శ్రీః
2 . పొన్నివర్ మేని
తిరునాగై (నాగపట్టణం) దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న సౌందర్యరాజన్ పెరుమాళ్ ను దర్శించిన తిరుమంగై ఆళ్వార్ ఆ స్వామి సౌందర్యమున లీనమై, పరాంకుశనాయకి అవస్థలో తన సఖితో తమ మనోస్థితిని చెప్పుచున్నారు.
** పొన్ ఇవర్ మేని మరదకత్తిన్, పొఙ్గు ఇళఞ్జోతి అకలత్తు ఆరమ్
మిన్, ఇవర్ వాయిల్ నల్వేదమోదుమ్, వేదియర్ వానవరావర్ తోழீ,
ఎన్నైయుమ్ నోక్కి ఎన్నల్కులుమ్ నోక్కి, ఏన్దు ఇళమ్ కొఙ్గైయుమ్ నోక్కు కిన్ఱార్,
అన్నై ఎన్ నోక్కుమెన్ఱు అఞ్జుకిన్ఱేన్, అచ్చో ఒరువర్ అழగియవా ll 1758
తోழீ =నాసఖీ!; ఇవర్ మేని = ఈ స్వామియొక్క తిరుమేని; పొన్ = బంగారమువలె మెరయుచున్నది; మరదకత్తిన్ పొఙ్గు ఇళమ్ శోది=మరకతము యొక్క మిక్కిలి నవీనమైన తేజస్సుగల; అకలత్తు ఆరమ్=వక్షస్థలమందలి హారము;మిన్=మెరుపు వలె ప్రకాశించు చున్నది; ఇవర్ = ఈ స్వామి; వాయిల్ =నోటితో; నల్ వేదమ్ ఓదుమ్ వేదియర్ =బాగుగ వేదములను ఉచ్చరించెడి వేదబ్రాహ్మణోత్తమునిగ యున్నారు; వానవర్ ఆవర్=(మరియు)దేవతయే అయియుందురు;(ఈ స్వామి);ఎన్నైయుమ్ నోక్కి = నన్నును చూచి; ఎన్ అల్కులుమ్ నోక్కి=నాయొక్క నితంబప్రదేశమును జూచి; ఏన్దు ఇళమ్ కొఙ్గైయుమ్ నోక్కు కిన్ఱార్=యౌవనమైన వక్షోజములును చూచుచున్నారు; అన్నై ఎన్ నోక్కుమ్ ఎన్ఱు అఞ్జుకిన్ఱేన్=నాయొక్క తల్లి ఏమి తలుచునో అని భయపడు చున్నాను; అచ్చో = ఆహో!;ఒరువర్ అழగియ ఆ = విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను?
సఖీ!,ఈ స్వామియొక్క తిరుమేని బంగారమువలె మెరయుచున్నది, మరకతము యొక్క మిక్కిలి నవీనమైన తేజస్సుగల వక్షస్థలమందలి హారము,మెరుపు వలె ప్రకాశించు చున్నది ఈ స్వామి, నోటితో బాగుగ వేదములను ఉచ్చరించెడి వేద బ్రాహ్మణోత్తమునిగ యున్నారు,(మరియు) దేవతయే అయియుందురు.(ఈస్వామి) నన్నును చూచి,నాయొక్క నితంబప్రదేశమును జూచి,యౌవనమైన వక్షోజములును చూచుచున్నారు. నాయొక్క తల్లి ఏమి తలుచునో అని భయపడు చున్నాను.ఆహో! విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను?
తోడు అవిழ் నీలమ్ మణఙ్గొడుక్కుమ్, శూழ் పునల్ శూழ் కుడన్దై క్కిడన్ద,
శేడర్ కొలెన్ఱు తెరిక్కమాట్టేన్, శెఞ్జుడరాழிయుమ్ శఙ్గుమేన్ది,
పాడగ మెల్లడియార్ వణఙ్గ, ప్పల్ మణిముత్తొడు ఇలఙ్గుశోది,
ఆడగమ్ పూణ్డ ఒరు నాన్గుతోళుమ్, అచ్చో ఒరువర్ అழగియవా ll 1759
తోడు అవిழ் నీలమ్ = దళములతో వికసించిన నీలోత్పములు, మణమ్ కొడుక్కుమ్= పరిమళము వెదజల్లుచుండెడి; శూழ் పునల్ = వ్యాపించియున్న తీర్థములతో; శూழ்=చుట్టుకొనియున్న; కుడన్దై క్కిడన్ద = తిరుకుడందై దివ్యదేశమున పవళించియున్న; శేడర్ కొల్ ఎన్ఱు = యౌవన పురుషుడో ఏమో! అని; తెరిక్క మాట్టేన్= తెలుసుకొనలేక పోవుచున్నాను; శెమ్ శుడర్ ఆழிయుమ్=శ్లాఘ్యమైన ప్రకాశించుచున్న చక్రాయుధము; శఙ్గుమ్ ఏన్ది=శంఖమును ధరించి;పాడగమ్ మెల్ అడియార్ వణఙ్గ= చరణాభరణములు గల మృదువైన పాదములుగల కాంతలు(శ్రీదేవి, భూదేవి) సేవించు చుండగ; పల్ మణి ముత్తొడు = పలు రకములైన రత్నములతోను, ముత్యములతోను; ఇలఙ్గు శోది ఆడగమ్ పూణ్డ = ప్రకాశించుచున్న తేజస్సుతో నిండిన బంగారపు ఆభరణములచే అలంకృతమైన; ఒరు నాన్గు తోళుమ్ = విలక్షణమైన నాలుగుభుజములు గల; అచ్చో = ఆహో!;ఒరువర్ అழగియ ఆ = విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
దళములతో వికసించిన నీలోత్పములు, పరిమళము గుబాళింపజేయు వ్యాపించియున్న తీర్థములతో చుట్టుకొనియున్న తిరుకుడందై దివ్యదేశమున పవళించియున్న యౌవన పురుషుడో ఏమో! అని తెలుసుకొనలేక పోవుచున్నాను. శ్లాఘ్యమైన ప్రకాశించుచున్న చక్రాయుధము,శంఖమును ధరించి,చరణాభరణములు గల మృదువైన పాదములుగల కాంతలు (శ్రీదేవి, భూదేవి) సేవించుచుండగ, పలురకములైన రత్నములతోను, ముత్యములతోను ప్రకాశించుచున్న తేజస్సుతో నిండిన బంగారపు ఆభరణములచే అలంకృతమైన విలక్షణమైన నాలుగుభుజములుగల ఆహో!, విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను?నా సఖీ!
వేయ్ ఇరుమ్ శోలై విలఙ్గల్ శూழ் న్ద, మెయ్యమణాళర్ ఇవ్వైయమెల్లామ్,
తాయిన నాయకరావర్ తోழீ, తామరై క్కణ్గళ్ ఇరున్దవాఱు,
శేయ్ ఇరుమ్ కున్ఱమ్ తిగழ் న్దతొప్ప, చ్చెవ్వియవాగి మలర్ న్దశోది,
ఆయిరమ్ తోళొడు ఇలఙ్గు పూణుమ్, అచ్చో ఒరువర్ అழగియవా ll 1760
తోழீ = నాసఖీ!; వేయ్ ఇరుమ్ శోలై = వెదురుచెట్లతో నిండియున్న విశాలమైన తోటలుగల; విలఙ్గల్ శూழ் న్ద = కొండలతో చుట్టుకొనియున్న;మెయ్యమ్ = తిరు మెయ్యమ్ దివ్యదేశమున వేంచేసియున్న; మణాళర్ = పెండ్లికొడుకును; ఇ వైయమ్ ఎల్లామ్ తాయిన = ఈ భూమండలమంతను స్పర్శించుచు కొలిచినట్టి; నాయకర్ ఆవర్ = పరమపురుషుడైన ఈ స్వామియొక్క; తామరై కణ్గళ్ ఇరున్ద ఆఱు = తామరవంటి నేత్రములయొక్క తీరును, ఏమని చెప్పను!; శేయ్ ఇరుమ్ కున్ఱమ్ = ఉన్నతమైనదియు, విశాలమైనదియు అయిన పర్వతములు; తిగழ் న్దు ఒప్ప = ప్రకాశించుచున్నట్లు; శెవ్వియ ఆగి = సౌందర్యముగలదై; మలర్ న్ద శోది = వ్యాపించియున్న తేజస్సుగలగిన; ఆయిరమ్ తోళొడు = సహస్రభుజములును; ఇలఙ్గు పూణుమ్ = మెరయుచున్న ఆభరణములును; అచ్చో = ఆహో!;ఒరువర్ అழగియ ఆ = విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
నాసఖీ! వెదురుచెట్లతో నిండియున్న విశాలమైన తోటలుగల కొండలతో చుట్టుకొనియున్న తిరు మెయ్యమ్ దివ్యదేశమున వేంచేసియున్న పెండ్లికొడుకును, ఈ భూమండలమంతను స్పర్శించుచు కొలచినట్టి పరమపురుషుడైన ఈ స్వామియొక్క తామరవంటి నేత్రములయొక్క తీరును, ఏమని చెప్పను!, ఉన్నతమైనదియు, విశాలమైనదియు అయిన పర్వతములు ప్రకాశించుచున్నట్లు, సౌందర్యముగలదై, వ్యాపించియున్న తేజస్సుగలగిన సహస్రభుజములును, మెరయుచున్న ఆభరణములును, ఆహో! విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
వమ్బు అవిழమ్ తుழாయ్ మాలై తోళ్ మేల్, కైయన ఆழிయుమ్ శఙ్గమ్ ఏన్ది,
నమ్బర్ నమ్మిల్లమ్ పుగున్దు నిన్ఱార్, నాగరికర్ పెరిదుమ్ ఇళైయర్,
శెమ్బవళమ్ ఇవర్ వాయిన్ వణ్ణమ్, దేవరివరదురువమ్ శొల్లిల్,
అమ్బవళ త్తిరళేయుమొప్పర్, అచ్చో ఒరువర్ అழగియవా ll 1761
తోళ్ మేల్ = దివ్యమైన భుజములపై; వమ్బు అవిழమ్ తుழாయ్ మాలై = పరిమళము వెదజల్లుచున్న తులసీమాలయున్నది; ఆழிయుమ్ శఙ్గమ్ = సుదర్శనచక్రమును; పాంచజన్యశంఖమును; కైయన =దివ్య హస్తములందు;ఏన్ది = ఆ దివ్యాయుధములను ధరించి; నమ్బర్ = ఈ స్వామి;నమ్ ఇల్లమ్ పుగున్దు నిన్ఱార్= మనయొక్క గృహమందు ప్రవేశించియున్నారు; నాగరికర్ = మంచి నాగరికతకలవారు; పెరిదుమ్ ఇళైయర్ = మిక్కిలి నూతన యౌవనముకలవానిగయున్నారు;ఇవర్=వీరియొక్క;వాయిన్ వణ్ణమ్=అదరముల వర్ణము; శెమ్ పవళమ్ = ఎర్రని పగడమువలె యున్నది!; దేవర్ ఇవరదు = దేవాంశులైన వీరియొక్క; ఉరువమ్ శొల్లిల్ = స్వరూపమును చెప్పదలిచినచో; అమ్ పవళమ్ తిరళేయుమ్ ఒప్పర్ = అందమైన పగడముల రాసులవలె ఆశింపబడుదురు; అచ్చో = ఆహో!;ఒరువర్ అழగియ ఆ = విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
దివ్యమైన భుజములపై పరిమళము వెదజల్లుచున్న తులసీమాల యున్నది, సుదర్శనచక్రమును, పాంచజన్యశంఖమును దివ్య హస్తములందు, ఆ దివ్యాయుధములను ధరించి,ఈ స్వామి మనయొక్క గృహమందు ప్రవేశించి యున్నారు, మంచి నాగరికతకలవారు, మిక్కిలి నూతన యౌవనము కలవానిగ యున్నారు,వీరియొక్క అదరముల వర్ణము ఎర్రని పగడమువలె యున్నది!, దేవాంశులైన వీరియొక్క స్వరూపమును చెప్పదలిచినచో అందమైన పగడముల రాసులవలె ఆశింపబడుదురు,ఆహో! విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
కోழிయుమ్ కూడలుమ్ కోయిల్ కొణ్డ, కోవలరేయొప్పర్ కున్ఱమన్న,
పాழிయమ్ తోళుమ్ ఓర్ నాన్గుడైయర్, పణ్డు ఇవర్ తమ్మైయుమ్ కణ్డఱియోమ్,
వాழிయరో ఇవర్ వణ్ణమెణ్ణిల్, మాకడల్ పోన్ఱుళర్ కైయిల్ వెయ్య,
ఆழிయొన్ఱేన్ది ఓర్ శఙ్గుపర్ట్రి, అచ్చో ఒరువర్ అழగియవా ll 1762
కోழிయుమ్=ఉఱైయూర్ ను;కూడలుమ్=దక్షిణ మధురను;కోయిల్ కొణ్డ=నివాస స్థానములగ ఎంచుకొన్న;కోవలరే ఒప్పర్=గోపాలకృష్ణుని వలనే యున్నారు;కున్ఱమ్ అన్న=పర్వతము వలె; పాழி = శక్తివంతమైన;అమ్=అందమైన;ఓర్ నాన్గు తోళుమ్=విలక్షణమైన నాలుగు భుజములు; ఉడైయర్ = కలిగియున్నారు;ఇవర్ తమ్మైయుమ్=ఇటువంటి ఈ స్వామిని; పణ్డుమ్ = మునుపెప్పుడును; కణ్డు అఱియోమ్ = మనము చూచినట్లు తెలియదు; వాழிయరో=చిరకాలము వీరు వర్ధిల్లుగాక!;ఇవర్ వణ్ణమ్ = వీరియొక్క స్వరూపమును; ఎణ్ణిల్ = స్మరించినయెడల; మా కడల్ పోన్ఱు ఉళర్ = మహాసముద్రమువలె యున్నారు;కైయిల్ = రెండు హస్తములయందు; వెయ్య=తీక్షణమైన;ఆழி ఒన్ఱు ఏన్ది=ఒక చక్రమును ధరించియు; ఓర్ శఙ్గుపర్ట్రి = మరియొక హస్తమున శంఖమును ధరించియున్న; అచ్చో = ఆహో!;ఒరువర్ అழగియ ఆ = విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
ఉఱైయూర్ ను, దక్షిణ మధురను,నివాస స్థానములగ ఎంచుకొన్న, గోపాలకృష్ణుని వలనే యున్నారు. పర్వతమువలె శక్తివంతమైన,అందమైన,విలక్షణమైన నాలుగు భుజములు కలిగియున్నారు.ఇటువంటి ఈ స్వామిని మునుపెప్పుడును మనము చూచినట్లు తెలియదు. చిరకాలము వీరు వర్ధిల్లుగాక!, వీరియొక్క స్వరూపమును స్మరించిన యెడల,మహాసముద్రమువలె యున్నారు, రెండు హస్తముల యందు, తీక్షణమైన ఒక చక్రమును ధరించియు, మరియొక హస్తమున శంఖమును ధరించియున్న, ఆహో! విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను! నా సఖీ!
వెఞ్జిన వేழమ్ మ్మరప్పొశిత్త, వేన్దర్ కొల్ ఏన్దిழைయార్మనత్తై,
తఞ్జుడైయాళర్ కొల్ యానఱియేన్, తామరై కణ్గళిరున్దవాఱు,
కఞ్జనై యఞ్జ మున్ కాల్ విశైత్త, కాళైయరావర్ కణ్డార్ వణఙ్గుమ్,
అఞ్జన మామలై యేయుమొప్పర్, అచ్చో ఒరువర్ అழగియవా ll 1763
వెమ్ శినమ్ వేழమ్ = తీవ్రమైన కోపముగల కువలయాపీడమను ఏనుగుయొక్క; మరప్పు ఒశిత్త = దంతములును పెరికి చంపిన; వేన్దర్ కొల్ = ప్రభువో వీరు!;ఏన్దు ఇழைయార్ మనత్తై=ఆభరణములు ధరించుకొనియున్న స్రీలయొక్క మనస్సును; తఞ్జు ఉడైయాళర్ కొల్ = ఆశ్రయముగా గల స్వామియో! వీరు!; యాన్ అఱియేన్=నాకేమియు తెలియకున్నది; తామరై కణ్గళ్ ఇరున్ద ఆఱు=తామరవంటి నేత్రములయొక్క తీరును, ఏమని చెప్పను!; మున్ = మునుపొకకాలమున; కఞ్జనై = కంసుడు; అఞ్జ = భయపడునట్లు;కాల్ విశైత్త=తన దివ్యపాదముయొక్క శక్తినిజూపిన; కాళైయర్ ఆవర్=యౌవనుడై యుండును; కణ్డార్ వణఙ్గుమ్ = చూచువారందరు సేవించుచుండు; అఞ్జన మా మలైయేయుమ్ ఒప్పర్ = పెద్ద ఒక అంజన పర్వతమువలె ఒప్పుచున్న; అచ్చో = ఆహో!; ఒరువర్ అழగియ ఆ = విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
తీవ్రమైన కోపముగల కువలయాపీడమను ఏనుగుయొక్క దంతములును పెరికి చంపిన ప్రభువో వీరు!,ఆభరణములు ధరించుకొనియున్న స్రీలయొక్క మనస్సును ఆశ్రయముగా గల స్వామియో! వీరు!,నాకేమియు తెలియ కున్నది,తామరవంటి నేత్రములయొక్క తీరును, ఏమని చెప్పను!, మునుపొకకాలమున కంసుడు భయపడునట్లు తన దివ్యపాదముయొక్క శక్తినిజూపిన యౌవనుడైయుండును. చూచువారందరు సేవించుచుండు పెద్ద ఒక అంజన పర్వతము వలె ఒప్పుచున్న, ఆహో! విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
పిణియవిழ் తామరై మొట్టు అలర్తుమ్, పేరరుళాళర్ కొల్ యానఱియేన్,
పణియుమ్ మెన్నెఞ్జుమ్ ఇదెన్ కొల్ తోழி, పణ్డివర్ తమ్మైయుఙ్గణ్డఱియోమ్,
అణికెழு తామరైయన్నకణ్ణుమ్, అమ్ కైయుమ్ పఙ్గయమ్ మేని వానత్తు,
అణి కెழ మా ముకిలేయుమొప్పర్, అచ్చో ఒరువర్ అழగియవా ll 1764
పిణి అవిழ் తామరై మొట్టు అలర్తుమ్=బంధవిమక్తులైనవారి హృదయ పుండరీకమనెడి తామర మొగ్గను వికసింపజేయు; పేరరుళాళర్ కొల్ = పేరరుళాళ పెరుమాళైయుండునో; యాన్ అఱియేన్ =నాకేమియు తెలియకున్నది;తోழீ=నా సఖీ!;ఎన్ నెఞ్జుమ్=నాయొక్క మనస్సు; పణియుమ్ ఇదెన్ కొల్ = తానే సేవించుచున్నదే! ఇదేమిటో?; ఇవర్ తమ్మైయుమ్=ఇటువంటి ఈ స్వామిని;పణ్డుమ్= మునుపెప్పుడును;కణ్డు అఱియోమ్ = మనము చూచినట్లు తెలియదు; కణ్ణుమ్ = నేత్రములు;అణి కెழு=మిక్కిలి సుందరమైన; తామరై అన్న = కమలములవలె యున్నది, అమ్ కైయుమ్ పఙ్గయమ్ = అందమైన హస్తములును కమలములే!, మేని = తిరుమేని; వానత్తు అణి కెழ మా ముకిలేయుమ్ ఒప్పర్ = ఆకాశమున గల మిక్కిలి సుందరమైన పెద్ద కాళమేఘమువలె ఒప్పుచున్న; అచ్చో = ఆహో!; ఒరువర్ అழగియ ఆ = విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
బంధవిమక్తులైనవారి హృదయ పుండరీకమనెడి తామర మొగ్గను వికసింపజేయు పేరరుళాళ పెరుమాళై యుండునో నాకేమియు తెలియకున్నది. నా సఖీ!, నాయొక్క మనస్సు, తానే సేవించుచున్నదే! ఇదేమిటో?. ఇటువంటి ఈ స్వామిని మునుపెప్పుడును మనము చూచినట్లు తెలియదు. నేత్రములు మిక్కిలి సుందరమైన కమలములవలె యున్నది. అందమైన హస్తములును కమలములే!. తిరుమేని ఆకాశమున గల మిక్కిలి సుందరమైన పెద్ద కాళమేఘమువలె ఒప్పుచున్న, ఆహో! విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
మఞ్జుయర్ మామది తీణ్డ నీణ్డ, మాలిరుఞ్జోలై మణాళర్వన్దు, ఎన్
నెఞ్జుళ్ళుమ్ కణ్ణుళ్ళుమ్ నిన్ఱు నీఙ్గార్, నీర్మలైయార్ కొల్ నినైక్కమాట్టేన్,
మఞ్జుయర్ పొన్ మలై మేలెழுన్ద, మాముగిల్ పోన్ఱుళర్వన్దు కాణీర్,
అఞ్జిలై ప్పుళ్ళు మొన్ఱేఱి వన్దార్, అచ్చో ఒరువర్ అழగియవా ll 1765
మఞ్జు ఉయర్ = మేఘమండల పర్యంతము ఉన్నతముగ నున్నదియు; మా మది తీణ్డ నీణ్డ = గొప్పచంద్రుని తాకచున్న పొడుగైన; మాలిరుఞ్జోలై = తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమున వేంచేసియున్న; మణాళర్ వన్దు=పెండ్లికొడుకు వచ్చి;ఎన్ నెఞ్జుళ్ళుమ్= నాయొక్క మనస్సునందును; కణ్ణుళ్ళుమ్ = కన్నులందును; నిన్ఱు నీఙ్గార్ = నిలిచి విడువకున్నారు; నీర్మలైయార్ కొల్ = తిరు నీర్మలై దివ్యదేశమున వేంచేసియున్న స్వామియో! వీరు; నినైక్కమాట్టేన్ = తలచలేకున్నాను; అఞ్జిలై ప్పుళ్ళుమ్ ఒన్ఱు = అందమైన రెక్కలుగల విలక్షణమైన గరుడాళ్వార్ మీద; ఏఱి వన్దార్ = అధిష్ఠించి ఏతెంచిన వీరు; మఞ్జు ఉయర్ పొన్ మలై మేల్ ఎழுన్ద=మేఘమండల పర్యంతము ఉన్నతముగనున్న ఒక బంగారపు కొండపై ఆవరించియున్న;మాముగిల్ పోన్ఱు ఉళర్=కాలమేఘమువలె ఒప్పుచున్నారు; వన్దు కాణీర్ = వచ్చి దర్శించుకొనుడు; అచ్చో = ఆహో!; ఒరువర్ అழగియ ఆ = విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
మేఘమండల పర్యంతము ఉన్నతముగ నున్నదియు,గొప్ప, చంద్రుని తాకచున్న పొడుగైన తిరుమాలిరుఞ్జోలై దివ్యదేశమున వేంచేసియున్న పెండ్లికొడుకు వచ్చి నాయొక్క మనస్సునందును, కన్నులందును,నిలిచి విడువకున్నారు. తిరు నీర్మలై దివ్యదేశమున వేంచేసియున్న స్వామియో! వీరు, తలచలేకున్నాను. అందమైన రెక్కలుగల విలక్షణమైన గరుడాళ్వార్ మీద అధిష్ఠించి ఏతెంచిన వీరు మేఘమండల పర్యంతము ఉన్నతముగనున్న ఒక బంగారపు కొండపై ఆవరించియున్న కాలమేఘము వలె ఒప్పుచున్నారు. వచ్చి దర్శించుకొనుడు. ఆహో! విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
ఎన్దిశైయుమ్ ఎఱి నీర్ క్కడలుమ్, ఏழுలగుముడనే విழுఙ్గి,
మణ్డి ఓరాలిలై ప్పళ్ళికొళ్ళుమ్, మాయర్ కొల్ మాయమ్ అఱియమాట్టేన్,
కొణ్డల్ నన్మాల్ వరైయేయుమొప్పర్, కొఙ్గలర్ తామరై క్కణ్ణుమ్ వాయుమ్,
అణ్డత్తు అమరర్ పణియ నిన్ఱార్, అచ్చో ఒరువర్ అழగియవా ll 1766
ఎణ్ దిశైయుమ్ ఎఱి నీర్=ఎనమిది దిక్కులనుండి వచ్చెడి అలలుకొట్టుచున్న నీరుగల; కడలుమ్ = సముద్రములను; ఏழுలగుమ్ = సప్తలోకములను; ఉడనే విழுఙ్గి=(ప్రళయ కాలమున) ఒక్కసారిగ మ్రింగి; ఓర్ ఆల్ ఇలై = ఒక చిన్న వటదళముపై; మణ్డి = అమరి; పళ్ళికొళ్ళుమ్ = యోగనిద్రలో పవళించియున్న; మాయర్ కొల్=ఆశ్చర్యభూతుడో వీరు!; మాయమ్ = వీరియొక్క ఆశ్చర్య స్వభావమును; అఱియమాట్టేన్ = తెలియకున్నాను; కొణ్డల్ = నీటిని గ్రహించియున్న మేఘమును;నల్ మాల్ వరైయేయుమ్ = అందమైన పెద్ద పర్వతమును;ఒప్పర్=ఒప్పుచున్నారు;కణ్ణుమ్ వాయుమ్=వీరియొక్క నేత్రములు, అదరములు; కొఙ్గు అలర్ తామరై = పరిమళభరితమైన కమలములవలె యున్నవి; అణ్డత్తు అమరర్=పరమపదమందలి నిత్యశూరులు;పణియ నిన్ఱార్=వచ్చి సేవించునట్లు నిలిచియున్న; అచ్చో = ఆహో!; ఒరువర్ అழగియ ఆ = విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
ఎనమిది దిక్కులనుండి వచ్చెడి అలలుకొట్టుచున్న నీరుగల సముద్రములను, సప్తలోకములను,(ప్రళయకాలమున) ఒక్కసారిగ మ్రింగి ఒక చిన్న వటదళముపై అమరి,యోగనిద్రలో పవళించియున్న ఆశ్చర్యభూతుడో వీరు!,వీరియొక్క ఆశ్చర్య స్వభావమును తెలియకున్నాను. నీటిని గ్రహించియున్న మేఘమును,అందమైన పెద్ద పర్వతమును,ఒప్పుచున్నారు.వీరియొక్క నేత్రములు,అదరములు పరిమళ భరితమైన కమలములవలె యున్నవి.పరమపదమందలి నిత్యశూరులువచ్చి సేవించునట్లు నిలిచియున్న, ఆహో! విలక్షణమైన ఈ స్వామియొక్క సౌందర్యము ఏమని వర్ణించెదను, నా సఖీ!
** అన్నముమ్ కేழలుమ్ మీనుమాయ్, ఆదియై నాగైయழగియారై,
కన్ని నన్మామదిళ్ మఙ్గై వేన్దన్, కామరుశీర్ క్కలికన్ఱి, కున్ఱా
విన్నిశైయాల్ శొన్న శెఞ్జొల్ మాలై, ఏழுమిరన్డు మొరొన్ఱుమ్ వల్లార్,
మన్నవరాయ్ ఉలగాణ్డు, మీణ్డుమ్ వానవరాయ్ మగిழ் వెయ్ తువరే ll 1767
అన్నముమ్ కేழలుమ్ మీనుమ్ ఆయ్ = హంస రూపిగను,వరాహ రూపిగను, మత్స్య రూపిగను అవతరించిన; ఆదియై = కారణభూతుడైన; నాగై అழగియారై = తిరునాగై దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న అతిసుందరుడైన సౌందర్యరాజన్ పెరుమాళ్ విషయమై;కన్ని నల్ మదిళ్ మఙ్గై వేన్దన్=దృఢమైన మంచి ప్రాకారములుగల తిరుమంగై దేశమునకు ప్రభువును; కామరుశీర్ = ఆశింపబడు సద్గుణ సంపన్నుడును; కలికన్ఱి= తిరుమంగై ఆళ్వార్; కున్ఱా ఇన్నిశైయాల్ శొన్న = ఏ లోపములు లేక ఇంపైన రాగములతొ అనుగ్రహించిన; శెమ్ శొల్ మాలై = అందమైన సూక్తులమాలైన; ఏழுమ్ ఇరన్డుమ్ ఒరు ఒన్ఱుమ్ = ఈ పదిపాసురములను; వల్లార్ = పఠించువారు;మన్నవరాయ్ = చక్రవర్తులై; ఉలగాణ్డు = ఈ లోకమును పాలించి; మీణ్డుమ్ = ఆపైన; వానవర్ ఆయ్ మగిழ் ఎయ్ తువరే = నిత్యశూరులతో చేరి ఆనందమును పొందుదురు!.
హంస రూపిగను,వరాహ రూపిగను, మత్స్య రూపిగను అవతరించిన, కారణభూతుడైన,తిరునాగై దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న అతిసుందరుడైన సౌందర్యరాజన్ పెరుమాళ్ విషయమై,దృఢమైన మంచి ప్రాకారములుగల తిరుమంగై దేశమునకు ప్రభువును,ఆశింపబడు సద్గుణ సంపన్నుడును,తిరుమంగై ఆళ్వార్ ఏ లోపములు లేక ఇంపైన రాగములతొ అనుగ్రహించిన అందమైన సూక్తులమాలైన ఈ పదిపాసురములను పఠించువారు, చక్రవర్తులై ఈ లోకమును పాలించి ఆపైన నిత్యశూరులతో చేరి ఆనందమును పొందుదురు!.
*****