శ్రీః
3 . కరైయెడుత్త
తిరుకణ్ణపురమ్ దివ్యసన్నిధిలో వేంచేసియున్న శౌరి పెరుమాళ్ దర్శించిన తిరుమంగై ఆళ్వార్, మిక్కిలి ప్రీతిని పొంది ఎడబాటును భరించలేక పరకాలనాయికి అవస్థలో వాపోవుచున్నారు.
** కరై యెడుత్త శురిశఙ్గుమ్, కనపవళత్తెழு కొడియుమ్,
తిరై యెడుత్తు వరు పునల్ శూழ், తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్,
విరై యెడుత్త తుழாయలఙ్గల్, విఱల్ వరైత్తోళ్ పుడైపెయర,
వరై యెడుత్త పెరుమానుక్కు, ఇழన్దేన్ ఎన్ వరివళైయే ll 1668
కరై యెడుత్త =ఘోషించెడి; శురి శఙ్గమ్=సుడులుగల శంఖములును;కనమ్=దట్టమైన; పవళత్తు = పగడముల యొక్క; ఎழு కొడియుమ్ = ఎదిగిన తీగలుగల; తిరై ఎడుత్తు వరు = అలలచేకొట్టుకొనుచు వచ్చు; పునల్ శూழ்= కావేరి జలములతో చుట్టబడిన; తిరుక్కణ్ణపురత్తు = తిరుకణ్ణపురమందు; ఉఱైయుమ్ = నిత్యవాసము చేయుచున్న; విరై ఎడుత్త = పరిమళభరితమైన; తుழாయ్ అలఙ్గల్ = తులసీమాలలు; విఱల్= శక్తివంతమైన,వరై తోళ్ =పర్వతమువంటి భుజములపై; పుడై పెయర= కదులునట్లు; వరై యెడుత్త = గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి పట్టుకొనిన; పెరుమానుక్కు= సర్వేశ్వరునికి; ఎన్ వరి వళైయే = నాయొక్క అందమైన కంకణములను; ఇழన్దేన్ = పోగొట్టుకొంటిని.
ఘోషించెడి సుడులుగల శంఖములును,దట్టమైన పగడముల యొక్క ఎదిగిన తీగలుగల అలలచేకొట్టుకొనుచు వచ్చు కావేరి జలములతో చుట్టబడిన తిరుకణ్ణపురమున నిత్యవాసము చేయుచున్న పరిమళభరితమైన తులసీమాలలు పర్వతమువంటి భుజములపై కదులునట్లు గోవర్ధనపర్వతమును గొడుగుగ పైకెత్తి పట్టుకొనిన సర్వేశ్వరునికి నాయొక్క అందమైన కంకణములను పోగొట్టుకొంటిని.
అరివిరవు ముగిల్ కణత్తాల్, అగిఱ్పుగైయాల్ వరై యోడుమ్,
తెరివరియ మణిమాడ, తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్,
వరి యరవినణై త్తుయిన్ఱు, మழைమదత్త శిఱు తరుకణ్,
కరి వెరవ మరుప్పొశిత్తాఱ్కు, ఇழన్దేన్ ఎన్ కనవళైయే ll 1669
అరివిరవు ముగిల్ కణత్తాల్=నల్లనైన మేఘ సమూహములచే;అగిల్ పుగైయాల్ = అగిల్ దుంగలయొక్క పొగలచేతను;( కమ్మిన చీకటిచే) వరై యోడుమ్ తెరివు అరియ= పర్వతముతోకూడ స్పష్టముగ తెలియని;మణి మాడ=మణిమయమయిన భవంతులతో ఒప్పు;తిరుక్కణ్ణపురత్తు= తిరుకణ్ణపురమందు; ఉఱైయుమ్=నిత్యవాసము చేయుచున్న; వరి అరవు ఇన్ అణై తుయిన్ఱు = పడగలయందు రేకలుగల ఆదిశేషుని భోగ్యమైన తల్పముపై పవళించియున్నవాడును; మழை మదత్త = వర్షము వలె పెరుగుచున్న మదజలము గలదియు;శిఱు తరు కణ్ = చిన్న క్రూరమైన కన్నులుగల; కరి వెరవ= కువలయాపీడమను ఏనుగు భయపడునట్లు; మరుప్పు ఒశిత్తాఱ్కు=దంతములును పెరికి చంపిన సర్వేశ్వరునికి; ఎన్ కన వళైయే = నాయొక్క బంగారు కంకణములను; ఇழన్దేన్ = పోగొట్టుకొంటిని.
నల్లనైన మేఘ సమూహములచే,అగిల్ దుంగలయొక్క పొగలచేతను (కమ్మిన చీకటిచే) పర్వతముతోకూడ స్పష్టముగ తెలియని మణిమయమయిన భవంతులతో ఒప్పు తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న,పడగలయందు రేకలుగల ఆదిశేషుని భోగ్యమైన తల్పముపై పవళించియున్నవాడును,వర్షము వలె పెరుగుచున్న మదజలముగలదియు చిన్న క్రూరమైన కన్నులుగల కువలయాపీడమను ఏనుగు భయపడునట్లు దంతములును పెరికి చంపిన సర్వేశ్వరునికి నాయొక్క బంగారు కంకణములను పోగొట్టుకొంటిని.
తుఙ్గ మామణిమాడ, నెడుముకట్టిన్ శూలిగై పోమ్,
తిఙ్గల్ మాముకిల్ తుణిక్కుమ్, తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్,
పైఙ్గణ్ మాల్ విడైయడర్తు, ప్పనిమదికోళ్ విడుత్తుగన్ద,
శెఙ్గణ్ మాల్ అమ్మానుక్కు, ఇழన్దేన్ ఎన్ శెఱివళైయే ll 1670
తుఙ్గమ్ మా మణిమాడ = ఉన్నతమైన,శ్లాఘ్యమైన రత్నములతో పొదగబడిన భవనముల; నెడు ముకట్టిన్ శూలిగై=పొడుగైన శిఖరముల పైనున్న శూలములు;పోమ్ తిఙ్గల్ మాముకిల్ తుణిక్కుమ్ = పైన సంచరించుచున్న చంద్రునిని, పెద్ద మేఘములను చేధించుచుండు; తిరుక్కణ్ణపురత్తు= తిరుకణ్ణపురమందు; ఉఱైయుమ్ = నిత్యవాసము చేయుచున్న; పైమ్ కణ్ మాల్ విడై అడర్తు = పసుపు పచ్చని కన్నులుగల పెద్ద వృషభములను వధించియు; పని మది కోళ్ విడుత్తు= చల్లని చంద్రునియొక్క క్షయను పోగొట్టి; ఉగన్ద=ఆనందించిన; శెమ్ కణ్=పుండరీకాక్షుడు;మాల్ అమ్మానుక్కు = ఆశ్రితలయందు వాత్సల్యముగల సర్వేశ్వరునికి;ఎన్ శెఱి వళైయే = నాయొక్క అమూల్యమైన కంకణములను; ఇழన్దేన్ = పోగొట్టుకొంటిని.
ఉన్నతమైన,శ్లాఘ్యమైన రత్నములతో పొదగబడిన భవనముల పొడుగైన శిఖరముల పైనున్న శూలములు, పైన సంచరించుచున్న చంద్రునిని, పెద్ద మేఘములను చేధించుచుండు తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న,పసుపుపచ్చని కన్నులు గల పెద్ద వృషభములను వధించియు, చల్లని చంద్రునియొక్క క్షయను పోగొట్టి ఆనందించిన పుండరీకాక్షుడు,ఆశ్రితలయందు వాత్సల్యముగల సర్వేశ్వరునికి నాయొక్క అమూల్యమైన కంకణములను పోగొట్టుకొంటిని.
కణమరువు మయిలగవు, కడి పొழிల్ శూழ் నెడుమరుగిల్,
తిణమరువు కన మదిళ్ శూழ், తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్,
మణమరువు తోళ్ ఆయ్ చ్చి, ఆర్ క్క ప్పోయ్ ఉరలోడుమ్,
పుణర్ మరుదమిఱ నడన్దాఱ్కు, ఇழన్దేన్ ఎన్ పొన్ వళైయే ll 1671
కణమ్ మరువు = సమూహములుగ చేరియుండు; మయిల్ = నెమళ్ళు యొక్క; అగవు= నృత్యములతోకూడిన; కడి పొழிల్ శూழ் = పరిమళభరితమైన తోటలతో చుట్టబడిన; నెడు మరుగిల్ = పొడుగైన వీధులును; తిణమ్ మరువు=దృఢత్వము కలిగిన;కన మదిళ్ శూழ் = బంగారుమయమయిన ప్రాకారములతో చుట్టుకొనియున్న; తిరుక్కణ్ణపురత్తు = తిరుకణ్ణపురమందు; ఉఱైయుమ్=నిత్యవాసము చేయుచున్న; మణమ్ మరువు తోళ్ ఆయ్ చ్చి = పరిమళము కలిగిన భుజములుగల గోపకాంత యశోదాదేవి; ఆర్ క్క = తాటితో కట్టగ; ఉరలోడుమ్ పోయ్ = ఆ రోకలితోకూడ పోయి; పుణర్ మరుదమ్ = జతగా చేరియున్న రెండు మద్ది వృక్షములు; ఇఱ=విరిగి క్రిందపడునట్లు;నడన్దాఱ్కు = పాకినట్టి సర్వేశ్వరునికి; ఎన్ పొన్ వళైయే = నాయొక్క బంగారు కంకణములను; ఇழన్దేన్ = పోగొట్టుకొంటిని.
సమూహములుగ చేరియుండు నెమళ్ళు యొక్క నృత్యములతోకూడిన పరిమళభరితమైన తోటలతో చుట్టబడిన పొడుగైన వీధులును, దృఢత్వము కలిగిన బంగారుమయమయిన ప్రాకారములతో చుట్టుకొనియున్న తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న,పరిమళము కలిగిన భుజములుగల గోపకాంత యశోదాదేవి తాటితో కట్టగ, ఆ రోకలితోకూడ పోయి, జతగా చేరియున్న రెండు మద్ది వృక్షములు విరిగి క్రిందపడునట్లు పాకినట్టి సర్వేశ్వరునికి నాయొక్క బంగారు కంకణములను పోగొట్టుకొంటిని.
వాయెడుత్త మన్తిరత్తాల్, అన్దణర్ తమ్ శెయ్ తొழிల్ గళ్,
తీయెడుత్తు మఱైవళర్కుమ్, తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్,
తాయెడుత్త శిఱుకోలుక్కు, ఉళైన్దోడి త్తయిరుణ్డ,
వాయ్ తుడైత్త మైన్దనుక్కు, ఇழన్దేన్ ఎన్ వరి వళైయే ll 1672
అన్దణర్=బ్రాహ్మణోత్తములు;వాయ్ ఎడుత్త మన్తిరత్తాల్=గట్టిగా ఉచ్చరించు మంత్రముల చేత; తమ్ శెయ్ తొழிల్ గళ్ = తాము చేయు అనుష్టానములైన;తీ ఎడుత్తు = అగ్ని సంబంధిత కార్యములు ఏ లోపములు లేకుండచేసి;మఱై వళర్కుమ్=వేద మర్యాదలను వృద్ధిపొందించుచుండు స్థానమైన; తిరుక్కణ్ణపురత్తు = తిరుకణ్ణపురమందు;ఉఱైయుమ్= నిత్యవాసము చేయుచున్న; తాయ్ ఎడుత్త = తల్లి యశోదాదేవి చేతితో పైకెత్తిన; శిఱు కోలుక్కు = చిన్న జాటికర్రకు; ఉళైన్దు ఓడి = భయపడి పారిపోయిన;తయిర్ ఉణ్డ వాయ్ తుడైత్త = పెరుగు ఆరగించిన నోటిని తుడుచుకొనిన; మైన్దనుక్కు= స్వామికి; ఎన్ వరి వళైయే = నాయొక్క అందమైన కంకణములను; ఇழన్దేన్ = పోగొట్టుకొంటిని.
బ్రాహ్మణోత్తములు గట్టిగా ఉచ్చరించు మంత్రముల చేత తాము చేయు అనుష్టానములైన అగ్ని సంబంధిత కార్యములు ఏ లోపములు లేకుండచేసి వేద మర్యాదలను వృద్ధిపొందించుచుండు స్థానమైన తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న, తల్లి యశోదాదేవి చేతితో పైకెత్తిన చిన్న జాటికర్రకు భయపడి పారి పోయిన, పెరుగు ఆరగించిన నోటిని తుడుచుకొనిన స్వామికి నాయొక్క అందమైన కంకణములను పోగొట్టుకొంటిని.
మడలెడుత్త నెడున్దాழை, మరుఙ్గెల్లామ్ వళర్ పవళమ్,
తిడలెడుత్త చ్చుడర్ ఇమైక్కుమ్, తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్,
అడలడర్తు అన్ఱిరణియణై, మురణழிయ అణియుకిరాల్,
ఉడలెడుత్త పెరుమానుక్కు, ఇழన్దేన్ ఎన్నొళి వళైయే ll 1673
మడల్ ఎడుత్త = ఎదిగిన ఆకులుగల; నెడు తాழை = పొడుగైన మొగలి చెట్లయొక్క; మరుఙ్గు ఎల్లామ్ = చుట్టుప్రక్కలంతటను; వళర్=పెరిగిన; పవళమ్=పగడపు దిబ్బలు; తిడల్ ఎడుత్త = మెట్ట ప్రాంతమందు వ్యాపించి;శుడర్ ఇమైక్కుమ్=కాంతితో ప్రకాశించు చుండెడి; తిరుక్కణ్ణపురత్తు= తిరుకణ్ణపురమందు; ఉఱైయుమ్ = నిత్యవాసము చేయుచున్న; అన్ఱు = మునుపొకకాలమున; ఇరణియనై = హిరణ్యాసురుని; అడల్ = యుద్ధమున; అడర్తు = అణిచిపెట్టి; మురణ్ అழிయ = అతనియొక్క బలము నశించునట్లు; అణి ఉకిరాల్ = అందమైన నఖములతో; ఉడల్ ఎడుత్త = శరీరమును చీల్చి వధించిన; పెరుమానుక్కు=సర్వేశ్వరునికి; ఎన్ ఒళి వళైయే=నాయొక్క ప్రకాశించు కంకణములను; ఇழన్దేన్ = పోగొట్టుకొంటిని.
ఎదిగిన ఆకులుగల పొడుగైన మొగలి చెట్లయొక్క చుట్టుప్రక్కలంతటను పెరిగిన పగడపు దిబ్బలు మెట్ట ప్రాంతమందు వ్యాపించి కాంతితో ప్రకాశించుచుండెడి తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న, మునుపొకకాలమున హిరణ్యాసురుని, యుద్ధమున అణిచిపెట్టి,అతనియొక్క బలము నశించునట్లు,అందమైన నఖములతో శరీరమును చీల్చి వధించిన సర్వేశ్వరునికి, నాయొక్క ప్రకాశించు కంకణములను పోగొట్టుకొంటిని.
వణ్డమరుమ్ మలర్ ప్పున్నై, వరినీழలణిముత్తమ్,
తెణ్డిరైకళ్ వరత్తిరట్టుమ్, తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్,
ఎణ్డిశైయుమ్ ఎழு కడలుమ్, ఇరునిలనుమ్ పెరువిశుమ్బుమ్,
ఉణ్డుమిழ் న్ద పెరుమానుక్కు, ఇழన్దేన్ ఎన్నొళి వళైయే ll 1674
వణ్డు అమరుమ్ = భ్రమరములు అమరియున్న; మలర్ = పుష్పములుగల; పున్నై= పున్నై చెట్లయొక్క; వరి నీழల్ =నీడల క్రింద; తెణ్ తిరైకళ్ = స్వచ్ఛమైన అలలు;అణి ముత్తమ్=అందమైన ముత్యములను; వర తిరట్టుమ్=తీసుకొనివచ్చి పోగుపెట్టుచుండు; తిరుక్కణ్ణపురత్తు= తిరుకణ్ణపురమందు; ఉఱైయుమ్= నిత్యవాసము చేయుచున్న; ఎణ్ తిశైయుమ్ = ఎనిమిది దిక్కులును; ఎழு కడలుమ్ = సప్త సముద్రములును; ఇరు నిలనుమ్ = విశాలమైన భూమియును; పెరువిశుమ్బుమ్ = పెద్ద ఆకాశమును; ఉణ్డు = (ప్రళయకాలమున) ఆరగించి; ఉమిழ் న్ద = (సృష్టికాలమున) వెలిబుచ్చిన; పెరుమానుక్కు=సర్వేశ్వరునికి; ఎన్ ఒళి వళైయే=నాయొక్క ప్రకాశించు కంకణములను; ఇழన్దేన్ = పోగొట్టుకొంటిని.
భ్రమరములు అమరియున్న పుష్పములుగల పున్నై చెట్లయొక్క నీడలక్రింద స్వచ్ఛమైన అలలు అందమైన ముత్యములను తీసుకొనివచ్చి పోగు పెట్టుచుండు తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న, ఎనిమిది దిక్కులును, సప్త సముద్రములును, విశాలమైన భూమియును,పెద్ద ఆకాశమును ప్రళయకాలమున ఆరగించి, సృష్టికాలమున వెలిబుచ్చిన సర్వేశ్వరునికి, నాయొక్క ప్రకాశించు కంకణములను పోగొట్టుకొంటిని.
కొఙ్గుమలి కరుఙ్గువళై, కణ్ణాగ తెణ్ కయఙ్గళ్,
శెఙ్గమల ముగమలర్తుమ్, తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్,
వఙ్గమలి తడఙ్గడలుళ్, వరియరవి నణై త్తుయిన్ఱ,
శెఙ్గమల నాభనుక్కు, ఇழన్దేన్ ఎన్ శెఱివళైయే ll 1675
తెణ్ కయఙ్గళ్ = స్వచ్ఛమైన జలములుగల తటాకములయందు; కొఙ్గు మలి కరుమ్ కువళై=పరిమళభరితమైన నల్లని నీలోత్పములు;కణ్ణాగ=నేత్రములను స్పురింపజేయ; శెమ్ కమలమ్ = ఎర్రని తామరపుష్పములు; ముగమ్ అలర్తుమ్ = ముఖములను అలరింప జేయునట్టి; తిరుక్కణ్ణపురత్తు=తిరుకణ్ణపురమందు;ఉఱైయుమ్=నిత్యవాసము చేయుచున్న; వఙ్గ మలి తడ కడలుళ్=పెద్ద పెద్ద అలలతో నిండిన పాలసముద్రమునందు; వరి అరవు ఇన్ అణై తుయిన్ఱు = పడగలయందు రేకలుగల ఆదిశేషుని భోగ్యమైన తల్పముపై పవళించియున్న; శెమ్ కమల నాభనుక్కు=ఎర్రని కమలము నాభియందుగల సర్వేశ్వరునికి;ఎన్ శెఱి వళైయే = నాయొక్క అమూల్యమైన కంకణములను; ఇழన్దేన్ = పోగొట్టుకొంటిని.
స్వచ్ఛమైన జలములుగల తటాకములయందు పరిమళభరితమైన నల్లని నీలోత్పములు నేత్రములను స్పురింపజేయ, ఎర్రని తామర పుష్పములు ముఖములను అలరింపజేయునట్టి తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న, పెద్ద పెద్ద అలలతో నిండిన పాలసముద్రమునందు పడగలయందు రేకలుగల ఆదిశేషుని భోగ్యమైన తల్పముపై పవళించియున్న ఎర్రని కమలము నాభియందుగల సర్వేశ్వరునికి నాయొక్క అమూల్యమైన కంకణములను పోగొట్టుకొంటిని.
వారాళుమిళమ్ కొఙ్గై, నెడుమ్ పణైత్తోళ్ మడప్పావై,
శీరాళుమ్ వరైమార్వన్, తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్,
పేరాళనాయిరమ్పేర్, ఆయిరవాయరవణై మేల్,
పేరాళర్ పెరుమానుక్కు, ఇழన్దేన్ ఎన్ పెయ్ వళైయే ll 1676
వార్ ఆళుమ్ ఇళమ్ కొఙ్గై=వస్త్రముచే కప్పుకొన్న యౌవనమైన వక్షోజములును; నెడుమ్ పణై తోళ్ = వెదురువలె పొడగైన భుజములుగల; మడ = ఆత్మగుణ పరిపూర్ణురాలైన; పావై = శ్రీదేవి నిత్యవాసము చేయుటచే ;శీర్ ఆళుమ్= ఖ్యాతి కలిగిన; వరై మార్వన్ = పర్వతమువలె పెద్ద వక్షస్థలముగలవాడును; తిరుక్కణ్ణపురత్తు = తిరుకణ్ణపురమందు; ఉఱైయుమ్ = నిత్యవాసము చేయుచున్న; పేర్ ఆళన్ = గొప్పతనము కలిగినవాడును; ఆయిరమ్ పేర్ = సహస్రనామములు కలవాడును;ఆయిరమ్ వాయ్ అరవు అణై మేల్ = సహస్ర పడగల ఆదిశేషుని తల్పముపై శయనించియున్న; పేరాళర్ పెరుమానుక్కు = దేవాదిదేవునికి; ఎన్ పెయ్ వళైయే = నాయొక్క చేతులందు అమరిన కంకణములు; ఇழన్దేన్ = పోగొట్టుకొంటిని.
వస్త్రముచే కప్పుకొన్న యౌవనమైన వక్షోజములును,వెదురువలె పొడగైన భుజములుగల ఆత్మగుణ పరిపూర్ణురాలైన శ్రీదేవి నిత్యవాసము చేయుటచే ఖ్యాతి కలిగిన పర్వతమువలె పెద్ద వక్షస్థలము గలవాడును, తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న గొప్పతనము కలిగినవాడును, సహస్రనామములు కలవాడును, సహస్ర పడగల ఆదిశేషుని తల్పముపై శయనించియున్న దేవాదిదేవునికి నాయొక్క చేతులందు అమరిన కంకణములు పోగొట్టుకొంటిని.
** తేమరువు పొழிల్ పుడై శూழ், తిరుక్కణ్ణపురత్తుఱైయుమ్
వామననై, మఱి కడల్ శూழ், వయలాలి వలనాడన్,
కామరుశీర్ కలికన్ఱి, కణ్డురైత్త తమిழ் మాలై,
నా మరువి యివై పాడ, వినైయాయ నణ్ణావే ll 1677
తే మరువు = తేనెలు ఒలుకుచుండు; పొழிల్ పుడై శూழ் = తోటలు నలుపక్కల చుట్టుకొనియున్న; తిరుక్కణ్ణపురత్తు ఉఱైయుమ్ = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న; వామననై = వామనమూర్తిగ అవతరించిన సర్వేశ్వరుని విషయమై; మఱి కడల్ శూழ்=అలలుకొట్టుచున్న సముద్రముచే చుట్టుకొనియున్న;వయల్ = పొలములతో ఒప్పు; ఆలి నాడన్ = తిరువాలి దేశమునకు నాయకుడును; కామరు శీర్ = ఆశింపబడు సద్గుణ సంపన్నులైనవారును; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్; కణ్డు ఉరైత్త = సమీక్షించి అనుగ్రహించిన; తమిழ் మాలై = తమిళ భాషలో నున్న ఈ పాశురముల మాలను; నా మరువి = నాలికయందుంచుకొని; ఇవై పాడ = వీటిని పఠించినచో; వినై ఆయ = పాపములనబడునవి అంతయు; నణ్ణావే = సమీపించలేక తొలగిపోవునుగదా!.
తేనెలు ఒలుకుచుండు తోటలు నలుపక్కల చుట్టుకొనియున్న తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న వామనమూర్తిగ అవతరించిన సర్వేశ్వరుని విషయమై, పొలములతో ఒప్పు తిరువాలి దేశమునకు నాయకుడును, ఆశింపబడుసద్గుణ సంపన్నులైనవారును, తిరుమంగై ఆళ్వార్ సమీక్షించి అనుగ్రహించిన తమిళ భాషలో నున్న ఈ పాశురముల మాలను నాలికయందుంచుకొని వీటిని పఠించినచో పాపములనబడునవి అంతయు సమీపించలేక తొలగిపోవునుగదా!.
*******