శ్రీః
5 . తవళవిళమ్
పరాంకుశనాయకి, తనను సంశ్లేషించి విడిచిపోయిన సర్వేశ్వరుని ఎడబాటులో మిక్కిలి కృశించి, తనయొక్క సఖీమణులతో, తిరు కుఱుఙ్గుడి దివ్యదేశమున నిత్యవాసము చేయుచున్న వైష్ణవనమ్బి పెరుమాళ్ సన్నిధికి చేర్చమని ప్రాధేయపడుచున్న విషయమును తిరుమంగై ఆళ్వార్ చెప్పుచున్నారు,
** తవళ ఇళమ్ పిఱై తుళ్ళు మున్నీర్, తణ్మలర్ తెన్ఱలోడు అన్ఱిల్ ఒన్ఱి
త్తువళ, ఎన్నెఞ్జగమ్ శోర ఈరుమ్, శూழ் పనినాళ్ తుయిలాదిరుప్పేన్,
ఇవళుమోర్ పెణ్కొడియెన్ఱిరఙ్గార్, ఎన్నలమైన్దు మున్కొణ్డుపోన,
కువళై మలర్ నిఱవణ్ణర్ మన్ను, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll 1788
తవళమ్ ఇళమ్ పిఱై = తెల్లని బాలచంద్రుడును; తుళ్ళు మున్నీర్ = అలలుకొట్టుచున్న సముద్రమును; తణ్ మలర్ తెన్ఱలోడు = చల్లని పుష్పములయందు వ్యాపించి వీచెడి గాలియును; అన్ఱిల్ = అన్ఱిల్ ( క్రౌంచపక్షులు) పక్షులయొక్క కిచకిచ ధ్వనులును;ఒన్ఱి = అన్నియు ఒకటిగ చేరి;ఎన్ నెఞ్జగమ్=నాయొక్క మనసు;తువళ=దుర్బలమగునట్లును; శోర = శిధిలమగునట్లును; ఈరుమ్ = మిక్కిలి బాధపెట్టుచున్నవి; శూழ் పని నాళ్ = అంతటను చలి వ్యాపించియున్న ఈ కాలమున; తుయిలాదు ఇరుప్పేన్ = నిదురలేక యున్నాను; ఇవళుమ్ ఓర్ పెణ్ కొడి ఎన్ఱు ఇరఙ్గార్ = ” ఈమె ఒక లేత తీగవంటి బాలికే కదా! ” అని మనసున కరుణించక;ఎన్ నలమ్ ఐన్దుమ్=నాయొక్క పంచేంద్రియములను మున్ కొణ్డు పోన = మునుపే హరించుకొనిపోయిన (నాయొక్క పంచేంద్రియములు తనయందే లీనమై పోవునట్లు చేసుకొనిన); కువళై మలర్ నిఱ వణ్ణర్ మన్ను = నీలోత్పముల పుష్పములవంటి వర్ణముగల సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న; కుఱుఙ్గుడిక్కే = తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
తెల్లని బాలచంద్రుడును, అలలుకొట్టుచున్న సముద్రమును, చల్లని పుష్పములయందు వ్యాపించి వీచెడి గాలియును, అన్ఱిల్ ( క్రౌంచపక్షులు) పక్షులయొక్క కిచకిచ ధ్వనులును, అన్నియు ఒకటిగ చేరి నాయొక్క మనసు దుర్బలమగునట్లును, శిధిలమగునట్లును, మిక్కిలి బాధపెట్టుచున్నవి.అంతటను చలి వ్యాపించియున్న ఈ కాలమున నిదురలేక యున్నాను. ” ఈమె ఒక లేత తీగవంటి బాలికే కదా! ” అని మనసున కరుణించక, నాయొక్క పంచేంద్రియములను,మునుపే హరించుకొనిపోయిన (నాయొక్క పంచేంద్రియములు తనయందే లీనమై పోవునట్లు చేసుకొనిన) నీలోత్పముల పుష్పములవంటి వర్ణముగల సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
తాదు అవిழ మల్లిగైపుల్గివన్ద తణ్మదియిన్ ఇళవాడైయిన్నే,
ఊదై తిరితన్దు ఉழఱియుణ్ణ, ఓరిరవుముఱఙ్గేన్, ఉఱఙ్గుమ్
పేదైయర్ పేదైమైయాల్ ఇరున్దు, పేశిలుమ్ పేశుగ పెయ్ వళైయార్,
కోదై నఱుమలర్ మఙ్గై మార్వన్, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll 1789
తాదు అవిழ మల్లిగై=పుప్పొడి రేణువులు వెదజల్లుచున్న మల్లెలలో;పుల్గి= వ్యాపించి; తణ్ మదియిన్ = చల్లని చంద్రునితోకూడ; ఇన్నే వన్ద = ఇచటకు వచ్చి వీచుచున్న;ఇళ వాడై = మంద మారుతమను; ఊదై=చల్లని గాలి; తిరితన్దు=నలుపక్కల సంచరించి;ఉழఱియుణ్ణ= ప్రాణము హరించునటులుండగ; ఓర్ ఇరవుమ్ ఉఱఙ్గేన్ = ఒక రాత్రి పూట కూడ నిదురించలేకున్నాను; పెయ్ వళైయార్ = చేతి కంకణములు జారిపోవని వారైన; ఉఱఙ్గుమ్ పేదైయర్ = నిదురించుచుండెడి వివేకహీనులైన ఆ యువతులు; పేదైమైయాల్ = తమయొక్క అఙ్ఞానముచే; ఇరున్దు=సోమరితనముతో నుండి;పేశిలుమ్ పేశుగ =(నాయొక్క విషయమున)ఎటువంటి నిందవచనములు పలికినను పలుకనీ; కోదై నఱు మలర్ మఙ్గై మార్వన్=కుంతలములందు పరిమళభరితమైన పుష్పములుగల శ్రీదేవిని తన వక్షస్థలమందుగల సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న;కుఱుఙ్గుడిక్కే= తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
పుప్పొడి రేణువులు వెదజల్లుచున్న మల్లెలలో వ్యాపించి, చల్లని చంద్రునితోకూడ, ఇచటకు వచ్చి వీచుచున్న, మంద మారుతమను చల్లని గాలి నలుపక్కల సంచరించి,ప్రాణము హరించునటులుండగ,ఒక రాత్రి పూట కూడ నిదురించలేకున్నాను, చేతి కంకణములు జారిపోవని వారైన, నిదురించుచుండెడి వివేకహీనులైన ఆ యువతులు తమయొక్క అఙ్ఞానముచే,సోమరితనముతో నుండి (నాయొక్క విషయమున) ఎటువంటి నిందవచనములు పలికినను పలుకనీ!, కుంతలములందు పరిమళభరితమైన పుష్పములుగల శ్రీదేవిని తన వక్షస్థలమందుగల సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
కాలైయుమ్ మాలై ఒర్ట్రుణ్డు, కఙ్గుల్ నాழிగై యూழிయిల్ నీణ్డు ఉలావుమ్,
పోల్వదోర్ తన్మై పుకున్దు నిఱ్కుమ్, పొఙ్గు అழలేయొక్కుమ్ వాడై శొల్లిల్,
మాలవన్ మామణివణ్ణన్ మాయమ్, మర్ట్రుముళ అవై వన్దిడామున్
కోల మయిల్ పయిలుమ్ పుఱవిల్, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll 1790
కాలైయుమ్ మాలై ఒర్ట్రుణ్డు = తెల్లవారుసమయము సంధ్యాసమయమువలె మిక్కిలి బాధ కలుగజేయుచున్నది;కఙ్గుల్ నాழிగై = రాత్రివేళ ఒక 24నిముషములకాలము; ఊழிయిల్ నీణ్డు = కల్పకాలముకంటె ఎక్కువగ; ఉలావుమ్ పోల్వదు ఓర్ తన్మై పుకున్దు నిఱ్కుమ్= గడిచెడిదానివలె క్లిష్టమైన స్వభావమును కలిగియున్నది; వాడై శొల్లిల్ = చల్లని గాలియొక్క స్వభావము చెప్పదలిచినచో; పొఙ్గు అழలే ఒక్కుమ్ = మండుచున్న నిప్పువలె ఉన్నది;మాలవన్ = గొప్పవాడును; మా మణివణ్ణన్ = శ్లాఘ్యమైన నీలమణివంటి వర్ణముగల సర్వేశ్వరునియొక్క;మాయమ్=మాయపు చేష్టలు;మర్ట్రుమ్ ఉళ = ఇంకను అనేకములు కలవు; అవై వన్దిడామున్=అవి వచ్చి మనపై పడక మునపే; కోల మయిల్ పయిలుమ్ పుఱవిల్ = సుందరమైన నెమళ్ళు గుమిగూడి నివసించుచున్న బాహ్యప్రదేశములుగల; కుఱుఙ్గుడిక్కే= తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
తెల్లవారుసమయము సంధ్యాసమయమువలె మిక్కిలి బాధకలుగ జేయుచున్నది,రాత్రివేళ ఒక 24నిముషములకాలము, కల్పకాలముకంటె ఎక్కువగ గడిచెడి దానివలె క్లిష్టమైన స్వభావమును కలిగియున్నది,చల్లని గాలియొక్క స్వభావము చెప్పదలిచినచో మండుచున్న నిప్పువలె ఉన్నది.గొప్పవాడును, శ్లాఘ్యమైన నీలమణి వంటి వర్ణముగల సర్వేశ్వరునియొక్క మాయపు చేష్టలు ఇంకను అనేకములు కలవు. అవి వచ్చి మనపై పడక మునపే, సుందరమైన నెమళ్ళు గుమిగూడి నివసించుచున్న బాహ్యప్రదేశములుగల తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
కరుమణిపూణ్డువెణ్ణాగణైన్దు, కారిమిల్ ఏర్ట్రణర్ తాழ்న్దు ఉలావుమ్,
ఒరుమణి ఓశై ఎన్నుళ్ళన్దళ్ళ, ఓరిరవుమ్ ఉఱఙ్గాదిరుప్పేన్,
పెరుమణి వానవరుచ్చివైత్త, పేరరుళాళన్ పెరుమై పేశి,
కురుమణినీర్ కొழிక్కుమ్ పుఱవిల్, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll1791
కరు మణి పూణ్డు = నల్లని గంటను మెడలో ధరించి; వెణ్ నాగు అణైన్దు = తెల్లని పశువులతో సంశ్లేషించి;కార్ ఇమిల్=నల్లని మూపురముగల;ఏఱు=వృషభముయొక్క; అణర్ = మెడలో; తాழ்న్దు ఉలావుమ్=వేలాడుతూ ఊగుచున్న;ఒరు మణి ఓశై = ఒక గంటయొక్క ధ్వని;ఎన్ ఉళ్ళమ్ తళ్ళ=నాయొక్క మనస్సును బాధతో కుదిపివేయు చుండగ; ఓర్ ఇరవుమ్ ఉఱఙ్గాదు ఇరుప్పేన్ = ఒక రాత్రైనను నిదురలేక యుంటిని; వానవర్ = నిత్యశూరులు; ఉచ్చి=తమ శిరస్సుపై;పెరుమణి=శ్లాఘ్యమైన రత్నమువలె;వైత్త = భూషణముగ ధరించిన; పేరరుళాళన్ పెరుమై పేశి = పేరరుళాళన్ యొక్క వైభవమును స్తుతించి; నీర్ కురు మణి కొழிక్కుమ్ పుఱవిల్ = ప్రవాహజలములచే శ్లాఘ్యమైన రత్నములు కొట్టుకొనువచ్చి చేరుచుండెడి బాహ్యప్రదేశములుగల; కుఱుఙ్గుడిక్కే= తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
తెల్లని పశువులతో సంశ్లేషించి,నల్లనిమూపురముగల వృషభముయొక్క మెడలో వేలాడుతూ ఊగుచున్న ఒక గంటయొక్క ధ్వని,నాయొక్క మనస్సును బాధతో కుదిపివేయు చుండగ, ఒక రాత్రైనను నిదురలేక యుంటిని. నిత్యశూరులు తమ శిరస్సుపై శ్లాఘ్యమైన రత్నమువలె భూషణముగ ధరించిన పేరరుళాళన్ యొక్క వైభవమును స్తుతించి, ప్రవాహజలములచే శ్లాఘ్యమైన రత్నములు కొట్టుకొనువచ్చి చేరుచుండెడి బాహ్యప్రదేశములుగల తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
తిణ్ తిమిల్ ఏర్ట్రిన్ మణియుమ్, ఆయన్ తీఙ్గుழలోశైయుమ్ తెన్ఱలోడు,
కొణ్డదోర్ మాలైయుమ్ అన్దియీన్ఱ, కోల ఇళమ్ పిఱై యోడుకూడి,
పణ్డైయ అల్లఇవైనమక్కు, పావియేన్ ఆవియై వాట్టమ్ శెయ్యుమ్,
కొణ్డల్ మణివణ్ణర్ మన్ను, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll 1792
తిణ్ తిమిల్ ఏర్ట్రిన్ మణియుమ్ = దృఢమైన మూపురముగల వృషభముయొక్క మెడలోని గంటల ధ్వనియు; ఆయన్ = గోపాలునియొక్క; తీమ్ కుழల్ ఓశైయుమ్ = మదురమైన వేణునాదమును; తెన్ఱలోడు కొణ్డదు ఓర్ మాలైయుమ్ = మంద మారుతముతో కలసిన సుందరమైన సంధ్యాకాలమును; అన్ది ఈన్ఱ కోల ఇళమ్ పిఱై యోడు కూడి = రాత్రివేళ ఉద్భవించిన అందమైన చంద్రునితో కూడి; ఇవై = ఇవన్నియు; నమక్కు= మనకు; పణ్డైయ అల్ల = మునుపుయుండినట్లు ఇపుడు లేవు; పావియేన్ ఆవియై వాట్టమ్ శెయ్యుమ్ = అవి పాపియైన నాయొక్క ప్రాణమును శిధిల పరచుచున్నవి; కొణ్డల్ మణివణ్ణర్ మన్ను = మేఘమువంటి వర్ణమును,నీలమణివంటి వర్ణముతోను ఒప్పు సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న; కుఱుఙ్గుడిక్కే= తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
దృఢమైన మూపురముగల వృషభముయొక్క మెడలోని గంటల ధ్వనియు, గోపాలునియొక్క మదురమైన వేణునాదమును, మంద మారుతముతో కలసిన సుందరమైన సంధ్యాకాలమును, రాత్రివేళ ఉద్భవించిన అందమైన చంద్రునితో కూడి ఇవన్నియు మనకు మునుపుయుండినట్లు ఇపుడు లేవు. అవి పాపియైన నాయొక్క ప్రాణమును శిధిల పరచుచున్నవి. మేఘమువంటి వర్ణమును, నీలమణివంటి వర్ణముతోను ఒప్పు సర్వేశ్వరుడు నిత్యవాసము చేయుచున్న తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
ఎల్లియుమ్ నన్పకలుమ్ ఇరున్దే, ఏశిలుమ్ ఏశుక ఏన్దిழைయార్,
నల్లారవర్ తిఱమ్ నామఱియోమ్, నాణ్ మడమ్ అచ్చమ్ నమక్కిఙ్గిల్లై,
వల్లనశొల్లి మకిழ்వరేలుమ్, మామణివణ్ణరై నామ్ మఱవోమ్,
కొల్లైవళర్ ఇళముల్లైపుల్ గు, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll 1793
ఏన్దు ఇழைయార్ = ఆభరణములను ధరించియున్న యవతీమణులు;ఎల్లియుమ్ నల్ పకలుమ్ ఇరున్దే = రాత్రింపగళ్లు కలసియుండి;ఏశిలుమ్ ఏశుక = నిందలు చెప్పినను, చెప్పుకోనీ!; నల్లార్ = వారలు భాగవతీమణులు కారుగదా!; అవర్ తిఱమ్ నామ్ అఱియోమ్ = వారియొక్క మనోభావములు మనకు తెలిసినదేగదా!;నమక్కు=మనకు; నాణ్ మడమ్ అచ్చమ్ ఇఙ్గు ఇల్లై=స్త్రీలక్షణములైన లజ్జ,మర్యాద,భయము లేవనియు; వల్లన శొల్లి = తమకు గలవానిని చెప్పుకొనుచు; మకిழ்వరేలుమ్ = మిక్కిలి నవ్వుకొను చున్నను; నామ్=మనము;మా మణి వణ్ణరైై మఱవోమ్=గొప్ప నీలమణివంటి వర్ణముగల సర్వేశ్వరుని ఎన్నడును మరువముగదా!;కొల్లై వళర్ ఇళ ముల్లై పుల్ గు=తోటలయందు పెరుగుచున్న లేత సన్నజాజితీగలతో వ్యాపించియున్న; కుఱుఙ్గుడిక్కే= తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకునిపోయి చేరవేయుడు!.
ఆభరణములను ధరించియున్న యవతీమణులు రాత్రింపగళ్లు కలసియుండి నిందలు చెప్పినను, చెప్పుకోనీ! వారలు భాగవతీమణులు కారుగదా! వారియొక్క మనోభావములు మనకు తెలిసినదేగదా!.మనకు,స్త్రీలక్షణములైన లజ్జ, మర్యాద,భయము లేవనియు,తమకు గలవానిని చెప్పుకొనుచు మిక్కిలి నవ్వుకొను చున్నను, మనము గొప్ప నీలమణివంటి వర్ణముగల సర్వేశ్వరుని ఎన్నడును మరువము గదా!. తోటలయందు పెరుగుచున్న లేత సన్నజాజితీగలతో వ్యాపించియున్న తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే నన్ను తీసుకునిపోయి చేరవేయుడు!.
శెఙ్గణ్ నెడియ కరియమేని, త్తేవరొరువర్ ఇఙ్గే పుగున్దు, ఎన్
అఙ్గమ్ మెలియ వళై కழల, ఆదుకొలో ఎన్ఱు శొన్న పిన్నై,
ఐఙ్గణై విల్లి తన్నాణ్మై, ఎన్నోడాడుమదనై అఱియమాట్టేన్,
కొఙ్గలర్ తణ్ పణై శూழ் పుఱవిల్, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll 1794
నెడియ శెమ్ కణ్ = పొడవైన ఎర్రని నేత్రములును;కరియమేని = నల్లని తిరుమేనిగల; తేవర్ ఒరువర్= అద్వితీయుడైన పెరుమాళ్; ఇఙ్గే పుగున్దు=ఇచటకు వేంచేసి;ఎన్ అఙ్గమ్ మెలియ = నాయొక్క శరీరావయవములు శిధిలమగునట్లును;వళై కழల = కంకణములు జారిపోవు నట్లును; ఆదు కొలో ఎన్ఱు శొన్న పిన్నై=(తాను ఎన్నడు వీడనని చెప్పిన మాటలలో పరోక్షముగ) అటువంటి ఎడబాటును తెలియచెప్పిన మొదలుగ; ఐమ్ కణై విల్లి = ఐదు బాణములు గల విల్లును ప్రయోగించెడి మన్మధుడు; ఎన్నోడు ఆడుమ్ = నాయొక్క విషయమున చూపెట్టుచున్న; తన్ ఆణ్మై అదనై = అతనియొక్క పౌరషమును; అఱియమాట్టేన్ = (పైకి చెప్పుటకు)తెలియకున్నాను;(ఆ బాణములు నాపై ప్రభావమును చూపక మునుపే) కొఙ్గ అలర్ = తేనెలొలుకు;తణ్=చల్లని;పణై శూழ்= చెట్ల కొమ్మలతో చుట్టుకొనియున్న; పుఱవిల్ = బాహ్యప్రదేశములుగల; కుఱుఙ్గుడిక్కే= తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
పొడవైన,(వాత్సల్యముతో) ఎరుపెక్కిన నేత్రములును, నల్లని తిరుమేనిగల అద్వితీయుడైన పెరుమాళ్,ఇచటకు వేంచేసి, నాయొక్క శరీరావయవములు శిధిల మగునట్లును, కంకణములు జారిపోవు నట్లును, (తాను ఎన్నడు వీడనని చెప్పిన మాటలలో పరోక్షముగ) అటువంటి ఎడబాటును తెలియచెప్పిన మొదలుగ,ఐదు బాణములు గల విల్లును ప్రయోగించెడి మన్మధుడు నాయొక్క విషయమున చూపెట్టుచున్న అతనియొక్క పౌరషమును (పైకి చెప్పుటకు) తెలియకున్నాను, (ఆ బాణములు నాపై ప్రభావమును చూపక మునుపే) తేనెలొలుకు చల్లని, చెట్ల కొమ్మలతో చుట్టుకొనియున్న బాహ్యప్రదేశములుగల తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
కేవలమన్ఱు కడలినోశై, కేణ్మిఙ్గళ్ ఆయన్ కై ఆమ్బల్ వన్దు, ఎన్
ఆవియళవుమ్ అణైన్దు నిఱ్కుమ్, అన్ఱియుమ్ ఐన్దుకణై తెరిన్దిట్టు,
ఏవలమ్ కాట్టి యివనొరువన్, ఇప్పడియేపుగున్దు ఎయ్ దిడామున్,
కోవలర్ కూత్తన్ కుఱిప్పఱిన్దు, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll 1795
కడలిన్ ఓశై = సముద్రము యొక్క ఘోష;కేవలమ్ అన్ఱు=సామాన్యముగలేదు సుమా!; కేణ్మిఙ్గళ్ = వినుడు; ఆయన్ = గోపాలకృష్ణుని యొక్క; కై = హస్తమందుగల; ఆమ్బల్ వన్దు = వేణువుయొక్క నాదము వచ్చి;ఎన్ ఆవి అళవుమ్ అణైన్దు నిఱ్కుమ్=నాయొక్క ప్రాణమువరకు సమీపించియున్నది; అన్ఱియుమ్ =అదియునుగాక; ఇవన్ ఒరువన్ = మన్మధుడను నితడు; ఐన్దు కణై = తనయొక్క పంచబాణములను; తెరిన్దిట్టు = బాగుగ పరిశీలించి; ఏ వలమ్ కాట్టి = ప్రయోగించు శక్తి సామర్ధ్యములు జూపుచు; ఇప్పడియే పుగున్దు = నాపై గురిచూసి; ఎయ్ దిడామున్ = ప్రయోగించక మునుపే; (ఇవన్నియు నాకు ప్రాణాంతకములుగ నున్నవి కావున)కోవలర్ కూత్తన్=గోకులవాసులు స్తుతించు కుంభనృత్యము చేయు సామర్ధ్యముగల సర్వేశ్వరునియొక్క;కుఱిప్పు అఱిన్దు = మనోభావములను తెలుసుకొని;కుఱుఙ్గుడిక్కే= తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
సముద్రము యొక్క ఘోష సామాన్యముగలేదు సుమా! వినుడు, గోపాలకృష్ణుని యొక్క హస్తమందుగల వేణువుయొక్క నాదము వచ్చి నాయొక్క ప్రాణమువరకు సమీపించియున్నది, మన్మధుడను నితడు తనయొక్క పంచ బాణములను బాగుగ పరిశీలించి, ప్రయోగించు శక్తి సామర్ధ్యములు జూపుచు నాపై గురిచూసి ప్రయోగించక మునుపే, (ఇవన్నియు నాకు ప్రాణాంతకములుగ నున్నవి కావున) గోకులవాసులు స్తుతించు, కుంభనృత్యము చేయు సామర్ధ్యముగల సర్వేశ్వరునియొక్క మనోభావములను తెలుసుకొని కుఱుఙ్గుడి దివ్యదేశమునకే నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
శోత్తైననిన్ఱు తొழ ఇరఙ్గాన్, తొన్నలఙ్గొణ్డెనక్కు ఇన్ఱు తాఱుమ్,
పోర్ ప్పదు ఓర్ పొఱ్పడమ్ తన్దుపోనాన్, పోయినవూరఱియేన్, ఎన్ కొఙ్గై
మూత్తిడుకిన్ఱన, మర్ట్రు అవన్ తన్ మొయ్యకలమ్ అణైయాదు వాళా,
కూత్తన్ ఇమైయవర్ కోన్ విరుమ్బుమ్, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll1796
శోత్తమ్ ఎన నిన్ఱు తొழ=”వందనము” అని చెప్పుచు సేవించినను;ఇరఙ్గాన్= దయ చూపలేదు; ఇన్ఱు తాఱుమ్ = ఇప్పటివరకు; తొల్ నలమ్ కొణ్డు = నాయొక్క స్వభావ సిద్దమైన గుణములంతను దొంగిలించి; పోర్ ప్పదు ఓర్ పొన్ పడమ్ = కప్పుకొనెడి ఒక పీతాంబరమును (పాలిపోయిన వర్ణమును); ఎనక్కు తన్దు పోనాన్ = నాకు కలుగజేసి వెడలి పోయెను; పోయిన ఊర్ అఱియేన్ = అతను వెడలిన ప్రదేశము తెలియదు; మర్ట్రు = మరియు; ఎన్ కొఙ్గై = నాయొక్క వక్షోజములు; అవన్ తన్ = అతనియొక్క; మొయ్ అకలమ్=అందమైన వక్షస్థలమును; అణైయాదు=చేరలేక; వాళా=వ్యర్థముగ; మూత్తిడుకిన్ఱన = పొంగియున్నది; కూత్తన్=మనోహరమైన చేష్టితములు కలవాడును; ఇమైయవర్ కోన్= నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరుడు; విరుమ్బుమ్ = ఆశించి నిత్యవాసము చేయుచున్న; కుఱుఙ్గుడిక్కే= తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
“వందనము” అని చెప్పుచు సేవించినను దయచూపలేదు, ఇప్పటివరకు నాయొక్క స్వభావసిద్దమైన గుణములంతను దొంగిలించి, కప్పుకొనెడి ఒక పీతాంబరమును (పాలిపోయిన వర్ణమును) నాకు కలుగజేసి వెడలి పోయెను, అతను వెడలిన ప్రదేశము తెలియదు. మరియు నాయొక్క వక్షోజములు అతనియొక్క అందమైన వక్షస్థలమును చేరలేక, వ్యర్థముగ పొంగియున్నది.మనోహరమైన చేష్టితములు కలవాడును, నిత్యశూరులకు ప్రభువైన సర్వేశ్వరుడు ఆశించి నిత్యవాసము చేయుచున్న తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే నన్ను తీసుకొనిపోయి చేరవేయుడు!.
** శెర్ట్రవన్ తెన్నిలఙ్గై మలఙ్గ, త్తేవపిరాన్ తిరుమామగళై
ప్పెర్ట్రుమ్, ఎన్నెఞ్జగమ్ కోయిల్ కొణ్డ, పేరరుళాళన్ పెరుమైపేశ
కర్ట్రవన్, కామరుశీర్ కలియన్, కణ్ణగత్తుమ్ మనత్తుమ్ అగలా
కొర్ట్రవన్, ముర్ట్రుళగాళి నిన్ఱ, కుఱుఙ్గుడిక్కే యెన్నై ఉయ్ త్తిడుమిన్ ll 1797
తెన్ ఇలఙ్గై మలఙ్గ = దక్షణదిక్కునగల లంకాపురి కలతచెందునట్లు;శెర్ట్రవన్=ధ్వంసము చేసినవాడును;తేవపిరాన్=దేవతలకు ప్రభువును;తిరుమామగళై పెర్ట్రుమ్ ఎన్ నెఞ్జగమ్ కోయిల్ కొణ్డ = శ్రీ దేవిని తన వక్షస్థలమున కలిగి నాయొక్క హృదయమును ఆలయముగ స్వీకరించినవాడైన; పేరరుళాళన్ = పేరరుళాళన్ పెరుమాళ్ యొక్క; పెరుమై = గొప్పతనమును; పేశ కర్ట్రవన్ = స్తుతించుగల సమర్ధుడును;కామరుశీర్ = ఆశింపబడు సద్గుణ సంపన్నుడును;కలియన్=తిరుమంగై ఆళ్వార్ యొక్క;కణ్ణగత్తుమ్= కన్నుల యందును; మనత్తుమ్=మనస్సునందును;అగలా =విడిచి పోవని; కొర్ట్రవన్ = సర్వేశ్వరుడు; ముర్ట్రు ఉళగు ఆళి = సర్వలోకములను పాలించు స్వామి; నిన్ఱ = నిత్యవాసము చేయుచున్న; కుఱుఙ్గుడిక్కే= తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే; ఎన్నై ఉయ్ త్తిడుమిన్ = నన్ను తీసుకునిపోయి చేరవేయుడు!.
దక్షణదిక్కునగల లంకాపురి కలతచెందునట్లు ధ్వంసము చేసినవాడును, దేవతలకు ప్రభువును, శ్రీ దేవిని తన వక్షస్థలమున కలిగి నాయొక్క హృదయమును ఆలయముగ స్వీకరించినవాడైన, పేరరుళాళన్ పెరుమాళ్ యొక్క గొప్పతనమును స్తుతించుగల సమర్ధుడును, ఆశింపబడు సద్గుణ సంపన్నుడును, తిరుమంగై ఆళ్వార్ యొక్క కన్నులయందును, మనస్సునందును, విడిచి పోవని సర్వేశ్వరుడు, సర్వలోకములను పాలించు స్వామి నిత్యవాసము చేయుచున్న తిరుకుఱుఙ్గుడి దివ్యదేశమునకే, నన్ను తీసుకునిపోయి చేరవేయుడు!.
**********