శ్రీః
8 . మాన్ కొణ్డ
తిరు నఱైయూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బి పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ సేవించుకొనుచున్నారు.
** మాన్ కొణ్డ తోల్, మార్విల్ మాణియాయ్, మావలిమణ్
తాన్ కొణ్డు, తాళాల్ అళన్ద పెరుమానై,
తేన్ కొణ్డ శారల్, తిరువేఙ్గడత్తానై,
నాన్ శెన్ఱు నాడి, నఱైయూరిల్ కణ్డేనే ll 1518
మాన్ కొణ్డ తోల్=కృష్ణాజినమును;మార్విల్=వక్షస్థలముపైన ధరించి; మాణి ఆయ్ = బ్రహ్మచారి రూపమునుదాల్చి; మావలి = మహాబలి నుండి;మణ్ తాన్ కొణ్డు = (మూడడుగుల) భూమిని తాను యాచించి;తాళాల్ అళన్ద=తన దివ్యమైన పాదముచే సర్వ లోకములు కొలిచి స్వీకరించిన;పెరుమానై= గొప్పతనము కలిగినవానిని;తేన్ కొణ్డ శారల్ = తేనెపట్టులుగల ఏటవాలు ప్రదేశములతో ఒప్పు; తిరువేఙ్గడత్తానై = తిరుమలలో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని; నాన్ = దాసుడైన నేను; నాడి శెన్ఱు = వెదుకుచు పోయి; నఱైయూరిల్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున; కణ్డేన్ = సేవించుకొంటిని.
కృష్ణాజినమును వక్షస్థలముపైన ధరించి,బ్రహ్మచారి రూపమునుదాల్చి మహాబలి నుండి మూడడుగుల భూమిని తాను యాచించి,తన దివ్యమైన పాదముచే సర్వ లోకములు కొలిచి స్వీకరించిన గొప్పతనము కలిగినవానిని,తేనెపట్టులుగల ఏటవాలు ప్రదేశములతో ఒప్పు తిరుమలలో నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని, దాసుడైన నేను వెదుకుచు పోయి తిరు నఱైయూర్ దివ్యదేశమున సేవించుకొంటిని.
మున్నీరై మున్నాళ్ కడైన్దానై, మూழ்త్తనాళ్
అన్నీరై మీనాయ్, అమైత్త పెరుమానై,
తెన్నాలిమేయ, తిరుమాలై ఎమ్మానై,
నన్నీర్వయల్ శూழ், నఱైయూరిల్ కణ్డేనే ll 1519
మున్ నాళ్ = మునుపొకకాలమున;మున్నీరై కడైన్దానై=మూడురకములైన నీటితోఒప్పు సముద్రమును చిలికినవాడును;మూழ்త్త నాళ్ = జగత్తును ప్రళయము ముంచు కాలమున; మీనాయ్ = మత్స్యరూపమునుదాల్చి; అన్నీరై = ఆ ప్రళయ సముద్రపు నీటిని; అమైత్త=నియంత్రణము చేసిన; పెరుమానై = గొప్పతనము కలిగినవాడును;తెన్ ఆలి మేయ = అందమైన తిరువాలి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న; తిరుమాలై = శ్రీదేవియొక్క విభుడును; ఎమ్మానై =నాయొక్క స్వామిని;నల్ నీర్ వయల్ శూழ் = మంచి నీరు పారుచుండు పొలములచే చుట్టుకొనియున్న; నఱైయూరిల్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున; కణ్డేన్ = సేవించుకొంటిని.
మునుపొకకాలమున మూడురకములైన నీటితోఒప్పు సముద్రమును చిలికినవాడును, జగత్తును ప్రళయము ముంచు కాలమున మత్స్యరూపమునుదాల్చి ఆ ప్రళయ సముద్రపు నీటిని నియంత్రణము చేసిన గొప్పతనము కలిగిన వాడును, అందమైన తిరువాలి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న శ్రీదేవియొక్క విభుడును,నాయొక్క స్వామిని మంచి నీరు పారుచుండు పొలములచే చుట్టుకొనియున్న తిరు నఱైయూర్ దివ్యదేశమున సేవించుకొంటిని.
తూవాయపుళ్ళూర్ న్దు, వన్దు తుఱై వేழమ్,
మూవామై నల్ గి, ముదలై తుణిత్తానై,
తేవాదితేవనై, చ్చెఙ్గమల క్కణ్ణానై,
నావాయ్ ఉళానై, నఱైయూరిల్ కణ్డేనే ll 1520
తూ వాయ=పరిశుద్దమైన వాక్కులుగల;పుళ్ ఊర్ న్దు తుఱై వన్దు = గరుడాళ్వార్ ను వాహనముగ చేసుకొని మడుగుయొక్క ఒడ్డున వచ్చిచేరి; వేழమ్ మూవామై=గజేంద్రుని దుఃఖము శమించునట్లు; నల్ గి = కృపతో; ముదలై తుణిత్తానై = మొసలిని ఖండించినవాడును; తేవాదితేవనై= నిత్యశూరుల యొక్క ప్రభువును;శెమ్ కమల కణ్ణానై=ఎర్రతామర పుష్పమువంటి నేత్రములుగలవాడును;నావాయ్ ఉళానై=తిరు నావాయ్ దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరుని; నఱైయూరిల్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున; కణ్డేన్ = సేవించుకొంటిని.
పరిశుద్దమైన వాక్కులుగల గరుడాళ్వార్ ను వాహనముగ చేసుకొని మడుగుయొక్క ఒడ్డున వచ్చిచేరి గజేంద్రుని దుఃఖము శమించునట్లు కృపతో మొసలిని ఖండించినవాడును,నిత్యశూరులయొక్క ప్రభువును, ఎర్రతామర పుష్పమువంటి నేత్రములు గలవాడును, తిరు నావాయ్ దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరుని, తిరు నఱైయూర్ దివ్యదేశమున సేవించుకొంటిని.
ఓడా అరియాయ్, ఇరణియనై ఊనిడన్ద,
శేడార్ పొழிల్ శూழ், తిరునీర్మలైయానై,
వాడామలర్ తుழாయ్, మాలై ముడియానై,
నాళ్ తోఱుమ్ నాడి, నఱైయూరిల్ కణ్డేనే ll 1521
ఓడా అరి ఆయ్ = లోకమున సంచరించని నరసింహ రూపముదాల్చి; ఇరణియనై ఊనై ఇడన్ద = హిరణ్యాసురునియొక్క శరీరమును చీల్చివధించినవాడును; శేడు ఆర్ పొழிల్ శూழ் = లేతదనముతొ నిండిన తోటలచే చుట్టబడియున్న; తిరు నీర్మలైయానై = తిరు నీర్మలై దివ్యదేశమున వేంచేసియున్న వాడును; వాడా మలర్ తుழாయ్ మాలై = వాడని పూలతోనున్న తులసీమాలను; ముడి యానై = తన కిరీటమునగల సర్వేశ్వరుని;నాళ్ తోఱుమ్ నాడి = నిత్యము వెదకుచు తిరిగి తిరిగి; నఱైయూరిల్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున; కణ్డేన్ = సేవించుకొంటిని.
లోకమున సంచరించని నరసింహరూపముదాల్చి హిరణ్యాసురునియొక్క శరీరమును చీల్చివధించినవాడును,లేతదనముతొ నిండిన తోటలచే చుట్టబడియున్నతిరునీర్మలై దివ్యదేశమున వేంచేసియున్నవాడును,వాడని పూలతోనున్న తులసీ మాలను తన కిరీటమునగల సర్వేశ్వరుని నిత్యము వెదకుచు తిరిగి తిరిగి తిరు నఱైయూర్ దివ్యదేశమున సేవించుకొంటిని.
కల్లార్మదిళ్ శూழ், కడియిలఙ్గైక్కార్ అరక్కన్,
వల్లాగమ్ కీళ, వరి వెమ్ శరమ్ తురన్ద,
విల్లానై, శెల్వవిబీడణర్కు, వేఱాగ,
నల్లానై నాడి, నఱైయూరిల్ కణ్డేనే ll 1522
కల్ ఆర్ మదిళ్ శూழ்=రాతిచే కట్టబడిన ప్రాకారములతో చుట్టుకొనియున్న; కడి ఇలఙ్గై = రక్షణకలిగిన లంకాపురియందుగల; కార్ అరక్కన్ = నీచుడైన రాక్షసరాజు రావణాసురుని యొక్క;వల్ ఆగమ్ కీళ = బలిష్టమైన శరీరము శిథిలమగునట్లు; వరి వెమ్ శరమ్ తురన్ద = అందమైన తీవ్రమైన బాణములను ప్రయోగించిన; విల్లానై = శార్ఙ్గమను విల్లును ధరించినవాడును; శెల్వమ్ విబీడణర్కు = శ్రీమంతుడైన విభీషణునకు; వేఱాగ = విలక్షణమైన; నల్లానై = మిక్కిలి ప్రేమపాత్రుడైన సర్వేశ్వరుని; నాడి = వెదుకుచు పోయి; నఱైయూరిల్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున; కణ్డేన్ = సేవించుకొంటిని.
రాతిచే కట్టబడిన ప్రాకారములతో చుట్టుకొనియున్న రక్షణకలిగిన లంకాపురియందుగల నీచుడైన రాక్షసరాజు రావణాసురుని యొక్క బలిష్టమైన శరీరము శిథిలమగునట్లు అందమైన తీవ్రమైన బాణములను ప్రయోగించిన శార్ఙ్గమను విల్లును ధరించినవాడును,శ్రీమంతుడైన విభీషణునకు విలక్షణమైన మిక్కిలి ప్రేమపాత్రుడైన సర్వేశ్వరుని వెదుకుచు పోయి తిరు నఱైయూర్ దివ్యదేశమున సేవించుకొంటిని.
ఉమ్బరులగోడు, ఉయిరెల్లామ్ ఉన్దియిల్,
వమ్బుమలర్మేల్, పడైత్తానై మాయనై,
అమ్బన్నకణ్ణాళ్, అశోదైతన్ శిఙ్గత్తై,
నమ్బనై నాడి, నఱైయూరిల్ కణ్డేనే ll 1523
ఉమ్బర్ ఉలగోడు = దేవలోకములను మరియు; ఉయిర్ ఎల్లామ్=సమస్త ప్రాణులను; ఉన్దియిల్ = తనయొక్క నాభియందు; వమ్బు మలర్ మేల్=పరిమళభరితమైన తామర పుష్పముపై; పడైత్తానై = సృష్టించినవాడును; మాయనై=ఆశ్చర్యకరమైన గుణచేష్ఠితములు కలవాడును; అమ్బు అన్న కణ్ణాన్ = బాణమువంటి నేత్రములుగల;అశోదై తన్ శిఙ్గత్తై = యశోదాదేవి యొక్క సింహపుపిల్లవంటి పుత్రుడును; నమ్బనై = ఆశ్రితులకు విశ్వసనీయుడైన సర్వేశ్వరుని;నాడి = వెదుకుచు పోయి; నఱైయూరిల్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున; కణ్డేన్ = సేవించుకొంటిని.
దేవలోకములను మరియు సమస్త ప్రాణులను తనయొక్క నాభియందు పరిమళభరితమైన తామరపుష్పముపై సృష్టించినవాడును,ఆశ్చర్యకరమైన గుణచేష్ఠితములు కలవాడును,బాణమువంటి నేత్రములుగల యశోదాదేవి యొక్క సింహపుపిల్లవంటి పుత్రుడును, ఆశ్రితులకు విశ్వసనీయుడైన సర్వేశ్వరుని వెదుకుచు పోయి తిరు నఱైయూర్ దివ్యదేశమున సేవించుకొంటిని.
కట్టేఱునీళ్ శోలై, క్కాణ్డవత్తై త్తీ మూట్టి
విట్టానై, మెయ్యమమర్ న్ద పెరుమానై,
మట్టేఱుకఱ్పగత్తై, మాదర్కాయ్, వణ్ తువరై
నట్టానై నాడి, నఱైయూరిల్ కణ్డేనే ll 1524
కట్టు ఏఱు నీళ్ శోలై = మిక్కిలి సంరక్షణము కలిగిన పొడవైన తోటలుగల;కాణ్డవత్తై = కాండవవనమును ; త్తీ మూట్టి విట్టానై=అగ్నిదేవునికి ఆహుతి చేసినవాడును; మెయ్యమ్ అమర్ న్ద పెరుమానై=తిరు మెయ్యమను దివ్యదేశమున అమరియున్న సర్వేశ్వరుడును; మట్టు ఏఱు కఱ్పగత్తై=తేనెలతోనిండిన కల్పవృక్షమును;మాదర్కు ఆయ్=తన సతీమణి సత్యభామాదేవికై; వణ్ తువరై నట్టానై = అందమైన ద్వారకలో స్థాపించిన సర్వేశ్వరుని; నాడి = వెదుకుచు పోయి; నఱైయూరిల్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున; కణ్డేన్ = సేవించుకొంటిని.
(ఇంద్రునిచే)మిక్కిలి సంరక్షణము కలిగిన పొడవైన తోటలుగల కాండవ వనమును అగ్నిదేవునికి ఆహుతి చేసినవాడును,తిరు మెయ్యమను దివ్యదేశమున అమరియున్నసర్వేశ్వరుడును, తేనెలతో నిండిన కల్పవృక్షమును తన సతీమణి సత్యభామాదేవికై అందమైన ద్వారకలో స్థాపించిన సర్వేశ్వరుని వెదుకుచు పోయి తిరు నఱైయూర్ దివ్యదేశమున సేవించుకొంటిని.
మణ్ణిన్ మీపారమ్ కెడుప్పాన్, మఱమన్నర్,
పణ్ణిన్మేల్వన్ద, పడైయెల్లామ్ పారదత్తు,
విణ్ణిన్ మీదేఱ, విశయన్ తేరూర్ న్దానై,
నణ్ణినాన్ నాడి, నఱైయూరిల్ కణ్డేనే ll 1525
మణ్ణిన్ మీ పారమ్ = భూమిపై నున్న భారమును; కెడుప్పాన్ = తొలగించుటకొరకు; మఱమ్ మన్నర్ = శత్రురాజుల యొక్క;పణ్ణిన్ మేల్ వన్ద పడై ఎల్లామ్=వ్యూహాత్మకముగ సమీకరించి ఎదిరించి వచ్చిన సేననంతయును; విణ్ణిన్ మీదు ఏఱ = వీరస్వర్గమునకు పోయి చేరునట్లు; పారదత్తు = మహాభారత యుద్దమున; విశయన్ తేర్ ఊర్ న్దానై = విజయుని యొక్క రథమును నడిపించిన సర్వేశ్వరుని;నణ్ణి నాన్ =నేను ఆశపడి;నాడి = వెదుకుచు పోయి; నఱైయూరిల్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున; కణ్డేన్ = సేవించుకొంటిని.
భూమిపై నున్న భారమును తొలగించుటకొరకు శత్రురాజుల యొక్క వ్యూహాత్మకముగ సమీకరించి ఎదిరించి వచ్చిన సేననంతయును వీరస్వర్గమునకు పోయి చేరునట్లు మహాభారతయుద్దమున విజయుని యొక్క రథమును నడిపించిన సర్వేశ్వరుని నేను ఆశపడి వెదుకుచు పోయి తిరు నఱైయూర్ దివ్యదేశమున సేవించుకొంటిని.
** పొఙ్గేఱు నీళ్ శోది, పొన్నాழிతన్నోడుమ్,
శఙ్గేఱుకోల, త్తడైక్కై పెరుమానై,
కొఙ్గేఱు శోలై, క్కుడన్దైక్కిడన్దానై,
నఙ్గోనై నాడి, నఱైయూరిల్ కణ్డేనే ll 1526
పొఙ్గు ఏఱు నీళ్ శోది = పెల్లుబుకుచున్న అంతులేని తేజస్సుకలిగిన; పొన్ ఆழி తన్నోడుమ్ = అందమైన సుదర్శనచక్రముతోను; శఙ్గు=పాంచజన్యమను శంఖమును; ఏఱు కోల తడక్కై పెరుమానై = స్వతసిద్ధముగ సంతరించుకొన్న అందమైన పెద్ద హస్తములుగల గొప్పతనము కలిగినవాడును;కొఙ్గు ఏఱు శోలై = తేనెలతోనిండిన తోటలుగల; కుడన్దై క్కిడన్దానై = తిరుకుడందై దివ్యదేశమున పవళించియున్న; నమ్ కోనై = మనయొక్క స్వామిని; నాడి = వెదుకుచు పోయి; నఱైయూరిల్ = తిరు నఱైయూర్ దివ్యదేశమున; కణ్డేన్ = సేవించుకొంటిని.
పెల్లుబుకుచున్న అంతులేని తేజస్సుకలిగిన అందమైన సుదర్శనచక్రముతోను, పాంచజన్యమను శంఖమును,స్వతసిద్ధముగ సంతరించుకొన్న అందమైన పెద్ద హస్తములుగల గొప్పతనము కలిగినవాడును,తేనెలతోనిండిన తోటలుగల తిరుకుడందై దివ్యదేశమున పవళించియున్న మనయొక్క స్వామిని వెదుకుచు పోయి తిరు నఱైయూర్ దివ్యదేశమున సేవించుకొంటిని.
** మన్ను మదురై, వసుదేవర్ వాழ் ముదలై,
నన్నఱైయూర్ నిన్ఱ నమ్బియై, వమ్బవిழ తార్
కన్నవిలుమ్ తోళాన్, కలియనొలి వల్లార్,
పొన్నులగిల్ వానవర్కు, పుత్తేళిర్ ఆగువరే ll 1527
మన్ను = నిత్యమైన (భగవత్సంబంధముగల); మదురై = ఉత్తర మధురలో; వసుదేవర్ వాழ் ముదలై = వసుదేవుని ఉజ్జీవింపజేయుటకై ముఖ్యముగ అవతరించిన స్వామి; నల్ నఱైయూర్ నిన్ఱ నమ్బియై = శ్లాఘ్యమైన తిరునఱైయూర్ లో నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బి విషయమై; వమ్బు అవిழ తార్ = పరిమళము వెదజల్లు మాలలుధరించిన; కల్ నవిలుమ్ తోళాన్= పర్వతమని చెప్పతగిన భుజములుగల; కలియన్= తిరుమంగై ఆళ్వార్; ఒలి =అనుగ్రహించిన ఈ సూక్తులమాలను;వల్లార్ = పఠించువారు;పొన్ ఉలగిల్ = పరమపదమునకు పోయి; వానవర్కు = అచటనున్న నిత్యశూరులకు; పుత్తేళిర్ ఆగువర్ = పూజ్యులగుదురు.
నిత్యమైన భగవత్సంబంధముగల ఉత్తర మధురలో వసుదేవుని ఉజ్జీవింపజేయుటకై ముఖ్యముగ అవతరించిన స్వామి,శ్లాఘ్యమైన తిరునఱైయూర్ లో నిత్యవాసము చేయుచున్న తిరునఱైయూర్ నమ్బి విషయమై పరిమళము వెదజల్లు మాలలు ధరించిన పర్వతమని చెప్పతగిన భుజములుగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ సూక్తులమాలను పఠించువారు పరమపదమునకు పోయి అచటనున్న నిత్యశూరులకు పూజ్యులగుదురు
*******