శ్రీః
4 . కావార్
తిరుపుల్లాణి దివ్యదేశమునకు పోయి కళ్యాణ జగన్నాధన్ పెరుమాళ్ ను సేవింపలేక, పరకాలనాయకి ఆ సర్వేశ్వరునిచెంతకు దూతలను పంపి తమయొక్క మనోవ్యధను విన్నవించుకొనుచున్నారు.
** కావార్ మడల్ పెణ్ణై, అన్ఱిల్ అరికురలుమ్,
ఏవాయిన్ ఊడు ఇయఙ్గుమ్, ఎహ్ కిల్ కొడిదాలో,
పూవార్ మణమ్ కమழమ్, పుల్లాణి కై తొழுదేన్,
పావాయ్ ఇదునమక్కు ఓర్, పాన్మయే యాగాదే ll 1778
కా ఆర్ మడల్ = తోటలందంతట నిండియున్న దళములుగల; పెణ్ణై = తాటిచెట్టు యందున్న; అన్ఱిల్=అన్ఱిల్ పక్షులయొక్క;అరి కురలుమ్=(విరహవేదనలోనున్ననాకు) వ్యధకలిగించెడి వాటి ప్రణయకిచకిచ ధ్వనులు; ఏ వాయిన్ ఊడు ఇయఙ్గుమ్ ఎహ్ కిల్= బాణముచే కలిగిన వ్రణమందు శూలాయుధముతొ పొడిచిన దాని కంటె;కొడిదు = మిక్కిలి బాధకరముగనున్నది;ఆల్ ఓ=అయ్యో!; పూ ఆర్ మణమ్ కమழమ్=పూలలోని గల పరిమళము వీచబడుచుండు;పుల్లాణి = తిరుపుల్లాణి దివ్యదేశమును; కైతొழுదేన్=నేను సేవించుటకై మిక్కిలి దుఃఖించుటయే జరుగుచున్నది!; పావాయ్ = నా ప్రియసఖీ!; ఇదు = ఈ విధముగ బాధపడుటయే; నమక్కు = ఆ సర్వేశ్వరుని ఆశించుచున్న మనకు; ఓర్ పాన్మయే ఆగాదే = నిత్య స్వభావమైపోయినదో ఏమో?
తోటలందంతట, నిండియున్న దళములుగల తాటిచెట్టు యందున్నఅన్ఱిల్ పక్షులయొక్క,(విరహవేదనలోనున్ననాకు) వ్యధకలిగించెడి వాటి ప్రణయ కిచకిచ ధ్వనులు, బాణముచే కలిగిన వ్రణమందు శూలాయుధముతొ పొడిచిన దాని కంటె మిక్కిలి బాధకరముగనున్నది, అయ్యో!, పూలలోనిగల పరిమళము వీచబడుచుండు తిరుపుల్లాణి దివ్యదేశమును,నేను సేవించుటకై,మిక్కిలి దుఃఖించుటయే జరుగుచున్నది! నాప్రియసఖీ! ఈ విధముగ బాధపడుటయే ఆ సర్వేశ్వరుని ఆశించుచున్న మనకు నిత్య స్వభావమైపోయినదో ఏమో?
మున్నమ్ కుఱళురువాయ్, మూవడి మణ్ కొణ్డు అళన్ద
మన్నన్ శరిదైక్కే, మాలాగి ప్పొన్ పయన్దేన్,
పొన్నమ్ కழி క్కానల్, పుళ్ళినఙ్గాళ్ పుల్లాణి,
అన్నమాయ్ నూల్ పయన్దాఱ్కు, ఆఙ్గిదనైచ్చెప్పుమినే ll 1779
పొన్నమ్ కழி క్కానల్=సముద్రతీరమునందున్న మడఅడవులలోగల; పుళ్ ఇనఙ్గాళ్ = పక్షి సమూహములారా!; మున్నమ్ = మునుపొకకాలమున; కుఱళ్ ఉరు ఆయ్ = వామనమూర్తియై; ( మహాబలి నుండి ) మూవడి మణ్ కొణ్డు = మూడడుగుల భూమిని యాచించి; అళన్ద=ముల్లోకములను కొలిచి స్వీకరించిన;మన్నన్ = దేవాదిదేవునియొక్క; శరిదైక్కే = చేతలకే;మాల్ ఆగి=నేను అతివ్యామోహము కలిగినదాననై; పొన్ పయన్దేన్ = నా వర్ణమును కోల్పోయి, పాలిపోతిని; ఇదనై = నాయొక్క ఈ స్థితిని; పుల్లాణి ఆఙ్గు = తిరుపుల్లాణి దివ్యదేశమునకే పోయి;అన్నమ్ ఆయ్ నూల్ పయన్దాఱ్కు=హంసరూపియై వేదశాస్త్రములను ఒసగిన ఆ జగన్నాథునికి; శెప్పుమినే = తెలియజేయుడు!.
సముద్రతీరమునందున్న మడఅడవులలోగల పక్షి సమూహములారా! మునుపొకకాలమున వామనమూర్తియై,మూడడుగుల భూమిని యాచించి ముల్లోకములను కొలిచి స్వీకరించిన దేవాదిదేవునియొక్క చేతలకే నేను అతి వ్యామోహము కలిగినదాననై, నా వర్ణమును కోల్పోయి, పాలిపోతిని.నాయొక్క ఈ స్థితిని తిరుపుల్లాణి దివ్యదేశమునకే పోయి హంసరూపియై వేదశాస్త్రములను ఒసగిన ఆ జగన్నాథునికి తెలియజేయుడు!.
వవ్వి త్తుழாయదన్మేల్, శెన్ఱ తనినెఞ్జమ్,
శెవ్వియఱియాదు, నిఱ్కుఙ్గొల్ నిత్తిలఙ్గళ్,
పవ్వత్తిరైయులవు, పుల్లాణి కై తొழுదేన్,
దెయ్వచ్చిలైయాఱ్కు, ఎన్ శిన్దైనోయ్ శెప్పుమినే ll 1780
తుழாయ్ అదన్ మేల్ వవ్వి=(సర్వేశ్వరుడు సంశ్లేషించి విడిచిపోయిన సమయమున ఆస్వామి భుజమునగల) తులసీమాలను పట్టుకొని; శెన్ఱ తని నెఞ్జమ్=నన్ను విడిచి ఏకాకిగ పోయిన నాయొక్క మనస్సు; శెవ్వి అఱియాదు నిఱ్కుమ్ కొల్ = (తిరిగి రావలెనని) మర్యాద లేక అచటనే ఉండిపోయినదే?;(పరకాలనాయికి, సర్వేశ్వరుని వక్షస్థలమందలి తనకుగల గాఢమైన ప్రీతిని పరోక్షముగ వెలిబుచ్చిరి.) పవ్వమ్ తిరై = సముద్రము యొక్క అలలు;నిత్తిలఙ్గళ్ ఉలవు = ముత్యములను చేరవేయు చుండెడి; పుల్లాణి=తిరుపుల్లాణి దివ్యదేశమును;కై తొழுదేన్=చేతులెత్తి సేవింప ఆశపడుచున్న; ఎన్ శిన్దైనోయ్ = నాయొక్క మనోవ్యధను; ( ఓ! పక్షి సమూహములారా!); దెయ్ వమ్ శిలైయాఱ్కు = దివ్యమైన శారంగం విల్లునుధరించిన సర్వేశ్వరునికి; శెప్పుమినే = తెలియజేయుడు!.
(సర్వేశ్వరుడు నన్ను సంశ్లేషించి విడిచిపోయిన సమయమున ఆస్వామి భుజమునగల) తులసీమాలను పట్టుకొని,నన్ను విడిచి ఏకాకిగ పోయిన నాయొక్క మనస్సు (తిరిగి రావలెనని) మర్యాద లేక అచటనే ఉండిపోయినదే?(పరకాలనాయికి, సర్వేశ్వరుని వక్షస్థలమందలి తనకుగల గాఢమైన ప్రీతిని పరోక్షముగ వెలిబుచ్చిరి.) సముద్రము యొక్క అలలు, ముత్యములను చేరవేయు చుండెడి తిరుపుల్లాణి దివ్యదేశమును చేతులెత్తి సేవింప ఆశపడుచున్న, నాయొక్క మనోవ్యధను ( ఓ! పక్షి సమూహములారా! ) దివ్యమైన శారంగం విల్లునుధరించిన సర్వేశ్వరునికి తెలియజేయుడు!.
పరియ ఇరణియనదాగమ్, అణియుగిరాల్,
అరియురువాయ్ క్కీణ్డాన్, అరుళ్ తన్దవా! నమక్కు,
పొరు తిరైగళ్ పోన్దు ఉలవు, పుల్లాణి కై తొழுదేన్,
అరి మలర్ క్కణ్ణీర్ తతుమ్బ, అమ్ తుగిలుమ్ నిల్లావే ll 1781
పరియ = బలిసిన; ఇరణియనదు = హిరణ్యాసురునియొక్క; ఆగమ్ = వక్షస్థలమును; అరి ఉరువాయ్ = నరసింహరూపమునుదాల్చి;అణి ఉగిరాల్=అందమైన నఖములచే; కీణ్డాన్ = చీల్చి సంహరించిన సర్వేశ్వరుడు; నమక్కు = మనకు; అరుళ్ తన్ద ఆ = కృపచేసిన విధము ఏమిటో?; పొరు తిరైగళ్ = ఒకటినిమించి మరియొకటి పైకెగియుచున్న అలలు; పోన్దు ఉలవు = సమీపమునకు వచ్చి చేరుచుండెడి;పుల్లాణి = తిరుపుల్లాణి దివ్యదేశమును;కై తొழுదేన్ = చేతులెత్తి సేవింప ఆశపడుచున్న నాయొక్క; అరి మలర్ కణ్ = తుమ్మెదలు వసించెడి పుష్పములవంటి నేత్రములనుండి; నీర్ తతుమ్బ= కన్నీళ్లు కారుచున్నవి; అమ్ తుగిలుమ్ నిల్లావే = అందమైన వస్త్రమును నడుమున నిలువకున్నది!.
బలిసిన హిరణ్యాసురునియొక్క వక్షస్థలమును, నరసింహరూపమునుదాల్చి అందమైన నఖములచే చీల్చి సంహరించిన సర్వేశ్వరుడు మనకు కృపచేసిన విధము ఏమిటో?, ఒకటినిమించి మరియొకటి పైకెగియుచున్న అలలు సమీపమునకు వచ్చి చేరుచుండెడి తిరుపుల్లాణి దివ్యదేశమును చేతులెత్తి సేవింప ఆశపడుచున్న నాయొక్క తుమ్మెదలు వసించెడి పుష్పములవంటి నేత్రములనుండి కన్నీళ్లు కారుచున్నవి. అందమైన వస్త్రమును నడుమున నిలువకున్నది!.
** విల్లాల్ ఇలఙ్గై మలఙ్గ, చ్చరమ్ తురన్ద,
వల్లాళన్ పిన్ పోన, నెఞ్జమ్ వరుమళవుమ్,
ఎల్లారుమ్ ఎన్దన్నై, ఏశిలుమ్ పేశిడినుమ్,
పుల్లాణియెమ్బెరుమాన్, పొయ్ కేట్టిరున్దేనే ll 1782
ఇలఙ్గై మలఙ్గ = లంకాపురి కలతచెంది నశించునట్లు;విల్లాల్ = శారంగం విల్లుచే; శరమ్ తురన్ద=బాణములను కురిపించిన;వల్లాళన్ పిన్=మహా పరాక్రమశాలియైన సర్వేశ్వరుని వెనుక; పోన నెఞ్జమ్=పోయిన మనస్సు;వరుమ్ అళవుమ్=తిరిగి వెనుకకు వచ్చువరకు; ఎల్లారుమ్ = నా తల్లులు,సఖులు మొదలగు వారందరు; ఎన్ తన్నై=నన్ను; ఏశిలుమ్ = నిందించినను; పేశిడినుమ్ = (నా మనోభావములను ఖండించి) మాటలాడినను; పుల్లాణి ఎమ్బెరుమాన్=తిరుపుల్లాణి దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరునియొక్క; పొయ్ కేట్టు ఇరున్దేనే = అసత్యపు వచనములను నమ్ముచునేయున్నాను!.
లంకాపురి కలతచెంది నశించునట్లు, శారంగం విల్లుచేబాణములను కురిపించిన మహా పరాక్రమశాలియైన సర్వేశ్వరుని వెనుక పోయిన మనస్సుతిరిగి వెనుకకు వచ్చు వరకు, నా తల్లులు,సఖులు మొదలగు వారందరు నన్ను నిందించినను, (నా మనోభావములను ఖండించి) మాటలాడినను, తిరుపుల్లాణి దివ్యదేశమున వేంచేసియున్న సర్వేశ్వరునియొక్క అసత్యపు వచనములను నమ్ముచునేయున్నాను!.
శుழுన్ఱిలఙ్గు వెఙ్గదిరోన్, తేరోడుమ్ పోయ్ మఱైన్దాన్,
అழுన్ఱు కొడిదాగి, అఞ్జుడరోన్ తాన్ అడుమాల్,
శెழுన్దడమ్ పూఞ్జోలై శూழ், పుల్లాణి కై తొழுదేన్,
ఇழన్దిరున్దేన్ ఎన్దన్, ఎழிల్ నిఱముమ్ శఙ్గుమే ll 1783
శుழுన్ఱు ఇలఙ్గు వెమ్ కదిరోన్ = (మేరు పర్వతమును)చుట్టుకొనివచ్చిన ప్రకాశించు సూర్యుడు;తేరోడుమ్ పోయ్ మఱైన్దాన్ = తన రథముతో పోయి అస్తమించెను; అమ్ శుడరోన్ తాన్ = అందమైన కిరణములుగల చంద్రుడు; అழுన్ఱు కొడిదు ఆగి = మిక్కిలి తీక్షణమై; అడుమ్ ఆల్=దహింపజేయుచున్నాడు, అయ్యో!;శెழுమ్ తడమ్ =సమృద్దిగ తటాకములతోను; పూ శోలై = అందమైన తోటలతోను, శూழ் = చుట్టుకొనియున్న; పుల్లాణి = తిరుపుల్లాణి దివ్యదేశమును;కై తొழுదేన్ = చేతులెత్తి సేవింప ఆశపడుచున్న నేను; ఎన్ తన్ ఎழிల్ నిఱముమ్ = నాయొక్క అందమైన వర్ణమును; శఙ్గుమ్ = కంకణములును; ఇழన్దిరున్దేన్ = పోగొట్టుకొనియున్నాను!.
(మేరు పర్వతమును)చుట్టుకొనివచ్చిన ప్రకాశించు సూర్యుడు తన రథముతో పోయి అస్తమించెను, అందమైన కిరణములుగల చంద్రుడు మిక్కిలి తీక్షణమై దహింప జేయుచున్నాడు, అయ్యో! ,సమృద్దిగ తటాకములతోను అందమైన తోటలతోను చుట్టుకొనియున్న తిరుపుల్లాణి దివ్యదేశమును చేతులెత్తి సేవింప ఆశపడుచున్న నేను నాయొక్క అందమైన వర్ణమును, కంకణములును పోగొట్టుకొనియున్నాను!.
కనైయార్ ఇడి కురలిన్, కార్ మణియిన్ నావాడల్,
తినైయేనుమ్ నిల్లాదు, తీయిల్ కొడిదాలో,
పునైయార్ మణిమాడ, పుల్లాణి కై తొழுదేన్,
వినైయేన్ మేల్ వేలైయుమ్, వెన్దழలే వీశుమే ll 1784
కనై యార్ ఇడి కురలిన్ = పిడుగు పడినట్లు మిక్కిలి ధ్వనికలిగిన; కార్ మణియిన్ నా ఆడల్ =(పశువుల మెడలో కట్టిన) నల్లని గంటల, వాటి కదలిక యొక్క ధ్వనులు; తినైయేనుమ్ నిల్లాదు = స్వల్పకాలమైనను నిలువక;తీయిల్ కొడిదు ఆలో=( సర్వేశ్వరుని ఎడబాటులో నున్న ) నాకు నిప్పుకంటె మిక్కిలి బాధకరముగ నున్నది అయ్యో!; పునై ఆర్ మణిమాడమ్ = మిక్కిలి సుందరమైన మణులతో ఒప్పు భవనములు గల; పుల్లాణి = తిరుపుల్లాణి దివ్యదేశమును; కై తొழுదేన్ = చేతులెత్తి సేవింప ఆశపడుచున్న; వినైయేన్ మేల్= పాపియైన నాపై; వేలైయుమ్ వెమ్ తழలే వీశుమ్ = సముద్రము, తీవ్రమైన వేడిగాలినే వీచు చున్నది!
పిడుగు పడినట్లు మిక్కిలి ధ్వని కలిగిన(పశువుల మెడలో కట్టిన) నల్లని గంటల, వాటి కదలిక యొక్క ధ్వనులు స్వల్పకాలమైనను నిలువక ( సర్వేశ్వరుని ఎడబాటులో నున్న )నాకు నిప్పుకంటె మిక్కిలి బాధకరముగ నున్నది. అయ్యో! మిక్కిలి సుందరమైన మణులతో ఒప్పు భవనములు గల తిరుపుల్లాణి దివ్యదేశమును చేతులెత్తి సేవింప ఆశపడుచున్న పాపియైన నాపై సముద్రము, తీవ్రమైన వేడిగాలినే వీచు చున్నది!
తూమ్బుడై క్కై వేழுమ్, వెరువ మరుప్పొశిత్త,
ప్పామ్బినణైయాన్, అరుళ్ తన్దవా నమక్కు,
పూమ్ శెరున్ది పొన్ శొరియుమ్, పుల్లాణి కై తొழுదేన్,
తేమ్బల్ ఇళమ్ పిఱైయుమ్, ఎన్దనక్కోర్ వెన్దழలే ll 1785
తూమ్బుడై కై వేழுమ్ = పొడుగైన తొండముగల కువలయాపీడమను ఏనుగు; వెరువ= భీతిచెందునట్లు; మరుప్పు ఒశిత్త = దాని దంతములును పెరికి చంపిన; ప్పామ్బిన్ అణైయాన్=శేషునిపై శయనించియున్న సర్వేశ్వరుడు;నమక్కు=మనకు;అరుళ్ తన్ద ఆ = కృపచేసిన విధము ఏమిటో?; పూమ్ శెరున్ది పొన్ శొరియుమ్ = అందమైన శురుపున్నై చెట్లు బంగారమును కురుపించుచున్న; పుల్లాణి = తిరుపుల్లాణి దివ్యదేశమును; కై తొழுదేన్ = చేతులెత్తి సేవింప ఆశపడుచున్న; ఎన్దనక్కు = నాకు; తేమ్బల్ ఇళమ్ పిఱైయుమ్ = అప్పుడే ఉదయించిన బాలచంద్రుడును; ఓర్ వెమ్ తழల్=ఒక తీవ్రమైన అగ్నికుండమువలె యున్నాడు!
పొడుగైన తొండముగల కువలయాపీడమను ఏనుగు భీతిచెందునట్లు దాని దంతములును పెరికి చంపిన, శేషునిపై శయనించియున్న సర్వేశ్వరుడు మనకు కృపచేసిన విధము ఏమిటో?, అందమైన శురుపున్నై చెట్లు బంగారమును కురుపించుచున్న తిరుపుల్లాణి దివ్యదేశమును చేతులెత్తి సేవింప ఆశపడుచున్ననాకు అప్పుడే ఉదయించిన బాలచంద్రుడును ఒక తీవ్రమైన అగ్నికుండమువలె యున్నాడు!
వేదముమ్ వేళ్వియుమ్, విణ్ణుమ్ ఇరుశుడరుమ్,
ఆదియుమానాన్, అరుళ్ తన్దవా నమక్కు,
పోదలరుమ్ పున్నై శూழ், పుల్లాణి కై తొழுదేన్,
ఓదముమ్ నానుమ్, ఉఱఙ్గాదిరున్దేనే ll 1786
వేదముమ్ = వేదస్వరూపుడును; వేళ్వియుమ్ = యఙ్ఞస్వరూపుడును; విణ్ణుమ్ = ఊర్ధ్వలోకములును; ఇరు శుడరుమ్ = సూర్యచంద్రులును; ఆదియుమ్ = జగత్కారణభూతుడును; ఆనాన్ = అయినట్టి సర్వేశ్వరుడు; నమక్కు=మనకు;అరుళ్ తన్ద ఆ=కృపచేసిన విధము ఏమిటో?;పోదు అలరుమ్= పుష్పములు వికసించుచుండెడి; పున్నై శూழ் = పున్నై చెట్లతో చుట్టుకొనియున్న; పుల్లాణి=తిరుపుల్లాణి దివ్యదేశమును; కై తొழுదేన్ = చేతులెత్తి సేవింప ఆశపడుచున్న; నానుమ్ = నేనును; ఓదముమ్ = సముద్రమును; ఉఱఙ్గాదు ఇరున్దేనే = కంటికి నిదురలేక యుంటిమి!
వేదస్వరూపుడును,యఙ్ఞస్వరూపుడును, ఊర్ధ్వలోకములును,, సూర్యచంద్రులును, జగత్కారణభూతుడును,అయినట్టి సర్వేశ్వరుడు,మనకు కృపచేసిన విధము ఏమిటో?,పుష్పములు వికసించుచుండెడి పున్నై చెట్లతో చుట్టుకొనియున్న తిరుపుల్లాణి దివ్యదేశమును చేతులెత్తి సేవింప ఆశపడుచున్న నేనును, సముద్రమును కంటికి నిదురలేక యుంటిమి!.
** పొన్నలరుమ్ పున్నై శూழ், పుల్లాణియమ్మానై,
మిన్నిడైయార్ వేట్కై నోయ్ కూర, ఇరున్దదనై,
కల్ నవిలుమ్ తిణ్డోళ్, కలయనొలివల్లార్,
మన్నవరాయ్ మణ్ణాణ్డు, వానాడుమున్నువరే ll 1787
పొన్ అలరుమ్ పున్నై శూழ் = బంగారపు వర్ణమువంటి పుష్పములు వికసించుచుండెడి పున్నై చెట్లతో చుట్టుకొనియున్న; పుల్లాణి అమ్మానై = తిరుపుల్లాణి దివ్యదేశమున వేంచేసియున్న కల్యాణ జగన్నాథన్ పెరుమాళ్ విషయమై;మిన్ ఇడైయార్=మెరుపువలె సూక్ష్మమైన నడుముగల యువతుల;వేట్కై నోయ్ కూర=వాంఛచే వ్యధ అమితముకాగ; ఇరున్దదనై = వారుయుండెడి స్థితిని; కల్ నవిలుమ్ తిణ్ తోళ్ కలియన్ = పర్వతము వంటిదని పొగడదగిన దృఢమైన భుజములుగల తిరుమంగై ఆళ్వార్; ఒలి వల్లార్ = అనుగ్రహించిన ఈ పాశురములను పఠించువారు; మన్నవర్ ఆయ్ మణ్ ఆణ్డు=రాజులై ఈ భూమిని పాలించి; (పిదప); వాన్ నాడుమ్ ఉన్నువర్ = పరమపద దేశమునకును శీఘ్రముగా ఏగుదురు!.
బంగారపు వర్ణమువంటి పుష్పములు వికసించుచుండెడి పున్నై చెట్లతో చుట్టుకొనియున్న తిరుపుల్లాణి దివ్యదేశమున వేంచేసియున్న కల్యాణ జగన్నాథన్ పెరుమాళ్ విషయమై, మెరుపువలె సూక్ష్మమైన నడుముగల యువతుల వాంఛచే వ్యధ అమితముకాగ, వారుయుండెడి స్థితిని, పర్వతము వంటిదని పొగడదగిన దృఢమైన భుజములుగల తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించిన ఈ పాశురములను పఠించువారు రాజులై ఈభూమిని పాలించి,(పిదప)పరమపద దేశమునకును శీఘ్రముగా ఏగుదురు!.
*******