పెరియతిరుమొழி-7వపత్తు (9)

 శ్రీః

9. కళ్ళమ్ మనమ్

             శిరుపులియూర్ దివ్యదేశమున చలశయన సన్నిధిలో కృపతో వేంచేసియున్న అరుమాకడలముద పెరుమాళ్ ను, తమయొక్క కల్మషములు తొలగించుకొనుటకై సేవించుకొని    తరించమని తిరుమంగై ఆళ్వార్ జనులకు హితము చెప్పుచున్నారు. 

** కళ్ళమ్మనమ్ విళ్ళుమ్ వగై, కరుది క్కழల్ తొழுవీర్,

వెళ్ళమ్ముదు పరవై త్తిరై విరియ, కరైయెఙ్గుమ్

తెళ్ళుమ్మణి తిగழுమ్, శిఱుపులియూర్ చ్చలశయన

త్తుళ్ళుమ్, ఎనదుళ్ళత్తుళ్ళుమ్, ఉఱై వారై యుళ్ళీరే  ll 1628

మనమ్ = తమ మనస్సుయొక్క; కళ్ళమ్ =  కృత్రిమ చేతలను;విళ్ళుమ్ వగై కరుది = విడిచెడి విధమును యోచించి; కழల్ తొழுవీర్ = సర్వేశ్వరుని పాదద్వందములను ఆశ్రయించ వలెనని కోరుకొను జనులారా!; ముదు పరవై =పురాతనమైన సముద్రము యొక్క;తిరై= అలలవలన కలుగు; వెళ్ళమ్=వరదలు; కరై ఎఙ్గుమ్ విరియ = తీరమందంతటను వ్యాపించగ;తెళ్ళుమ్= (ఆ అలలు) చెరిగి చేరవేసిన; మణి తిగழுమ్ = రత్నములచే ప్రకాశించుచున్న; శిఱుపులియూర్ = శిఱుపులియూర్ లో; చలశయనత్తుళ్ళుమ్ = చలశయన సన్నిధిలోను;ఎనదు ఉళ్ళత్తుళ్ళుమ్ = నాయొక్క హృదయమందును; ఉఱై వారై = నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని; ఉళ్ళీరే = ధ్యానించుడు! 

    తమ మనస్సుయొక్క కృత్రిమ చేతలను విడిచెడి విధమును యోచించి సర్వేశ్వరుని పాదద్వందములను ఆశ్రయించవలెనని కోరుకొను జనులారా!, పురాతనమైన సముద్రము యొక్క అలలవలన కలుగు వరదలు తీరమందంతటను వ్యాపించగ,ఆ అలలు  చెరిగి చేరవేసిన రత్నములచే ప్రకాశించుచున్న శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలోను, నాయొక్క హృదయమందును నిత్యవాసము చేయుచున్న అరుమాకడలముద పెరుమాళ్ ను ధ్యానించుడు!

తెరువిల్ తిరి శిఱునోమ్బియర్, శెఞ్జోర్ట్రుడు కఞ్జి

మరువి, పిరన్దవర్ వాయ్ మొழி, మదియాదు వన్దడైవీర్,

తిరువిల్ పొలి మఱైయోర్, శిఱుపులియూర్ చ్చలశయనత్తు,

ఉరువక్కుఱళ్ అడికళ్, అడి ఉణర్మిన్ ఉణర్ వీరే  ll 1629

ఉణర్ వీర్ = వివేకవంతులారా!; తెరువిల్ తిరి = వీధులలో సంచరించెడి; శిఱు నోమ్బియర్ = అల్పమైన వ్రతములు సలుపు; శెమ్ శోర్ట్రుడు కఞ్జి మరువి= ఎర్రని అన్నము మరియు గంజిని ఆశించి; పిరన్దవర్ = వేదమార్గములందుగాక వేరుగ పుట్టిన మతమునందలి జైనులు,బౌద్ధులు మొదలగువారియొక్క; వాయ్ మొழி = చెప్పెడి మాటలను; మదియాదు = తిరస్కరించి; వన్దు అడైవీర్ = వచ్చి స్వామియొక్క  సన్నిధిని చేరుకొనుడు; తిరువిల్ పొలి మఱైయోర్ = సంపదలతో ప్రకాశించు వైదిక బ్రాహ్మణోత్తములు నివసించుచున్న; శిఱుపులియూర్ = శిఱుపులియూర్ లో; చలశయనత్తు = చలశయన సన్నిధిలో; ఉరువ = అందమైన; కుఱళ్  అడికళ్ = వామనమూర్తిగ అవతరించిన అరుమాకడలముద పెరుమాళ్ యొక్క; అడి = దివ్యమైన పాదద్వందములను; ఉణర్మిన్ = ధ్యానించుడు!.

వివేకవంతులారా!,వీధులలో సంచరించెడి అల్పమైన వ్రతములు సలుపు ఎర్రనిఅన్నము మరియు గంజిని ఆశించి వేదమార్గములందుగాక వేరుగ పుట్టిన మతము నందలి జైనులు,బౌద్ధులు మొదలగువారియొక్క చెప్పెడి మాటలను తిరస్కరించి, వచ్చి స్వామియొక్క  సన్నిధిని చేరుకొనుడు. సంపదలతో ప్రకాశించు వైదిక బ్రాహ్మణోత్తములు నివసించుచున్న శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో అందమైన వామనమూర్తిగ అవతరించిన అరుమాకడలముద పెరుమాళ్ యొక్క దివ్యమైన పాద ద్వందములను ధ్యానించుడు!.

పఱైయుమ్ వినై తొழுదుయ్ మ్మినీర్, పణియుమ్ శిఱుతొణ్డీర్,

అఱైయుమ్ పునల్ ఒరుపాల్, వయలొరుపాల్ పొழிలొరుపాల్,

శిఱైవణ్డినమ్ అఱైయుమ్, శిఱుపులియూర్ చ్చలశయన

త్తుఱైయుమ్, ఇఱై అడియల్లదు, ఒన్ఱిఱైయుమఱియేనే  ll 1630

పణియుమ్ శిఱుతొణ్డీర్ = క్షుద్రదేవతలను అల్పములకై ఆరాధించు అఙ్ఞాన భక్తులారా!; నీర్=మీరు; తొழுదు ఉయ్ మిన్=(శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో వేంచేసి యున్న అరుమాకడలముద పెరుమాళును) సేవించుకొని ఉజ్జీవింపుడు;(సేవించినచో) వినై పఱైయుమ్ = పాపములు వెంటనే తొలగిపోవును; ఒరుపాల్ అఱైయుమ్ పునల్=ఒకపక్క ధ్వనించు నీటివనరులవద్దను;ఒరుపాల్ వయల్= మరియొక పక్క పొలముల యందును;ఒరుపాల్ పొழிల్=ఇంకొక పక్క తోటలలోను;శిఱై వణ్డు ఇనమ్ అఱైయుమ్=అందమైన రెక్కలుగల తుమ్మెదల సమూహములు ఝంకారము చేయుచుండెడి; శిఱుపులియూర్ చలశయనత్తు ఉఱైయుమ్ ఇఱై = శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో నిత్యవాసము చేయుచున్న అరుమాకడలముద పెరుమాళ్ యొక్క; అడి అల్లదు = దివ్య చరణములు తప్ప; ఒన్ఱు = వేరొకటి; ఇఱైయుమ్ = స్వల్పమైనను; అఱియేన్ = నాకు తెలియదు!.

      క్షుద్రదేవతలను అల్పములకై ఆరాధించు అఙ్ఞాన భక్తులారా!, మీరు శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో వేంచేసి యున్న అరుమాకడలముద పెరుమాళును సేవించుకొని ఉజ్జీవింపుడు. అట్లు సేవించుకొనినచో పాపములు వెంటనే తొలగిపోవును. ఒకపక్క ధ్వనించు నీటివనరుల వద్దను, మరియొక పక్క పొలముల యందును,ఇంకొక పక్క తోటలలోను అందమైన రెక్కలుగల తుమ్మెదల సమూహములు ఝంకారము చేయుచుండెడి శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో నిత్యవాసము చేయుచున్న అరుమాకడలముద పెరుమాళ్ యొక్క దివ్య చరణములు తప్ప వేరొకటి,  స్వల్పమైనను నాకు తెలియదు!.

వానార్ మది పొదియమ్ శడై, మழுవాళియొడొరుపాల్,

తానాగియ తలైవనవన్, అమరర్ క్కదిపతియామ్,

తేనార్ పొழிల్ తழுవుమ్, శిఱుపులియూర్ చ్చలశయనత్తు

ఆనాయనదు, అడియల్లదు, ఒన్ఱఱియేన్ అడియేనే  ll 1631

ఒరపాల్ = తిరుమేనియందు ఒక పక్కన; వానార్ మది పొదియమ్ శడై = ఆకాశమున యున్న చంద్రకళను తన జటయందు కలిగియున్న; మழுవాళియొడు తాన్ ఆగియ = గొడ్డలి ధరించిన శివునితోకూడిన వాడైన;తలైవన్ అవన్=ప్రభువైన ఆస్వామి;అమరర్కు  అదిపతి ఆమ్ = దేవతలకు నాయకుడైన దేవేంద్రుడు తానే అయి యున్నవాడు; తేన్ ఆర్ పొழிల్ తழுవుమ్ = తేనెలతోనిండిన తోటలతో కూడియున్న;శిఱుపులియూర్ = శిఱుపులియూర్ లో; చలశయనత్తు = చలశయన సన్నిధిలో కృపతో వేంచేసియున్న;  ఆన్ ఆయనదు = ఆ శ్రీ గోపాలకృష్ణుని యొక్క; అడి అల్లదు = దివ్య చరణములు తప్ప; ఒన్ఱు = వేరొకటి; అడియేన్ అఱియేన్ = ఈ దాసునికి తెలియదు!.

      తిరుమేనియందు ఒక పక్కన,ఆకాశమునయున్న చంద్రకళను తన జటయందు కలిగియున్న, గొడ్డలి ధరించిన శివునితోకూడిన వాడైన ప్రభువైన ఆస్వామి,దేవతలకు నాయకుడైన దేవేంద్రుడు తానే అయి యున్నవాడు,తేనెలతో నిండియున్న  తోటలతో కూడియున్న శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో కృపతోవేంచేసియున్నఆ శ్రీ గోపాలకృష్ణుని యొక్క దివ్య చరణములు తప్ప వేరొకటి ఈ దాసునికి తెలియదు!.

నన్దా నెడునరకత్తిడై, నణుగావగై, నాళుమ్

ఎన్దాయ్ ఎన, ఇమైయోర్ తొழுదేత్తుమిడమ్, ఎఱినీర్

చ్చెన్దామరై మలరుమ్, శిఱుపులియూర్ చ్చలశయనత్తు, 

అన్దామరై యడియాయ్, ఉనదడియేఱ్కరుళ్ పురియే  ll 1632

ఇమైయోర్ = దేవతలు; నాళుమ్ = ప్రతిదినము; ఎన్దాయ్ ఎన = మా యొక్క స్వామీ! అని చెప్పి; తొழுదు ఏత్తుమ్ = సేవించుచు స్తుతించుచుండెడి; ఇడమ్ = దివ్యదేశము మరియు; ఎఱి నీర్ శెన్దామరై మలరుమ్ శిఱుపులియూర్ = అలలుకొట్టుచున్న నీటి వసతులయందు  వికసించిన ఎర్రని తామర పుష్పములతో ఒప్పు శిఱుపులియూర్ లో; చలశయనత్తు= చలశయన సన్నిధిలో వేంచేసియున్న; అమ్ తామరై అడియాయ్ = సుందరమైన తామర పుష్పమువంటి దివ్య చరణములు కలవాడా!;నన్దా నెడు నరకత్తు ఇడై = నాశములేని పెద్ద నరకములో; నణుగావగై = చేరని విధముగ;ఉనదు అడియేఱ్కు అరుళ్ పురియే = శ్రీవారి దాసుడైన నాపై కృప జేయుమా!

          దేవతలు ప్రతిదినము మా యొక్క స్వామీ! అని చెప్పి సేవించుచు స్తుతించుచుండెడి దివ్యదేశము మరియు అలలుకొట్టుచున్న నీటి వసతులయందు  వికసించిన ఎర్రని తామర పుష్పములతో ఒప్పు శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో వేంచేసియున్న,సుందరమైన తామర పుష్పమువంటి దివ్య చరణములు కలవాడా!, నాశములేని పెద్ద నరకములో చేరని విధముగ శ్రీవారి దాసుడైన నాపై కృప జేయుమా!

ముழு నీలముమ్ మలర్ ఆమ్బలుమ్, అరవిన్దముమ్ విరవి,

కழு నీరొడు మడవారవర్, కణ్ వాయ్ ముగ మలరుమ్,

శెழுనీర్ వయల్ తழுవుమ్, శిఱుపులియూర్ చ్చలశయనమ్,

తొழுనీర్మైయదుడై యార్, అడితొழுవార్ తుయరిలరే  ll 1633

ముழு నీలముమ్ = సంపూర్ణముగ నల్లనైన నీలోత్పములును;మలర్ ఆమ్బలుమ్=నల్ల కలువ పుష్పములు; అరవిన్దముమ్=తామరపుష్పములు; కழுనీరొడు=ఎర్రకలువలును; విరవి = ఇవన్నియు చేరి; మడవార్ అవర్ = అచటనున్న కాంతలయొక్క;కణ్ వాయ్ ముగమ్ అలరుమ్ = నేత్రములు,అదరములు,ముఖమండలములను వికసింపజేసెడి; శెழுనీర్ వయల్ తழுవుమ్ = పుష్కలముగ నీరుకల పొలములచే చుట్టుకొనియున్న;  శిఱుపులియూర్ = శిఱుపులియూర్ లో; చలశయనమ్ = చలశయన సన్నిధిలో నిత్యవాసము చేయుచున్న అరుమాకడలముద పెరుమాళ్ యొక్క దివ్య చరణములను; తొழுమ్ నీర్మైయదు ఉడైయార్ = సేవించుటయే స్వభావముగలవారి యొక్క; అడి తొழுవార్=పాదములను సేవించువారు; తుయర్ ఇలర్ = దుఃఖము లేనివారగుదురు!.

      సంపూర్ణముగ నల్లనైన నీలోత్పములును మరియు నల్ల కలువ పుష్పములు, తామరపుష్పములును,ఎర్రకలువలును ఇవన్నియు చేరి, అచటనున్న కాంతలయొక్క నేత్రములు,అదరములు,ముఖమండలములను వికసింపజేసెడి,పుష్కలముగ నీరుకల పొలములచే చుట్టుకొనియున్న శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో నిత్యవాసము చేయుచున్న అరుమాకడలముద పెరుమాళ్ యొక్క దివ్య చరణములను సేవించుటయే స్వభావము గలవారియొక్క పాదములను సేవించువారు దుఃఖము లేనివారగుదురు!.

** శేయోఙ్గు, తణ్ తిరుమాలిరుఞ్జోలై మలైయుఱైయుమ్

మాయా, ఎనక్కురైయాయిదు, మఱైనాన్గినుళాయో,

తీయోమ్బుకై మఱైయోర్, శిఱుపులియూర్ చ్చలశయన

త్తాయో, ఉనదడియార్ మనత్తాయో, అఱియేనే  ll 1634

శేయ్ ఓఙ్గు = మిక్కిలి ఉన్నతమైన; తణ్ = చల్లని; తిరుమాలిరుఞ్జోలై మలై = తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు; ఉఱైయుమ్ = నిత్యవాసము చేయుచున్న; మాయా= ఆశ్చర్యభూతుడా!;, మఱైనాన్గినుళాయో = నాలుగు వేదములందుంటివో; తీ ఓమ్బు= హోమాగ్నులను వృద్దిపరచెడి; కై మఱైయోర్ = హస్తములుగల వైదిక బ్రాహ్మణోత్తములు నివసించుచున్న; శిఱుపులియూర్= శిఱుపులియూర్ లో; చలశయనత్తాయో=చలశయన సన్నిధిలో వేంచేసియున్నవాడవో!; ఉనదు అడియార్ మనత్తాయో=శ్రీవారి ఆశ్రితుల యొక్క హృదయమందు వేంచేసియున్నవాడవో!;అఱియేన్ = తెలుసుకొనలేకున్నాను;ఇదు ఎనక్కు ఉరైయాయ్ = ఈ విషయమును శ్రీవారే నాకు కృపతో చెప్పకోరెదను!.

మిక్కిలి ఉన్నతమైన తిరుమాలిరుఞ్జోలై పర్వతమందు నిత్యవాసము చేయుచున్న ఆశ్చర్యభూతుడా!, నాలుగు వేదములందుంటివో?, హోమాగ్నులను వృద్ది పరచెడి హస్తములుగల వైదిక బ్రాహ్మణోత్తములు నివసించుచున్న శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో వేంచేసియున్నవాడవో?, శ్రీవారి ఆశ్రితుల యొక్క హృదయమందు వేంచేసియున్నవాడవో?, తెలుసుకొనలేకున్నాను. ఈ విషయమును శ్రీవారే నాకు కృపతో చెప్పకోరెదను!.

మైయార్ వరినీలమ్, మలర్ క్కణ్ణార్ మనమ్ విట్టిట్టు,

ఉయ్ వాన్ ఉనకழలే, తొழுదు ఎழுవేన్ కిళి మడవార్, 

శెవ్వాయ్ మొழிపయిలుమ్, శిఱుపులియూర్ చ్చలశయనత్తు,

ఐవాయ్ అరవణై మేల్, ఉఱై అమలా అరుళాయే  ll 1635

కిళి = చిలుకలు; మడవార్ = స్త్రీలయొక్క; శెవ్ వాయ్ మొழி = ఎర్రని అదరములుగల నోటినుండి వెలువడు మాటలను; పయిలుమ్ = అభ్యసించి తిరిగి పలుకుచుండెడి; శిఱుపులియూర్ = శిఱుపులియూర్ లో; చలశయనత్తు = చలశయన సన్నిధిలో కృపతో వేంచేసియున్న; ఐవాయ్ అరవు అణై మేల్ = ఐదు నోర్లుగల ఆదిశేషుని తల్పముపై; ఉఱై అమలా = శయనించియున్న నిర్మలహృదయుడా!; మై ఆర్ = కాటుక పెట్టుకొనిన; వరి = రేకలు కలిగిన; నీలమ్ మలర్ = నల్ల కలువలవంటి; కణ్ణార్ = నేత్రములుగల కాంతలయందు; మనమ్ విట్టిట్టు = మనస్సును వదిలి పెట్టి; ఉయ్ వాన్ = ఉజ్జీవించుటకై;  ఉన కழలే = శ్రీ వారి దివ్యచరణములే; తొழுదు ఎழுవేన్ = సేవించి ఉద్ధరింపబడుటకై; అరుళాయే = కృపచేయుమా! .

      చిలుకలు స్త్రీలయొక్క ఎర్రని అదరములుగల నోటినుండి వెలువడు మాటలను అభ్యసించి తిరిగి పలుకుచుండెడి శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో కృపతో వేంచేసియున్న, ఐదు నోర్లుగల ఆదిశేషుని తల్పముపై శయనించియున్న నిర్మల హృదయుడా!,కాటుక పెట్టుకొనిన,రేకలు కలిగిన నల్ల కలువలవంటి నేత్రములుగల కాంతలయందు మనస్సును వదిలి పెట్టి ఉజ్జీవించుటకై శ్రీ వారి దివ్యచరణములే సేవించి ఉద్ధరింపబడుటకై కృపచేయుమా!

**     కరు మాముగిలురువా, కనలురువా పునలురువా,

పెరు మాల్వరైయురువా, పిఱవురువా నినదురువా,

తిరుమామగళ్ మరువుమ్, శిఱుపులియూర్ చ్చలశయనత్తు,

అరుమాకడలముదే, ఉనదడియే శరణామే  ll 1636

కరు మా ముగిల్ ఉరువా = నల్లని పెద్ద మేఘమువంటి తిరుమేని కలవాడా!; కనల్ ఉరువా= (తనయందు ప్రీతిలేనివారికి)అగ్నివంటి రూపము కలవాడా!;పునల్ఉరువా=జలమువలె చల్లని తిరుమేని కలవాడా!; పెరు మాల్ వరై ఉరువా = మిక్కిలి పెద్ద పర్వతము వంటి రూపము కలవాడా!; పిఱ ఉరువా=తక్కిన అన్ని పదార్దములును తన రూపముగ కలవాడా!; నినదు ఉరువా=  అసాధారణమైన దివ్యమంగళ విగ్రహ రూపమును కలిగియున్నవాడా!; తిరు మా మగళ్ మరువుమ్ = శ్రీ మహాలక్ష్మి వక్షస్థలమున అమరియున్న; శిఱుపులియూర్ చలశయనత్తు అరుమాకడలముదే =  శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో కృపతో నిత్యవాసము చేయుచున్న అరుమాకడలముదమా!; ఉనదు అడియే శరణామే=శ్రీ వారి దివ్యచరణములే నాకు శరణ్యము!. 

నల్లని పెద్ద మేఘమువంటి తిరుమేని కలవాడా!,(తనయందు ప్రీతిలేని వారికి) అగ్నివంటి రూపము కలవాడా!,జలమువలె చల్లని తిరుమేని కలవాడా!,మిక్కిలి పెద్ద పర్వతము వంటి రూపము కలవాడా!, తక్కిన అన్ని పదార్దములును తనరూపముగ కలవాడా!, అసాధారణమైన దివ్యమంగళ విగ్రహ రూపమును కలిగియున్నవాడా!,శ్రీ మహాలక్ష్మి వక్షస్థలమున అమరియున్న శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో కృపతో నిత్యవాసము చేయుచున్న అరుమాకడలముదమా!,శ్రీ వారి దివ్యచరణములే నాకు శరణ్యము!. 

** శీరార్ నెడు మఱుగిల్, శిఱుపులియూర్ చ్చలశయనత్తు,

ఏరార్ ముగిల్ వణ్ణన్ తన్నై, ఇమైయోర్ పెరుమానై, 

కారార్ వయల్ మఙ్గైక్కిఱై, కలియనొలిమాలై, 

పారార్ ఇవై పరవి త్తొழ, ప్పావమ్ పయిలావే  ll 1637

శీర్ ఆర్ నెడు మఱుగిల్ = మిక్కిలి మనోహరమైన పొడుగైన వీధులుగల; శిఱుపులియూర్ = శిఱుపులియూర్ లో; చలశయనత్తు = చలశయన సన్నిధిలో కృపతో వేంచేసియున్న; ఏరార్ ముగిల్ వణ్ణన్ తన్నై = మిక్కిలి సుందరమైన, మేఘమువంటి దివ్య రూపముగల; ఇమైయోర్ పెరుమానై = నిత్యశూరులకు స్వామియైన సర్వేశ్వరుని విషయమై; కార్ ఆర్ వయల్ మఙ్గైక్కు= మేఘములచే ఆవరింబడిన పొలములుగల తిరుమంగై దేశమునకు; ఇఱై = ప్రభువైన; కలియన్ =  తిరుమంగై ఆళ్వార్; ఒలిమాలై ఇవై = అనుగ్రహించిన ఈ సూక్తులమాలను; పారార్ = ఈ భూలోకమందలి జనులు; పరవి తొழ = పఠించి అరుమాకడలముద పెరుమాళ్ యొక్క దివ్య చరణములను సేవించుకొనిన, పావమ్ పయిలావే = వారి పాపములు నిలువలేక తొలగిపోవును కదా!.

మిక్కిలి మనోహరమైన పొడుగైన వీధులుగల శిఱుపులియూర్ లో చలశయన సన్నిధిలో కృపతో వేంచేసియున్న మిక్కిలి సుందరమైన, మేఘమువంటి దివ్య రూపము గల,నిత్యశూరులకు స్వామియైన సర్వేశ్వరుని విషయమై,మేఘములచే ఆవరింబడిన పొలములుగల తిరుమంగై దేశమునకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ సూక్తులమాలను ,ఈ భూలోకమందలి జనులు పఠించి అరుమాకడలముద పెరుమాళ్ యొక్క దివ్య చరణములను సేవించుకొనిన, వారి  పాపములు నిలువలేక తొలగిపోవును కదా!.

******

వ్యాఖ్యానించండి