెరుపువలె సన్నని నడుముగల యువతులు (మునుపు కలిగియున్న ) ప్రీతిని విడిచినవారై,(ముసలితనము కలిగిన) ” మీరు దగ్గుచు మా వద్దకు వచ్చినది ఎందులకు? ” అని తిరస్కారముచేయక ముందే, సముద్రముచే చుట్టుకొనియున్న లంకాపురి కలత చెందునట్లు వానరవీరుడైన హనుమంతునిచే అగ్నికి ఆహుతి చేసిన సర్వేశ్వరుడు వేంచేసి యున్నదియు,మంచి తీర్థములతో ఒప్పుచున్నదియు, తిరునఱైయూర్ ను, ఓ ! నా మనసా! మనము సేవించుకొందుము లేచి రమ్ము.
విల్లేర్ నుదలార్, వేట్కైయైమార్ట్రి చ్చిరిత్తు, ఇవన్
పొల్లాన్ తిరైన్దానెన్నుమ్, పుఱనురై కేట్పదన్ మున్,
శొల్లార్ మఱైనాన్గోది, ఉలగిల్ నిలాయవర్,
నల్లార్ నఱైయూర్, నామ్ తొழுదుమ్ ఎழுనెఞ్జమే ll 1484
విల్ ఏర్ నుదలార్ = విల్లువలె అందమైన కనుబొమలు కలిగిన యువతులు;వేట్కైయై= (మునుపు కలిగియున్న ) ప్రీతిని; మార్ట్రి= విడిచినవారై; శిరిత్తు=పరిహాసము చేసి; ఇవన్ పొల్లాన్=ఇతడు దుర్మార్గుడు;తిరైన్దాన్ =శరీరము ముడతలుపడియున్నవాడు;ఎన్నుమ్= అని;పుఱన్ ఉరై=బైటచెప్పెడి కించపరచు మాటలను;కేట్పదన్ మున్=వినుటకు ముందే;శొల్ ఆర్ = దివ్యమైన సూక్తులచే నిండియున్న; మఱై నాన్గు ఓది = వేదములు నాలుగు స్తుతించి; ఉలగిల్ నిలాయవర్ = లోకమున ఆ వేదములను స్థిరపరచినవారైన; నల్లార్=సద్గుణములతో అలరారు బ్రాహ్మణోత్తములు నివసించు; నఱైయూర్ = తిరు నఱైయూర్ ను; నెఞ్జమే= ఓ! నా మనసా!; నామ్ తొழுదుమ్ ఎழு= మనము సేవించుకొందుము లేచి రమ్ము.
విల్లువలె అందమైన కనుబొమలు కలిగిన యువతులు (మునుపు కలిగియున్న) ప్రీతిని విడిచినవారై పరిహాసము చేసి ” ఇతడు దుర్మార్గుడు,శరీరము ముడతలు పడియున్నవాడు ” అని బైటచెప్పెడి కించపరచు మాటలను వినుటకు ముందే,దివ్యమైన సూక్తులచే నిండియున్న వేదములు నాలుగు స్తుతించి,లోకమున ఆ వేదములను స్థిరపరచినవారైన సద్గుణములతో అలరారు బ్రాహ్మణోత్తములు నివసించు తిరునఱైయూర్ ను, ఓ ! నా మనసా! మనము సేవించుకొందుము లేచి రమ్ము.
వాళ్ ఒణ్ కణ్ నల్లార్ తాఙ్గళ్, మదనెన్ఱార్ తమ్మై,
కేళుఙ్గళ్ ఈళైయోడు, ఏఙ్గుకిழవన్ ఎన్నాదమున్,
వేళ్వుమ్ విழవుమ్, వీతియిలెన్ఱుమ్ ఆఱాతవూర్,
నాళుమ్ నఱైయూర్, నామ్ తొழுదుమ్ ఎழுనెఞ్జమే ll 1485
వాళ్ ఒణ్ కణ్ = కత్తివలె వాడియైన నేత్రములుగల; నల్ ఆర్ = అందమైన యువతులు; తాఙ్గళ్= తమరు; మదన్ ఎన్ఱార్ తమ్మై=” ఇతడు మన్మధుడు ” అని(మునుపు) కొనియాడిన వారి విషయమై; ఈళై యోడు ఏఙ్గు కిழవన్ = ” కంఠమందు కఫముతోకూడి వ్యధచెందు ఈ వృద్ధుడు ;కేళుఙ్గళ్ = ఇచటకు ఏ పనికై వచ్చెనని అడగండి”; ఎన్నాదమున్ = అని దూషించి చెప్పుటకు ముందే; వీతియిల్ = మాడవీధులలో; వేళ్వుమ్ విழవుమ్ = యాగములు,ఉత్సవములు; ఎన్ఱుమ్ = ఎల్లప్పుడును; ఆఱాద వూర్=ఎడతెగక జరిగెడి దివ్యదేశము;నఱైయూర్ = తిరు నఱైయూర్ ను; నాళుమ్ = ప్రతిదినము;నెఞ్జమే= ఓ! నా మనసా!; నామ్ తొழுదుమ్ ఎழு= మనము సేవించుకొందుము లేచి రమ్ము.
కత్తివలె వాడియైన నేత్రములుగల అందమైన యువతులు,తమరు ” ఇతడు మన్మధుడు ” అని (మునుపు)కొనియాడిన వారివిషయమై, ” కంఠమందు కఫముతోకూడి వ్యధచెందు ఈ వృద్ధుడు ఇచటకు ఏ పనికై వచ్చెనని అడగండి” అని దూషించి చెప్పుటకు ముందే,మాడవీధులలో యాగములు, ఉత్సవములు ఎల్లప్పుడును ఎడతెగక జరుగెడి దివ్యదేశము తిరు నఱైయూర్ ను ప్రతిదినము ఓ ! నా మనసా! మనము సేవించుకొందుము లేచి రమ్ము.
కనిశేర్ న్దిలఙ్గు నల్ వాయవర్, కాదన్మైవిట్టిడ,
కునిశేర్ న్దు ఉడలుమ్, కోలిల్ తళర్ న్దు ఇళైయాదమున్,
పనిశేర్ విశుమ్బిల్, పాన్మది కోళ్ విడుత్తానిడమ్,
నని శేర్ నఱైయూర్, నామ్ తొழுదుమ్ ఎழுనెఞ్జమే ll 1486
కనిశేర్ న్దు = ఎర్రని దొండపండువలె ఒప్పు; ఇలఙ్గు = మెరయుచున్న; నల్ వాయవర్= అందమైన అదరములుగల యువతులు; కాదన్మైవిట్టిడ= (మొదటగల)ప్రీతిని విడువగ; కునిశేర్ న్దు ఉడలుమ్= గూనితో నున్న శరీరముకలిగి; కోలిల్ = చేతికర్రతో(నడచుచు); తళర్ న్దు=అలసి; ఇళైయాదమున్= శక్తిహీనుడగుటకు ముందే;విశుమ్బిల్ =ఆకాశమందు; పాల్ = పాలువలె; పని శేర్ = చల్లదనముతో కూడిన; మది = చంద్రునియొక్క; కోళ్ = దుఃఖమును; విడుత్తాన్ ఇడమ్ = పోగొట్టిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము;నని శేర్=గొప్పతనము కలిగియున్న; నఱైయూర్=తిరు నఱైయూర్ ను; నెఞ్జమే = ఓ! నా మనసా!; నామ్ తొழுదుమ్ ఎழு = మనము సేవించుకొందుము లేచి రమ్ము.
ఎర్రని దొండపండువలె ఒప్పు మెరయుచున్న అందమైన అదరములుగల యువతులు (మొదటగల)ప్రీతిని విడువగ, గూనితో నున్న శరీరముకలిగి, చేతికర్రతో (నడచుచు) అలసి, శక్తిహీనుడగుటకు ముందే,ఆకాశమందు పాలువలె చల్లదనముతో కూడిన చంద్రునియొక్క దుఃఖమును పోగొట్టిన సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న దివ్యదేశము,గొప్పతనము కలిగియున్న తిరునఱైయూర్ ను, ఓ ! నా మనసా! మనము సేవించుకొందుము లేచి రమ్ము.
** పిఱైశేర్ నుదలార్, పేణుదల్ నమ్మై ఇలాదమున్,
నఱైశేర్ పొழிల్ శూழ், నఱైయూర్ తొழுనెఞ్జమేయెన్ఱ,
కఱైయార్ నెడువేల్ మంగైయర్ కోన్, కలికన్ఱి శొల్,
మఱవాదు ఉరైప్పవర్, వానవర్ క్కు ఇన్ అరశావరే ll 1487
పిఱైశేర్ నుదలార్ = చంద్రకళ వలె నుదురులు కలిగిన యువతులు;నమ్మై=మనయొక్క విషయమున; పేణుదల్ ఇలాదమున్ = తగిన ఆదరము ఇవ్వని ముసలితనము రాక మునుపే; నెఞ్జమే = ఓ! నా మనసా!; నఱైశేర్ పొழிల్ శూழ்=”తేనెతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న; నఱైయూర్ తొழு ఎన్ఱ = తిరు నఱైయూర్ దివ్య దేశమును సేవించు ” అని ఉపదేశించినవారును; కఱై యార్ నెడు వేల్ = రక్తపు మరకలతో నిండిన పొడువైన శూలాయుధమును కలవారును; మంగైయర్ కోన్= తిరుమంగై దేశవాసులకు ప్రభువును; కలికన్ఱి శొల్ = తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ సూక్తులను; మఱవాదు=మరువక; ఉరైప్పవర్=పఠించువారు;వానవర్ క్కు ఇన్ అరశు ఆవరే = నిత్యశూరులకు ప్రీతిగల పాలకులగుదురు.
చంద్రకళ వలె నుదురులు కలిగిన యువతులు మనయొక్క విషయమున తగిన ఆదరము ఇవ్వని ముసలితనము రాక మునుపే, ఓ! నా మనసా!,”తేనెతో నిండిన తోటలతో చుట్టుకొనియున్న తిరు నఱైయూర్ దివ్య దేశమును సేవించు” అని ఉపదేశించిన వారును,రక్తపు మరకలతో నిండిన పొడువైన శూలాయుధమును కలవారును, తిరుమంగై దేశవాసులకు ప్రభువును, తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ సూక్తులను మరువక పఠించువారు నిత్యశూరులకు ప్రీతిగల పాలకులగుదురు.
**********