శ్రీః
7. తిరువుక్కున్దిరువాకియ
తిరుఅழுన్దూరు దివ్యదేశమున వేంచేసియున్న ఆమరువియప్పన్ పెరుమాళ్ యొక్క దివ్య చరణారవిందములయందు చేరి తిరుమంగై ఆళ్వార్ తమ శత్రువులైన పంచేద్రియముల విషయమై విన్నవించుకొనుచున్నారు.
** తిరువుక్కుమ్ తిరువాగియ శెల్వా, తెయ్ వత్తుక్కు అరశే శెయ్యకణ్ణా,
ఉరువ చ్చెఞ్జుడరాழிవల్లానే, ఉలగుణ్డ ఒరువా తిరుమార్ బా,
ఒరువற் క్కార్ట్రి ఉయ్యుమ్ వగై అన్ఱాల్, ఉడనిన్ఱు ఐవరెన్నుళ్ పుగున్దు,ఒழிయాదు
అరువిత్తిన్ఱిడ అఞ్జి నిన్నడైన్దేన్, అழுన్దూర్ మేల్ తిశై నిన్ఱ అమ్మానే ll 1608
తిరువిక్కుమ్ తిరువాగియ శెల్వా = శ్రీ మహాలక్ష్మికిని లక్ష్మియైన శ్రీమంతుడా!; తెయ్ వత్తుక్కు అరశే = బ్రహ్మాదిదేవతలకు ప్రభువా!; శెయ్య కణ్ణా=పుండరీకాక్షుడా!; ఉరువమ్ = అందమైన రూపము మరియు ; శెమ్ శుడర్ ఆழி వల్లానే = ఎర్రని తేజస్సు కలిగిన సుదర్శనచక్రమును ప్రయోగించు సమర్ధతగలవాడా!; ఉలగుణ్డ ఒరువా = (ప్రళయకాలమున ) సర్వలోకములను ఆరగించిన అద్వితీయుడా!; తిరుమార్ బా = శ్రీదేవి వక్షస్థలమున కలవాడా!; అழுన్దూర్ మేల్ తిశై నిన్ఱ అమ్మానే = అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!; ఒరువற் క్కు ఆర్ట్రి ఉయ్యుమ్ వగై అన్ఱు = ఏ ఒక ఇంద్రియమునుండి తప్పించుకొని జీవంచెడి విధానమే లేదు; ఆల్ = అయ్యో!; ఐవర్ = పంచేద్రియములు; ఎన్నుళ్ పుగున్దు = నాయందు ప్రవేశించి; ఉడన్ నిన్ఱు = పక్కనే ఉండి; ఒழிయాదు = నిరంతరము; అరువి తిన్ఱిడ =వేదించుచు నన్ను వదలక తినుచుండగ; అఞ్జి =(ఏ పాపకృత్యములు చేయుదునోయని)భయపడి; నిన్ అడైన్దేన్=నీయొక్క దివ్యమైన చరణారవిందములందు చేరియున్నాను స్వామీ! .
శ్రీ మహాలక్ష్మికిని లక్ష్మియైన శ్రీమంతుడా!,బ్రహ్మాదిదేవతలకు ప్రభువా!, పుండరీకాక్షుడా!,అందమైన రూపము మరియు ఎర్రని తేజస్సు కలిగిన సుదర్శన చక్రాయుధమును ప్రయోగించు సమర్ధతగలవాడా!, ప్రళయకాలమున సర్వలోకములను ఆరగించిన అద్వితీయుడా!,అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!,ఏ ఒక ఇంద్రియమునుండి తప్పించుకొని జీవంచెడి విధానమే లేదు, అయ్యో! పంచేద్రియములు నాయందు ప్రవేశించి పక్కనే ఉండి నిరంతరము వేదించుచు నన్ను వదలక తినుచుండగ ఏ పాపకృత్యములు చేయుదునోయని భయపడి నీయొక్క చరణారవిందములందు చేరియున్నాను స్వామీ!
పన్దార్ మెల్ విరల్ నల్వళైత్తోళి, పావై పూమగళ్ తన్నొడుముడనే
వన్దాయ్, ఎన్మనత్తే మన్ని నిన్ఱాయ్, మాల్వణ్ణా మழைపోలొళివణ్ణా,
శన్దోకా పౌழிయా తైత్తిరియా, శామవేదియనే నెడుమాలే,
అన్దో నిన్నడియన్ఱి మర్ట్రఱియేన్, అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే ll 1609
పన్దు ఆర్ మెల్ విరల్=బంతిచే పరిపూర్ణమై సున్నితమైన వ్రేళ్ళును మరియు;నల్ వళై తోళి=అందమైన కంకణములతో ఒప్పు భుజములుగల;పావై=ప్రతిమవంటి;పూమగళ్ తన్నొడుమ్ ఉడనే వన్దాయ్ = కమలవాసిని శ్రీ దేవితోకూడి వేంచేసి;ఎన్ మనత్తే మన్ని నిన్ఱాయ్ = నా హృదయమందు నిత్యవాసము చేయుచున్నవాడా!; మాల్ వణ్ణా = నల్లనివాడా!; మழைపోల్ ఒళి వణ్ణా = మేఘములవలె చల్లని సుందరమైన రూపము కలవాడా!;శన్దోగా=ఛాందోగ్యోపనిషత్తుచే ప్రతిపాదింపబడినవాడా!; పౌழிయా= కౌషితకీ బ్రాహ్మణమును (ఋగ్వేద బ్రాహ్మణము) ఎఱింగినవాడా!; తైత్తిరియా = తైత్తిరీయ ఉపనిషత్తుచే ప్రతిపాదింపబడినవాడా!;శామవేదియనే=సామవేదము ఎఱింగినవాడా!; నెడుమాలే = ఆశ్రితులయందు అధిక వ్యామోహముగలవాడా!; అన్దో = అయ్యో!ఎంత మూర్ఖుడునై యుంటినోగదా!; అழுన్దూర్ మేల్ తిశై నిన్ఱ అమ్మానే = అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!; నిన్ అడి అన్ఱి మర్ట్రు అఱియేన్ = శ్రీ వారి దివ్యచరణములు తప్ప ( పంచేంద్రియముల బారినుండి తప్పించుకొను) ఉపాయము వేరొకటి నాకు తెలియదు!.
బంతిచే పరిపూర్ణమై సున్నితమైన వ్రేళ్ళును మరియు అందమైన కంకణములతో ఒప్పు భుజములుగల ప్రతిమవంటి కమలవాసిని శ్రీ దేవితోకూడి వేంచేసి నా హృదయమందు నిత్యవాసము చేయుచున్నవాడా!, నల్లనివాడా!; మేఘములవలె చల్లని సుందరమైన రూపముకలవాడా!, ఛాందోగ్యోపనిషత్తుచే ప్రతిపాదింపబడినవాడా!,కౌషితకీ బ్రాహ్మణమును (ఋగ్వేద బ్రాహ్మణము) ఎఱింగినవాడా!,తైత్తిరీయోపనిషత్తుచే ప్రతిపాదింపబడినవాడా!, సామవేదము ఎఱింగినవాడా!, ఆశ్రితులయందు అధిక వ్యామోహము గలవాడా!,అయ్యో!ఎంతమూర్ఖుడునై యుంటినోగదా!, అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!,శ్రీవారి దివ్యచరణములుతప్ప (పంచేంద్రియముల బారినుండి తప్పించుకొను) ఉపాయము వేరొకటి నాకు తెలియదు!.
నెయ్యార్ ఆழிయుమ్ శఙ్గముమ్ ఏన్దుమ్; నీణ్డతోళుడైయాయ్, అడియేనై
చ్చెయ్యాదవులకత్తిడై చ్చెయ్ దాయ్, శిఱుమైక్కుమ్ పెరుమైక్కుముళ్ పుగున్దు,
పొయ్యాల్ ఐవర్ ఎన్మెయ్ కుడియేఱి, పోర్ట్రి వాழ்వదఱ్కఞ్జి నిన్నడైన్దేన్,
ఐయా నిన్నడియన్ఱి మర్ట్రఱియేన్, అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే ll 1610
ఐయా = ఓ! స్వామీ!;అழுన్దూర్ మేల్ తిశై నిన్ఱ అమ్మానే = అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!; నెయ్ ఆర్ ఆழிయుమ్ = మిక్కిలి వాడియైన సుదర్శనచక్రము; శఙ్గముమ్ = పాంచజన్యమను శంఖమును;ఏన్దుమ్=ధరించిన; నీణ్డ తోళ్ ఉడైయాయ్=పెద్ద బాహువులుగలవాడా!; అడియేనై = ఈ దాసుని విషయమున; ఉలకత్తిడై = ఈ లోకములో; శెయ్యాద శెయ్ దాయ్= (ఇంద్రియములు ఒసగి) చేయ తగనిది చేసితివి; ఐవర్=పంచేద్రియములు;పొయ్యాల్ = కృత్రిమముగ;శిఱుమైక్కుమ్ పెరుమైక్కుమ్ ఉళ్ పుగున్దు = అల్పమైన సుఖములు పొందుట కొరకు మరియు, ఉన్నతమైన సుఖములు పొందుట కొరకు, అట్టి రెండు గుణములతో నాయందు ప్రవేశించి;ఎన్ మెయ్ కుడి ఏఱి = నాయొక్క శరీరమున నన్ను సంసారమందు ప్రరేపించగ; పోర్ట్రి వాழ்వదఱ్కు = వాటిని తృప్తి పరుచుటకు; అఞ్జి = భయపడి; నిన్ అడైన్దేన్ = శ్రీవారి దివ్య చరణారవిందముల చెంతకు చేరియున్నాను;నిన్ అడి అన్ఱి మర్ట్రు అఱియేన్ = శ్రీ వారి దివ్యచరణములు తప్ప ( పంచేంద్రియముల బారినుండి తప్పించుకొను ) ఉపాయము వేరొకటి నాకు తెలియదు!.
ఓ! స్వామీ!,అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!,మిక్కిలి వాడియైన సుదర్శనచక్రము, పాంచజన్యమను శంఖమును, ధరించిన పెద్ద బాహువులుగలవాడా!,ఈ దాసుని విషయమున ఈ లోకములో (ఇంద్రియములు ఒసగి) చేయ తగనిది చేసితివి. పంచేద్రియములు కృత్రిమముగ అల్పమైన సుఖములుపొందుట కొరకు మరియు, ఉన్నతమైన సుఖములు పొందుట కొరకు, అట్టి రెండు గుణములతో నాయందు ప్రవేశించి, అవి నాయొక్క శరీరమున నన్ను సంసారమందు ప్రరేపించగ, వాటిని తృప్తి పరుచుటకు భయపడి, శ్రీవారి దివ్య చరణారవిందముల చెంతకు చేరి యున్నాను. శ్రీ వారి దివ్యచరణములు తప్ప ( పంచేంద్రియముల బారినుండి తప్పించుకొను ) ఉపాయము వేరొకటి నాకు తెలియదు!.
పరనే పఞ్జవన్ పౌழிయన్ శోழన్, పార్మన్నర్ తామ్ పణిన్దేత్తుమ్
వరనే, మాదవనే మదుశూదా, మర్ట్రోర్ నల్తుణై నిన్నలాలిలేన్గాణ్,
నరనే నారణనే, తిరునఱైయూర్ నమ్బీ, ఎమ్బెరుమాన్ ఉమ్బరాళుమ్
అరనే, ఆదివరాహమున్ ఆనాయ్, అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే ll 1611
పరనే = పరమపురుషా!; పఞ్జవన్ పౌழிయన్ శోழన్ పార్ మన్నర్ తామ్ = పఞ్జవన్ పౌழிయన్ శోழన్ అను నామములుగల భూపతులచే;పణిన్దు ఏత్తుమ్ = సేవించుచు స్తుతింపబడు; వరనే = కీర్తిగలవాడా!; మాదవనే = మాధవా!; మదుశూదా = మధువను అసురిని వధించినవాడా!; నరనే నారణనే = నరనారాయణనునిగ అవతరించినవాడా!; తిరునఱైయూర్ నమ్బీ = తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్నపరిపూర్ణుడా!;ఎమ్బెరుమాన్ = నాయొక్క స్వామీ!;ఉమ్బర్ ఆళుమ్ అరనే = దేవతలను పాలించు శివునికి అంతర్యామిగ నుండువాడా!;మున్ ఆదివరాహమ్ ఆనాయ్ = మునుపొకకాలమున ఆదివరాహమూర్తిగ అవతరించినవాడా!; అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే = అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!; నిన్ అలాల్ = శ్రీవారు తప్ప; మర్ట్రు ఓర్ నల్ తుణై = మరియొక ( పంచేంద్రియముల బారినుండి తప్పించు) మంచి రక్షకుడు; ఇలేన్ కాణ్ = లేనివాడును సుమా!.
పరమపురుషా!,పఞ్జవన్ పౌழிయన్ శోழన్ అను నామములుగల భూపతులచే సేవించుచు స్తుతింపబడు కీర్తిగలవాడా!,మాధవా! మధువను అసురిని వధించినవాడా!, నరనారాయణనునిగ అవతరించినవాడా!,తిరునఱైయూర్ దివ్యదేశమందు నిత్యవాసము చేయుచున్న పరిపూర్ణుడా!, నాయొక్క స్వామీ!, దేవతలను పాలించు శివునికి అంతర్యామిగ నుండువాడా!,మునుపొకకాలమున ఆదివరాహమూర్తిగ అవతరించినవాడా!,అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!, శ్రీవారు తప్ప మరియొక ( పంచేంద్రియముల బారినుండి తప్పించు) మంచి రక్షకుడు లేనివాడును సుమా!.
విణ్డాన్ విణ్ పుగ వెఞ్జమత్తరియాయ్, ప్పరియోన్ మార్వగమ్పర్ట్రిప్పిళన్దు,
పణ్డు ఆన్ ఉయ్య ఓర్ మాల్వరైయేన్దుమ్, పణ్బాళా పరనే పవిత్తరనే,
కణ్డేన్ నాన్ కలియుగత్తతన్ తణ్మై, కరుమమావతుమ్ ఎన్ దనక్కఱిన్దేన్,
అణ్డా నిన్నడియన్ఱి మర్ట్రఱియేన్, అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే ll 1612
విణ్డాన్ = విరోధియైన హిరణ్యాసురుడు; విణ్ పుగ = వీరస్వర్గము చేరునట్లు; వెమ్ శమత్తు=తీవ్రమైన యుద్ధమందు;అరి ఆయ్=నరసింహమూర్తిగ అవతరించి;పరియోన్ మార్వగమ్ పర్ట్రి పిళన్దు=(బ్రహ్మ వరములచే) రక్షణగల ఆహిరణ్యాసురుని వక్షస్థలమును పట్టుకొని చీల్చినవాడును; పణ్డు= శ్రీ కృష్ణావతారమందు;ఆన్ ఉయ్య=గో సమూహములు జీవించునట్లు;ఓర్ మాల్ వరై ఏన్దుమ్ = ఒక పెద్ద గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి; పణ్బు ఆళా = (భయంకరమైన వర్షమునుండి) గోవులను రక్షించిన గోపాలా!; పరనే = మహోన్నతమైనవాడా!; పవిత్తరనే=పరిశుద్ధస్వభావుడా!; అణ్డా=అణ్డములకు ఈశుడా!; అழுన్దూర్ మేల్ తిశై నిన్ఱ అమ్మానే=అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్నస్వామీ!; కలియుగత్తు తన్ తణ్మై = ఈ కలియుగము యొక్క స్వభావమును;నాన్ కణ్డేన్ = నేను తెలుసుకొనియున్నాను; ఎన్ తనక్కు = నాకు; కరుమమ్ ఆవతుమ్ = చేయదగిన కర్మములను; అఱిన్దేన్ = బాగుగ తెలుసుకొంటిని; నిన్ అడి అన్ఱి మర్ట్రు అఱియేన్ = శ్రీ వారి దివ్యచరణములు తప్ప (పంచేంద్రియముల బారినుండి తప్పించుకొను) ఉపాయము వేరొకటి నాకు తెలియదు!.(ఆ దివ్య పాదపద్మములందు చేరియున్నాను)
విరోధియైన హిరణ్యాసురుడు వీరస్వర్గము చేరునట్లు తీవ్రమైన యుద్ధమందు నరసింహమూర్తిగ అవతరించి (బ్రహ్మ వరములచే) రక్షణగల ఆహిరణ్యాసురుని వక్షస్థలమును పట్టుకొని చీల్చినవాడును, శ్రీ కృష్ణావతారమందు గో సమూహములు జీవించునట్లు ఒక పెద్ద గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి (భయంకరమైన వర్షమునుండి)గోవులను రక్షించిన గోపాలా!, మహోన్నతమైనవాడా!, పరిశుద్ధ స్వభావుడా!, అణ్డములకు ఈశుడా!,అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!,ఈ కలి యుగము యొక్క స్వభావమును నేను తెలుసుకొనియున్నాను.చేయదగిన కర్మములను బాగుగ తెలుసుకొంటిని. శ్రీ వారి దివ్యచరణములు తప్ప (పంచేంద్రియముల బారినుండి తప్పించుకొను) ఉపాయము వేరొకటి నాకు తెలియదు!. ఆ దివ్య పాదపద్మములందు చేరియున్నాను.
తోయా ఇన్ తయర్ నెయ్యముదుణ్ణ, చ్చొన్నార్ శొల్లినగుమ్ పరిశే, పెర్ట్ర
తాయాల్ ఆప్పుణ్డిరున్దు అழுదు ఏఙ్గుమ్ తాడాళా, తరైయోర్కుమ్ విణ్ణోర్కుమ్
శేయాయ్, కిరేత్త తిరేత్త తువాపర కలియుగమ్, ఇవై నాన్గు మునానాయ్,
ఆయా నిన్నడియన్ఱి మర్ట్రఱియేన్, అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే ll 1613
శొన్నార్ = ఏదైనను నోటికివచ్చినట్టు మాటలాడువారు; శొల్లి నగుమ్ పరిశే = మాటలాడి నవ్వెడి విధముగ; తోయా ఇన్ తయర్ = అప్పుడే తోడుకొనుచున్న మధురమైన పెరుగు, నెయ్ అముదు ఉణ్ణ = నెయ్యిని ( దొంగతనముగ ) ఆరగించగ; పెర్ట్ర తాయాల్ = తల్లి యశోదాదేవిచే; ఆప్పుణ్డు ఇరున్దు అழுదు ఏఙ్గుమ్ = రోకలికి కట్టబడి, నోటితో మాటలాడలేక కట్టబడియుండి, వెక్కి వెక్కి ఏడ్చిన, తాడాలా = శకటాసురుని తన్నిన దివ్యమైన పాదములు కలవాడా!,తరైయోర్కుమ్ విణ్ణోర్కుమ్ శేయాయ్ = భూవాసులకు మరియు ఊర్ధ్వలోకమున యున్నవారికి అందనివాడా!; మున్ = మొదటనే; కిరేత తిరేత తువాపర కలియుగమ్ ఇవై నాన్గుమ్ ఆనాయ్ = కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అను నాలుగు యుగములకు నిర్వాహకుడైనవాడా!; ఆయా = గోపాలకృష్ణుడా! ; అழுన్దూర్ మేల్ తిశై నిన్ఱ అమ్మానే = అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!; నిన్ అడి అన్ఱి మర్ట్రు అఱియేన్ = శ్రీ వారి దివ్యచరణములు తప్ప (పంచేంద్రియముల బారినుండి తప్పించుకొను) ఉపాయము వేరొకటి నాకు తెలియదు.
ఏదైనను నోటికివచ్చినట్టు మాటలాడువారు మాటలాడి నవ్వెడి విధముగ అప్పుడే తోడుకొనుచున్న మధురమైన పెరుగు మరియు నెయ్యిని ( దొంగతనముగ ) ఆరగించగ, తల్లి యశోదాదేవిచే రోకలికి కట్టబడి నోటితో మాటలాడలేక కట్టబడియుండి, వెక్కి వెక్కి ఏడ్చిన శకటాసురుని తన్నిన దివ్యమైన పాదములు కలవాడా!,భూవాసులకు మరియు ఊర్ధ్వలోకమున యున్నవారికి అందనివాడా!, మొదటనే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము అను నాలుగు యుగములకు నిర్వాహకుడైనవాడా!,గోపాలకృష్ణుడా!, అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!,శ్రీ వారి దివ్యచరణములు తప్ప (పంచేంద్రియముల బారినుండి తప్పించుకొను) ఉపాయము వేరొకటి నాకు తెలియదు.
కఱుత్తు కఞ్జనై అఞ్జ మునిన్దాయ్, కార్వణ్ణా కడల్పోలొళివణ్ణా,
ఇఱుత్తిట్టు ఆన్విడైయేழுమున్ వెన్ఱాయ్, ఎన్దాయ్ అన్దరమేழு మున్నానాయ్,
పొరుత్తు కొణ్డిరున్దాల్ పొఱుక్కొణ్ణా, పోగమే నుకర్ వాన్ పుకున్దు, ఐవర్
అఱుత్తు త్తిన్ఱిడ అఞ్జి నిన్నడైన్దేన్, అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే ll 1614
కఞ్జనై అఞ్జ = కంసుడు భీతిచెందునట్లు; కఱుత్తు = కోపగించి; మునిన్దాయ్ = నిరసించినవాడా!; కార్ వణ్ణా=మేఘమువలె చల్లని రూపము కలవాడా!; కడల్ పోల్ ఒళి వణ్ణా = సముద్రమువలె అందమైన రూపము కలవాడా!;మున్=మునుపొకకాలమున; ఆన్ విడై ఏழ் ఇఱుత్తిట్టు వెన్ఱాయ్=ఏడు వృషభములను చావగొట్టి జయించినవాడా! ఎన్దాయ్ = సర్వేశ్వరా! మున్ = మొదటినుండి; అన్దరమ్ ఏழுమ్ ఆనాయ్ = పైనున్న ఏడు లోకములకును నియామకుడైనవాడా!; అழுన్దూర్ మేల్ తిశై నిన్ఱ అమ్మానే = అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!;పొరుత్తు కొణ్డు ఇరున్దాల్ పొఱుక్క ఒణ్ణా = (బాధను) సహించుకొని ఉండవలెనని తలచియున్నను సహింపజాలని;పోగమే నుకర్ వాన్ = దుఃఖానుభవములే కలుగజేయుటకు;ఐవర్ పుగున్దు=పంచేద్రియములు నాయందు ప్రవేశించి; అఱుత్తు తిన్ఱిడ=హింసించి నన్ను తినుచుండగ; అఞ్జి= ( ఏ పాప కృత్యములు చేయుదునోయని ) భయపడి;నిన్ అడైన్దేన్ = నీయొక్క దివ్యమైన చరణారవిందములందు చేరియున్నాను స్వామీ! .
కంసుడు భీతిచెందునట్లు కోపగించి నిరసించినవాడా!, మేఘమువలె చల్లని రూపము కలవాడా!, సముద్రమువలె అందమైన రూపము కలవాడా!, మునుపొక కాలమున ఏడు వృషభములను చావగొట్టి జయించినవాడా!,సర్వేశ్వరా!, మొదటినుండి పైనున్న ఏడు లోకములకును నియామకుడైనవాడా!,అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!, బాధను సహించుకొని ఉండవలెనని తలచి యున్నను సహింపజాలని దుఃఖానుభవములే కలుగజేయుటకు పంచేద్రియములు నాయందు ప్రవేశించి హింసించి నన్ను తినుచుండగ ఏ పాప కృత్యములు చేయుదునో యని భయపడి నీయొక్క దివ్యమైన చరణారవిందములందు చేరియున్నాను స్వామీ! .
నెడియానే కడి ఆర్ కలినమ్బీ, నిన్నైయే నినైన్దు ఇఙ్గిరుప్పేనై,
కడియార్ కాళైయర్ ఐవర్ పుగున్దు, కావల్శెయ్ ద అక్కావలై పిழைత్తు,
కుడిపోన్దు ఉన్నడిక్కీழ் వన్దు పుగున్దేన్, కూఱై శోఱివై తన్దు ఎనక్కరుళి,
అడియేనై ప్పణియాణ్డు కొళెన్దాయ్, అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే ll 1615
నెడియానే=అందరిని మించినవాడా!;కడి=(భూమికి)రక్షణగ చుట్టియున్న; ఆర్ కలి = సముద్రమందు పవళించియున్న; నమ్బీ = పరిపూర్ణుడా!;ఎన్దాయ్=నాయొక్క స్వామీ!; అழுన్దూర్ మేల్ తిశై నిన్ఱ అమ్మానే = అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!; నిన్నైయే నినైన్దు = శ్రీవారినే ధ్యానించుచు;ఇఙ్గు ఇరుప్పేనై=ఇచటనున్న నన్ను; కడియార్ = మిక్కిలి క్రూరమైనవియు;కాళైయర్ = (హింసయందు) యౌవనమైనదియు; ఐవర్ = పంచేద్రియములు; పుగున్దు = నాయందు ప్రవేశించి; కావల్ శెయ్ ద అ క్కావలై పిழைత్తు = ( నీచెంతకు చేరనీయక ) కాచుచున్న అట్టి అడ్డగింతను తప్పించుకొని; ఉన్ అడిక్కీழ் = శ్రీవారి దివ్య చరణారవిందములందు; కుడి పోన్దు = నివసింప నెంచి; వన్దు పుగున్దేన్ = మిక్కిలి ఆశతో వచ్చి చేరియున్నాను;ఎనక్కు=ఈ దాసునికి;కూఱై శోఱు ఇవై తన్దరుళి = నాకు వస్త్రములు, అన్నము అయిన ఈ దివ్యమైన చరణారవిందములను అనుగ్రహించి; అడియేనై పణి ఆణ్డు కొళ్ = దాసుడైన నన్ను నిత్యకింకరునిగ స్వీకరించుమా! నా స్వామీ!.
అందరిని మించినవాడా!,భూమికి రక్షణగ చుట్టియున్న సముద్రమందు పవళించియున్న పరిపూర్ణుడా!,నాయొక్క స్వామీ!, అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!, శ్రీవారినే ధ్యానించు ఇచటనున్న నన్ను,మిక్కిలి క్రూరమైనవియు, హింసయందు యౌవనమైనదియు,అయిన పంచేద్రియములు నాయందు ప్రవేశించి,నీచెంతకు చేరనీయక కాచుచుండగ అట్టి అడ్డగింతను తప్పించుకొని శ్రీవారి దివ్య చరణారవిందములందు నివసింప నెంచి మిక్కిలి ఆశతో వచ్చి చేరియున్నాను. నాకు వస్త్రములు, అన్నము అయిన ఈ దివ్యమైన చరణారవిందములను అనుగ్రహించి దాసుడైన నన్ను నిత్యకింకరునిగ స్వీకరించుమా! నా స్వామీ!.
కోవాయైవర్ ఎన్మెయ్ కుడియేఱి, కూఱై శోఱివై తా ఎన్ఱు కుమైత్తు
పోగార్, నానవరై పొఱుక్కకిలేన్ పునిదా, పుట్కొడియాయ్ నెడుమాలే,
తీ వాయ్ నాకణైయిల్ తుయిల్వానే, తిరుమాలే యినిచ్చెయ్ వదొన్ఱఱియేన్,
ఆవావెన్ఱు అడియేఱ్కు ఇఱైఇరఙ్గాయ్, అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానే ll 1616
పునిదా = పరిశుద్ధస్వభావుడా; పుళ్ కొడియాయ్ = గరుడధ్వజుడా!; నెడుమాలే = ఆశ్రితులయందు అధిక వ్యామోహముగలవాడా!; తీ వాయ్ నాకణైయిల్ తుయిల్వానే= శత్రువులపై నిప్పులు కురుపించు ఆదిశేషుని తల్పముపై యోగనిద్రలో పవళించినవాడా!; తిరుమాలే = శ్రీలక్ష్మీవల్లభుడా!; అழுన్దూర్ మేల్ తిశై నిన్ఱ అమ్మానే = అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!;ఐవర్ =పంచేద్రియములు; కో ఆయ్ = నన్ను నియమించు ప్రభువులై; ఎన్ మెయ్ కుడి ఏఱి = నాయొక్క శరీరమున నన్ను సంసారమందు ప్రరేపించి; కూఱై శోఱు ఇవై తా ఎన్ఱు = వస్త్రములు,అన్నము వీటిని ఒసగుమని;కుమైత్తు పోగార్ = వేదించుచునేయుండి విడిచి పోవుటలేదు; నాన్ అవరై పొఱుక్క కిలేన్=నేను వాటియొక్క బాధలను సహింపలేకున్నాను; ఇని శెయ్ వదు ఒన్ఱుమ్ అఱియేన్ = శ్రీ వారి దివ్యచరణముల చెంత చేరిన నాకు ఇక ఏమిచేయవలనో తెలియకున్నది స్వామీ!;అడియేఱ్కుు=ఈ దాసుని విషయమై; ఆ ఆ ఎన్ఱు =”అయ్యయ్యో” అని; ఇఱై ఇరఙ్గాయ్ = కొంచెము కరుణించు స్వామీ! .
పరిశుద్ధస్వభావుడా!,గరుడధ్వజుడా!,ఆశ్రితులయందు అధిక వ్యామోహము గలవాడా!,(శత్రువులపై) నిప్పులు కురుపించు ఆదిశేషుని తల్పముపై యోగనిద్రలో పవళించినవాడా!,శ్రీలక్ష్మీవల్లభుడా!, అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామీ!, పంచేద్రియములు నన్ను నియమించు ప్రభువులై నాయొక్క శరీరమున నన్ను సంసారమందు ప్రేరేపించి వస్త్రములు,అన్నము వీటిని ఒసగుమని వేదించుచునేయుండి విడిచి పోవుటలేదు. నేను వాటియొక్క బాధలను సహింపలేకున్నాను. శ్రీ వారి దివ్య చరణముల చెంత చేరిన నాకు ఇక ఏమిచేయవలనో తెలియకున్నది స్వామీ!, ఈ దాసుని విషయమై “అయ్యయ్యో” అని కొంచెము కరుణించు స్వామీ! .
** అన్నమన్ను పైమ్బూమ్బొழிల్ శూழ் న్ద, అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానై,
కన్నిమన్ను తిణ్డోళ్ కలికన్ఱి యాలినాడన్, మఙ్గై క్కులవేన్దన్,
శొన్న ఇన్ తమిழ் నన్నమణిక్కోవై, తూయ మాలై ఇవై పత్తుమ్ వల్లార్,
మన్ని మన్నవరాయ్ ఉలగాణ్డు, మానవెణ్ కుడైక్కీழ் మకిழ்వారే ll 1617
అన్నమ్ మన్ను=ఎల్లప్పుడు హంసలు సంచరించెడి;పై పూ పొழிల్ శూழ் న్ద=విశాలమైన పూలతోటలతో చుట్టుకొనియున్న; అழுన్దూర్ మేల్ తిశైనిన్ఱ అమ్మానై = అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామి విషయమై; కన్ని మన్ను తిణ్ తోళ్ = శక్తివంతమైన భుజములుగల; ఆలినాడన్ = తిరువాలి దేశమున నివసించు; మఙ్గై కులవేన్దన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువు;కలికన్ఱి= తిరుమంగై ఆళ్వార్;శొన్న=అనుగ్రహించిన; ఇన్ తమిழ் = మధురమైన తమిళ బాషయందు;నల్ మణి కోవై=మంచి రత్నమాలవలె శ్లాఘ్యమైన; తూయ మాలై ఇవై పత్తుమ్ వల్లార్=పరిశుద్ధమైన సూక్తులమాలైన ఈ పదిపాసురములను పఠించువారు; మన్నవర్ ఆయ్ = చక్రవర్తులై; మన్ని = చిరకాలము సుఖముగ; ఉలగు ఆణ్డు = ఈ లోకమును పాలించుచు; మానమ్ వెణ్ కుడై క్కీழ் మకిழ்వారే = గొప్ప తెల్లని ఛత్రముక్రింద అమితానందముతో నుండుదురు!.
ఎల్లప్పుడు హంసలు సంచరించెడి విశాలమైన పూలతోటలతో చుట్టుకొనియున్న అழுన్దూర్ లో ఉత్తరదిక్కున వేంచేసియున్న స్వామి విషయమై, శక్తివంతమైన భుజములుగల తిరువాలి దేశమున నివసించు,తిరుమంగై దేశవాసులకు ప్రభువు తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన మధురమైన తమిళ బాషయందు మంచి రత్నమాలవలె శ్లాఘ్యమైన పరిశుద్ధమైన సూక్తులమాలైన ఈ పది పాసురములను పఠించువారు చక్రవర్తులై చిరకాలము సుఖముగ ఈ లోకమును పాలించుచు గొప్ప తెల్లని ఛత్రముక్రింద అమితానందముతో నుండుదురు!.
*******