శ్రీః
8 . కాదిల్ కడిప్పు
(కోయిల్ తిరుమొழி)
శ్రీకృష్ణునియందలి అమితమైన ప్రీతిగల గోపిక తనను ఉపేక్షించించినాడని ఆ శ్రీకృష్ణునితో సలిపిన వివాదమును తిరుమంగై ఆళ్వార్ అనుభవించుచున్నారు.
** కాదిల్ కడిప్పిట్టు, క్కలిఙ్గముడుత్తు,
తాదునల్ల, తణ్ణమ్ తుழாయ్ కొడు అణిన్దు,
పోదుమఱిత్తు, ప్పుఱమే వన్దు నిన్నీర్,
ఏదుక్కిదు వెన్, ఇదు వెన్నిదు వెన్నో ll 1922
( శ్రీకృష్ణునికై రాకకై వేచియున్న గోపకాంత అతనిని చూడగనే మిక్కిలి కోపముతో ) కాదిల్ = చెవిలో; కడిప్పు = కుండలములు; ఇట్టు=ధరించి;కలిఙ్గమ్ ఉడుత్తు = నల్లని శాలువ కప్పుకొని; తాదు నల్ల తణ్ అమ్ తుழாయ్= పుప్పొడి రేణువులతో నిండిన మంచి చల్లని అందమైన తులసీమాలతో; అణిన్దు కొడు = అలంకరించుకొని; పోదు మఱిత్తు వన్దు పుఱమే = చాల ప్రొద్దుపోయిన తరువాత వచ్చి తలుపు సమీపమున; ఎదుక్కు నిన్ఱీర్ = ఎందులకు నిలబడియున్నారు?;ఇదు ఎన్ = ఏమి ఇంత ఆలస్యము? ఇదు ఎన్ = (అలంకరించుకొనుటచే ఆలస్యమయినదియని చెప్పగ) ఏమి ఈ అసత్యపు పలుకులు!
( శ్రీకృష్ణునికై రాకకై వేచియున్న గోపకాంత అతనిని చూడగనే మిక్కిలి కోపముతో ) చెవిలో కుండలములు ధరించి,నల్లని శాలువ కప్పుకొని,పుప్పొడి రేణువులతో నిండిన మంచి చల్లని అందమైన తులసీమాలతో అలంకరించుకొని, చాల ప్రొద్దుపోయిన తరువాత వచ్చి తలుపు సమీపమున ఎందులకు నిలబడియున్నారు? ఏమి ఇంత ఆలస్యము?,(అలంకరించుకొనుటచే ఆలస్యమయినదియని చెప్పగ) ఏమి ఈ అసత్యపు పలుకులు! అని కృష్ణునిపై రుస రుస లాడెను.
తువర్ ఆడై ఉడుత్తు, ఒరుశెణ్డు శిలుప్పి,
కవరాగముడిత్తు, క్కలిక్క చ్చుక్కట్టి,
శువరార్ కదవిన్ పుఱమే, వన్దు నిన్నీర్,
ఇవరారిదు వెన్, ఇదు వెన్నిదు వెన్నో ll 1923
( గోపిక శాంతించియుండునని,కొంత సమయము గడిచిన పిదప)తువర్ ఆడై ఉడుత్తు= ఎర్రని వస్త్రమును భుజములపై వేసుకొని; ఒరు శెణ్డు శిలుప్పి=ఒక పూల గుచ్ఛమును చేతిలో ఆడించుచు; కవరాగ ముడిత్తు = కేశములను బాగుగ దువ్వి ముడివేసుకొని; కలి కచ్చు కట్టి = నీటైన ధోతిని నడుమున కట్టుకొని; శువర్ ఆర్ కదవిన్ పుఱమే = గోడకు ఆనుకుని తలుపుకు సమీపమున వచ్చి నిలిచియున్నారు. వీరు ఎవరు? ( అని చిరునవ్వుతో గోపిక పలుకగ,కృష్ణుడు ఆమె వంక చూచుచు మెల్లగ లోపలకు ప్రవేశింపసాగెను ) ఇదు ఎన్ ఇదు ఎన్ ఇదు ఎన్ = ఆమె ప్రణయ రోషముతో ఏమిటిది స్వామీ! ?
( గోపిక శాంతించియుండునని,కొంత సమయము గడిచిన పిదప) ఎర్రని వస్త్రమును భుజములపై వేసుకొని ఒక పూల గుచ్ఛమును చేతిలో ఆడించుచు, కేశములను బాగుగ దువ్వి ముడివేసుకొని,నీటైన ధోతిని నడుమున కట్టుకొని, గోడకు ఆనుకుని తలుపుకు సమీపమున, వచ్చి నిలిచియున్నారు. వీరు ఎవరు?; ( అని గోపిక చిరునవ్వుతో పలుకగ, కృష్ణుడు ఆమె వంక చూచుచు మెల్లగ లోపలకు ప్రవేశింపసాగెను) ఆమె ప్రణయ రోషముతో ఏమిటిది స్వామీ! ?
కరుళక్కొడి యొన్ఱుడైయీర్, తనిప్పాగీర్,
ఉరుళ చ్చకడమదు, ఉఱక్కిల్ నిమిర్ త్తీర్,
మరుళైక్కొడు పాడివన్దు, ఇల్లమ్పుగున్దీర్,
ఇరుళత్తిదు వెన్, ఇదు వెన్నిదు వెన్నో ll 1924
కరుళన్ = గరుడును; కొడి ఒన్ఱు ఉడైయీర్ = ధ్వజముగ కలవాడా!; తని పాగీర్ = ఆ గరుడుని వాహనముగ నడిపించువాడా!; ఉఱక్కిల్=నీవు నిదురించుచున్నప్పుడు; శకడమదు = అసురునిచే ఆవేశింపబడి వచ్చిన ఆ శకటము, ఉరుళ = నశించునట్లు; నిమిర్ త్తీర్ = పాదమును చాచి తన్నినవాడా!; ఇరుళత్తు = ఈ రాత్రి సమయమున; మరుళ = (యువతులు) మోహింపబడునట్లు; పాడికొడువన్దు = ఇంపుగ పాడుకొనుచు వచ్చి; ఇల్లమ్ పుగున్దీర్ = గృహమున చొచ్చియున్నారు; ఇదు ఎన్ ఇదు ఎన్ ఇదు ఎన్ = ఆలస్యముగ తగని సమయమున రాత్రియందు దొంగతనముగ గృహమున చొచ్చుటకు కారణమేమి?
గరుడును ధ్వజముగ కలవాడా!,ఆ గరుడుని వాహనముగ నడిపించువాడా!, నీవు నిదురించుచున్నప్పుడు,అసురునిచే ఆవేశింపబడి వచ్చిన ఆ శకటము నశించునట్లు పాదమును చాచి తన్నినవాడా!,ఈ రాత్రి సమయమున (యువతులు) మోహింపబడునట్లు ఇంపుగ పాడుకొనుచు వచ్చి గృహమున చొచ్చియున్నారు. ఆలస్యముగ తగని సమయమున రాత్రియందు దొంగతనముగ గృహమున చొచ్చుటకు కారణమేమి?
నామమ్ పులవుముడై, నారణనమ్బి,
తామత్తుళబమ్, మిగనాఱిడుకిన్ఱీర్,
కామనెన ప్పాడివన్దు, ఇల్లమ్పుగున్దీర్,
ఏమత్తదు వెన్, ఇదు వెన్నిదు వెన్నో ll 1925
నామమ్ పులవుమ్ ఉడై = పలు నామములు గల; నారణ నమ్బి= శ్రీమన్నారాయణా!; మిగు నాఱు = పరిమళభరితమైన; తుళబమ్ తామమ్ = తులసీమాలను;ఇడు కిన్ఱీర్=ధరించి యున్నవాడా!; కామన్ ఎన = మన్మధునివలె; పాడి వన్దు = పాడుకొనుచు వచ్చి; ఏమత్తు = ఈ అర్ధరాత్రి సమయమున; ఇల్లమ్ పుగున్దీర్ = గృహమున చొచ్చియున్నారు; ఇదు ఎన్ ఇదు ఎన్ ఇదు ఎన్ = ఈ అర్ధరాత్రి యందు తగని సమయమున దొంగతనముగ గృహమున చొచ్చుటకు కారణమేమి?
పలు నామములు గల, శ్రీమన్నారాయణా!,పరిమళభరితమైన తులసీమాలను ధరించియున్నవాడా!, మన్మధునివలె పాడుకొనుచు వచ్చి ఈ అర్ధరాత్రి సమయమున గృహమున చొచ్చియున్నారు. ఈ అర్ధరాత్రి యందు తగని సమయమున దొంగతనముగ గృహమున చొచ్చుటకు కారణమేమి?
శుర్ట్రుమ్ కుழల్ తాழ, చ్చురికై యణైత్తు,
మర్ట్రుమ్ పల, మామణిపొన్ కొడు అణిన్దు,
ముర్ట్రమ్ పుగున్దు, ముఱువల్ శెయ్ దు నిన్ఱీర్,
ఎర్ట్రుక్కిదు వెన్, ఇదు వెన్నిదు వెన్నో ll 1926
కుழల్ = కేశములు; శుర్ట్రుమ్ తాழ = మెడవైపు అటుఇటు కదులుచుండగ; శురికై అణైత్తు = కత్తిని ధరించి; మర్ట్రుమ్ పల = మరియు పల; మా మణి =శ్లాఘ్యమైన రత్నాభరణములును; పొన్ = బంగారపు ఆభరణములును; అణిన్దు కొడు = ధరించుకొని; ముర్ట్రమ్ పుగున్దు = మాగృహ ప్రాంగణమున ప్రవేశించి; ముఱువల్ శెయ్ దు నిన్ఱీర్ = చిరునవ్వుతో నవ్వుతూ; ఎర్ట్రుక్కు నిన్ఱీర్ = ఎందులకు నిలబడియున్నారు?;ఇదు ఎన్ =ఈ ఆభరణములను అలంకరించుకొనుట ఎందులకు?; ఇదు ఎన్ ఇదు ఎన్=ఈ రాత్రి యందు తగని సమయమున దొంగతనముగ గృహమున వచ్చుట ఎందులకు?
కేశములు మెడవైపు అటుఇటు కదులుచుండగ,కత్తిని ధరించి మరియు పల శ్లాఘ్యమైన రత్నాభరణములును బంగారపు ఆభరణములును ధరించుకొని మాగృహ ప్రాంగణమున ప్రవేశించి చిరునవ్వుతో నవ్వుతూ, ఎందులకు నిలబడియున్నారు?,ఈ ఆభరణములను అలంకరించుకొనుట ఎందులకు?,ఈ రాత్రి యందు తగని సమయమున దొంగతనముగ గృహమునకు వచ్చుటకు కారణమేమి?
ఆనాయరుమ్, ఆనిరైయుమ్ అఙ్గొழிయ,
కూనాయదోర్, కొర్ట్ర విల్లొన్ఱు కైయేన్ది,
పోనారిరున్దారైయుమ్, ప్పార్తుప్పుగుదీర్,
ఏనోర్ కళ్మున్ ఎన్, ఇదు వెన్నిదు వెన్నో ll 1927
ఆన్ ఆయరుమ్ = గోపాలకులను;ఆ నిరైయుమ్=గో సమూహములను;అఙ్గు ఒழிయ=ఆ అడవియందే విడిచి; కూను ఆయదు ఓర్ = వంగియున్న ఒక విశిష్టమైన; కొర్ట్ర విల్లు ఒన్ఱు = జయసూచకమైన విల్లునొకటి (వేటకై పోవునట్లు స్పురింపజేయుచు);కైయేన్ది = చేతిలో ధరించి; పోనార్ ఇరున్దారైయుమ్ పార్తు పుగుదీర్ = వెలుపలకు పోయినవారిని,ఉన్నవారిని చూచుకొని గృహమున చొచ్చియున్నారు;ఏనోర్ గళ్ మున్ ఎన్= ప్రతికూలరైన వారి ఎదురుగ, నిందించునట్లు ఎందులకు వచ్చిరి?; ఇదు ఎన్ ఇదు ఎన్ = ఈ విధముగ గృహమున వచ్చుట ఎందులకు?
గోపాలకులను,గో సమూహములను ఆ అడవియందే విడిచి,వంగియున్న ఒక విశిష్టమైన జయసూచకమైన విల్లునొకటి (వేటకై పోవునట్లు స్పురింపజేయుచు) చేతిలో ధరించి వెలుపలకు పోయినవారిని, ఉన్నవారిని చూచుకొని గృహమున చొచ్చియున్నారు, ప్రతికూలరైన వారి ఎదురుగ, నిందించునట్లు ఎందులకు వచ్చిరి? ఈ విధముగ గృహమున వచ్చుట ఎందులకు?
మల్లేపొరుదతిణ్తోళ్, మణవాళీర్,
అల్లే యఱిన్దోమ్, నుమ్మనత్తిన్ కరుత్తై,
శొల్లాదొழிయీర్, శొన్నపోదినాల్ వారీర్,
ఎల్లేయిదు వెన్, ఇదు వెన్నిదు వెన్నో ll 1928
మల్ పొరుద = మల్ల వీరులతో పోరు సలిపి వధించిన; తిణ్ తోళ్ = దృఢమైన భుజములుగల; మణవాళీర్ = శ్రీదేవి వల్లభుడా!; నుమ్ మనత్తిన్ కరుత్తై = మీయొక్క మనోభావమును; అల్లే = ఈ రాత్రియందు; అఱిన్దోమ్ = తెలుసు కొంటిమి; శొల్లాదు ఒழிయీర్ = (ఏ సమయమున వచ్చెదరోయని) చెప్పక వెడలిపోదురు;శొన్న పోదినాల్ వారీర్ = చెప్పిన సమయమునకు రాకుందురు;ఎల్లే = అయ్యో!, ఇదు వెన్ = ఇటుల చేయుట దేని కొరకు; ఇదు ఎన్ ఇదు ఎన్ = ఇట్లు చేయుట ఎందులకు?
మల్ల వీరులతో పోరు సలిపి వధించిన దృఢమైన భుజములుగల శ్రీదేవి వల్లభుడా!, మీయొక్క మనోభావమును, ఈ రాత్రియందు తెలుసు కొంటిమి, (ఏ సమయమున వచ్చెదరోయని) చెప్పక వెడలిపోదురు, చెప్పిన సమయమునకు రాకుందురు, అయ్యో! ఇటుల చేయుట దేని కొరకు, ఇట్లు చేయుట ఎందులకు?
పుక్కు ఆడరవమ్, పిడిత్తు ఆట్టుమ్ పునిదీర్,
ఇక్కాలఙ్గళ్, యామునక్కు ఏదన్ఱుమల్లోమ్,
తక్కార్ పలర్, తేవిమార్ శాలవుడైయీర్,
ఎక్కేయిదు వెన్, ఇదు వెన్నిదు వెన్నో ll 1929
పుక్కు=మడుగులో దుమికి; ఆడు అరవమ్=పడగలెత్తి ఆడుచున్న కాళీయసర్పమును; పిడిత్తు = పట్టుకొని; ఆట్టుమ్ = (దాని శక్తి క్షీణించునట్లు) ఆడించిన; పునిదీర్ = పరిశుద్ద స్వభావుడా!; ఇ కాలఙ్గళ్ = ఈ దినములందు; యామ్ = మేము; ఉమక్కు = మీకు; ఏదు ఒన్ఱుమ్ అల్లోమ్ = ఏ ఒక గణనీయమైన గుణములు కలిగినవారము కాము; తక్కార్=తమకు తగిన;పలర్=పలు; తేవిమార్=మహిషీమణులు; శాలవుడైయీర్ = చాలమంది కలగియున్నారు; ఎక్కే = ఎంత దురదృష్టమో?;ఇదు వెన్ = ఈ జాగు మాకు ఎందులకు; ఇదు ఎన్ ఇదు ఎన్ = మమ్ము కరుణింపక పోవటకు కారణమేమి!
మడుగులో దుమికి పడగలెత్తి ఆడుచున్న కాళీయసర్పమును పట్టుకొని (దాని శక్తి క్షీణించునట్లు) ఆడించిన పరిశుద్ద స్వభావుడా!, ఈ దినములందు మేము, మీకు ఏ ఒక గణనీయమైన గుణములు కలిగినవారము కాము. తమకు తగిన పలు మహిషీమణులు చాలమంది కలగియున్నారు. ఎంత దురదృష్టమో? మీ ఎడబాటులో జీవింపలేని మాపై కరుణింపక పోవటకు కారణమేమి!
ఆడిఅశైన్దు, ఆయ్ మడవారొడు నీపోయ్,
కూడిక్కురవై పిణై, కోమళ ప్పిళ్ళాయ్,
తేడిత్తిరుమామగళ్, మణ్మగళ్ నిఱ్ప,
ఏడీయిదు వెన్, ఇదు వెన్నిదు వెన్నో ll 1930
తిరుమామగళ్ = శ్రీమహాలక్ష్మి; మణ్ మగళ్ = శ్రీ భూదేవి, తేడి నిఱ్ప= వెదుకుచుండగ; నీ పోయ్ = వారిని ఉపేక్షించి పోయి; ఆయ్ మడవారొడు = గోపకాంతలతో;కూడి=కలసి; ఆడి అశైన్దు = ఆడుచు కదులుచు; కురవై పిణై = రాసక్రీడ సలిపిన;కోమళమ్ పిళ్ళాయ్= అందమైన యౌవనుడా!; ఇదు ఎన్ = ఇది ఏమి? ఇపుడు నా చెంతకు వచ్చితివి!; (చేరువులోనున్న) ఏడీ ఇదు ఎన్ = ఓ! నా సఖీ ఇది ఏమి?;ఇదు ఎన్ ఇదు ఎన్ = నన్ను వీడునో? యని చాల అశాంతిగ నున్నది!
శ్రీమహాలక్ష్మి,శ్రీ భూదేవి వెదుకుచుండగ వారిని ఉపేక్షించి పోయి, గోపకాంతలతో కలసి ఆడుచు కదులుచు రాసక్రీడ సలిపిన, అందమైన యౌవనుడా! ఇది ఏమి? ఇపుడు నా చెంతకు వచ్చితివి!,(చేరువులోనున్న) ఓ! నా సఖీ ఇది ఏమి?, నన్ను వీడునో? యని చాల అశాంతిగ నున్నది!
** అల్లిక్కమలక్కణ్ణనై, అఙ్గోరాయ్ చ్చి,
ఎల్లిప్పొழுదూడియ, ఊడల్ తిఱత్తై,
కల్లిన్ మలితోళ్, కలియన్ శొన్న మాలై,
శొల్లిత్తుదిప్పారవర్, తుక్కమిలరే ll 1931
అల్లి కమల కణ్ణనై = పుప్పొడి రేణువులతో నిండిన కమలములవంటి నేత్రములుగల శ్రీకృష్ణుని ఉద్దేశించి; అఙ్గు = ఆ గోకులములో; ఓర్ ఆయ్ చ్చి = ఒక గోపకాంత; ఎల్లి పొழுదు = రాత్రివేళ; ఊడియ ఊడల్ తిఱత్తై = ప్రణయ రోషముతో నిందించినమాటల విషయమై; కల్లిన్ మలి = పరత్వముకంటె అతిశయించిన (శక్తితో ఒప్పు); తోళ్= భుజములుగల; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; శొన్న = అనుగ్రహించిన; మాలై = ఈ సూక్తుల మాలను; శొల్లి = నోరార చెప్పుచు; తుదిప్పార్ అవర్ = సర్వేశ్వరుని స్తుతించువారు; తుక్కమ్ ఇలరే = దుఃఖములు లేక సుఖముగ నివసింతురు!
పుప్పొడి రేణువులతో నిండిన కమలములవంటి నేత్రములుగల శ్రీకృష్ణుని ఉద్దేశించి, ఆ గోకులములో ఒక గోపకాంత రాత్రివేళ ప్రణయ రోషముతో నిందించిన మాటల విషయమై, పరత్వముకంటె అతిశయించిన (శక్తితో ఒప్పు) భుజములుగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ సూక్తుల మాలను నోరార చెప్పుచు, సర్వేశ్వరుని స్తుతించువారు దుఃఖములు లేక సుఖముగ నివసింతురు!
*********