పెరియతిరుమొழி-10వపత్తు (9)

శ్రీః

9 . పుళ్ళురువాగి

                          సర్వేశ్వరుని సంశ్లేషమునకై  తపించుచున్న పరకాలనాయకి స్థితిని  సహింపజాలక ఆమెయొక్క తల్లి తన కుమార్తె ఏ కారణమున ఉపేక్షింప బడుచున్నదని ఆ సర్వేశ్వరుని ప్రశ్నించుటను తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించుచున్నారు. 

** పుళ్ళురువాగి నళ్ళిరుళ్ వన్ద, పూదనై మాళ,ఇలఙ్గై

ఒళ్ళెరి మణ్డియుణ్ణ పణిత్త, ఊక్కమదనై నినైన్దో,

కళ్ళవిழ் కోదై కాదలుమ్, ఎఙ్గళ్ కారికై మాదర్ కరుత్తుమ్,

పిళ్ళైతన్ కైయిల్ కిణ్ణమేయొక్క, పేశువదు ఎన్దై పిరానే  ll 1932

ఎన్దై పిరానే = నాయొక్క స్వామీ!; ఎఙ్గళ్ కళ్ అవిழ் కోదై కాదలుమ్ = తేనెలొలుకు పుష్పములతో అలంకరించుకొనిన కొప్పుగల నాయొక్క బాలికయొక్క తమను   పొందగోరు ఆశయును;కారికై మాదర్ కరుత్తుమ్ = (ఆ ఆశను నిందించు) అందమైన స్త్రీల మనోభావమును; పిళ్ళై తన్ కైయిల్ కిణ్ణమే ఒక్క పేశువదు= “చిన్న పిల్ల చేతిలో గిన్నియే” అనునట్లు (ప్రయాసములేక తీసుకొనగలమని ఉపేక్షింపబడునట్లు) మీచే  ఉపేక్షింపబడు చున్నట్లున్నది;పుళ్  ఉరు ఆగి=పక్షి రూపమును దాల్చి; నళ్ ఇరుళ్ వన్ద= నడి రేయిలో వచ్చిన; పూతనై = (స్తనమందలి పాలనొసగుటకై వచ్చిన) పూతన;మాళ = మరణించునట్లును; ఇలఙ్గై = లంకాపురిని; ఒళ్ ఎరి మణ్డి ఉణ్ణ = జ్వలించెడిమంటలు వ్యాపించి ఆహుతియగునట్లు; పణిత్త = చేసిన; ఊక్కమ్ అదనై నినైన్దో = శక్తిని, పరత్వమును తమ హృదయమున తలచుకొని ఈమె తమకు తగదనుకొనుచున్నారా!

        నాయొక్క స్వామీ!,తేనెలొలుకు పుష్పములతో అలంకరించుకొనిన కొప్పుగల నాయొక్క బాలికయొక్క తమను   పొందగోరు ఆశయును, (ఆ ఆశను నిందించు) అందమైన స్త్రీల మనోభావమును,”చిన్న పిల్ల చేతిలో గిన్నియే” అనునట్లు (ప్రయాసములేక తీసుకొనగలమని ఉపేక్షింపబడునట్లు) మీచే  ఉపేక్షింపబడు చున్నట్లున్నది.పక్షి రూపమును దాల్చి నడిరేయిలో వచ్చిన (స్తనమందలి పాలనొసగుటకై వచ్చిన) పూతన మరణించునట్లును, లంకాపురిని జ్వలించెడిమంటలు వ్యాపించి ఆహుతియగునట్లును, చేసిన శక్తిని, పరత్వమును తమ హృదయమున తలచుకొని ఈమె తమకు తగదనుకొనుచున్నారా!

మన్ఱిల్ మలిన్దు కూత్తు ఉవన్దు ఆడి, మాల్ విడైయేழு మడర్తు, ఆయర్

అన్ఱు నడుఙ్గ ఆనిరై కాత్త, ఆణ్మైకొలో అఱియేన్ నాన్,

నిన్ఱ పిరానే నీళ్ కడల్ వణ్ణా, నీ ఇవల్ తన్నై నిన్కోయిల్,

మున్ఱిల్ ఎழுన్ద మురుమ్ కైయిల్ తేనా, మున్ కైవళై కవర్ న్దాయే  ll 1933

నిన్ఱ పిరానే = తిరుమలలో నిలిచియున్న స్వామీ!; నీళ్ కడల్ వణ్ణా = మహాసముద్రము వంటి వర్ణముగలవాడా!;నీ=నీవు;నిన్ కోయిల్ మున్ఱిల్ ఎழுన్ద మురుమ్ కైయిల్ తేనా = నీయొక్క కోవెల ముంగిటనున్న ముల్లంగిచెట్టుకున్న తేనెపట్టుయందలి తేనె సులభముగ పొందబడునట్లు; ఇవల్ తన్నై = ఈ నా బాలికయొక్క; మున్ కైవళై = ముంజేతి కంకణములును; కవర్ న్దాయ్ = హరించితివి; (ఇది) మన్ఱిల్ మలిన్దు = నాలుగు వీధుల నడుమ నిలబడి; ఉవన్దు = సంతోషముతో; కూత్తు ఆడి = (కుంభనృత్యము మొదలగు) నృత్యములు చేసియు;మాల్ విడై యేழுమ్ అడర్తు = నల్లని వృషభములు ఏడింటిని అణచియు;అన్ఱు=(ఇంద్రుడు రాళ్ళ వర్షము కురిపించిన) ఆ కాలమున; ఆయర్ నడుఙ్గ=గోకులవాసులు వణుకుచుండగ; ఆనిరై కాత్త = గో సమూహములను రక్షించుటను; ఆణ్మైకొలో = ఆ గొప్పతనము తలచుటచేతనా ఉపేక్షించుట; నాన్ అఱియేన్ = నాకు తెలియకున్నది! 

            తిరుమలలో నిలిచియున్న స్వామీ!,మహాసముద్రము వంటి వర్ణముగలవాడా!,నీవు, నీయొక్క కోవెల ముంగిటనున్న ముల్లంగి చెట్టుకున్న తేనెపట్టు యందలి తేనె సులభముగ పొందబడునట్లు, ఈ నా బాలికయొక్క ముంజేతి కంకణములును హరించితివి.  నాలుగు వీధుల నడుమ నిలబడి సంతోషముతో   (కుంభనృత్యము మొదలగు) నృత్యములు చేసియు, నల్లని వృషభములు ఏడింటిని అణచియు,(ఇంద్రుడు రాళ్ళ వర్షము కురిపించిన) ఆ కాలమున గోకులవాసులు వణుకుచుండగ, గో సమూహములను రక్షించుటను,ఆ గొప్పతనము తలచుటచేతనా ఉపేక్షించుట, నాకు తెలియకున్నది! 

ఆర్ మలి ఆழ் శఙ్గొడు పర్ట్రి, ఆర్ట్రలై ఆర్ట్రల్ మికుత్తు,

కార్ ముగిల్ వణ్ణా కఞ్జనై మున్నమ్, కడన్ద నిన్ కడుమ్ తిఱల్ తానో,

నేర్ ఇழை మాదై నిత్తిలత్తొత్తై, నెడుఙ్గడల్ అముదనైయాళై,

ఆర్ ఎழிల్ వణ్ణా అమ్ కైయిల్ వట్టామ్, ఇవళెనక్కరుదుగిన్ఱాయే  ll 1934

కార్ ముగిల్ వణ్ణా = కాలమేఘమువంటి వర్ణముగలవాడా!; ఆర్ ఎழிల్ వణ్ణా = మిక్కిలి  సుందరమైన స్వరూపము కలవాడా!; నేర్ ఇழை = పరమవిలక్షణమైన ఆభరణములు కలిగినదియు;నిత్తిలత్తొత్తై= ముత్తులమాలవలెనున్న; నెడు కడల్ అముదు ఆనైయాళై = మహాసముద్రమున ఉద్భవించిన అమృతము పోలిన; మాదై  = ఈ నాయొక్క బాలిక విషయమున; ఇవళ్ అమ్ కైయిల్ వట్టు ఆమ్ ఎన కరుదుగిన్ఱాయ్= “ఈమె చేతిలోనున్న బెల్లపు ముక్కలాంటి బాలిక  ” యని తలచుచున్నావు;(ఏలననగ) మున్నమ్= మునుపు; ఆర్ మలి = మిక్కిలి వాడియైన; ఆழி = చక్రాయుధము;శఙ్గమ్ = శంఖము; పర్ట్రి = హస్తమున ధరించి(అవతరించి);ఆర్ట్రలై = నీయొక్క అనంతశక్తిని;ఆర్ట్రల్ మికుత్తు = కప్పిపుచ్చుకొని; కఞ్జనై = కంసుని;కడన్ద=కడతేర్చిన;నిన్ కడుమ్ తిఱల్ తానో=నీయొక్క బలపరాక్రములు కారణముచేగదా? (ఉపేక్షించుచుంటివి)

                కాలమేఘమువంటి వర్ణముగలవాడా!, మిక్కిలి సుందరమైన స్వరూపము కలవాడా!, పరమవిలక్షణమైన ఆభరణములు కలిగినదియు, ముత్తుల మాలవలెనున్న, మహాసముద్రమున ఉద్భవించిన అమృతము పోలిన, ఈ నాయొక్క బాలిక విషయమున “ఈమె చేతిలోనున్న బెల్లపు ముక్కలాంటి బాలిక  ” యని తలచుచున్నావు,(ఏలననగ) మునుపు మిక్కిలి వాడియైన చక్రాయుధము,శంఖము   హస్తమున ధరించి(అవతరించి), నీయొక్క అనంతశక్తిని కప్పిపుచ్చుకొని  కంసుని కడతేర్చిన నీయొక్క బలపరాక్రములు కారణముచేగదా? (ఉపేక్షించుచుంటివి)

మల్ గియ తోళుమ్ మానురియదళుమ్, ఉడైయవర్ తమక్కుమ్ ఓర్ పాగమ్,

నల్ గియ నలమో నరకనైతొలైత్త, కరతలత్తు అమైదియన్ కరుత్తో,

అల్లియమ్ కోదై అణినిఱఙ్గొణ్డువన్దు, మున్నే నిన్ఱు పోగాయ్,

శొల్లియెన్ నమ్బీ ఇవళ్ నీ ఉఙ్గళ్, తొణ్డర్ కైత్తణ్డెన్ఱవాఱే  ll 1935

నమ్బీ = స్వామీ!; అల్లి అమ్ కోదై = సుందరమైన పూలమాలచే అలంకరించుకొనిన అందమైన  కుంతలములతో ఒప్పు కొప్పుగల ఈ నా బాలికయొక్క;అణి=విలక్షణమైన; నిఱమ్ = మేని సౌందర్యమును; కొణ్డు = అపహరించుటయేగాక; మున్నే వన్దు  నిన్ఱు పోగాయ్ = ముంగిటనే వచ్చి ఈమె కంటెదుర నిలబడి వీడకపోతివి;నీ = నీవు;ఇవళై= ఈ బాలికను; ఉఙ్గళ్ తొణ్డర్ కై తణ్డు ఎన్ఱ వాఱు = మీయొక్క  ఆశ్రితుల చేతిలోగల దండము వలె తలచుచుంటిరా ఏమి? (ఏలననగ) మల్ గియ తోళుమ్ = విశాలమైన భుజములును; మాన్ ఉరి అదళుమ్ = లేడి చర్మమును, ఉడైయవర్ తమక్కుమ్ = కలిగియున్న శివునికిని;ఓర్ పాగమ్=మీయొక్క శరీరమున ఒక బాగమున;నల్ గియ=(నివాసస్థలముగ) ఒసగితిమేయని; నలమో = గొప్పతనమును తలచుకొనియా; (లేక) నరకనై తొలైత్త=నరకాసురుని సంహరించిన;కరతలత్తు = హస్తమునగల; అమైదియన్ కరుత్తో = మహాశక్తిని తలచుకొనియా? (ఉపేక్షించుచుంటివి)

     స్వామీ!,సుందరమైన పూలమాలచే అలంకరించుకొనిన అందమైన  కుంతలములతో ఒప్పు కొప్పుగల ఈ నా బాలికయొక్కవిలక్షణమైనమేని సౌందర్యమును అపహరించుటయే గాక, ముంగిటనే వచ్చి ఈమె కంటెదుర నిలబడి వీడకపోతివి, నీవు ఈ బాలికను, మీయొక్క  ఆశ్రితుల చేతిలోగల దండము వలె తలచుచుంటివా ఏమి? (ఏలననగ) విశాలమైన భుజములును, లేడి చర్మమును, కలిగియున్న శివునికిని, మీయొక్క శరీరమున ఒక బాగమున (నివాసస్థలముగ) ఒసగితిమేయన్న గొప్పతనమును తలచుకొనియా?, (లేక) నరకాసురుని సంహరించిన హస్తమునగల మహాశక్తిని తలచుకొనియా? (ఉపేక్షించుచుంటివి)

శెరు అழிయాద మన్నర్ గళ్ మాళ, త్తేర్ వలఙ్గొణ్డ అవర్ శెల్లుమ్,

అరు వழி వానమ్ అదర్ పడక్కణ్డ, ఆణ్మైకొలో అఱియేన్ నాన్,

తిరుమొழி ఎఙ్గళ్ తేమలర్ కోదై, శీర్మైయై నినైన్దిలైయన్దో,

పెరువழி నావఱ్కనియిలుమ్ ఎళియవళ్, ఇవళెనప్పేశుగిన్ఱాయే  ll 1936

ఎఙ్గళ్ = మాయొక్క; తిరు మొழி =ఈ మదురమైన,శ్లాఘ్యమైన మాటలుగల; తే మలర్ కోదై=తేనెలొలుకు పుష్పములతో అలంకరించుకొనిన కుంతలములతో ఒప్పు  కొప్పుగల బాలికయొక్క; శీర్మైయై=గొప్పతనమును; నినైన్దిలై=తెలియకున్నావు;అన్దో=అయ్యో!; ఇవళ్ పెరువழி నావల్ కనియిలుమ్ ఎళియవళ్ ఎన పేశుగిన్ఱాయ్ = పెద్దవీధిలో రాలి పడియున్న నల్లరేగిపండుకంటెను ఈమె సులభముగ పొందవచ్చునని తలచుచుంటివి?; (ఎందుకనగ) శెరు =యుద్దములలో; అழிయాద=అపజయము తెలియని;మన్నర్ గళ్ = మహారాజులు; మాళ = మరణించునట్లు; తేర్ వలమ్ కొణ్డు = రథ సారథ్యము వహించి;  అవర్ శెల్లుమ్ = ఆ రాజుల పోవు; అరు వழி వానమ్ = అపురూపమైన మార్గముగల  వీరస్వర్గమును; అదర్ పడ కణ్డ = పొందునట్లు చేసిన; ఆణ్మైకొలో = పాలనాదక్షతను తలచుకొనియా; నాన్ అఱియేన్ = నాకేమియు తెలియకున్నది!

    మాయొక్క,ఈ మదురమైన,శ్లాఘ్యమైన మాటలుగల, తేనెలొలుకు పుష్పములతో అలంకరించుకొనిన కుంతలములతో ఒప్పు  కొప్పుగల బాలికయొక్క గొప్పతనమును తెలియకున్నావు,అయ్యో!,పెద్దవీధిలో రాలి పడియున్న నల్లరేగిపండు కంటెను ఈమె సులభముగ పొందవచ్చునని తలచుచుంటివి? (ఎందుకనగ)  యుద్దములలో అపజయము తెలియని మహారాజులు మరణించునట్లు రథ సారథ్యము వహించి,  ఆ రాజుల పోవు  అపురూపమైన మార్గముగల వీరస్వర్గమును పొందునట్లు చేసిన పాలనాదక్షతను తలచుకొనియా! నాకేమియు తెలియకున్నది!

అరక్కియరాగమ్ పుల్లెన విల్లాల్, అణిమదిళ్ ఇలఙ్గైయర్ కోనై,

శెరుక్కழிత్తు అమరర్ పణియ మున్నిన్ఱ, శేవగమో శెయ్ దదిన్ఱు,

మురుక్కు ఇదయ్ వాయ్ చ్చి మున్ కై వెణ్ శఙ్గమ్ కొణ్డు, మున్నే నిన్ఱుపోగాయ్,

ఎరుక్కిలైక్కాగ ఎఱిమழுవోచ్చల్, ఎన్ శెయ్ వదు ఎన్దై పిరానే  ll 1937

ఎన్దై పిరానే=నాయొక్కస్వామీ!;మున్=మునుపొకకాలమున;అరక్కియర్=రాక్షసస్త్రీల; ఆగమ్=వక్షస్థలము; పుల్లెన=శూన్యమగునట్లు;అణి మదిళ్ ఇలఙ్గైయర్ కోనై = అందమైన ప్రాకారములుగల లంకాపురి వాసులకు ప్రభువైన రావణాసురుని;విల్లాల్=ఒక బాణముచే; శెరుక్కు అழிత్తు = దురహంకారమును అణచి;అమరర్ పణియ నిన్ఱ = బ్రహ్మాదిదేవతలు సేవించునట్లు నిలబడిన;శేవగమో=పరాక్రమమును తలచికొనియా;ఇన్ఱు శెయ్ దదు = ఇపుడు(ఈమె విషయమున ఉపేక్షించి)మీరు చేయునది; మురుక్కు ఇదయ్ వాయ్ చ్చి= మోదుగపువ్వు(అడవి జ్వాల)వలె ఆధారపడియున్న ఈ బాలికయొక్క;మున్ కై వెణ్ శఙ్గమ్ కొణ్డు = ముంజేతియందలి అందమైన కంకణములను హరించుటయే గాక; మున్నే వన్దు  నిన్ఱు పోగాయ్ = ముంగిటనే వచ్చి ఈమె కంటెదుర ఎల్లప్పుడు నిలబడి వీడకపోతివి; ఎరుక్కు ఇలైక్కు ఆగ = జిల్లేడుమొక్క ఆకులకై;ఎఱి మழு ఓచ్చల్ ఎన్ శెయ్ వదు = వాడియైన గొడ్డలిని పైకెత్తి నరుకుటకు ఏమి అవసరము?

        నాయొక్క స్వామీ!,మునుపొకకాలమున రాక్షసస్త్రీల వక్షస్థలము శూన్యమగునట్లు అందమైన ప్రాకారములుగల లంకాపురివాసులకు ప్రభువైన రావణాసురుని ఒక బాణముచే దురహంకారమును అణచి, బ్రహ్మాదిదేవతలు సేవించునట్లు నిలబడిన పరాక్రమమును తలచుకొనియా,ఇపుడు(ఈమె విషయమున  ఉపేక్షించి) మీరు చేయునది, మోదుగపువ్వు(అడవి జ్వాల)వలె ఆధారపడియున్న ఈ బాలికయొక్క ముంజేతియందలి అందమైన కంకణములను హరించుటయే గాక  ముంగిటనే వచ్చి ఈమె కంటెదుర ఎల్లప్పుడు నిలబడి వీడకపోతివి.జిల్లేడుమొక్క ఆకులకై వాడియైన గొడ్డలిని పైకెత్తి నరుకుటకు ఏమి అవసరము?

ఆழி అమ్ తిణ్ తేర్ అరశర్ వన్దు ఇఱైఞ్జ, అలైకడల్ ఉలగమున్ ఆణ్డ,

పాழி అమ్ తోళ్ ఓరాయిరమ్ వీழ, పడై మழுప్పర్ట్రియ వలియో,

మాழைమెన్నోక్కి మణి నిఱమ్ కొణ్డు వన్దు, మున్నే నిన్ఱుపోగాయ్,

కోழி వెణ్ముట్టైక్కు ఎన్ శెయ్ వతెన్దాయ్, కుఱన్దడి నెడుఙ్గడల్ వణ్ణా  ll 1938

నెడు కడల్ వణ్ణా = మహాసముద్రము వంటి వర్ణముగలవాడా!; ఎన్దాయ్ = నాయొక్క స్వామీ!; మున్ = మునుపొకకాలమున; తిణ్ =దృఢమైన; ఆழி అమ్  తేర్ = పెద్ద చక్రములుతో నున్న  అందమైన రథములు కలిగిన; అరశర్ వన్దు ఇఱైఞ్జ=రాజులు వచ్చి సేవించునట్లు; అలైకడల్ ఉలగమ్ ఆణ్డ =అలలుచే నిండిన సముద్రముచే చుట్టుకొనియున్న ఈ లోకమును పాలించిన; ఓర్ ఆయిరమ్ పాழி అమ్ తోళ్ వీழ = (కార్త్యవీర్యార్జునునియొక్క) బలిష్టమైన ఆ సహస్రభుజములు తెగి క్రిందపడునట్లు; పడై మழு పర్ట్రియ వలియో = ఆయుధము గండ్రగొడ్డలి చేపట్టిన మహాపరాక్రమమును తలచికొనియా; మాழை మెల్ నోక్కి =  లేడియొక్క అందమైన చూపులవంటి చూపులుగల ఈ నా బాలికయొక్క; మణి నిఱమ్ కొణ్డు = సుందరమైన మేని సౌందర్యమును హరించుటయే గాక; మున్నే వన్దు  నిన్ఱు పోగాయ్ = ముంగిటనే వచ్చి ఈమె కంటెదుర ఎల్లప్పుడు నిలబడి వీడకపోతివి; కోழி వెణ్ ముట్టైక్కు = ( తనకు తానే పగిలిపోయెడి) తెల్లని కోడిగుడ్డునకు; కుఱు తడి ఎన్ శెయ్ వదు = చిన్న కర్ర దేనికొరకు?

            మహాసముద్రము వంటి వర్ణముగలవాడా!,నాయొక్క స్వామీ!  మునుపొకకాలమున దృఢమైన పెద్ద చక్రములుతోనున్న  అందమైన రథములు కలిగిన రాజులు వచ్చి సేవించునట్లు,అలలుచే నిండిన సముద్రముచే చుట్టుకొనియున్న ఈ లోకమును పాలించిన,(కార్త్యవీర్యార్జునునియొక్క) బలిష్టమైన ఆ సహస్రభుజములు తెగి క్రిందపడునట్లు, ఆయుధము గండ్రగొడ్డలి చేపట్టిన మహాపరాక్రమమును తలచికొనియా,  (నాయొక్క బాలిక నీచే ఉపేక్షింపబడుచున్నది!),ఈ లేడియొక్క అందమైన చూపులవంటి చూపులుగల  నా బాలికయొక్క సుందరమైన మేని సౌందర్యమును హరించుటయే గాక, ముంగిటనే వచ్చి ఈమె కంటెదుర ఎల్లప్పుడు నిలబడి వీడకపోతివి.(తనకు తానే పగిలిపోయెడి)తెల్లని కోడిగుడ్డునకు చిన్న కర్ర దేనికొరకు?

పొరున్దలన్ ఆగమ్ పుళ్ ఉవన్దు ఏఱ, వళ్ళుకిరాల్ పిళన్దు, అన్ఱు

పెరున్దగైక్కు ఇరఙ్గి వాలియై మునిన్ద, పెరుమైకొలో శెయ్ దదిన్ఱు,

పెరున్దడఙ్కణ్ణి శురుమ్బుఱుకోదై, పెరుమైయై నినైన్దిలై పేశిల్,

కరుఙ్గడల్ వణ్ణా కవుళ్ కొణ్డ నీరామ్, ఇవళెనక్కరుదుగిన్ఱాయే  ll 1939

అన్ఱు = మునుపొకకాలమున; పొరున్దలన్ = శత్రువైన హిరణ్యాసురునియొక్క; ఆగమ్= శరీరమును; పుళ్ = (రాబందులు మొదలగు) పక్షులు;ఉవన్దు ఏఱ=ఆనందముతో ఎక్కి తినునట్లు; వళ్ ఉకిరాల్ = వాడియైన నఖములచే; పిళన్దు = అతని శరీరము చీల్చియు; పెరున్దగైక్కు ఇరఙ్గి = గొప్ప స్వభావముగల సుగ్రీవునిపై దయతలచి; వాలియై మునిన్ద = వాలిపై ఆగ్రహించి వధించితిననియు; పెరుమైకొలో = గొప్పతనమును తలచుకొనియా?; ఇన్ఱు  శెయ్ దదు = ఇపుడు నాయొక్క బాలిక నీచే ఉపేక్షింప బడుచున్నది!; కరుమ్ కడల్ వణ్ణా = సముద్రమువలె నల్లని వర్ణముగలవాడా!; పెరు తడ కణ్ణి = మిక్కిలి విశాలమైన కన్నులుగల;శురుమ్బు ఉఱు కోదై =(తేనెలొలుకు పుష్పములవలన) భ్రమరములు వీడని కొప్పుగల ఈ నా బాలికయొక్క;పెరుమైయై నినైన్దు ఇలై = విలక్షణమును తలచుటలేదు; పేశిల్ = నిజము చెప్పినయెడల; కవుళ్ కొణ్డ నీర్ ఆమ్ ఇవళ్ ఎన కరుదుగిన్ఱాయ్ = నోటిలో పుక్కిలించుటకు తీసుకొనిన నీరు వలె ఈమెను తలచుచున్నావు!

మునుపొకకాలమున శత్రువైన హిరణ్యాసురునియొక్క శరీరమును (రాబందులు మొదలగు) పక్షులు ఆనందముతో ఎక్కి తినునట్లువాడియైన నఖములచే  అతని శరీరము చీల్చియు,గొప్ప స్వభావముగల సుగ్రీవునిపై దయతలచి వాలిపై ఆగ్రహించి వధించితిననియు, గొప్పతనమును తలచుకొనియా? ఇపుడు నాయొక్క బాలిక నీచే ఉపేక్షింపబడుచున్నది!,సముద్రమువలె నల్లని వర్ణముగలవాడా!, మిక్కిలి విశాలమైన కన్నులుగల,(తేనెలొలుకు పుష్పములవలన) భ్రమరములు వీడని కొప్పుగల ఈ నా బాలికయొక్క విలక్షణమును తలచుటలేదు,నిజము చెప్పినయెడల నోటిలో పుక్కిలించుటకు తీసుకొనిన నీరు వలె ఈమెను తలచుచున్నావు!

నీర్ అழల్ వానాయ్ నెడునిలమ్ కాలాయ్, నిన్ఱనిన్ నీర్మైయై నినైన్దో,

శీర్ కెழுకోదై ఎన్నలదు ఇలళ్ ఎన్ఱు, అన్నదోర్ తేర్ట్రన్మైదానో,

పార్ కెழு పవ్వత్తు ఆరముదనైయ, పావయై ప్పావమ్ శెయ్ దేనుక్కు,

ఆర్ అழల్ ఓమ్బుమ్ అన్దణన్ తోట్టమాగ, నిన్ మనత్తు వైత్తాయే  ll 1940

పావమ్ శెయ్ దేనుక్కు=పాపియైన నాయొక్క; పార్ కెழு పవ్వత్తు ఆర్ అముదు అనైయ పావయై = భూమండలమును చుట్టుకొనియున్న సముద్రమందుగల అపురూపమైన అమృతమువలె పరమభోగ్యమైన అందాలరాశి ఈ బాలికను; ఆర్ అழల్ ఓమ్బుమ్ అన్దణన్ తోట్టమాగ నిన్ మనత్తు వైత్తాయ్ =  నిత్యఅగ్నిహోత్రుడైన బ్రాహ్మణునియొక్కతోట వలె (అతనిచే సక్రమముగ చూడబడక నశించునట్లు) నీయొక్క మనస్సున నుంచుకొంటివి; (ఏలననగ)  నీర్ అழల్ వానాయ్ నెడునిలమ్ కాలాయ్ నిన్ఱ నిన్ నీర్మైయై నినైన్దో = జలము, అగ్ని,ఆకాశము,విశాలమైన భూమి, వాయువు మొదలగు పంచభూతములు నేనే యను గొప్పతనమును తలచుకొనియా!; శీర్ కెழு కోదై = శ్లాఘ్యమైన కుంతలములతో ఒప్పు కొప్పుగల ఈ బాలికకు;ఎన్ అలదు ఇలళ్ ఎన్ఱు = “నేను తప్ప వేరొకగతి లేదు” అని తలచి; అన్నదు ఓర్ తేర్ట్రన్మైదానో = ఆ ఒక దైర్యముచేతనా!నీవు ఉపేక్షించుచుంటివి!,

                  పాపియైన నాయొక్క, భూమండలమును చుట్టుకొనియున్న సముద్రమందుగల అపురూపమైన అమృతమువలె పరమభోగ్యమైన అందాలరాశి ఈ బాలికను, నిత్యఅగ్నిహోత్రుడైన బ్రాహ్మణునియొక్క తోట వలె (అతనిచే సక్రమముగ చూడబడక నశించునట్లు) నీయొక్క మనస్సున నుంచుకొంటివి (ఏలననగ) జలము, అగ్ని,ఆకాశము,విశాలమైన భూమి, వాయువు మొదలగు పంచభూతములు నేనే యను గొప్పతనమును తలచుకొనియా, శ్లాఘ్యమైన కుంతలములతో ఒప్పు కొప్పుగల ఈ బాలికకు “నేను తప్ప వేరొకగతి లేదు” అని తలచి ఆ ఒక దైర్యముచేతనా!నీవు ఉపేక్షించుచుంటివి!,

** వేట్టత్తై క్కరుదాదు అడియిణై వణఙ్గి, మెయ్ మ్మైనిన్ఱ ఎమ్బెరుమానై,

వాళ్ తిఱల్ తానై మఙ్గైయర్ తలైవన్, మానవేల్ కలియన్ వాయొలిగళ్, 

తోట్టలర్ పైన్దార్ చ్చుడర్ ముడియానై, ప్పழమొழிయాల్ పణిన్దురైత్త,

పాట్టివైపాడ ప్పత్తిమైపెరుగి, చ్చిత్తముమ్ తిరువొడు మిగుమే  ll 1941

వేట్టత్తై కరుదాదు = పైపైన పొంగివచ్చు కోరికలను తలచక; అడియిణై వణఙ్గి = తన పాదపద్మములనే సేవించగ; మెయ్ మ్మై నిన్ఱ =(అట్టివారికి)నిజముగ తన స్వరూపముతో ప్రత్యక్షమగువాడును; తోడు అలర్ పై తార్ శుడర్ ముడియానై=దళములతో వికసించిన పచ్చని(తులసి)మాలను, మిక్కిలి ప్రకాశించుచున్న కిరీటమున,కలవాడును;  ఎమ్బెరుమానై = అట్టి సర్వేశ్వరుని ఉద్దేశించి; వాళ్ తిఱల్ తానై = ఖడ్గములు ధరించిన శక్తివంతమైన సేనకలవారును;మఙ్గైయర్ తలైవన్= తిరుమంగై దేశవాసులకు ప్రభువును; మానవేల్ = గొప్పతనము కలిగిన శూలాయుధము ధరించిన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; వాయ్ ఒలిగళ్ = సూక్తులను; పழ మొழிయాల్ పణిన్దు ఉరైత్త = లోకోక్తులతో చేర్చి మిక్కిలి వినయముతో  అనుగ్రహించినట్టి; పాట్టు ఇవై పాడ = ఈ పాసురములను పాడినచో; శిత్తమ్ = వారి హృదయమున; పత్తిమై పెరుగి = పరమభక్తి వృద్ధిపొంది;  తిరువొడు మిగుమ్ = (సర్వేశ్వరుని చరణారవిందములందు నిత్యకైంకర్యమను) దివ్యమైన సంపద అభివృద్ధి పొందును! 

            పైపైన పొంగివచ్చు కోరికలను తలచక తన పాదపద్మములనే సేవించగ (అట్టివారికి)నిజముగ తన స్వరూపముతో ప్రత్యక్షమగువాడును,దళములతో వికసించిన పచ్చని(తులసి)మాలను, మిక్కిలి ప్రకాశించుచున్న కిరీటమున కలవాడును,అట్టి సర్వేశ్వరుని ఉద్దేశించి, ఖడ్గములు ధరించిన శక్తివంతమైన సేనకలవారును, తిరుమంగై దేశవాసులకు ప్రభువును, గొప్పతనము కలిగిన శూలాయుధము ధరించిన  తిరుమంగై ఆళ్వార్, సూక్తులను లోకోక్తులతో చేర్చి మిక్కిలి వినయముతో  అనుగ్రహించినట్టి ఈ పాసురములను పాడినచో,వారి హృదయమున పరమభక్తి వృద్ధిపొంది,(సర్వేశ్వరుని చరణారవిందములందు నిత్యకైంకర్యమను) దివ్యమైన సంపద అభివృద్ధి పొందును! 

*********

వ్యాఖ్యానించండి