శ్రీః
10 . వణ్డార్
తిరుకణ్ణపురమందునిత్యవాసము చేయుచున్న శౌరి పెరుమాళ్ ను, తిరుమంగై ఆళ్వార్,తనకు శ్రీవారి కైంకర్యసేవను ప్రసాదించమని కోరుకొనుచున్నారు.
** వణ్డార్ పూమామలర్మఙ్గై, మణనోక్క
ముణ్డానే, ఉన్నై యుగన్దుగన్దు, ఉన్ఱనక్కే
తొణ్డానేఱ్కు, ఎన్ శెయ్ కిన్ఱాయ్ శొల్లు, నాల్ వేదమ్
కణ్డానే, కణ్ణపురత్తుఱై అమ్మానే ll 1738
వణ్డు ఆర్ పూ = భ్రమరములతో నిండిన అందమైన; మా మలర్ మఙ్గై = శ్లాఘ్యమైన తామర పుష్పమందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మి యొక్క;మణమ్ నోక్కమ్=క్రీగంటి చూపులను;ఉణ్డానే= ఆస్వాదించుచున్న వాడా!; నాల్ వేదమ్ కణ్డానే = నాలుగు వేదములచేతను తెలియబడువాడా!; కణ్ణపురత్తు ఉఱై = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న; అమ్మానే = స్వామీ!; ఉన్నై = శ్రీవారినే;ఉగన్దు ఉగన్దు = మిక్కిలి ఆశించి; ఉన్ఱనక్కే = శ్రీవారికే;తొణ్డు ఆనేఱ్కు= కైంకర్యసేవ చేయుభాగ్యమును పొందదలచి ఉత్సుకతతో వేచియున్న ఈ దాసుని విషయమై;ఎన్ శెయ్ కిన్ఱాయ్ = ఏమి చేయదలచితిరో; శొల్లు = చెప్పుడు!
భ్రమరములతో నిండిన అందమైన శ్లాఘ్యమైన తామర పుష్పమందు ఉద్భవించిన శ్రీమహాలక్ష్మి యొక్క క్రీగంటి చూపులను ఆస్వాదించుచున్నవాడా!,నాలుగు వేదములచేతను తెలియబడువాడా!, తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!, శ్రీవారినే మిక్కిలి ఆశించి, శ్రీవారికే కైంకర్యసేవ చేయుభాగ్యమును పొందదలచి ఉత్సుకతతో వేచియున్న ఈ దాసుని విషయమై ఏమి చేయదలచితిరో చెప్పుడు!
పెరునీరుమ్ విణ్ణుమ్, మలైయుమ్ ఉలగేழுమ్,
ఒరుతారా నిన్నుళ్ ఒడుక్కియ, నినైయల్లాల్,
వరుదేవర్ మర్ట్రుళరెన్ఱు, ఎన్మనత్తిఱైయుమ్
కరుదేన్ నాన్, కణ్ణపురత్తుఱై అమ్మానే ll 1739
కణ్ణపురత్తు ఉఱై = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న; అమ్మానే = స్వామీ!; పెరు నీరుమ్ = సముద్రములును; విణ్ణుమ్ = ఆకాశమును; మలైయుమ్= పర్వతములును, ఉలగేழுమ్ = సప్త లోకములును; ఒరు తార్ ఆ = ఒక మాలగ;నిన్నుళ్ ఒడుక్కియ=తమ ఉదరమున ఒక మూల ఇరికించుకొనిన;నినై యల్లాల్=శ్రీవారిని తప్ప; వరు దేవర్ మర్ట్రు ఉళర్ ఎన్ఱు= (నేను ఆశ్రయణీయుడను అని చెప్పెడు) రాదగిన దేవత వేరొకటి ఉన్నట్లుగ; ఎన్ మనత్తు ఇఱైయుమ్ = నాయొక్క హృదయమున స్వల్పమైనను; నాన్ కరుదేన్ = నేను ఎన్నడును తలచియుండలేదు.
తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!, సముద్రములును, ఆకాశమును, పర్వతములును, సప్త లోకములును తమ ఉదరమున ఒక మూల ఇరికించుకొనిన,శ్రీవారిని తప్ప,( నేను ఆశ్రయణీయుడను అని చెప్పెడు) రాదగిన దేవత వేరొకటి ఉన్నట్లుగ నాయొక్క హృదయమున స్వల్పమైనను, నేను ఎన్నడును తలచియుండలేదు.
** మర్ట్రుమోర్ దెయ్ వముళదెన్ఱు, ఇరుప్పారోడు
ఉర్ట్రిలేన్, ఉర్ట్రదుమ్, ఉన్నడియార్కడిమై,
మర్ట్రెల్లామ్ పేశిలుమ్, నిన్తిరువెట్టెழுత్తుమ్
కర్ట్రునాన్, కణ్ణపురత్తుఱై అమ్మానే ll 1740
కణ్ణపురత్తు ఉఱై=తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న;అమ్మానే=స్వామీ!; మర్ట్రుమ్ ఓర్ దెయ్ వమ్ ఉళదె ఎన్ఱు ఇరుప్పారోడు = శ్రీవారు కాక వేరొక దైవము ఆశ్రయింప తగినట్లు కలదని తలచుకొనియుండు వారితో; ఉర్ట్రిలేన్ = ఏకీభవించి కలసి యుండలేను; నిన్ తిరు ఎట్టెழுత్తుమ్ = తమ అష్టాక్షరీ మంత్రముయొక్క;మర్ట్రు ఎల్లామ్ పేశిలుమ్=తెలుసుకొనదగిన విశేషార్థమలన్నియు తెలియచెప్పినను; నాన్ కర్ట్రు ఉర్ట్రదుమ్ = నేను అధికముగ తెలుసుకొని లబ్ధిపొందినది; ఉన్ అడియార్కు అడిమై=శ్రీవారి దాసులకు శేషభూతుడగుటయే స్వామీ!
తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!, శ్రీవారు కాక వేరొక దైవము ఆశ్రయింపతగినట్లు కలదని తలచుకొనియుండు వారితో ఏకీభవించి కలసియుండలేను. తమ అష్టాక్షరీ మంత్రముయొక్క తెలుసుకొనదగిన విశేషార్థమలన్నియు తెలియ చెప్పినను, నేను అధికముగ తెలుసుకొని లబ్ధిపొందినది శ్రీవారి దాసులకు శేషభూతుడగుటయే స్వామీ!
పెణ్ణానాళ్, పేర్ ఇళమ్ కొఙ్గైయిన్ ఆర్ అழల్ పోల్,
ఉణ్ణానఞ్జుణ్డు ఉగన్దాయై, యుగన్దేన్ నాన్,
మణ్ణాళా, వాళ్ నెడుఙ్గణ్ణి, మదుమలరాళ్
కణ్ణాళా, కణ్ణపురత్తుఱై అమ్మానే ll 1741
మణ్ణ్ ఆళా = శ్రీ భూదేవిని పాలించుచున్నవాడా!; వాళ్ నెడు కణ్ణి = ప్రకాశించుచున్న విశాలమైన నేత్రములుగల;మదు మలర్ ఆళ్ = తేనెలొలుకు పుష్పమందు ఉద్భవించిన శ్రీ దేవి; కణ్ ఆళా = వల్లభుడా!; కణ్ణపురత్తు ఉఱై = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న; అమ్మానే=స్వామీ!; పెణ్ ఆనాళ్ = ఒక యవతి రూపము ధరించి వచ్చిన రక్కసి పూతనయొక్క; పేర్ ఇళమ్ కొఙ్గైయిన్= పెద్ద యౌవన స్తనములందలి;ఆర్ అழల్ పోల్ = మండుచున్న నిప్పువలె నున్న;ఉణ్ణా=ఆరగింపజాలని; నఞ్జు=విషమును; ఉణ్డు=ఆస్వాదించి; ఉగన్దాయై = ఆనందించిన శ్రీ వారిని; నాన్ యుగన్దేన్ = నేను చేరుకొని అమితానందము పొందితిని!
శ్రీ భూదేవిని పాలించుచున్నవాడా!,ప్రకాశించుచున్న విశాలమైన నేత్రములుగల, తేనెలొలుకు పుష్పమందు ఉద్భవించిన శ్రీ దేవి వల్లభుడా!, తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!,ఒక యవతి రూపము ధరించి వచ్చిన రక్కసి పూతనయొక్క,పెద్ద యౌవన స్తనములందలి, మండుచున్న నిప్పువలె నున్న ఆరగింపజాలని విషమును ఆస్వాదించి ఆనందించిన శ్రీ వారిని నేను చేరుకొని అమితానందము పొందితిని!
పెర్ట్రారుమ్ శుర్ట్రముమ్, ఎన్ఱివై పేణేన్ నాన్,
మర్ట్రారుమ్ పర్ట్రిలేన్, ఆదలాల్ నిన్నడైన్దేన్,
ఉర్ట్రానెన్ఱు ఉళ్ళత్తువైత్తు, అరుళ్ శెయ్ కణ్డాయ్,
కర్ట్రార్ శేర్, కణ్ణపురత్తుఱై అమ్మానే ll 1742
కర్ట్రార్ శేర్ = పండితులుచేరి నివసించుచున్న; కణ్ణపురత్తు ఉఱై=తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న; అమ్మానే = స్వామీ!; పెర్ట్రారుమ్ = జన్మమొసగిన తల్లిదండ్రులని; శుర్ట్రముమ్ = బంధువులని; ఎన్ఱు ఇవై = చెప్పబడు వారందరిని; నాన్ పేణేన్ = నేను ఇకపై కలిగియండుటకు ఆశింపను;మర్ట్రు ఆరుమ్ పర్ట్రు ఇలేన్ = వేరు ఏ ఒక్కరియొక్క ఆశ్రయము కలిగిలేను; ఆదలాల్ నిన్నడైన్దేన్ = అందుచే శ్రీవారి పాదద్వందములను ఆశ్రయించితిని; ఉళ్ళత్తు = తమ దివ్య హృదయమున; ఉర్ట్రాన్ ఎన్ఱు వైత్తు = ” ఈతడు నన్నే నమ్ముకొనియన్నవాడు ” అని అభిమానించి; అరుళ్ శెయ్ కణ్డాయ్ = కృపజేయవలెను సుమా!
పండితులుచేరి నివసించుచున్న తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ! జన్మమొసగిన తల్లిదండ్రులని,బంధువులని చెప్పబడు వారందరిని నేను ఇకపై చేరియుండుటకు ఆశింపను, వేరు ఏ ఒక్కరియొక్క ఆశ్రయము కలిగిలేను, అందుచే శ్రీవారి పాదద్వందములను ఆశ్రయించితిని. తమ దివ్య హృదయమున ” ఈతడు నన్నే నమ్ముకొనియన్నవాడు ” అని అభిమానించి కృపజేయవలెను సుమా!( శ్రీ వారే నాగతి కదా!)
ఏత్తి ఉన్ శేవడి, ఎణ్ణి యిరుప్పారై,
పార్తిరున్దఙ్గు, నమన్ తమర్ పర్ట్రాదు,
శోత్తమ్, నామ్ అఞ్జుదు మెన్ఱు, తొడామై నీ
కాత్తిపోల్, కణ్ణపురత్తుఱై అమ్మానే ll 1743
కణ్ణపురత్తు ఉఱై=తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న;అమ్మానే=స్వామీ!; ఉన్ శేవడి = నీయొక్క దివ్యమైన చరణారవిందములను; ఏత్తి = స్తుతించి;ఎణ్ణి యిరుప్పారై = ధ్యానించు చుండువారిని; నమన్ తమర్ = యమబటులు; పార్తు ఇరున్దు = ప్రాణముపోవు కాలమును ఎదురుచూచి; అఙ్గు =ఆ సమయమున; పర్ట్రాదు=వచ్చి సమీపించలేక; శోత్తమ్ = ” నమస్కారము “;నామ్ అఞ్జుదుమ్ = (సమీపించుటకుకూడ) మేము భయపడుచున్నాము; ఎన్ఱు=అని చెప్పి; తొడామై నీ కాత్తిపోల్ = స్పర్శింపనీయక శ్రీవారు రక్షించికృపజేసితిరికదా!
తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!,నీయొక్క దివ్యమైన చరణారవిందములను స్తుతించి ధ్యానించు చుండువారిని, యమబటులు ప్రాణముపోవు కాలమును ఎదురుచూచి, ఆ సమయమున వచ్చి సమీపించలేక,” నమస్కారము! (సమీపించుటకుకూడ) మేము భయపడుచున్నాము” అని చెప్పి స్పర్శింపనీయక శ్రీవారు రక్షించికృపజేసితిరికదా!
వెళ్ళైనీర్ వెళ్ళత్తు, అణైన్ద అరవణై మేల్,
తుళ్ళునీర్ మెళ్ళ, త్తుయిన్ఱ పెరుమానే,
వళ్ళలే ఉన్ తమర్కెన్ఱుమ్, నమన్ తమర్
కళ్ళర్ పోల్, కణ్ణపురత్తుఱై అమ్మానే ll 1744
వెళ్ళై నీర్ = పాలసముద్రముయొక్క; వెళ్ళత్తు = ఉప్పొంగిన వరదలందు; అణైన్ద = చేరియున్న; అరవు అణై మేల్ = శేష తల్పముపై; తుళ్ళు నీర్ = చిన్న తుంపరలు; మెళ్ళ = మెల్లగ పడుచుండగ; తుయిన్ఱ పెరుమానే = యోగనిద్రలో పవళించియున్నస్వామీ!; వళ్ళలే = ఉదారస్వభావుడా!; కణ్ణపురత్తు ఉఱై=తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న;అమ్మానే=స్వామీ!; ఉన్ తమర్కు= నీయొక్క ఆశ్రితుల విషయమున; ఎన్ఱుమ్ = ఎల్లప్పుడును;నమన్ తమర్ = యమబటులు;కళ్ళర్ పోల్=దొంగలవలె దాగియుందురు కదా!
పాలసముద్రముయొక్క ఉప్పొంగిన వరదలందు చేరియున్న శేష తల్పముపై చిన్న తుంపరలు, మెల్లగ పడుచుండగ, యోగనిద్రలో పవళించియున్న స్వామీ!, ఉదారస్వభావుడా !, తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!,నీయొక్క ఆశ్రితుల విషయమున ఎల్లప్పుడును యమబటులు దొంగలవలె దాగియుందురు కదా!
మాణాగి, వైయమళన్దతువుమ్, వాళవుణన్
పూణాగమ్ కీణ్డదువుమ్, ఈణ్డునినైన్దిరున్దేన్,
పేణాద వల్వినైయేన్, ఇడరెత్తనైయుమ్
కాణేన్నాన్, కణ్ణపురత్తుఱై అమ్మానే ll 1745
కణ్ణపురత్తు ఉఱై=తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న;అమ్మానే=స్వామీ!; (మునుపు)మాణ్ ఆగి=వామన బ్రహ్మచారి రూపమును దాల్చి;వైయమ్ అళన్దతువుమ్= లోకములను కొలిచి స్వీకరించినదియు; వాళ్ అవుణన్ = ఖడ్గము కలిగిన హిరణ్యాసురుని యొక్క; పూణ్ ఆగమ్ = ఆభరణములతో నున్న వక్షస్థలమును; కీణ్డదువుమ్ = చీల్చినదియు; ఈణ్డు = ఇపుడు; నినైన్దు ఇరున్దేన్ = నేను అనుసంధించు కొనుచున్నాను; పేణాద = ఆత్మోజ్జీవమునకు ఒక సత్కర్మమును చేయనివాడను; వల్ వినైయేన్ = క్రూరమైన పాపములు కలవాడను; నాన్ = అయినట్టినేను; ఇడర్ ఎత్తనైయుమ్ = నాకు స్వల్ప పాపమైనను; కాణేన్ = నాయందు కనిపించుటలేదు!
తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!, (మునుపొకకాలమున),వామన బ్రహ్మచారి రూపమును దాల్చి లోకములను కొలిచి స్వీకరించినదియు, ఖడ్గము కలిగిన హిరణ్యాసురునియొక్క ఆభరణములతో నున్న వక్షస్థలమును చీల్చినదియు,ఇపుడు నేను అనుసంధించు కొనుచున్నాను, ఆత్మోజ్జీవమునకు ఒక సత్కర్మమును చేయనివాడను, క్రూరమైన పాపములు కలవాడను అయినట్టినేను,నాకు స్వల్ప పాపమైనను నాయందు కనిపించుటలేదు!
నాట్టినాయెన్నై, ఉనక్కు మున్ తొణ్డాగ,
మాట్టినేనత్తనైయేకొణ్డు, ఎన్వల్వినైయై,
పాట్టినాల్ ఉన్నై, ఎన్నెఞ్జిత్తిరున్దమై
కాట్టినాయ్, కణ్ణపురత్తుఱై అమ్మానే ll 1746
కణ్ణపురత్తు ఉఱై=తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న;అమ్మానే=స్వామీ!; మున్ = మొదట; ఎన్నై=నన్ను; ఉనక్కు= శ్రీవారికి;తొణ్డు ఆగ=దాసునిగ;నాట్టినాయ్=స్థాపించితిరి; అత్తనైయేకొణ్డు = ఆ కృపయే ఆధారముగా చేసుకొనినేను; ఎన్ వల్ వినైయై = నాయొక్క క్రూరమైన పాపములన్నియు; మాట్టినేన్ = పోగొట్టుకొంటిని; (మరియు) పాట్టినాల్ = ఇటువంటి పాశురములతో; ఉన్నై = శ్రీవారిని; ఎన్ నెఞ్జిత్తు ఇరున్దమై = నాయొక్క హృదయమందు సదా అమరియండునట్లు; కాట్టినాయ్ = దివ్యమైన మార్గమును ప్రకాశింపజేసితిరికదా! స్వామీ!
తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామీ!, మొదట నన్ను, శ్రీవారికి దాసునిగ స్థాపించితిరి,ఆ కృపయే ఆధారముగా చేసుకొనినేను నాయొక్క క్రూరమైన పాపములన్నియు పోగొట్టుకొంటిని.( మరియు ) ఇటువంటి పాశురములతో శ్రీవారిని నాయొక్క హృదయమందు సదా అమరియండునట్లు దివ్యమైన మార్గమును ప్రకాశింప జేసితిరి కదా! స్వామీ!
** కణ్డశీర్, క్కణ్ణపురత్తుఱైయమ్మానై,
కొణ్డశీర్ త్తొణ్డన్, కలియనొలిమాలై,
పణ్డమాయ్ ప్పాడుమ్, అడియవర్కెఞ్జాన్ఱుమ్,
అణ్డమ్బోయాట్చి, అవర్కదఱిన్దోమే ll 1747
కణ్డ శీర్ = కనులతో ప్రత్యక్షముగ చూడగల ఐశ్వర్యముతో ఒప్పు;కణ్ణపురత్తు ఉఱై= తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న;అమ్మానై=స్వామి శౌరి పెరుమాళ్ విషయమై; శీర్ కొణ్డ = శ్రీ వైష్ణవలక్ష్మి గలవారైన; తొణ్డన్ = దాసుడైన; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలిమాలై = అనుగ్రహించిన సూక్తులమాలను;పణ్డమ్ ఆయ్=ఒక నిధివలె తమ హృదయమున నుంచుకొని;పాడుమ్=గానము చేయగల;అడియవర్కు= శ్రీ వైష్ణవులకు; ఎఞ్జాన్ఱుమ్ = ఎల్లప్పుడును; అణ్డమ్ పోయ్ ఆట్చి = పరమపదమునకు పోయి పాలించగల సౌభాగ్యము పొందగలరు; అవర్కు అదు అఱిన్దోమే = ఆ మహనీయులకు ఆ సౌభాగ్యమే కలుగునని నిశ్చయముగ తెలుసుకొంటిమి!.
కనులతో ప్రత్యక్షముగ చూడగల ఐశ్వర్యముతో ఒప్పు తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామి శౌరి పెరుమాళ్ విషయమై శ్రీ వైష్ణవలక్ష్మి గలవారైన దాసుడైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన శబ్దపుష్ఠిగల ఈ సూక్తులమాలను ఒక నిధివలె తమ హృదయమున నుంచుకొని గానము చేయగల శ్రీ వైష్ణవులకు ఎల్లప్పుడును పరమపదమునకు పోయి పాలించగల సౌభాగ్యము పొందగలరు. ఆ మహనీయులకు ఆ సౌభాగ్యమే కలుగునని నిశ్చయముగ తెలుసుకొంటిమి!.
తిరుమంగై ఆళ్వార్ తిరువడిగళే శరణం
*********