శ్రీః
7 .నీణాగమ్
(కోయిల్ తిరుమొழி)
***********
సర్వేశ్వరుని కైంకర్యసేవలందు ఉపయోగించలేనిది ఏదైనను అనర్ధమేయని తిరుమంగై ఆళ్వార్ వక్కాణించుచున్నారు.
** నీణాగమ్ శుర్ట్రి, నెడువరై నట్టు, ఆழ் కడలై
ప్పేణాన్ కడైన్దు, అముదమ్ కొణ్డుగన్ద పెమ్మానై,
పూణారమార్వనై, ప్పుళ్ళూరుమ్ పొన్ మలైయై,
కాణాదార్ కణ్ణెన్ఱుమ్, కణ్ణల్ల కణ్డామే ll 2012
నీళ్ నాగమ్ శుర్ట్రి = పొడవైన వాసుకియను సర్పమును (చిలుకుటకు తాడుగ) చుట్టి; నెడు వరై నట్టు = పెద్ద (మంధర) పర్వతమును (కవ్వముగ) స్ధాపించి; ఆழ் కడలై = అగాధమైన పాలసముద్రమును; పేణాన్ = (తాను పవళించియుండు పాలసముద్రము చిలుక బడుచున్నదని)ఎంతమాత్రము తలచక; కడైన్దు = చిలికి; అముదమ్ = అమృతమును; కొణ్డు = (దేవతలకు) తీసిచ్చి; ఉగన్ద = ఆనందించిన; పెమ్మానై = స్వామియును; ఆరమ్ పూణ్ మార్వనై=హారములచే అలంకరింపబడిన వక్షస్థలము కలిగిన; పుళ్ ఊరుమ్ = గరుడాళ్వార్ పై వేంచేయుచుండు; పొన్ మలైయై = బంగారు కొండ ఆ సర్వేశ్వరుని; కాణాదార్ = సేవింపలేనివారియొక్క; కణ్ ఎన్ఱుమ్ = కన్నులు ఎల్లప్పుడును; కణ్ అల్ల = కన్నులే కాదని; కణ్డామ్ = (ప్రహ్లాదుడు మొదలగు భక్తుల వలన) తెలుసు కొంటిమిగదా!
పొడవైన వాసుకియను సర్పమును (చిలుకుటకు తాడుగ)చుట్టి పెద్ద (మంధర) పర్వతమును (కవ్వముగ) స్ధాపించి అగాధమైన పాలసముద్రమును (తాను పవళించి యుండు పాలసముద్రము చిలుకబడుచున్నదని) ఎంతమాత్రము తలచక చిలికి అమృతమును (దేవతలకు) తీసి ఇచ్చి ఆనందించిన స్వామియును, హారములచే అలంకరింపబడిన వక్షస్థలము కలిగిన గరుడాళ్వార్ పై వేంచేయుచుండు బంగారు కొండ ఆ సర్వేశ్వరుని సేవింపలేనివారియొక్క కన్నులు ఎల్లప్పుడును కన్నులే కాదని (ప్రహ్లాదుడు మొదలగు భక్తులవలన) తెలుసు కొంటిమిగదా!
నీళ్వాన్ కుఱళురువాయ్, నిన్ఱు ఇరన్దు మావలి మణ్
తాళాల్ అళవిట్ట, తక్కణైక్కు మిక్కానై,
తోళాద మామణియై, తొణ్డర్కినియానై,
కేళా చ్చెవిగళ్, శెవియల్ల కేట్టామే ll 2013
నీళ్ వాన్ = పొడవుగ పెరుగుటకై; కుఱళ్ ఉరువాయ్ = వామన రూపముదాల్చి;నిన్ఱు = యఙ్ఞశాలకువచ్చి నిలబడి; మావలి మణ్ ఇరన్దు=మహాబలిని(మూడడుగుల) భూమిని యాచించి; తాళాల్=తన దివ్యమైన పాదముతొ;అళవు ఇట్ట=సర్వలోకములను కొలిచిన; తక్కణైక్కు మిక్కానై = అగ్రతాంబూలము పొందుటకు శ్లాఘ్యమైన వాడును; తోళాద మా మణియై = ఛిద్రింపబడి ప్రకాశము నశించని శ్లాఘ్యమైన నీలమణివంటి వాడును; తొణ్డర్కు ఇనియానై = భక్తజనులకు మిక్కిలి భోగ్యముగనుండువాడైన సర్వేశ్వరుని గొప్పతనమును; కేళా శెవిగళ్ = వినని చెవులు; శెవి అల్ల=చెవులే కాదని, కేట్టామే = (ఇది మనము మహానుభావుల నుండి) వినియుంటిమి కదా!
పొడవుగ పెరుగుటకై వామన రూపముదాల్చి యఙ్ఞశాలకువచ్చి నిలబడి మహాబలిని (మూడడుగుల) భూమిని యాచించి తన దివ్యమైన పాదముతొ సర్వలోకములను కొలిచినవాడును,అగ్రతాంబూలము పొందుటకు శ్లాఘ్యమైన వాడును, ఛిద్రింపబడి ప్రకాశము నశించని శ్లాఘ్యమైన నీలమణివంటి వాడును, భక్తజనులకు మిక్కిలి భోగ్యముగనుండువాడైన సర్వేశ్వరుని గొప్పతనమును వినని చెవులు,చెవులే కాదని (ఇది మనము మహానుభావుల నుండి) వినియుంటిమి కదా!
తూయానై, తూయమఱైయానై, తెన్ ఆలి
మేయానై, మేవాళుయిరుణ్డముదుణ్డ
వాయానై, మాలై వణఙ్గి, అవన్ పెరుమై
పేశాదార్, పేచ్చెన్ఱుమ్, పేచ్చల్లకేట్టామే ll 2014
తూయానై = పరమపవిత్రుడును; తూయ మఱైయానై = పరిశుద్ధమైన వేదములచే ప్రతిపాదింప బడువాడును; తెన్ ఆలి మేయానై = అందమైన తిరువాలి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడును;మేవాళ్ ఉయిర్ ఉణ్డు అముదమ్ ఉణ్డ వాయానై= రక్కసి పూతనయొక్క ప్రాణములను పీల్చి ( రాసుకొనిన విషమునుగాక) స్తనమందలి పాలమృతమును గ్రోలిన నోరుగలవాడైన; మాలై వణఙ్గి = సర్వేశ్వరుని పాదములను సేవించి; అవన్ పెరుమై పేశాదార్=ఆ సర్వేశ్వరునియొక్క గొప్పతనమును పలుకనివారి;పేచ్చు ఎన్ఱుమ్ = పలుకులు ఎల్లప్పుడును; పేచ్చు అల్ల = పలుకులే కావు; కేట్టామే = (ఇది మనము మహానుభావుల నుండి) వినియుంటిమి కదా!
పరమపవిత్రుడును, పరిశుద్ధమైన వేదములచే ప్రతిపాదింప బడువాడును, అందమైన తిరువాలి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్నవాడును, రక్కసి పూతన యొక్క ప్రాణములను పీల్చి ( రాసుకొనిన విషమునుగాక) స్తనమందలి పాలమృతమును గ్రోలిన నోరుగలవాడైన, సర్వేశ్వరుని పాదములను సేవించి, ఆ సర్వేశ్వరునియొక్క గొప్పతనమును పలుకనివారి,పలుకులు ఎల్లప్పుడును పలుకులే కావు.(ఇది మనము మహానుభావుల నుండి) వినియుంటిమి కదా!
కూడా ఇరణియనై, క్కూరుగిరాల్ మార్వడన్ద,
ఓడా అడల్ అరియై, ఉమ్బరార్ కోమానై
తోడార్ నఱన్దుழாయ్, మార్వనై ఆర్వత్తాల్,
పాడాదార్ పాట్టెన్ఱుమ్, పాట్టల్ల కేట్టామే ll 2015
కూడా ఇరణియనై = శత్రువైన హిరణ్యాసురునియొక్క; మార్వు = వక్షస్థలమును; కూర్ ఉగిరాల్ = వాడియైన నఖములచే;ఇడన్ద=చీల్చి వధించిన;ఓడా=ఆ హిరణ్యాసురునికి వెనుతిరగని; అడల్= భయంకరమైన; అరియై=నరసింహరూపమునుదాల్చిన వాడును; ఉమ్బరార్ కోమానై = నిత్యశూరులయొక్క ప్రభువును; తోడు ఆర్ నఱు తుழாయ్ మార్వనై = దళములతో నిండిన పరిమళభరితమైన తులసీమాలతో ఒప్పు వక్షస్థలము కలిగిన సర్వేశ్వరుని; ఆర్వత్తాల్ = మిక్కిలి ప్రీతితో; పాడాదార్ = పాడనివారియొక్క; పాట్టు ఎన్ఱుమ్ = ఆ పాటలు ఎల్లప్పుడును; పాట్టు అల్ల = పాటలే కావు; కేట్టామే = (ఇది మనము మహానుభావుల నుండి) వినియుంటిమి కదా!
శత్రువైన హిరణ్యాసురునియొక్క వక్షస్థలమును వాడియైన నఖములచే చీల్చి వధించిన, ఆ హిరణ్యాసురునికి వెనుతిరగని భయంకరమైన నరసింహరూపమునుదాల్చిన వాడును, నిత్యశూరులయొక్క ప్రభువును, దళములతో నిండిన పరిమళభరితమైన తులసీమాలతో ఒప్పు వక్షస్థలము కలిగిన సర్వేశ్వరుని మిక్కిలి ప్రీతితో పాడనివారియొక్క ఆ పాటలు ఎల్లప్పుడును పాటలే కావు.(ఇది మనము మహానుభావుల నుండి) వినియుంటిమి కదా!
మైయార్ కడలుమ్, మణివరైయుమ్ మాముగిలుమ్,
కొయ్యార్ కువళైయుమ్, కాయావుమ్ పోన్ఱిరుణ్డ,
మెయ్యానై, మెయ్యమలైయానై, చ్చఙ్గేన్దుమ్
కైయానై, కైత్తొழா, క్కైయల్ల కణ్డామే ll 2016
మై ఆర్ కడలుమ్ = కాటుకవలె నల్లని సముద్రమును;మణివరైయుమ్ = నీలమణులతో నిండిన పర్వతమును; మా ముగిలుమ్ = కాళమేఘమును; కొయ్ ఆర్ కువళైయుమ్ = కోయవలెనని ఆశించెడి నీలోత్పలమును; కాయావుమ్ = రెల్లు పూవును;పోన్ఱు = ఒప్పు; ఇరుణ్డ = నల్లని; మెయ్యానై = తిరుమేని కలవాడును; మెయ్యమ్ మలైయానై = తిరు మెయ్యమ్ దివ్యదేశమున వేంచేసియున్నవాడును; శఙ్గు ఏన్దుమ్ కైయానై = శంఖమును ధరించిన హస్తముగల సర్వేశ్వరునికి; తొழா కై = అంజలి ఘటించని చేతులు; కై అల్ల = చేతులే కావు; కణ్డామే = (ఇది మనము మహానుభావుల నుండి) తెలుసుకొంటిమి కదా!
కాటుకవలె నల్లని సముద్రమును, నీలమణులతో నిండిన పర్వతమును, కాళమేఘమును, కోయవలెనని ఆశించెడి నీలోత్పలమును,రెల్లుపూవును ఒప్పు నల్లని తిరుమేని కలవాడును, తిరు మెయ్యమ్ దివ్యదేశమున వేంచేసియున్న వాడును, శంఖమును ధరించిన హస్తముగల సర్వేశ్వరునికి అంజలిఘటించని చేతులు చేతులే కావు. (ఇది మనము మహానుభావుల నుండి) తెలుసుకొంటిమి కదా!
కళ్ళార్ తుழாయుమ్, కణవళరుమ్ కూవిళైయుమ్,
ముళ్ళార్ ముళరియుమ్, ఆమ్బలుమున్ కణ్డక్కాల్,
పుళ్ళాయ్ ఓరేనమాయ్, ప్పుక్కిడన్దాన్ పొన్నడికెన్ఱు,
ఉళ్ళాదార్ ఉళ్ళత్తై, ఉళ్ళమా క్కొళ్ళోమే ll 2017
కళ్ ఆర్ తుழாయుమ్ = తేనెలతోనిండిన తులసియును;కణ వళరుమ్=ఎర్రగన్నేరును; కూవిళైయుమ్ = బిల్వపత్రములను; ముళ్ ఆర్ ముళరియుమ్ = ముళ్ళతో నిండిన తామర పుష్పములను; ఆమ్బలుమ్=నల్లకలువలను;మున్=మన కన్నెదుట;కణ్డక్కాల్=చూచినచో; (ఇవన్నియు) పుళ్ ఆయ్ ఓర్ ఏనమాయ్ పుక్కు ఇడన్దాన్ పొన్నడికి ఎన్ఱు=హంసరూపియై వేదశాస్త్రములను ఒసగియు, వరాహరూపముదాల్చి భూమిని అండభిత్తి నుండి పెగళించి ఉద్దరించిన సర్వేశ్వరునియొక్క అందమైన చరణారవిందములకని; ఉళ్ళాదార్ = తమ హృదయమున తలచని వారియొక్క; ఉళ్ళత్తై = మనస్సును; ఉళ్ళమ్ ఆ కొళ్ళోమే = ఒక మనస్సని తలచలేము కదా!
తేనెలతోనిండిన తులసియును,ఎర్రగన్నేరును,బిల్వపత్రములను, ముళ్ళతో నిండిన తామర పుష్పములను,నల్లకలువలను,మన కన్నెదుట చూచినచో (ఇవన్నియు) హంసరూపియై వేదశాస్త్రములను ఒసగియు,వరాహరూపముదాల్చి భూమిని అండభిత్తి నుండి పెగళించి ఉద్దరించిన సర్వేశ్వరునియొక్క అందమైన చరణారవిందములకని తమ హృదయమున తలచని వారియొక్క మనస్సును, ఒక మనస్సని తలచలేము కదా!
కనైయార్ కడలుమ్, కడువిళైయుమ్ కాయావుమ్
అనైయానై, అన్బినాల్ ఆర్వత్తాల్, ఎన్ఱుమ్
శునైయార్ మలరిట్టు, త్తొణ్డరాయ్ నిన్ఱు,
నినై యాదార్ నెఞ్జెన్ఱుమ్, నెఞ్జల్ల కణ్డామే ll 2018
కనై ఆర్ కడలుమ్ = ఘోషించుచున్న మహా సముద్రమును;కడువిళైయుమ్= “కరువిళై” పుష్పమును; కాయావుమ్ = రెల్లు పుష్పమును; అనైయానై= ఒప్పు సర్వేశ్వరుని; అన్బినాల్ ఆర్వత్తాల్ = ప్రేమతో హృదయపూర్వకముగ; శునై ఆర్ మలర్ ఇట్టు = తటాకములో నిండియున్న పుష్పములను తీసుకొనివచ్చి సమర్పించి; తొణ్డర్ ఆయ్ నిన్ఱు = పరమభక్తులై యుండుటను;ఎన్ఱుమ్ = ఏనాడును; నినై యాదార్ = తలచని వారియొక్క; నెఞ్జు ఎన్ఱుమ్ = మనస్సు ఎల్లప్పుడును; నెఞ్జు అల్ల = మనసే కాదు; కణ్డామే = (ఇది మనము మహానుభావుల నుండి) తెలుసుకొంటిమి కదా!
ఘోషించుచున్న మహా సముద్రమును “కరువిళై” పుష్పముమును, రెల్లు పుష్పమును ఒప్పు సర్వేశ్వరుని, ప్రేమతో హృదయపూర్వకముగ తటాకములో నిండియున్న పుష్పములను తీసుకొనివచ్చి సమర్పించి, పరమభక్తులై యుండుటను ఏనాడును తలచనివారియొక్క మనస్సు ఎల్లప్పుడును, మనసే కాదు.(ఇది మనము మహానుభావుల నుండి) తెలుసుకొంటిమి కదా!
వెఱియార్ కరఙ్గూన్దల్, ఆయ్ చ్చియర్ వైత్త,
ఉఱియార్ నఱువెణ్ణైయ్, తానుగన్దుణ్డ
శిఱియానై, శెఙ్గణ్ నెడియానై, చ్చిన్దిత్తు
అఱియాదార్, ఎన్ఱు మఱియాదార్ కణ్డామే ll 2019
వెఱి ఆర్ = పరిమళభరితమైన; కరు కూన్దల్ = నల్లని కుంతలములుగల;ఆయ్ చ్చియర్ వైత్త = గోపకాంత యశోదాదేవిచే భద్రముగ ఉంచిన; ఉఱి ఆర్ = ఉట్లయందు గల; నఱు వెణ్ణైయ్ = పరిమళభరితమైన వెన్నను; తాన్ ఉగన్దు ఉణ్డ = తాను ఆశించి ఆరగించిన; శిఱియానై=చిన్న బాలుడైన;శెమ్ కణ్=ఎర్రని నేత్రములుగల; నెడియానై=సర్వేశ్వరుని; శిన్దిత్తు అఱియాదార్ = తమ హృదయముతో తలచుటకు తెలియనివారు; ఎన్ఱుమ్ = ఎల్లప్పుడును; అఱియాదార్ = అవివేకులేయగుదురు; కణ్డామే = (ఇది మనము మహానుభావుల నుండి) తెలుసుకొంటిమి కదా!
పరిమళభరితమైన నల్లని కుంతలములుగల గోపకాంత యశోదాదేవిచే భద్రముగ ఉంచిన,ఉట్లయందు గల పరిమళభరితమైన వెన్నను తాను ఆశించి ఆరగించిన చిన్న బాలుడైన, ఎర్రని నేత్రములుగల సర్వేశ్వరుని తమ హృదయముతో తలచుటకు తెలియనివారు ఎల్లప్పుడును అవివేకులేయగుదురు. (ఇది మనము మహానుభావుల నుండి) తెలుసుకొంటిమి కదా!
తేనొడు వణ్డాలుమ్, తిరుమాలిరుఞ్జోలై,
తాన్ ఇడమా క్కొణ్డాన్, తడమలర్ క్కణ్ణిక్కాయ్,
ఆన్ విడై యేழన్ఱడర్తాఱ్కు, ఆళానారల్లాదార్,
మానిడవరెల్లరెన్ఱు, ఎన్ మనత్తే వైత్తేనే ll 2020
వణ్డు=భ్రమరములు; తేనొడు=నోటియందు తేనెతో; ఆలుమ్=ఝంకారము చేయుచుండెడి; తిరుమాలిరుఞ్జోలై = తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును; తాన్ ఇడమా కొణ్డాన్ = తాను నివాసస్థలముగ గ్రహించినవాడును ; అన్ఱు=మునుపొకకాలమున; తడ మలర్ కణ్ణిక్కాయ్= విశాలమైన నీలోత్పముల పుష్పములవంటి నేత్రములుగల నప్పిన్నైపిరాట్టి కొరకు; ఆన్ విడై ఏழ் = వృషభములు ఏడింటిని; అడర్తాఱ్కు = అణచి వధించిన సర్వేశ్వరునికి; ఆళ్ ఆనార్ అల్లాదార్ = దాసులైనవారు కాక మిగలినవారు; మానిడవర్ అల్లర్ ఎన్ఱు = మనుష్యకోటిలో చేరినవారు కారని; ఎన్ మనత్తే వైత్తేన్ = నా మనస్సులో దృఢముగ స్ధాపించుకొంటిని!
భ్రమరములు నోటియందు తేనెతో ఝంకారము చేయుచుండెడి తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమును తాను నివాసస్థలముగ గ్రహించినవాడును, మునుపొక కాలమున విశాలమైన నీలోత్పముల పుష్పములవంటి నేత్రములుగల నప్పిన్నైపిరాట్టి కొరకు వృషభములు ఏడింటిని అణచి వధించిన సర్వేశ్వరునికి దాసులైనవారు కాక మిగలినవారు మనుష్యకోటిలో చేరినవారు కారని నా మనస్సులో దృఢముగ స్ధాపించుకొంటిని!
** మెయ్ నిన్ఱ పావమగల, తిరుమాలై
కైనిన్ఱ ఆழிయాన్, శూழுమ్ కழల్ శూడి,
కైనిన్ఱవేల్ కై, క్కలియనొలిమాలై,
ఐయొన్ఱుమైన్దుమ్,ఇవై పాడి ఆడుమినే ll 2021
మెయ్ నిన్ఱ = తప్పక అనుభవింపవలసి యుండిన; పావమ్ అగల = పాపములు నశింప జేయుటకై; కై నిన్ఱ ఆழிయాన్=హస్తమునందు ఒప్పు సుదర్శనచక్రము కలిగిన; తిరుమాలై = శ్రీదేవి వల్లభునియొక్క; శూழுమ్ కழల్ = సర్వవ్యాపియైన పాదములను; శూడి = శిరస్సున ధరించి; కై నిన్ఱ వేల్ కై = హస్తమున నుండు శూలాయుధమును ప్రయోగించు సమర్ధతతొ ఒప్పు చేతులుగల;కలయన్=తిరుమంగై ఆళ్వార్; ఒలి మాలై = అనుగ్రహించిన సూక్తులమాలైన; ఐ ఒన్ఱుమ్ ఐన్దుమ్ ఇవై = ఈ పదిపాసురములను; పాడి = నోరారపాడి; ఆడుమినే = నృత్యము చేయుడు!
తప్పక అనుభవింపవలసి యుండిన పాపములు నశింపజేయుటకై హస్తమునందు ఒప్పు సుదర్శనచక్రము కలిగిన శ్రీదేవి వల్లభునియొక్క సర్వవ్యాపియైన పాదములను శిరస్సున ధరించి, హస్తమున నుండు శూలాయుధమును ప్రయోగించు సమర్ధతతొ ఒప్పు చేతులుగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన సూక్తులమాలైన ఈ పదిపాసురములను నోరారపాడి నృత్యము చేయుడు!
*******