శ్రీః
6. శిఙ్గమదాయ్
తిరు అழுన్దూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న ఆమరువియప్పన్ పెరుమాళ్ ను తిరుమంగై ఆళ్వార్ సేవించుకొనుచున్నారు.
** శిఙ్గమదాయ్ అవుణన్, తిఱలాగమ్ మున్ కీణ్డుగన్ద,
శఙ్గమ్ ఇడత్తానై, త్తழల్ ఆழி వలత్తానై,
శెఙ్గమలత్తు ఆయననైయార్, తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ,
అఙ్గమల క్కణ్ణనై, అడియేన్ కణ్డుకొణ్డేనే ll 1598
మున్ = మునుపొకకాలమున; శిఙ్గమ్ అదు ఆయ్ = నరసింహరూపమునుదాల్చి; అవుణన్ = అసురుడు హిరణ్యాసురుని యొక్క; తిఱల్ ఆగమ్ = బలిష్టమైన వక్షస్థలమును; కీణ్డు ఉగన్ద = చీల్చి సంతోషించిన;శఙ్గమ్ ఇడత్తానై=శంఖము ఎడమ హస్తమున కలవాడును; తழల్ ఆழி వలత్తానై = తీక్షణమైన సుదర్శనచక్రము కుడి హస్తమున కలవాడును; శెమ్ కమలత్తు ఆయన్ అనైయార్= (నాభియందు) ఎర్రని కమలమున జనించిన బ్రహ్మవంటి బ్రాహ్మణోత్తములు నివసించుచున్న;తెన్ అழுన్దియిల్ మన్ని నిన్ఱ=అందమైన తిరు అழுన్దూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న;అమ్ కమల కణ్ణనై = సుందరమైన తామర పుష్పమువంటి నేత్రములుగల ఆమరువియప్పన్ పెరుమాళ్ ను; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను సేవించుకొంటిని!.
మునుపొకకాలమున నరసింహరూపమునుదాల్చి అసురుడు హిరణ్యాసురుని యొక్క బలిష్టమైన వక్షస్థలమును చీల్చి సంతోషించిన, శంఖము ఎడమ హస్తమున కలవాడును,తీక్షణమైన సుదర్శనచక్రము కుడి హస్తమున కలవాడును,(నాభియందు) ఎర్రని కమలమున జనించిన బ్రహ్మవంటి బ్రాహ్మణోత్తములు నివసించుచున్న అందమైన తిరు అழுన్దూర్ దివ్యదేశమున, నిత్యవాసము చేయుచున్న సుందరమైన తామర పుష్పమువంటి నేత్రములుగల ఆమరువియప్పన్ పెరుమాళ్ ను, దాసుడైన నేను సేవించుకొంటిని!.
కోవానార్ మడియ, క్కొలైయార్ మழுక్కొణ్డు అరుళుమ్,
మూవా వానవనై, ముழுనీర్ వణ్ణనై, అడియార్కు
ఆవావెన్ఱిరఙ్గి, తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ,
దేవాదిదేవనై, యాన్ కణ్డుకొణ్డు తిళైత్తేనే ll 1599
కో ఆనార్ = (దుర్మార్గులైన)క్షత్రీయ రాజులందరు;మడియ=మరణించునట్లు;కొలై ఆర్ మழு కొణ్డు అరుళుమ్ = వధించగల శక్తివంతమైన గండ్రగొడ్డలి తన హస్తమున ధరించినవాడును; మూవా వానవనై = ముసలితనము మొదలగు వికారములు లేని దేవాదిదేవుడును; ముழுనీర్ వణ్ణనై=సముద్రమువంటి వర్ణము కలవాడును; అడియార్కుఆవా ఎన్ఱు ఇరఙ్గి = ఆశ్రితుల విషయమున “అయ్యో” అని కరుణతో;తెన్ అழுన్దియిల్ మన్ని నిన్ఱ=అందమైన తిరు అழுన్దూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న,దేవాదిదేవనై = సర్వేశ్వరుడైన ఆమరువియప్పన్ పెరుమాళ్ ను,యాన్ కణ్డుకొణ్డు దాసుడైన నేను సేవించుకొని; తిళైత్తేనే = మహదానందమును పొందితిని!.
దుర్మార్గులైన క్షత్రీయ రాజులందరు మరణించునట్లు వధించగల శక్తివంతమైన గండ్రగొడ్డలి తన హస్తమున ధరించినవాడును,ముసలితనము మొదలగు వికారములు లేని దేవాదిదేవుడును,సముద్రమువంటి వర్ణము కలవాడును, ఆశ్రితుల విషయమున “అయ్యో” అని కరుణతో అందమైన తిరు అழுన్దూర్ దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుడైన ఆమరువియప్పన్ పెరుమాళ్ ను దాసుడైన నేను సేవించుకొని మహదానందమును పొందితిని!.
ఉడైయానై, ఒలినీరులగఙ్గళ్ పడైత్తానై,
విడైయానోడ అన్ఱు, విఱలాழிవిశైత్తానై,
అడైయార్ తెన్నిలఙ్గై అழிత్తానై, అణి యழுన్దూర్
ఉడైయానై, అడియేన్ అడైన్దు ఉయ్ న్దుపోనేనే ll 1600
ఉడైయానై = సర్వమునకు స్వామియు; ఒలి నీర్ ఉలగఙ్గళ్ పడైత్తానై=అలలుకొట్టుచున్న సముద్రములచే చుట్టుకొనియున్న లోకములను సృష్టించినవాడును; అన్ఱు = భాణాసురునితో సంభవించిన యుద్ధములో; విడైయాన్ ఓడ = శివుడు ఓడి పారిపోవునట్లు; విఱల్ ఆழி విశైత్తానై=శక్తివంతమైన సుదర్శనచక్రమును అతివేగముగ ప్రయోగించిన వాడును; అడైయార్ తెన్ ఇలఙ్గై అழிత్తానై = శత్రువులతో నిండియున్న దక్షణదిక్కునగల లంకాపురిని నాశనముచేసినవాడును; అణి యழுన్దూర్ ఉడైయానై=అందమైన తిరు అழுన్దూర్ దివ్యదేశమునకు స్వామియైన ఆమరువియప్పన్ పెరుమాళ్ దివ్య చరణములను; అడియేన్ అడైన్దు = దాసుడైన నేను ఆశ్రయించి;ఉయ్ న్దుపోనేన్ = ఉజ్జీవింపబడితిని!
సర్వమునకు స్వామియు,అలలుకొట్టుచున్న సముద్రముచే చుట్టుకొనియున్న లోకములను సృష్టించినవాడును,భాణాసురునితో సంభవించిన యుద్ధములో శివుడు ఓడి పారిపోవునట్లు శక్తివంతమైన సుదర్శనచక్రమును అతివేగముగ ప్రయోగించిన వాడును, శత్రువులతో నిండియున్న దక్షణదిక్కునగల లంకాపురిని నాశనము చేసిన వాడును, అందమైన తిరు అழுన్దూర్ దివ్యదేశమునకు స్వామియైన ఆమరువియప్పన్ పెరుమాళ్ దివ్య చరణములను దాసుడైన నేను ఆశ్రయించి ఉజ్జీవింపబడితిని.
కున్ఱాల్ మారితడుత్తవనై, కులవేழమన్ఱు
పొన్ఱామై, అదనుక్కరుళ్ శెయ్ ద పోరేర్ట్రై,
అన్ఱు ఆవిన్ నఱునెయ్ అమర్ న్దు ఉణ్ణ, అణి అழுన్దూర్
నిన్ఱానై, అడియేన్ కణ్డుకొణ్డు నిఱైన్దేనే ll 1601
కున్ఱాల్ మారి తడుత్తవనై = గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి పెద్ద వర్షమును అడ్డగించిన వాడును;కుల వేழమ్=శ్లాఘ్యమైన కులమున జన్మించిన గజేంద్రుడు;అన్ఱు= మొసలి కోరలలో చిక్కి వ్యధ పొందిన సమయమున; పొన్ఱామై = మరణము పొందనీయక; అదనుక్కు అరుళ్ శెయ్ ద=దానికి కృపజేసిన స్వామి;పోర్ ఏర్ట్రై=పోరు సలుపుటలో వృషభమువంటి వాడును; అన్ఱు = కృష్ణావతారమందు; ఆవిన్ నఱునెయ్ అమర్ న్దు ఉణ్ణ = సువాసన కలిగిన ఆవు నెయ్యిని బాల్యావస్థయందు (బాల్యలీలలు సలిపి) ఆస్వాదించినవాడును; అణి అழுన్దూర్ నిన్ఱానై = అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న ఆమరువియప్పన్ పెరుమాళ్ ను; అడియేన్ కణ్డుకొణ్డు నిఱైన్దేన్ = దాసుడైన నేను సేవించుకొని ఎటువంటి కొరత లేనివాడనైతిని!
గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి పెద్ద వర్షమును అడ్డగించినవాడును, శ్లాఘ్యమైన కులమున జన్మించిన గజేంద్రుడు మొసలి కోరలలో చిక్కి వ్యధ పొందిన సమయమున, మరణము పొందనీయక దానికి కృపజేసిన స్వామి,పోరు సలుపుటలో వృషభము వంటి వాడును, కృష్ణావతారమందు సువాసన కలిగిన ఆవు నెయ్యిని బాల్యావస్థయందు (బాల్యలీలలు సలిపి) ఆస్వాదించినవాడును, అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న ఆమరువియప్పన్ పెరుమాళ్ ను దాసుడైన నేను సేవించుకొని ఎటువంటి కొరత లేనివాడనైతిని!
కఞ్జనై క్కాయ్ న్దానై, క్కణ్ణమఙ్గైయుళ్ నిన్ఱానై
వఞ్జన పేయ్ ములైయూడు, ఉయిర్ వాయ్ మడత్తు ఉణ్డానై,
శెఞ్జొల్ నాన్మఱైయోర్, తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ,
అఞ్జన క్కున్ఱన్దన్నై, అడియేన్ కణ్డుకొణ్డేనే ll 1602
కఞ్జనై కాయ్ న్దానై = కంసునిపై కోపగించి వధించినవాడును;కణ్ణమఙ్గైయుళ్ నిన్ఱానై=తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో వేంచేసినవాడును; వఞ్జనమ్=వంచనచేయు స్వభావముగల;పేయ్=రక్కసి పూతనయొక్క;ములై ఊడు= స్తనముల ద్వారా;వాయ్ మడత్తు=తన నోటితో;ఉయిర్ ఉణ్డానై= ఆమె ప్రాణములను హరించినవాడును; శెమ్ శొల్ నాల్ మఱైయోర్ = అందమైన సూక్తులుగల నాలుగు వేదములయందు ప్రావీణులైన బ్రాహ్మణోత్తములు నివసించుచున్న; తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ = అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న; అఞ్జన క్కున్ఱన్ తన్నై = కాటుకవలె నల్లని పర్వతమువంటి ఆమరువియప్పన్ పెరుమాళ్ ను; అడియేన్ కణ్డుకొణ్డేనే = దాసుడైన నేను సేవించుకొంటిని!.
కంసునిపై కోపగించి వధించినవాడును,తిరు కణ్ణమఙ్గై దివ్యదేశమున నిలిచియున్న తిరుక్కోలములో వేంచేసినవాడును,వంచనచేయు స్వభావముగల రక్కసి పూతనయొక్క స్తనముల ద్వారా తన నోటితో ఆమె ప్రాణములను హరించినవాడును, అందమైన సూక్తులుగల నాలుగు వేదములయందు ప్రావీణులైన బ్రాహ్మణోత్తములు నివసించుచున్న, అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న కాటుకవలె నల్లని పర్వతమువంటి ఆమరువియప్పన్ పెరుమాళ్ ను దాసుడైన నేను సేవించుకొంటిని!.
పెరియానై, అమరర్ తలైవఱ్కుమ్ పిరమనుక్కుమ్,
ఉరియానై ఉకన్దానవనుక్కుమ్, ఉణర్వదనుక్కు
అరియానై, అழுన్దూర్ మఱైయోర్ గళ్, అడిపణియుమ్
కరియానై, అడియేన్ కణ్డుకొణ్డు కళిత్తేనే ll 1603
పెరియానై=అద్వితీయుడైన సర్వేశ్వరుడును;అమరర్ తలైవఱ్కుమ్=దేవతల ప్రభువైన ఇంద్రునకును; పిరమనుక్కుమ్=చతుర్ముఖ బ్రహ్మకును;యానై ఉరి ఉకన్దానవనుక్కుమ్= ఏనుగుయొక్క చర్మమును సంతోషముతో ధరించియున్న శివునికిని; ఉణర్వదనుక్కు అరియానై = తెలుసుకొనుటకు అశక్యుడును; అழுన్దూర్=తిరు అழுన్దూర్ లో వసించు; మఱైయోర్ గళ్ = వేదపండితులు; అడిపణియుమ్ కరియానై = సేవించుచుండు దివ్య చరణములుగల నల్లని ఏనుగువంటి ఆమరువియప్పన్ పెరుమాళ్ ను; అడియేన్ కణ్డుకొణ్డు కళిత్తేనే = దాసుడైన నేను సేవించుకొని మహదానందమును పొందితిని! .
అద్వితీయుడైన సర్వేశ్వరుడును,దేవతల ప్రభువైన ఇంద్రునకును, చతుర్ముఖ బ్రహ్మకును,ఏనుగుయొక్క చర్మమును సంతోషముతో ధరించియున్న శివునికిని, తెలుసుకొనుటకు అశక్యుడును, తిరు అழுన్దూర్ లో వసించు వేదపండితులు సేవించుచుండు దివ్య చరణములుగల నల్లని ఏనుగువంటి ఆమరువియప్పన్ పెరుమాళ్ ను, దాసుడైన నేను సేవించుకొని మహదానందమును పొందితిని!
తిరువాழ் మార్వన్ తన్నై, తిశైమణ్ నీర్ ఎరిముదలా,
ఉరువాయ్ నిన్ఱవనై, ఒలిశేరుమ్ మారుదత్తై,
అరువాయ్ నిన్ఱవనై, తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ,
కరువార్ కఱ్పకత్తై, క్కణ్డుకొణ్డు కళిత్తేనే ll 1604
తిరు వాழ் మార్వన్ తన్నై = శ్రీమహాలక్ష్మి నిత్యవాసముచేయుచున్న వక్షస్థలము కలవాడును; తిశై మణ్ నీర్ ఎరి ముదలా ఉరువాయ్ నిన్ఱవనై = దిక్కులు,భూమి, జలము,అగ్ని మొదలైన పదార్దములుగ నిలిచియున్నవాడును; ఒలిశేరుమ్ మారుదత్తై= శబ్ధముయొక్క గుణముగల వాయువునకు నిర్వాహకుడును; అరువాయ్ నిన్ఱవనై = అంతర్యామిగ నుండువాడును; తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ = అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న;కరు ఆర్ కఱ్పకత్తై =మిక్కిలి మహిమాన్వితమైన కల్పవృక్షమువంటి ఆమరువియప్పన్ పెరుమాళ్ ను; కణ్డుకొణ్డు కళిత్తేనే = దాసుడైన నేను సేవించుకొని మహదానందమును పొందితిని!
శ్రీమహాలక్ష్మి నిత్యవాసముచేయుచున్న వక్షస్థలము కలవాడును, దిక్కులు, భూమి,జలము,అగ్ని మొదలైన పదార్దములుగ నిలిచియున్నవాడును, శబ్ధముయొక్క గుణముగల వాయువునకు నిర్వాహకుడును, అంతర్యామిగ నుండువాడును,అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్నమిక్కిలి మహిమాన్వితమైన కల్పవృక్షమువంటి ఆమరువియప్పన్ పెరుమాళ్ ను, దాసుడైన నేను సేవించుకొని మహదానందమును పొందితిని!.
నిలైయాళాక, ఎన్నై యుకన్దానై, నిలమగళ్ తన్
ములై ఆళ్విత్తకనై, ముదునాన్మఱై వీదిదొఱుమ్,
అలైయారుఙ్గడల్ పోల్ ముழఙ్గుమ్, తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ,
కలైయార్ శొఱ్పొరుళై, క్కణ్డుకొణ్డు కళిత్తేనే ll 1605
ఎన్నై నిలై ఆళ్ ఆగ = నన్ను శాశ్వతమైన దాసునిగ; ఉకన్దానై = సంతోషముతో తన దివ్య హృదయమున ఎంచుకొనినవాడును;నిలమగళ్ తన్=శ్రీ భూదేవి యొక్క; ములై ఆళ్ విత్తకనై = వక్షోజములను పాలించగల సమర్ధుడును;వీదిదొఱుమ్=అన్ని వీధులలో; ముదు నాల్ మఱై = పురాతనమైన నాలుగు వేదములు; అలై ఆరుమ్ కడల్ పోల్ ముழఙ్గుమ్ = అలలతో నిండిన సముద్రమువలె ఘోషింపబడుచున్న;తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ = అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న; కలై ఆర్ శొల్ పొరుళై = శాస్త్రములందు సమస్త సూక్తులచే ప్రతిపాదింపబడుచున్నస్వామి ఆమరువియప్పన్ పెరుమాళ్ ను, కణ్డుకొణ్డు కళిత్తేనే = దాసుడైన నేను సేవించుకొని మహదానందమును పొందితిని!
నన్ను శాశ్వతమైన దాసునిగ సంతోషముతో తన దివ్యహృదయమున ఎంచుకొనినవాడును,శ్రీ భూదేవి యొక్క వక్షోజములను పాలించగల సమర్ధుడును; అన్ని వీధులలో పురాతనమైన నాలుగు వేదములు అలలతో నిండిన సముద్రమువలె ఘోషింపబడుచున్న అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న శాస్త్రములందు సమస్త సూక్తులచే ప్రతిపాదింపబడుచున్న స్వామి, ఆమరువియప్పన్ పెరుమాళ్ ను, దాసుడైన నేను సేవించుకొని మహదానందమును పొందితిని!
** పేరానై, క్కుడందై ప్పెరుమానై, ఇలఙ్గొళిశేర్
వారార్ వనములైయాళ్, మలర్ మఙ్గై నాయకనై,
ఆరా ఇన్నముదై, తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ,
కారార్ కరుముగిలై, కణ్డుకొణ్డు కళిత్తేనే ll 1606
పేరానై = తిరుప్పేర్ దివ్యదేశమున పవళించియున్నవాడును; క్కుడందై పెరుమానై = తిరుకుడందై దివ్యదేశమున తన మహిమను జాటుచు శయనించి యున్నవాడును; ఇలఙ్గు ఒళి శేర్ =ప్రకాశించెడి కాంతిగల, వార్ ఆర్ =వస్త్రముచే అలంకరింపబడిన; వన ములై యాళ్=అందమైన వక్షోజములుగల; మలర్ మఙ్గై నాయకనై=కమలవాసినికి నాయకుడును; ఆరా ఇన్ అముదై = ఎంత అనుభవించినను తృప్తితీరని మధురమైన అమృతము వంటివాడును;తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ = అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న; కార్ ఆర్ కరు ముగిలై = వానాకాలమందలి కాళమేఘమువంటి వర్ణముగల స్వామి,ఆమరువియప్పన్ పెరుమాళ్ ను; కణ్డుకొణ్డు కళిత్తేనే = దాసుడైన నేను సేవించుకొని మహదానందమును పొందితిని!
తిరుప్పేర్ దివ్యదేశమున పవళించియున్నవాడును,తిరుకుడందై దివ్యదేశమున తన మహిమను జాటుచు శయనించి యున్నవాడును,ప్రకాశించెడి కాంతిగల వస్త్రముచే అలంకరింపబడిన అందమైన వక్షోజములుగల కమలవాసినికి నాయకుడును,ఎంత అనుభవించినను తృప్తితీరని మధురమైన అమృతము వంటివాడును,అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న వానాకాలమందలి కాళమేఘమువంటి వర్ణము గల స్వామి,ఆమరువియప్పన్ పెరుమాళ్ ను,దాసుడైన నేను సేవించుకొని మహదానందమును పొందితిని!
** తిఱల్ మురుకననైయార్, తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ,
అఱముదల్వనవనై, అణి ఆలియర్ కోన్ మరువార్,
కఱై నెడువేల్ వలవన్, కలికన్ఱి శొల్ ఐ యిరణ్డుమ్,
ముఱై వழுవామై వల్లార్, ముழுతాళ్వర్ వానులగే ll 1607
తిఱల్ మురుకన్ అనైయార్ = బలవంతుడైన సుబ్రహ్మణ్యస్వామితో సరిసమానమైన వారితో నిండియున్న; తెన్ అழுన్దైయిల్ మన్ని నిన్ఱ = అందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న; అఱమ్ ముదల్వన్ అవనై = సకల ధర్మములకు మూలకారకుడైన ఆమరువియప్పన్ పెరుమాళ్ విషయమై; అణి ఆలియర్ కోన్ = అందమైన తిరువాలి దివ్యదేశవాసులకు ప్రభువును; మరువార్ = శత్రువుల యొక్క; కఱై నెడువేల్ వలవన్ = రక్తపు మరకలుగల పొడుగైన శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; శొల్ ఐ ఇరణ్డుమ్= అనుగ్రహించిన ఈ పది పాసురములను; ముఱై వழுవామై వల్లార్ = క్రమము తప్పక పఠించువారు; వానులగు ముழுదు ఆళ్వర్ = పరమపదమును సంపూర్ణముగ పరిపాలించుదురు!.
బలవంతుడైన సుబ్రహ్మణ్యస్వామితో సరిసమానమైన వారితో నిండియున్నఅందమైన తిరు అழுన్దూర్ దివ్య దేశమున నిత్యవాసము చేయుచున్న సకల ధర్మములకు మూలకారకుడైన ఆమరువియప్పన్ పెరుమాళ్ విషయమై,అందమైన తిరువాలి దివ్యదేశవాసులకు ప్రభువును,శత్రువుల యొక్క రక్తపు మరకలుగల పొడుగైన శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ పదిపాసురములను క్రమము తప్పక పఠించువారు పరమపదమును సంపూర్ణముగ పరిపాలించుదురు!.
*****