శ్రీః
4 . విణ్ణవర్
తిరుకణ్ణపురమ్ దివ్యసన్నిధిలో వేంచేసియున్న శౌరి పెరుమాళ్ యొక్క విరహతాపమును తీర్పమని తుమ్మెదలును పరాంకుశనాయకి వేడుకొనుచున్నది.
** విణ్ణవర్తఙ్గళ్ పెరుమాన్, తిరుమార్వన్,
మణ్ణవరెల్లామ్ వణఙ్గుమ్, మలి పుగழ்శేర్,
కణ్ణపురత్తెమ్బెరుమాన్, కదిర్ముడిమేల్,
వణ్ణ నఱున్దుழாయ్, వన్దూదాయ్ కోల్తుమ్బీ ll 1678
కోల్ తుమ్బీ=కొమ్మలలో సంచరించు తుమ్మెదా!;విణ్ణవర్ తఙ్గళ్ పెరుమాన్=నిత్యశూరుల యొక్క నాయకుడును; తిరుమార్వన్ = శ్రీ దేవి వక్షస్థలమున కలవాడును; మణ్ణవర్ ఎల్లామ్ వణఙ్గుమ్ = ఈ భూలోకమందలి జనులందరిచే సేవింపబడువాడును; మలి పుగழ்శేర్ = మిక్కిలి కీర్తిగల వాడును; కణ్ణపురత్తు ఎమ్బెరుమాన్ = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క; కదిర్ ముడిమేల్ = ప్రకాశించుచున్న శిరస్సుపైగల; వణ్ణమ్ నఱు తుழாయ్ = అందమైన పరిమళభరితమైన తులసీమాల యొక్క సువాసనను గ్రహించి; వన్దు = ఇచటకు వచ్చి; ఊదాయ్ = నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!, నిత్యశూరులయొక్క నాయకుడును, శ్రీ దేవి వక్షస్థలమున కలవాడును, ఈ భూలోకమందలి జనులందరిచే సేవింపబడు వాడును, మిక్కిలి కీర్తిగల వాడును, తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క ప్రకాశించుచున్న శిరస్సుపైగల అందమైన పరిమళభరితమైన తులసీ మాల యొక్క సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
వేదముదల్వన్, విలఙ్గుపురి నూలన్,
పాదమ్ పరవి, ప్పలరుమ్బణిన్దేత్తి,
కాదన్మైశెయ్యుమ్, కణ్ణపురత్తెమ్బెరుమాన్,
తాదు నఱున్దుழாయ్, తాழ் న్దూదాయ్ కోల్తుమ్బీ ll 1679
కోల్ తుమ్బీ= కొమ్మలలో సంచరించు తుమ్మెదా!;వేదముదల్వన్ = వేదములచే ప్రప్రధమ బాధ్యతగ అద్వితీయుడని ప్రతిపాదింపబడినవాడును;విలఙ్గు పురి నూలన్=ప్రకాశించు యఙ్ఞోపవీతము తన మేనియందు కలవాడును; పలరుమ్ = పలువురు; పాదమ్ = దివ్య చరణములను, పరవి పణిన్దు ఏత్తి = ఆశ్రయించి సేవించుకొని స్తుతించి; కాదన్మై శెయ్యుమ్ = భక్తితో ప్రీతికలిగియండు; కణ్ణపురత్తు ఎమ్బెరుమాన్ = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క; తాదు = పుప్పొడి రేణువులతో నిండిన;నఱు తుழாయ్ = పరిమళభరితమైన తులసీమాల యందు; తాழ் న్దు = మునిగి; ఊదాయ్ = ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!,వేదములచే ప్రప్రధమ బాధ్యతగ అద్వితీయుడని ప్రతిపాదింపబడినవాడును,ప్రకాశించు యఙ్ఞోపవీతము తన మేని యందు కలవాడును, పలువురు దివ్య చరణములను ఆశ్రయించి సేవించుకొని స్తుతించి భక్తితో ప్రీతికలిగియండు తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క పుప్పొడి రేణువులతో నిండిన పరిమళభరితమైన తులసీమాలయందు మునిగి ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
విణ్డమలరెల్లామ్, ఊదినీయెన్ పెరుది,
అణ్డముదల్వన్, అమరర్గళెల్లారుమ్,
కణ్డు వణఙ్గుమ్, కణ్ణపురత్తెమ్బెరుమాన్,
వణ్డు నఱున్దుழாయ్, వన్దూదాయ్ కోల్తుమ్బీ ll 1680
కోల్ తుమ్బీ= కొమ్మలలో సంచరించు తుమ్మెదా!; నీ = నీవు; విణ్డ మలర్ ఎల్లామ్ = వికసించిన పుష్పములందంతటను; ఊది = ఝంకారము చేసి; ఎన్ పెరుది = ఏమి పొందెదవు; అణ్డమ్ ముదల్వన్ = పరమపదమునకు నిర్వాహకుడును; అమరర్గళ్ ఎల్లారుమ్ = బ్రహ్మాదిదేవతలందరును; కణ్డు వణఙ్గుమ్ = వెదకి సేవించుచుండెడి; కణ్ణపురత్తు ఎమ్బెరుమాన్ = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క; వణ్డు నఱు తుழாయ్ = భ్రమరములు చేరెడు పరిమళభరితమైన తులసీమాల యొక్క సువాసనను గ్రహించి; వన్దు = ఇచటకు వచ్చి; ఊదాయ్ = నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!, నీవు వికసించిన పుష్పములందంతటను ఝంకారము చేసి ఏమి పొందెదవు?,పరమపదమునకు నిర్వాహకుడును, బ్రహ్మాదిదేవతలందరును వెదకి సేవించుచుండెడి తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క భ్రమరములు చేరెడు పరిమళ భరితమైన తులసీమాల యొక్క సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
నీర్ మలికిన్ఱ దోర్, మీనాయ్ ఓరామైయుమాయ్,
శీర్ మలికిన్ఱ దోర్, శిఙ్గవురువాగి,
కార్ మలివణ్ణన్, కణ్ణపురత్తెమ్బెరుమాన్,
తార్ మలి తణ్ తుழாయ్, తాழ் న్దూదాయ్ కోల్తుమ్బీ ll1681
కోల్ తుమ్బీ= కొమ్మలలో సంచరించు తుమ్మెదా!; నీర్ మలికిన్ఱదు = సముద్రమందు వ్యాపించిన; ఓర్ మీన్ ఆయ్ = అద్వితీయమైన మత్స్యావతారము దాల్చినవాడును; ఓర్ ఆమైయుమ్ ఆయ్=విలక్షణమైన కూర్మావతారము దాల్చినవాడును;శీర్ మలికిన్ఱదు ఓర్ శిఙ్గమ్ ఉరువాగి = మిక్కిలి ఖ్యాతికలిగిన అద్వితీయమైన నరసింహావతారము దాల్చినవాడును; కార్ మలి వణ్ణన్ = మేఘముకంటెను శ్లాఘ్యమైన నల్లని వర్ణము గలవాడును;కణ్ణపురత్తు ఎమ్బెరుమాన్ = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క; తార్ మలి తణ్ తుழாయ్ = దట్టమైన మాలయందుగల చల్లని తులసీదళములలో; తాழ் న్దు = మునిగి; ఊదాయ్ = ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!,సముద్రమందు వ్యాపించిన అద్వితీయమైన మత్స్యావతారము దాల్చినవాడును,విలక్షణమైన కూర్మావతారము దాల్చినవాడును, మిక్కిలి ఖ్యాతికలిగిన అద్వితీయమైన నరసింహావతారము దాల్చినవాడును, మేఘము కంటెను శ్లాఘ్యమైన నల్లని వర్ణము గలవాడును, తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క దట్టమైన మాలయందుగల చల్లని తులసీదళములలో మునిగి ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!
ఏరార్ మలరెల్లామ్, ఊదినీయెన్ పెరుది,
పారారులగమ్, పరవ ప్పెరుఙ్గడలుళ్,
కారామైయాన, కణ్ణపురత్తెమ్బెరుమాన్,
తారార్ నఱున్దుழாయ్, తాழ் న్దూదాయ్ కోల్తుమ్బీ ll 1682
కోల్ తుమ్బీ= కొమ్మలలో సంచరించు తుమ్మెదా!; నీ = నీవు; ఏర్ ఆర్ మలర్ ఎల్లామ్ = మిక్కిలి సుందరమైన ఇతర పుష్పములందంతటను; ఊది = ఝంకారము చేసి; ఎన్ పెరుది = ఏమి పొందెదవు?; పార్ ఆర్ ఉలగమ్ = ఈ భూమియందున్న సకల జనులు; పరవ = స్తుతించి సేవించునట్లు; పెరు కడలుళ్=అగాధమైన సముద్రమందు;కార్ ఆమై ఆన =పెద్ద కూర్మముగ అవతరించిన; కణ్ణపురత్తు ఎమ్బెరుమాన్ = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క; తార్ ఆర్ నఱు తుழாయ్ = దట్టమైన మాలయందుగల పరిమళభరితమైన తులసీదళములలో;తాழ் న్దు=మునిగి; ఊదాయ్= ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!,నీవు మిక్కిలి సుందరమైన ఇతర పుష్పములందంతటను ఝంకారము చేసి ఏమి పొందెదవు?,ఈ భూమియందున్న సకల జనులు స్తుతించి సేవించునట్లు అగాధమైన సముద్రమందు పెద్ద కూర్మముగ అవతరించిన తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క దట్టమైన మాలయందుగల పరిమళభరితమైన తులసీదళములలో మునిగి ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
మార్విల్ తిరువన్, వలనేన్దు శక్కరత్తన్,
పారై ప్పిళన్ద, పరమన్ పరఞ్జోది,
కారిల్ తిగழ், కాయావణ్ణన్ కదిర్ముడిమేల్,
తారి న్నఱున్దుழாయ్, తాழ் న్దూదాయ్ కోల్తుమ్బీ ll 1683
కోల్ తుమ్బీ= కొమ్మలలో సంచరించు తుమ్మెదా!; మార్విల్ తిరువన్ = వక్షస్థలమందు శ్రీమహాలక్ష్మిని కలిగినవాడును;వలన్ ఏన్దు శక్కరత్తన్=కుడిహస్తమున సుదర్శనచక్రము ధరించినవాడును;పారై ప్పిళన్ద పరమన్=భూమిని అండభిత్తినుండి పెగళించి ఉద్దరించిన అద్వితీయుడును; పరమ్ శోది = సాటిలేని జ్యోతిస్వరూపుడును; కారిల్ తిగழ் = నల్లని వర్ణముతొ ప్రకాశించు; కాయావణ్ణన్ = రెల్లు పూవువంటి వర్ణముగల సర్వేశ్వరుని యొక్క; కదిర్ ముడిమేల్ = ప్రకాశించుచున్న శిరస్సుపైగల; తారిల్ = మాలయందుగల; నఱు తుழாయ్ = పరిమళభరితమైన తులసీదళములలో; తాழ் న్దు= మునిగి; ఊదాయ్ = ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!,వక్షస్థలమందు శ్రీ మహాలక్ష్మిని కలిగినవాడును, కుడిహస్తమున సుదర్శనచక్రము ధరించినవాడును, భూమిని అండభిత్తినుండి పెగళించి ఉద్దరించిన అద్వితీయుడును, సాటిలేని జ్యోతి స్వరూపుడును నల్లని వర్ణముతొ ప్రకాశించు రెల్లు పూవువంటి వర్ణముగల సర్వేశ్వరుని యొక్క ప్రకాశించుచున్న శిరస్సుపైగల మాలయందుగల పరిమళభరితమైన తులసీ దళములలో మునిగి ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
వామనన్ కఱ్కి, మదుశూదన్ మాదవన్,
తార్మన్ను, దాశరథియాయ తడమార్వన్,
కామన్ తన్ తాదై, కణ్ణపురత్తెమ్బెరుమాన్,
తామ నఱున్దుழாయ్, తాழ் న్దూదాయ్ కోల్తుమ్బీ ll 1684
కోల్ తుమ్బీ= కొమ్మలలో సంచరించు తుమ్మెదా!;వామనన్ = వామనావతారము ఎత్తిన వాడును; కఱ్కి = కల్కిగ అవతరించువాడును; మదుశూదన్ = మధువను అసురిని వధించినవాడును; మాదవన్ = శ్రీదేవి వల్లభుడును, తార్ మన్ను=రక్షకత్వమును సూచించెడి మాలను ఎల్లప్పుడు కలిగిన; తడమార్వన్ = విశాలమైన వక్షస్థలముగల; దాశరథి ఆయ = దశరథుని పుత్రునిగ అవతరించినవాడును; కామన్ తన్ తాదై = మన్మధుని యొక్క తండ్రియైన; కణ్ణపురత్తు ఎమ్బెరుమాన్ = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క; తామమ్ = మాలయందు గల; నఱు తుழாయ్ = పరిమళభరితమైన తులసీదళములలో; తాழ் న్దు=మునిగి; ఊదాయ్ =ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!,వామనావతారము ఎత్తినవాడును, కల్కిగ అవతరించువాడును ,మధువను అసురిని వధించినవాడును, శ్రీదేవి వల్లభుడును, రక్షకత్వమును సూచించెడి మాలను ఎల్లప్పుడు కలిగిన విశాలమైన వక్షస్థలముగల దశరథుని పుత్రునిగ అవతరించిన వాడును, తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క మాలయందుగల పరిమళభరితమైన తులసీ దళములలో మునిగి ఆ సువాసనను గ్రహించి ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
నీలమలర్ గళ్, నెడునీర్వయల్ మరుఙ్గిల్,
శాలమల రెల్లామ్, ఊదాదే, వాళరక్కర్
కాలన్, కణ్ణపురత్తెమ్బెరుమాన్ కదిర్ముడిమేల్,
కోల నఱున్దుழாయ్, కొణ్డూదాయ్ కోల్తుమ్బీ ll 1685
కోల్ తుమ్బీ= కొమ్మలలో సంచరించు తుమ్మెదా!; నెడు నీర్ వయల్ = అధికమైన నీటి వసతులతో ఒప్పు పొలములలోగల; నీలమ్ మలర్ గళ్=నీలోత్పల పుష్పములందును; మరుఙ్గిల్ = చుట్టు ప్రక్కలంతటను గల; శాల మలర్ ఎల్లామ్=చాల పుష్పములందును; ఊదాదే = ఝంకారము చేయక; వాళ్ ఆరక్కర్ కాలన్ = ఖడ్గము ఆయుధముగగల రాక్షసులయొక్క మృత్యువైన;కణ్ణపురత్తు ఎమ్బెరుమాన్ = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క; కదిర్ ముడిమేల్ = ప్రకాశించుచున్న శిరస్సుపై గల; కోలమ్ = అందమైన; నఱు తుழாయ్ కొణ్డు = పరిమళభరితమైన తులసీమాలయందు గల సువాసన గ్రహించి; ఊదాయ్ =ఆ సువాసనను ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!,అధికమైన నీటివసతులతో ఒప్పు పొలములలోగల నీలోత్పల పుష్పములందును, చుట్టుప్రక్కలంతటను గల చాల పుష్పములందును ఝంకారము చేయక ఖడ్గము ఆయుధముగగల రాక్షసులయొక్క మృత్యువైన తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క ప్రకాశించుచున్న శిరస్సుపైగల అందమైన పరిమళభరితమైన తులసీమాలయందు గల సువాసన గ్రహించి, ఆ సువాసనను ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
నన్దన్ మదలై, నిలమఙ్గై నల్ తుణైవన్,
అన్దముదల్వన్, అమరర్ గళ్ తమ్బెరుమాన్,
కన్దఙ్గమழ், కాయావణ్ణన్ కదిర్ముడిమేల్,
కొన్దు నఱున్దుழாయ్, కొణ్డూదాయ్ కోల్తుమ్బీ ll 1686
కోల్ తుమ్బీ= కొమ్మలలో సంచరించు తుమ్మెదా!; నన్దన్ మదలై = నందగోపునియొక్క కుమారుడును; నిలమఙ్గై నల్ తుణైవన్ = శ్రీ భూదేవికి ప్రీతికరమైన వల్లభుడును; అన్దమ్ ముదల్వన్ = సంహారమునకు, సృష్టికి నిర్వాహకుడును; అమరర్ గళ్ తమ్ పెరుమాన్ = నిత్యశూరులకు నాధుడును; కన్దమ్ కమழ் = పరిమళము వెదజల్లు వాడును; కాయావణ్ణన్ = రెల్లు పూవువంటి వర్ణముగల సర్వేశ్వరునియొక్క; కదిర్ ముడిమేల్ = ప్రకాశించుచున్న శిరస్సుపైగల; కొన్దు = గుత్తుగుత్తులుగ నున్న; నఱు తుழாయ్ కొణ్డు = పరిమళభరితమైన తులసీమాలయందు గల సువాసన గ్రహించి; ఊదాయ్ = ఆ సువాసనను ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!,నందగోపునియొక్క కుమారుడును, శ్రీ భూదేవికి ప్రీతికరమైన వల్లభుడును,సంహారమునకు,సృష్టికి నిర్వాహకుడును, నిత్యశూరులకు నాధుడును, పరిమళము వెదజల్లువాడును,రెల్లు పూవువంటి వర్ణముగల సర్వేశ్వరుని యొక్క ప్రకాశించుచున్న శిరస్సుపైగల గుత్తుగుత్తులుగ నున్నపరిమళభరితమైన తులసీమాలయందు గల సువాసన గ్రహించి,ఆ సువాసనను ఇచటకు వచ్చి నాయొక్క వక్షస్థలముపై ఊదుమా!.
** వణ్డమరుఞ్జోలై, వయలాలినన్నాడన్,
కణ్డశీర్ వెన్ఱి, క్కలియనొలిమాలై,
కొణ్డల్ నిఱవణ్ణన్, కణ్ణపురత్తానై,
తొణ్డరోమ్బాడ, ననైన్దూదాయ్ కోల్తుమ్బీ ll 1687
కోల్ తుమ్బీ= కొమ్మలలో సంచరించు తుమ్మెదా!; వణ్డు అమరుమ్ శోలై = భ్రమరములు అమరియున్న తోటలుగలదియు; వయల్=పొలములుగలదియు;ఆలి =తిరువాలియను; నల్ నాడన్ = మంచి దేశమునకు ప్రభువును; కణ్డ శీర్ = ప్రత్యక్షముగ చూడగల సద్గుణ సంపన్నుడును; వెన్ఱి = జయశీలుడును; కలియన్ = తిరుమంగై ఆళ్వార్; ఒలి మాలై = అనుగ్రహించిన ఈ సూక్తులమాలను; కొణ్డల్ నిఱమ్ వణ్ణన్ = మేఘముల వర్ణమువంటి వర్ణముగల; కణ్ణపురత్తానై = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరునిపై; తొణ్డరోమ్ పాడ = భక్తులు పాడగ; నినైన్దు = నీ మనస్సున తలచుకొని; ఊదాయ్ = ఝంకారము చేయుమా!
కొమ్మలలో సంచరించు తుమ్మెదా!,భ్రమరములు అమరియున్న తోటలు గలదియు,పొలములుగలదియు, తిరువాలియను మంచి దేశమునకు ప్రభువును, ప్రత్యక్షముగ చూడగల సద్గుణ సంపన్నుడును, జయశీలుడును, తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ సూక్తులమాలను, మేఘముల వర్ణమువంటి వర్ణముగల, తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరునిపై, భక్తులు పాడగ, నీ మనస్సున తలచుకొని ఝంకారము చేయుమా !
******