పెరియతిరుమొழி-8వపత్తు (5)

శ్రీః

5  . తన్దైకాలిల్

తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న స్వామియొక్క కలయిక కొరకు వేచియున్న పరకాలనాయకి విలపించుచున్నారు.

** తన్దైకాలిల్  విలఙ్గు అఱ, వన్దు తోన్ఱియ తోన్ఱల్ పిన్, తమియేన్ తన్

శిన్దైపోయిర్ట్రు, త్తిరువరుళ్ అవనిడై ప్పెఱుమ్ అళవిరున్దేనై,

అన్దికావలన్ అముదుఱు పశుఙ్గదిర్, అవైశుడ అదనోడుమ్,

మన్దమారుదమ్ వనములై తడవన్దు, వలిశెయ్ వదొழிయాదే  ll 1698

తన్దై కాలిల్ = తండ్రి వసుదేవునియొక్క కాళ్ళయందలి; విలఙ్గు అఱ = సంకెళ్లు తెగి క్రిందపడునట్లు; వన్దు తోన్ఱియ = అవతరించిన; తోన్ఱల్ పిన్ = స్వామియైన శ్రీకృష్ణుని  వెనుకనే; తమియేన్ తన్ = ఏకాకియైన నాయొక్క; శిన్దై పోయిర్ట్రు = మనస్సు వెడలి పోయినది; అవనిడై = ఆ స్వామి చెంతనుండి; తిరు అరుళ్ = దివ్యమైన కృప; పెఱుమ్ అళవు ఇరున్దేనై = పొందు సమయమువరకు చూచి వేచియున్న నన్ను;అన్ది కావలన్ = రాత్రివేళకు రాజైన చంద్రునియొక్క; అముదు ఉఱు= మిక్కిలి అమృతమయమయిన; పశుమ్ కదిర్ అవై = ఆ చల్లని కిరణములు; శుడ =నన్ను  దహించుచుండగ; అదనోడుమ్ = దానితో చేరి; మన్ద మారుదమ్ = మంద మారుతము; వన ములై తడమ్ వన్దు = నా అందమైన స్తనముల మధ్య వీచి; వలిశెయ్ వదు ఒழிయాదు = హింసించుటను విడువకున్నది.

తండ్రి వసుదేవునియొక్క కాళ్ళయందలి సంకెళ్లు తెగి క్రిందపడునట్లు అవతరించిన స్వామియైన శ్రీకృష్ణుని వెనుకనే ఏకాకియైన నాయొక్క మనస్సు వెడలి పోయినది. ఆ స్వామి చెంతనుండి దివ్యమైన కృప పొందు సమయమువరకు చూచి వేచియున్న నన్ను, రాత్రివేళకు రాజైన చంద్రునియొక్క మిక్కిలి అమృతమయమయిన ఆ చల్లని కిరణములు నన్ను  దహించుచుండగ,దానితో చేరి మంద మారుతము నా అందమైన స్తనముల మధ్య వీచి హింసించుటను విడువకున్నది.

మారి మాక్కడల్వళైవణఱ్కు ఇళైయవన్, వరైపురై తిరుమార్విల్,

తారినాశైయిల్ పోయిన నెఞ్జముమ్, తాழ்న్దదు ఓర్ తుణైకాణేన్,

ఊరున్దుఞ్జిర్ట్రు ఉలగముమ్ తుయిన్ఱదు, ఒళియవన్ విశుమ్బు ఇయఙ్గుమ్,

తేరుమ్ పోయిర్ట్రు త్తిశైగళుమ్ మఱైన్దన, శెయ్ వదొన్ఱఱియేనే  ll 1689

మారి = మేఘము వంటి వాడును; మా కడల్ = నీలి సముద్రమువంటి వాడును; వళై వణఱ్కు ఇళైయవన్ =శంఖమువలె తెల్లని వర్ణముగల బలరామునియొక్క తమ్ముడు శ్రీ కృష్ణునియొక్క;వరై పురై=పర్వతముపోలిన;తిరు మార్విల్=దివ్యమైన వక్షస్థలమందు గల; తారిన్ ఆశైయిల్=మాలయందు ఆశచే;పోయిన నెఞ్జముమ్=నన్ను వదలి వెడలిన మనస్సును; తాழ் న్దదు = వెనుకకు వచ్చుటకు బద్దకించినది( ఆ స్వామిచెంతనే ఉండిపోయినది),ఓర్ తుణై కాణేన్ = సహాయకులైన ఏ ఒక్కరిని చూడకున్నాను;ఊరుము తుఞ్జిర్ట్రు=ఊరి జనులందరు నిదురించిరి; ఉలగముమ్ తుయిన్ఱదు= లోకములంతయు నిదురించినది; విశుమ్బు = ఆకాశమున; ఇయఙ్గుమ్ = సంచరించుచున్న; ఒళియవన్ తేరుమ్ = సూర్యునియొక్క రథము; పోయిర్ట్రు =కనుమరుగై పోయినది;తిశైగళుమ్ మఱైన్దన=దిక్కులును తెలియకున్నది; శెయ్ వదు ఒన్ఱు అఱియేనే=నాకిక చేయతగినది ఏమియు తెలియకున్నది!.

మేఘము వంటి వాడును,నీలి సముద్రమువంటి వాడును,శంఖమువలె తెల్లని వర్ణముగల బలరామునియొక్క తమ్ముడు శ్రీ కృష్ణునియొక్క పర్వతముపోలిన దివ్యమైన వక్షస్థలమందుగల మాలయందు ఆశచే నన్ను వదలి వెడలిన మనస్సును వెనుకకు వచ్చుటకు బద్దకించినది. ఆ స్వామి చెంతనే ఉండిపోయినది. సహాయకులైన ఏ ఒక్కరిని చూడకున్నాను. ఊరి జనులందరు నిదురించిరి. లోకములంతయు నిదురించినది. ఆకాశమున సంచరించుచున్న సూర్యునియొక్క రథము కనుమరుగై పోయినది. దిక్కులును తెలియకున్నది.నాకిక చేయతగినది ఏమియు తెలియకున్నది!.

ఆయన్ మాయమేయన్ఱి మర్ట్రెన్ కైయిల్, వళైగళుమ్ ఇఱైనిల్లా,

పేయినారుయిర్ ఉణ్డిడుమ్ పిళ్ళై, నమ్బెణ్ణుయిర్కిరఙ్గుమో,

తూయ మా మదిక్కదిర్ చ్చుడ తుణైయిల్లై, ఇణైములై వేగిన్ఱదాల్,

ఆయన్ వేయినుక్కు అழிగిన్ఱదుళ్ళముమ్, అఞ్జేలెన్బారిల్లైయే  ll 1690

ఆయన్ = శ్రీ కృష్ణునియొక్క;మాయమే అన్ఱి మర్ట్రు ఎన్ = మాయలే తప్ప మరియొకటి ఏమున్నది?; వళైగళుమ్=కంకణములు; కైయిల్ ఇఱై నిల్లా=చేతులందు క్షణకాలమైనను నిలుచుటలేదు;పేయినార్ ఉయిర్ ఉణ్డిడుమ్ పిళ్ళై=రక్కసి పూతనయొక్కప్రాణములను ఆరగించి ఆమెను వధించిన బాలుడు; నమ్ పెణ్ ఉయిర్కు ఇరఙ్గుమో=(ఆ పూతనవలె) స్త్రీలుగ జన్మించిన మనయొక్క ప్రాణములపై దయకలిగియుండునో?; తూయ మా మది = శుద్దమైన తెల్లని చంద్రునియొక్క; కదిర్ శుడ=కిరణములు దహించుచుండగ; ఇణై ములై వేగిన్ఱదాల్ = నాయొక్క రెండు స్తనములు మండిపోవుచున్నదయ్యో!; తుణై ఇల్లై=సహాయము లేదు; ఉళ్ళముమ్=నా మనస్సు;ఆయన్=శ్రీ కృష్ణునియొక్క,వేయినుక్కు=వేయు మురళీనాధమునకు;అழிగిన్ఱదు=మాయమైపోయినది; అఞ్జేల్ ఎన్బార్ ఇల్లైయే= ” భయపడకుమా! ” అని అభయమిచ్చువారెవ్వరు లేరే!

శ్రీ కృష్ణునియొక్క మాయలే తప్ప మరియొకటి ఏమున్నది?,కంకణములు చేతులందు క్షణకాలమైనను నిలుచుటలేదు. రక్కసి పూతనయొక్కప్రాణములను ఆరగించి ఆమెను వధించిన బాలుడు (ఆ పూతనవలె) స్త్రీలుగ జన్మించిన మనయొక్క ప్రాణములపై దయకలిగియుండునో?.శుద్దమైన తెల్లని చంద్రునియొక్క కిరణములు దహించుచుండగ నాయొక్క రెండు స్తనములు మండిపోవుచున్నదయ్యో!, సహాయము లేదు. నా మనస్సు శ్రీ కృష్ణునియొక్క వేయు మురళీనాధమునకు మాయమైపోయినది. “భయపడకుమా!” అని అభయమిచ్చువారెవ్వరు లేరే!

కయఙ్గొళ్ పుణ్డలై క్కళిఱున్దు వెన్దిఱల్, కழల్మన్నర్ పెరుమ్బోరిల్,

మయఙ్గ వెణ్ శఙ్గమ్ వాయ్ వైత్త మైన్దనుమ్, వన్దిలన్ మఱికడల్ నీర్,

తయఙ్గు వెణ్డిరై త్తివలై నుణ్ పనియెన్నుమ్, తழల్ ముకన్దిళములై మేల్,

ఇయఙ్గు మారుదమ్ విలఞ్గిల్ ఎన్నావియై, ఎనక్కెనపెఱలామే  ll 1691

కయమ్ కొళ్ పుణ్ తలై =(చీము,రక్తము)తటాకమువలె ఎండిపోని వ్రణములతో నిండిన శిరములుగల; కళిఱు = గజములను;ఉన్దు =నడిపించు సమర్ధతగల; వెమ్ తిఱల్ =తీవ్రమైన శక్తిగలవారును; కழల్ మన్నర్ = తమ కాళ్ళయందు వీరకంకణములుగల రాజులు; పెరుమ్ పోరిల్ = పెద్ద భారతయుద్దమున; మయఙ్గ = కలతచెందునట్లు;వెణ్ శఙ్గమ్ = తెల్లని పాంచజన్యమను శంఖమును; వాయ్ వైత్త = నోటియందుంచుకొని  పూరించిన; మైన్దనుమ్ = మహాపురుషుడు; వన్దు ఇలన్ = నావద్దకు వచ్చి చేరలేదు; మఱి కడల్ = అలలుకొట్టుచున్న సముద్రము యొక్క; నీర్ = జలమందు; తయఙ్గు = కదలి వచ్చెడి; వెణ్ తిరై = తెల్లని అలలతోకూడియుండు; తివలై నుణ్ పనియెన్నుమ్ = నీటి బిందువులను సూక్ష్మమైన మంచుయని చెప్పబడు; తழల్= నిప్పును; ముకన్దు = మిక్కుటముగ తీసుకొనివచ్చి; ఇళ ములై మేల్ = నాయొక్క యౌవన స్తనములపై; ఇయఙ్గు=వీచుచున్న; మారుదమ్=గాలి; విలఞ్గిల్ ఎన్ ఆవియై= ఒంటరియైన నాయొక్క ప్రాణము; ఎనక్కు ఎన పెఱలామ్ = నాకు చెందినది కాదని స్పురింపజేయుచున్నది.

      (మావటివాని కారణముగ,చీము,రక్తము) తటాకమువలె ఎండిపోని వ్రణములతో నిండిన శిరములుగల గజములను నడిపించు సమర్ధతగల తీవ్రమైన శక్తి గలవారును, తమ కాళ్ళయందు వీరకంకణములుగల రాజులు పెద్ద భారతయుద్దమున కలతచెందునట్లు తెల్లని పాంచజన్యమను శంఖమును నోటియందుంచుకొని పూరించిన మహాపురుషుడు నావద్దకు వచ్చి చేరలేదు. అలలు కొట్టుచున్న సముద్రము యొక్క జలమందు కదలివచ్చెడి తెల్లని అలలతోకూడియుండు నీటి బిందువులను సూక్ష్మమైన మంచుయని చెప్పబడు నిప్పును మిక్కుటముగ తీసుకొనివచ్చి నాయొక్క యౌవన స్తనములపై వీచుచున్న గాలి ఒంటరియైన నాయొక్క ప్రాణమును, నాకు చెందినది కాదని స్పురింపజేయుచున్నది.

ఏழு మామరమ్ తుళైపడ చ్చిలైవళైత్తు, ఇలఙ్గయై మలఙ్గువిత్త,

ఆழிయాన్, నమక్కరుళియ వరుళొడుమ్, పకలెల్లై కழிగిన్ఱదాల్,

తోழிనామ్ ఇదఱ్కెన్ శెయ్ దుమ్ తుణైయిల్లై, శుడర్ పడు ముదునీరిల్,

ఆழ వాழ்కిన్ఱ ఆవియై అడువదోర్, అన్దివన్దు అడైగిన్ఱదే  ll 1692

ఏழு మా మరమ్ = ఏడు పెద్ద సాలవృక్షములు; తుళై పడ శిలై వళైత్తు = చేధించి క్రింద పడునట్లు విల్లును వంచి బాణమును ప్రయోగించినవాడును;ఇలఙ్గయై మలఙ్గువిత్త = లంకాపురి కలతచెందునట్లు చేసిన; ఆழிయాన్ = అంగుళీయకము కలగియున్న స్వామి; నమక్కు అరుళియ అరళొడుమ్ = మునుపు మనకొసగిన కృపతో కూడ; పకల్ ఎల్లై కழிగిన్ఱదాల్=పగలు సమయము ముగిసి పోయినది; ఆల్ = అయ్యో!; తోழி = నాయొక్క సఖీ!; ఇదఱ్కు నామ్ ఎన్ శెయ్ దుమ్ తుణై యిల్లై = ఈ ఆపదకు మనము ఏమి చేయబూనినను సహాయభూతులు ఎవ్వరు లేరు; శుడర్ పడు ముదునీరిల్ = సూర్యుడు ఉదయించు సముద్రమున; ఆழ = ఆ సముద్రమున అస్తమించగ; వాழ்కిన్ఱ ఆవియై అడువదు = ఉన్న ప్రాణము హరించెడు; ఓర్ అన్ది వన్దు = ఘాతమొనరించు సాయంకాలము వచ్చి; అడైగిన్ఱదే = చేరియున్నదే!

ఏడు పెద్ద సాలవృక్షములు చేధించి క్రింద పడునట్లు విల్లును వంచి బాణమును ప్రయోగించినవాడును, లంకాపురి కలతచెందునట్లు చేసిన అంగుళీయకము కలగియున్న స్వామి మునుపు మనకొసగిన కృపతో కూడ పగలు సమయము ముగిసి పోయినది. అయ్యో!, నాయొక్క సఖీ! ఈ ఆపదకు మనము ఏమి చేయబూనినను సహాయభూతులు ఎవ్వరు లేరు.సూర్యుడు ఉదయించు సముద్రమున, ఆ సముద్రమున అస్తమించగ ఉన్న ప్రాణము హరించెడు ఘాతమొనరించు సాయంకాలము వచ్చి చేరియున్నదే!

మురియుమ్ వెణ్డిరై మదుకయమ్ తీప్పడ, ముழఙ్గు అழల్ ఎరియమ్బిన్,

వరికొల్ వెఞ్జిలై వళైవిత్త మైన్దనుమ్, వన్దిలన్ ఎన్ శెయ్ గేన్, 

ఎరియుమ్ వెఙ్కదిర్ తుయిన్ఱదు, పావియేన్ ఇణైనెడుఙ్గణ్ తుయిలా,

కరియనాழிగై ఊழிయిల్ పెరియన, కழிయమాఱు అఱియేనే  ll 1693

మురియుమ్ = పైకెగియుచున్న; వెణ్ తిరై = తెల్లని కెరటములు కలిగిన;మదుకయమ్= సముద్రము; తీ పడ=అగ్నితో రగులునట్లు; ముழఙ్గు అழల్ ఎరి అమ్బిన్= ప్రకాశించు  నిప్పురవ్వలు చిందించు శరములు కలిగిన; వరి కొల్ వెమ్ శిలై = అందమైనదియు, తీవ్రమైన విల్లును;వళై విత్త=వంచి ప్రయోగించిన;మైన్దనుమ్= మహావీరుడైన శ్రీరాముడు; వన్దు ఇలన్ = వచ్చియుండలేదు; ఎన్ శెయ్ గేన్ = ఏమి చేయగలను?; ఎరియుమ్ = ప్రకాశించుచున్న ; వెమ్ కదిర్ = తీవ్రమైన కిరణములుగల సూర్యుడు; తుయిన్ఱదు = అస్తమించెను; పావియేన్ ఇణై నెడుమ్ కణ్ తుయిలా=పాపియైన నాయొక్క విశాలమైన రెండు నేత్రములు నిదురింపదు;ఊழிయిల్ పెరియన = కల్పకాలముల కంటెను అధికమైన; కరియ నాழிగై = ఈ అంధకారమైన రాత్రి సమయము; కழிయమ్ ఆఱు అఱియేనే = ఏ విధముగ గడిచిపోవునో తెలియకున్నది?.

            పైకెగియుచున్న తెల్లని కెరటములు కలిగిన సముద్రము అగ్నితో రగులునట్లు, ప్రకాశించు నిప్పురవ్వలు చిందించు శరములు కలిగిన,అందమైనదియు, తీవ్రమైన విల్లును వంచి ప్రయోగించిన మహావీరుడైన శ్రీరాముడు వచ్చియుండలేదు. ఏమి చేయగలను?, ప్రకాశించుచున్న తీవ్రమైన కిరణములుగల సూర్యుడు అస్తమించెను. పాపియైన నాయొక్క విశాలమైన రెండు నేత్రములు నిదురింపదు. కల్పకాలముల కంటెను అధికమైన ఈ అంధకారమైన రాత్రి సమయము  ఏ విధముగ గడిచిపోవునో తెలియకున్నది?.

కలఙ్గమాక్కడల్ కడైన్దు అడైత్తు, ఇలఙ్గైయర్  కోనదు వరైయాగమ్

మలఙ్గ,  వెఞ్జమత్తు అడుశరన్దురన్ద, ఎమ్మడిగళ్ వారానాల్,

ఇలఙ్గు వెఙ్గదిర్ ఇళమదియదనొడుమ్, విడైమణియడుమ్, ఆయన్

విలఙ్గల్ వేయినదు ఓశైయుమాయ్, ఇని విళై వదొన్ఱఱియేనే  ll 1694

మా కడల్ = పెద్ద సముద్రమును; కలఙ్గ = కలతచెందునట్లు; కడైన్దు = చిలికినవాడును; అడైత్తు = సేతువును కట్టినవాడును;ఇలఙ్గైయర్ కోనదు=లంకాపురి వాసులకు ప్రభువైన రావణాసురునియొక్క; వరైయాగమ్=పర్వతమువంటి వక్షస్థలము;మలఙ్గ=వ్యాకులత  చెందునట్లు; వెమ్ శమత్తు = తీవ్రమైన యుద్ధమందు; అడు శరమ్ తురన్ద = కడతేర్చు శరములను ప్రయోగించిన;ఎమ్ అడిగళ్=నాయొక్క స్వామి;వారాన్ = వచ్చుట లేదు; ఆల్ = అయ్యో!; ఇలఙ్గు = కాంతిగల; వెమ్ కదిర్ = కఠోరమైన కిరణములుగల; ఇళ మది అదనొడుమ్=బాల చంద్రునితో కూడ; విడై మణి =(సాయంకాల సమయమును  సూచించెడి) వృషభముల మెడలందుగల  గంటలు; అడుమ్ = నన్ను శిధిల పరచుచున్నది; ఆయన్ = శ్రీ గోపాలకృష్ణుని;  విలఙ్గల్  వేయినదు = కొండలందలి పెరుగు వెదురుయొక్క మురళి; ఓశైయుమ్ ఆయ్=గానము అంతట ధ్వనించుచుండగ; ఇని విళై వదు ఒన్ఱు అఱియేనే = ఇక ఉండువిధానము ఒక్కటియు తెలియకున్నది!

        పెద్ద సముద్రమును కలతచెందునట్లు చిలికినవాడును, సేతువును కట్టినవాడును, లంకాపురి వాసులకు ప్రభువైన రావణాసురునియొక్క పర్వతమువంటి వక్షస్థలము వ్యాకులత చెందునట్లు తీవ్రమైన యుద్ధమందు,కడతేర్చు శరములను ప్రయోగించిన నాయొక్క స్వామి వచ్చుట లేదు.అయ్యో! కాంతిగల కఠోరమైన కిరణములు గల బాల చంద్రునితో కూడ,(సాయంకాల సమయమును సూచించెడి) వృషభముల మెడలందుగల  గంటలు నన్ను శిధిల పరచుచున్నది. శ్రీ గోపాలకృష్ణుని కొండలందలి పెరుగు వెదురుయొక్క మురళిగానము అంతట ధ్వనించుచుండగ, ఇక ఉండువిధానము ఒక్కటియు తెలియకున్నది !.

ముழுదివ్వైయగమ్ ముఱైకెడ మఱైదలుమ్, మునివనుమ్ మునివెయ్ ద,

మழுవినాల్ మన్నర్ ఆరుయిర్ వవ్వియ, మైన్దనుమ్ వారానాల్,

ఒழுగు నుణ్ పనిక్కు ఒడుఙ్గియ పేడైయై, అడఙ్గవఞ్జిఱైకోలి,

తழுవు నళ్ళిరుళ్ తనిమైయిల్ కడియదోర్, కడువినైయఱియేనే  ll 1695

ఇ వైయగమ్ = ఈ లోకమున; ముழுదు = అంతటను; ముఱైకెడ మఱైదలుమ్ = నీతి, మర్యాదలు నశించు పోవుచుండగ; మునివనుమ్=జమదగ్ని ముని; మునివు ఎయ్ ద = ఆగ్రహము పొందగ; మழுవినాల్ = గండ్రగొడ్డలిచే; మన్నర్ = క్షత్రీయ రాజుల యొక్క; ఆర్ ఉయిర్ = అపూర్వమైన ప్రాణములను; వవ్వియ = హరించిన; మైన్దనుమ్ = శక్తివంతడైన పరశురాముడు; వారాన్ = వచ్చుట లేదు;ఆల్ = అయ్యో!; ఒழுగు నుణ్ పనిక్కు = కురియుచున్న సన్నని మంచువలన; ఒడుఙ్గియ పేడైయై = ముడుచుకొనిన ఆడ పక్షులు; అమ్ శిఱై కోలి = అందమైన తమ రెక్కలతో కప్పుకొనుచు; అడఙ్గ తழுవుమ్ = దగ్గరగ చేరియుండెడి; నళ్ళిరుళ్ = ఈ అర్ధరాత్రియందు; తనిమైయిల్ = (నా స్వామి చెంతలేని) ఇటువంటి ఒంటరియైన జీవితము కంటె; కడియదు =క్రూరమైన; ఓర్ కొడు వినై = వేరొక మహాపాపమును; అఱియేన్ = నాకు తెలియుటలేదు!.

      ఈ లోకమున అంతటను నీతి, మర్యాదలు నశించు పోవుచుండగ, జమదగ్ని ముని ఆగ్రహము పొందగ, గండ్రగొడ్డలిచే క్షత్రీయ రాజుల యొక్క అపూర్వమైన ప్రాణములను హరించిన శక్తివంతడైన పరశురాముడు వచ్చుట లేదు అయ్యో!. కురియుచున్న సన్నని మంచువలన ముడుచుకొనిన ఆడ పక్షులు అందమైన తమ రెక్కలతో కప్పుకొనుచు దగ్గరగ చేరియుండెడి, ఈ అర్ధరాత్రియందు (నా స్వామి చెంతలేని) ఇటువంటి ఒంటరియైన జీవితము కంటె క్రూరమైన వేరొక మహాపాపమును నాకు తెలియుటలేదు!.

కనఞ్జెయ్ మామదిళ్ కణపురత్తవనొడుమ్, కనవినిల్ అవన్ తన్ద,

మనఞ్జెయిన్బమ్ వన్దు ఉట్పుడ ఎళ్ గి, ఎన్వళైనెగ ఇరున్దేనై,

శినఞ్జెయ్ మాల్ విడై శెఱుమణియోశై, ఎన్ శిన్దైయై చ్చిన్దువిక్కుమ్,

అనన్దల్ అన్ఱిలిన్ అరికురల్, పావియేన్ ఆవియై అడుగిన్ఱదే  ll 1696

కనమ్ శెయ్ = దృఢముగ నిర్మింపబడిన; మా మదిళ్=పెద్ద ప్రాకారములతో చుట్టబడిన;  కణపురత్తు అవనొడుమ్ = తిరుకణ్ణపురమందు వేంచేసియున్న ఆసర్వేశ్వరునితో కూడి; కనవినిల్ = స్వప్నమందు; అవన్ తన్ద = ఆ స్వామి ఒసగిన; మనమ్ శెయ్ ఇన్బమ్ = మానసికమైన ఆనందము; వన్దు ఉట్పుడ = తలపుకు రాగ; ఎళ్ గి = మోహమున శిధిలమవగ;ఎన్ వళై నెగ ఇరున్దేనై = నాయొక్క చేతులందు అమరిన కంకణములు జారిపోవునట్లున్న నన్ను; శినమ్ శెయ్ = కోపగించిన; మాల్ విడై = పెద్ద వృషభముల యొక్క; శెఱు మణి ఓశై = క్రూరమైన గంటల ధ్వని;ఎన్ శిన్దైయై=నాయొక్క మనస్సును; శిన్దువిక్కుమ్ = శిధిలపరచుచున్నది; అనన్దల్ = నిదురించుచుండెడి; అన్ఱిలిన్ = అన్ఱిల్ (క్రౌంచ) పక్షియొక్క;అరి కురల్=దయనీయమైన కీచు కీచు ధ్వనులు; పావియేన్ ఆవియై అడుగిన్ఱదే = పాపియైన నా ప్రాణమును హింసించుచున్నది!

దృఢముగ నిర్మింపబడిన పెద్ద ప్రాకారములతో చుట్టబడిన తిరుకణ్ణపురమందు వేంచేసియున్న ఆసర్వేశ్వరునితో కూడి, స్వప్నమందు ఆ స్వామి ఒసగిన మానసికమైన ఆనందము తలపుకు రాగ మోహమున శిధిలమవగ,నాయొక్క చేతులందు అమరిన కంకణములు జారిపోవునట్లున్న నన్ను, కోపగించిన పెద్ద వృషభముల యొక్క క్రూరమైన గంటల ధ్వని నాయొక్క మనస్సును శిధిలపరచుచున్నది. నిదురించుచుండెడి అన్ఱిల్ (క్రౌంచ) పక్షియొక్క దయనీయమైన కీచు కీచు ధ్వనులు పాపియైన నా ప్రాణమును హింసించుచున్నది!

** వార్ కొల్ మెన్ ములై మడన్దైయర్, తడఙ్గడల్ వణ్ణనై తాళ్ నయన్దు,

ఆర్వత్తాల్ అవర్ పులమ్బియ పులమ్బలై, యఱిన్దు మున్నురైశెయ్ ద,

కార్ కొల్ పైమ్బొழிల్ మఙ్గైయర్ కావలన్, కలికన్ఱి యొలివల్లార్,

ఏర్ కొల్ వైకున్ద మానగర్ పుక్కు, ఇమైయవరోడుమ్ కూడువరే  ll 1697

వార్ కొల్=వస్త్రముచే కప్పుకొన్న;మెన్ ములై=మృదువైన వక్షోజములుగల; మడన్దైయర్ అవర్ = ఆ గోపస్త్రీలు;తడ కడల్ వణ్ణనై = పెద్ద సముద్రమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని యుక్క;తాళ్ నయన్దు=దివ్యమైన చరణములందు ఆశపడి;ఆర్వత్తాల్=మిక్కిలి ప్రీతితో,  మున్ పులమ్బియ పులమ్బలై = మునుపు విలపించుచు పలికిన పలుకులు; అఱిన్దు = తెలుసుకొని; కార్ కొల్ పై పొழிల్ మఙ్గైయర్ కావలన్=మేఘములు సంచరించుచుండెడి విశాలమైన తోటలుగల తిరుమంగై దేశమునకు ప్రభువైన;కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్;  ఉరై శెయ్ ద = అనుగ్రహించిన; ఒలి వల్లార్ = శబ్దపుష్ఠిగల ఈ సూక్తులను పఠించువారు; ఏర్ కొల్ వైకున్ద మానగర్ పుక్కు = మిక్కిలి సుందరమైన పరమపదమను  మహా నగరమును ప్రవేశించి; ఇమైయవరోడుమ్ కూడువరే = నిత్యశూరులతో చేరియుందురు!.

వస్త్రముచే కప్పుకొన్న మృదువైన వక్షోజములుగల  ఆ గోపస్త్రీలు పెద్ద సముద్రమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని యుక్క దివ్యమైన చరణములందు ఆశపడి మిక్కిలి ప్రీతితో, మునుపు విలపించుచు పలికిన పలుకులు తెలుసుకొని, మేఘములు సంచరించుచుండెడి విశాలమైన తోటలుగల తిరుమంగై దేశమునకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన శబ్దపుష్ఠిగల ఈ సూక్తులమాలను పఠించువారు మిక్కిలి సుందరమైన పరమపదమను  మహా నగరమును ప్రవేశించి నిత్యశూరులతో చేరియుందురు!.

*******

వ్యాఖ్యానించండి