శ్రీః
9 . కైమ్మానమ్
తిరుకణ్ణపుర దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న శౌరి పెరుమాళ్ కే దాసుడునని తిరుమంగై ఆళ్వార్ వక్కాణించి చెప్పుచున్నారు.
** కైమ్మాన మదయానై, ఇడర్ తీర్త కరుముగిలై,
మైమ్మాన మణియై, అణికొల్ మరదకత్తై,
ఎమ్మానై ఎమ్బిరానై, ఈశనై ఎన్ మనత్తుళ్
అమ్మానై, అడియేన్ అడైన్దు ఉయ్ న్దుపోనేనే ll 1728
మానమ్ కై మద ఆనై=పొడుగైన తొండముగల,మదజలము స్రవించెడి గజేంద్రునియొక్క; ఇడర్ తీర్త = దుఃఖమును తీర్చికరుణించిన;కరుముగిలై = కాలమేఘమువంటి వాడును; మై = కాటుక వంటి వర్ణము కలవాడును; మానమ్ మణియై = అత్యంత విలువైన నీలమేఘ రత్నమువంటివాడును; అణి కొల్ మరదకత్తై = అతి సుందరమైన మరకతము వంటివాడును; ఎమ్మానై = మనయొక్క స్వామియును; ఎమ్బిరానై = మనయొక్క మహోపకారకుడును; ఈశనై = సర్వేశ్వరుడును; ఎన్ మనత్తుళ్ అమ్మానై = నాయొక్క హృదయమందు వేంచేసియున్న స్వామియైన శ్రీ శౌరి పెరుమాళ్ ను;అడియేనై అడైన్దు=దాసుడైన నేను ఆశ్రయించి; ఉయ్ న్దుపోనేనే = ఉజ్జీవించిపోతిని!
పొడుగైన తొండముగల,మదజలము స్రవించెడి గజేంద్రునియొక్క దుఃఖమును తీర్చికరుణించిన,కాలమేఘమువంటి వాడును,కాటుక వంటి వర్ణము కలవాడును, అత్యంత విలువైన నీలమేఘ రత్నమువంటివాడును,అతి సుందరమైన మరకతము వంటివాడును, మనయొక్క స్వామియును, మనయొక్క మహోపకారకుడును, సర్వేశ్వరుడును,నాయొక్క హృదయమందు వేంచేసియున్న స్వామియైన శ్రీ శౌరి పెరుమాళ్ ను దాసుడైన నేను ఆశ్రయించి ఉజ్జీవించిపోతిని!
తరుమాన మழముగిలై, ప్పిరియాదు తన్నడైన్దార్,
వరుమానమ్ తవిర్కుమ్, మణియై అణియురువిల్,
తిరుమాలై యమ్మానై, అముదత్తై క్కడల్ కిడన్ద
పెరుమానై, అడియేన్ అడైన్దు ఉయ్ న్దు పిழைత్తేనే ll 1729
తరు = కల్పవృక్షమువంటి వాడును; మానమ్= పెద్ద;మழ ముగిలై = వానాకాలమందలి కాళమేఘము వంటి వాడును; పిరియాదు = ఎన్నడును విడువక; తన్ అడైన్దార్=తనను ఆశ్రయించిన వారికి; వరుమ్=ఎదురుగా వచ్చుచున్న;మానమ్ తవిర్కుమ్=అవమానము పోగొట్టువాడును; మణియై = నీలమణివంటి వాడును; అణి ఉరువిల్ = అందమైన రూపము కలిగిన; తిరుమాలై = శ్రీదేవియొక్క విభుడును; అమ్మానై = సర్వశేషిగ ఉండువాడును; అముదత్తై = అమృతమువలె పరమభోగ్యుడును; కడల్ కిడన్ద పెరుమానై = పాలసముద్రమున పవళించిన స్వామి శౌరి పెరుమాళ్ ను; అడియేన్ అడైన్దు = దాసుడైన నేను ఆశ్రయించి; ఉయ్ న్దు = ఉజ్జీవించి; పిழைత్తేనే = సుఖముగ రక్షింపబడితిని!.
కల్పవృక్షమువంటి వాడును, పెద్ద, వానాకాలమందలి కాళమేఘమువంటి వాడును,ఎన్నడును విడువక ఆశ్రయించిన వారికి ఎదురుగా వచ్చుచున్న అవమానము పోగొట్టువాడును, నీలమణివంటివాడును, అందమైన రూపము కలిగిన శ్రీదేవియొక్క విభుడును,సర్వశేషిగ ఉండువాడును,అమృతమువలె పరమభోగ్యుడును, పాలసముద్రమున పవళించిన స్వామి, శౌరి పెరుమాళ్ ను దాసుడైన నేను ఆశ్రయించి, ఉజ్జీవించి, సుఖముగ రక్షింపబడితిని!.
విడైయేழన్ఱడర్తు, వెకుణ్డు విలఙ్గలుఱ,
పడైయాల్ ఆழிతట్ట, పరమన్ పరఞ్జోది,
మడైయార్ నీలమల్ గుమ్ వయల్ శూழ், కణ్ణపురమొన్ఱు
ఉడైయానుక్కు, అడియేన్ ఒరువర్కు ఉరియేనో ll 1730
అన్ఱు = మునుపొకకాలమున; విడై ఏழ் =( పైకి ఉరుకుచు వచ్చెడి) వృషభములు ఏడింటిపై; వెకుణ్డు = కోపగించి; అడర్తు = అణచివేసినవాడును; విలఙ్గల్ ఉఱ = త్రికూట పర్వతమునకు చేరుకొనునట్లు; పడైయాల్ = వానరసేనలను చేరతీసుకొని; ఆழி = సముద్రమును; తట్ట = (సేతువు కట్టి) అడ్డగించిన వాడును; పరమన్ = అద్వితీయుడును; పరమ్ శోది = శ్లాఘ్యమైన తేజోమయ స్వరూపుడును; నీలమ్ మల్ గుమ్ = నీలోత్పల పుష్పములు వ్యాపించియున్న; వయల్ శూழ்=పొలములతో చుట్టుకొనియున్న; కణ్ణపురమ్ ఒన్ఱు=తిరుకణ్ణపురమను ఒక ప్రసిద్దమైన దివ్యదేశమును; ఉడైయానుక్కు = నివాసస్థానముగ కలిగిన సర్వేశ్వరునికి; అడియేన్ = శేషభూతుడైన నేను; ఒరువర్కు = వేరొకరికి; ఉరియేనో = బద్దుడునగుదునా? (ఎన్నటికి కానేకాను).
మునుపొకకాలమున,( పైకి ఉరుకుచు వచ్చెడి) వృషభములు ఏడింటిపై కోపగించి అణచివేసినవాడును,త్రికూట పర్వతమునకు చేరుకొనునట్లు వానరసేనలను చేరతీసుకొని సముద్రమును(సేతువు కట్టి) అడ్డగించినవాడును,అద్వితీయుడును, శ్లాఘ్యమైన తేజోమయ స్వరూపుడును, నీలోత్పల పుష్పములు వ్యాపించియున్నపొలములతో చుట్టుకొనియున్న తిరుకణ్ణపురమను ఒక ప్రసిద్దమైన దివ్యదేశమును, నివాసస్థానముగ కలిగిన సర్వేశ్వరునికి శేషభూతుడైన నేను వేరొకరికి బద్దుడునగుదునా? (ఎన్నటికి కానేకాను).
** మిక్కానై, మఱైయాయ్ విరిన్ద విళక్కై, ఎన్నుళ్
పుక్కానై, ప్పుగழ் శేర్ పొలికిన్ఱ పొన్మలైయై,
తక్కానై, క్కడికై తడఙ్కున్ఱిన్ మిశై యిరున్ద,
అక్కార క్కనియై, అడైన్దు ఉయ్ న్దుపోనేనే ll 1731
మిక్కానై=గొప్పవాడును;మఱై ఆయ్ విరిన్ద విళక్కై=వేదముగ వ్యాపించిన దీపమువంటి వాడును; ఎన్నుళ్ పుక్కానై = నాయొక్క హృదయమందు ప్రవేశించియున్నవాడును; పుగழ் శేర్ = కీర్తి కలిగినవాడును; పొలికిన్ఱ పొన్ మలైయై = జ్వలించెడి బంగారపు కొండ వంటివాడును; తక్కానై = కరుణామూర్తియును; కడికై తడ కున్ఱిన్ మిశై యిరున్ద = కడిగైయను(ఘటికాచలము) పెద్ద కొండపైన వేంచేసియున్న; అక్కార కనియై = పటిక బెల్లమువంటి భోగ్యమైన స్వామిని తిరుకణ్ణపురమందు; అడైన్దు = దాసుడైన నేను ఆశ్రయించి; ఉయ్ న్దుపోనేనే = ఉజ్జీవించిపోతిని!
గొప్పవాడును,వేదముగ వ్యాపించిన దీపమువంటి వాడును, నాయొక్క హృదయమందు ప్రవేశించియున్నవాడును, కీర్తి కలిగినవాడును,జ్వలించెడి బంగారపు కొండవంటివాడును, కడిగైయను (ఘటికాచలము) పెద్ద కొండపైన వేంచేసియున్న పటిక బెల్లమువంటి భోగ్యమైన స్వామిని తిరుకణ్ణపురమందు దాసుడైన నేను ఆశ్రయించి ఉజ్జీవించిపోతిని!
వన్దాయ్ ఎన్మనత్తే, వన్దు నీ పుకున్ద పిన్నై,
ఎన్దాయ్ పో యఱియాయ్, ఇదువే అమైయాదో,
కొన్దార్ పైమ్బొழிల్ శూழ், కుడన్దై క్కిడన్దుకన్ద
మైన్దా, ఉన్నై యెన్ఱుమ్, మఱవామై ప్పెర్ట్రేనే ll 1732
ఎన్దాయ్ = నాయొక్క స్వామీ!; ఎన్ మనత్తే = నాయొక్క హృదయమున; నీ వన్దాయ్= నీవు వచ్చి ప్రవేశించితివి; వన్దు నీ పుకున్ద పిన్నై = అట్లు వచ్చి నీవు చేరినపిదప; పోయ్ అఱియాయ్ = తిరిగి మరలిపోవుటకు మరచిపోతివి; ఇదువే అమైయాదో = ఇదియే ఈ దాసునికి చాలదా? (ఎంత భాగ్యవంతుడనో!); కొన్దు ఆర్=పూల గుత్తులతో నిండిన; పై పొழிల్ శూழ் = విశాలమైన తోటలతో చుట్టుకొనియున్న; కుడన్దై = తిరుకుడందై దివ్యదేశమున; కిడన్దు = శయనించి; ఉకన్ద = ఆనందించిన; మైన్దా = సుందరుడా!; ఉన్నై ఎన్ఱుమ్= శ్రీ వారిని ఎన్నడును;మఱవామై పెర్ట్రేనే=మరువని మహాభాగ్యమును పొందితిని!.(ఆహా!)
నాయొక్క స్వామీ! నాయొక్క హృదయమున నీవు వచ్చి ప్రవేశించితివి, అట్లు వచ్చి నీవు చేరినపిదప తిరిగి మరలిపోవుటకు మరచిపోతివి. ఇదియే ఈ దాసునికి చాలదా? (ఎంత భాగ్యవంతుడనో!) గుత్తులతో నిండిన విశాలమైన తోటలతో చుట్టుకొనియున్న తిరుకుడందై దివ్యదేశమున శయనించి ఆనందించిన సుందరుడా! శ్రీ వారిని ఎన్నడును మరువని మహాభాగ్యమును పొందితిని!.(ఆహా!)
ఎఞ్జావెన్ రకత్త, అழுన్ది నడుఙ్గుగిన్ఱేఱ్కు,
అఞ్జేలెన్ఱడియేనై, ఆట్కొళ్ళవల్లానై,
నెఞ్జే నీ నినైయాదు, ఇఱై పొழுదుమిరుత్తి కణ్డాయ్,
మఞ్జార్ మాళిగై శూழ், వయలాలి మైన్దనైయే ll 1733
ఎఞ్జా=(పాప కర్మముల ఫలమును అనుభవించుటలో)ఒకప్పుడును లోపములేని;వెమ్ నరకత్తు = క్రూరమైన నరకమందు;అழுన్ది= యాతనలకు భీతిచెంది;నడుఙ్గుగిన్ఱేఱ్కు అడియేనై = వణుకుచున్న నన్ను; అఞ్జేల్ ఎన్ఱు = భీతిచెందకని అభయమిచ్చి, ఆట్కొళ్ళవల్లానై=కైంకర్యసేవలను చేకొనగల సమర్ధుడును; మఞ్జు ఆర్ మాళిగై శూழ் = మేఘమండలము స్పర్శించునట్లున్న ఉన్నతమైన భవనములతో చుట్టుకొనియున్న; వయల్ ఆలి = పొలములుగల తిరువాలియందు వేంచేసియున్న; మైన్దనై = నిత్యయౌవనుడైన స్వామి శ్రీ శౌరి పెరుమాళ్ ను; నెఞ్జే = మనసా!; నీ = నీవు; ఇఱై పొழுదుమ్ = ఒక క్షణమైనను; నినైయాదు ఇరుత్తి కణ్డాయ్= తలచకున్నావే!
(పాప కర్మముల ఫలమును అనుభవించుటలో)ఒకప్పుడును లోపములేని క్రూరమైన నరకమందు యాతనలకు భీతిచెంది వణుకుచున్న నన్ను, భీతి చెందకని అభయమిచ్చి, కైంకర్యసేవలను చేకొనగల సమర్ధుడును, మేఘమండలము స్పర్శించు నట్లున్న ఉన్నతమైన భవనములతో చుట్టుకొనియున్న,పొలములుగల తిరువాలియందు వేంచేసియున్న నిత్యయౌవనుడైన స్వామి శ్రీ శౌరి పెరుమాళ్ ను మనసా! నీవు ఒక క్షణమైనను తలచకున్నావే ! ( అని సర్వేశ్వరుని మహోపకారమును స్మరింపజేయుచు మనస్సు యొక్క స్వభావమును నిందించుచున్నారు )
పెర్ట్రార్ పెర్ట్రొழிన్దార్, పిన్నుమ్ నిన్ఱడియేనుక్కు,
ఉర్ట్రానాయ్ వళర్ త్తు, ఎన్నుయిరాగి నిన్ఱానై,
ముర్ట్రా మా మది కోళ్, విడుత్తానై యెమ్మానై,
ఎత్తాల్ యాన్ మఱక్కేన్, ఇదుశొల్ ఎన్నేழை నెఞ్జే ll 1734
ఎన్ ఏழை నెఞ్జే = నాయొక్క ఙ్ఞానవిహీనమైన మనసా!; పెర్ట్రార్ = నన్ను కన్న తల్లిదండ్రులు; పెర్ట్రు ఒழிన్దార్=జన్మమిచ్చి ఇచట విడిచి వెడలిపోయిరి; పిన్నుమ్= మరియు; అడియేనుక్కు = నాకు; ఉర్ట్రాన్ ఆయ్ నిన్ఱు= సకలవిధ బంధువుగ నిలిచి; వళర్ త్తు=పెంచి; ఎన్ ఉయిర్ ఆగి నిన్ఱానై = నాకు ప్రాణభూతుడై, సత్కర్మలను ఆచరింప జేసినవాడును; ముర్ట్రా మా మది = పరువము నిండని చంద్రునియొక్క; కోళ్ = క్షయరోగమును; విడుత్తానై =పోగొట్టిన;ఎమ్మానై = నాయొక్క స్వామిని; ఎత్తాల్ యాన్ మఱక్కేన్ = ఏ కారణముతో నేను మరువగలను?;ఇదు శొల్ = ఈ విషయమును విశదముగ వివరించు!
నాయొక్క ఙ్ఞానవిహీనమైన మనసా!,నన్ను కన్న తల్లిదండ్రులు జన్మమిచ్చి ఇచట విడిచి వెడలిపోయిరి,మరియు నాకు సకలవిధ బంధువుగ నిలిచి,పెంచి,నాకు ప్రాణభూతుడై, సత్కర్మలను ఆచరింప జేసినవాడును,పరువము నిండని చంద్రునియొక్క క్షయరోగమును పోగొట్టిన నాయొక్క స్వామిని ఏ కారణముతో నేను మరువగలను?. ఈ విషయమును విశదముగ వివరించు!
కర్ట్రార్ పర్ట్రఱుక్కుమ్, పిఱవి ప్పెరుఙ్గడలే,
పర్ట్రా వన్దడియేన్, పిఱన్దేన్ పిఱన్దపిన్నై,
వర్ట్రా నీర్ వయల్ శూழ், వయలాలి అమ్మానై
పెర్ట్రేన్, పెర్ట్రదువుమ్, పిఱవామై ప్పెర్ట్రేనే ll 1735
కర్ట్రార్ = వివేకవంతులు; పర్ట్రు అఱుక్కుమ్ =”దీనితో సంబంధము మనకు వద్దు” అని భయపడి తెంచుకొనెడి; పిఱవి పెరు కడలే = సంసారమనెడి మహా సాగరమే; పర్ట్రా = మహా భోగ్యముగ పట్టుకొని; అడియేన్ వన్దు పిఱన్దేన్ =(ఈ భూమియందు) నేను (అనేక జన్మలు) జన్మించితిని; పిఱన్ద పిన్నై = అట్లు కలిగిన జన్మలో;వర్ట్రా నీర్ వయల్ శూழ் = ఎన్నడును ఎండిపోని నీటి సమృద్దిగల పొలములతో చుట్టుకొనియున్న; వయలాలి= తిరువాలి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న; అమ్మానై = సర్వేశ్వరుని; పెర్ట్రేన్ = పొందితిని; పెర్ట్రదువుమ్ = ఆ స్వామిని పొందిన నేను; పిఱవామై ప్పెర్ట్రేనే = మరియొక జన్మలేమిని పొందగలిగితిని!.
వివేకవంతులు “దీనితో సంబంధము మనకు వద్దు”అని భయపడి తెంచుకొనెడి సంసారమనెడి మహా సాగరమే,మహా భోగ్యముగ పట్టుకొని(ఈ భూమియందు) నేను (అనేక జన్మలు) జన్మించితిని. అట్లు కలిగిన జన్మలో, ఎన్నడును ఎండిపోని నీటి సమృద్ది గల పొలములతో చుట్టుకొనియున్న తిరువాలి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సర్వేశ్వరుని పొందితిని. ఆ స్వామిని పొందిన నేను మరియొక జన్మలేమిని పొందగలిగితిని!
** కణ్ణార్ కణ్ణపురమ్, కడిగై కడి కమழுమ్,
తణ్ణార్ తామరై శూழ், తలై చ్చఙ్గమేల్ తిశైయుళ్,
విణ్ణోర్ నాణ్మదియై, విరికిన్ఱ వెఞ్జుడరై,
కణ్ణార క్కణ్డుకొణ్డు, కళిక్కన్ఱదిఙ్గెన్ఱుకొలో ll 1736
కణ్ ఆర్ = కన్నులు మరలింపలేని సుందరమైన;కణ్ణపురమ్=తిరుకణ్ణపురమునందును; కడిగై = తిరు కడిగాచలమందును; కడి కమழுమ్ = పరిమళము వెదజల్లుచుండెడి; తణ్ ఆర్=చల్లదనముతో నిండిన;తామరై శూழ்=తామర పుష్పములతో చుట్టబడిన; తలై శఙ్గ మేల్ తిశైయుళ్=తలైశఙ్గమను దివ్యదేశమున పడమర దిక్కునందు;విణ్ణోర్= నిత్యశూరులకు;నాళ్ మదియై = ప్రతిదినము చంద్రునివలె అనుభవింప బడుచుండువాడు; విరికిన్ఱ వెమ్ శుడరై = ప్రాతఃకాలమున ఉదయించుచున్న సూర్యునివలె మిక్కిలి ప్రతాపవంతుడైన సర్వేశ్వరుని;ఇఙ్గు=ఈ భువిలో; కణ్ణార కణ్డుకొణ్డు=కన్నులు తృప్తి చెందువరకు చూచి; కళికిన్ఱదు = ఆనందించెడి సౌభాగ్యము;ఎన్ఱు కొలో = ఎప్పుడు కలగునో కదా?
కన్నులు మరలింపలేని సుందరమైన తిరుకణ్ణపురమునందును, తిరు కడిగాచలమందును,పరిమళము వెదజల్లుచుండెడి చల్లదనముతో నిండిన తామర పుష్పములతో చుట్టబడిన తలైశఙ్గమను దివ్యదేశమున పడమర దిక్కునందు నిత్యశూరులకు ప్రతిదినము చంద్రునివలె అనుభవింప బడుచుండువాడు, ప్రాతః కాలమున ఉదయించుచున్న సూర్యునివలె మిక్కిలి ప్రతాపవంతుడైన సర్వేశ్వరుని ఈ భువిలో కన్నులు తృప్తిచెందువరకు చూచి ఆనందించెడి సౌభాగ్యము ఎప్పుడు కలగునో కదా?
** శెరునీరవేల్వలవన్, కలికన్ఱి మఙ్గైయర్కోన్,
కరునీర్ముగిల్వణ్ణన్, కణ్ణపురత్తానై,
ఇరునీర్ ఇన్ తమిழ், ఇన్నిశై మాలైగళ్ కొణ్డు తొణ్డీర్,
వరునీర్ వైయముయ్య, ఇవై పాడి ఆడుమినే ll 1737
కరు నీర్ ముగిల్ వణ్ణన్ = సముద్ర గర్భమునుండి నీరు గ్రహించిన మేఘమువంటి వర్ణము కలిగిన; కణ్ణపురత్తానై = తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న శౌరి పెరుమాళ్ విషయమై; శెరు నీర వేల్ వలవన్ = యుద్ధము చేయు స్వభావముగల శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల; మఙ్గైయర్ కోన్ = తిరుమంగై దేశవాసులకు ప్రభువైన; కలికన్ఱి = తిరుమంగై ఆళ్వార్ (అనుగ్రహించిన); ఇరు నీర్ = అనేక లక్షణములు కలిగిన; ఇన్ తమిழ் = ఇంపైన తమిళ భాషలో; ఇన్ ఇశై = ఇంపైన రాగములతొ నున్న;ఇవై మాలైగళ్ కొణ్డు = ఈ సూక్తులమాలను మనస్సున చేకొని; తొణ్డీర్ = భక్తులారా!; వరు నీర్ వైయమ్ ఉయ్య = సముద్రముచే చుట్టుకొనియున్న ఈ లోకము ఉజ్జీవించునట్లు;పాడి=నోరార గానముచేసి; ఆడుమినే = నృత్యము చేయుడు!.
సముద్ర గర్భమునుండి నీరు గ్రహించిన మేఘమువంటి వర్ణము కలిగిన, తిరుకణ్ణపురమందు నిత్యవాసము చేయుచున్న శౌరి పెరుమాళ్ విషయమై,యుద్ధము చేయు స్వభావముగల శూలాయుధమును ప్రయోగించు సమర్ధతగల తిరుమంగై దేశవాసులకు ప్రభువైన తిరుమంగై ఆళ్వార్ (అనుగ్రహించిన) అనేక లక్షణములు కలిగిన ఇంపైన తమిళ భాషలో,ఇంపైన రాగములతొ నున్న ఈ సూక్తులమాలను మనస్సున చేకొని భక్తులారా!,సముద్రముచే చుట్టుకొనియున్న ఈ లోకము ఉజ్జీవించునట్లు నోరార గానముచేసి,నృత్యము చేయుడు!.
********